కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/బ్రాహ్మణశాఖలు
బ్రాహ్మణశాఖలు
"భూమిన్ బ్రాహ్మణశాఖలం దొకటియై పొల్పొందు నెంతేని నారామద్రామిడశాఖ. భారద్వాజ గోత్రమ్మునన్"
"తనకుమాలిన ధర్మంలేదు" కనక ముందుగా మాశాఖపేరు చెప్పుకున్నాను. ఆయీ పద్యంలో “ఎంతేని నారామ" అనే దానిలోవున్న సంధినిగూర్చి ప్రస్తుతం అంతగా ప్రసక్తి లేకపోయినా అవకాశాన్నిబట్టి జిజ్ఞాసువుల కొఱకు వ్యాసాంతమందు కొంత చర్చిస్తాను. ద్రవిడ, ద్రమిడ అనే రూపాలు రెండూవున్నాయి గనక ఆశబ్దం శంకించవలసి వుండదు. ఆ యీ "బ్రాహ్మణశాఖలు” అవాంతరాలు కాక ముఖ్యమైనవి పది యేదో వ్యాసంలో"ఆంధ్రద్రవిడ కర్ణాట మరాటా ఘూర్జరాస్తథా సారస్వతాః కాన్యకుబ్జా గౌడా ఉత్కల మైథిలాః"
ఆ యీశ్లోకం వుదాహరించినట్లే జ్ఞాపకం. యిందులో, తథా అనే రెండక్షరాలూ తప్ప తక్కినపదాలన్నీ “బ్రాహ్మణశాఖల” నామధేయాలు, వీట్లని రెండుగా విభజిస్తే పంచద్రావిళ్లూ పంచగౌడలూ అని తేలుతుంది. గౌడలలోవుండే అవాంతరభేదాలు ఆదేశ వాస్తవ్యులకు తెలిసినట్లు తదితరులకు తెలియవు కనక దానిజోలికి పోయేదిలేదు. బాగా తెలియని విషయం పెట్టుకొని అపహాస్యాస్పదుణ్ణి కావడం కంటె తూష్ణీంభావమే యుక్తం. యింకనల్లా- “పంచద్రావిళ్లు" మిగులుతారు. యిందులోకూడా అవాంతరంగావున్న ద్రవిడశాఖను గూర్చి దాక్షిణ్యాత్యులకు తెలిసినట్లు మనకు తెలియదు. -
"పంచద్రావిళ్లు"లో అవాంతరంగా ద్రవిడులున్నట్లే - పంచగౌడలలో కూడా గౌడలున్నట్లు పయిశ్లోకం తెలుపుతూనే వుంది. సరే; మొదటివారిలో మైసూరు ప్రాంతంలోవుండే కర్ణాటకులలో ఉండే అవాంతరభేదాలుగాని, మరాటులలోనూ ఘూర్జరులలోనూవుండే అవాంతరభేదాలుగాని మనకుబాగా తెలియవు. కనకవారిని కూడా వ్రాసేదిలేదు.ఆ సందర్భాన్ని తెలిపే పుస్తకాలు కూడా వున్నట్లు గోచరింపదు. మహారాష్ట్రులు ఆయుధ జీవులన్నంత వఱకు పాణినీయసూత్రంవల్ల గోచరిస్తుంది. దానికి తథ్యంగా కొంతకాలం వారురాజ్యాన్ని పాలించారు- “పుబ్బలో పుట్టి, మఖలో మాడింది” రాజ్యం యెప్పడూ ఆయుధబలాన్ని పురస్కరించుకొని వుంటుంది. "వీరభోజ్యము సుమ్ము రాజ్యము" "దెబ్బకు దెయ్యం జంకుతుంది" యితరులనుపట్టి పీడించే పిశాచాలుకూడా ఆయుధానికి జంకి పన్నుచెల్లిస్తాయన్నమాట. ఘూర్జరులు విశేషించి వర్తకులేమో? వీరిలో పాండిత్యము వల్ల పేరందిన వారి పేళ్లు శ్రుతంకావడంలేదు. వేంకటాధ్వరి– “కేవా ఘూర్జరసుభ్రువా మవయవాయూనాం న మోహావహాః" (విశ్వగుణాదర్శం) అనడంచేత ఆయీ బ్రాహ్మణులు ఐశ్వర్యవంతులని సాక్షాత్పరంపరయా బోధిస్తుంది. "యత్రాకృతిస్తత్రగుణాః, యత్ర గుణాస్తత్ర సంపదః" అయితే వేంకటాధ్వరి యావత్తుజాతినీ బోధించే ఘూర్ణరపదాన్ని ప్రయోగించడంచేత దాన్ని కేవలం బ్రాహ్మణ పరం చేయడం సమంజసంకాదనే శంక కవకాశంవున్నా బ్రాహ్మలతోపాటు యితరులు కూడా ఐశ్వర్యవంతులు కావలసివస్తుంది. కాని అంతకంటే వచ్చే విప్రతిపత్తిలేదని తెల్విడి. అయినా మనకు బాగా తెలియని విషయంలో యేదో వ్రాతకుదిగి, తెలిసీ తెలియని వ్యాఖ్యాతలవలె అపహాస్యాస్పదులం కావడంకంటే యేకొంచమేనా తెలిసిన విషయంలోనే కొంత వ్యాకరించడం సమంజసం కనక ప్రస్తుతం అట్టిది- "ఆంధ్రభ్రాహ్మణ జాతి" కనక దాన్ని గూర్చే తెలిసినంతలో కొంతవ్యాకరిస్తాను. యీ పేరు వీరువసించే దేశం ఆంధ్రదేశం కావడంచేత వచ్చివుంటుంది. యిదేకాదు తక్కిన ద్రవిడ, కర్ణాట, వగైరా పేర్లుకూడా డిటో, యీ పేరుగల బ్రాహ్మణులలో అవాంతరభేదాలు చాలావున్నాయి. (1) తెలంగాణ్యులు (2) వేగినాట్లు (3) వెల్నాట్లు (4) కాసలనాట్లు (5) ములికి (ముల్కు నానాటికి మురికిగా పరిణమించింది) నాట్లు, (6) కరణకమ్మలు వీరు వైదికులమని వ్యవహరించుకుంటారు. అన్యోన్యమూ వీరిలో వీరికి పంక్తిభోజనాలు (ఆహితాగ్నులకుతప్ప) కలవు. మంచప్పొత్తు (వివాహాలు) మాత్రం యేలేశ్వరోపాధ్యాయుల నాటినుండి లేదు. అంతకుపూర్వం వున్నట్లే వూహించాలి. ఉపాధ్యాయులుగారి కొమార్తెకు విశ్వబ్రాహ్మణుడు భర్తగా (ప్రమాదంచేత) తటస్థపడ్డాడనిన్నీ ఆ కారణంచేత శ్రుతిస్మృతి సందర్భంలేని యీ వివాహనిషేధం బ్రాహ్మలలో ఆచారంగా పరిణమించినదనిన్నీ చెప్పుకుంటారు. “ఏలేశ్వరోపాధ్యాయులు" గారు చాలా గొప్పవారని తోస్తుంది. ఆయన వెల్నాటిశాఖీయులే. ఆ యింటిపేరివారు ఆశాఖలో మొగల్తుర్తి గ్రామంలో నేడున్నూ వున్నారు. ఇతరత్రకూడా వుండివుంటారు. నాకు అక్షరాభ్యాసానంతరం (రెండో గురువులు) యేలేశ్వరరావు శ్రీరామశాస్త్రుల్లుగారే. ఆయీ వంశీకులు వుపాధ్యాయులుగారి కొమార్తెకు ప్రమాదవశతః ఘటించిన “విశ్వబ్రాహ్మణ జామాతృకత్వం" కారణంగా ఆయీ శాఖవారికి వెలి (బహిష్కారం) వచ్చి తద్ద్వారా వీరువెలినాట్లుగా ఏర్పడి తుదకు వెల్నాట్లుగా వ్యవహరింపబడుతూ వున్నారని వొక పుక్కిటి పురాణము శ్రుత మవుతుందిగాని అది యుక్తి సహము కాకపోవడముచేత అనాదరణీయము. యెవరో వృథా శాఖాభిమానులు "దురభిమాన గ్రహావేశ ధూమధూపితులు" కల్పించి వుంటారు. పాకనాడు, కాసలనాడు, వేగినాడువగైరా పేళ్లవంటిదే యీవెలనాడున్నూ వెలనాడు అనేది విదర్భదేశానికి నామాంతరమని వినికిడి వుంది. ఆదేశ వాసులు బ్రాహ్మణులు వెల్నాటివారు. అయితే ఆదేశంలో వసించే క్షత్రియాదులుకూడా వెల్నాట్లు కావద్దా? అనే శంక కవకాశం లేకపోదు. ఆశంక యితర నాడులకూ వుంది, “అయం నిరుత్తరః పూర్వః పక్షః" -యేకారణమో? బ్రాహ్మణులకు మాత్రమే ఆయీ పేరు కలిగింది –యింతే యిప్పటికి చెప్పేసమాధానం. వెలనాటి చోడుడు అనేపేరుతో వొకరాజు వున్నట్టు దేనిలోనో చదివిన జ్ఞాపకం. ఆయీ ఆంధ్ర బ్రాహ్మణులలో వుండే యావత్తు అవాంతర శాఖలూ వొక ప్రక్కా వెల్నాటివా రొకప్రక్కా వుండేటట్లు విభజించి తూకం వేస్తే యింకా, వెల్నాటివారే మొగ్గుతారని తోస్తుంది. యీ శాఖ సంఖ్యాబాహుళ్యానికే కాదు, పూర్వం - వేదశాస్త్ర సంపత్తికే" కాదు, ఐశ్వర్యానికే కాదు, అన్నిటికీ ఆంధ్ర బ్రాహ్మణశాఖలలో అగ్రగణ్యంగా కనపడుతుంది ఆఖరికి ఆంధ్ర కవిత్వానిక్కూడా నిన్నమొన్నటి నుంచి యీ శాఖకే, తిరుపతిశాస్త్రిగారివల్ల యెక్కువ గౌరవం కల్గింది. అతనిదే యీ వాక్యం
"వెలనాటివాడ గవితకు వెల నాటిన వాడ" అన్నాడు తిర్పతిశాస్త్రి. ఏదో సందర్భములో, యింకా కొందఱు వీరిలో కవులున్నారు. కాని “నఖలు సర్వోపి వత్సరాజః". అనేకకారణాలవల్ల వెల్నాటివారికి అగ్రతాంబూలం యీవలసి వస్తుంది. ఆ శాఖలో -ఆ-బూ-చే-లు మఱీ సుప్రసిద్దులని గోదావరి జిల్లాలో చెప్పగా వినడం. ఆ అంటే ఆకెళ్లవారు, బూ అంటే బులుసు, చే అంటే చేవలి. యీ యింటి పేర్లవారు వేదశ్రౌతాలలో అందెవేసిన చేతులనిన్నీ వీరు లేని యజ్ఞమంటూ వుండదనీ చెప్పకోగా వినడం. “బులుసులేని యజ్ఞం" “బలుసులేని తద్దినం" అనే లోకోక్తి స్పెషలుగా బులుసువారికే సమన్వయించేది సరేసరి, సర్వత్రాకాదు గాని కోనసీమలో మాత్రం అన్నివిధాలా “పెద్ద ద్రావిళ్లు" వెల్నాట్లకు తీసిపోరని చెప్పకుంటారు. (యీ పెద్ద ద్రావిళ్లకు పేరూరు ద్రావిళ్లు అని నామాంతరం) యివన్నీ గతకాలపు మాటలు. యిటీవల అందఱూ రాజకీయ విద్యలోకి దిగారు. లోగడ, శాస్త్రీ, అవధానీ వగైరాల స్థానాలని రావు పదం ఆక్రమించింది. కాని యిప్పడేనా విత్తనాలు (వేదశాస్తాలకు) కావలసివస్తే ఆ ప్రాంతంలోనే సకృత్తుగా దొరుకుతాయి. పూర్వకాలంలో వేదశాస్తాలకు పేరు పడ్డ కుటుంబాలు కొన్ని రాజకీయ విద్యలో కృషిచేసి దానిలో పేరుప్రతిష్ఠలు గడించడం అభినందనీయమేగాని, కొన్ని కుటుంబాలు కాలమహిమచేత యేదీలేకుండా, శుంఠతావచ్ఛేదకాలుగా తయారవడం శోచనీయం. -
“తేషాం నిందా న కర్తవ్యా యుగరూపాహితే ద్విజాః" యెవరో స్వాములవారు అప్పటికి పూర్వం పుష్కరకాలం నాడు చూచిన చూపునకూ, తాత్కాలికంగా చూచిన చూపునకూ, భేదం కొంత కనపడితేనే -"అహో పేరూరి దౌర్భాగ్యం వ్యాఖ్యాతా సూపశంకరః" అన్నారని చెప్పుకుందురుగదా! ఆస్వాములవారికి గ్రహాయుర్దాయం కాక యోగాయుర్దాయం పట్టి యిప్పుడు వచ్చిచూస్తే యేమనుకోవలసి వస్తుందో? అనిపిస్తుంది నాకు. ఇది గతజల సేతుబంధనం. ఆంధ్రభ్రాహ్మణులలో సర్వవిధాలా వెల్నాటివారు అగ్రగణ్యులు. పేరూరి ద్రావిళ్లు లేదా పెద్దద్రావిళ్లు యీ "ఈషదసమాప్తౌ కల్పప్రత్యయః ఆయీ ‘కల్ప" తౌల్యాన్ని చెప్పేటప్పుడే ప్రత్యయంగాని, వేదాంగాన్ని చెప్పేటప్పుడు స్వతంత్రశబ్దమే (కల్పశ్చేతి షడంగాని, చూ.) యీచర్య. 'చుం' ను గూర్చి వేఱొకవ్యాసంలో విస్తరించడంచేత స్పృశించి విడుస్తున్నాను. అయితే యీ రెండు శాఖలూ తప్ప యితరశాఖలు యెందుకూ పనికిరానివికావు. వారిలోకూడా లోకోత్తరులైన పండితులు వుండేవారు.
(1) భాగవతుల హరిశాస్త్రుల్లుగారు (2) ఇంద్రగంటి విశ్వపతిశాస్త్రుల్లుగారు (3) కొవ్వూరు గోపాలశాస్త్రుల్లుగారు (4) శిష్టు కృష్ణమూర్తిగారు (5) ఆణివిళ్ల వేంకటశాస్త్రుల్లు గారు (6) నడివింటి మంగళేశ్వరశాస్త్రుల్లుగారు (7) పుల్లేదక్షిణామూర్తి శాస్త్రుల్లుగారు (8) ఇంద్రగంటి గోపాలశాస్త్రుల్లుగారు (9) మంత్రవాది లక్ష్మీనారాయణశాస్త్రుల్లుగారు.
