కన్యాశుల్కము/చతుర్థాంకము
శ్రీ
కన్యాశుల్కము
చతుర్థాంకము
1-వ స్థలము. రామప్పంతులు యింటిసావిడి.
[రామప్పంతులు కుర్చీమీదకూర్చుని వుండగా మధురవాణి నిలబడి తమలపాకులుచుట్టి యిచ్చుచుండును.]
రామ-- నేనే చిన్నతనంలో యింగిలీషు చదివివుంటే జడ్జీలయదట ఫెళఫెళలాడించుదును. నాకు వాక్‌స్థానమందు బృహస్పతివున్నాడు. అందుచాతనే యింగిలీషురాక పోయినా నాప్రభ యిలా వెలుగుతూంది.
మధు-- మాటలునేర్చిన శునకాన్ని వేటకిపంపితే ఉసుకోమంటే ఉసుకోమందిట.
రామ-- నేనా శునకాన్ని?
మధు-- హాస్యానికన్న మాటల్లా నిజవఁనుకుంటారేవిఁ?
రామ-- హాస్యానికా అన్నావు?
మధు-- మరిమీతో హాస్యవాఁడకపోతే, వూరందరితోటీ హాస్యవాఁడ మన్నారాయేవిఁటి?
రామ-- అందరితో హాస్యవాఁడితే యరగవా?
మధు-- అంచేతనే కుక్కన్నా, పందన్నా, మిమ్ముల్నే అనాలిగాని, మరొకర్ని అనకూడదే? మిమ్మల్ని యేవఁనడానికైనా నాకుహక్కువుంది. యిక మీమాటకారితనం నాతో చెప్పేదేమిటి? మీమాటలకు భ్రమసేకదా మీ మాయలలోపడ్డాను?
రామ-- నాకు యింగిలీషేవొస్తే, దొరసాన్లు నావెనకాతల పరిగెత్తరా?
మధు-- మీ అందానికి మేము తెనుగువాళ్లము చాలమో? యింగిలీషంటే జ్ఞాపకవొఁచ్చింది. గిరీశంగారు మాట్లాడితే దొరలుమాట్లాడినట్టు వుంటుందిట.
రామ-- అటా, యిటా! నీకేంతెలుసును. వాడువొట్టి బొట్లేరుముక్కలు పేల్తాడు. ఆమాటలుగానీ కోర్టులో పేల్తే చెప్పుచ్చుకు కొడతారు.
మధు-- అదేమో మీకేతెలియాలి! గాని, గిరీశంగారు లుబ్ధావధాన్లుగారి తమ్ములటా? చెప్పా`రు కారు!
రామ- నీమనుసు వాడిమీదికి వెళుతూందేం? ఐతే నీకెందుకు, కాకపోతేనీకెందుకు?
మధు- మతిలేని మాటా, సుతిలేనిపాటా, అని.
రామ- నాకామతి లేదంటావు?
మధు- మీకు మతిలేకపోవడవేఁం, నాకే.
రామ- యెం చేత?
మధు- నుదట్ను వ్రాయడం చేత.
రామ- యేవఁని రాశుంది?
మధు- విచారం వ్రాసివుంది.
రామ- యెందుకు విచారం?
మధు- గిరీశంగారు లుబ్ధావధాన్లుగారి తమ్ములైతే, పెళ్లికివొస్తారు; పెళ్లికివొస్తే, యేదైనాచిలిపిజట్టీ పెట్టి, మీమీద చెయిజేసుకుంటారేమో అని విచారం.
రామ- అవును, బాగాజ్ఞాపకంచేశావు. గాని డబ్బు ఖర్చైపోతుందని అవుఁధాన్లు బంధువుల నెవళ్లనీ పిలవడు.
మధు- గిరీశంగారు పిలవకపోయినా వస్తారు.
రామ- నువుగానీ రమ్మన్నావా యేమిటి?
మధు- మీకంటే నీతిలేదుగాని నాకులేదా?
రామ- మరివాడొస్తాడని నీకేలాతెలిసింది?
మధు- పెళ్లికూతురు అన్నకి చదువు చెప్పడానికి కుదురుకుని, వాళ్లింట పెళ్లి సప్లై అంతా ఆయనేచేస్తున్నారట. అంచేత రాకతీరరని తలస్తాను.
రామ- వాడొస్తే యేమి సాధనం?
మధు- నన్నా అడుగుతారు?
రామ- పెళ్లే తప్పిపోతే?
మధు- యలాతప్పుతుంది?
రామ- తప్పిపోడానికి ఒకతంత్రం పన్నా`ను.
మధు- అయితే, మధురంమాట చెల్లించారే?
రామ- చెల్లించక రావఁప్ప యే చెరువునీరు తాగుతాడు?
మధు- యేదీముద్దు (ముద్దుపెట్టుకొనును.)
రామ- గాని మధురం, కీడించిమేలిద్దాం. ఒకవేళ దెబ్బబే జోటు అయిపోయి వాడు రావడవేఁ తటస్థిస్తే యేవిఁటి సాధనం?
మధు- ఆడదాన్ని, నన్నా అడుగుతారు?
రామ- ఆడదాని బుద్ధిసూక్ష్మం. కోర్టువ్యవహారం అంటే చెప్పు. యెత్తుకి యెత్తు యింద్రజాలం లాయెత్తుతానూ? చెయిముట్టు సరసవఁంటేమాత్రం నాకు కరచరణాలు ఆడవు.
మధు- పెళ్లినాలుగురోజులూ, తలుపేసుకుని యింట్లో కూచోండి.
రామ- ఆడదానిబుద్ధి సూక్ష్మవఁని చెప్పానుకానూ? మామంచి ఆలోచన చెప్పావు.
మధు- గాని, నాకొకభయం కలుగుతూంది. నిశిరాత్రివేళ పైగొళ్లెం బిగించి, కొంపకి అగ్గిపెడతాడేమో?
రామ- చచ్చావేఁ! వాడు కొంపలు ముట్టించే కొరివి ఔను. మరి యేవిఁగతి?
మధు- గతి చూపిస్తే యేమిటిమెప్పు?
రామ- "నువ్వుసాక్షాత్తూ నన్ను కాపాడిన పరదేవతవి" అంటాను.
మధు- (ముక్కుమీదవేలుంచి) అలాంటిమాట అనకూడదు. తప్పు!
రామ- మంచిసలహా అంటూ చెప్పావంటే, నాలుగు కాసులిస్తాను.
మధు- డబ్బడగలేదే? మెప్పడిగాను. నేను నా ప్రాణంతో సమానులైన మిమ్మల్ని కాపాడుకోవడం, యెవరికో ఉపకారం?
రామ- మెచ్చి యిస్తానన్నా తప్పేనా?
మధు- తప్పుకాదో? వేశ్యకాగానే దయా దాక్షిణ్యాలు వుండవో?
రామ- తప్పొచ్చింది. లెంపలు వాయించుకుంటాను, చెప్పు.
మధు- పెళ్లివంటలకి పూటకూళ్లమ్మని కుదర్చండి.
రామ- చబాష్! యేమి విలవైన సలహా చెప్పా`వు! యేదీ చిన్నముద్దు (ముద్దుపెట్టుకోబోయి, ఆగి) గాని గిరీశంగాడు నన్నూ దాన్నీకూడా కలియగట్టి తంతాడేమో?
మధు- ఆభయం మీకక్కరలేదు. పూటకూళ్లమ్మ కనపడ్డదంటే, గిరీశంగారు పుంజాలు తెంపుకు పరిగెత్తుతారు, ఆమె నోరు మహాఁ చెడ్డది.
రామ- అవును. నోరేకాదు, చెయ్యికూడా చెడ్డదే. దాం దెబ్బనీకేం తెలుసును. గాని, మా దొడ్డసలహా చెప్పావు. యేదీ ముద్దు. (ముద్దుపెట్టుకొనును.)
(ముద్దుబెట్టుకుంటుండగా, లుబ్ధావధాన్లు ఒక వుత్తరము చేతబట్టుకుని ప్రవేశించును.)
లుబ్ధా- యేమిటీ అభావచేష్టలూ!
రామ- (గతుక్కుమని తిరిగిచూసి) మావాఁ పడుచువాళ్లంగదా? అయినా, నా మధురవాణిని నేను నడివీధిలో ముద్దెట్టుకుంటే, నన్ను అనేవాడెవడు?
మధు- నడి కుప్పమీదయెక్కి ముద్దుపెట్టుకోలేరో? పెంకితనానికి హద్దుండాలి. బావగారికి దండాలు, దయచెయ్యండి. (కుర్చీ తెచ్చి వేయును.)
రామ- నాకు మావఁగారైతే, నీకు బావగారెలాగేవిఁటి?
మధు- మాకులానికి అంతా బావలే. తమకు యలా మావఁలైనారో? (లుబ్ధావధాన్లుతో) కూచోరేం? యేమి హేతువోగాని బావగారు కోపంగా కనపడు తున్నారు. రేపు పెళ్లైనతరవాత అక్కగారిని, వీధితలుపు గడియవేసి మరీ ముద్దెట్టుగుంటారేమో చూస్తానుగదా? అయినా మీ అల్లుడుగారికి చిన్నతనం యింకా వొదిలిందికాదు.
రామ- పైలా పచ్చీసీలో, చిన్నతనంగాక పెద్దతనం యలా వొస్తుంది? యేం, మావాఁ! కోపవాఁ?
లుబ్ధా- నాకు పెళ్లీవొద్దు పెడాకులూవొద్దు.
రామ- (మధురవాణి చెవిలో) చూశావా మధురం, నాయంత్రం అప్పుడే పారింది. (పైకి లుబ్ధావధాన్లుతో) అదేం, అలా అంటున్నారు? నిశ్చయం అయినతరవాత గునిసి యేం లాభం?
లుబ్ధా- నీ సొమ్మేం పోయింది? గునియడం గినియడంకాదు, నాకీ పెళ్లి అక్ఖర్లేదు.
మధు- (రామప్పంతులు చెవిలో) యేమిటా వుత్తరం?
రామ- (మధురవాణి చెవిలో) అగ్నిహోత్రావుధాన్లు పేరుపెట్టి నేనే బనాయించాను.
మధు- (రామప్పంతులు చెవిలో) యేవఁని?
రామ- (మధురవాణి చెవిలో) నువ్వు ముసలివాడివి గనక నీ సంబంధం మాకు వొద్దని.
మధు- చిత్తం! చెప్పేస్తాను.
రామ- (మధురవాణి చెవిలో) నీకు మతిపోయిందా యేమిటి? పెళ్లి తప్పించమని నువ్వే నాప్రాణాలు కొరికితే, యీ యెత్తు యెత్తాను. నోరుమూసుకో.
మధు- (లుబ్ధావధాన్లు చెవిలో) యీ సంబంధం మీకు కట్టిపెట్టాలని పంతులు చూస్తున్నారు. వొప్పుకోకండి.
రామ- (మధురవాణితో) యేమీ బేహద్బీ! (లుబ్ధావధాన్లుతో) స్త్రీ బుద్ధిః ప్రళయాంతకః అన్నాడు. దానిమాటలు నమ్మకండి. కల్పనకి యింతమనిషిలేదు.
లుబ్ధా- (చేతిలోని వుత్తరమును ఆడిస్తూ) యీ కుట్రంతా నీదే.
రామ- (తీక్షణంగా మధురవాణి వైపుచూసి, లుబ్ధావధాన్లుతో) కోపం కోపంలా వుండాలిగాని, యేకవచన ప్రయోగం కూడదు.
లుబ్ధా- యిదంతా మీకల్పనే. నాకొంప ముంచడానికి తలపెట్టారు. చదవండి.
రామ- (వుత్తరం అందుకోక కుర్చీ వెనక్కి తీసుకుని) ఆ వుత్తరం సంగతి నాకేం తెలుసును?
లుబ్ధా- చేసినవాడివి, నీకు తెలియకపోతే, యెవరికి తెలుస్తుంది?
రామ- అదుగో మళ్లీ యేకవచన ప్రయోగం! మెత్తగా మాట్లాడుతున్నానని కాబోలు అనాడీ చేస్తున్నారు? వుత్తరంగిత్తరంనేను కల్పించానని, మళ్లీ అన్నారంటే కథ చాలా దూరం వెళుతుంది. ఆ సంగతిమట్టుకు కాని వుండండి. రామప్పంతులు తడాఖా అంటే యేవఁనుకున్నారో?
లుబ్ధా- నువ్వు-
రామ- అదుగో మళ్లీ.
లుబ్ధా- మీ కల్పనైతేనేం, మరొహరి కల్పనైతేనేం, బుద్ధి పొరపాటునాది. మధ్య వెధవలతో నాకేంపని? వెంటనే బయల్దేరిపోయి, ఆ అగ్నిహోత్రావధాన్లునే అడుగుతాను.
రామ- మాటలు మాజోరుగా వొస్తున్నాయి. జాగ్రత్త (లుబ్ధావధాన్లు వెళ్లును) నన్నేనా వెధవలు అంటున్నాడు?
మధు- నన్నుకూడా కలుపుకోవాలని వుందా యేవిఁటండి?
రామ- నన్నుమట్టుకు వెధవని కింద కట్టావూ?
మధు- నేవుండగా వెధవలు మీరెలా అవుతారు?
రామ- నన్ను సప్త వెధవనిచేశావు. మరి యింకా తరవాయి యేం వుంచావు?
మధు- అదేవిఁటి ఆమాటలు?
రామ- ఆ వుత్తరం నేను బనాయించానని, ఆ వెధవతో యెందుకు చెప్పా`వు?
మధు- మీతోడు, నేను చెప్పలేదే?
రామ- మరి నేను బనాయించానని, వాడికెలా తెలిసింది?
మధు- యెందుకీ ఆందోళన?
రామ- మరి, ఆవెధవ ఆవుత్తరం తీసికెళ్లి అగ్నిహోత్రావధాన్లుకి చూపిస్తే, నామీద వాడు వెంటనే పోర్జరీకేసు బనాయిస్తాడే? పీక తెగిపోతుంది, యేవిఁటి సాధనం?
మధు- యంత్రం యెదురు దిరిగిందో? ఐతే చక్రం అడ్డువేస్తాను. (మధురవాణి తొందరగా వీధిలోకి వెళ్లును.)
రామ- యిదెక్కడికి పారిపోతూంది? యిదే చెప్పేశింది. దొంగపని చేసినప్పుడు రెండోవారితో చెప్పకూడదు. వెధవని చెవులు నులుపుకుంటాను. పరిగెత్తివెళ్లి చేతులో కాగితం నులుపుకొత్తునా? - గాడిదకొడుకు కరిస్తే? పోయి మీనాక్షి కాళ్లుపట్టుకుంటాను.
(మధురవాణి వకచేతితో వుత్తరము, వకచేతితో లుబ్ధావధాన్లు చెయ్యిపట్టుకుని ప్రవేశించును.)
మధు- (రామప్పంతులుతో) చాలు, చాలు, మీ ప్రయోజకత్వం. బావగారికి అన్నా, తమ్ముడా, కొడుకా, కొమ్మా? మిమ్మలిని ఆప్తులని నమ్ముకుని, సలహాకివస్తే, ఆలోచనా సాలోచనా చెప్పక, ఏకవచనం, బహువచనం, అని కాష్టవాదం పెట్టారు. బావా! కుర్చీమీదకూచోండి. (కుర్చీమీదకూచోబెట్టి) (రామప్పంతులుతో) యీవుత్తరం యేవిఁటో నింపాదిగా చదివి చూసుకోండి (వుత్తరం రామప్పంతులు చేతికి యిచ్చును.)
