కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/పుక్కిట పురాణ కథలు
పుక్కిటి పురాణ కథలు
ఈపుక్కిటి పురాణాలను గుఱించి కొంత వ్రాస్తాను. యివి వినేవాళ్ల కెంతో ఆహ్లాదకరంగానైతే కనపడతాయి గాని వీట్లలో సత్యంమాత్రం సున్నకి సున్న హళ్లికి హళ్లీగా వుంటుంది. కొన్ని మనలో యీలాటి కథలు లేకపోలేదు, గాని అన్నీ ఈలాటివిమాత్రం కావు. తెనాలి రామలింగానికిన్నీ పెద్దన్నగారికిన్నీ భట్టుమూర్తిగారికిన్నీ ముక్కుతిమ్మన్నగారికిన్నీ సంబంధించిన కథ లెన్నో వున్నాయి. ఆ కథలు, వీరంతా వొకటే కాలంలో వున్నారంటేనేకాని నిలిచేటట్టులేదు. యితరాధారాలని పుచ్చుకుని వీరు సమకాలికులే కారంటూ వీరేశలింగం పంతులవారు సిద్ధాంతీకరించి యీ కవిసంఘానికి సంబంధించిన కథ లన్నిటినీ తోసేశారు. వీరేశలింగం గారు పైసిద్దాంతాన్ని బయలుదేఱదీసే దాఁకా పైకథలన్నీ అమల్లోనేవున్నాయి, యిప్పుడున్నూ వున్నట్టే గురజాడ శ్రీరామమూర్తి గారు ఆ కథలన్నిటినీ విశ్వసిస్తూనే కవిజీవితాలు వ్రాసివున్నారు. రాయలకాలపు కవులకు సంబంధించిన గాథలకే కాదు యీ దురవస్థ భోజరాజ కాళిదాసులకు సంబంధించిన గాథలకున్నూ పట్టింది. భోజకాళిదాసులిద్దఱేకాక, దండి భవభూతులే కాక, బాణుఁడు కూడా ఒకటేకాలంవారన్నట్టు యితిహాసాలెన్నోవున్నాయి. ఇటీవల వారి వారి కాలనిర్ణయాలు సప్రమాణంగా ఋజువుచేస్తే ఆ యితిహాసాలన్నీ పుక్కిటిపురాణాలక్రింద తేలిపోయాయి. భవభూతి తన వత్తరరామ చరిత్రాన్ని కొడుకు ద్వారాగా కాళిదాసుగారు వేశ్యాగృహంలో వుండఁగా వినిపింపఁజేసినట్టున్నూ, కాళిదాసుగారు విన్నట్టున్నూ వకకథ చెపుతారు. భవభూతి శుద్ధశ్రోత్రియకుటుంబంలోనివాఁ డన్నట్టు ఉత్తరరామచరిత్ర పీఠికలో - "శ్రోత్రియ పుత్రః" అనే మాటవల్లనే తేలుతుంది. అట్టి శ్రోత్రియపుత్రుఁడు వేశ్యాలోలుఁడైన కాళిదాసుకు తన నాటాకాన్ని వినిపించడానికి వేశ్యాగృహానికి వెళ్లడం యెలాగ? అందుచేత కొడుకును పంపి వినిపింపఁజేశాఁడనిన్నీ అనంతరమందు కాళిదాసు విని యేమన్నాఁడని కొడుకును అడిగితే "యేమీ అనలేదు, ఆహ్లాదంగా ప్రియురాలున్నూ, తానున్నూ విన్నా"రనిన్నీ కొడుకు చెప్పినట్లున్నూ దానిమీఁద భవభూతి "యేమిన్నీ అననేలేదా?” అని అట్టే గుచ్చి గుచ్చి అడిగేటప్పటికి కొడుకు
శ్లో. “కిమపి కిమపి మందం”
అనే శ్లోకంలో నాలుగో చరణాంతం- "రాత్రిరేవం వ్యరంసీత్" అనేచోటమాత్రం వకమాట అన్నాఁడని చెప్పఁగా ఆమాట యేమాటో చెప్పవలసిందని భవభూతి తన కొడుకు నడిగినట్టున్నూ కొడుకు యీలా చెప్పినట్టున్నూ పండితపరంపరలో చెప్పుకుంటారు. దాన్ని వుదాహరిస్తాను- -