ఈలా యేకరువు పెట్టవలసివస్తే వందలకొలదిగా పెరుగుతుంది. జాబితా గతించిన వికారివత్సరం చాలామంది పండితులను మాట దక్కించుకుంది గాని, లేని పక్షంలో యింకా యిప్పటిక్కూడా చాలామంది వుండేవారే. ఆ వికారి సంllరంలో సప్తగ్రహకూటం తటస్థించింది. అది దేశానికి అనేకవిధాల అరిష్టాపాదకమని మాపరమ గురువులు, కొవ్వూరులో శాంతికి వుపక్రమించి చాలా పనిచేశారు. వారు ఆ దీక్షలోనే పరమపదించారు
“కలిమానం బొక యైదువేలరుగ నేకత్రస్థ సప్తగ్రహ
మ్ములకున్ శాంతి యొనర్చుచున్ శ్రమలవమ్మున్ లేకయే బ్రహ్మముం
గలసెన్ బ్రహ్మగురూత్తముండు దశమీ కంజాప్తవారంబు నా
ద్య లసత్పక్షము కార్తికమ్మును వికార్యబ్దమ్మునుం గూడగన్"
జాబితాలో వుదహరించిన నామధేయాలన్నీ యితరశాఖల పండితులవే. వెల్నాటిశాఖ విస్తరించి వుండడంచేత వారిలో పండితసంఖ్య కూడా విస్తరించే వుండేది. యితరశాఖా సంఖ్యనుబట్టి పండితసంఖ్య యితరశాఖలలోనూ వుండేదన్నమాట. శాఖలన్నిటిలోనూ మా ఆరామ ద్రావిడశాఖ సంఖ్యలో చాలా తక్కువది. కవులూ, పండితులూ, యజ్ఞకర్తలు కూడా యీశాఖలో చాలా తక్కువేగాని, యజ్ఞకర్తలకూ ఋత్విక్కులకూ వుపకరించే గ్రంథం ఆణివిళ్ల అనేది కాకరపర్తి వాస్తవ్యులు ఆణివిళ్ల వేంకటసోమయాజులుగారు రచించడంచేత ఋత్విక్కులలో వారిపేరు యెఱుగని వారుండరు. యీ సోమయాజులుగారు, అప్పరాయ యశశ్చంద్రోదయం అనే అలంకార గ్రంథం కూడా రచించారు. యీయనకవిత్వం అగ్రహారాలు చాలా సంపాదించింది. ఆఖరు వయస్సులో పెద్దాపుర సంస్థానంవారు వీరికి అగ్రహారం యిస్తూవుండగా మంత్రి పాణంకిపల్లి రామచంద్రుడుగారు చెడగొట్టినట్టు చెప్పుకుంటారు. దానికి కారణం రామచంద్రుడుగారు సోమయాజులు గారిని విందుకు ఆహ్వానిస్తే యాజులుగారు అంగీకరించపోవడమే. సోమయాజులువారు యితరులు వండినది యేలాగూ తినరు. అందుకు దివానుగారికి కోపంరాలేదు. "అయ్యా! మీరు చేసుకునే స్వహస్తపాకం, మాగృహంలో, మాపదార్థంతో చేసుకుంటే మాకు సంతుష్టి. తద్ద్వారా మా పెద్దలు తరిస్తారు మేమూ తరిస్తాం” అని ప్రాధేయపడితేకూడా సోమయాజులుగారు, దానిలో యేం లోపంవస్తుందో వైదీకానికి? అందుకుకూడా వు, హు, ససేమిరా, అని ఛాందసంగా బిఱ్ఱబిగియడంచేత రామచంద్రుడు గారికి వొళ్లుమండి ఆయీ అపకారం చేసినట్లు చెప్పకుంటారు. కత్తిపోటుకన్నా కలంపోటు మిన్నగా పనిచేస్తుందన్నమాట వూరికే పుట్టలేదు. ఆయీమాటను ప్రస్తుతగాథ వ్యాఖ్యానిస్తుంది. సోమయాజులుగారు రాజుగారి మీద, కంకణబంధం కాబోలును రచిస్తే దానికి రాజుగారు సంతసించి మీకేంకావాలీ, కోరుకోవలసిందని అడిగారనిన్నీ దానిమీద సోమయాజులు గారు వారి గ్రామం కాకరపర్తికి అతిసమీపంలో వసిష్ఠానదికి తూర్పువొడ్డున వున్న గౌతమీవసిష్ఠా మధ్యస్థం నారికెలమిల్లి గ్రామాన్ని అగ్రహారంగా కోరారనిన్నీ రాజుగారు దివానుగారిని పిలిపించి దానపట్టా వ్రాయవలసిందనేటప్పటికి లోగడ జరిగిన విందుప్రసక్తి మనస్సులో వుండడంచేత మంత్రి రాజుగారితో- "అయ్యా నెలరోజులలో గొప్ప సూర్యగ్రహణం రానైవుంది, ఆ గ్రహణకాలంలో యీలాటి దానాలు యివ్వడం కోటి గుణితంగా యీలాటి పండితులే సెలవిస్తారు కనక అప్పుడు మనం అక్కడికి వెళ్లి ఆ వసిష్ఠలోనో, గౌతమిలోనో, స్నానంచేసి యీ దానంచేస్తే బాగుంటుందేమో? సోమయాజులు గారితో సంప్రతించవలసి"నదని కడు వినయవిధేయతలతో మనవి చేసేటప్పటికి, మంత్రిగారి మాట టక్కున టంకప్పొడిలాగ అతుక్కోవడంచేత “మహాబాగా వుందోయి రామచంద్రుడూ! నీ మాట” అని రాజుగారు సమ్మతించి అప్పటికి ఆ ప్రయత్నం విరమించారనిన్నీ పిమ్మట గ్రహణమైతే వచ్చింది, రాజుగారు స్నానానికి ఆ ప్రదేశానికి దయచేసి వెళ్లీవెళ్లడంతోనే సోమయాజులు గారినైతే ఆహ్వానించడానికి యెవరినో పంపడంమట్టుకు జరిగింది; కాని అప్పటికి చాలా వృద్ధాప్యంలోవున్న సోమయాజులుగారు స్వర్గంలో-రంభగారి లోగిట్లో వున్నట్లు తెలిసి అన్నా యెంతమోసం జరిగింది అని రాజుగారు విచారిస్తూ- “అన్నా! రామచంద్రుడూ? పాపం మూటకట్టుకున్నావు గదా;" అని మృదువుగా - మందలించా రనిన్నీ చెప్పకోగా వినడం. ఆ యా వేంకటసోమయాజులుంగారే కూచిమంచి జగ్గకవిగారి చంద్రరేఖావిలాపంలో చంద్రరేఖకి తండ్రిగా అపలపింపబడ్డవారు. జగ్గకవి వేంకట సోమయాజులు గారిముందు గడ్డిపోచగాకూడా మాఱదు. ఆయన వేదవేదాంగ పారంగతుడు. పైగా సంస్కృతంలో మహాకవి. జగ్గకవి తెలుగు కవిత్వానికి కావలసినంత సంస్కృత పాండిత్యం వున్నవాడు. వీరిద్దరున్నూ యేటికొప్పాక జమీందార్లవద్ద తారస పడడంలో యేదో వైరకారణం కలిగివుండాలి. “యాచకో యాచకశ్శత్రుః" జమీందార్ల వద్ద జగ్గకవికి తా ననుకున్న లాభం లభించకపోవడంమాత్రం సత్యం. దానికి సోమయాజులుగారు కారకులో కారోగాని, జగ్గకవిగారికి సోమయాజులుగారే కారకులనే నిశ్చయం కలిగినట్లు విలాపంవల్ల గోచరిస్తుంది. ఆ కాలంలో సంస్కృతపండితులు, యద్వా కవులు, తెలుగు కవులను తోటకూరలోని పరుగులమాదిరిని చూడడం మాత్రం అప్పుడేకాదు యిప్పుడుకూడా సంస్కృతపండితులకూ కవులకూ తెలుగుకవులంటే చాలా యీసడింపే! యిట్టి యీసడింపు సోమయాజులుగారు, జగ్గకవిగారిపట్ల కనపఱిచే వుంటారు. విలాపంలో కొన్ని వాక్యాలు యీ మర్మాన్ని వ్యాకరిస్తాయి.