రామ- (వుత్తరం అందుకుని తనలో) బతికా`న్రా దేవుఁడా. (చూచుకుని) అరే నావుత్తరవేఁకాదే యిది. నానీడచూసి నేనే బెదిరాను (పైకి) మావాఁ! వొస్తూనే తిట్లతో ఆరంభిస్తే యెంతటి వాడికైనా కొంచం కోపం వొస్తుంది. నెమ్మదిగానూ, మర్యాదగానూ, నన్నొచ్చియేం సహాయం చెయమంటే అది చెయనూ?
లుబ్ధా- మరైతే యీ పటాటోపం వొద్దని రాయండి. అతగాడికి పటాటోపం కావలిస్తే ఆఖర్చంతా అతగాడే పెట్టుకోవాలి.
మధు- (లుబ్ధావధాన్లు, జుత్తుముడివిప్పి దులిపి) యేం ధూళి! సంరక్షణ చేసేవాళ్లు లేకపోబట్టిగదా? (గూటిలోనుంచి వాసననూనె దువ్వెనాతెచ్చి తలదువ్వుచుండును.)
రామ- (ఉత్తరం తిప్పి కొనచూసి చదువును.) "శేవకుడు తమ్ములు గిరీశం"- వీడా!
మధు- పైకి చదవండి.
రామ- "నీ గిరీశం", అనగానే పైకి చదవాలేం?
లుబ్ధా- "నీ గిరీశం" అన్నారేం?
రామ- అది వేరేకథ.
లుబ్ధా- పైకి చదవండి.
రామ- (చదువును)"సేవకుడు, తమ అత్యంత ప్రియసోదరులు గిరీశం అనేక నమస్కారములు చేసీ చాయంగల విన్నపములు, త॥ యీ నాటికి వృద్ధాప్యంలోనయినా మీరు తిరిగీ వివాహం చేసుకుని ఒక యింటివారు కావడమునకు నిశ్చయించితిరన్న మాటవిని యమందానందకందళిత హృదయారవిందుడ నైతిని."
లుబ్ధా- వెధవ, వృద్ధాప్యవఁంటా`డూ? మొన్నగాక మొన్ననేగదా యాభైదాటా`యి.
మధు- (దువ్వెన మొలనుపెట్టి, లుబ్ధావధాన్లు జుత్తుముడివేసి) సంరక్షణలేక యిలా వున్నారుగాని, యవరు మిమ్మల్ని ముసలివాళ్లనేవారు?
రామ- (చదువును)"మీకు కాబోవు భార్య, నాప్రియశిష్యుండగు వెంకటేశ్వర్లు చెలియలగుటంజేసి నాకు బ్రహ్మానందమైనది. నేను అగ్నిహోత్రావధానులు వారి యింటనే యుండి పెళ్లిపనులు చేయించుచున్నాడను. వారు నన్ను పుత్రప్రాయముగా నాదరించుచున్నారు. బహు దొడ్డవారేగాని చంద్రునకు కళంకమున్నటుల వారికి కించిత్తు ద్రవ్యాశా, కించిత్తు ప్రథమకోపముం గలవు." వ్యాకరణం వెలిగిస్తున్నాడయ్యా గుంటడూ!
"షరా- ఆకోపం వొచ్చినప్పుడు మాత్రం యెదట పడకుండా దాగుంటే యెముకలు విరగవు. ప్రాణం బచాయిస్తుంది. మరేమీ ఫర్వావుండదు- ద్రవ్యాశ అనగా, అది వారికిగాని మీకుగాని ఉపచరించేదికాదు. మీ వూరివారెవరోగాని ఒక తుంటరి, మీరు విశేషధనవంతులనియు, పెళ్లి దేవదుందుభులు మ్రోయునటుల చేతురనియు, వర్తమానము చేయుటను, యేబది బండ్లమీద యీ వూరివారి నందరిని తర్లించుకు రానైయున్నారు. ఇంతియకాక, దివాంజీ సాహేబు వారినడిగి, ఒక కుంజరంబునూ మూడు లొట్టియలనూ, యేనుగుఱ్ఱంబులంగూడ తేనై యున్నారు. బంగారపుటడ్డలపల్లకీగూడ దెచ్చెదరు."
"షరా- దానిమీద సవారీ ఐ, ఆలండౌలత్తులతో వూరేగి, మీరు పెళ్లిచేసుకోవడం నాకు కన్నులపండువేగాని, యిదంతా వృధా వ్రయంగదా. అని నాబోటి ఆప్తులు విచారిస్తున్నారు. యెద్దుపుండు కాకికి రుచి. రామప్పంతులు సొమ్మేంబోయింది?"
వెధవ! నావూసెందుకోయి వీడికి?
"యిందులో ఒక పరమరహస్యం. అది యెద్దియనిన, యీ రామప్పంతులు చిక్కులకు, జాకాల్; తెలివికి, బిగ్ యాస్."
యిదేవిఁటోయి, యీ బొట్లేరు యింగిలీషు!
"అనగా"
వ్యాఖ్యానంకూడా వెలిగిస్తున్నాడయా!
"జాకాల్, అనేది, గుంటనక్క"
పింజారీ వెధవ!
"బిగ్ యాస్, అనగా, పెద్ద-"
వీడి సిగాదరగా! యేం వీడిపోయీకాలం! వీడిమీద తక్షణం డామేజి దావా పడేస్తాను.
(మధురవాణికి నవ్వొచ్చి, ఆపుకోజాలక, విరగబడి నవ్వును.)
యెందుకలా నవ్వుతావు? నీ మొగుడు నన్ను తిడుతున్నాడనా ఆనందం?
మధు- (నవ్వుచేత మాట తెమలక, కొంతసేపటికి) కాదు-కాదు-మీతోడు-లొటి-
రామ- నాతోడేవిఁటి! నేను చస్తే నీకు ఆనందవేఁ!
మధు- (ముక్కుమీద వేలువుంచి, రామప్పంతులు దగ్గరకువెళ్లి, సిరస్సు కౌగలించుకొని, ముద్దెట్టుకొనును) యేమి దుష్టుమాటా!
రామ- మరెందుకు నవ్వుతావ్?
మధు- లొటి-లొటి-లొటి-
రామ- యేవిఁటా "లొటి"?
మధు- లొటి-పిట-
రామ- అవును, లొటిపిట, అయితే?
మధు- (సమాళించుకుని) యెందుకో?
రామ- యెందుకో నాకేంతెలుసును?
లుబ్ధా- ఉత్తరం వల్ల మీరే తెమ్మన్నట్టు అగుపడుతూందే?
రామ- నేనా? నేనా? నాకెందుకూ లొటిపిట?
మధు- (ఉప్పెనగా తిరిగీ నవ్వుతూ) యెక్కడానికీ.
రామ- నేనా యెక్కడం?
మధు- యెందుకు కూడదూ? మీరొక లొటి-పిట-బావగారొక లొటిపిట- పో-పో-పొలిశెట్టి-పెళ్లి సప్లయిదారుడుగనక, అతడో లొటిపిట-యెక్కి పొలాలంట-వూరేగండి-వెన్నుకుప్పెక్కి-ఆ వైభవం-కళ్లారా-చూస్తాం- (మిక్కిలిగా నవ్వును నవ్వును సమాళించుకుని) బావగారూ, క్షమించండి- ఆదుష్టువ్రాతకి నవ్వాను- మరేంగాదు.
రామ- దుష్టంటే దుష్టా! గాడిద!
లుబ్ధా- మీరొహ, పెద్దగాడిదనికూడా తెమ్మన్నారని కాబోలు, రాశాడండీ.
రామ- లేదు, లేదు, గాడిదెమాట వుత్తరంలో యక్కడా లేదు.
లుబ్ధా- వుంది. నేను చదివానండీ. గాడిదనెందుకు తెమ్మన్నావయ్యా నానెత్తి మీదికీ?
రామ- నీకు మతిపోతూందా యేమిటి? గాడిదెమాట లేదంటూంటేనే? (మధురవాణి తిరిగీ నవ్వుచుండును) నీక్కూడా మతిపోయిందీ? యెందుకానవ్వు? నన్ను చూశా? అవుధాన్లును చూశా?
మధు- యెందుకు-ఆ-అనుమానం?-సామెత-వుంది.
రామ- యేమిటా సామిత గీమితాను?
మధు- గాడిద అందిట-పాటకి నేను-అందానికి-మా అప్పా-అందిట-
రామ- అంటే?
మధు- పెళ్లికి గాడిద-లొటిపిటామాట-యిన్నాళ్లకి-మళ్లీ విన్నానుగదా అని.
రామ- వింటే?
మధు- నవ్వొచ్చింది. మీరు కూడా నవ్వరాదూ? యెందుకీ దెబ్బలాట?
రామ- వీడిమీద డామేజి దావా వెంటనే పడేస్తాను.
మధు- (లుబ్ధావధాన్లుతో) బావా, యెందుకు మా పంతులుగారిమీద అన్యాయంగా అనుమానం పడతారు? ఆయన నిజంగా మిమ్మల్ని అన్నగార్లా భావించుకుంటున్నారు. గిరీశంగారు పంతులుమీద వ్రాయడానికి కారణాంతరం వున్నది. మీతో చెప్పవలసిన సంగతికాదు గాని, మీ ఉభయులకూ స్నేహం చెడడానికి సిద్ధంగా వున్నప్పుడు చెప్పకతీరదు. మీ గిరీశంగారు నాకు కొన్నాళ్లు యింగ్లీషు చెప్పేవారు. కొద్ది రోజులు నన్ను వుంచుకున్నారు. మా పంతులుగారు ఆయన దగ్గిరనుంచి నన్ను తీసుకువెళ్లిపోయి వచ్చినారనే దుఃఖంచేత లేనిపోని మాటలు కల్పించి "నక్కాగిక్కా" అని వ్రాశారుగాని, ఆ బొల్లిమాటలు నమ్మకండి.
రామ- "నక్కా గిక్కా" వొట్టినే పోతుందనుకున్నావా యేమిటి? డామేజి దావా పడ్డతరవాత దాని సంగతి తెలుస్తుంది.
మధు- బావా, మరొకమాట ఆలోచించండీ. పంతులకేం లాభం యేనుగులూ, లొటిపిటలూ, గాడిదలూ- (నవ్వును.)
రామ- మనిషివికావా యేమిటి? గాడిదెమాట లేదంటూంటేనే?
మధు- పోనియ్యండి - మీకెందుకు కోపం! గాడిదలు లేకపోతే కడంవ్వే ఆయెను. యివన్నీ మీ యింటిమీదపడి తింటే మా పంతులుగారికి యేంలాభం? చెప్పండీ. ఒకవేళ రాతబుబేరం జరుగుతుంది గనక పోలిశెట్టికి లాభించవచ్చును.
లుబ్ధా- బాగాచెప్పావు-పోలిశెట్టి చేసినపనే!
రామ- చవగ్గా చేస్తాడని ఖర్చువెచ్చం కోవఁటాడిమీద పెట్టావు. అనుభవించు.
మధు- యిప్పుడు మించిపోయినదేమి? పెళ్లికూతుర్ని పంపిస్తే పదిరూపాయలు ఖర్చుతో యిక్కడ ముడిపెట్టేస్తాం. మీరెవరూ రావద్దని, మీ మావఁగారిపేర వుత్తరం వ్రాయండి.
లుబ్ధా- మా ప్రశస్తమైన ఆలోచన చెప్పావు. మావఁగారూ, మధురం మా బుద్ధిమంతురాలు.
రామ- అదుగో! "మధురం గిధురం" అని మీరు అనకూడదు. "మధురవాణి" అనాలి.
లుబ్ధా- పొరపాటు-- గాని తీరామోసి వాళ్లు పెళ్లికూతుర్ని ఒక్కర్తెనీ పంపించేస్తే?
మధు- మరేం? మీతీపు దిగదీసిందీ? పెళ్లిచేసుకొండి.
లుబ్ధా- నా ప్రాణంపోతే యీ సంబంధం చేసుకోను. ఆవుత్తరం కొసాకూ చదివితే అభావచేష్టలు మీకే బోధపడతాయి.
మధు- చదవడం మానేసి యేమిటి ఆలోచిస్తున్నారు?
రామ- గిరీశం గాడిమీద పరుపునష్టానికి డామేజీదావా తేకమాన్ను-వాడి మొహం లాగేవుంది వుత్తరం. చదివేదేవిఁటి.
లుబ్ధా- మావెధవ నాపరువుమాత్రం యేమైనా వుంచాడనా? అయినా తరవాయి చదవండీ.
రామ- (చదువును)"తాజాకలం. చిన్నది బహులక్షణంగా వుంటుంది. గాని కొంచం పెయ్యనాకుడుమాత్రంకద్దు. అద్దానిని మనవారు వైధవ్యహేతువ అండ్రు. యిదివట్టి సూప-సూపర్-స్టి-షన్-అనగా, తెలివితక్కువ నమ్మకం. మనవంటి ప్రాజ్ఞులు లెక్కించవలసినదికాదు. షరా-దీనికి వక చిన్నబైరాగీ చిటికీవున్నది. చిమ్మిటతో పెయ్య నాకుడు వెండ్రుకలూడబీకి, ఒక పౌ-పౌడర్-అనగా, గుండ కద్దు; ఆగుండ ప్రామినచో మరల పెయ్యనాకుడు పుట్టనేరదు. ఈ లోగా దైవాత్తూ వైధవ్యంబే సంప్రాప్తించినచో, పదేపదే క్షౌరం బౌనుగావున పెయ్యనాకుడు బాధించనేరదు. రెండవ నెంబరు షరా-ఒకవేళ వైధవ్యం తటస్థించినా, మావదెనగారు జుత్తు పెంచుకునేయడల, మీరేం జెయ్యగలరు; నేనేం జెయ్యగలను?"
మధు- చాల్చాలు; యీపాటి చాలించండి. గిరీశంగారు యేంతుంటరి?
రామ- యిప్పుడైనా వాడి నైజం నీకు బోధపడ్డదా?(చదువును) "మూడవషరా-యీరోజుల్లో స్త్రీ పునర్వివాహం గడబిడ లావుగానున్నది. తమకు విశదమే. మీరు స్వర్గంబునకుంబోయి ఇంద్రభోగం బనుభవించుచుండ నామెకు పునర్వివాహము చేసికొన బుద్ధి పొడమ వచ్చును. అదిమాత్రం నేను ఆపజాలనని స్పష్టముగా తెలియునది. ఏలననిన? వద్దని మందళించుటకు ఎదట పడితినో, 'మీయన్న స్వర్గంబున రంభతో పరమానందంబునొందుచు నున్నారుకదా, నా గతేమి' యని యడిగినచో నేమి యుత్తర మీయువాడ?"
మధు- మరి చాలించండి.
