కన్యాశుల్కము (తొలికూర్పు)/పంచమాంకము
వెంకమ్మ : కొంప ములిగిపోయింది మరేమిటి (అనీ చతికిలబడును)
అగ్నిహో : (కోపముచేత వణకుచు) అయ్యవారు పకీరు ముండని తీసుకువెళ్లినాడూ? నగలపెట్టె! నాకోర్టు కాగితాలో!
వెంకటే: నా పుస్తకాల పెట్టెకూడా పట్టుకుపోయినాడు.
అగ్నిహో :(జందెము చేతుల బట్టి ముందుకు వెనుకకు కుడిచేయిలాగుచు) దొంగ లంజకొడకా! నువ్వే వాణ్ణి యింట్లో పెట్టావు, గాడిద కొడుకును చంపేదును. నాకు రవంత ఆచోకీ తెలిసింది కాదు. గాడిద కొడుకును పాతిపెట్టేదును.
రామప్ప: (దగ్గిరకువచ్చి) అయ్యవారు మహాదొడ్డవాడని చెప్పారే యేమి యెత్తుకు పోయినాడేమిటండి?
అగ్నిహో :యేమి యెత్తుకుపోయినాడా - నీ శ్రార్థం యెత్తుకుపోయినాడు. పకీరు ముండ నెత్తుకపోయినాడు. గాడిద కొడుకు ఇంగ్లీషు జదువుకొంపతీసింది. (అని కుమారుని జుత్తుపట్టుకొని కొట్టబోవుచుండగా తెర దించవలెను)
***
కన్యాశుల్కము
పంచమాంకము
ఒకటవస్థలము - విశాఖపట్టణములో మధురవాణి బసయెదుటి వీధి
(రామప్పంతులు, అగ్నిహోత్రావధాన్లు ప్రవేశించుచున్నారు)
అగ్నిహో : మనం పోలిశెట్టి దగ్గిర బదుల్తెచ్చిన రూపాయిలన్నీ అయిపోయినాయి, యప్పటికీ ఖర్చులు ఖర్చులే అంటారు. నా దగ్గిర వక దమ్మిడీలేదు.
రామప్ప: ఖర్చు కానిదీ కార్యాలవుతాయిటయ్యా? మీ కడియం యెక్కడైనా తాకట్టు పెట్టండి.
అగ్నిహో : యీ వూళ్లో మనం యెరిగిన వాళ్లెవరున్నారు.
రామప్ప: రండి మధురవాణి దగ్గర తాకట్టు పెడదాము.
అగ్నిహో : చేసేవి మాఘస్నానాలూ, దూరేవి దొమ్మరి కొంపలూ అని జటాంత స్వాధ్యాయిని నన్ను ముండలిళ్లకి తీసుకు వెళతావషయ్యా? రామప్ప: మరి యేకొంపలూ తీరక్కపోతే కేసులు గెలియడం ఎలాగు? అది అందరు ముండల్లాంటి దనుకున్నారా యేమిటి? సంసారి వంటిది. ఐనా మీకు రావడం ఇష్టం లేకపోతే నాచేతికివ్వండి. నేనే తాకట్టుపెట్టి తీసుకొస్తాను.
అగ్నిహోః అలాక్కాదు నేను కూడా వస్తాను.
రామప్ప: యేదీ కడియం ఇలాగివ్వండి.
అగ్నిహో : యిది మాతాతగార్నాటిది. యిది యివ్వడమంటే నాకేమీ యిష్టంలేకుండా వుంది. డబ్బూరికే ఖర్చుపెట్టించేస్తున్నారు. మీరు కుదిర్చిన వకీలు తగిన వాడుకాడు, యింగ్లీషూ రాదేమీ లేదూ.
రామప్ప. ఆయన్లాంటి చెయ్యి యీ జిల్లాలో లేదు. ఆయన్ని చూస్తే డిప్టీకలక్టరు గారికి ప్రాణం. ఇంతకీ మీరేదో పట్టుదల మనుషులనుకున్నా గాని మొదటున్న వుత్సాహం యిప్పుడు లేదు. మీకు డబ్బు ఖర్చుపెట్టడం యిష్టంలేకపోతే మానేపాయెను. యావత్తైలం తావద్వ్యాఖ్యానం అన్నాడు, మరి నాకు శెలవిప్పించెయ్యండి.
అగ్నిహో : (ఆలోచించి) అయితే తాకట్టు పెట్టండి. (అని నిమ్మళముగా కడియము తీసియిచ్చును)
రామప్ప: (తన చేతనెక్కించుచు) యీ కేసుల్లో యిలాగు శ్రమ పడుతున్నాను కదా? నాకొక దమ్మిడీ అయినా యిచ్చారుకారుగదా?
అగ్నిహో : అయితే నా కడియం వుడాయిస్తావా యేమిషి ?
రామప్ప: నేను మీకు యెలాంటి వకీల్ని కుదీర్చాను. ఆయన మీ విషయమై యంత శ్రమపడుతున్నాడు. ఇదుగో ఆయన వస్తున్నాడు.
(నాయడు ప్రవేశించును)
రామప్ప: (తనలో) యేమిటి చెప్మా వీడు మధురవాణి బసపెరటి దొడ్డివేపునుంచి వస్తున్నాడు? వీడుకూడా మధురవాణిని మరిగాడా యేమిటి? వీణ్ణి ఈ కేసులో నుంచి తప్పించెయ్యాలి.
నాయడు: యేమండీ రామప్పంతులన్నా, మిగతా ఫీజిప్పించారుకారుగద?
అగ్నిహో : మీరు రాసిన డిఫెన్సు బాగుంది కాదని భుక్తగారన్నారట.
నాయడు: ఎవడా అన్నవాడు గుడ్లు పీకించేస్తాను. రామప్పంతులన్నగారూ చూశారండీ - డిఫెన్సు యెంత జాగ్రత్తగా తయారీచేశానో. నా దగ్గిర హైకోర్టుకూడా ప్లయింట్లు రాసుకు వెళ్లిపోతారు, యీ కుళ్లు కేసనగా యేపాటి? నే చెప్పినట్టల్లా పార్టీ నడిస్తే నే పట్టినకేసు పోవడమన్నమాట యెప్పుడూలేదు. యో డిఫెన్సు చిత్తగించండి. (అనీ చంకలోని రుమాల్ కట్టతీసి విప్పి యందులోని యొక కాగితము తీసి చదువును) ‘ఫిర్యాదీచెప్పిన సంగతులు యావత్తూ అబద్ధంకాని యెంత మాత్రం నిజంకావు.” చూశారూ ఆ వక్కమాటతోటే ఫిర్యాదీ వాదం అంతా పడిపోతుంది. 'ఫిర్యాదీ నామీద గిట్టక దురుద్దేశంతో కూహకంచేసి కేసు తెచ్చినాడు కానీ యిందులో యెంతమాత్రం నిజంలేదు.
రామప్ప: డిఫెన్సు మాటకేమండి కాని అవధాన్లుగారు పైసా లేదంటున్నారు.
నాయడు: పైసాలేకపోతే పనేలా జరుగుతుంది?
రామప్ప: ఒక సంగతి మనవిచేస్తానిలారండి (రామప్పంతులు, నాయడు, వేరుగా మాట లాడుదురు)
రామప్ప: నాయడుగారూ మీ వకాల్తీ యీయన కేమీ సమాధానం లేదు. నే యెంత చెప్పినా వినక భీమారావు పంతులుగారికి వకాల్తీ యిచ్చాడు. మీకు యింగ్లీష్ రాదనీ, లా రాదనీ, యెవడో దుర్బోధ చేశాడు.
నాయడు: స్మాలెట్ దొరగార్ని మెప్పించిన ముండాకొడుకుని నాకు లా రాకపోతే యీగుంట వెధవలకుటోయ్ లా వస్తుంది. పాస్‌పీసని రెండు యింగ్లీషు ముక్కలు మాట్లాడడంతోటే సరా యేమిటి? అందులో మన డిప్టికలక్టరు గారికి యింగ్లీషు వకీలంటే కోపం. అందులో బ్రాహ్మడంటే మరీని. ఆ మాట ఆలందరికి బోధపర్చండి.
రామప్ప: మరి కార్యం లేదండి, నే యెంతో దూరం చెప్పాను తిక్కముండాకొడుకు.
నాయడు: అయితే నన్నిలాగు అమర్యాద చేస్తారా? యీబ్రాహ్మడి యోగ్యత యిప్పుడే కలక్టరుగారి బసకువెళ్లి మనవిచేస్తాను.