"నాన్నా! కాళిదాసుగారు నాటకాన్ని వినిపించేటప్పుడు ఆయన సాని సున్నం రాసి యిసూవున్న తమలపాకులు వేసుకుంటూవున్నారు. ఆ సందర్భంలోపైని వుదహరించిన-“కిమపి కిమపి మందం” అనే శ్లోకచతుర్థచరణం వింటూ సానితో “సున్నం, ఎక్కువయింది" అని మాత్రం అన్నారు. యింతకన్న వక్కమాటకూడా నాటకం వినిపించేటప్పుడు కాళిదాసుగారు మాట్లాడినట్టే లేదు" అని కొడుకు చెప్పేటప్పుడు "రాత్రి రేవం వ్యరంసీత్" అనేచోట "ఏవం వ్యరంసీత్" అనడంకంటె “ఏవ వ్యరంసీత్" అంటే యెక్కువ సరసంగా వుంటుందని కాళిదాసుగా రభిప్రాయపడ్డట్టు భవభూతి తెలుసుకొని ఆలాగు సవరించు కొన్నట్టు వినికి. యీ పాఠంలో వున్న స్వారస్యమేమిటంటే? స్నిద్ధ దంపతులైన సీతారాములు యేవో తలా తోఁకా లేనిరీతిగా మాటలాడుకుంటూ పరస్పరాలింగన మహోత్సవాన్ని అనుభవిస్తూ వుండఁగా, రాత్రి య్యేవే విరామాన్ని పొందిందిగాని వారిగోష్ఠి యింకా విరామాన్ని పొందనేలేదు- అనేది- అసలు పాఠంలో సున్నవుంటే, “ఏవం” అని వుంటుంది. కనక ఏవం అంటే? ఈ ప్రకారంగా సీతారాములకు రాత్రి గడిచిపోయింది అని మాత్రమే వస్తుంది, ఆ పాఠంకంటే యీపాఠం సొగసుగా వుంటుందని కాళిదాసుగారు “సున్నం" యెక్కువయిందనే మిషతో సూచించినట్టయింది కాని యీ కథ యిటీవల వారికల్పన కాని మఱోమాదిరిదికాదు. యేమంటే, కాళిదాసు తెలుఁగు దేశస్థుఁడు కాడు కాఁబట్టి తెలుఁగుపదమైన “సున్నం” అనే పదంతో ఆలా చమత్కరించడం సంభవించదుకదా! కాఁబట్టి యెవరో బుద్ధిమంతులు ఆశ్లోకంలో ఆసవరణను వుపపాదించి యీకథాకల్పనచేసి కాళిదాసుకు అంటగట్టినమాట సత్యదూరంకాదు. యీలాటివే యింకా కొన్ని కథాకల్పనలున్నాయి. వక నాఁడు దండిమహాకవిన్నీ కాళిదాసుగారున్నూ ధారాపట్టణ వీథమ్మట షికారు వెడుతూవున్నారనిన్నీ ఆలా వెళ్లేటప్పుడు దండిగారివద్ద తమల పాకులున్నూ చెక్కలు వగయిరాలున్నూ వున్నాయనిన్నీ సున్నం లేకపోవడంచేత ఆ వీథిలోవున్న ఒకానొక వేశ్యాగృహం గుమ్మంలో వున్నవక వేశ్యబాలికను వుద్దేశించి-శ్లో"తూర్ణ మానీయతాం చూర్ణం పూర్ణ చంద్రనిభాననే!" అని దండి శ్లోకపూర్వకంగా ఆజ్ఞాపించినట్టున్నూ కాళిదాసు గారివద్ద తమలపాకులుకూడా లేకపోవడంచేత-శ్లో"పర్ణాని స్వర్ణవర్ణాని కర్ణాంతా౽౽కీర్ణ లోచనే!" అని ఆజ్ఞాపించినట్టున్నూ, ఆ బోగంపిల్ల తమలపాకులున్నూ, సున్నమున్నూ తెచ్చి కాళిదాసుగారికి ముందుగా యిచ్చి తరవాత దండిగారికి సున్నాన్ని తెచ్చి యిచ్చిందనిన్నీ ఆపట్లాన్ని దండి "నేను ముందుగా నిన్ను సున్నం తెమ్మన్నానుకదా, నాకు ముందుగా సున్నాన్ని' యివ్వక కాళిదాసుగారికి తమలపాకులు ముందుగా యిచ్చి నాకు తరువాత సున్నాన్ని యివ్వడానికి కారణమేమిటి?" అని విలాసంగా అడిగేటప్పటికి ఆ పిల్ల- “అయ్యా మేము వేశ్యలం, మాకు వకఅణా యెవరెక్కువిస్తే వారిని ముందుగా గౌరవిస్తాం. కాళిదాసుగారు అయిదు అణాలు యిచ్చారు. మీరు మూఁడు అణాలే యిచ్చా"రని జవాబు చెప్పిందనిన్నీ దానితో దండి దాని తెల్వితేటలకు సంతోషించి వూరుకున్నాఁడనిన్నీ వకకథ విద్వత్పరంపర చెప్పగా వినడం. ణకారాన్ని “అణా" అని చిన్నప్పుడు కుఱ్ఱాళ్లకు అక్షరాలు చెప్పేటప్పుడు మన తెలుఁగు దేశంలో పలకడంవుంది. యీ పలుకుబడి యితరదేశాలలోకూడా వుంటే వందేమో కాని 'అణా' అనేది నాల్గుడబ్బుల పరిమాణం కల ద్రవ్యాన్ని చెప్పడం వుండివుండదు. కాఁబట్టి యీకథకూడా ఆంధ్రదేశంలో పుట్టినకథే అనుకోవాలి. కథ కల్పితమే అయినప్పటికీ అప్పటికాలంలో వేశ్యలుకూడా సంస్కృతంలో మంచి ప్రవేశం కలవాళ్లనే