రామ- నీ యిష్టం వొచ్చినప్పుడు చదివి, నీ యిష్టం వొచ్చినప్పుడు మానేస్తాననుకున్నావా? (చదువును) "నాల్గవషరా-కొదువ అన్ని హంశములూ బహు బాగావున్నవి. తప్పకుండా యీ సంబంధం మీరు చేసుకోవలిసిందే. మీ అత్తగారు సాక్షాత్తూ అరుంధతివంటివారు. మనలో మనమాట, ఆమెకు యీ సంబంధం యెంతమాత్రమూ యిష్టము లేదు. పుస్తెకట్టేసమయమందు, మీయింటి నూతులోపడి ప్రాణత్యాగం చేసుకుంటానని, యిరుగు పొరుగమ్మలతో అంటున్నారు, గాని ఫర్వాలేదు. ఆ నాలుగు గడియలూ, కాళ్లూ చేతులూ కట్టేదాం. మూడు ముళ్లూ పడ్డతరవాత నూతులోపడితే పడనియ్యండి. మనసొమ్మేం బోయింది? పోలీసువాళ్ల చిక్కులేకుండామాత్రం, వాళ్లకేమైనా పారేసి వాళ్లని కట్టుకోవలసివస్తుంది. యీ సంగతులు యావత్తూ మీ మేలుకోరి వ్రాసితిని. యిక్కడ వారికి తెలియరాదు. మరిచిపోయినాను, పిల్లజాతకం అత్యుత్కృష్టంగా వుందట. ఆ బనాయింపు కూడా రామ-"
మధు- రామ?
రామ- అది ఆడవాళ్లు వినవలసిన మాటకాదు.
లుబ్ధా- అది కూడా మీరే బనాయించారంటా డేవిఁటండీ?
రామ- వాడి నోటికి సుద్ధీ, బద్ధంవుందీ? డామేజీ పడితేగాని కట్టదు.
లుబ్ధా- కొంచం అయినా నిజం వుండకపోతుందా, అని నాభయం. అత్తగారికి యిష్టంలేదని పోలిశెట్టి కూడా చెప్పాడు. యీ సంబంధానికి వెయివేలదణ్ణాలు; నా కొద్దుబాబూ.
మధు- బాగా అన్నారు. మీ సంబంధం మాకు యెంతమాత్రంవొద్దని, మీ మావఁగారి పేర వ్రాయండి. కాకితం కలంతేనా?
లుబ్ధా- మావాఁ! మరి ముందూ వెనకా ఆలోచించక వెంటనే వుత్తరం రాసి పెట్టండీ. (నిలబడి మధురవాణి చెవిలో రహస్యము మాట్లాడును; మధురవాణి లుబ్ధావధాన్లు చెవిలో మాట్లాడును.)
రామ - మొహంమీద మొహంపెట్టి, యేవిఁటా గుసగుసలు? పైనుంచి పోస్టుజవాను- "లుబ్ధావుధాన్లుగారున్నారండీ. వుత్తరంవొచ్చింది"
(మధురవాణి పైకివెళ్లి వుత్తరముతెచ్చి లుబ్ధావధాన్లుచేతికి యిచ్చును. లుబ్ధావధాన్లు రామప్పంతులు చేతికి యిచ్చును.)
లుబ్ధా- సులోచనాలు తేలేదు. మీరే చదవండి.
రామ- (తనలో చదువుతూ) మరేవీఁ! చిక్కే వొదిలిపోయింది. మీ మావఁగారి దగ్గర్నించి.
లుబ్ధా- యేవఁని? యేనుగులూ, లొటిపిటలూ తానంటాడా యేవిఁటండి?
రామ- మీ సంబంధవేఁ అక్కర్లేదట.
లుబ్ధా యేవిఁటీ? యెంచాతనో? వాడికా అక్కర్లేదు? నాకా అక్కర్లేదు? తన పరువుకి నేంతగాను కానో?
మధు- నిమిషంకిందట పెళ్లి వొద్దన్నారే? యిప్పుడు పెళ్లి తప్పిపోయిందని కోపవాఁ?
లుబ్ధా- యింకా యేం కూస్తాడో చెప్పండీ.
రామ- మీరు పీసిరి గొట్లని యెవరో చెప్పారట.
లుబ్ధా- నేనా పీసిరి గొట్టుని? వొక్కపాటున పద్దెనిమిది వొందలు యే పీసిరి గొట్టు పోస్తాడు? యింత సొమ్ము యెన్నడైనా, ఒక్కసారి, అగ్నిహోత్రావుధాన్లు కళ్లతో చూశాడూ? సంసారం పొక్తుగా చేసుకుంటే పీసిరి గొట్టా? వాడిసొమ్ము వాడినెత్తిన కొట్టినతరవాత, నేనెలాంటివాణ్ణి అయితే వాడికేం కావాలి?
మధు- యెలాంటివాళ్లేం? బంగారంలావున్నారు?
రామ- మీరు ముసలివాళ్లనీ, మీకు క్షయరోగం వుందనీ కూడా, యెవరో చెప్పా`రట.
లుబ్ధా- నేను ముసలివాణ్ణా వీడి సిగతరగా! యాబైయేళ్లకే ముసలిటండీ? కొంచం దగ్గు వుండడవేఁ కాగట్టండి (దగ్గును) నిలివెడు ధనంపోసి పిల్లని కొనుక్కున్న తరవాత, మరిదాని ఘోషా, నా ఘోషా వాడి కెందుకయ్యా? డబ్బుచ్చుకున్న తరవాత చచ్చిన శవానికైనా కట్టకతీరదు. మాటాడ్రేం?
రామ- అవును; నిజవేఁ. మీరు ముసలివాళ్లైతేమాత్రం?
లుబ్ధా- అదుగో. 'ఐతేమాత్రం' అంటారేవిఁటి? నువ్వేపెట్టావు కాబోలు యీ పెంటంతాను.
రామ- అన్ని పెంటలు పెట్టడానికీ, మీ తమ్ముడు గిరీశం అక్కడే వున్నాడుకదూ?
లుబ్ధా- వీడు, అక్కడెలా పోగయినాడయ్యా నాకు శనిలాగ?
మధు- ఏమి! యీ మగవారి చిత్రం! యింతసేపూ పెళ్లి వొద్దని వగిస్తిరి; యిప్పుడు పెళ్లి తేలిపోయిందని వగుస్తున్నారు. నిజంగా మీకు పెళ్లాడాలని వుందండీ?
లుబ్ధా- వుంటే వుంది, లేకపోతే లేదు. గాని యీ దుర్భాషలు నేను పడి వూరుకుంటానా?
మధు- మరేం జేస్తారు?
రామ- యేంజేస్తారా? డామేజీకి దావా తెస్తారు.
లుబ్ధా- దావావొద్దు, నీ పుణ్యం వుంటుంది. వూరుకో బాబూ.
రామ- కాకపోతే, యింతకన్నా చవకైనదీ, సాంప్రదాయవైఁనదీ, సంబంధం కుదిర్చి, చేసుకున్నావఁంటే, అగ్నిహోత్రావుధాన్లుని చెప్పుచ్చుకు కొట్టినట్టు వుంటుంది.
లుబ్ధా- చవగ్గా కుదరడవెఁలాగ?
మధు- నామాటవిని పెళ్లిమానేసి వూరుకోండి.
లుబ్ధా- యేం? ముసలివాణ్ణని నీకూ తోచిందా? యేవిఁటి?
మధు- మీరా ముసలివాళ్లు? యవరా అన్నవారు?
లుబ్ధా- నీకున్నబుద్ధి ఆ అగ్నిహోత్రావుధాన్లకి వుంటే బాగుండును.
మధు- ఓ పన్ను కదిలిందా? కన్నుకు దృష్టి తగ్గిందా? చూడండీ, మీ దండలు కమ్మెచ్చులు తీసినట్టు యలా వున్నాయో?
రామ- (తనదండలు చూసుకొని) మావఁ పెరట్లో గొప్పు తవ్వడంనుంచి దండలు మోటుగా వున్నాయి; గాని నాదండలు సన్నవైఁనా ఉక్కు ఖడ్డీలు.
మధు- (తన చీర కొంగుతో లుబ్ధావధాన్లు ఛాతీకొలిచి) యెంతఛాతీ!
రామ- యేమిటీ వాళకం?
మధు- వుత్తరం, మీలో మీరు చదువుకుంటారేం? పైకి చదవండి.
రామ- నువ్వు నన్ను ఆజ్ఞాపించే పాటిదానివా? మేం చదువుకుంటాం. యివి ఆడవాళ్లు వినవలిసినమాటలుకావు. నువ్వు అవతలకి వెళ్లు.
మధు-- నేను కదలను.
రామ-- అమాంతంగా యెత్తుకెళ్లి వెనకింట్లో కుదేస్తాను.
మధు-- (కుర్చీ వెనకను నిలబడి లుబ్ధావధాన్లు దండలు చేతులతో గట్టిగా పట్టుకుని) మార్కండేయులు శివుణ్ణి చుట్టుకున్నట్లు, బావగార్ని చుట్టుకుంటాను. యెలా లాక్కు వెళాతారో చూస్తాను.
లుబ్ధా-- (తనలో) యేమి మృదువూ చేతులు! తల, తల దగ్గిర చేరిస్తే, యేమి ఘుమఘుమా! (పైకి) "బాలాదపి సుభాషితం" అన్నాడు మావఁగారూ - మధురవాణ్ణి వుణ్ణియ్యండి. మంచి బుద్ధిమంతురాలు. నిజం కనిపెడుతుంది.
రామ-- అయితే మరివిను (చదువును) "మీకొమార్తె ప్రవర్తన బాగావుండక పోవడంచాత మిమ్మల్ని వెలేశారని లోకంలో వార్త గట్టిగావున్నది."
లుబ్ధా-- (కొంతతడవు వూరుకుని) నువ్వే నాకొంప తీశావు.
మధు-- పంతులేనా?
లుబ్ధా-- ఒహర్ననవలిసిన పనేవుఁంది?
మధు-- (కొంతతడవు వూరుకొని) నేను మీ యింటికి వెళ్లిపో యొస్తాను. రండి. పెళ్లీగిళ్లీ మానెయ్యండి. మీకు పెళ్లాంకన్న యెక్కువగా సంరక్షణ చేస్తాను.
లుబ్ధా-- (ఆనందం కనపరుస్తూ) బీదవాణ్ణి నేను డబ్బివ్వలేనే? నీలాంటి విలవైన వస్తువను పంతులుగారే భరించాలి.
మధు-- నాకు డబ్బక్కర్లేదు. తిండి పెడతారా?
లుబ్ధా-- ఆహా! అందుకులోపవాఁ!
మధు-- ఐతే పదండి. మరి యీ పంతులుగారిమాయ మాటలు వినక పెళ్లి మానేసి, సుఖంగా యింట్లో కూచుందురుగాని.
రామ-- (మధురవాణివైపు తీక్షణముగా చూసి) నువ్వు భోజనం చెయ్యలేదన్నమాట జ్ఞాపకంవుందా? వెళ్లు.
మధు-- మీచర్య చూస్తేనే కడుపునిండుతుంది. (ఛఱ్ఱుమని యింటిలోనికి పోవును.)
లుబ్ధా-- యీ మధురవాణి. విన్నారా! మావాఁ! వేశ్య అయినా! చాలా తెలిసినమనిషి. మన సంసార్లకి దానికివున్నబుద్ధివుంటే బతికిపోదుం.
రామ-- అవుఁను. బుద్ధిమంతురాలే; గాని వొళ్లెరగని కోపం. యేవైఁనా వెఱ్ఱి అనుమానం పుట్టితే, తనూపై కానదు. చూశారా మావాఁ, మీలాంటి శిష్ఠులు సానివాళ్ల శరీరం తాకకూడదు. అది చిన్నతనంచేత మొఖంమీద మొఖం పెడితే "పిల్లా, యడంగా నిలబడి మాట్లాడు" అని చెప్పాలి. ఒక్కటే వొచ్చింది దీనికి దుర్గుణం. పరాయివాళ్లతో మాట్లాడితేగాని దానికితోచదు. పట్ణవాసంలో వుండడంనించి ఆదురలవాటు అబ్బింది.
లుబ్ధా-- చిన్నతనంగదా! మధురవాణి నాపిల్లలాంటిది. ముట్టుగుంటే అదోతప్పుగా భావించకండి.
రామ-- నీ సొమ్మేం బోయింది! అదికాదు, చూశారా మావాఁ. వుంచుకున్న ముండాకొడుకు యదట, మరో మొగాణ్ణి పట్టుకుని "వీడి దండలు కమ్మెచ్చులు తీసినట్టున్నాయి. వీడి ఛాతీ భారీగావుంది"- అని చెవిలో నోరుపెట్టి గుసగుసలాడుతూంటే అగ్గెత్తుకొస్తుందా రాదా?
లుబ్ధా-- పొరపాటు. లెంపలు వాయించుకుంటాను. క్షమించండి.
రామ-- మీలెంపలు వాయించుకుంటే కార్యంలేదు. దాని లెంపలు వాయించాలి. మీమీద దానికి కొంచెం యిష్టం వున్నట్టుంది. గట్టిగా బుద్ధిచెప్పండి.
లుబ్ధా-- నామీద యిష్టవేఁవిఁటి మావాఁ! యక్కడైనా కద్దా?
రామ-- మీయింటికి వెళ్లిపోయొస్తానంటూందే? మరి తీసికెళ్లు.
(పైమాటలాడుచుండగా మధురవాణి పట్టుచీరకట్టుకుని ప్రవేశించి.)
మధు-- అలాగే తీసికెళ్తారు మీకు భారవైఁతేను. ఆ మహానుభావుడికి చాకిరీచేస్తే పరంఐనా వుంటుంది.
లుబ్ధా-- మామగారు హాస్యానికంటున్నారుగాని, నిన్నొదుల్తారా? నేతగను, తగను.
రామ-- అలాగడ్డి పెట్టండి!
మధు-- ఆయన హాస్యానికి అంటున్నా, నేను నిజానికే అంటున్నాను. గడ్డి గాడిదలు తింటాయి; మనుష్యులు తినరు.
రామ-- అదుగో మళ్లీ గాడిదలంటుంది! (మధురవాణి నవ్వుదాచుటకు ముఖం తిప్పికొని, లోగుమ్మముదాటి, విరగబడినవ్వును.)
లుబ్ధా-- మధురవాణికి మీదగ్గిర భయంభక్తీకూడాకద్దు.
రామ-- వుంది. కోపవొఁస్తే గడ్డి పరకంతఖాతరీ చెయ్యదు. పరాయిమనిషి వున్నాడని అయినా కానదు.
లుబ్ధా-- పెళ్లిప్రయత్నం యిక మానుకోవడవేఁ ఉత్తమం, అని తోస్తుంది. యేవిఁటి తమశలవు?
రామ-- నాశలవేం యెడిసింది! పెళ్లిచేసుకోవొద్దని మధురవాణి శలవైంది. దాని బుద్ధికి ఆనందించి అలా నడుచుకుంటున్నారు. స్త్రీబుద్ధిః ప్రళయాంతకః అని చెప్పనే చెప్పాను.
లుబ్ధా-- మీరు ఆప్తులనేగదా మీ సలహాకి వొచ్చాను. మధురవాణి చెప్పిందనా పెళ్లివద్దంటున్నాను. తప్పినపెళ్లి తప్పిపోయింది. ఖర్చులుకూడొచ్చాయి గదా అని సంతోషిస్తున్నాను.
రామ-- రెడ్డొచ్చాడు మొదలాడన్నాడట. సాధక బాధకాలు యెన్ని పర్యాయములు చెప్పినా అవి అన్ని పూర్వపక్షంఐ, ముక్తాయింపు మళ్లీ డబ్బు ఖర్చు మీదికి వొస్తూవుంటుంది. పెళ్లి చేసుకుని కడుపు ఫలిస్తే మీ యిల్లు పదియిళ్లౌతుంది. పెళ్లి చేసుకోక గుటుక్కుమంటే, యీ కష్టపడి ఆర్జించిన డబ్బంతా యవడిపాలుకాను?