(తెర దించవలెను)
***
రెండవస్థలము - విశాఖపట్టణము, లుబ్ధావధాన్లుగారి బస
(లుబ్ధావధానులు కూరుచొనియుండును)
లుబ్ధావ: రామనామతారకం భక్తి ముక్తి దాయకం; రామనామతారకం భక్తిముక్తి దాయకం - (అని స్మరణ జేయుచుండును). (తనలో) ఆహా! నా అంత దురదృష్టవంతుడు లోకంలో యెవడైనా వున్నాడూ? ఏల్నాడిశని రాగానే కాసీకి బయల్దేరి వెళ్లిపోవలసింది. బుద్ధి తక్కువపని చేశాను రామనామతారకం:- సౌజన్యారావు పంతులుగారు నిన్న పెట్టిన చివాట్లకి తల పగిలిపోయింది. ఇంత డబ్బుండిన్నీ కూతుర్ని ముసలివాడికి డబ్బుకు లోబడి అమ్మాను. అది మొదటి తప్పు, నా జీవానికి ఉసూరుమంటూ అదీ మానం, పరువూ, ప్రతిష్టా, చెడి, లేనిపోని కూనీకేసు పీకలమీదికి వచ్చి, జైల్లో పడ్డది. దానివంతు నన్ను జైల్లో పెట్టేస్తే నాకు విచారం లేకపోవును. యినస్పెక్టరు ముండాకొడుకు దాన్ని ౘలపట్టాడు; ఈ పాపం యెవళ్లని కొట్టుకు పోతుందో. పెళ్లాం ముండ పారిపోవడ మేమిటి చంపేశామని మా మీద కేసేమిటి? కలి, కలి, కలి, కలి, కలి; కలి మండుకు పోతూంది. రామనామతారకం - స్వయంకృతాపరాధం వగిచి కార్యంలేదు - రామ నామతారకం - ఈ రామప్పంతులే నా పాలిటి శని, వేరే గ్రహం అక్కర్లేదు. లేకపోతే వెర్రిముండాకొడుకుని నా యింట్లో నే పడుండక ఆ వెధవమాట్లు విని కాలం అంతా మళ్లింతరువాత పెళ్లి చేసుకోవడమేమిటి. యెంత డబ్బు ఖర్చైపోయింది. పెళ్లికో రెండువేలు ఖర్చైపోయినాయి. హెడ్డు కనిష్టీబు వచ్చి కూనీ, కూనీ అని పత్రం తీసుకువెళ్లి పోయినాడు. ఆ తరవాత పోలీసొచ్చి మళ్లీ కేసు లేవదీసి అతనో సంచీ లాగేశాడు. మళ్లీ యేగాడిదకొడుకు యే పెంట పెట్టాడో కలక్టరు యిదంతా యెక్క తీశాడు. నిజం దైవానికి తెలుసును. మా అమ్మి పసిపిల్ల, సౌజన్యారావు పంతులుగారన్నట్టు యంత దారుణప్పని యెంత మాత్రం చేసి వుండదు. దాని వుసురూ నా వుసురూ యెవళ్లకు తగుల్తుందో, సౌజన్యారావు పంతులుగారు యిప్పుడు వస్తామన్నారు, ఆయనొక్కడే నాకు సత్యసంధుడు కనబడుతున్నాడు. కడమంతా వకీళ్లూ, పోలీసులూ అంతా పచ్చపదొంగలు, కలినిండిపోయివుంది - రామనామతారకం.
(రామప్పంతులు ప్రవేశించుచున్నాడు)
రామప్ప: మామా నాకేమీ మనస్సు మనస్సులాగుంది కాదు.
లుబ్ధావ: మహాప్రభో నీకు పదివేలు నమస్కారాలు. యిహ, యీ పకీరువెధవను వదిలివెయ్యి - రామనామతారకం రామప్ప: రామరామా! యెంత మాటంటావయ్యా. మీరు ఆపదలోవుండి విరక్తిచాత యేమాటలన్నా మేము మీవిషయంలో పనిచేయడం మాకు విధి. ముందూ వెనకా చూడ్డానికి యిహటైమ్ లేదు. వ్యవహారం అంతా ఫొక్తు పర్చుకువచ్చాను. పదివేలక్కర్లేదు. అయిదు వేలిచ్చినట్టైనా యినస్పెక్టరుగారు బలమైన డిఫెన్సు సాక్ష్యంకూడా కుదిర్చి పెడతారు. కేసు యెండ ముందర మంచు విడిపోయినట్టు విడిపోతుంది. ఒక చోట వ్యవహారం కూడా కుదిర్చాను. ప్రామిసరీ నోట్ రాసినట్టైనా రూపాయిలిస్తారు.
లుబ్ధావ: వకదమ్మిడీ నేనివ్వను - రామనామతారకం -
రామప్ప: చెడిపోక నామాటవిను, యంతో ప్రయాస మీద యీ ఘట్టం కుద ర్చాను. యినస్పెక్టరు, తాప్సీలార్ని సాధించడంకోసం యీ కేసంతా లేవదీశాడు. యిందులో సిక్షైపోయినట్టైనా తాస్సీల్దారు తాడుతెగుతుంది. డిప్టికలక్టరు బ్రహ్మద్వేషి: గట్టిడిఫెన్సొ స్తేనేకానీ కమ్మెంటు కట్టేస్తాడు. యినస్పెక్టరు యింత పట్టుదలగా వున్నా నాకూ అతనికీ వుండే స్నేహంచాత యీ ఘట్టానికి వొప్పుకున్నాడు. యిటు పైని జాలం అయితే నీ కూతురికి వురి నీకు కఠిన సిక్షాపడిపోతుంది.
లుబ్ధావ: పడితే పడ్నీ నాదగ్గర డబ్బులేదు. నన్ను బాధపెట్టక నీ మానాన్న నీవు పోదూ రామనామతారకం -
రామప్ప: నీ అంత కర్కోటకుణ్ణి నేనెక్కడా చూడలేదు. కన్నకడుపు కూతురు జైల్లో కూర్చుని వురికి సిద్ధంగా వుంటే వెధవడబ్బుకి ముందూ వెనకా చూస్తున్నావు.
లుబ్ధావ: నన్నెందుకు బాధపెడతావు పదివేల నమస్కారాలు వెళిపో బాబూ-రామనామతారకం -
రామప్ప. ఐతే నీకు సిక్షకావడం, నీ కొమార్తెను వురితియ్యడం నిశ్చయం. నాకు హృదయం కరిగిపోతుంది. దేవుడా యేమిటిగతి. (అని కళ్లను వోణీ అద్దుకొనును)
(లుబ్ధావధాన్లు గదిలోనికి వెళ్లి తలుపు వేసుకొనును)
(సౌజన్యారావు పంతులుగారు ప్రవేశించుచున్నారు)
రామప్ప: తమరు ధర్మస్వరూపులు, లుబ్ధావధాన్లు గారియందు దయచాత యీ కేసులో పనిచేస్తున్నారు. కేసంతా వట్టి అన్యాయం. యేమీ నిజంలేదు. సెలవైతే డిఫెన్సు సాక్ష్యం కుదురుస్తాను.
సౌజన్య: నీ సంగతి నాకు తెలుసు. యిక్కడ్నుంచి లేచివెళ్లిపో.
రామప్ప: (తనలో) వీడసాధ్యుడ్లావున్నాడు. వీడి చర్య చిత్రంగా వుంది. డబ్బుయేడుపేమీ అక్కర్లేదు. ఎప్పుడూ న్యాయం న్యాయం అంటూ దేవులాడుతాడు. (అని నిష్క్రమించుచున్నాడు). సౌజన్య: లుబ్ధావధాన్లుగారూ!
లుబ్ధావ: (తలుపు తీసుకొని పైకివచ్చి) బాబ్బాబు! దయచేశారా?
సౌజన్య: యీదౌల్బాజీని మళ్లీ యెందుకు రానిచ్చారూ?
లుబ్ధావ: యినస్పెక్టరు అయిదువేలు లంచమియ్యమన్నాడని వచ్చాడు.
సౌజన్య: మీరు కాక్కో మెతుకన్నా వెదపకండి. మొట్టమొదట మీ సంగతి చూడగానే మీరు నిర్దోషులని నాకు తట్టి మీ విషయంలో నేనే దఖలు పుచ్చుకున్నాను. ఆ గుంటూరి శాస్త్రుల్లెవరో యేమీ భేదించలేకుండా వున్నాను కాని, నాకు వచ్చిన యితర భోగట్టా అంతా మీ కనుకూలంగానే వుంది. తగిన డిఫెన్సు సాక్ష్యం దొరుకుతుందని నమ్మకం వుంది. మీరట్టే భయపడకండి.