(1) "పెద్దయేనుగుకాలంత... ... ఇట్టి సౌందర్యనిధి భువి బుట్ట జేసినట్టి తామరచూలి నేర్పఱయదరమె? చాల జదివిన వేంకటశాస్త్రికైన"
(2) "డాయను భీతిఁ బొంద మగడా?యను సొమ్ములుదాల్చు. డా? యను. ... వేంకటశాస్త్రి నేఁడు రాఁ డా? యను వానికేమి పుఱుడా? యను నేగతి దేవుఁడా యనున్”
ఆయీ వేంకటశాస్త్రిగారే వేంకటసోమయాజులుగారు. యీయన చేసిన యజ్ఞశాలలోనే రాజుగారు చంద్రరేఖతో మొదటి కన్నెర్కం జరిగించినట్లున్నూ, ఆ చంద్రరేఖ సోమయాజులుగారి సంతానమైనట్టున్నూ జగ్గకవిగారు కోపంకొద్దీ ఔచిత్యానౌచిత్యాలు పాటించక వ్రాస్తే వ్రాశారుగాక ఆ వ్రాతవల్ల సోమయాజులుగారికి లాభించింది. యెందుచేతనంటే, రాజుగారికి చంద్రరేఖ అనే వుంపుడుకత్తె వుంటే వుండుగాక, ఆమె వేంకటశాస్త్రిగారికి కూతురే అగుగాక, రాజుగారికి మిద్దెలూ, మేడలూ యెన్నో వుంటాయి గదా! అట్టిస్థితిలో యీ యజ్ఞశాలలోనేనా ప్రథమసమాగమభాగ్యం కావలసివచ్చింది? అనే విప్రతిపత్తి గోచరించి ఆయీ గాథయావత్తూ కాకపోయినా, సోమయాజులుగారి చుట్టరికం చంద్రరేఖ తల్లికి వుందనే టంతవరకేనా అసత్యమని తేలుతుంది.
చంద్రరేఖా విలాపంలో వున్న విషయం యావత్తూ కల్పితమేకాని రాజుగారికి చంద్రరేఖ వుంపుడుకత్తె అనే టంతవఱకు యథార్థం కాకపోదు. జగ్గకవి అఖండ శివపూజా ధురంధరుడైన తిమ్మకవిగారికి సాక్షాత్తూ సోదరుడు. అట్టి సద్వంశీయుడు యీ అనుచితానికి దిగడం శోచ్యంకాకపోదు. గాని, దానికి తగినంతకారణం లేకపోలేదు. రాజుగారు జగ్గకవిని నౌకర్లచే కొట్టించినట్లు వినికిడి. మొదట రచించినది చంద్రరేఖా విలాస మనిన్నీ వేంకటశాస్త్రిగారి యీసడింపుల వల్ల ఆ కృతికి సత్కారం జరగలేదనిన్నీ క్రమక్రమంగా ఆయీ వైషమ్యం యీ విధంగా పరిణమించిందనిన్నీ వినికి. యిందులో యేకొంతో సత్యంకాకపోదు. నేను ఆయీ రాజుగారి గ్రామం నేటికి 48 సంవత్సరాలనాడు వెళ్లి వున్నాను. రాజుగారి వంశీకులు నన్ను బాగా సత్కరించారు. మొదట రచించిన చంద్రరేఖావిలాసం యొక్కడేనా లభిస్తుందా? అని వారు ప్రశ్నించారు కూడాను. యింతకూ జగ్గకవిగారి కవితాధార చాలా ధారాళమయినదే కాని ఆయనకు నామరూపాలు కలిగించేది యే పుస్తకమూ లేదు.
(1) జగన్నాథమాహాత్మ్యం (2) సుభద్రాపరిణయం- యీ రెండూ సోమదేవ రాజీయంతో సహా మూడు అచ్చుపడ్డాయి. చాలాకాలంనాడు నేను చూచాను. యీ విలాపం ముందఱ అవి దివిటీముందు దీపాలు. "పాపకృత్యే౽పికీర్తిమ్" అన్న జాతకగ్రంథ శ్లోకానికి ఆయీ విలాపం ప్రథమోదాహరణం. కోపంమీద వ్రాసినవ్రాత కనక ఆవేశపూరితంగా నడిచింది. కొన్ని పద్యాలు చూస్తే ఆ కాలంలోకూడా, వైదిక నియోగ కక్షలు వున్నట్లు తెల్లమవుతుంది. కొంచెం యీయనకు భోగినీదండకం (పోతనామాత్యప్రణీతం) మార్గదర్శకంగా వుంటుంది గానిదానిలో ఔచిత్యం వుంది. దీనిలో అది బొత్తిగా లేదు. జగ్గకవిగారి తరవాత మళ్లా యీ శతాబ్దంలో యీలాటి ఔచిత్య దూరంగా వ్రాసేకవి కవిత్వం వుంది. అది రచనవల్లనే లోకానికి గోచరిస్తుంది కనక పేరు వివరించవలసి వుండదు. ఆ రచనకన్న జగ్గకవిది అనేక వేలరెట్లు నాణెంగావుంటుంది. యేదో ప్రసక్తాను ప్రసక్తంగా చాలాదూరం వచ్చాం. వేంకటకవిగారి స్వహస్తపాక నియమంతుదకు అగ్రహారాన్ని ముట్టకుండా చేసిందన్నది పరమార్థం. పనిలో పని శ్రీ కూచిమంచి గోపాలకృష్ణమ్మగారు యీ స్వయం పాకస్థులను యేవిధంగా సమ్మానించేవారో? దాన్నికూడా చదువరుల వినోదార్థం టూకీగా వివరించి ప్రధానగాథలోకి వస్తాను.
గోపాలకృష్ణమ్మగారు చిన్న జమీందార్లని వినికి. బహుశః కోన సీమప్రాంతం పలివెల వీరి నివాసమై వుండాలి. వేదవేత్తలు, శాస్త్రకోవిదులు,కవులు వారి దర్శనానికి రావడంలో ఆశ్చర్యం వుండదు. వీరిలో కొందఱు ఆహితాగ్నులు వుండకపోరు. వారిని ముందుగా గోపాలక్రిష్ణమ్మగారు యీ విధంగా హెచ్చరించేవారట. అయ్యా తాము మాపంక్తిని భోంచేయరు కాబోలును. స్వయంపాకానికి యేర్పాటు చేయవలసిందంటారా? అనేటప్పటికి చిత్తం అలాగే అని యీ ఆహితాగ్నులు సవినయంగా తలవూపే వారనిన్నీ తరువాత వారికి కావలసింది తవ్వెడో మానెడో బియ్యమూ, దానికి సరిపడ్డ పప్పూ, ఉప్పూ వగైరా అయినా పంపడం మాత్రం యే పాతిక ముఫ్పైమందికో సరిపడ్డంత పంపేవారనిన్నీ అది చూచి వారు “అయ్యా యింతపదార్థం అవసరం ఉండదు” అని త్రిప్పివేయబోతూ వుండగా కిష్టమ్మగారు "అయ్యా, మీ స్వయంపాకంలోనే యీవేళ మేంకూడా భోంచేసి పునీతులం కావడానికి మాకు అభ్యనుజ్ఞ నిప్పించాలని అతి వినయంగా (అతి వినయం ధూర్తలక్షణం) కోరేవారనిన్నీ దానికి యీ ఛాందసులు యేమీ ప్రతి చెప్పలేక, ఆహితాగ్నులు వంట బ్రాహ్మలుగా మారి భోజనానంతరం వారిచ్చే సంభావన పుచ్చుకొని జమీందారు గారి యుక్తికి ఆశ్చర్యపడుచూ వెళ్లేవారనిన్నీ చెప్పుకుంటారు. ఆయీ సంగతి యెన్నాళ్లనాటిదో కాదు గాని నాపుట్టుకకు కొంచెం పూర్వపుదై వుంటుంది. కనక యెనభైయేళ్లనాటిదై వుంటుంది. అయితే గోపాల క్రిష్ణమ్మగారు యీ విధంగా వీరిని సమ్మానమనే పేరుతో అవమానించడం యెందుకు? అనే శంక ప్రతివారికి ఉత్థితాకాంక్షగా కలుగుతుంది. ఆయన తాత్పర్యం యిది : ఆహితాగ్నులకు తగిన శుచిశుభ్రాలు లేని చోట, స్వహస్తపాకం చేసుకుంటారు సరే, మా యింట్లో యే విధమైన ఆచారలోపమూ లేదుగదా? వీరికీ తెగనీలుగెందుకు? కనక వీరికిది ప్రాయశ్చిత్తంగా పరిణమించుగాక! అని కావచ్చును. యేమేనా కిష్టమ్మగారి ఆతిధేయత్వం అభినందనీయంగాదు. దీనికి "వీరభద్రపళ్యానికి హనుమత్పళ్లెం"గా బులుసు వెంకట సోమయాజులుగారు వొకయుక్తిచేసి మృదువుగా మందలించినట్లు విన్నాను. -
యెప్పుడో దైవికంగానో, లేక ప్రత్యేకించి పనిగట్టుకొని యిందుకోసమో, వెంకప్ప సోమయాజులుగారు దయచేసేటప్పటికి యథాపూర్వంగానే సామగ్రి వెళ్లేటప్పటికి స్వయంపాకం యేలాచేస్తే ప్రస్తుతానికి అనుకూలమో, ఆలాగు "పచా మ్యన్నం చతుర్విధం"గా తయారుచేసి యింత పచ్చిపులుసుమాత్రం చేసి, కూరలు వారు పంపినా వాట్లజోలికి పోక దేవతార్చన ముగించి “అయ్యా! అభ్యవహారానికి దయచేయండి" అని జమీందారు గారిని ఆహ్వానించేటప్పటికి వారు దయచేశారు. సోమయాజులుగారు విస్తళ్లలో పదార్థం వడ్డించారు: అది సరిగా వుడకలేదు సరికదా, పైగా దాన్నిండా మసిబొగ్గులూ, మట్టిబెడ్డలూ వగైరాలతో యేలా వుండాలో, చెప్పేదేమిటి? ఆలావుండేటప్పటికి జమీందారుగారు తెల్లబోయి "యేమి?? సోమయాజులుగారూ యీలా వుంది? పొయి మండిందిగాదా? అయ్యో పాపం యీవేళ దీన్ని యేలా భోంచేస్తారు" అంటూ నిజమైన విచారం తోటే వుపచారవాక్యాలు పలికేటప్పటికి సోమయాజులుగారు యెఱిగుండిచేసిన కొంటెతనమేకనక నిర్వికారచిత్తంతో సగౌరవంగా సంబోధించి- "కాలే కడుపుకి మండేబూడిది" యిది మాకు నిత్యమూ జీతపాటే. యెప్పడోగాని మాకు యీ స్వహస్తపాకము తప్పదు. సుకుమారముగా వుండే మీరు కూడా నేడు యీ “తదన్నంతద్రసం" లోకి రావడమూ, మాకష్టసుఖాలు తెలుసుకోవడమూ వచ్చింది కదా? అని లజ్జిస్తున్నా ననేటప్పటికి జమీందారుగారు తాము చేసినపనికి చాలా పశ్చాత్తపించి యీలాటి మహర్షులపట్ల యేలావుండాలో యెఱిగివుండిన్నీ అపచారం చేశాంగదా? అని నొచ్చుకొని, క్షమాపణచెప్పి వారి ఆశీర్వచనాన్ని పొందినట్లు చెప్పగా వినడం. యిందులో యేకొంచెమో. యిటీవలి వారికల్పనైతే కావచ్చుగాని యావత్తూ కల్పనకాదు. యీ గోపాలకిష్టమ్మగారికి పండితులతోటీ కవులతోటీ యొక్కువ పరిచయం వున్నట్టు ఆయీ స్వయంపాకగాథే కాదు, ఖలకర్ణ విషాయణం అనే ప్రబంధంకూడా సాక్ష్యమిస్తుంది. యీ పుస్తకం పేరు వినడమేకాని దీన్ని చూడలేదు. పన్నాల రామబ్రహ్మ శాస్త్రుల్లుగారు ఆయీ ప్రబంధం రచించారని మా విద్యార్థిదశలో వినికిడి. కవికర్ణ రసాయనాన్ని పట్టి యీ పేరు పుట్టి వుంటుంది. యిది గోపాలకృష్ణమ్మగారిని దూషించేదిగా వుంటుందని పేరువల్ల గోచరిస్తూవుంది. కవికీ యీయనకీ యేదో కలహకారణం కలిగి వుండాలి.
అసలు తోవలోనుంచి వ్యాసం మఱోతోవలోకి వచ్చి చాలా సేపయింది. శ్రీనాథమహాకవి “పాకనాటింటివాడవు" అన్నాడుగదా! వీరు నియ్యోగులా? వైదికులా? అని ప్రశ్నించుకుంటే, ఆ పుస్తకంలోనే- "కమలనాభామాత్య చూడామణి" అని తనతాత గారికి వేసిన అమాత్య బిరుదం సంశయాన్ని తీర్చివేస్తుంది. ఆ యీ పాకనాటివారికి ప్రాఙ్నౌటు వారనే నామాంతరం కూడా శ్రుత మవుతూ వుంది. వీరు నెల్లూరుమండలంలో కొంత విస్తరించి వున్నట్లు నావూహ. ఆఱువేల వారికంటే వీరిశాఖ చాలా తక్కువ సంఖ్య గలదే. వీరికీ వారికీ యిచ్చి పుచ్చుకోవడాలు యీనాడే కాదు, ఆ నాడూ వున్నాయను కుంటాను. కంకంటి పాపరాజుగారు “విద్యావినోదు లార్వేలవారు" అంటూ వొక సీసపద్యం చక్కనిది వ్రాసి శాఖాసౌభాగ్యాన్ని వ్యాకరించి వున్నారు. (యీ పద్యం ఉత్తర రామాయణంలో చూ.) శ్రీనాథుడు తనశాఖనుగూర్చి వ్రాస్తే బాగుండేది. కాని వ్రాసినట్టులేదు. మేమైతే “తురగవిద్యా ధురంధరత గోటలనైన దాటనేర్తురు పాకనాటివారు” అంటూ వొకసీసం రచించాంగాని ఆపాక నాటివారు (ఆయీ పద్యం శ్రీనివాసవిలాసంలో చూ.) గద్వాల, ఆత్మకూరు, ఆయీ సంస్థానాధిపతులైన రెడ్డిరాజులుగాని బ్రాహ్మణులుగారు. నా బాల్యగురువులు- వెల్నాటివారు అని వొక సీసం స్వశాఖా సౌభాగ్యాన్ని గూర్చి వ్రాసి వున్నారు. అది శ్రీకృష్ణభారతంలో వుంది. యిక్కడికి “ఆంధ్రద్రవిడ" అన్న శ్లోకంలో వున్న ఆంధ్రావాంతర భేదాలు తెలిసినంతలో వివరించినట్లయింది.
ద్రావిళ్లలో పుదూరు ద్రావిళ్లూ పుట్టగుంట ద్రావిళ్లు అనే వారిని పేర్కోలేదు, గాని తక్కినవారిని గూర్చి తెలుగుదేశంలో వుండేవారిని పేర్కొన్నట్లే, యీ పుదూరు, పుట్టగుంట వారు నెల్లూరుప్రాంతంలో వున్నారు. చెన్నపురిలోనూ కనబడతారు. (1) వావిళ్లవారు, (2) చదలు వాడవారు, (3) వేదంవారు యీ మొదలైన సుప్రసిద్దులు ఆయీద్రావిళ్లే, ఆయీ శాఖకు చెందినవిద్యార్థి - వేదం వేంకటేశ్వరశాస్త్రి నావద్ద కొన్నాళ్లు చదువుకున్నాడు. చెన్నపురిలో తన బంధువులు కొందఱితో నన్ను చూడడానికి వచ్చినపుడు సయితము విభూతిధారిగానే కనపడ్డాడు గాని, బంధువులు తిరుమణి తిరుచూర్ణ ధారులుగా వున్నారు. అప్పుడు ప్రశ్నించలేదుగాని తరవాత అతణ్ణి యీవిషయమై ప్రశ్నించాను.