లుబ్ధా-- అదుగో యేమో యెక్కువ ధనం వున్నట్టు శలవిస్తారు. నాకేవుఁంది?
రామ-- వున్నంతవుంది. పరానికి యిన్ని నీళ్లచుక్కలు వొదిలేవాడుండాలా?
లుబ్ధా-- అలా అయితే, తమ రెందుకు పెళ్లి చేసుకున్నారు కారూ?
రామ-- నేను పిత్రార్జితం అంతా కరరావుఁడు చుట్టేవేశాను. యిక పరానికా? నేను శాక్తేయుణ్ణీ; యోగ సాధనం చేస్తాను. నాకు మరికర్మతో పనిలేదు. లోకంకోసం తద్దినాలు పెడుతున్నాను. అయితే సానిదాన్ని యెందుకు వుంచుకున్నావయ్యా! అని అడగగలరు. "కామిగాక మోక్షకామికాడు" అన్నాడు. యిక మీసంగతో? మీరు నిద్దరపోతూండగా చూసి యెప్పుడో ఒకనాడు మీనాక్షి ఆపాతు యెక్కదీసి రంకుమొగుణ్ణి తీసుకు పారిపోతుంది. ఆపైని దరిద్రదేవత మిమ్మల్ని పెళ్లాడుతుంది.
లుబ్ధా-- అయితే యేం జెయమంటారు?
రామ-- మీరు పునః ప్ర`యత్నంచేసి పెళ్లా`డండి. పెళ్లాంభయంచేత మీనాక్షి ఆటకట్టడుతుంది. మీనాక్షి భయంచేత, మీ పెళ్లాం కట్టుగావుంటుంది. అవునంటారా? కాదంటారా?
లుబ్ధా-- నిజవైఁనమాటే.
రామ-- నిజవైఁతేనేం? మీకు బహుపరాకు. సాధకబాధకాలు అడుగడుక్కీ జ్ఞాపకం చేస్తూండాలి. మీకు జాతకరీత్యా, వివాహం జరక్కపోతే, మార్కం వుందన్నమాట పరాకుపడ్డారా?
లుబ్ధా-- పరాకులేదు. గాని యిన్నాళ్లాయి కొట్టుకుంటూంటే, యీ నాటికి పద్ధెనిమిది వొందలకి, వక సంబంధంకుదిరి, తీరా క్రియకాలానికి తేలిపోయిందిగదా? యిప్పుడు చవగ్గా మనకి సంబంధం కుదురుతుందా? కుదరదు. కుదరదు.
రామ-- నిన్న నొచ్చాడయ్యా, గుంటూరునించి వక బ్రాహ్మడూ. వున్నాడో వెళ్లిపోయినాడో?
లుబ్ధా-- సంబంధానికా?
రామ-- అవును. యంతబుద్ధి తక్కువపనిచేశానూ! నాయెరికని యెక్కడైనా సంబంధంవుందా అని అతగాడు అడిగితే, లేదని చెప్పా`ను. యీ సంబంధం మీకు తప్పిపోతుందని నేనేం కలగన్నానా యేవిఁటి? అతడు జటాంత స్వాధ్యాయిన్నీ మంచి సాంప్రదాయవైఁనకుటుంబీకుడున్నూ, ఆ సంబంధంచేస్తే అగ్నిహోత్రావుధాన్లుని చెప్పుచ్చుకు కొట్టినట్టౌను.
లుబ్ధా-- బేరం యేం చెప్పా`డు?
రామ-- బేరం మహాచవకయ్యా. అదే విచారిస్తున్నాను. అతగాడు గుంటూరునుంచి వస్తున్నాడు. అక్కడివాళ్లకి, మనదేశపు కొంపలమ్ముకునే బేరాలతాపీ యింకా తెలియదు. అందుచేత నందిపిల్లిలో పన్నెండు వందలకి సంబంధం కుదుర్చుకున్నాడు. వ్యవధిగాగాని పెళ్లికొడుకువారు రూపాయలు యివ్వలేమన్నారట, ఆ బ్రాహ్మడికి రుణాలున్నాయి వాయిదానాటికి రూపాయలు చెల్లకపోతే దావా పడిపోతుందని యెక్కడయినా పిల్లని అంటగట్టడానికి వ్యాపకంచేస్తున్నాడు. ఒకటి రెండు స్థలాల్లో వెయ్యేసి రూపాయలకి బేరం వొచ్చిందట. పన్నెండు వందలకిగాని యివ్వనని చెప్పా`డు.
లుబ్ధా-- మరొక్కవొంద వేదాంమనం?
రామ-- అతగాడు వుంటేనా, నూరువెయడానికీ యాభైవెయడానికీని?
లుబ్ధా-- కనుక్కుందురూ మీపుణ్యంవుంటుంది. యెక్కడబసో?
రామ-- దాని సిగగోసినడబ్బు, డబ్బుమాట అలా వుణ్ణీండి గాని. ఆపిల్ల యేమియేపు! యేమి ఐశ్వర్యలక్షణాలు! ధనరేఖ జెఱ్ఱిపోతులావుంది. సంతానరేఖలు స్ఫుటంగావున్నాయి. పిల్ల దివ్యసుందర విగ్రహం.
[మధురవాణి ప్రవేశించును.]
మధు-- గ్రహవేఁవిఁటి?
రామ-- గ్రహవేఁవిఁటా? అవుధాన్లుగారి గ్రహస్థితి చూస్తున్నాం. జాతకరీత్యా యీ సంవత్సరంలో వివాహం కాకతప్పదు.
మధు-- మీమాట నేను నమ్మను. (అవుధాన్లు దగ్గిరకువెళ్లి ముఖంయదట ముఖం వుంచి) ఆమాటనిజమా?
లుబ్ధా-- అంతా నిజం అంటున్నారు.
మధు-- సిద్ధాంతిగారేవఁన్నారు?
లుబ్ధా-- జాతకం చూసిన సిద్ధాంతల్లా ఆమాటే అంటున్నాడు. యిదివరికల్లా నాజాతకం మాగట్టి దాఖలా యిస్తూంది. ఒక్కటీ తప్పిపోలేదు.
మధు-- అయితే మీ ప్రారబ్ధం. ఆపెయ్యనాకుడు పిల్లనిమాత్రం యీ పంతులు మాయమాటలువిని చేసుకోకండి.
రామ-- భోంచేస్తూ వొచ్చావు, యేం పుట్టి ములిగిపోయిందని?
మధు-- వెండిగిన్నెకోసం వొచ్చాను.
రామ-- తీసుకెళ్లు. (మధురవాణి నిష్క్రమించును.)
లుబ్ధా-- పెళ్లి చేసుకోవొద్దంటుందేవఁండీ?
రామ-- నిమ్మళంగామాట్లాడండి. సానిది యక్కడైనా పెళ్లి చేసుకోమంటుందయ్యా? నీమీద కన్నేసింది.
లుబ్ధా-- నామీద కన్నెయ్యడవేఁవిఁటి మావఁగారూ! యవరు విన్నా నవ్వుతారు.
రామ-- మీరుగానీ పెళ్లి చేసుకోవడం మానేస్తే, మీయింట్లోవొచ్చి బయిఠాయిస్తుంది. అది ఘంటాపథంగా చెబుతూవుంటే చెవుల్లేవా యేవిఁటి మీకు? దానితో మీరేవఁయినా వెఱ్ఱి వెఱ్ఱి చాష్టలు చేశారంటే మీకూనాకూ పడుతుంది గట్టిరంధి. జాగ్రతెరిగి మసులుకొండి.
లుబ్ధా-- నేనా? నేనా? యేవిఁటి అలా శలవిస్తున్నారు. మావాఁ! నాపిల్ల ఒకటీ అది వొకటీనా? ఆ గుంటూరు శాస్తూల్లు వున్నాడో వెళ్లా`డో, ఒక్కమాటు కనుక్కోలేరో?
రామ-- యదటింట్లోనే బసచేశాడు కనుక్కుంటానుగాని, మధురవాణి భోజనం యేపాటి అయిందో చూసి మరీ వెళతాను. (లోపలికి వెళ్లివచ్చి పైకి వెళ్లును.)
లుబ్ధా-- మధురవాణ్ణి తీసుకుపోతా ననుకుంటున్నాడు యీ పంతులు ఆహ! హ! (పొడుముపీల్చి) మనిషికీ మనిషికీ తారతమ్యం సాందేకనిపెట్టాలి. పంతుల్లాగ మీసంవుంచుకుని, రంగువేసుకుంటే, తిరిగీ యౌవ్వనం వొస్తుంది. యీ చవక సంబంధం కుదిరినట్టాయనా యేమి అదృష్టవంతుణ్ణి!
(రామప్పంతులు స్త్రీవేషముతోనున్న శిష్యుణ్ణి రెక్కపట్టుకు తీసుకువచ్చును. అరచెయ్యి చూపించి)
రామ-- మావాఁ! యేం ఖొదాకొట్టు కొచ్చిందోయి నీకు! యిదిగో ధనరేఖ. చెయ్యి కొసముట్టి రెండోపక్కకి యెగబాకిరినట్టుందోయి. యివిగో సంతానరేఖలు. కంఠందగ్గిర చూశావా హారరేఖలు?
లుబ్ధా-- అట్టే పరిశీలన అక్కర్లేదు. చాల్లెండి.
(పై ప్రసంగము జరుగుచుండగా మధురవాణి వెనక పాటున వచ్చి పంతులు నెత్తిమీద చెంబుతో నీళ్లు దిమ్మరించును.)
రామ-- యేమిటీ బేహద్బీ!
మధు-- మంగళాస్నానాలు. (శిష్యుడి గెడ్డం చేత నొక్కి) నీకు సిగ్గులేదేలంజా?
(మధురవాణి నిష్క్రమించును.)
రామ-- కోపవొఁస్తే మరి వొళ్లెరగదు. యిక కొరకంచో చీపురుగట్టో పట్టుకు వెంట దరువుఁతుంది. యీ పిల్లని తీసుకు పారిపోదాంరండి.
(శిష్యుడి చెయ్యి పట్టుకుని పైకి నడుచును.)
లుబ్ధా-- నడుస్తుంది. రెక్క వొదిలెయ్యండి.
రామ-- (రెక్కవదిలి) ఓహో! కాబోయే యిల్లాలనా?
(ముగ్గురూ నిష్క్రమించి, వీధిలో ప్రవేశింతురు.)
లుబ్ధా-- యీ పిల్లని చేసుకోమని మీ అభిప్రాయవేఁనా?
రామ-- నా అభిప్రాయంతో యేంకార్యం? మీ మనస్సమాధానం చూసుకోండి. పిల్ల యేపుగావుందా? రూపు రేఖావిలాసాలు బాగున్నాయా? అది చూసుకోండి.
లుబ్ధా-- సంసార్లకి సౌందర్యంతో యేంపని?
(సిద్ధాంతి తొందరగా యెదురుగుండా వస్తూ ప్రవేశించి.)
సిద్ధా-- (లుబ్ధావధాన్లుతో) యవరు మావాఁ యీపిల్ల? (లుబ్ధావుధాన్లు జవాబుచెప్పక, రామప్పంతులువైపు బుఱ్ఱతిప్పి సౌజ్ఞచేయును.)
రామ-- మావాళ్లే.
సిద్ధా-- (నిదానించి) భాగ్య లక్షణాలేంబట్టాయీ యీ పిల్లకీ!
రామ-- యేవిఁటండి?
సిద్ధా-- విశాలవైఁన నేత్రాలూ, ఆకర్ణాలూ, ఆవుంగరాలజుత్తూ, విన్నారా? యేదమ్మా చెయ్యి (చెయ్యిచూసి) యే అదృష్టవంతుడు యీ పిల్లని పెళ్లాడాడోగాని-
రామ-- యింకా పెళ్లికాలేదండి.
సిద్ధాం-- మీరు పెళ్లి చేసుకోవాలని వుంటే, యింతకన్న అయిదోతనం, అయిశ్వర్యం, సిరి, సంపదాగల పిల్ల దొరకదు. యిది సౌభాగ్యరేఖ, యిది ధనరేఖ, పంతులూ బోషాణప్పెట్టలు వెంటనే పురమాయించండి. యేదీ తల్లీ చెయితిప్పూ. సంతానం వకటి, రెండు, మూడు. (చెయ్యివొదలి లుబ్ధావధాన్లతో)యెదీ మావాఁ పొడిపిసరు. (పొడుంపీల్చి) పోలిశెట్టి కూతురు ప్రసవం అవుతూంది. జాతకం రాయాలి. మళ్లీ దర్శనం చాస్తాను.
రామ-- వక్కమాట. (సిద్ధాంతితో రహస్యంగా మాట్లాడును. సిద్ధాంతి చంకలో పంచాంగంతీసి, చూచును. మరి నాలుగుమాటలాడి పంచాంగం చంకని పెట్టుకుని తొందరగా వెళ్లిపోవును.)
లుబ్ధా-- యేవఁంటాడు?
రామ-- నేనే యీపిల్లని పెళ్లి చేసుకుంటాననుకుంటున్నాడు. రేపటి త్రయోదసినాడు పెళ్లికి మంచిది అన్నాడు.
లుబ్ధా-- ఆరోజు వివాహముహూర్తం లేదే?
రామ-- శుభస్య శీఘ్రం అన్నాడు. ద్వితీయానికి అంతముహర్తం చూడవలసిన అవసరంలేదు. తిథీ నక్షత్రం బాగుంటే చాలును. యిదుగో మీమావఁగారు వొస్తున్నారు.
లుబ్ధా-- బేరఁవాడి చూడండి.
(కరటక శాస్తుల్లు ప్రవేశించును.)
కరట-- గంగాజలం సిరస్సున పోసుకున్నారా యేవిఁటి పంతులుగారూ? మాపిల్లని యెక్కడికి తీసికెళ్తున్నారు?
రామ-- (కరటక శాస్త్రితో) మాట.
(ఇద్దరూ రహస్యముగా మాటలాడుదురు.)
రామ-- (లుబ్ధావధాన్లును యెడంగా తీసికెళ్లి) పధ్నాలుగు వొందలు తెమ్మంటున్నాడు. యెవళ్లో పదమూడు యిస్తావఁన్నారట.
లుబ్ధా-- యిదా మీరు నాకు చేసిన సాయం? పోనియ్యండి, ఆపజ్యెండుకైనా తగలెట్టండి.
రామ-- ఉపకారానికి పోతే నాదా`నిష్టూరం? కోరి అడిగితే కొమ్మెక్కుతారు. యేంజెయను? (కరటకశాస్త్రితో రహస్యంగా మాట్లాడి, తిరిగీ వచ్చి లుబ్ధావధాన్లుతో) మావాఁ కృత్యాద్యవస్థమీద వొప్పించాను. పిల్లదానికి సరుకు పెడితేగాని వల్లలేదని భీష్మించుకు కూచున్నాడు. యేవఁంటావు?
లుబ్ధా-- అది నావల్లకాదు.
రామ-- వూరుకోవయ్యా. అలాగే అందూ, మధురవాణి తాలూకు కంటెతెచ్చి ఆవేళకి పెట్టి, తరవాత తీసుకుపోతాను.
లుబ్ధా-- అదేదో మీరే చూసుకోండి.
రామ-- నేనే చూసుకుంటాను. ఖర్చు వెచ్చాలేవోమనవేఁ చేసుకుని, కొంచంలో డబడబలాడించేదాం. పోలిసెట్టిని సప్లైకి పెట్టకండి. పెద్దిపాలెం వెళ్లి లౌక్యుల్ని యెవరు పిలవడం?