అంశమేకాకుండా కాళిదాసుగారితోపాటు దండిమహాకవి కూడా అంతో యింతో విలాస పురుషుఁడే అనే అంశం దీనివల్ల ధ్వనితం అవుతుంది. పైఁగా దండికన్నా కాళిదాసే అధికుఁడనే అంశం తాత్కాలికలుగావుండే బోగంకన్యకలకు కూడా తెలిసినదే అనికూడా ధ్వనిత మని తెలిసికోవలసి వుంటుంది. ఎన్నోకథలు కాళిదాసున్నూ, దండిన్నీ భవభూతిన్నీ వకటేకాలంవాళ్లన్నట్టు చెప్పుకొనేవే వున్నాయి. అందులో కొన్నిటిని తోసేయడం మఱీ చిక్కుగా వుంటుంది. చూడండీ యీ కింద వుదాహరించే కథలు-శ్లో కవి ర్దండీ కవి ర్దండీ కవిర్దండీ నసంశయః" అని కాళీమహాదేవి కాళిదాసుతో అన్నట్టున్నూ దానిమీఁద కాళిదాసుకి కోపంవచ్చి “వొళ్లెఱుగనిశివం"గా అమ్మవారిని వుద్దేశించి, "కో౽హం రండే!’ అని అడిగినట్టున్నూ, దానిమీఁద అమ్మవారు తన పొరపాటును సవరించు కోవడానికి దయతో- "త్వమేవా౽హం త్వమేవా౽హం త్వమేవా౽హం న సంశయః’ అని జవాబు చెప్పినట్టున్నూ వినడం. యేక కాలికత్వం దండికాళిదాసుల కుండకపోతే యీకథ కుదరదు. లేదా? కాళిదాసుకంటే దండి పూర్వుఁడేనా అయివుంటే కొంత సమన్వయం అవుతుంది. మఱిన్నీ భోజరాజుగారు ఉపరిసురతాన్ని కాళిదాస భవభూతు లిద్దఱికీ వర్ణ్యంగా యేర్పఱిచి ప్రశ్నించినప్పుడు చెఱివకశ్లోకం చెప్పడమున్నూ అందులో కాళిదాసుగారిశ్లోకమే మెఱుఁగుగా వున్నట్టు ఒకవిశేషణంవల్ల భోజరాజుగారు అభిప్రాయపడేటప్పటికి భవభూతి తనదే బాగా వుందని వృథా వివాదకు వుపక్రమించడం తోనే కాళిదాసు "మనకీ వివాద మెందుకు? మనమన శ్లోకాలు సమానతూఁకం గల తాటాకుల మీఁదవ్రాసి శారదాదేవ్యాలయంలో అమ్మవారి యెదుట తూఁచుదాము. అందులో యేది యెక్కువ తూఁగితే ఆకవిత్వం అతిశయించినట్టు నిర్ణయమవుతుం"దని చెప్పినట్టున్నూ అందుకు భవభూతికూడా వొప్పుకున్నట్టున్నూతుదకు ఆలా తూఁచేటప్పడు భవభూతిగారిశ్లోకం వున్నవైపు తేలికగా పైకితేలిపోతూ వుండివుండడంలో అమ్మవారు స్వల్పవిషయంలో మహాకవికి, పరాభవం యెందుకు రావాలని కాఁబోలు! తనచెవు సందున అలంకారార్థం ధరించిన యెఱ్ఱకలువపూలు తాలూకో, తామరపువ్వుతాలూకో మకరందాన్ని భవభూతిశ్లోకం వున్నవైపున చిలికినట్టున్నూ దాన్ని కనిపెట్టి కాళిదాసు- శ్లో "అహో! మే సౌభాగ్యం మమచ భవభూతేశ్చ ఫణితిం ధటాయా మారోప్య ప్రతిఫలతి తస్యాం లఘిమని | గిరాం దేవీ సద్యశ్శ్రుతికలిత కల్హార కలికా ! మధూళీమాధుర్యం క్షిపతి పరిపూర్త్యె భగవతీ..” అనే శ్లోకం చెప్పి ఆ రహస్యాన్ని బయటఁ బెట్టినట్టున్నూ విద్వత్పరంపరవల్ల వినడం. ఇందులో భవభూతి పేరుకూడా వుంది కానీ యీ శ్లోకం కాళిదాసే చెప్పాఁడనడానికి ఆధారంలేదు. ఆ పద్ధతిని భవభూతికిన్నీ మఱివక కవికిన్నీ యిట్టి వివాదం తటస్థించడమున్నూ, అందులో భవభూతికి వోడురావడమున్నూ తటస్థిస్తుంది. వొక్క కాళిదాసుకు భవభూతి యే స్వల్పంగానో తీసిపోవడానికి విద్వల్లోకం అంగీకరిస్తుందికానీ మఱో కవికి తీసిపోవడానికి ఎంత మాత్రమున్నూ అంగీకరించదు. కాఁబట్టి ఆకల్పన కుదరదు. అదిన్నీ కాక, కొన్ని విషయాలలో కాళిదాసు భవభూతికి యత్కించితు తీసిపోయినప్పటికీ ఉత్తరరామ చరిత్ర రచనలో కాళి దాసుకన్నా అంటే అతని శాకుంతల రచనకంటే కూడా మిన్నగానే వున్నట్టు కాళిదాసే వప్పుకున్నట్టు యీక్రింది శ్లోకం చెపుతుంది- శ్లో "నాటకేషుచ కావ్యేషు వయంవా వయమేవవా, ఉత్తరే రామచరితే భవభూతి ర్విశిష్యతే" అంటూ యెప్పుడో సర్టిఫికట్టు యిచ్చినట్టు వినికి. ఏక కాలికులు కారు వీరనేవారు యీశ్లోకాన్ని కూడా యెవరికో అంటగట్టవలసి వస్తుంది. యింకా యెన్నో వున్నాయి. వీరిద్దఱ్ఱే కాక దండికూడా భోజుని సభలో వుండేవాఁడనడానికి సంబంధించిన కథలు. అవన్నీ భోజ చరిత్రలో యెవరో వుటంకించే వున్నారు. భోజచరిత్ర వ్రాసిన కవి యెవరో తెలియదు. మాఘకవినికూడా ఆ భోజచరిత్ర భోజుఁడి కాలంలో వున్నట్టు చెపుతుంది. కాలపరిశీలకులు ఆ భోజచరిత్రాన్ని బొత్తిగా విశ్వసింపరు. కాని కొన్ని కథలుమాత్రం ఆ పరిశీలకులకు కంఠం ముడిపట్టుకొనేవి లేకపోలేదు. కొందఱు కాళిదాసు విక్రమార్కుని సభలోవున్నట్టు నప్రమాణంగా ఋజువుచేస్తున్నారు. శాకుంతలంలో ప్రస్తావనలోవున్న- "అభిరూపభూయిష్ఠా పరిషదియమ్” అనే వాక్యాన్ని “విక్రమార్కభూయిష్ఠా" అని వున్నట్టు చెపుతూవున్నారు. కాళిదాసకృతము లనుకొనే రఘువంశ కుమార సంభవాది కావ్యాలున్నూ, శాకుంతల విక్రమోర్వశీయాది నాటకాలున్నూ రచించిన కాళిదాసులు వేఱువేఱుగా వున్నట్టున్నూ చెపుతూ వున్నారు యిప్పుడు కొందఱు పరిశీలకులు. ఆ చెప్పడంలో రఘువంశ కుమారసంభవాలు రెండున్నూ యేకకవికృతాలు కావనేవారికి వకచిక్కు వుంది. రఘువంశంలో యిందుమతీ పరిణయఘట్టంలో వున్నశ్లోకాలు, కుమారసంభవంలో పార్వతీపరిణయఘట్టంలో కొన్ని తూచా తప్పకుండా పడివున్నాయి. భిన్నకర్తృకగ్రంథా లయితే ఆలా పడడానికి సమాధానం వుండదు. అందుచేత ఆ రెండు గ్రంథాలమట్టుకేనా యేకకర్తృకత్వం వప్పుకోవాలని నేననుకుంటాను. యిద్దఱు కాళిదాసులు వున్నట్టు వ్రాసేవారికిన్నీ ఆధారాలు లేకపోలేదు. అవి ఖండించాలంటే సుఖసుఖాల తేలేపని కాదు. కాని లోకంలో వున్న ప్రతీతియందు వున్నంత మూఢవిశ్వాసం మాత్రం పరిశీలించి చేసిన సిద్ధాంతమందు లోకానికి కలగదు. అందుచేత మూఢవిశ్వాసాన్నే నేను అవలంబిస్తూ వున్నాను. యింకా కొందఱు కాళిదాసులైతే వున్నారు. కాని వారు 'అభినవ' అనేపదం పూర్వమంధు కలవా రవడంచేత అంతగాని కొంతగాని బాధించరు. "అభినవపదపూర్వః కాళిదాసః ప్రగల్భః" ఇత్యాదులు చూచుకోఁదగును. మొత్తందండి భవభూతి కాళిదాసులు, సంస్కృత కవితాప్రపంచకంలో పేరు మ్రోగిన త్రిమూర్తులు. దండి భవభూతులు కాళిదాసుకన్న ముందే భోజరాజుగారి ఆస్థానమందు వుండి యెవ్వరినిన్నీ ఆరాజుగారి ఆస్థానానికి చేరనిచ్చేవారు కారంటూ కొన్ని కథలు వున్నాయి. వాట్ల నిజానిజాలు నిర్ణయించడం చాలా దుర్ఘటం. కాళిదాసునుకూడా వీరిద్దఱున్నూ చేరనిచ్చే వారే కారనిన్నీ కాళిదాసు యేదో వెఱ్ఱిగా శ్లోకాలు చెప్పుకొంటూ వీరిని ఆశ్రయించేటప్పటికి రాజుగారికి తమయందు వుండే అపోహని తొలగించడానికి యీ కాళిదాసుని రాజుగారి ముందఱ పెట్టారనిన్నీ వకకథవుంది. ఆకథకు సంబంధించిందే యీ క్రింది శ్లోకం.
