కథలు - గాథలు (దిగవల్లి శివరావు)/మంగలి కొండోజీ

కర్నూలునవాబు పదచ్యుతి

ఆప్ఘనిస్థానం యుద్దంలో ఇంగ్లీషువాళ్లు ఓడిపోతారని అనుకుని దేశంలోవున్న మహమ్మదీయు లందరూ ఏకమై తిరుగుబాటు చేయడానికి కుట్రచేసినట్లూ, దానికి కర్నూలు ఒక కేంద్రస్థాన మైనట్లుగా తేలింది. "మన కళ్ల యెదుటనే ఇలాంటి గొప్పకుట్రసాగుతూ వుండడమూ, దానికి సొమ్ము చేకూరడమూ ఎంత ఆశ్చర్ల్యము!"అని దీనినిగురించి ఇంగ్లాండుకు వ్రాసిన ఆయన అన్నాడు.

కర్నూలు నవాబు గులాం రసూలుఖానును పదభ్రష్టుణ్ని చేసి తిరుచినాపల్లికి రాజకీయఖైదుగా పంపారు. అక్కడ అతడు క్రైస్తవ మతంలొ ఆసక్తి చూపుతూ క్రైస్తవదేవాలయానికి వెళ్లగా ఒక తురకఫకీరు ఆయనను 1840 వ సంవత్సరం జూలై 12-వ తేదీన కత్తితో పొడిచి చంపాడు. (South Indian Sketches A short account of some missionary stations of Church Mission Society by S.Tucker, James NIsbel & Co; 1842 pp 17-23)

-------

12. మంగలి కొండోజీ

   క॥ "ఎంగిలిముచ్చుగులాములు
        సంగతిగా గులము చెఱుప జనుదెంచి రయా
        యింగిత మెరిగినఘను డీ
        మంగలికొండోజి మేలు మంత్రులకన్నన్."

అని కంసాలి రుద్రయ్య యని ప్రసిద్ధిజెంచిన కందుకూరి రుద్రకవి చెప్పిన చాటుపద్య మొకటి చిరకాలమునుంచి ప్రచారంలో వున్నది.

ఈ రుద్రకవి విద్యానగరసామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల కాలంనాటివాడనిన్నీ, ఇతడు రాయలవారి దర్శనంకోసం చాలాకాలం వేచియుండి మంత్రులనూ, రాజోద్యోగులనూ ఎన్నాళ్లు ఆశ్రయించినా వారు దర్శన మిప్పించలేదనిన్నీ, ఇలా వుండగా రాయలవారికి క్షౌరంచేసే మంగలి కొండోజీ ఈ కవి ఇలాగ మంత్రుల యిళ్లదగ్గిరా, వుద్యోగుల యిళ్లదగ్గిరా పడిగాపులుకాస్తూ పడివుండడం చూసి దయదలచి ఈ సంగతి రాయలవారితో మనవి చేశాడనిన్నీ, అంతట రాయలవారు కవికి దర్శనమిచ్చారనిన్నీ, అప్పుడు రుద్రకవి యీ పద్యం చెప్పాడనిన్నీ ప్రతీతి.

రాజగురువైన తాతాచార్యులవారు రుద్రకవిని ఊరు, పేరు, కుల గోత్రాలు అడిగితే కవి చమత్కారంగా పద్యంలోనే జవాబు చెప్పాడట. తరువాత రాజసభలో అనేక దుస్సమస్య లియ్యగా అవన్నీ చక్కగా పూరించాడట. అంతట రాయలవా రాయనకు తగినవిధంగా సత్కరించి తమ ఆస్థానంలో అష్టదిగ్గజా లనే కవులలో ఒక్కనిగా చేశారట. రుద్రకవి రాజగురువైన తాతాచార్యుల వారితోనూ అష్ఠదిగ్గజాలలో [1] చేరిన అల్లసాని పెద్దన, ముక్కుతిమ్మన, పుత్తేటి రామభద్రయ్య, పింగళి సూరన, కవిరాట్టు, తెనాలి రమలింగకవి, భట్టుమూర్తి మొదలయిన కవులతోనూ వాగ్వాదాలు చేసేవాడనిన్నీ ప్రతీతి.

ఈ రుద్రకవికి 1550-1580 మధ్య గోలకొండ నేలుతూ కవులను ఆదరించి "మల్కిభరాం" అని పేరుపొందిన మలిక్ ఇబ్రహీంకుతుబ్ షా పాదుషాగారు రెంటచింతల (చింతలపాలెం) అనే గ్రామాన్ని యిచ్చి సత్కరించారు. ఆ గ్రామాన్ని రుద్రకవి వంశీకులు అనుభవిస్తున్నారు.