లుబ్ధా-- మరి నా కెవరున్నారు. మీరే పిలవాలి.
రామ-- లౌక్యుల్ని పిలవడానికి వెళ్లినప్పుడు దుస్తుడాబుగా వుండాలి. దగలా, గిగలా తీయించి యెండవేయిస్తాను.
(నిష్క్రమింతురు.)
2-వ స్థలము. లుబ్ధావధాన్లుయిల్లు.
లుబ్ధా -- అవును. మీరు చెప్పినమాట బాగుంది. దివ్యస్థలాల్లో ఏకరాత్ర వివాహాచారంవుంది.
కరట-- పెద్ద పెద్ద ఉద్యోగస్థులుకూడా, యిప్పటిరోజులలో, వివాహాలు అలాగే చేస్తున్నారు. కోదండరామస్వామివారు స్వయంవ్యక్తవూఁ, హనుమత్ప్రతిష్ఠా అయినప్పుడు, దివ్యస్థలంకాదని యెవడనగలడు?
లుబ్ధా-- ఆమాట సత్యవేఁగాని, యిది దివ్యస్థలంగా ఆలోచించి ఇదివరకు యెవళ్లూ యిక్కడ, ఏకరాత్రవివాహం చేసివుండలేదు మావఁగారూ. మనంచేస్తే యేవఁంటారో?
కరట-- దివ్యస్థలం అయినతరవాత యెవడేవఁంటే మనకేం పోయింది?
లుబ్ధా-- అయితే పంతులుతో చెబుదాం.
కరట-- యేవిఁటి మీసత్యకాలం మావగారూ! యీపెళ్లిలో యేదోవొక వొంటుబెట్టి, నాలుగుడబ్బులు ఆర్జించు కుందావఁని చూస్తూవున్న పంతులూ, పోలిశెట్టీ, ఏకరాత్ర వివాహానికి ఆమోదిస్తారా? పుస్తెకట్టిందాకా ఆమాట వాళ్లతో చెప్పకండి.
లుబ్ధా-- పంతులుతో చెప్పకపోతే యేంజట్టీ పెడతాడో?
కరట-- యేవిఁటి మీభయం! అతగాడు మీకు యజమానా? జట్టీ, గిట్టీ పెడితే, పెణతూడ గొడతాను.
లుబ్ధా-- మీరు కాదుగాని, సిద్ధాంతిగారి చేతిలో రెండు రూపాయలు పడేస్తే, ఆపూచీ అంతా ఆయన నెత్తిమీద వేసుకుంటాడు. ఆయన యదట పంతులు నోరు యెగియదు.
కరట-- పావఁంటిదానికి విరుగుడుంది. పంతులికుండదా?
(నిష్క్రమింతురు.)
3-వ స్థలము. లుబ్ధావధాన్లు యింటిపెరడు.
[కరటకశాస్తుల్లు, మీనాక్షీ ప్రవేశింతురు.]
మీనాక్షి-- మీపిల్లని నాకడుపులో పెట్టుకోనా తాతయ్యా?
కరట-- కడుపుగదా అమ్మా? అంచేత పదేపదే చెబుతున్నాను. దానికి తల్లివైనానువ్వే, తండ్రివైనానువ్వే. (దుఃఖమును అభినయించును.)
మీనాక్షి-- విచారించకండి, తాతయ్యా, దానికి యేలోపం రానియ్యను.
కరట-- అమ్మా, నీకిమ్మని మా అమ్మిచేతికి ఓ పులిమొహురు యిచ్చాను. పుచ్చుకో.
మీనాక్షి-- యిస్తుంది. తొందరేవిఁటి, తాతయ్యా? దాందగ్గిరవుంటేనేం? నాదగ్గిరవుంటేనేం?
(సిద్ధాంతి ప్రవేశించును.)
సిద్ధాంతి-- యెంతసేపూ కూరలుతరగడం, భోజనాల సరంజాం జాగ్రతచెయ్యడం సందడేగాని, లగ్నానికి కావలసిన సరంజాం జాగ్రత చెయ్యడపు తొందరేవీఁ కానరాదు. నాశిష్యుడు ముంగిపోతులాగ పడున్నాడు.
మీనా-- నాలుగ్గడియల పొద్దుకిలగ్గవైతే, యిప్పట్నించీ సరంజాం తొందరేవిఁటి అచ్చన్న మావాఁ?
సిద్ధాంతి-- చదవేస్తేవున్న మతీ పోయిందన్నాట్ట. నాలుగ్గడియల రాత్రుందనగా శుభమూర్తం.
మీనా-- మానాన్న యెప్పుడూ యిదేమచ్చు. యేమాటా నిజం యింట్లో ముండలతో చెప్పకపోతే యెలా యేడుస్తారు? నాన్నా? నాన్నా!
(లుబ్ధావధాన్లు ప్రవేశించును.)
లుబ్ధా-- యెందుకాగావు కేకలు?
మీనా-- నాలుగ్ఘడియల రాత్రుందనగానట మూర్తం. అచ్చన్న మావఁ అంటున్నారు.
లుబ్ధా-- యిదేవిఁటండోయి, నాలుగ్గడియలపొద్దు కనుకున్నానే ముహూర్తం?
సిద్ధాంతి-- ముప్పైమూడు ఘడియలపొద్దు కనుకున్నారుకారో? మీ వెఱ్ఱులు చాలించి చప్పునకానియ్యండి మంగళాస్నానాలు. ఊళ్లో బ్రాహ్మలినందర్నీ పిలిచేశాను.
లుబ్ధా-- చంపారే! చలి!- అయితే, రావఁప్పంతులుకూడా నాలుగ్ఘడియలపొద్దుకి అనుకున్నాడే ముహర్తం? ఆయనే వొచ్చి, పెద్దిపాలెంలో లౌక్యుల్ని నాలుగ్ఘడియలపొద్దుకి రమ్మని పిలుస్తారేమో?
సిద్ధాంతి-- శతాంధాః కూపం ప్రవిశంతి. అమ్మీ, పిల్లకి స్నానం చేయించూ.
మీనా-- యిదుగో, నిమిషంలో చేయిస్తాను.
సిద్ధాంతి-- ఆడవాళ్లునయం. పెళ్లిపందిట్లో సరంజాం చూసుకుంటాను.
లుబ్ధా-- పంతులులేకుండా లగ్నం అయితే-
సిద్ధాంతి-- పంతులుకా, మీకాపెళ్లి? జంకవోడక స్నానంకానీండి.
(నిష్క్రమింతురు.)
4-వ స్థలము. లుబ్ధావధాన్లు యింటి అరుగుమీద పసుపుబట్టలు కట్టుకుని, లుబ్ధావధాన్లు స్త్రీవేషముతో శిష్యుడు, కొందరు బ్రాహ్మలు కూర్చుని వుందురు.
(రామప్పంతులు, తాషామర్ఫా, కావిళ్లూ, చాకర్లతో, ప్రవేశించి అరుగుమీద చతికిలబడి)
రామ-- అబ్బ! ఎంతశ్రమ పడ్డానండి (నౌఖర్లతో) తాషామర్పా వూరుకోమను. బోయీలొహళ్లూ, బాజావాళ్లొహళ్లూ, వూరుచేరేటప్పటికి కోలాహలంలావుచేస్తారు. కాళ్లుపీక్కు వచ్చాయయ్యా, వెథవ పెద్దిపాలెం యంతదూరవుఁందీ! (తిరిగిచూసి) యిదేవిఁటీ పసుబ్బట్టలూ, పెళ్లికూతురుతో కలిసికూచోడవూఁను? పెళ్లికొడుకుం చేయించుకున్నావటయ్యా? ముదిమికి ముచ్చట్లులావు.
లుబ్ధా-- లగ్నానికి మీరు లేకపోయినారుగదా! అని మహా విచారపడుతున్నాను.
రామ-- (ఉలికిపడి) యేవిఁటీ! లగ్గవేఁవిఁటి?
పూజారిగవరయ్య-- లగ్నంవేళకి తమరు లేకపోయినారుగదా అని, మేం యావన్మందివీఁ విచారించాం. తమరు యేదో వ్యవహారాటంకంచేత వేళకి రాజాలినారుకారనుకున్నాం. తాము లేకపోవడంచేత సభ సొగుసే పోయింది. "నియ్యోగిలేనిసావిడి । అయ్యయ్యో వట్టిరోత, అది యెట్లన్నన్! వయ్యారి"-
రామ-- అట్టేపేలకు. ముహర్తానికి ముందే పుస్తె యెలా ముడెట్టా`వయ్యా?
పూజా-- సిద్ధాంతిగారు నక్షత్రాలు చూసి ఘడియలుగట్టి సరిగ్గా ముహూర్తం వేళకే పుస్తె కట్టించారండి.
రామ-- నాలుగ్ఘడియల పొద్దుకాలేదే?
పూజారి-- నాలుగుఘడియల రాత్రుందనగా కదండీ, శుభముహూర్తం?
రామ-- సిద్ధాంతి, ముహర్తం తెల్లవారి నాలుగుఘడియలకని చెప్పా`డే?
పూజారి-- పంచాంగం మార్చడానికి యవడిశక్యం బాబూ? తెల్లవారగట్ల నాలుగు ఘడియలకని, సిద్ధాంతిగారు మనవిజేసివుంటారు. తాము పరాగ్గా వినివుందురు.
రామ-- పంచాంగానికేం యీ వెధవ పల్లిటూర్లో? సిద్ధాంతి ఆడింది ఆటా, పాడింది పాటా. యంతద్రోహం చేశాడయ్యా సిద్ధాంతి!
పూజారి-- సిద్ధాంతి యంతో నొచ్చుకున్నాడు, తమరు రాలేదని బాబూ. యేమి ఆటంకంచాత వుండిపోయినారో? అని అవుధాన్లుగారు తల్లడిల్లారు. తాషామర్ఫా విన్నతరవాతగదా, ఆయనమనస్సు స్వస్థపడ్డది.
లుబ్ధా-- నిజం మావఁగారు.
పూజారి-- యిక మధురవాణో? అంటే, ఆపందిట్లో నిశ్చేష్టురాలై పుత్తడిబొమ్మలాగ నిలుచుందిగాని బ్రాహ్మణ్యం యావన్మందీ గెడ్డం పట్టుకు యెంత బతిమాలుకున్నా, పాడిందిగాదు.
కొండిభొట్లు-- అంతసేపూ హెడ్డు కనిష్టీబుగారితో మాట్లాడుతూ నిల్చుందిగాని, యేం? యింతమందిం ప్రార్ధించినప్పుడు, ఓ కూనురాగం తియ్యకూడదో?
మరివకబ్రాహ్మడు-- ఓరి కుంకాయా, పంతులుగారు సభలో లేందీ యలా పాడుతుందిరా?
పూజా-- హెడ్డుగారితో యేవిఁటి మాట్లాడుతూందనుకున్నావు? పంతులుగారు సరుకూజప్పరా, పెట్టుకు వెళ్లారు. యేంప్రమాదం వొచ్చిందో! ముహర్తం వేళకి రాలేదు. జవాన్లనిపంపి వెతికించండి అని బతిమాలుకుంటూందిరా.
కొండిభొట్లు-- యీ గవరయ్యగారు గోతాలు కోస్తాడ్రా. హెడ్డూ, అదీ, ఒహరిమీదొహరు విరగబడి నవ్వూతూంటే, పంతులుకోసం బెంగెట్టుకుందని కవిత్వం పన్నుతాడు.
రామ-- వైదికం! వైదికం! మీయేడుపులు మీరు యేడవక, లోకంలో భోగట్టా అంతా మీకెందుకు?
పూజారి-- వూరుకోరా కొండిభొట్లు. పెద్దాపిన్నా అక్కర్లేదూ?
రామ-- నీపెద్దతనం యెక్కడ యేడిసింది? నివ్వే ముందు రేపెట్టావు.
పూజారి-- వై, స, బు, పె, అని యందుకన్నాడు బాబూ?
రామ-- అతడేడీ, అతడు? అతడిపేరేవిఁటీ?
పూజారి-- యెవరండి?
రామ-- ఆగుంటూరి శాస్తూల్లేడయ్యా?
పూజారి-- యేగుంటూరి శాస్తుల్లండి?
లుబ్ధా-- ఆయనా, - మరేవొచ్చి, ఆయనా-వూరి కెళ్లారు.
రామ-- యేవిఁటీ తెలివితక్కువమాట! కూతురికి పెళ్లౌతూంటే, వూరికెళావెళ్లాడు?
లుబ్ధా-- పెళ్లయిపోయిందిగదా?
రామ-- తెలివిహీనం! లగ్నవఁంటే నేను లేకుండా వెలిగించావుగానీ, పెళ్లి ఐదురోజులు తగలడుతుందిగదూ?-
పూజారి-- ఏకరాత్ర వివాహం కదండీ? అంచేత ప్రధానహోమం, శేషహోమంతో సమాప్తి అయిపోయింది.
రామ-- (నిశ్చేష్టుడై లుబ్ధావధాన్లుతో) ఓరి, సామిద్రోహప వెధవా!
పూజారి-- (నోరుమూసి) బాబ్బాబూ, శాంతించండి! శాంతించండి! (లుబ్ధావధాన్లుతో) పంతులుగారి కాళ్లమీద పడవయ్యా. (పంతులుతో) తమరు చేయించిన శుభం. అశుభంమాటలు శలవియ్యకండి. సిద్ధాంతిగారూ, వారి మావఁగారూ, శాస్త్రచర్చచేసి, లగ్నం పదినిమిషాలుందనగా, ఏకరాత్ర వివాహం స్థిరపర్చారు.
రామ-- యేంకుట్ర! వాడికి రూపాయలివ్వలేదుగద?
లుబ్ధా-- యెల్లుండి యేవా`ళకైనా రూపాయలు చెల్లించకపోతే దావా పడుతుందని, తొందరపడి పట్టుకు వెళ్లిపోయినారు. మళ్లీ వారంనాటికి వొస్తానఁన్నారు.
రామ-- నన్ను మధ్యవర్తినిచేసి, నేను లేనిదీ, యీ వ్యవహారం యలా పైసలుచేశావు? నేను యంత యడ్వాన్సు వాడికియిచ్చానో నీకు తెలుసునూ? అప్పుడే మావఁగారితో కలిసిపోయి నాకు టోపీ అల్లావూ?
లుబ్ధా-- మీరుచేసిన నిర్నయప్రకారవేఁ, రూపాయలు చేతులో పడితేనేగాని, పుస్తెకట్ట నివ్వనన్నాడు. యేంజెయ్యను?
రామ-- పుస్తెకట్టకపోతే నీపుట్టె ములిగిందిగాబోలు! నేవొచ్చేలోగా యేం వుప్పెనవొచ్చింది? వీడేదో పెద్దదగాచేసి, నేనొస్తే, పట్టుగుంటానని రూపాయలు చేతులో పడేసుకుని వుడాయించాడు. వాడిపేరేవిఁటీ?
పూజారి-- ఆయన పేరు-మరేవచ్చి-అవుధాన్లుగారు శలవిస్తారు.
లుబ్ధా-- నాకు తెలియదు.
రామ-- అయ్యో అభాజనుడా! యిహ, వాడు, పంచాళీమనిషి అనడానికి సందేహవేఁవిఁటి?
లుబ్ధా-- అతగాణ్ణి మీరే తీసుకొచ్చి దొడ్డవాడని చెప్పారు? అంచేతనే అతణ్ణి నేను నమ్మాను.