శ్లో. “అస్థివద్బకవచ్చైవ చల్లవ ద్వెల్లకుక్కవత్
రాజతే భోజతేకీర్తిః పున స్సన్యాసిదంతవత్"
యీ శ్లోకంలో వున్న"చల్ల, వెల్లకుక్క" శబ్దాలు గౌడదేశీయుఁడైన కాళిదాసు శ్లోకంలో పడడం అసంభవం కాఁబట్టి ఆంధ్రదేశీయుల కల్పనాకథగా మనం భావించాలి. లోకంలో వక రాజును గూర్చిగాని, ఒక కవినిగూర్చి గాని మనం మాట్లాడుకోవలసివస్తే ఆ వ్యక్తులు మొట్టమొదటనుంచిన్నీ మహాయోగంలోనే వున్నట్టు చెప్పకోవడంలో వినడానికి అంత ఆదరం వుండదు, చూడండీ! విశ్వదాతగారినిగూర్చి లోకం యెంత సంతోషంగా చెప్పుకుంటూ వుంటుందోను యీయన వొకప్పుడు 0-4-0 అణాలు తనచేతులో లేక యెంతో చిక్కుపడ్డట్టు కూడా వింటే ఆయన ముఖతః విన్నానేమో? లేక మఱి వకరివల్ల విన్నానో జ్ఞప్తి చాలదు. అసలుమాత్రం యథార్థం కాకపోలేదు. అలాగే విద్యాభ్యాస కాలంలో మ్యునిసిపల్ దీపాల సహాయం యీయనకుపకారం చేసినట్టున్నూ వినడం. యీదీపాల సహాయం శ్రీ భాష్యం అయ్యంగారు వగైరా కొన్ని మహావ్యక్తులకున్నూ జరిగినట్లు వినడం కలదు. అట్టి నాగేశ్వరరావుగారు యేరోజు కారోజు చేసే దానం యెంత వుంటుందో? లెక్కవేస్తే తేలదు. ఆయీ విషయం నేను కొంత కళ్లారా చూచిందే. యీయన ఆగర్భ శ్రీమంతుఁడై వుండి చిన్నప్పటినుంచీ యిలాటి దాతగానే వుంటే లోకానికి కలిగే ఆదరాతిశయం వేఱు, యిప్పుడు కలిగే ఆదరాతిశయం వేఱు. మన కాళిదాసుగారు మొట్టమొదట భోజరాజ దర్శనానికి వెళ్లేటప్పుడు కవిత్వంలో నిరుపమానుఁడే అయినప్పటికీ తగినంత పేరుప్రతిష్ఠలు కలవాఁడుగా లేనట్టున్నూ, రాజదర్శనానంతరం పెద్దయోగం పట్టినట్టున్నూ చెప్పకోవడంలోనే విశేషం వుందని వేరే వ్రాయనక్కఱలేదు. దండి భవభూతులు ఏకసంథా, ద్విసంథా గ్రాహులనిన్నీ కాళిదాసుగారు భోజరాజుగారి మీఁద చెప్పిన శ్లోకాలు వెంటనే వారు చదివి యివి మేమిదివఱలో చెప్పినవే కాని నూతనాలు కావని చెప్పడానికి మొదలు పెట్టేటప్పటికి వారి ధారణకి లొంగని మాదిరి శ్లోకాలు, శ్లో. 'వాశ్చారేడ్డ్వజధ గ్ధృతోడ్వధిపతిః కుద్రేడ్జజానిః" అనే పాషాణపాక శ్లోకాలు రచించి వారికి శృంగభంగం చేసి కాళిదాసు భోజుని ఆస్థానంలో స్థిరపడిపోయాఁడనిన్నీ వకకథ చెప్పుకోవడం వుంది. యింకా భోజుఁడికిన్నీ కాళిదాసుకిన్నీ సంబంధించిన వెన్నో కథలున్నాయి. భోజరాజుగారి వుంపుడుకత్తె కాళిదాసుగారికి వలపుసానిగా యేర్పడ్డట్టున్నూ తుదకు ధనాశచేత ఆవేశ్య కాళిదాసు మెడకోసి చంపినట్టున్నూ వకకథ వుంది.
శ్లో. "కుసుమే కుసుమోత్పత్తి శ్శ్రూయతే నతుదృశ్యతే" అని భోజరాజుగారు వేశ్యా కేళీగృహపు గోడమీఁద వ్రాసి దీన్ని పూర్తిచేసిన వారికి అర్ధరాజ్యం యిస్తామని వ్రాసినట్టున్నూ ఆ అర్ధరాజ్యం తాను పుచ్చుకునే వుద్దేశ్యంతో ఆశ్లోక పూర్తిని కాళిదాసుచేత- "బాలే! తవముఖాం భోజే దృష్ట మిందీవరద్వయమ్" అని చేయించి కాళిదాసు నిద్రపోతూ వుండఁగా "మర్డరు" చేసి మిడిమిడిజ్ఞానపాండిత్యం కల ఆ వేశ్య "బాలే” అన్న పదం తీసివేసి, “రాజే” అని చేర్చి రాజుగారిని అర్ధరాజ్యం యివ్వవలసిందని కోరఁబోతూ వుండగా, ఆపూర్తియందువున్న మోసాన్ని “రాజే” అనే అసంగత మార్పువల్లనే గ్రహించిన మహాకవి భోజరాజు- “కాళిదాసుని చంపేశావా యేమిటి? నీతల్లి కడుపుకాలా!” అని ప్రశ్నించాఁడనిన్నీ, అది