రుద్రకవి రచించిన నిరంకుశోపాఖ్యానం అనే ప్రబందంలో

   "చేరి కన్నడభూమి చెఱపట్టు పాశ్చాత్య
    నృపతిపై నొక్కింత కృప తలిర్చు"

అను సీసపద్యపాద మొకటి విద్యానగరవినాశనమును


సూచిస్తూవున్నందువల్ల 1565 లో జరిగిన తాలికోటయుద్ధ మనే 'రాక్షస తగ్డి ' యుద్దములో ఆళియరామరాయలు దివంగతుడై విద్యానగరాన్ని మహమ్మదీయులు కొల్లగొని నాశనం చేసిన తరువాతనే ఈ ప్రబంధము రచింపబడియుండినట్లు కనబడుతూ వున్నది. ఈ రెండు కారణాలవల్లనూ రుద్రకవి కృష్ణదేవరాయల కాలములో ఉన్నాడో లేడో అనే సంశయం కలిగి కృష్ణదేవరాయలకాలంలో ఒక రుద్రకవి వున్నట్లయితే అతడీ నిరంకుశోపాఖ్యాన గ్రంధకర్త తాతయై యుండవలెననిన్నీ, లేదా ఇత డప్పటికి బాలుడుగా నైనా ఉండవలననిన్నీ బ్రహ్మశ్రీ వేటూరు ప్రభాకర శాస్త్రులవారు తమ చాటుపద్యమణిమంజరి రెండవభాగములో వ్రాసియున్నారు.

మంగలి కొండోజీని గురించి రుద్రకవి చెప్పిన చాటుపద్యము వల్ల గూడా ఈకవి కృష్ణదేవరాయల తరువాతి కాలం నాటి వాడేనని స్పష్టంగా ఋజువు అవుతున్నది.

చ రి త్రాం శాలు

మంగలి కొండోజీ కధలో యెంత సత్యమున్నదో తెలియదుగాని కొండోజీ మాత్రం కల్పితపురుషుడు కాదు. కొండోజీ యనే మంగలి యొకడు 1542 మొదలు 1569 వరకూ రాజ్యం చేసిన సదాశివరాయలవారి కాలంలో విశేషమైన రాజసమ్మానం పొందినట్లు శాసనాలవల్ల కనబడుతున్నది.

కృష్ణదేవరాయలవారు 1509 మొదలు 1529 వరకూ రాజ్యం చేసి స్వర్గస్థులు కాగా ఆయన తరువాత 1542 వరకూ అచ్యుతదేవరాయలవారున్నూ, 1569 వరకూ సదాశివరాయలవారున్నూ విద్యానగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. సదాశివరాయలవారి కాలంలో పేరునకే ఆయన చక్రవర్తి గాని సాక్షాత్తుగా పరిపాలించే ప్రభువు కృష్ణదేవరాయలవారి అల్లుడైన అరవీటి రామరాజుగారే. ఆయన అళియరామరాయలని చరిత్రలో ప్రసిద్ధి చెందియున్నారు. ఈరామరాయలవారు మహమ్మదీయులతో చాలా యుద్ధాలు చేసి జయించిన మహావీరుడు, సంగీతసాహిత్యాలను చిత్రకళలను పోషించిన రసజ్ఞుడు. ఆయన చాలమంది సంస్కృతాంధ్రవిద్వాంసులను కవులను ఆదరించి బహుగ్రంధరచనను చేయించి భోజుడని ప్రఖ్యాతి చెందినట్లు సదాశివరాయలవారి శాసనాలలోనే వుదాహరింపబడి యున్నది. తరువాత వసుచరిత్రను రామరాయలవారి తమ్ముడైన తిరుమలరాయల కంకిత మిచ్చిన భట్టుమూర్తి రామరాయలవారి ఆస్థానకవిగా నుండి సమ్మానింపబడి "రామరాజభూషణు" డనే బిరుదును పొందినాడు.

రామరాయలవారి కాలంలో రాజగురువుపేరు తాతాచార్యులే ఆయన పంచమతభంజన మనే గ్రంధాన్ని వ్రాసి "పంచమతభంజనం" తాతాచార్యులవా రనే బిరుదును వహించాడు. కృష్ణదేవరాయల వారి కాలంనాటి కవులు, గాయకులు, విద్వాంసులు, సామంతులు, సరదారులు అనేకులు రామరాయలవారి కాలంనాటికి కూడా బ్రతికి వుండి రాజసభలో వున్నట్లు తెలుస్తున్నది.