“యీ ప్రాంతంలో మాశాఖీయులు కొందఱు యీ విధంగా వుండడం ఆచార మన్నాడు. కీ.శే. వేదం వేంకటరాయశాస్త్రుల్లుగారు వగైరా మహామహులేకాదు, లోకైక ప్రసిద్దులు అల్లాడివారు లోనైనవారుకూడా యీ శాఖవారే అని విన్నాను.
తుని మొదలుకొని బరహంపురందాకా దెవిలిద్రావిళ్లు అనే శాఖవుంది. వీరు పేరూరిద్రావిళ్లేకాని అన్యుಲು కారు. రజస్వలా వివాహం చేయడంవల్ల స్వశాఖనుండి విడిపోవలసి వచ్చిందని వినికిడి. ఆలాటి వివాహంయొందుకు చేశారో అన్యత్ర వ్యాఖ్యానించాను.
తూర్పున - పుట్టనంబులు అంటూ గంజాం డి. ప్రాంతంలో వొక శాఖ వుందనిన్నీ వారు చెప్పకోవడం - ఆరామద్రావిళ్లుగా చెప్పుకుంటారు గాని ఆరామద్రావిళ్లు కారనిన్నీ మా శాఖీయులు తూర్పుదేశీయులు చెప్పగా విన్నాను. యెంతవఱకు సత్యమో కాని వీరు కోళ్లను పెంచుతారని యెవరో చెప్పగా విన్నాను.
వీరిలోకూడా మంచి విద్వాంసులున్నారు. వెల్నాటివారో లేక పేరూరిద్రావిళ్లో వీరికన్యను వివాహంచేసుకున్నారని విన్నాను. కాని ఆ వివాహం సంఘసంస్కర్తలకు సంబంధించింది, (పునర్వివాహం) కావడంచేత తావన్మాత్రంవల్ల ఆశాఖకీ యీ శాఖకీ బాంధవ్యం నిరాఘాటమనడానికి వీలు కాదు, కుక్కుటములూ, పిల్లులూ, కుక్కలూ యీ మూడింటి పెంపకమూ
"శ్వాన కుక్కుట మార్జాల పోషకస్యదినత్రయమ్
ఇహ జన్మని శూద్రత్వం చండాలఃకోటిజన్మసు".
అనే ధర్మవచనాన్ని పట్టి నిషిద్ధమే అయినా, కోళ్లను పెంచడం బ్రాహ్మలకు యెక్కువ దురాచారంగా పాటిస్తున్నారు, పిల్లులు బాహాటంగా యింట్లోమనుషులతోపాటు యెంతటి శిష్టుల గృహాలైనాసరే గాలితోపాటు తిరుగుతూనే వుంటాయి. మడి గట్టుకొన్నప్పడుకూడా వాట్లను ముట్టుకోవడం దుర్వారమే. అవి పదార్థాలను ముట్టుకుంటూనే వుంటాయి. బంగాళీల యిండ్లలో వీటికి మఱీ చనువు. వారు మత్స్య భుక్కులు గనక మత్స్యశేషాలు వారికి పనికిరానిబాపతు వీట్లకు వుపయోగపడుతూ వుంటాయి. వారు కోళ్లను పెంచుతారని వినలేదు. బంగాళీలు తమ పిల్లలతోపాటుగా పిల్లులను ప్రేమించి వాట్లకు తమసిరి ననుసరించి ఆభరణాలుకూడా అలంకరిస్తారని వినడం. కుక్కలను శిష్టులు పెంచరుగాని బాగా నాగరీకం ముదిరిన బ్రహ్మబంధువులు పెంచుతూనే వున్నారు. వీరేనా కోళ్లను పెంచరు, మొత్తం త్వరలో శూద్రత్వం సంపాదించుకోవాలంటే యీ యిండియన్ గడియారాలని పెంచడమే మంచి వుపాయం. ప్రస్తుతకాలంలో నాన్ బ్రామిన్సుతనం నౌకరీ సంపాదనకు సాధనం గనక బ్రాహ్మలు దీన్ని అవలంబిస్తే పై అధికార్లు గౌరవిస్తారేమో? బ్రాహ్మలు యెందఱో పాపం! యీ దిక్కుమాలినకులంలో యెందుకు పుట్టవలసి వచ్చిందో అని విచారించేవారున్నారు. పూర్వం దేనికి దేనికి గౌరవమో, యిప్పుడు దానికి దానికి అది లేదు. వెధవ పొట్టకోసం యెంతటి అనౌచిత్యానికైనా సరే సర్వులూ ఆలాయపడే కాలందాపరించింది. శాంతం పాపం! ప్రకృతమనుసరామః. కోళ్లను పెంచడంవల్ల బ్రాహ్మణ్యానికి వచ్చే హాని యెక్కువది అని తేలింది. శాస్త్రం కంటె కొన్ని విషయాలలో ఆచారం ప్రబలంగా కనపడుతుంది.
“తాల హింతాల ఖర్జూర నారికేళ మధుద్రుమాః
ఏషాం ఫలాని భోజ్యాని న మద్యంతు కదాచన."
అని వొకాయన చదివి తాటిముంజలు తినడానికి అభ్యంతరం లేదన్నారు. శ్లోకం యాజ్ఞవల్క్యస్కృతిలోని దన్నారు. దేవతా నివేదనకు కొబ్బరికాయ, ఖర్జూరం, యిప్పపువ్వు, యివి వాడినట్లు తాటిపండుగాని, యీతపళ్లుగాని వాడరు. కొబ్బరికాయనీళ్లు శివునికి అభిషేకం చేస్తారు. తాగుతారు కాని కొబ్బరికల్లు నిషిద్ధమే. యీలా విచారణ చేసినకొద్దీ శాస్తానికీ, ఆచారానికీ వున్న తేడాపాడాలు కనపడతాయి. కోళ్లని పెంచడంచేత పుట్టనంబులకూ, మాఆరామద్రావిడానికీ బాంధవ్యం లేకపోయిందనే (యీకుక్కుటపోషణ కల్పితమో, యథార్ధమో విచారించాలి.) ప్రసక్తిలో యితర విషయం కొంత నడిచింది. ఆయీ నంబులుకూడా ఆంధ్రభ్రాహ్మణ జాతీయులే.
యిక శివార్చకులూ, వైఖానసులూ ఆయీ రెండుశాఖలవారూకూడా ఆంధ్రులలో అంతర్భవించే బ్రాహ్మణులే. ఒకరికి ఆగమం ప్రమాణం; వేరొకరికి ప్రత్యేకించి సూత్రములు (ఆపస్తంబాదికం కాక వుంది. దానికి కర్త-విఖనోఋషి) యీ యిరుతెగలవారూ విగ్రహారాధనకు ప్రధానులు. సగుణోపాసకులు. విష్ణువు నారాధించడమూ, తిరుమణి తిరుచూర్ణ ధారణమూ యివి రెండున్నూ శ్రీ వైష్ణవులతోపాటే వైఖానసులకి; తక్కిన సందర్భాలలో కలవదు- "యెవరికి వారే యమునాతీరే" వీరికి కంచప్పొత్తుకుగాని, మంచపొత్తుకుగాని స్వశాఖేగాని అనుకూలించేది మఱొకటిలేదు. వీరుతప్త చక్రాంకణం అంగీకరించరు. గర్భస్థశిశువుకు చూలాలిగర్భంమీద తిరుమణితో ఆయీ సంస్కారం కొందఱు శిష్టులు నెఱవేర్చడం కలదు. వీరు గర్భవైష్ణవులని శ్రీనివాసస్మృతిలో వుంది. అహమేవ గురుస్తేషాం గర్బవైష్ణవ జన్మనామ్ - శివార్చకులు శివభక్తులే కాని లింగధారణం అంగీకరించరు. ఆదిశైవులమంటారు. అంటే ఆరాధ్యశైవులకంటే ప్రాచీనులైన శైవులన్న మాట. వైఖానసుల వైష్ణవంకూడా వీరి శైవంవంటిదే కాని, ఆదిపదంచేర్చి వారు వ్యవహరించుకోవడంలేదు. వీరికి పొత్తు స్వశాఖీయులతో మాత్రమే. దక్షిణదేశంలో అందులోనూ - చిదంబర క్షేత్రంలో వీరిశాఖ విస్తరించి వుండడమే కాకుండా, వుడ్డూలమైన పండితులుకూడా వున్నట్టు వినికిడి. వీరిని దీక్షితులంటారనిన్నీ వీరి వర్తన ఆపేరుకు తగినట్టుగా వుంటుందనీ చెప్పగావిన్నాను. యీదేశంలోకూడా వీరిలో ఆగమాలు తెలిసిన పండితులు కొందఱువున్నారు. యిక్కడ ఆంధ్రదేశస్థులలో ఉండే అవాంతర బ్రాహ్మణులను గూర్చి సంగ్రహంగా తెల్పినట్లయింది.