యథార్థం వప్పుకోక విధిలేక వప్పుకొని శవాన్ని చూపిస్తే అప్పుడు భోజరాజు తనకు కూడా మృత్యువు సమీపించడాన్ని తెలిసికొని యేకొంచెమో శేషించివున్న తన ఆయుర్దాయాన్ని విభజించి సగం కాళిదాసుకుయిచ్చి యిద్దఱున్నూ కలిసి శ్రీవాల్మీకిరచిత రామాయణగాథననుసరించి రామాయణ చంపూరచన కారంభించి సుందరకాండవఱకున్ను రచించేటప్పటికి ఆయుఃపరిమితి సరిపోయిందనిన్నీ అందుచేతే యుద్ధకాండ మఱివకరు రచించడం తటస్థించిందనిన్నీ వక కథ చెప్పకుంటారు. యీ కథకు సంబంధించి - “శ్లో. అద్య ధారా నిరాధారా... అద్య ధారా సదాధారా" అనే శ్లోకద్వయం కనపడుతుంది. ఆయీ కథలు కొన్ని పురాణాల్లో వుండే సందర్భాలను అనుసరించి కనపడతాయి. భోజరాజుగారి శిరస్సులో అంటే మెదడులో యేదో కప్పపిల్ల చేరినట్టున్నూ, దాన్ని అశ్వనీదేవతలు "ఆపరేష"ను చేసినట్టున్నూ వక కథ వుంది. యిప్పటికాలంలో అయితే ఆ “ఆపరేషను" దేవతలదాఁకా వెళ్లవలసిలేదుగాని అప్పుడు దేవతలదాఁకా వెళ్లింది. ఆయీ కథల నిజానిజాలు తేల్చడం చాలాకష్టం. యింతదాఁకా వుదహరించిన కథలవల్ల కాళిదాసుగారు వేశ్యాలోలుఁడైనప్పటికీ కేవల శ్రోత్రియపుత్రుఁడున్నూ, శ్రోత్రియుఁడున్నూ అయిన భవభూతి ఆయన యెడల యెక్కువ ఆదరాన్నే చూపించేవాఁడనిన్నీ తన వుంపుడుకత్తెకున్న కాళిదాసుకున్నూ సంబంధం వుందనే అంశం భోజరా జెఱిఁగీకూడా అతనియందు ప్రేమగానే వుండేవాఁడనిన్నీ తేలడమేగాకుండా అంతటి మహారాజున్నూ మహాకవీనిన్నీ అయిన భోజుఁడు వుంచుకొన్న సానికి కూడా కాళిదాసురసికత్వం మనశ్చాంచల్యాన్నయితే కలిగించి ప్రేమింపచేసింది కాని తుట్టతుదకు అర్ధరాజ్యాపేక్ష అట్టి వలపు మగణ్ణికూడా చంపించివేసిందనిన్నీ యెన్నో విశేషాలు ధ్వనిమర్యాదచేత బయలుదేఱతాయి, ఆయా మాదిరి విశేషాలు ధ్వనించేకథ లింకా వీరికి సంబంధించిన వున్నాయి. వ్యాసం పెరిగిపోతూవుంది. అందుచేత వాట్లను వదులుకొని చదువరుల వినోదార్థం వొక శ్లోకానికి సంబంధించిన పుక్కిటి పురాణకథను వుదహరిస్తాను
యీ కథ నేను విని యిప్పటికి 48 యేండ్లు దాఁటవచ్చింది. కథ మాత్రం నిజం కాదేమోకాని శ్రోత్రపేయంగామాత్రం వుంటుంది. యీకథే కాదు; మనవారి మతంలో యెన్నో పురాణగాథలు యీలాటివే, అంటే అర్ధవాదాలే. అర్ధవాదాలంటే లేని అర్ధాన్ని ప్రయోజనాంతరాపేక్షతో వుపన్యసించడమే. ఆశ్లోకం తుట్టతుదను వుదాహరిస్తాను. కథ మొదలెడ్తూ వున్నాను - వొకానొక మహాకవి భోజరాజుగారి దర్శనం నిమిత్తం బయలుదేఱి ధారానగరానికి వచ్చాఁడఁట! వచ్చి వూరు వెలపల డేరా వేసుకొని మకాం చేశాఁడఁట! “కవులకు డేరా లుంటాయా?” అని సందేహిస్తారు కాఁబోలును! సందేహించకండి, యిప్పటి అస్మదాదులనుబట్టి వెనుకటి మనకవులందఱినిన్నీ యీలాటివాళ్లే అనుకోకండి. ఆ కవులు విదేశీయ ప్రభుపరిపాలనలో వున్నవాళ్లు కారుకదా!- “ఎదురైనచోఁ దన మదకరీంద్రము డిగ్గి కేలూఁత యొసంగి యెక్కించుకొనియె" అనే పద్యం వగయిరాలు జ్ఞాపకం తెచ్చుకోండి. అంతదాఁకా యెందుకు? తురగా రామకవి యీకాలాని కెంతోపూర్వుఁడు కాcడు - అతనిదే యీ క్రిందిపద్యంఉ. "రాతిరి మేము పస్తుహయరత్నము పస్తు కవీంద్రగాయక, వ్రాతముపస్తు
నర్మసచివాగ్రణి పస్తు.... ముద్దుకోమలి..... పస్తిఁక నేమి సెప్పదున్?”