లుబ్ధావ: బాబూ మీరు నా పాలింటి నారాయణమూర్తిలా చక్రం అడ్డువేశారు. మీరు సాక్షాత్తు అవుతారపురుషుల్లా వున్నారు. మీరు కడంవకీళ్ల లాంటివారుకారు మీ మొహం చూస్తే పాతకాలన్నీ పోతాయి. యీ గండం గడిచీ నాపిల్లా నేను కాసీ చేరుకునే సాధనం చేయిస్తిరట్టయినా నా దగ్గరున్న డబ్బంతా మీ పాదాల్దగ్గిర దాఖల్ చేస్తాను. మాకు నెలకో పదిరూపాయిలు జీవనోపాధికి పంపిస్తూ ఆ కడమంతా మీరు పుచ్చుకోండి.
సౌజన్య: నేను మొదట మీతోచెప్పేవున్నాను. నాకోదమ్మిడీ అక్కర్లేదు. నే చెప్పిన మాటలు మీకునచ్చి ముసలివాళ్లు పెళ్లాడకూడదనీ, కన్యాశుల్కం తప్పనీ, యిప్పటికైనా నమ్మకంతోస్తే యీలాంటి దురాచారాలు మాన్పడానికి రాజమహేంద్రంలో వొక సభ ఉంది కనక మీకు తోచిన డబ్బు ఆ సభకి యిస్తే చాలును.
లుబ్ధావ: (బుర్రయూపుచు). ఆ-ఆ-ఆ- బాగా బోధపడ్డది. శల్యాల్ని పట్టిపోయింది. తప్పకుండా దాఖలు చేసుకుంటాను.
సౌజన్య: (నోట్ బుక్కు పెన్సలు, తీసి) బాగా జ్ఞాపకం తెచ్చుకొమ్మన్నాను -తెచ్చుకున్నారా | గుంటూరు శాస్త్రుల్లు పోల్తీ అదీని.
లుబ్ధావ: ఆ!
సౌజన్య: అతని మాటలకి పడమటిదేశపు యాసవుందా?
లుబ్ధావ: (ఆలోచించి) యెంతమాత్రం లేదు.
(తెర దీంచవలెను)
(సౌజన్యారావుగారి యిల్లు.)
(సౌజన్యారావు పంతులుగారు, అగ్నిహోత్రావధానులు కూరుచొని మాటలాడుచుందురు)
సౌజన్య: ఇహ మిమ్మల్ని జయించినవాడు లేడు. పిల్లల్నమ్ముకోవడం శిష్టాచారం అంటారయ్యా?
అగ్నిహో : ఔనండి మా మేనత్తల్నందర్ని అమ్మేరు. వాళ్లంతా పునిస్త్రీ చావేచచ్చారు. మా తండ్రి మేనత్తల్నికూడా అమ్మడమే జరిగిందష, యిప్పుడీ వెధవ యింగ్లీష్ చదువునుంచి ఆ పకీరు వెధవదాన్నీ లేవదీసుకు వెళ్లిపోయినాడు గాని, వైధవ్యం అనుభవించిన వాళ్లంతా యెంత ప్రతిష్టగా ప్రతీకారు పూర్వకాలంలో.
సౌజన్య : చిన్నపిల్లల్ని కాలంగడిచినవాడికి చేస్తే వైధవ్యం రాక మానుతుందయ్యా?
అగ్నిహో : ప్రాలుద్ధం చాలకపోతే ప్రతివాళ్లకీ వస్తుంది. చిన్నవాళ్లకిస్తే నేమి పెద్దవాళ్లకిస్తేనేమి, రాసిన రాతేవడైనా తప్పించగలడూ?
సౌజన్య : డబ్బుకి లోభపడిగదా ముసలివాళ్లకిస్తారు. కన్యలమ్ముకోవడం శాస్త్ర దూష్యం కాదయ్యా?
అగ్నిహో : యిప్పుడు మీ లౌక్యుల్లో రెండేసి వేలూ, మూడేసి వేలూ, వరకట్టాలు పుచ్చుకుంటున్నారు కారండీ. మామట్టుకేనా శాస్త్రాలు?
సౌజన్య: చంటిపిల్లని ముసలివాడికి యేం సౌఖ్యపడుతుందని యిచ్చారయ్యా?
అగ్నిహో : అదంతా మీకెందుకయ్యా. ఓహో! యిందుకా నన్ను పిలిపించారు. వెధవముండన్లేవదీసుకు పోయిన పకీర్ వెధవపక్షాన మాట్లాడతారూ? యేం పెద్ద మనుష్యులండీ, కేసునుకునేది లేదు సరేగదా ఆ వెధవ, కనపడితే నా దుఃఖంతీరా నూటేస్తాను.
సౌజన్య: తొందరపడకండీ అవుధాన్లుగారూ, బ్రాహ్మణోత్తములు, తమ దగ్గిరంతా శాంతం నేర్చుకోవాలి. లుబ్ధావధాన్లుని నూటేసినందుకు సిక్ష కావడానికి సిద్దంగా వుందిగదా. వందో రెండువందలో యీసరికి వదిలిపోయినాయి. కాళ్లు బాగా పీకితేనేకాని కన్యా శుల్కంలోవున్న దోషమూ కనపడదు, మీ మూలంగా దురవస్థచెందిన మీ పిల్లయందు మీకు కనికరమూ పుట్టదు. నాపేర రిఫార్‌మ్ సభ శక్రటరీగారు వుత్తరం వ్రాశారు. ఆ పిల్లతాలూకు ఆస్తి కొంత మీవద్ద వుందట; చిక్కులలో దిగక పంపించెయ్యండి.
అగ్నిహో : నా పిల్లేమిటి పకీర్ ముండ. రేపు యింటికి వెళుతూనే ఘటాశార్ధం పెట్టేస్తాను.
సౌజన్య : ఇంత కనికరం లేదేమయ్యా నీకు?
అగ్నిహో : ఏమిటో నా ప్రాలుద్ధం మీ కెందుకూ? మీ గృహకృత్యాలవూసుకు నే వచ్చానా? సౌజన్య : అయితే ఆ పిల్ల ఆస్తికి మీమీద దావా తేవలసివుంటుంది.
అగ్నిహో : దావాలకి భయపడేవాణ్ణి కానండోయ్.
సౌజన్యా: అది నాకు తెలుసును, మీరు అగ్రహారపు చెయ్యి, ఆఖరుమాట ఒక మాట చెబుతాను, ఆలోచించండి. మీరు గిరీశంమీద కేసుతేవడం మానుకుని ఆ పిల్ల తాలూకు ఆస్తి యిచ్చివేస్తే, మీమీద లుబ్ధావధాన్లుగారు తెచ్చిన ఫిర్యాదు తీయించివేస్తాను.
అగ్నిహో :కేసు మానుకుంటానూ? లుబ్ధావధాన్లుకు చేసినట్టే యెప్పుడో వొహప్పుడు వాడిక్కూడా యెమికలు పచ్చడిచేస్తాను. లుబ్ధావధాన్లు నన్ను చేసేదేమిటి? సాక్ష్యం రావాలికాదూ.
సౌజన్య: ఇప్పుడు మీరే నాదగ్గిర వొప్పుకున్నారుగదా! నేనే పలుకుతాను సాక్ష్యం.
అగ్నిహో : అంతవారు కారనా, యేడిసినట్టేవుంది ముండాసంత, యేడిసినట్టేవుంది. యిందుకేనా యింత ప్రత్యుథ్థానంచేసి నన్ను తీసుకువచ్చారు. యేమిటో కేసులో సలహా చెబుతారనుకున్నాను.
(అని లేచి వెళ్ళిపోవును)
***
మూడవస్థలము - విశాఖపట్టణములోని వీధి
(బైరాగీ, వెనుక పదిమంది శూద్రులు ప్రవేశీంచుచున్నారు)
1 వ శూద్రుడు : యక్కడనుంచి విజయం చేస్తున్నారు?
బైరాగి : నేను కాశీనుంచి వస్తున్నాను.
1 వ. శూద్రుడు : యన్నాళ్లాయి బయలుదేరినారు?
బైరాగి : రెండురోజులయినది.
2 వ. శూద్రుడు : యలాగొచ్చారు యింతయేగిరం.
బైరాగి : పవనం బంధించి వాయువేగంమీద వచ్చాము.
3వ శూద్రుడు : యోగులకి యాలాటి శిద్దులయినా వుంటాయి. యీయనే కాబోలురా మొన్న శివరాత్రికి, సింహాచలంలోను, వుపాకలోనూ కూడా ఒక్క మాటే కనపడ్డాడనీ అనుకున్నారూ?
బైరాగి : యీ వూరిలో సదావృత్తి మఠం వున్నదా?