సత్యాషాఢశాఖీయులు మిక్కిలి విరళంగా తెలుగుదేశంలో యేలూరుప్రాంతంలో కనపడతారు. అసలు వీరు యేడుగోత్రాలు మాత్రమే వుండేవారనిన్నీ యిటీవల రెండు గోత్రాలవారు నిస్సంతవడంచేత నేడు అయిదుగోత్రాలవారే వున్నారనిన్నీ ఆకారణంచేత వివాహాదులు కష్టసాధ్యం కావలసివచ్చిందనిన్నీ ఆచిక్కు తొలగడానికి తెలగాణ్యశాఖవారిని కోరితేవారు వీరిని కలుపుకొన్నారనిన్నీ వినికిడి మాత్రమేకాదు. నేను స్వయంగా ఆయీ శాఖాద్వితయానికి జరిగిన వివాహం కీ||శే||లు కలువలపల్లి రంగనాథశాస్త్రుల్లుగారింట చూచి వున్నాను. ఆయీ శాఖలో యితర శాఖలో యొక్కడోగాని లేని - 'సప్తార్షేయప్రవరులు' - కూడా వున్నారు. మాలో తి||శాIIకి బాల్యగురువులు కీ||శే||లు శ్రీబూర్ల సుబ్బారాయుడుగారు యీశాఖీయులే. నాశిష్యవర్గంలో ప్రధానులలో వొకడుగా గణింపదగిన చి||మంచావజ్ఝల సీతారామశాస్త్రి యీసత్యాషాఢ శాఖీయుడేకాని, ఇతడు జన్మతః తెలగాణ్యుడై సత్యాషాఢ శాఖవారికి దత్తుడయినాడు. భవతు.
యికనల్లా వెల్నాటిపూజార్లు తప్ప అవాంతర బ్రాహ్మణశాఖలన్నీ అంతో యింతో . (ఆంధ్రదేశంలోని) వ్యాకరించినట్లయింది. యేరాజుల కాలంలోనో యేడుగోత్రాలవారు - వెల్నాట్లు శివార్చన చేయడానికి అంగీకరించి కేటాయింపబడడంచేత తక్కినశాఖవారు , వారితో యౌనసంబంధం మానుకొన్నట్లు కనబడుతుంది. భోజన ప్రతిభోజనాలు (శిష్టులకువినా) యితరశాఖలతో జరుగుతూనేఉన్నాయి. భగవంతుణ్ణి పూజించడం పరమోత్కృష్టమైన కార్యమే అయినా అది ప్రతిఫలశూన్యంగా వుండాలి కాని, అన్యథాగా అయితే దానికి గౌరవం లేకపోవడమేకాక, దేవలకత్వాన్ని సంఘటిస్తుందనిన్నీ ఆ దేవలకత్వం పాంక్తేయత్వానికి భంజకమనిన్నీ ధర్మశాస్త్రకర్తలు ఋషిపుంగవులు నిర్వచించి వున్నారు.
యిక నల్లామిగిలినవారు ఆంధ్రదేశీయులలో (1) విశ్వబ్రాహ్మలు (2) దేవ బ్రాహ్మలు, (3) కళింగబ్రాహ్మలు - యీ మూడు తెగలవారూ కనపడతారు. వీరిలో నెంబరు వన్‌వారు కృష్ణా, గోదావరి, గుంటూరు, మండలవాస్తవ్యులు. యావన్మందీ ఆహార విషయంలోనూ సదాచార సంపత్తిలోనూ బ్రాహ్మణులతోపాటుగానే వుంటారు. వారిలో వారికే యెన్నో సందర్భాలు కుదిరితేగాని పంక్తిభోజనాలు సందర్భించనప్పుడు యితరులతో సందర్భించవని వ్రాయవలసి యుండదు. రెండో నెంబరు వారిలో యెవరోతప్ప తక్కినవారు మత్స్యభుక్కులే కాక మాంసభుక్కులు కూడా అని చెప్పగావినడం. మూడోనెంబరువారు తూర్పున సికాకుళం ప్రాంతంలోవున్నారు. వీరి బ్రాహ్మణ్యాన్ని గురించి మనకు బాగా తెలియదు, వోఢ్ర బ్రాహ్మణ్యానికి సంబంధించి వీరి ఆచారాలు వుంటాయని తోస్తుంది. యిక్కడికి, శ్లోకములో వున్న వొకటి రెండు నెంబర్లను గూర్చి యే కొంచెమో వ్యాకరించినట్లుయింది.
యిక కర్ణాటకులను గూర్చి వ్రాయాలి. వీరందఱూ ద్వైతమతస్టులు. మాధ్వులని వీరికి నామాంతరం. వీరిలోనూ వైదీకులున్నారు. వారు ఆచార్యపదంతో వ్యవహరించ బడతారు. లౌకికులు పంతులు పదంతో వ్యవహరింపబడతారు. బ్రాహ్మణజాతిలో మొట్టమొదట లౌకికోద్యోగాలలో ప్రవేశించినవారు వీరే. వ్యాపారులు అనేపేరు వీరికి ఆకారణంచేతనే వచ్చి వుంటుంది. వీరికి అద్వైతులంటే చాలాద్వేషం. అది మతవిషయం లోనే. యితరత్ర వారూ వీరూ మమేకంగానే వుంటారు. చాలా భాగం లౌకికులే కావడంచేత యేమాత్రం వైదికవిద్యాప్రవేశం వున్నా ఆ వ్యక్తికి వీరిచ్చే గౌరవం అపారం.
"అబ్రవీ త్పురాణగాథ" వీరు పూజించే స్వశాఖాపండితులను గూర్చి ప్రతిపక్షులైన స్మార్తపండితులు కల్పించిందే. వీరిలో యితర శాస్త్రాలకన్నా తర్కశాస్త్రం చదివిన విద్వాంసు లధికంగా వుంటారు. వీరి వేదాంతం చాలా భాగం ఆశాస్త్రాన్ని పురస్కరించుకొని వుంటుంది. జగత్ర్పసిద్దులగు భీమాచార్ల్యులవారు ఈ శాఖీయులే.
వీరిలో అవాంతరభేదాలు నాకు బాగా తెలియవుగాని లోకైకప్రసిద్ధతార్కికులు కీ||శే||లు శ్రీకర్ణాట సీతారామశాస్త్రుల్లుగారుకూడా యీ శాఖలో అవాంతరీయులే కావాలి. వీరిలో స్మార్తులలో మాదిరిగా గ్రామపురోహితులు లోనైనవారు లేకపోలేదుగాని బాహుళ్యంమీద లౌకికులే హెచ్చు. పంతుల పఠాణీవేషాలు అనే పాత్రద్వయంలో వున్నపంతులు యీశాఖవారే. బ్రాహ్మణులు నాగరీకం ముదిరితే వుండే విశేషాలు ఆవేషాలవల్ల సులువుగా బోధపడతాయి. హాస్యాన్ని నికృష్టంగా చూస్తారు. గాని, నీతిని బోధించడానికి నవరసాలలో దాన్ని పోలిన రసం లేనేలేదంటాను నన్నడిగితే. వీరికి మాధ్వనామం మతగురువునుబట్టి వచ్చినదని తెల్విడి.
యికవైష్ణవులనుగూర్చి తప్ప తక్కిన మన దేశపు బ్రాహ్మణశాఖలని గూర్చి వ్రాసినట్లయింది. వీరిలో అవాంతరభేదాలు చాలావున్నాయి. అవన్నీ వివరించవలసివస్తే చాలా గ్రంథం పెరుగుతుంది. ముఖ్యంగా రెండు భేదాలు అందఱికీ తెలిసినవున్నాయి. (1) తెళహ, (2) వళహ - అని రెండు తెగలుగా విభజిస్తేచాలు. మతవిషయంలో అనగా ముక్తివిషయంలో కూడా యీ రెండు తెగలవారికీ భేదం సరేసరి, బొట్టులోకూడా యత్కించి ద్భేదం వుంది, ఆయీ భేదం చాలా ఆయువుపట్టు. వళహలు పాదం లేని బొట్టు ధరిస్తారు. తెళహలు పాదంతో ధరిస్తారు. పాదం అంటే కనుబొమ్మలమధ్యను దాటి ముక్కుమీదికి రావడం. కాంచిలో ఆయీ రెండు తెగలవారూ కూడా వున్నారు. వరదరాజ స్వామినికూడా ఆయీ భేదానికి గుఱిచేస్తూ వుంటారని వినడం. అంతేకాదు యీ నామం కోర్టులదాకా వెళ్లించడం కూడా చేస్తుందిట. వీరిలో వీరికి దక్షిణాదిని యిచ్చిపుచ్చుకోవడం వుంది. కాని అల్లుడిబొట్టు అల్లుడిదే మామగారి బొట్టు మామగారిదే నేడు కమ్యూనిష్టులూ, కాంగ్రెసువారూ యేలాగో, వీరూ వారూ ఆలాగే గమ్యస్థానం వొకటే అయినా సికపట్లకు లోనవుతూ వుంటారు. వళహవారు వేదానికి స్మార్తులిచ్చినంత గౌరవాన్నీ యిస్తారు. అనగా యజ్ఞయాగాదులు పిష్టపశువుతో కాకుండా ప్రత్యక్షపశువుతోటే చేస్తారు. గత భర్తృకలైన స్త్రీలకు, శిరోముండనం ఉంది. తెళహవారికి యీ రెండూ లేవు. యజ్ఞమంటూ యెవరూచేసినట్లు లేదు. కేవల భక్తికే ప్రాధాన్యం యిస్తారు. మతకర్తయూ, భాష్యకర్తయూ అయిన శ్రీరామానుజులవారు తెళహలే అని వీరు చెపుతారు. వారు వళహవారే అని వారంటారు. రామానుజులతరువాత మళ్లా రామానుజులంతో అంతకెక్కువో అని వారే కాక యితరమతస్థులుకూడా విశ్వసించదగిన వేదాంతదేశికులు వళహలే. మహాకవీ యాగకర్తా అయిన వేంకటాధ్వరి వళహే. తెళహలు ద్రావిడ వేదానికిచ్చినంత గౌరవం ఋగ్యజురాది వేదాల కివ్వరు. వళహలు యించుమించు ఋగ్యజురాదులవిషయంలో స్మార్తులే కాని ద్రావిడవేదాన్ని కూడా గౌరవిస్తారు. ద్వైతులకు కన్నడం రాకపోవడం గౌరవభంజకమైనట్లే వీరికి అఱవం రాకపోవడంకూడా డిటో, వీథిలో దేశభాష మాట్లాడినా యింట్లో లేదా వంటయింట్లోనేనా అఱవం మాట్లాడేవారు చాలా ప్రశస్తమైనవారుగా అంగీకరింపబడతారు. దీనిక్కారణం భగవత్కాలక్షేపానికి వుపయోగపడే తాత్త్వికగ్రంథం (ఉపనిషత్సారం) యావత్తూ ఆళ్వారులు అఱవంలో అనువదించడమే. యెన్నివేదాలువచ్చినా నాలుగు పాశురాలేనా రాకపోతే ఆ వ్యక్తికి, గౌరవం లేదన్నమాటే. వేదం వచ్చినవారు వళహలలో నూటికొకరేనా ఉంటారుగాని తెళహలలో వుంటారో లేదో? పుస్తకాపేక్షే దివ్యదేశాలలో చాలా నికృష్టంగా చూస్తారు. వీరు కూడా వారిని అదేవిధంగా చూడాలను కొన్నావారు వీరికి చిక్కరు. వారు శివాలయంలోకి యెన్నడూ రానేరారని వ్రాయనక్కఱలేదు. మానవులందఱినీ తరింపజేయడానికి అవతరించినట్లు విశ్వసించడానికి శిష్యసంచారమే సాక్ష్యమిస్తుంది గాని, అది నానాటికి యేదో విధంగా పరిణమించి ప్రకృతం కొనవూపిరితో కూడా వుందనడానికి ధైర్యంలేదు. అద్వైతులకన్నా ద్వైతులకన్నా వీరు నిమ్నజాతులకు తరణోపాయం చూపడంలో వుదారులు. ఆళ్వారులలో కొందఱు అంత్యజలేవున్నారు. వీరిలో యతీశ్వరులున్నారు. (రామానుజులవారు యతిరాజులే కదా? కాని, అద్వైతసన్న్యాసానికీ, వీరి సన్న్యాసానికీ యేతాంపెట్టుగా వుంటుంది. యితరమతస్థులు (స్మార్తులు వగైరా) చట్టన పాశ్చాత్యనాగరికతకు లొంగి మాఱినా, వీరుమాత్రం మతచిహ్నలింకా పరిత్యజించలేదనేది చాలా అభినందనీయం. క్రాఫింగువగైరాలు వీరిలో నూటికి 99 మందికి లేవనే చెప్పవచ్చు. పాండిత్యాన్ని వేషంచేత భూషించడం వీరికి తెలిసినట్లు యితరులకు తెలియనే తెలియదు. యితరులలో పాండిత్యం హెచ్చిన కొద్దీ వేషం తగ్గుతూంది వీరిలో వేషమూ హెచ్చుతుంది.
శ్రీమాన్ పరవస్తు రంగాచార్యులయ్యవార్లంగారు విజయనగర సంస్థానానికి ఆయీ కారణం చేతనే వెళ్లలేదని మా పరమగురువులవల్ల విన్నాను. కొంచెం వివరిస్తాను: అయ్యవార్లంగారు కోటలోకి సవారీమీద వెళ్లడమూ, ద్వారం దాటిన పిమ్మట సవారీ దిగి పావుకోళ్ళతో సభాస్థానందాకా వెళ్లడమూ సభలో వారి స్వంత చిత్రాసనంమీద కూర్చుండడం ఆచారం. మహారాజావారు సవారీ మర్యాదకు అంగీకరించారుగాని తక్కిన దానికి అంగీకరించలేదు. కారణం యేమిటంటే: అది వారి ఆస్థానపండితులకు అవమానకర మన్నారు. ఆలాగయితే మీ సంస్థానానికి మేము రానే రామన్నారు (తృణీకృత బ్రహ్మపురందరులు) ఆచార్లుగారు. మహారాజా వారు మీ చిత్తం అని వూరుకున్నారు. యివన్నీ యిప్పటివారికి యేదో విధంగా కనపడతాయి. యించుమించుకు తత్త్వాలకు సంబంధించిన మర్యాదలవంటివే యివి. యిప్పడు దొడ్డితుడిచే వ్యక్తికికూడా గారు పదం చివరతగులుస్తూ వున్నాం. ఆలా తగల్చకపోతేనో? "డిఫర్‌మేషన్" దాఖలయిందన్నమాటే.
యేదో స్వల్పంగా వ్రాయడానికి ఆరంభించి అవాంతరసందర్భాలవల్ల కొంత పెరిగి పెద్దదయింది. యెన్నో సంగతి సందర్భాలు యింకా వ్రాయవలసినవి వున్నాయిగాని వోపిక లేక యింతతో ముగిస్తున్నాను.
★ ★ ★