రామరాయల చేతులలో ఓడిపోయిన మహమ్మదీయరాజు లందరూ ఏకమై 1565 లో విద్యానగరంమీదికి దండెత్తి రాగా తాలికోట యనే 'రాక్షస తగ్డి ' యుద్ధం జరిగింది. అందులో రామరాయలవారు స్వర్గస్తులైనారు. అంతట ఆయన తమ్ముడైన తిరుమల రాయలవారు ధనకనకవస్తువాహనాలను తీసుకుని సదాశివరాయల వారితో విద్యానగరం వదలిపెట్టి పెనుగొండను రాజధానిగా చేసుకొని రాజ్యపరిపాలన మారంభించారు. విద్యానగరాన్ని మహమ్మదీయులు నాశనం ఛేశారు 1569 లో సదాశివరాయలవారు చనిపోగా అరవీటి తిరుమల రాయలవారే చక్రవర్తియై 1572 వరకూ పరిపాలించారు వారి తరువాత ఆయన కొమాళ్లలో శ్రీరంగరాయలవారు 15895 వరకున్నూ వేంకటపతి దేవరాయ మహారాయలవారు 1614 వరకున్నూ, చంద్రగిరి రాజధానిగా చేసుకుని విద్యానగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. వేంకటపతి దేవరాయలవారి తరువాత కుటుం బంలోనే కొన్ని తగాదాలు వచ్చినవి. తరువాత ముప్ఫయి నలభై సంవత్సరాలలో ఈ రాజ్యభాగం మహమ్మదీయులకు వశమై అరవీటి రాజవంశ పరిపాలన అంతరించింది.

భట్టుమూర్తి రామరాజభూషణు డనే బిరుదును పొందిన తరువాత రచించిన "వసుచరిత్ర" మనే ఆంధ్రప్రబంధాన్ని రామరాయల తరువాత రాజ్యం చేసిన తిరుమల రాయలవారికి అంకితం యిచ్చాడు. 'నరసభూపాలీయ ' మనే అలంకార గ్రంధాన్ని రాయలవారి మేనల్లుడైన పోచిరాజు నరసరాజుగారికి కృతియిచ్చాడు.

తెనాలి రామలింగకవి కృష్ణదేవరాయల ఆస్థానంలో వుండి కవిత్వం చెప్పినట్లుగాని, గ్రంధాలు రచించి నట్లుగాని నిదర్శనాలు కనబడడంలేదు. రాయలవారిని గురించి, తాతా చార్యులవారిని గురించి, సమకాలికులైన కవులను గురించీ అతడు చెప్పినట్లు ప్రచారంలోవున్న చాటుపద్యాలు కృష్ణదేవరాయల తరువాత రాజ్యంచేసిన రాయలవార్లకుకూడా అన్వయిస్తున్నవి. కృష్ణదేవరాయల కాలం తరువాతనే అతను గొప్ప గ్రంధాలను రచించి రాజసమ్మానం పొందినట్లున్నూ, వేంకటపతిదేవరాయ మహారాయల కాలం వరకూ జీవించియున్నట్లున్నూ, రాయలవారి మెప్పుకోసం వైష్ణవుడై తన పేరుకూడా రామకృష్ణకవి యని మార్చుకున్నట్లున్నూ, కనబడుతున్నది.

కృష్ణదేవరాయలవారి తరువాత రాజ్యంచేసిన రాయలవార్లందరూకూడా సంగీతసాహిత్యాలను లలితకళలను పొషించి విద్యావ్యాసంగము చేస్తూ రసజ్ఞులై సంస్కృతాంధ్రకవులను ఆదరించి ఆంధ్రభోజు లనిపించుకున్నవారే, ఈరాయలవార్ల రాజగురువుల పేర్లు కూడా తాతాచార్యులవార్లే. అనంతాచార్యుడు వ్రాసిన ప్రసన్నామృతంలో ఈ గురువుల వంశావళి కనబడుతున్నది. ఈ తాతాచార్యులవార్లకు అయ్యావయ్యంగారనీ, ఎట్టూరు తాతాచార్యులు గారనీ, పంచమతభంజనం తాతాచార్యులనిన్నీ, కోటికన్యాదానం తాతాచార్యులనిన్నీ, చేర్చి అనేకకధలు చెప్పుకుంటున్నారు. మన రుద్రకవి కధకూడా ఇలాంటిదే.