3వ శూద్రుడు: లేదుగురూ మేమంతా వుండగా మీకు మఠం యెందుకూ? కాశీలో భోగట్టా యేమిటిగురూ! బైరాగి : నాలుగు రోజుల క్రిందట విశ్వేశ్వరుడు కోవిల్లో ఒక బంగారపు రేకు పడ్డాది. దానిమీద అక్షరాలున్నాయి. బ్రాహ్మల కెవ్వరికీ తెలిసినాయికావు. అప్పుడు మా దగ్గిరకు తీసుకువచ్చేటప్పటికి మేము చదివాము-మరియెవరితో చెప్పకండి. అందులో ఆరు నెలలకి ఇంగిలీషు బావుటా పోతుందనివుందీ.
2 వ శూద్రుడు : ఏమాచ్చెర్రెం! ఏమాచ్చెర్రెం! గురువుగారు భోజనం యేటారగిస్తారు?
బైరాగి : పాలు, పంచదార, అరటిపళ్లున్నూ నెలకు పదిహేన్‌రోజులు ఆలాగు ఫలారం చేస్తాం, పదిహేన్‌రోజులు వాయుభక్షణం చేస్తాము. యోవూరు భోగట్టాలేమిటి?
1 వ శూద్రుడు : ఏమున్నాయండి. రామచంద్రపురం అగ్ఘురారం కాపరస్తుడు లుబ్ధావధాన్లని ముసలిబ్రాహ్మడు పెళ్లాన్ని కూతురుచేత చంపించేశాడు. కూనీ కేసు వొచ్చింది. రేపు . సాయింత్రం అతన్ని, హెడ్డుకనిష్టీబుని, సాక్షులనీ, తాసీల్దారుని సిక్ష చెబుతారు.
బైరాగి : (తెల్లపోయి) యీ వూరు పాపంతో నిండినట్టు కనబడుతుంది. యీ వూళ్లో మేమొక నిముషమయినా వుండము.
2వ శూ: గురోజీ మీ రెళ్లిపోతే మాగతేమిటి? కూనీ చేసినోళ్లు యీ వూరోళ్లుకారు.
3వశూ: ఆ వూరు దుకాణాదారుగారిదిగో వస్తున్నారు. ఆయన మంచి గ్యాని.
బైరాగి : (క్రేగంట నా దిక్కుజూచి) యీ వూళ్లో తాగడం లావుగావున్నట్టు కనబడుతుంది. మేము తాగుబోతులతో మాట్లాడము. ఆ దుకాణాదారు వచ్చేలోగా ఈ సందులోకి మళ్లిపోదామురండి.
(ఇంతటిలో దుకాణదారు పరుగెత్తికొని వచ్చును)
దుకా : (బైరాగీమొలలో చేయివేసి పట్టుకొని) నాకు బాకీవున్న రూపాయలిక్కడ కక్కితేనేకాని వొదలను.
బైరాగి : యేమిటీవాళకం! వీడు తప్పతాగి పేలుతున్నాడు. నేను మొదటే అన్నాను కానూ, తాగుబోతులతో సహవాసం కూడదని.
3వ శూ: భాయి! మీకేమి మతిపోయిందా యేమిటి? గురువుగారితో అలాగ మాటలాడుతున్నారు.
దుకా : గురువూలేదు, గుర్రాలేదూరుకోశ్. యీడెక్కడ గురువు, నా దుకాణంమీద సారా అంతా చెడతాగి డబ్బు యివ్వకుండా యగేశాడు.
2న శూ: నీకు మతిపోయింది. ఆయనేటి నీ దుకాణంమీద సారాతాగడం యేటి? మొన్న బయల్దేరి కాశీనుంచి యిప్పుడే ఒచ్చారు. దుకా : ఆకాశంమీంచి ఒచ్చాడుకాడూ? రూపాయిలిచ్చేసి మరీ కదులు.
బైరాగి : మావంటి సాధులతోటి మీకు వాదెందుకబ్బీ, యెవర్ని చూసి నేననుకున్నావో యేమిటో. నీ వంత మమ్మలిని నిర్బంధ పెట్టాలనీవుంటే వొక్కనిముషంతాళు, యింత రాగి తెచ్చుకుంటే వెండిచేసి యిస్తాను.
3వశూ: యేమి వెర్రిముండాపని చేశావోయ్ -బంగారం చేశేవాళ్లకి డబ్బులచ్చంటోయ్, ఆరికాళ్ల మీదపడి కోపం తీర్చుకో.
దుకా : వుండోశ్ యేడిసినట్టేవుంది. (హెడ్ కనిష్టీబు ప్రవేశించును)
హెడ్ : యేమండోయి గురోజీ! మీరు దొరకడం నాకు దేముడు దొరికినట్టుంది. ఇక బతికాను, మీతో కొన్ని జరూరుసంగతులు చెప్పాలిరండి.
బైరాగి : భాయి! మీరు వెనక్కుండండి (పదిమంది శూద్రులును వెనుకకు వెళ్లిపోవుదురు. )
దుకా : నా రూపాయిలు యిచ్చి మరీ మాట్లాడండి.
బైరాగి : నీకు కావలసినంత వేడిచేసిస్తాను, నలుగురిలోను మర్యాదతీసి వేయ్యడం న్యాయమేనా. ఇలాంటి రహస్యాలు పామరులకు తెలియకూడదు.
హెడ్ : (దుకాణాదారునితో) భాయి! నీ రూపాయలు నేనిస్తానుగాని, కేసుమాటేదో జాగ్రత్త చేసుకోనియ్యండి. (బైరాగీవైపు తిరిగి) గురోజీ కూనీకేసు పీకల మీదికి వచ్చింది. కేసు యేబుగ్గీలేనిదే, నాలుగు రాళ్లుతడముకుందామని ఆవేళ రాత్రి ముసలివాణ్ణి గందరగోళం పెట్టాం, రామప్పంతులుగాడు యేదో వాడడిగినంత యిచ్చాంకామని తాస్సీల్దారుకి ఆకాశరామన్న అర్జీకొట్టాడు - వాడొచ్చి కేస్ మళీకదీపి, హాత్‌హూత్తని, ముసలాణ్ణి బెదిరించి డబ్బులాగి వూరుకున్నాడు. తాస్సీల్దారు దగ్గరకూడా రామప్పంతులుకేం పెగిలింది కాదు, దాంతో కలక్టరుకి ఒహ ఆకాశ రామన్న అర్జీకొట్టాడు. దాని మీద అది యినస్పెక్టరుకి రిఫరైంది. వాడు మైరావణాసురుడు. తాస్సీల్దారుకీ వాడికి బలవద్విరోధం దొంగసాక్ష్యం అంతా కూడదీసి పద్మవ్యూహం పన్నేశాడు. నేనూ తాస్సీల్దారూ, కేసు కమ్మీచేశామని రుజువుతెస్తున్నాడు.
బైరాగి : మేముండగా మీకేమి భయమండీ. కోరుటుకు వెళ్లేటప్పుడు యీ వేరు చేతికి కట్టుకుని యీ అక్షింతలు యింటిమీద పడేసి లోపలికి వెళ్లండి. అధికారికి వాగ్బంధము అయిపోతుంది.
హెడ్ : ఆలాగురక్షించు గురూ. మీరు నా పక్షం సాక్ష్యంకూడా పలకాలి. లుబ్ధావధాన్లు మామ గారు ఆ గుంటూరు శాస్త్రులెవరో వాడెక్కడా కనబడకుండా వున్నాడు. వాడుకాని దొరికితే కేసొక్క నిముషంలో పోతుందని ఫస్టుక్లాస్ ప్లీడర్ సౌజన్యారావు పంతులుగారు చెప్పారు. గుంటూరు టెలిగ్రాఫిస్తే అక్కడనుంచి యీ మధ్య యవరూ శాస్త్రుల్లు కూతుర్ని తీసుకుని యీ వేపు రాలేదని జవాబు వచ్చింది. వాణ్ణి రప్పించే సాధనం యేమైనా చేయించగల్రూ గురోజీ?
బైరాగి : ఆహా! అదెంతపని, రాత్రి అంజనం వేసి యెక్కడున్నదీ కనుక్కుంటాం.
హెడ్ : దయచెయ్యండి యింటికి వెళదాము.
బైరాగి : యీ శిష్యులక్కొంచం గ్యానోపదేశంచేసి వస్తాను మీరు వెళ్లండి.
హెడ్ : అలాక్కాదు. నేను మీతో కూడా వుంటాను.
(తెర దీంచవలెను.)
డెప్యూటీ కలెక్టర్ మాణిక్యం మొదలికచేరీ (వకీళ్లు, బంట్రోతులు మొదలైనవారు.)
భీమా : నాకు మునసబుకోర్టులో కేసున్నది. కటాక్షిస్తే వొక అర్జీ దాఖలుచేసి శలవు పుచ్చుకుంటాను.
కలెక్టర్ : కోర్టువారికి సావకాశం అయేవరకూ వుండలేని వకీళ్లు కేసు యెందుకు దాఖలు చేయవలె? ఇది చెప్పినట్టల్లా వచ్చే కోర్టనా మీ యభిప్రాయం?