రామ-- నువ్వు నమ్మితే యెవడికి కావాలి? నమ్మకపోతే యెవడికి కావాలి? అతనికి నేను పెళ్లిఖర్చులకోసం బదులిచ్చిన నూరురూపాయిలూ, అక్కడపెట్టు.
లుబ్ధా-- యెవరికిచ్చారో అతణ్ణే అడగండి. నాతో చెప్పకండి.
రామ-- సరే, నీతో చెప్పను- నీతో యిక మాటే ఆణ్ణు- మరి నీయింట్లో వక్క నిమిషం వుండను. (లేచినిలుచుని) అంతావినండయ్యా! యీ గుంటూరుశాస్తుల్లు పచ్చిదొంగ, లేకుంటే ఈ తెలివిహీనుడు యిచ్చిన రూపాయిలు సంధించుకుని, పేరైనా చెప్పకుండా పరారీ అవుతాడా? నాతాలూకు సొమ్ముకూడా పట్టుకు చపాయించాడు. వీడివైఖరీ చూడగా, రెండోపెళ్లి పిల్లనో, సూద్రప్పిల్లనో, యీ తెలివిహీనుడికి అమ్మి. యెగేసినట్టు కనపడుతుంది. గనక, ఒరే! బారికీ, ఒరే! మంగలీ, హెడ్డుగారి దగ్గిరికెళ్లి, యిద్దరు జవాన్లను తీసుకురా. వాడి వెంట దౌడా యింపిస్తాను.
(పైమాటలు అంటూ వుండగా, సిద్ధాంతి ప్రవేశించి, రామప్పంతులు మాటలు ముగించి వెళ్లిపోబోతూవుండగా రెక్కబట్టి నిలబెట్టును.)
సిద్ధాంతి-- యెక్కడికి వెళతారు? కొంచం నిలబడండి.
రామ-- యేమిటి నీ నిర్బంధం?
సిద్ధాంతి-- గుంటూరి శాస్తుల్లుగారి పేరేవిఁటో మీక్కావాలా!
రామ-- యేమిటా పేరు?
సిద్ధాంతి -- పేరి రామశాస్తుల్లుగారు. ఆయనపేరుతో మీకేం పనుంది?
రామ -- వాడు నాకుబాకీ.
సిద్ధాం-- మీకు ఒక దమ్మిడీ బాకీలేదు. ఆ నిజం నాకుతెలుసును.
రామ-- చెయ్యి నొక్కేస్తున్నావేవిఁటి!
సిద్ధాం-- వైదీకపాళ్ల చెయ్యి మృదువుగా యలా వుంటుంది? అవధాన్లుగారు యిచ్చిన సొమ్ము తాలూకు నిలవ యెంతుందో చెప్పండి.
రామ-- నువ్వెవరివి అడగడానికి? అన్న! చెయ్యినొక్కుతున్నావు! తంతావా యేవిఁటి?
సిద్ధాం-- శుభమల్లె, పెళ్లికూతుర్ని ముండా ముతకా, అంటే యెవరయినా వూరుకుంటారా?
రామ-- ముండకాదు, పునిస్త్రీయే, అంటాను; చెయ్యివొదిలెయ్యి.
(లుబ్ధావధాన్లు శిష్యుడికి కొంతయడంగా జరుగును.)
సిద్ధాం-- కోపంవొచ్చినప్పుడు, లౌక్యం మరిచిపోకూడదు. మీరు ప్రభువులూ; మేం ఆశ్రితులం. తమకిలాభించేమాట చెబుతాను, యిలా దయచెయ్యండి.
రామ-- మర్యాదగా మాట్లాడితే, నా అంతమంచివాడు లేడు.
సిద్ధాం-- అవధాన్లుగారూ మీరు కూడా యిలారండీ.
(అవధాన్లు, సిద్ధాంతి, రామప్పంతులూ రహస్యముగా మాట్లాడుదురు.)
రామ-- (ఉత్సాహముతో) సిద్ధాంతీ యేదీ పొడిపిసరు. నియ్యోగపాడన్నవాడు, సవబుకి కట్టుబడతాడు. యవరయా వంటబ్రాహ్మలు! మాయింటికి ఫలహారాలు వెళ్లాయా? యేవోఁయి, కొండి భొట్లూ! మాట, యిలారా!
(కొండి భొట్లు వచ్చును.)
కొండి-- యేం శలవు?
రామ-- మాయింటిదాకా నాతోరా.
కొండి-- చిత్తం.
రామ-- మాతోట్లో, మంచి పనసకాయలున్నాయి. రెండుకాయలకి బరాతవిఁస్తాను. తెచ్చుకో మీ అయ్యకి పనసకాయ కూరంటే, మాయిష్టం.
కొండి-- చిత్తం!
రామ-- పెళ్లిలో యేవిఁటోయి గమ్మత్తు.
కొండి-- యేవీఁ గమ్మత్తు లేదండి.
రామ-- మధురవాణి పాడిందికాదేం?
కొండి-- పాడింది -
రామ-- ఆఁ!
కొండి-- కాదండి.
రామ-- అలాచెప్పు. అంతసేపూ హెడ్డు కనిష్టీబుతో మాట్లాడుతూంది కాబోలు?
కొండి-- లేదండి. ఒక్కమాటాళ్లేదు.
రామ-- మరెందుకన్నావూ, మాట్లాడిందని యిందాకానూ? విరగబడి నవ్విందన్నావే?
కొండి-- మరీ- మరీ- మరే వొచ్చి- లింగన్నగారి కాంభొట్లు అలా అనమన్నాడు.
రామ-- వాడిపని పట్టిస్తాను. నాతో వెకాస్యాలా! నువ్వుమాత్రం వాడిజట్టు కూడకు. చిన్నప్పట్నుంచీ నిన్ను యెరుగుదును. నువ్వు నిజాయితీ మనిషివి.
కొండి-- అవుఁనండి. యెప్పుడూ నేను నిజవేఁ చెబుతాను.
రామ-- అవునుగాని, హెడ్డు కనిష్టీబుమాటమట్టుకు నిజం చెప్పావుకావు. పట్టాభిరామస్వావిఁమీద ప్రమాణంచేసి, చెప్పూ! మధురవాణి యవరెవరితో మాట్లాడింది?
కొండి-- మరేవచ్చి- నిజం చెప్పమన్నారూ?
రామ-- నిజాయితీ మనిషివనేగదా నిన్ను అడుగుతున్నానూ?
కొండి-- అయితే, - అందరితోటీ మాట్లాడింది.
రామ-- అందరితోటీ అంటే యవరెవరితోటి?
కొండి-- యవరెవరా అండి? పెళ్లి వొదిలేసి, అంతా మధురవాణి చుట్టూమూగాం. భుక్తగారితో మాట్లాడింది. మరేవచ్చి.
రామ-- యింకా యవరితో మాట్లాడింది?
కొండి-- సిద్ధాంతి మంత్రం చప్పడం మానేసి మధురవాణి చెవులో యేకాంతం మాట్లాడాడు.
రామ-- మరింకా యవరితోటి?
కొండి-- మరేవచ్చి- హెడ్డు కనిష్టీబుతోటి.
రామ-- ఓరి ఛండాలుడా! హెడ్డుతో మాట్లాడ లేదన్నావే?
కొండి-- అవును మాట్లాళ్లేదు.
రామ-- పుండాఖోర్! మాట్లాడిందా మాట్లాళ్లేదా?
కొండి-- సచ్చాన్రా దేవుఁడా!
రామ-- అసత్యం అంటే, నాకు వెఱ్ఱికోపం. ప్రమాణ పూర్తిగా, నిజంచెప్పు. అబద్ధవాఁడితే, తల పేలిపోతుంది. మాట్లాడిందాలేదా?
కొండి-- లేదు.
రామ-- ప్రమాణ పూర్తిగా?
కొండి-- ప్రమాణ పూర్తిగానే.
రామ-- యిప్పుడు నిజంచెప్పావు. విన్నావా? నీకు చిన్నతనం; ఆడవాళ్లమీద, ఒహరు అనమన్నా, అన్యాయంమాటలు ఆడకూడదు. తెలిసిందా?
కొండి-- మధురవాణి మా దొడ్డమనిషి.
రామ-- వూళ్లో అలా అనుకుంటారేం?
కొండి-- అంతా అనుకుంటారు.
(రామప్పంతులు యింటియెదట.)
రామ-- నేను తలుపుకొడతాను, నివ్వో చిన్నగమ్మత్తుచెయ్యి.
కొండి-- చిత్తం.
రామ-- యీ విచ్చబేడమొలనిపెట్టుకో. మా పెరటిగోడ అవతల, ఒక అరఘడియ నిలబడు. దిడ్డీ తోవంట కనిష్టేబుగాని, మరెవరుగాని, పైకి వొచ్చినట్టాయెనా, రెక్కపట్టుకుని, కేకెయ్యి. నేవొస్తాను. లేకుంటే వుడాయించెయి. (కొండిభొట్లు నిష్క్రమించును.) తలుపు తలుపు. (తనలో) ఒకంతట తలుపుతియ్యదు. అనుమానా నిక్కారణం. వీడు నిజంచెప్పాడా? అబద్ధం చెప్పాడా? నేను పాలెంనించి వొచ్చి కబురు పంపించిన తరవాత రాక, యిది తుఱ్ఱుమని యలాపరిగెత్తి వెళ్లిందీ పెళ్లిలోకి? తలుపు తలుపు! యప్పటికీరాదేం! (మధురవాణి తలుపుతీయును) యేం జేస్తున్నావు యింతసేపు?
మధు: ఉదయంనుంచి రాత్రివరకూ చేసేపనులన్నీ, రేపటినుంచి వ్రాసివుంచుతాను రండి.
(ఉభయులూ నిష్క్రమింతురు.)
(కొండి భొట్లు ప్రవేశించి.)
కొండి: పంతులుగారూ, పంతులుగారూ.
(రామప్పంతులు, మధురవాణీ ప్రవేశింతురు.)
రామ: (మధురవాణితో) నువ్వు లోపలకివెళ్లు. (కొండిభొట్లుతో) యేవిఁటి?
కొండి: మరేవచ్చి,- పట్టుకోలేదు.
రామ: (తీక్షణంగా) యెందుకు పట్టుకున్నావుకావు?
కొండి: చెప్పరానిదాన్ని యలా పట్టుకోవడం?
మధు: చెప్పరానిదాన్ని యెందుకు పట్టుకోవడం?
కొండి: దిడ్డీతోవంట యవరొచ్చినా పట్టుకొని, కాకెయమని పంతులు చెప్పారు.
మధు: యేవిఁచిత్రం! యేం అప్రతిష్టా! బ్రాహ్మడికి వెఱ్ఱెత్తుతూంది కాబోలు!
రామ: (మధురవాణి వెనకనిలచి చేతితో వెళ్లిపొమ్మని కొండిభొట్లుకు సౌజ్ఞ చేసి) పేలుడుగాయ వైదీకప గుంటడి వెకాశ్యాలు నిజం అనుకుంటావేవిఁటి?
(లోపలికి వెళ్లును.)
(రామప్పంతులు యింటిలోనికి వెళ్లగానే మధురవాణి సావిడివెనక తలుపు పైనుంచివేసి, కొండిభొట్లును లోపలికిరమ్మని సౌజ్ఞచేసి, ముద్దెట్టుకొనును.)
మధు: (నిమ్మళంగా) బాగా, కాపాడావు!
కొండి: మధురవాణీ, యిదిగో పంతులిచ్చిన బేడ. యిదిగో హెడ్డుగారిచ్చినపావలా. యింద వెండితొడిపొడికాయ. (యిచ్చును.)
మధు: (పుచ్చుకొని) నువ్వు మంచివాడివి. యీవేళనుంచి, నీకూనాకూ నేస్తం. తెలిసిందా? (మరివకసారి ముద్దుపెట్టుకొని) యికవెళ్లు.
(కొండిభొట్లు చెంగున వీధిలోకి యెగిరి వీధినడుమ గెంతులువేయును)
[కాంభొట్లు ప్రవేశించి.]
కాంభొ: యెందుకురా యీగెంతులు?
కొండి ముద్దెట్టుకుందిరా!
కాంభొ: వెఱ్ఱి వెఱ్ఱి వేషాలు వెయ్‌కు. యీ కోతి మొహాన్నే?
కొండి: పోస్సి, వెఱ్ఱికుట్టా! మేం జట్టుకట్టాం!
(నిష్క్రమింతురు.)
5-వ స్థలము. కృష్ణారాయపురం అగ్రహారంలో.
(అగ్నిహోత్రావధాన్లు యింటిపెరటిలో గిరీశం పనివాళ్లచేత పందిరి వేయించుచుండును.)
[వెంకటేశం ప్రవేశించును.]
గిరీశం: యేమివాయ్ బావా, యెడందవడ యెఱ్ఱబారింది?
వెంకటేశం: నాన్న గూబగదలేశాడు.
గిరీ: యేంజేశావు?
వెంక: సంధవార్చలేదని.
గిరీ: ఆమాత్రం వార్చినట్లు వేషం వెయ్యలేకపోతివో?
వెంక: చూడ్డనుకున్నాను.
గిరీ: అను కోడాలుపనికి రావోయి, బావా! మనం యేదైనా వేషం వేశావంటే, ఒకడు చూస్తున్నాడని అనుకున్నప్పుడూ, ఒకడు చూస్తూవుండలేదనుకున్నప్పుడూ కూడా, వొక్కమోస్తరుగా వేషం నడిపిస్తే సేఫ్ సైడ్. చూస్తున్నావుకావా, రోజూ నేను యెంతసేపు బక ధ్యానంచేస్తానో?
వెంక : యేవఁని ధ్యానం చాస్తారు?
గిరీ: యేం ధ్యానవాఁ? యీ చాదస్త బ్రాహ్మడు యంతట్లో దేవతార్చన చాస్తాడు, యంతట్లో విస్తట్లో మెతుకులు పడతాయి అని తదేకధ్యానం చేస్తాను.
వెంక: మంత్రాలు చదివి దేవుఁణ్ణి ధ్యానం చెయ్యాలిగాని, అన్నంకోసం ధ్యానంచేస్తే పాపంకాదా?
గిరీ: ఇగ్నొరెన్స్! మతసంబంధమైన సంగతులు నీకేమీ తెలియవు. యీ పెళ్లి అయిపోయిన తరవాత నిన్ను మతంలో తరిఫీదు చెయ్యాలి. అన్నిమతాలూ పరిశీలించి వాటితాలూకు యసెన్స్, నిగ్గుతీసి ఓ కొత్తమతం యేర్పర్చాను. అది అమెరికా వెళ్లి ప్రజ్వలింపచేస్తాను. యిప్పడుమట్టుకు నీ సంశయం తీరుస్తాను. యేమన్నావ్? అన్నాన్నా ధ్యానించడం, అని కదూ? యేవఁందోయి నీ ఉపనిషత్తు? "అన్నం బ్రహ్మేతి వ్యజానాత్" అన్నవేఁ, బ్రహ్మ. అని తెలుసుకోవోయి, వెధవాయా, అంది. తెల్లవాడు యేవఁని ధ్యానం చేస్తాడోయి రోజూనూ? "ఫాదర్, గివ్, అస్ అవర్, డెయిలీ బ్రెడ్" అనగా "నన్ను కన్నతండ్రీ, రోజూ ఒక రొట్టెముక్క ఇయ్యవోయి అని"- ఇక, మనవేఁవఁనాలి? "తండ్రీ రోజూ, కందిపప్పు, ధప్పళం ఇయ్యవయ్యా" అని ధ్యానించాలి. మన చమకంలో యేమన్నాడూ? "శ్యామాకాశ్చమే" "చామల అన్నం మామజాగా వుంటుంది, నాక్కావాలి, ఓ దేవుఁడా! అన్నాడు" ఆ చమకంలో యవడికి యిష్టవైఁన వస్తువులు వాడు కలపవచ్చును- "కందిగుండా చమే, యింగువ నా నాచమే" దీనినే రిలిజియస్ రిఫార్ము అంటారు.