'మంగలి కొండోజీ ' పొందిన రాజసన్మానం

రుద్రకవి పేర్కొన్న మంగలికొండోజీ 1545 మొదలు 1565 వరకూ సదాశివరాయలవారి కాలంలో విద్యానగరాన్ని పరిపాలించిన అళియరామరాయలవారి సన్నిహితభృత్యుడు. ఇతడు తనకు బహుపసందుగా ముఖక్షౌవరం చేస్తాడని రాయలవారు సదాశివరాయల వారికి చెప్పగా సదాశివరాయలవారు కూడా కొండోజీని ఆదరించి అతనిమీద అనుగ్రహం కలిగి అతణ్ణి బహుకరించారు. ఈ కొండోజీ పేరు "బాడవిపట్టణ కాపురస్తుడైన మంగలి తిమ్మొజు కొండోజు*[2] గారు" అనిన్నీ, "కొండోజా" అనిన్నీ సదాశివరాయలవారి దానశాసనాలలొ కనబడుతున్నది. 1545 నాటికే రామరాయలవారికి కొండోజీ పైన అనుగ్రహం కలిగి మంగళ్ళు మామూలుగ చెల్లించవలసిన వృత్తి పన్నును, సుంకములును ఇతరపన్నులన్నూ అతడిచ్చుకో నక్కరలేకుండా ఒక తాకీదు జారీచేశారు. రాజ్య పరిపాలకుడి చర్యను చూసి మైసూరు రాజప్రతినిధి రాజ్యంలో చేరిన శివమొగ్గ జిల్లాలొ సదాశివరాయలవారి యుద్యోగి (ఏజంటు) ఈ కొండోజూకు చన్నగిరి మంగలి పన్నును ఇనాముగా నిచ్చారు.

కొండోజు రామరాయలవారికి సేవచేస్తూవుండి రాయలవారిని ఆశ్రయించినందువల్ల మంగలికులస్ధు లెవ్వరూ పన్ను లిచ్చుకో నక్కర లేకుండా సదాశివరాయలవారు 1554 లో శాసించారు. ఆ మరుసటి సంవత్సరం వెట్టిచాకిరీ., బిరద, నిర్ణీతపు శిస్తులున్నూ, ఇతరపన్నులున్నూ కూడా విజయనగర సామ్రాజ్యపు సగిహద్దులోపల తానుగాని, తన కుటుంబమువారుగాని చెల్లించనక్కరలేకుండా కొండోజీ ఒక ఫర్మానా పొందాడు.

సదాశివరాయలవారి ఆజ్ఞప్రకారం రామరాయలవారు ఈ అదృష్ణశాలికి యుంకొక దానశాసనంకూడా రాయించి యిచ్చారు గాని అందులోని సంగతులు సరిగ్గా తెలియడం లేదు. ఆ కాలంలోనే గూడూరులో వున్న సదాశివరాయలవారి యుద్వోగి ఈ కొండోజికి ఆచంద్రతారార్కంగా అనుభవించగలందులకు ఒక దానశాసనం వ్రాయించి యిచ్చి దానికి ఆటంకం కలిగించేవారికి బ్రహ్మహత్యా పాతకం కలుగుతుందని అందులో వ్రాయించారు.

హీరేకెరూరులో ఒక కవిలెవల్ల రామరాయలవారు 'తిమ్మోజా, హోమ్మోజా, బారోజా ' లనే ముగ్గురు మంగళ్ళపైన పన్నులు తీసివేసినట్లు కనబడుతూ వున్నది. బాదామిలోనున్న ఒకశాసనంవల్ల 'తిమ్మోజా, కొండోజా, భద్ర లనే మొగ్గురు మంగళ్ళకు పన్నులు తీసివేసినట్లున్నూ కనబడుతున్నది.