భీమా : చిత్తం, చిత్తం, తమ ప్రిడిశెసర్లు అలాగ్గడుపుతూ వచ్చేవారు.
కలెక్టర్ : ఆఫీస్ పని చూసుకొని పిల్చేవరకూ ఉండండి.
అగ్నిహో : (రామప్పంతులుతో) యేమండోయ్ మన కొత్తవకీల్ని కోప్పడుతున్నారే?
రామప్ప: యీ అధికార్ల నైజం యేమిటంటే యెవళ్లమీద దయుండి యెవళ్ల పక్షం కేస్ చెయ్యాలంటే వాళ్లని కరవ్వొచ్చినట్టు కనపడతారు. మీరు కోర్ట్లసంగతంతా తెలుసునంటారే? యిదేనా మీ అనుభవం?
అగ్నిహో : (కొంచెము గట్టిగా) అవునవున్నాకు తెలుసును.
కలెక్టర్ : యెవరా మాట్లాడుతున్న మనిషి,
నాయడు: (లేచి) తక్‌షీల్ మాప్‌చేస్తే మనవిచేస్తాను. యీయన కృష్ణారాయపురం అగ్రహారంకాపురస్తుడు, నులక అగ్నిహోత్రావధాన్లుగారు, మహాయోగ్యమైన బ్రాహ్మడు, జటాంత స్వాధ్యాయి, యీయనే లుబ్ధావధాన్లుగారికి కొమార్తెని, పద్దెనిమిదివందల రూపాయిలకు, కన్యాదానం చేయడానికి బేరమాడుకుని, కాబోయే అల్లుడికి దేహశుద్ధిచేశారు. అందుకే యీ మధ్య లుబ్ధావధాన్లు గారు యేలినవారి కోర్టులో చార్జీదాఖలు చేశారు. అందులో ముద్దాయీ యీ మహానుభావుడే! రామవరంలో సహస్రమాసజీవైన వక బ్రాహ్మణ శ్రేష్టుడుంటే ఆయనకు పెద్ద కుమార్తెను కన్యాదానంచేసి, రెండు పిల్లికూనల్ని స్వీకరించేటప్పటికి పెళ్లిలోనే ఆ బ్రాహ్మడిపుణ్యం అంతా మూడి పరంపదం వీంచేశాడు. ఆ పిల్లదాని తరపున భూముల కొరకు దావాతెచ్చారు. వీరు తమవంటి గవర్నమెంట్ ఆఫీసర్లకి తరుచుగా పని గలుగ చేసి ప్లీడర్లని పోషిస్తూవుంటారు. వీరి యోగ్యత లేమి, వీరి దయాంతఃకరణ లేమి, వీరి సరసత లేమి, మరి యెన్నడముకు శేషుడికైనా అలవికాదు. వారి తరపున కేసు దాఖలు చెయ్యడం కోసమే భీమారావు పంతులుగారు కోర్టుకు దయచేశారు (అని విరసముగానవ్వి కూరుచొనును).
కలెక్టర్ : బలే శాబాష్ (గుమాస్తాతో) ఏదీ భీమారావు పంతులుగార్ని ప్రియాదు అర్జీ దాఖలు చేయమను. (గుమాస్తా పుచ్చుకొని దాఖలు చేయును)
కలెక్టర్ : (కాగితమందుకొని) యేమిటయ్యా కేసు స్వభావం?
భీమా : చిత్తం, యీయన వెధవకొమార్తెని, యీయన కొమారుడికి చదువుచెప్పే గిరీశం అనే ఆయన అలంకారాలూ, ఆస్తీతోకూడా లేవతీసుకు వెళిపోయినాడు.
అగ్నిహో : దస్తావేజులూ, కోర్టుకాయితాలూ కూడానండీ.
కలెక్టర్ : యేమిటి? ఆ,హా,హా,హా,హా (అని నవ్వుచు బూట్సు నేలపైతట్టును) బలేశాభాష్ (అర్జీచూసుకొని) యిన్నాళ్లేమి చేస్తున్నారు?
భీమా : తహస్సీల్దార్‌గారి దగ్గర నేరం జరిగిన మూడోరోజునే మున్సబుకోర్టు వకీలు వెంకట్రావు పంతులుగారు, చార్జిదాఖలుచేస్తే ఆ తహస్సీల్దారుగారు కేస్ స్వభావం యేమిటని అడిగినారు. ఎబ్‌డక్‌షన్ అని వెంకట్రావుపంతులుగారు చెప్పేసరికి యింగ్లీషు రాకపోవడం చాత, తహస్సీల్దారు గారు ఆ మాట యెప్పుడూ విన్లేదని చెప్పారు. తరవాత కేస్ స్వభావం తెలుగున చెప్తే యీలాటి నేరం మా జూరిస్‌డిక్‌షన్‌లో జరగదు. తోవలో రోడ్డుమీద యే తాలూకా సరిహద్దులో యెత్తుకు పోయినాడో అని అర్జీ దాఖలు చేసుకున్నారు కారు. లుబ్ధావధాన్లుగారి కూనీకేసు కామాప్ చేసిన తహస్సీల్దారుగారే యీయనండి.
నాయడు: ఇంగ్లీష్ రాకపోతేనేమండి. తహస్సీల్దారుగారు యెంత ప్రాజ్ఞులు. పూర్వపు యూరోపియన్ అధికార్లని యెంతమందిని మెప్పించారు. ఆయన లుబ్ధావధాన్లుగారి కేసు కామాప్ చేశారని భీమారావుపంతులుగారు అంటున్నారు. యింకా విచారణవుతున్న కేసులో అలా అన్నందుకు యీనపైన తహస్సీల్దారుగారు పరువునష్టం చార్జీ తేవడమునకు వీలువున్నది. కలెక్టర్: (భీమారావువైపు జూచి) పిల్లకు పదహారు సంవత్సరములకులోపు యీడని రుజు వున్నదా?
భీమా : జాతకం వుందండి.
నాయడు : కోర్టువారు ఆ జాతకం దాఖలు చేసుకోవాలి
భీమా : యీ కేసులో ఆయన మాట్లాడుతుంటే నే ఎంతమాత్రం వొప్పేదిలేదు.
నాయడు: యీ కేసులో నాక్కూడా వకాల్తినామా వుందండి (అని దాఖలుచయును)
భీమా : (అగ్నిహోత్రావధాన్లుగారితో) ఏమయ్యా యీయనక్కూడా వకాల్తీ యిచ్చావయ్యా?
అగ్నిహో: మొదటా, రామప్పంతులు యీయన కిప్పించారు.
భీమా: (అగ్నిహోత్రావధాన్లుగానితో) అయితే యేడువు.
(అగ్నిహోత్రావధాన్లు తెల్లపోయి చూచును)
కలెక్టర్ : యేదీ జాతకం దాఖలు చెయ్యండీ.
(భీమారావు పంతులు దాఖలు చేయును)
నాయడు: కోర్టువారితో వకసంగతి మనవి చేసుకుంటాను. యీజాతకం విశ్వామిత్రుడంత యోగ్యుడైన బ్రాహ్మడిచేత తయారుచెయ్య బడ్డది. అదుగో ఆమూల నిలబడ్డ రామప్పంతులుగారికి యీ జాతకంలో మంచి ప్రవేశం వుందండి.
భీమా: నేను పేస్‌డ్ వకీల్ని కేసు హీరింగు నేనే చేయవలెనుగాని నాయుడుగారు చేస్తే నేనెంత మాత్రం వొప్పేదిలేదు.
నాయుడు: స్మాలెట్ దొరగారి దగ్గిర్నుంచీ యేజన్సీ కోర్టులో వకాల్తీ చేస్తున్నాను. డబ్బుచ్చుకున్నందుకు నా పార్టీ తరపున నాలుగుమాటలు చెప్పితీరుతానుగాని యింగ్లీష్ చదువుకున్న కొందర్లాగ నోటంట మాట్రాకుండా కొయ్యలాగ నిలబడనండి.
కలెక్టర్: క్లార్క్ ఆ రామప్పంతులుచాతను దీనిక్కాపీ రాయించు.
(క్లార్క్ వ్రాయించును)
(అతను కాపీవ్రాయులోగా డెప్యూటీ కలెక్టర్, గుమాస్తాలు తెచ్చిన కొన్ని కాగితముల మీద సంతకములు చేయుచుండును. కొంతసేపునకు గుమాస్తా రామప్పంతులు వ్రాసిన కాపీతోకూడా జాతకమును దాఖలు చేయును)
కలెక్టర్ : (అగ్నిహోత్రావధానులవైపుచూచి) మీ కొమార్తె, యే సంవత్సరమందు బుట్టిందయ్యా? అగ్నిహో: దుర్మతి.