వెంక: గేదెపెరుగూ చమే, చేగోడీ చమే.
గిరీ: చబాష్! అదే ఒరిజినాలిటీ - అడిగితేగాని అమ్మ అయినా పెట్టదు. దేవుఁడు మాత్రం ముద్దిస్తాడనుకున్నావా యేమిటి? నీకు యెప్పుడు యేమి కావలిస్తే అప్పుడు ఆవస్తువులు సంపుటీచేసి చమకపారాయణ ఆరంభించేది.
వెంక: అయితే రేపణ్ణించి నేను రోజూ చమకపారాయణ చేస్తాను.
గిరీ: మనస్సులో చెయ్యి. పైకి పారాయణ చేశావంటే, నీతండ్రి ఎడ్యుకేషన్ లేకపోవడంచేతా, రీజన్ తెలియకా, యిదేవిఁటి చమకం పాడు చేస్తున్నాడని పెణతెక్కగొట్టి, తొమ్మిదో అష్టం ఘనం పారాయణచేస్తాడు.
వెంక: మొన్న బుగతగారి యింట్లోంచి మీరు పొగాక్కట్ట యెత్తుకొచ్చారుగదా, పాపం చేశారని దేవుఁడు కోప్పడ్డా?
గిరీ: చిన్నతనంలో మాపింతండ్రి (నీ తండ్రిలాగే అగ్గిరావుఁడోయి) చెవినులిపి నాచేత ఉపనిషత్తులు చదివించాడు. దాం తస్సా గొయ్యా, పేరు మరిచిపోయినానుగాని, ఒక వుపనిషత్తులోను, శిష్యుడుప్రశ్న అడుగుతూవుంటే, గురువు సమాధానం చెబుతూంటాడు. ఆ వుపనిషత్తులో చెప్పిన శిష్యుళ్లాంటి శిష్యుడివి నువ్వు; ఆలాంటి గురువుని నేను. మన ప్రశ్నోత్తరాలు యవడైనా తాటాకుమీదరాసి పారేశాడంటే, ఒక రెండువొందలేళ్లు అయినతరవాత 'టొబాకోపనిషత్తు' అవుతుంది. పొగాకు కట్టకి పాప వేఁవిటోయి, కాల్చి పారేసేదానికి? అందులో పొడుంచేసే బుద్ధిహీనులదగ్గిర పొగాకు యెత్తుకురావడం లోకోపకారవఁని నమ్ము.
వెంక: యలాగండి లోకోపకారం?
గిరీ : యలాగా. యిదిగో, యిలా చుట్టకాలిస్తే, స్టీము యింజన్‌లాగ, భగ్, భగ్‌మని పొగ ఆకాశానికి పరిగెత్తి మేఘవైఁ వర్షం కురిపిస్తుంది. పొడుంగాని పీలుస్తే ఆఘాటుకి, ఆకాశం ఆర్చుకుపోతుంది. ముక్కంటమాత్రం చిరివర్షం కురిసి యిల్లూ వొళ్లూకూడా డర్టీ అవుతుంది. గనక పొడుంచేసే మూర్ఖుల యింట్లోవుండే పొగాకంతా దొంగిలించి చుట్టలుగట్టి, తగలెట్టవలిసినదే. ఒకవేళ, గిరీశంగారూ, తమరు దొంగతనంచేశారు, కొద్దిరోజులు నరకానికి విజయం చెయ్యండి, అని దేవుఁడుగానీ, అన్నట్టాయనా ఒక చిన్నలెక్చరుకొట్టి గభరాయింపజేస్తాను.
వెంక: యేవఁని లెక్చరు కొడతారు? గిరీశం-- యేవఁనా? ఓ దేవుఁడా! నామనస్సు యిండిపెండెంటుగా సృజించావా? లేక డిపెండెంటుగా సృజించావా? యిండిపెండెంటుగా అయితే, నా యిష్టవొఁచ్చినపనల్లా నేను చేశాను. నువ్వెవరు, అడగడానికి? యిలాంటి చిక్కులు పెట్టా`వంటే హేవెన్‌లో చిన్న నేషనల్ కాంగ్రెస్ వొకటి లేవదీస్తాను. లేక నన్ను డిపెండెంటుగా చేశావూ? అష్లాగయితే నువ్వే నాచేత పాపంచేయించావు గనక నీకే ఆశిక్ష కావలిసింది. దేర్‌పోర్ చలో, నరకానికి, చలో! అక్కణ్ణించి నువ్వు తిరిగీ వొచ్చేలోగా, ఆరుఘడియలు స్వర్గంలో నీ అధికారం, నాకిస్తివట్టాయనా, కొన్ని సృష్టిలో లోపాలు సవరణ చేస్తానంటాను.
వెంక: యేవిఁటండి లోపాలు?
గిరీ: లోపాలన్న లోపాలా! నీచేతే వొప్పిస్తాను. నెంబర్‌వన్ - నీ మేష్టరులాంటి అభాజనుణ్ణి పుట్టించడం లోపం అంటావా అనవా?
వెంక: లోపవేఁ.
గిరీ: నీసిస్టర్‌లాంటి బ్యూటిఫుల్ యంగ్ గర్లుని, విడోని చెయ్యడం తప్పంటావా, ఒప్పంటావా?
వెంక: తప్పే.
గిరీ: యిలాంటి లోపాలు కోటానకోట్లు. ఇక రద్దుసృష్టి యంతుందనుకున్నావు? ఫరిన్‌స్టెన్స్, యెన్ని సముద్రాలు వున్నాయి?
వెంక: యేడు.
గిరీ:-- యేడూ, యేడిసినట్టేవున్నాయి. పాలసముద్రం వుంటూవుండగా మళ్లీ పెరుగుసముద్రం, నేతిసముద్రం యెందుకోయి? యిది ప్లియోనిజమ్, పునరుక్తి- మరో తెలివితక్కువ చూశావా? యెందుకూ పనికిమాలిన ఉప్పుసముద్రం మననెత్తినికొట్టి, పెరుగు, పాలు, నెయ్యి, చెరుకుపానకం యీ సముద్రాలన్నీ యవడికీ అందుకు రాకుండా దూరంగా విసిరేశాడోయి. ఒక సంవత్సరంగాని నాకు దేవుఁడు దివాన్గిరీ యిస్తే, భీమునిపట్ణానికి పాలసముద్రం, విశాఖపట్ణానికి మంచినీళ్ల సముద్రం, కళింగపట్ణానికి చెరుకుసముద్రం తెస్తాను. యీ యీస్టర్ను ఘాట్సు అంతా పొగాకు అరణ్యం చేస్తాను. యీ లెక్చరు నేను కొట్టే సరికి, దేవుఁడు యేవఁంటాడో తెలిసిందా? వీడు అసాధ్యుళ్లావున్నాడు. వెనకటికి "పాతయముడివా కొత్తయముడివా" అని అడిగిన పెద్దమనిషికంటే ఒక ఆకు యెక్కువ చదువుకున్నట్టు కనపడతాడు. గనక వీడికో జోడు గుఱ్ఱాలబండీ యిచ్చి, స్వర్గంలో వున్న యావత్తు మహలులు, బగీచాలూ చూపించి, యేం కావాలంటే అది యివ్వండని దేవదూతలతో చెబుతాడు. నా శిష్యుడు, వెంకటేశాన్నికూడా తీసుకొస్తేగాని, నాకేం తోచదని నే చెబుతాను. అప్పుడు నిన్ను విమానమ్మీద తీసుకొస్తారు. మన విఁద్దరం స్వర్గంలో మజా వుడాయిద్దాం. యీవేళకి మతంమీద యింతవరకు లెక్చరు చాలును. యిక వెళ్లి దేవాలయం తోటలో కోతిపిల్లిని కఱ్ఱ ఆడుకో. సాయంత్రానికి నీతండ్రి వొచ్చేసరికి మాత్రం, దీపంయదట కూచుని పుస్తకం తిరగేస్తూ పులుస పటుకులు ధానంచెయ్యి. యింగువవేసి బలేసొగుసుగా తయారుచేస్తారు (వెంకటేశం వెళ్లును.) రనెవే.
(బుచ్చమ్మ ప్రవేశించి.)
బుచ్చమ్మ: యీ రుబ్బురోలునిండా తాటాకుముక్కలు పడుతున్నాయి, యివతలకి లాగేసిపెడతారూ.
గిరీ : అదెంతపని.
(గిరీశం రుబ్బురోలు, పందిరి అవతలకులాగును. బుచ్చమ్మ రుబ్బురోలు కడిగి మినపపప్పు రుబ్బును.)
గిరీ: (పాడును) "భజగోవిందం. భజగోవిందం. గోవిందం భజ మూఢమతే" యేం, వదినా, కంటనీరు పెడుతున్నారూ?
బుచ్చ: యేవీఁలేదు.
గిరీ: మీరు కంటనీరు పెడితే నామనసు కరిగిపోతూంది.
బుచ్చ: మీకేం - మహరాజులు - మాకష్టాలు మమ్మల్నే బాధిస్తాయి.
గిరీ: యేమి కనికరం లేనిమాట అన్నారూ! మీరు అలా దుఃఖంలో ములిగివుంటే, యెందుకు నాకీ వెధవ బతుకు? మీకోసం యేం చెయ్యమంటే అది చాస్తానే? ప్రాణవిఁచ్చెయ్యమంటే యిచ్చేస్తానే? దాఖలా చూడండి యిదుగో కత్తిపీట!
బుచ్చ: (కత్తిపీట దగ్గిరతీసుకుని) చెల్లికి యీ సమ్మంధం తప్పించారు కారుగదా?
గిరీ : అదొక్కటిమట్టుకు నాకు సాధ్యవైఁందికాదు.
బుచ్చ: అయితే మీతో నాకేం పనీ? యింత సందడిగా పెళ్లిపనులు చేయిస్తున్నారు. మానాన్నకి తోచకపోతే, మీకైనా తోచకూడదా, యీ సమ్మంధం కూడదని? మీకుకూడా దానిమీద యింత కనికరం లేకపోవాలా? లుబ్ధావుఁధాన్లు మీకు అన్నగారని కాబోలు మీకు సంతోషం.
గిరీ: నాకాసంతోషం? యంత క్రూరమైనమాట అన్నారు! యీ సంబంధం ఔతుందని, నా మనస్సులో యంత ఖేదిస్తున్నానో, ఆ భగవంతుడికి తెలుసును. యీ సంబంధం తప్పించాలని చెడచివాట్లుపెడుతూ మా అన్న పేర రెండు టావులు వుత్తరం రాశాను. చెవినిపెట్టాడుకాడు. నేను యేంచేతును? వాడిని స్మరిస్తేనే పాపంవొస్తుంది. ఊరికే కూచుంటే, మీతండ్రి యేవఁనుకుంటాడో అని, మీయింట అరవ చాకిరీ చేస్తూ నీకు యేనాటికైనా కనికరం వొస్తుందేమో అని ఒక్కమనిషిని నూరుమంది చేసేపని చేస్తున్నాను. అంతేగాని, యీ నమ్మిన నౌఖరుమీద నీమనసు భారంగావుంటే, యవరికీ చెప్పకుండా యీరాత్రి లేచి మాదేశానికి వెళ్లిపోతాను.
బుచ్చ : వెళ్లిపోకండి.
గిరీ: నేనుమాత్రం పోయే సాధనం యలాగ? యెన్నోమాట్లు యేవఁనుకుంటాను? యీ పెళ్లి తప్పించ లేకపోయినానుగదా? నాప్రాణంకంటే యిష్టవైఁన యీ బంగారపు బొమ్మలాంటి బుచ్చమ్మని పునిస్త్రీని చెయ్య లేకపోయినానుగదా? అని విరక్తిపుట్టి, పోదాం అని నిశ్చయించే సరికి - కాలు ముందుకువేసినా, మనస్సు వెనక్కిలాగి యేమితోచేదీ? "పైకి పోతానని సందడి పడుతున్నాను. నాబుచ్చమ్మ కనపడకపోతే, పోయి బతకడం యలాగ? దానికి యంత కనికరం లేకపోయినా, యిక్కడేవుండి, చూసైనా సంతోషిద్దాం" అని వుండి పోతూ వొచ్చాను.
బుచ్చ : మీరు చెబితే, లుబ్ధావుఁధాన్లుగారు పెళ్లి మానుకుంటాడని తమ్ముడుచెప్పాడు?
గిరీ : నే చెప్పినమాట, యీ భూప్రపంచంలో యవడూ కొట్టివెయ్యలేడు. అందుచేత, వెంకటేశం అలా అని వుంటాడుగాని, మీతండ్రి ఒకడు, మా అన్న వకడు లోకాతీతులు. వాళ్లు బ్రహ్మచెబితే వినరు. ఈయనకి వెఱ్ఱికోపం. అతగాడు శుద్ధపీసిరిగొట్టు. మాఅన్న సుఖపడ్డానికా యీపెళ్లి తలపెట్టాడు? నీమొగుడు నిన్నుపెళ్లాడి యంతసుఖపెట్టాడో, మాఅన్న నీచెల్లెల్ని పెళ్లాడి, అంతే సుఖపెడతాడు. ఆఫ్రికాదేశంలో స్లేవరీ అనివుంది. అనగా మనుషుల్ని వట్టి పశువుల్లాగ బజార్లలో అమ్ముతారు. యవరు కొనుక్కుంటే వాళ్లయింట్లో అయామనిషి బతికినన్నాళ్లూ చాకిరీ చెయ్యాలి. అలాగ్గానే మా అన్న, మీచెల్లెలిని పెళ్లిఅనే మిషపెట్టి, కొంటున్నాడు. వాడింట యిది జీతంలేని బాపనక్కలాగ పనీపాటూ చేస్తుందని, వాడి ఆశ. నేను కూడదని యంత గడ్డిపెట్టినా విన్నాడుకాడు. యీ కష్టాలన్నీ యిలా వుండగా నాకు మరోభయం వేస్తూంది. చెబితే కోపంతెచ్చుకోవుగద?
బుచ్చ: మీరేం చెప్పినా నాకు కోపంలేదు.
గిరీ: ఆమాత్రం ధైర్యవిఁస్తే, నాక్కావలసిందేవిఁటి? రామచంద్రపురం అగ్రహారీకులు బహు దుర్మార్గులు - మాఅన్న చచ్చిపోయినతరవాత నీ చెల్లెల్ని తిన్నగా ఉండనియ్యరు. అదికూడా మా మీనాక్షి మోస్తరౌతుంది.
బుచ్చ: మీనాక్షికేం లోపంవొచ్చింది?