సదాశివరాయలావారికిన్నీ, రామరాయలవారికిన్ని కొండోజీ యందున్నూ, పైన చెప్పిన ముగ్గురుమంగళ్ల యందున్నూ కలిగిన అనుగ్రహంవల్ల మంగలికులంవారి కందరికీ చాలా వుపకారాలు జరిగినవి. రామరాయల వారికి కొండోజాయందు కలిగిన అభిమానంవల్ల తుముకూరుజిల్లాలో నున్న మంగలి కులస్థు లందరికీకూడా పన్నులు లేకుండా తీసివేసినట్లు 1545 లోని ఒక శాసనంవల్ల తెలుస్తూవుంది. తరువాత విజయనగరరాజ్యం సరిహద్దులోపల గల మంగళ్లందరూ కూడా పన్ను లిచ్చుకో నక్కరలేదని వుత్తర్వు చేశారు. పైని చెప్పిన కారణంవల్లనే సదాశివరాయలవారు ఉలబి గ్రామంలోని మంగళ్లకు వృత్తిపన్నును ఇనాముగా వదలివేసినట్లు చెప్పబడినది.

దరిమిలాను సామ్రాజ్యంలో నున్న మంగళ్లందరికీకూడా అనేక సౌకర్యాలు కలిగించారు. మంగళ్లు ఇచ్చుకోవలసిన పన్నులు, నిర్ణీతపు శిస్తులు, వారు చెయ్యవలసిన వెట్టి చాకిరీ, బిరద, సుంకములు, కావలి పన్నులు యావత్తు సదాశివరాయలవారున్నూ రామరాయలవారున్నూ తీసివేసినట్లుకూడా, చిట్టాలందుర్గము జిల్లాలొ 1546 లోని ఒక శాసనంవల్ల కనబడుతున్నది.

సదాశివరాయలవారు స్వయంగా ఊటుకూరులోని మంగళ్ళ పైని పన్నులు తీసివేశారు. రామరాయలవారున్నూ కర్ణాటక రాజ్యంలోని కొన్ని మండలాలలోనూ, కడపజిల్లాలోని కొన్ని సీమల లోనూ మంగళ్లపైని పన్నులు తొలిగించారు.

రాయలవారిని చూసి వారి మంత్రులూ సామంతులూ కూడా అనేక గ్రామాలలో మంగళ్లపైని పన్నులు తీసివేశారు . (The Aravidu Dynasty --Heras pp. 48-49)

__________________


13. నూజివీటి వ్యవహారం

1771 లో నూజివీటి జిమీందారుడైన నరసింహ అప్పారావు గారు చాలా ఖర్చు మనిషి. చెన్నపట్నం ఇంగ్లీషు కంపనీ ప్రభుత్వానికి చెల్లించవలసిన కప్పం(పేష్కసు) సరిగా చెల్లించలేకపోయేవాడు. అందువల్ల చిక్కులలో పడ్డాడు.

జమీందారీని వశపర్చుకోవడానికి కంపినీ సర్కారువారు 1773 లో బందరులో ఒక సైనికదళం పంపారు. అప్పుడు ఆయన అత్యధికమైన వడ్డీరేటుతో బందరులో నున్న కంపెనీదొరల దగ్గరనే కొంతసొమ్ము బదులు చేసి బకాయి చెల్లించాడు.

1775లో బందరు కంపెనీవారి పరిపాలనసంఘానికి అధ్యక్షుడుగా నుండిన వైటుహిల్లుకు, హాడ్జెసుకు, ఇంకా బందరులో కంపెనీ ఉద్యోగం చేస్తూవున్న మరికొందరు దొరలకు నరసింహా అప్పారావు గారు బాకీ వున్నారనీ వాళ్ళు 1775లో తగాదా ప్రారంభించారు. మూడు సంవత్సరాలు గడిచినవి గాని వ్యవహారం తెగలేదు. అంతట అప్పారావుగారు చెన్నపట్నానికి ప్రయాణం కట్టారు.

  1. కృష్ణదేవరాయలుగారు తమ ఆస్థానములోని అష్టదిగ్గజములనే కవులకు తప్పలూరును అగ్రహారంగా యిచ్చినట్లు 2 వ నెం. స్థానిక చరిత్ర 357 వ పుట (క్రీ.శ.1528)లో నుదాహరింపబడి యున్నదని డాక్టరు నేలటూరి వెంకట రమణయ్యగారు తమ విజయనగర 3 వ రాజవంశచరిత్రలో వ్రాసినారు చూడు. పుట.421.
  2. ఓరా అనేది ఒజ్జ శబ్దానికి రూపాంతరము. దీనిని సాధారణంగా కంసాలులూ, మంగళ్ళూ ఉపయేగిస్తారు. ఉత్తర హిందూస్థానంలో ఓఝూఅనే రూపంవున్నది. అన్నింటికీ ఉపాధ్యాయుడనే అర్దం 'అని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గాదు చెప్పారు.