కలెక్టర్: జాతకంలో దుందుభుందే. రెండు దస్తూరీలు వొక్కలాగున్నా యేమయ్యా బ్రాహ్మడా? బ్రాహ్మణ్యం పరువంతా తీసేస్తిరే. గడ్డితిని పిల్లనమ్ముకున్నావు సరేకాని, యీలాటి ఫోర్జరీలు కూడా చేయిస్తావూ, బ్రాహ్మల్లో అంత, ఖంగాళీ మాలకూడు మరెక్కడాలేదు. నీ దుర్మార్గతవల్ల నీ కుమార్తెను యీ అవస్థలోకి తెచ్చి మళ్లీ ఎబ్‌డక్‌షన్ కేసుకూడానా? నీ పొట్ట కరిగించేస్తానుండు. (గుమాస్తాతో) కేస్‌లో నోటీస్‌లు చెయ్యి.
గుమా: (చార్జీ కాగితముజూచి) యిందులో ముద్దాయీ యింటిపేరూ సాకీనూ లేదండి.
నాయ: (లేచి) వల్లకాట్లో రామనాధయ్య వ్యవహారంలాగుంది. ఇంగ్లీషు వకీళ్లు దాఖలు చేసే కాకితాలు యీరీతినే వుంటాయండి.
భీమా : (గుమాస్తాతో రహస్యముగా) తరవాయీలు నింపించలేదుటయ్యా (పైకి) యీలా నాయుడుగారు నన్ను తూలనాడుతుంటే కోర్టువారు ఊరుకోడం న్యాయంకాదు.
కలెక్టర్: నాయడుగారు మిమ్ము నేమి అన్లేదే.
భీమా : (తనలో) యిక్కడికి నేను రావడం బుద్ధిపొరపాటు.
క్లర్క్ : (భీమారావు పంతులుగారితో) ఇంటిపేరూ, సాకీనూ యేమిటండీ?
భీమా : (అగ్నిహోత్రావధానులుగారితో) ఏమిటయ్యా?
అగ్నిహో : ఆయనపేరు గిరీశం, మరంతకంట నాకు తెలియదు.
కలెక్టర్ : చాబాష్ : బాగావుంది! అవధాన్లుగారి కొమార్తెని యెవడో తీసుకుపోయినాడు. కనక వాడి వూరూ పేరూ యెరిగినవాళ్లు తెలియచెయ్యవలసినదని దండోరా కొట్టించి గేజట్లో వేయించండి. పోలీసువారికి యెందుకు నోటీసివ్వలేదూ! సాకీనూ మొదలైనవి లేనిది కేసు యడ్‌మిట్‌చేయడానికి వీలులేదు. టిఫిన్‌కి వేళయింది లేదాము (అని లేచి వెళ్లిపోవును)
అగ్నిహో: (భీమారావు పంతులుగారితో) ఏమండోయ్ కేసు అడ్డంగా తిరిగిందే (భీమారావు పంతులుగారు మాట్లాడరు)
అగ్నిహో: యేమండోయి మీతోటి మాట్లాడుతున్నాను.
భీమా : ఇచ్చిన ఫీజుకు పనైపోయింది. మళ్ళీ ఫీజిస్తేనే కాని మాట్లాడేది లేదు.
అగ్ని : యేం పనైంది అఘోరంపని, కలక్టరు చివాట్లు పెడుతూంటే ముంగిలా మాట్లాడక వూరుకున్నారు.
భీమా: బంట్రోత్! యితన్ని నా దగ్గరకి రాకుండా గెంటేయ్. అగ్నిహో: ఓహో బాగుంది వ్యవహారం! రామప్పంతులేడీ?
నాయడు: (మెల్లగా వెనుకనుండివచ్చి) ఫోర్జరీమాట రాగానే సన్నగా జారారు యీపాటికి వారివూరికి సగంతోవలో వుంటారు.
అగ్ని: అయ్యో కొంపతీశాడే!
నాయడు: ఇంగ్లీషు వకీలు సరదా తీరిందా? ఫోర్జరీకి తమక్కూడా మఠప్రవేశం అవుతుంది.
అగ్ని: అయ్యో నీ యింటకోడి కాల్చా.
నాయడు: రోజూ కాలుస్తూనే వుంటారు.
(అందరునూ నిష్క్రమింతురు)
(సౌజన్యారావుగారి బస)
(కుర్చీమీద సౌజన్యారావుగారు కూరుచొని యుందురు, బంట్రౌతొక కార్డు తీసుకొనివచ్చి యిచ్చును)
సౌజన్య: (కార్డు చూచుకొని) జె.యస్.గ్రీస్. (బంట్రౌతుతో) డ్రెస్సు వేసుకుని వస్తానుండు (అని వెళ్లి డ్రెస్సు వేసుకొని వచ్చి కుర్చీమీద కూరుచొనును)
సౌజన్య: (బంట్రౌతుతో) ఆయన్ను పిలు.
(బంట్రౌతువెళ్లి గిరీశమును లోపలికి పిలుచుకొనివచ్చును)
సౌజన్య: ఈయనెవరు. దొరగారేరి?
బంట్రౌ: యీయనేనండి కార్డుయిచ్చారు.
గిరీశం: ఐ యామ్, గిరీస్, సర్; వీరయ్య పంటులుగారూ, ఆఫ్ రామవరం, సెంట్‌మీ.
సౌజన్య: ఇదేమిటి వికారం గ్రిసేమిటి? క్రిస్టియనువుటయ్యా?
గిరీ: చిత్తం, చిత్తం, చిత్తం, కాను.
సౌజన్య: మీరు వచ్చిన సంగతి విషయమై ఆతరవాత చెబుతాను. కొన్ని రోజుల క్రిందట మీ విషయమై వీరయ్యపంతులుగారు నా పేర వ్రాసినారు, నేను అందు విషయమై భోగట్టా చెయ్యడంలో పాపం లుబ్ధావధానులుగారి కేసు సంగతి నాకు తెలిసినది. అందు విషయమై కొంత ఇన్‌టరెస్టు పుచ్చుకుని పనిచేస్తూవున్నాను. లుబ్ధావధాన్లుగారు మీకు బంధువుణ్ణని చెప్పారు యేమి బంధుత్వం యేమిటి?
గిరీశ: అతను మా పెత్తల్లి కొమారుడండి. సౌజన్య: ఆయన కుమార్తెమీద కూనీకేసు వచ్చినమాట యెరుగుదురు కాదూ! డెప్యూటీ కలెక్టరు బ్రహ్మద్వేషి; బలమైన డిఫెన్స్ సాక్ష్యం దొరక్కపోతే కమ్మెంట్టైపోతుంది. ఆయనికి పిల్లనిచ్చిన గుంటూరి శాస్రుల్లెవరో మీకు తెలుసునా?
గిరీశ : నాకు ఆసంగతి మట్టుకు తెలియదండి. శలవయితే అదెంత భాగ్యం కనుక్కుంటానండి.
సౌజన్య: వెతగ్గా వెతగ్గా వూళ్లో గుంటూరు కాపరం అని చెప్పుకునే అవధాన్లొకడు దొరికాడు. ఆయన్ని మా యింటికి పిలిపించాను. ఇప్పు డిక్కడే వున్నాడు. వెళ్లి రహస్యంగా యీ సంగతి లుబ్ధావధాన్లుగారితో చెప్పి వేగిరం తీసుకురండి.
గిరీశ : ఆయన్కెడ బసచేశారండి?
సౌజన్య: జగన్నాధస్వామి కోవిల కెదురుగుండాను.
(గిరీశం వెళ్లును. తెర దించవలెను)
***
మూడవస్థలము - (లుబ్ధావధాన్లుగారి బస)
లుబ్ధావ: రామనామతారకం భక్తిముక్తిదాయకం (అని పఠించుచుండును)
గిరీశ : (ప్రవేశించి) అన్నయ్యా (అని యేడ్చుచు కౌగలించుకొనుచు)
లుబ్ధావ: రామనామతారకం భక్తిముక్తిదాయం -
గిరీశ : మీ మీద కూనికేసొచ్చిందని తెలిసి నిద్రాహారం లేకుండా యెకాయకీని వెళిపోయి వచ్చాను. మా అన్నయ్యకీ వాళ్లకీ కబురంపించావు కావేమి?
లుబ్ధావ: ఎవడేం చెయ్యాలి? అన్నిటికీ సౌజన్యరావు పంతులుగారే వున్నారు. అయితే అబ్బీ అగ్నిహోత్రావధాన్లుగాడి కూతుర్ని లేవదీసుకు వెళ్లిపోయినావట్రా! వాడికి తగిన శాస్త్రి చేశావు. దాన్ని పెళ్లి మాత్రం ఆడ్లేదుగదా!