గిరీ: యేవఁనిచెప్పను? కడుపుచించుకుంటే కాళ్లమీద పడుతుంది. అయినా నీదగ్గిర నాకు దాపరికం యేవిఁటి? దానిమొగుడు పోయినతరవాత యేటేటా కడుపు అవుతూవుండడం. అయినప్పుడల్లా వొల్లమాలిన అల్లరిన్నీ. ఒకప్పుడు అది ప్రాణభయంకూడా చేస్తుంది. ఆవూళ్లో రావఁప్పంతులని వొక పరమదుర్మార్గుడు నియ్యోగప పంతులు వున్నాడు. వాడు ఒక సానిదాన్ని వుంచుకున్నాడు. యెందరినో సంసార్లని చెడగొట్డాడు. మా అన్న వ్యవహారాలన్నీ ఆపంతులే చూస్తాడు. మా అన్న చచ్చిన ఉత్తరక్షణం, నీ చెల్లెలికి వొల్లమాలిన ధనం చేతిలోకి వొస్తుంది. స్వాతంత్ర్యం కలుగుతుంది. "ఏమి ఇది?" అని అడిగేవాడుండడు. యిహ, చెడిపోవడానికి అభ్యంతరవేఁవిటి? "నేను కట్టుగావున్నానుకానా"? అని నువ్వు అనగలవు. నీ మొగుడితాలూకు ఆస్తి నీ చెయ్యి చిక్కలేదు. మొగుడి యింటికైనా నువ్వు వెళ్లలేదు.
బుచ్చ-- అవును.
గిరీ-- తల్లిదండ్రుల చాటున ఖాయిదాగా వున్నావు. పరాయివాడు యింట్లో అడుగుబెట్టలేడు. గాని యిలా యెంతకాలం వెళ్లుతుంది? నిన్ను తల్లితండ్రులు కలకాలం కాపాడలేరుగదా? వాళ్లు పోయినతరవాత నీకూ స్వాతంత్ర్యం వొస్తుంది. యేకాలానికి మనసు యలా వుండునో? అప్పుడు కాలుజారిన తరవాత, నువ్వు యేవఁనుకుంటావు? "అయ్యో నాడు గిరీశాన్ని శాస్త్రోక్తంగా పెళ్లాడి పునిస్త్రీనయిపోతే, పిల్లాపేకా కలిగి, అష్టైశ్వర్యంతో తులతూగుదునుగదా? యీ దురవస్థ నాకు రాకపోవునుగదా"? అని విచారిస్తావు. అప్పుడునే యెక్కడవుంటానూ? స్వర్గంలో మీకోసం యెదురుచూస్తూ వుంటాను. యీ పెళ్లి అయిపోయినతరవాత వెంకటేశమూ, నేనూ పట్ణానికి వెళ్లిపోతాం. నిన్ను, తలుచుకుంటూ నిద్రాహారం మానేసి, కొన్నిరోజులు వుంటాను. యెంతకాలవఁని మనిషన్నవాడు, నిద్రాహారంమాని వుండగలడు? నిన్ను తలుచుకుని తలుచుకుని నిద్దరపట్టక, రెండుఝాముల రాత్రప్పుడు నాగదిలో యీజీచెయిరుమీద కూచునివుండగా - యదట బల్లమీద మెరుపుదీపం, గోడని నిలువుటద్దం వున్నాయి - ఆ అద్దంలో నాముఖం చూసుకుని, యేమంటానూ? "యీ సొగుసైనముఖం, యీ తామరరేకులవంటి నేత్రాలు, యీ సోగమీసాలు. యివన్నీవృధాగదా? యవరు చూసి ఆనందించనూ? నాబుచ్చమ్మ, నన్ను పెళ్లాడక పోయినతరవాత నాబతుకు యెందుకు" అని, నిస్పృహాకలిగి ఛఱ్ఱున టేబిలు సొరుగుతీసి, అందులోవున్న జోడుగుళ్ల పిస్తోలు యెక్కుబెట్టి గుండె దూసిపోయేటట్టు కొట్టేసుకుంటాను.
బుచ్చ-- కొట్టుకోకండి. మీరు అలా అంటే నాకు యేడుపొస్తుంది.
గిరీ-- తక్షణం దేవతలు విమానం పంపించి నన్ను స్వర్గానికి తీసుకువెళతారు. స్వర్గానికి వెళ్లానని నాకు అక్కడమాత్రం సుఖవుఁంటుందనుకున్నావా వొదినా? నవాభరణభూషితురాలయి రంభతక్కుతూ తారుతూ వొచ్చి, "హా! ప్రియ! గిరీశ! నీలాటి సుందరుణ్ణి యన్నడూ నేను చూడలేదు. రమ్ము, నన్ను చేకొమ్ము," అని రెక్కబట్టుకు లాగుతుంది. నేనేవఁంటానూ? "చీ! అవతలికిపో! - నేను ఏంటీనాచ్చి! సానిది తాకితే, పరమ అపవిత్రంగా తలుస్తాను. పియర్సు సబ్బురాసి కడిగితేనేగాని యీచేతికి కశ్మలంపోదు. నువ్వారంభవి? మాబుచ్చమ్మ సొగుసుకి నువ్వు వొడ్డీకి పనికిరావు. గోయెవే, డామ్, డర్టీ గూస్" అని అంటాను. అలాగే, మేనకా, ఊర్వసీ, తిలోత్తమా మొదలైన యావన్మంది అప్సరస్త్రీలనీ తన్ని తగలేస్తాను. తగిలేసి, కాషాయ వస్త్రాలు ధరించి కల్పవృక్షచ్ఛాయని "హా! బుచ్చమ్మా, బుచ్చమ్మా" అని నీపేరు జపంచేస్తూ అనేక సంవత్సరాలు పద్మాసనంమీద వుండిపోతాను. అంతట కొన్నాళ్లకి నాతపస్సు ఫలించి, నువ్వు నందనవనంలోకి చంద్రోదయంలాగ బయలుదేరి వస్తావు. నేను "ప్రియురాలా! యెన్నాళ్లకి వొచ్చావు!" అని, అమాంతంగా వెళ్లి నిన్ను కౌగలించుకుంటాను. అప్పుడు నీ మొదటి మొగుడు, ముసలివెధవ, గావంచా గుడ్డకట్టుకుని, పొడుంముక్కుతో, "బుచ్చమ్మ నా పెళ్లాం" అని అడ్డురాబోతాడు. "వెధవాయా, నువ్వు బుచ్చమ్మకి తగవు. నీ రూపాయలు నువ్వు పట్టుకుపో" అని, వొక్కతాపు తన్ని తగిలేస్తాను. మనం యిద్దరం సుఖంగా స్వర్గంలో శాశ్వతంగా వుండిపోతాం.
బుచ్చ-- యేడుస్తూన్న దాన్ని నవ్విస్తారు.
గిరీ-- నువ్వు నన్ను పెళ్లాడితే, మనం బతికున్నంతకాలం నవ్వుకుంటూ, ఆనందిస్తూ కాలం వెళ్లబుచ్చుతాం. అప్పుడు నిన్ను యిలా పప్పురుబ్బనిస్తానా? మనకి యెంతమంది నౌఖర్లువుంటారు! యెంతమంది చాకర్లు వుంటారు! తోటలు, దొడ్లు, గుఱ్ఱాలు, బళ్లు! నిన్ను నడవనిస్తానా? పుష్పంలాగ నెత్తిమీద పెట్టుకుంటాను. అప్పుడు నీకు కలిగే ఆనందం ఆలోచించుకో.
బుచ్చమ్మ-- నా జన్మానికి మరి ఆనంద వెఁక్కడిది?
గిరీ-- నేను, నీకు దాసుడనై "యిదుగో నన్ను స్వీకరించు. నన్ను పెళ్లాడి ఆజన్మం ఆనందం అనుభవించు. నన్ను ఆనందంలో ముంచు" అని బతిమాలుకుంటూంటే, నువ్వు అట్టి సులభసాధ్యమైన సుఖమును కాలున తన్నుకు వెళ్లిపోయి, నాబతుకు కూడా బుగ్గిని కలిపితే, నేనేమి చెయ్యగలను?
బుచ్చ-- మీ బతుక్కి లోపవేఁవిఁ? మీరు మహరాజులు.
గిరీ-- నువ్వు నన్ను పెళ్లాడితే నేను మహరాజునే అవుతాను. నీ నోటంట వచ్చిన మాట అమోఘం - వొట్టినే పోకూడదు. గనక నాతో వెళ్లిపోయిరా.
బుచ్చ-- అమ్మ నాయనా! నే మీతోరాను.
గిరీ-- సరే. రాకపోతే నేనేగదా ప్రాణత్యాగం చేస్తాను? పీడానాడాకూడా పాయె.
బుచ్చ-- అలాంటి మాటలు అనకండి.
గిరీ-- చేసేమాట, చెబితే తప్పేమిటి? నేనేమైతేనేంగాని, నీ చెల్లెలిమీదైనా నీకు కనికరం కద్దా?
బుచ్చ-- అదేం, అలా అడుగుతున్నారు?
గిరీ-- నిజంగా కనికరంవుందా?
బుచ్చ-- వుండకుండా వుంటుందా?
గిరీ-- వుంటే, యీ పెళ్లి తప్పించే సాధనం నీ చేతులోనేవుంది.
బుచ్చ-- నా చేతులోనా?
గిరీ-- అక్షరాలా.
బుచ్చ-- యేమి చిత్రమైన మాటలు చెబుతారు!
గిరీ-- యీ భూప్రపంచంమీద వుండుకున్న యావన్మంది స్త్రీలలోనూ, నిన్నొక్కర్తెనూ వలిచి, నేను నీకు సుతలామూ లొంగిపోబట్టిగదా, నాబతుకు హాస్యాలకింద ఐపోయింది.
బుచ్చ-- మీతోడు-అలా అనకండి.
గిరీ-- పోనియి - ఆమాత్రం భరవసాయిచ్చావు. ఒకమాట నాకు ప్రమాణ పూర్తిగాచెప్పు. నీ చెల్లెలు పెళ్లి తప్పించడం, నీచేత అయితే, చేస్తావా?
బుచ్చ-- చెయ్యనా?
గిరీ-- యేమో, చేస్తావో చెయ్యవో! చేస్తానని ప్రమాణంచేస్తేనే, ఆమాట నేను చెబుతాను.
బుచ్చ-- యాఁవఁని ప్రమాణం చెయ్మన్నారు?
గిరీ-- నామీద ప్రమాణం చెయ్యి.
బుచ్చ-- మీమీద ప్రమాణమే; చెప్పండి.
గిరీ-- అయితే విను. వొంటరిగా చూసి, యీమాటేనీతో రహస్యంగా చెప్పుదావఁని కాచి, కాచివుండగా, యీవేళ, మీతండ్రి వూరికి వెళ్లడం, మీతల్లి వాకట వుండడంనుంచి, సమయం చిక్కింది. చెవివొగ్గివిను. నీచెల్లెలి పెళ్లి తప్పడానికి ఒక్కటే సాధనంవుంది. అది యేవిఁటంటే, నువ్వు ముందూవెనకా ఆలోచించక, నాతో లేచివచ్చి నన్ను పెళ్లిచేసుకోవడవేఁ - లేకుంటే నీచెల్లెలి పెళ్లితప్పదు.
బుచ్చ-- (ముసిముసి నవ్వుతో) నేను మీతో లేచివొస్తే మాచెల్లెలు పెళ్లి ఆగిపోతుందీ? యేవిఁచిత్రాలు!
గిరీ-- ఆమాట నీచేతనే వొప్పిస్తానుకదూ - విను - పెళ్లికి తర్లి వెళ్లుతూన్నప్పుడు, రెండోనాడు రాత్రి బండీవాడి చేతులో నాలుగు రూపాయలుపెట్టి, నీబండీ తోవతప్పించి అనకాపిల్లి రోడ్డులో పెట్టిస్తాను. అక్కడనుంచి రామవరందాకా మా స్నేహితులు అంచీబళ్లు ఖణాయిస్తారు. ఆడుతూ పాడుతూ, మనం దౌడాయించి రామవరంలో పెళ్లాడేసుకుని సుఖంగావుందాం. యిక మీవాళ్ల సంగతి యేవౌఁతుందీ? మనం వుడాయించిన మన్నాడు తెల్లవారగట్ల, నీబండీ కనపడక, కలవిలపడి, మీవాళ్లు నెత్తీ నోరూ కొట్టుకుంటారు. నీచెల్లెలు పెళ్లి ఆగిపోతుంది. మరి రెండు రోజులికి మనం పెళ్లాడావఁని తెలుస్తుంది. నిన్ను ముసలివాడికి కట్టిబెట్టినందువల్ల కలిగిన చిక్కులు చూస్తూ, నీతండ్రి నీచెల్లెలికి మళ్లీ ముసలిసంబంధం చెయ్యడు. నీతండ్రి ఒకవేళ మూర్ఖించి పెళ్లి చేస్తానన్నా, మన తమాషా విన్నతరవాత, నా అన్న నీ చెల్లెల్ని మరి పెళ్లి చేసుకోడు. యిది సిద్ధాంతం. అవునాకాదా?
బుచ్చ-- అవును కాబోలు.
గిరీ-- అయితే మరి అందుకు సమ్మతేనా?
బుచ్చ-- యెందుకు?
గిరీ-- నాతో వెళ్లిపోయి రావడానికి.
బుచ్చ-- అమ్మ నాయనా, నా ప్రాణంపోతే నేను మీతోరాను.
గిరీ-- రాకపోతే, మీచెల్లెలికి యీపెళ్లీ తప్పదూ, నాకు చావూ తప్పదూ.
బుచ్చ -- అలా అనకండి.
గిరీ-- అనకపోతేమాత్రం, చావు తప్పేదుందిగనకనా? నిన్ను వొదిలి బతకలేను, అది వకచావు. నువ్వు నామీద వొట్టువేసుకుని ఆమాట తప్పిపోతే, నన్ను దేవుఁడే చంపేస్తాడు. అది రెండోచావు. మరి నాకు చావు యెలా తప్పుతుంది?
బుచ్చ-- నానించి మీరు చచ్చిపోతే, నేనూ చచ్చిపోతాను. చచ్చిపోకండి.
గిరీ-- నావశవాఁ? అడుగో నీతమ్ముడు వొస్తున్నాడు. మరి మనం యీ కష్టసుఖాలు మాట్లాడుకోడానికి వీలుచిక్కదు. ఒక్కమాట చెప్పు. బతకమన్నావా? చావమన్నావా?
బుచ్చ-- వెయ్యేళ్లూ బతకండి.
గిరీ -- అలాగైతే, నాతోరావడం ఖాయవేఁనా?
బుచ్చ-- యేంజెయమంటే అది చాస్తాను.
(వెంకటేశం మిడతనుపట్టుకు ప్రవేశించును.)
వెంక-- యిదుగోనండోయి, గొల్లభావఁనిపట్టుకున్నాను.
గిరీ-- చూశావూ, వొదినా! నీతమ్ముడు చిన్నగుంటడయీ, అప్పుడే గొల్లభావఁల్ని పట్టు గుంటున్నాడు.
బుచ్చ-- (ముసిముసినవ్వు నవ్వుచు) మిడత!
గిరీ-- (బుచ్చమ్మతో) యిన్నాళ్లకి మిడతంభొట్లు చేతులో చిక్కాడు. (వెంకటేశంతో) యిలాతే - మిడతల్ని పట్టుకోవడం మంచి ఎడ్యుకేషన్. యిదే, నాచురల్ హిస్టరీ, ప్రకృతిశాస్త్రం అంటారు.
వెంక-- అక్కయ్యా - కొంచం ఊరుబిండి!
బుచ్చ-- అమ్మ చూస్తే తంతుంది.
వెంక-- అమ్మచూడదులే. (వూరుబిండి చేతులో వేసుకుని నాలుకతోనాకి గెంతును.)
(తెరదించవలెను.)