గిరీశ : అంత తెలివితక్కువపని చేస్తానా? నువ్వు నన్ను పెంచుకుంటావనీ, పెళ్లి చేస్తావనీ మావాళ్ళు కొండంత ఆశ పెట్టుకున్నారు గదా!
లుబ్ధావ: యీ గండం గడిస్తే పెంపకంమాట ఆలోచించుకుందాం.
గిరీశ : (గద్గదస్వరంతో) గడిచేటట్టు కనపడదట. సౌజన్యరావు పంతులుగారన్నారు. డెప్యూటీ కలెక్టరు బ్రహ్మద్వేషట. కడుపు సముద్రం అయిపోతూంది (అని కళ్లు తుడుచుకొనును) విధికృతం తప్పించడాని కెవడి శక్యం, కానీ, ముందు గతన్నా చూసుకో. ఓ దత్తపత్రిక రాసిచ్చేస్తే కాపుదారీగా వుంటుంది. లుబ్ధావ: నాకున్న బంధువులంతా నాదగ్గిర డబ్బు లాగాల్ని చూశేవాళ్లే కాని కష్టసుఖాలకి పనికి వచ్చేవాడు ఒక్కడయినా లేడు.
గిరీశ : ఒహణెత్తినైనా ఓ దమ్మిడి కొట్టిన పాపాన్నెప్పుడైనా పోయినావూ? నే కాబట్టి నీ ఆపద సమయంలో వచ్చాను కాని నీ బంధువులందరికీ నీయందు పిసరంతయినా అభిమానం లేదు.
లుబ్ధావ: లేకపోతే పీడా నాడా కూడా పాయెను.
గిరీశ : నీదగ్గిరొక దమ్మిడీ నేనాశించి రాలేదు. దత్తత చేసుకుని యప్పటికైనా తరుణోపాధి చూసుకొమ్మన్నాను.
లుబ్ధావ: యిక్కడంతయింది, యిహ ముందు లోకం మాట ఆలోచించుకుందాం.
గిరీశ : నీకోవేళ సిక్షైపోతే నీ వ్యవహారాలూ సవహారాలూ చూశేవాడెవడైనా వుండాలిగదా? నీ సన్నిహిత బంధువుల్లో యింగ్లీషొచ్చినవాణ్ణి నే నొక్కణ్ణే. నాకో పౌరాఫ్‌టర్నామా ఐనా గొలికిచ్చేయ్.
లుబ్ధావ: నువ్వెందుకు నన్ను దుఃఖంలోవున్నవాణ్ణి మరింత దుఃఖపెడతావు? అన్నిటికీ సౌజన్యారావుపంతులుగారున్నారు. ఆయ నెలా చెబితే అలా చేస్తాను.
గిరీశ : (తనలో) యీ సౌజన్యరావు పంతులు మా అసాధ్యపు ఘటంలా వున్నాడు. అతణ్ణి చూసిన దగ్గర్నుంచీ బ్రహ్మన్లక్ష్యపెట్టనివాణ్ణి నాకే కంపరం కలుగుతూంది.
(బంట్రోతు ప్రవేశించును)
బంట్రో: అవధాన్లుగారూ! సౌజన్యరావుపంతులుగారు రమ్మంటున్నారు.
గిరీశ : ఆఁ. ఆఁ. మరిచిపోయినాను. నే నిప్పుడక్కడినుంచే వచ్చాను. ఎవరో గుంటూరి శాస్త్రుల్లు వారింటి కొచ్చాడట. నిన్ను పిలవమన్నాడు.
లుబ్ధావ: (ముఖమున నాతృత గనుపరచుచు) ఏమిటీ! గుంటూరి శాస్తుల్లే! ఇదుగో వస్తున్నాను. (వళ్లంతా వణుకును). (లుబ్ధావధాన్లు, గిరీశం నాలుగడుగులు నడచునంతటికి పోస్టు బంట్రౌతు కనుబడును)
పోస్టు బం: మీరేటండీ లుబ్ధావధాన్లుగారు?
లుబ్ధావ: అవును, ఎందుకేమిటి?
పోస్టు బం : మీపేర పన్నెండు వందలూపాయలు మనీ ఆర్డరొహటీ, బంగీవహటీ వచ్చింది.
లుబ్ధావ: (తనలో) నాపేర మణీ ఆర్డరేమిటి చెప్మా! (పైకి) ఏదీ యిలాతే. పో.బం: యీ వూరి పెద్దమనుష్యులెవరైనా సాక్షి సంతకం చేస్తేనే కానీ యిస్తే మాకు మాట వస్తుంది.
లుబ్ధావ: అయితే సౌజన్యరావు పంతులుగారి యింటికి, రా, ఎవరి దగ్గిర్నుంచొచ్చిందేమిటి మణీ ఆర్డరు?
పో.బం: (కాగితము తీసిచూచీ) యెవరో గుంటూరి శాస్తుల్లట..
లుబ్ధావ: ఏమిటేమిటి? ఆ కాయితం యిలా చూడ్నీ (అనీ వణుకుచున్న చేతితో కాగితము పట్టుకొని చూచి) గుంటూరి శాస్త్రుల్లేమిటి మణీ ఆర్డరు పంపించడం యేమిటి? యిదీ నిజమేనా?
పో.బం: అవునండీ. ఆ ఫారములో అలావుంది.
గిరీశ : (పోస్టు బంట్రౌతును గోకి, లుబ్ధావధాన్లుతో) కావలిస్తే నేసాక్ష్య సంతకం చేస్తాను. పుచ్చుకో రూపాయిలు. సంచీ నే మోస్తాన్లే. శుభస్య శీఘ్రం అన్నాడు.
లుబ్ధావ: అహం; అహం; అలాకాదు వేగిరంరా, సంజీవరావు పంతులుగారి దగ్గిరకి వెళదాం. (అనీ నడచుచు) గుంటూరి శాస్త్రుల్లేవూరి నుంచోయి యిచ్చాడు.
గిరీశ : యిలా తెండి చెట్టాను. (అని లుబ్ధావధాన్లు చేతిలో నుంచి కాగితము లాగును)
లుబ్ధావ: వద్దొ ద్దొ ద్దొ ద్దొ ద్దొ ద్దు. (అనీ కాగితము వదలడు)
గిరీశ : (లుబ్ధావధాన్లు చేతిలోనుండగానే కాగితము చూచి) వైజాగపటామ్, అనగా, యీ వూరునుంచే.
లుబ్ధావ: (బుర్రెత్తి చూచి ఆశ్చర్యము ముఖమున గనుపరచుచు) అడుగో గుంటూరి శాస్తుల్లా సందులోను, మన్ని చూచి పరుగెత్తుతున్నాడు. (అని లుబ్ధావధాన్లు పరిగెత్తును)
గిరీశ : యేమిటి వెర్రెత్తిందా వీడికి! (అనీ లుబ్ధావధాన్లుతో కూడా నాలుగడుగులు పరుగెత్తి కరటకశాస్త్రులు కనబడగానే వెనకకుతగ్గి, లుబ్ధావధాన్లు చేయిబట్టుకు వెనుకకులాగి) వీడుకాదు గుంటూరిశాస్త్రులు. అతను వలంగా వుంటాడు. అతన్ని సౌజన్యరావు పంతులుగారింట్లో చూశాను. ఇతను కరటకశాస్త్రులు,
లుబ్ధావ: (జాపోయుచు) నీకు తెలియత్తెలియత్తెలియదు. వీణ్ణి పట్టుకో. పట్టుకుంటే యీమణీ ఆర్డర్రూపాయలు నీ కిచ్చేస్తాను.
గిరీశ : (ఒక్కక్షణ మాలోచించి ముందువెనుకజూచి) ఆల్‌రైట్ (అని పరుగెత్తును) (ముందు గుంటూరిశాస్త్రులు. వెనుక గిరీశం తెరచుట్టు పరుగుపెడుదురు. )
(ఆ వీధిలోనే మరియొక చోటు)
(అగ్నిహోత్రావధాన్లు, నాయడు, మాటలాడుచుందురు)
అగ్నిహో :అయితే కేసు మానుకొమ్మన్నారూ?
నాయడు: లేకపోతే మీకు చాలా వుపద్రం సంభవిస్తుంది. ఆ యింగ్లీషు వకీలు అంతా పాడుచేశాడు.
అగ్నిహో : అయితే రామప్పంతులు వూడాయించేసి నట్టేనా?
నాయడు: అందుకు సందేహం యేమిటి?
అగ్నిహో : నాకడియం. మరో బంగారపు సరుకూ తాకట్టు పెడతాననీ తీసుకుపోయినాడు.
నాయడు: వాటికి నీళ్లధారే.
అగ్నిహో : అయ్యో! కడియం మా తాతగారినాటిది, మీరు మొన్న దొడ్డీతోవంబడవస్తున్నారే, ఆ సానింట్లోతాకట్టు పెట్టానన్నాడు.
నాయడు: రామ, రామా, దాని దగ్గిర యంతమాత్రం లేదు. మీది మిక్కిలి దాన్తాలూక్కంటోటి వాడే తీసుకుపోయి యెక్కడో తాకట్టు పెట్టేశాడు, గానీ మీమీద ఫోర్జరీకేసు ఖణాయించకుండా డిఫ్టీ కలక్టరుగారితో సిఫార్సు చేశాను గదా నాకేమిస్తారు?
అగ్నిహో : యేమిచ్చేది, నాభి కొనుక్కోడానికి దమ్మిడీ అయినా యిప్పుడు లేదు. వూరికి చేరితేనేకాని డబ్బురాదు.
నాయడు: పోనియ్యండి. ఒక ప్రోమిసరీనోటు రాయండి రూపాయిలు యిప్పిస్తాను.
అగ్నిహో : పీకపోయినా అప్పుచేయ్యను. మా తండ్రి చచ్చిపొయ్యేటప్పుడు రుణం చెయ్యనని ప్రమాణం చేయించుకున్నాడు.
(తెరవెనుక నుంచి పట్టుకో, పట్టుకో దొంగ యనునొక కేక వినబడును) (కరటకశాస్త్రులు వగర్చుచు పరుగెత్తుకొని వచ్చును)
అగ్నిహో : ఇదుగో బావా యిదేమిటోయ్!
కరటక: ఊరుకో, ఊరుకో, నేనిక్కడున్నానని చెప్పకు.
(అని పరదామూల దాగును. రెండవ వైపునుంచీ వగర్చుచు గిరీశం వచ్చును)
అగ్నిహో : (గిరీశంను జూచి) ఇదుగో గాడిదెకొడుకు దొరికాడు, (అని మీద బడబోగా గిరీశం గతక్కుమని వెనుకకు మళ్లి పారిపోవును. అగ్నిహోత్రావధాన్లు వెంట దరుమును)
నాయడు: యేమిటీ గమ్మత్తు! యేమిటీ అద్భుతం! యిదీ అరబ్బీనైట్సులో చిత్రం లావుంది, దీని గమ్మత్తేదో మనంకూడా కనుక్కుందాం. (వెళ్లును)
నాల్గవ స్థలము - సౌజన్యరావుపంతులుగారి యింటినడవ
(లుబ్ధావధాన్లు, గిరీశం ప్రవేశించుచున్నారు)
గిరీశ : దొరికిపోయినాడుకాని అగ్నిహోత్రావధాన్లు అడ్డుపడ్డాడు. వొహరికిద్దరైనారు గదా అని వెళిపోవచ్చాను.
లుబ్ధావ: గుంటూరిశాస్త్రుల్లు వాడేనా.
గిరీశ : వాడెక్కడ గుంటూరిశాస్త్రుల్లు. ఆయన అగ్నిహోత్రావధాన్లు బావమరిది కరటక శాస్త్రుల్లు.
(సౌజన్యరావు పంతులుగారు ప్రవేశించుదురు)
సౌజన్య: యేమిటండోయ్ విశేషాలు?
లుబ్ధావ: గుంటూరిశాస్త్రుల్లు కనపడ్డాడండి. ఇదుగో యిప్పుడే.
గిరీశ : కాడండి, అతను అగ్నిహోత్రావధాన్లు బావమరిది కరటకశాస్త్రుల్లండి.
సౌజన్య: (ఆశ్చర్యము నభినయించుచు) సొంస్కృతనాటకంలో విదూషకుడు, మన కరటక శాస్త్రుల్లా యేమిటి?
గిరీశ : అవునండి.
లుబ్ధావ: కాడు, కాడు, నా కళ్ళారా చూశాను. అతనే గుంటూరి శాస్త్రుల్లు, నన్ను చూస్తూనే పరుగుచ్చుకున్నాడు.
గిరీశ : చాలాదూరం వెంట దరిమాను కాని దొరికాడుకాడు.
సౌజన్య: అలాగనా; నిన్నే అగ్నిహోత్రావధాన్లు వీధికొసని కడుపీడ్చుకుంటూ వెంటతరమడం మేడమీంచి చూశానే.
గిరీశ : (తెల్లపోయి చూచును)
సౌజన్యా: మళ్లీ కళ్లెదటపడి దొరికినట్టైనా నీ యెముకలు విరక్కొట్టేస్తాడు.
లుబ్ధావ: (మణీఆర్డరు కాగితము సౌజన్యరావు పంతులుగారికి చూపించి) యిదిగోనండి గుంటూరి శాస్త్రుల్లు దగ్గిర్నుంచి పన్నెండువందల్రూపాయిలకు మణీఆర్డరు వచ్చింది. ఈ వూర్నుంచేనట.
సౌజన్య: పన్నెండు వందలేనా మీ దగ్గర అతను పుచ్చుకున్నవి?
లుబ్ధావ: అవునండి.
సౌజన్య: అతని కుమార్తెకు పెళ్లికాలేదే? ఐసీ ఇట్ ఆల్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ హార్లకివ్‌స్ ప్రాక్టికల్ జోక్‌స్. మీ వివాహం నిజమయిన వివాహం కాదు మీరు భయపడకండి. లుబ్ధావ: (చేయి వణకుచుండ) యిదుగోనండి ఈ బంగీలో గుంటూరి శాస్త్రుల్ల పిల్లకి పెట్టిన కంటె.
నాయడు: (పై మాటలనుచుండగ గడపమీద నడుగుబెట్టి నిలిచియుండి) ఆఁ పంతులుగారూ! అది మధురవాణిదండి, దాని తరుపున వకాల్తీ నేనుపట్టాను. (లుబ్ధావధాన్లుగారి వైపు చూచి) యేమండీ లుబ్ధావధాన్లుగారూ! యీ కంటె మధురవాణిది కాదూ?
లుబ్ధావ: రామప్పంతులు అలాగే అంటూవచ్చేవాడు.
సౌజన్య: అది యెవరిదైతే వారికి యిప్పించేస్తాను.
నాయడు: తమరు మరి వకలా చేస్తారని కాదు. తెలిసిన హంశంగనక మనవి చేశాను. అగ్నిహోత్రావధాన్లుగారి కొమార్తెను ఎత్తుకు పోయిన గిరీశం తమ బసలో జొరబడ్డాడని ఆయన... చూసి కనుకొమ్మన్నారు, దొరికాడా యేమిటండీ?
సౌజన్య: మీరు మాటాడక ఊరుకోండి. యితనూ, అతనూ కలిస్తే రక్తఖల్లీలైపోతాయి. (గిరీశంతో) యిప్పుడు నాలుగు గంటలపావు అయినది. ఆరు గంటలకు స్టీమరు వెళ్లిపోతుంది. యవరోయి బంట్రోతు! బగిగి, పెరటి గుమ్మమువైపు తీసుకురా (గిరీశంతో) నీవు యీ నిముషము బయలుదేరి స్టీమరు అందుకుని, రాజమహేంద్రవరము వెళ్లిపో, నీ యోగ్యత నాకు యిదివరకే తెలిసి వీరయ్యపంతులుగారికి తెలియజేసినాను. బుచ్చమ్మను నీవు యిప్పుడు పెళ్లాడడముకు వల్లలేదు. ఆ పిల్లను రామబాయిగారి వీడోస్‌హోముకు పంపించి విద్య చెప్పించ వలసినదని వీరయ్య పంతులుగారి పేర వ్రాసినాను. నీవంటివాళ్లు చేరితే రిఫారం పరువుపోతుంది. నీవు తిరిగీ కాలేజీలో ప్రవేసించి యీ వికారపు చేష్టలు వదిలి, బియ్యేవరకూ చదువుకుంటే ఆపైని బుచ్చమ్మకు యిష్టంవుంటె నిన్ను పెళ్ళాడుతుంది. నీచదువు విషయమయి వీరయ్య పంతులుగారు ఫండులోనుంచి సహాయము చేస్తారు. నీవు తిన్నగా తిరగకపోతే ఆ సహాయంకూడా చెయ్యరు. (బంట్రౌతు ప్రవేసించి బగ్గీ సిద్ధంగా వున్నది అని చెప్పును) పో, పోయి బుద్ధిగా బతుకు, వకనిముషం ఆగావంటే, అగ్నిహోత్రావధాన్లు నీ పెంకితనం అణగకొడుతాడు.
గిరీశం : (మాటలువినినంతసేపును, నిర్ఘాంతపోయి చూచుచు, మాటలు కాగానే ముఖం ప్రక్కకు త్రిప్పి) డామిట్! వ్యవహారం అడ్డంగా తిరిగింది.
(తెర దించవలెను)