యీ పద్యంలో మొదట కొంతజ్ఞాపకంరాక బొట్టుపెట్టి వదలేశాను. వ్రాయకుండానే తెలుస్తుందని కొంత వదిలేశాను. కవులు గుఱ్ఱాలతో మఱికొందఱు కవులతో గాయకులతో నర్మసచివులతోకూడా బయలుదేఱేటప్పుడు సొంత డేరా వుండవలసిందే కాని మహారాజావారి దర్శనము అయి వారి సప్లయి అందేలోపున సొంతడేరా వుండకపోతే కొత్తవూళ్లో వీరిని భరించతగ్గ గృహస్థెవఁడుంటాఁడు? అందుచేతేకదా! పూర్వము యెవరో కవి యేనుఁగునున్నూ కవీశ్వరుణ్ణీ రాజు భరించవలసిందే కాని తదితరులు భరించ లేరని చెప్పివున్నాఁడు- "సుకవితా యద్యస్తి రాజ్యేనకిమ్"- అనే భర్తృహరి వాక్యంకూడా మహాకవుల సంపత్తి సామాన్యం కాదని తెలుపుతుంది, భర్తృహరివాక్యాని కిది అర్థంకాదని కొందఱనవచ్చును. కాకపోవుఁగాక- “సుకవీంద్ర బృంద రక్షకుఁడెవ్వఁడనిన వీఁడను నాలుకకుఁ దొడవైనవాఁడు" అనే సీసచరణం వగయిరాలు కవుల ఐశ్వర్యాన్ని తెలుపుతూ వున్నాయి కదా! అది ఆలా వుంచుదాం. కవిగారు వచ్చి డేరాలోదిగారు. కాళిదాసుకు ముందే ఈసంగతి తెలిసి దేవిని ప్రార్థించాఁడు, దేవి “ఆకవి నీకన్న వొకజన్మం యెక్కువగా నన్ను వుపాసించాcడు, నీకుసాధ్యుఁడు కాఁడు, ఉపాయాంతరం చూచుకొ"మ్మంది. ఆ పట్లాన్ని కాళిదాసుకు యేమీ తోఁచిందికాదు. తానేమో తొమ్మిదిజన్మాలల్లో దేవిని వుపాసించినట్టున్నూ ఆ కవి పదిజన్మాలల్లో వుపాసించినట్టున్నూ దేవిస్పష్టంగా చెప్పింది. ఆలోచించి, ఆలోచించి కాళిదాసు వకగడ్డి అమ్మకునేవాఁడివేషం వేసుకుని పచ్చగడ్డికావిడి బుజాన్ని పెట్టుకొని కనుచీఁకటి పడుతూవుండఁగా ఆ కొత్తకవిగారి డేరా దగ్గిఱికివచ్చి తొంగిచూస్తూ వున్నాఁడఁట! అప్పుడు ఆ కొత్తకవీశ్వరుఁడు "గడ్డికావిడి యెంత కేస్తా?” వని బేరమాడేటప్పటికి మనకాళిదాసన్నాట్ట, "అయ్యా! యీ గడ్డి కాళిదాసుగారి గుఱ్ఱానికి వాడుకగా ప్రతీరోజూ అమ్మకునేదండి. మీకమ్మేదిలే"దన్నాట్ట! అనేటప్పటికి ఆకవి “వోరీ! మేము యిప్పడే యీవూరికి వచ్చాము. మా గుఱ్ఱానికి నీవు అమ్మకపోతే కొత్తవూల్లో గడ్డి సంపాదించడం కష్టం, కాళిదాసుగారు నీ కిచ్చేదానికంటె రెట్టింపుఖరీదు యిస్తా" మంటూ బతిమాలేటప్పటికి మనగడ్డి కావటివాఁడు (కాళిదాసు) "బాబూ! ఆరు నాకు రోజూ రాత్రి కూడుకూడా పెట్టిస్తా"రన్నాట్ట! దానిమీఁద కవిగారు "మేమున్నూ పెట్టిస్తా" మన్నారఁట! అనేటప్పటికి మొగమాట పడ్డట్టు నటించి కాళిదాసు గడ్డికావడి వారికి వేసి అక్కడే భోంచేసి “బూబూ!” యీ రేతిరిక్కడే తొంగుంటానని చెప్పి ఆ కవిగారిగుట్టూ మట్టూ కనుక్కోవడానికి అక్కడే పడుక్కున్నాఁడఁట! తర్వాత తెల్లవాఱగట్ల చంద్రాస్తమయం అవుతూ వుండంగా ఆ కవిగారు మేలుకుని ఆ చంద్రుణ్ణి యీ విధంగా వర్ణించడానికి మొదలెట్టారఁట! శ్లో. “చరమగిరికురంగీశృంగకండూయనేన, స్వపితి పునరిదానీ మంతరిందోః కురంగః" అంటే అర్థమేమిటంటే? పడమటి కొండ అనఁగా, అస్తగిరియందు వుండే ఆడలేడి తనయొక్క కొమ్ముతో గోకుతూవుంటే, ఆ సౌఖ్యాన్ని అనుభవిస్తూ చంద్రమండలంలో వుండే మొగలేడి సుఖిస్తూ వుందని వర్ణించాఁడన్నమాట. ఫలితార్థం చంద్రాస్తమయం అవుతోవుందని తేలింది. యిన్ని తికమక లెందుకు చంద్రాస్తమయ మవుతూందనే చెప్పరాదా? అని శంకిస్తారేమో? ఆ తికమకలు వుంటేనే ఆ రచన కవిత్వమనిపించుకుంటుందని తెలుసుకోవాలి. సరే ప్రస్తుతం వ్రాస్తాను. కాళిదాసు కవిగారి గుట్టూ మట్టూ తెలుసుకోవడానికి ప్రచ్ఛన్నంగా వచ్చి వున్నావాఁడే కనక ఆ రచనలో వుండే లోపాన్ని కనిపెట్టి - "బాబూ! ఆఁడలేడికి కొమ్ము లుంటాయాండి?" అంటూ మెల్లిగా శంకించాడు. శంకించేటప్పటికి కవిగారు తాను పడ్డ పొరపాటును గ్రహించుకున్నారు. అన్నా గడ్డి అమ్మకొనేవాఁడికి కూడా దొరుకడ్డాంకదా? అని మనస్సులో విచారం పుట్టింది. దానితో సవరణ తోఁచింది కాదు సరికదా! ఉత్తరార్థంకూడా స్ఫురించిందికాదు. ఆ కంగారంతా మన కాళిదాసుగారు కనిపెట్టి అయ్యా! "శృంగ" అనేచోట- “తుండ" అంటే కుదురుతాదండి. అన్నాఁడఁట! అప్పుడు అర్థం. ముట్టితో గోఁకడం కనక సరిపోతుందన్నమాట. ఆ సవరణ వినేటప్పటికి కవిగారికి మరీ గాబరా పుట్టిందఁట! ఆ గాబరామీఁద ఉత్తరార్ధం అసలే స్ఫురించక "బ్రే" కేసినట్టయిందఁట! అది కాళిదాసు కనిపెట్టి- “తరవాయి సెలవిప్పించండి బాబూ! యింటా” నన్నాట్ట. కవిగారు కంగారుతో - బెల్లంకొట్టిన రాయిలాగ వుండిపోయారనిన్నీ అదంతా గ్రహించి కాళిదాసు - 'అయ్యా! సెలవైతే తరవాయి నాను పూర్తిచేసుకుంటా’ నన్నాఁడనిన్నీ కవిగారు ఆమాటవిని అత్యాశ్చర్యపడి– “యేమీ నీవు కవిత్వం కూడా చెప్పగలవా?" అని అడిగారనిన్నీ దానికి కాళిదాసు- ‘బాబూ! బాగా చెప్పలేనుగాని యీమాత్రం నేనే కాదండి; మా కాళిదాసుగారి నౌకర్లందఱున్నూ చెపుతారండి' అంటూ వుత్తరార్ధాన్ని శ్||లో పరిణతరవిగర్భ వ్యాకులా పౌరుహూతీః దిగపి ఘనక పోతీహుంకృతైః క్రన్దతీవ" అని పూర్తి చేసినట్టున్నూ దానితో కాళిదాసును జయించాలని డబ్బా డవాలీ కట్టుకొని పెద్ద అట్టహాసంగా బయలుదేఱి వచ్చిన కవిగారు హడిలిపోయి 'కాళిదాసుగారి నౌకర్లే యింతింత కవులయితే ఆయనయెంతవాఁడో?" అనుకొని- “చచ్చినంత కలగంటే పెందరాళ్లే మేలుకో" మన్నారనుకొని డేరా సామాను బళ్లకెక్కించి వుదయం కాకుండానే వచ్చినతోవను ప్రయాణం కట్టినట్టు గోదావరి డి. అమలాపురం, తాII కాట్రేవుకోన కాపురస్థులు శ్రీమల్లాది నరసింహశాస్త్రుర్లుగా రనేవారు చెప్పఁగా విన్నాను. ఆయన బహుశః నాయీడువారే అని జ్ఞాపకం. ఆయీ శ్లోకం యే గ్రంథంలోనో యిటీవల చూచినట్టు కూడా జ్ఞాపకం. ఆ గ్రంథం కాళిదాసు చేసినదని జ్ఞాపకం లేదు. యే మహాకవిదో? యీ శ్లోకాన్నిబట్టి యింత పుక్కిటిపురాణాన్ని యేమహానుభావుఁడు కల్పించాఁడో? కాని వినడానికి మాత్రం చాలా సొంపుగావుంది. కాళిదాసును జయించే యిచ్ఛతో వచ్చి డేరాలో మకాంచేసిన ఆకవిపేరు యెవ్వరో విన్నట్టు జ్ఞాపకం లేదు. అసలు చెప్పినవారు చెప్పినట్టేలేదు. చెప్పేవుంటే యింతవఱకూ జ్ఞాపకంవుండి ఆకాస్తాజ్ఞాపకం వుండకపోదు. మనకు ఈ కథవల్ల మహాకవులనిపించుకొనేవా ళ్లందఱూ కొన్ని జన్మలయందు దేవీ వుపాసన చేసివుంటారనిన్నీ అట్టివారు వొకరిని వొకరు జయించి పేరు పొందవలసివస్తే వుపాసనాబలిమికంటేకూడా వుపాయం యెక్కువ అవసరమనిన్నీ ప్రస్తుతం కాళిదాసుకు అంటఁగట్టిన కథవల్ల తెలుసుకోవలసి వుంటుంది. ఉత్తరార్థానికి అర్థం కొంచెం వ్రాస్తాను. తూర్పుదిక్కనే వొకానొక సంపూర్ణ గర్భవతి సూర్యుఁడనే శిశువును కనఁబోతూ ప్రసవవేదన పడుతూ వుందా? అన్నట్టు ఆఁడపావురాపిట్టలధ్వని వినబడుతూందని వత్తరార్ధతాత్పర్యం. యీలాటికథలు నాచిన్నతనం మొదలు బందరులో నేనుస్కూలు టీచరీకి ప్రవేశించేవరకూ దేశాటనం చేయడంలో ఎన్నో వినివున్నాను. యెన్నో ప్రాస్తావికాలు, శ్లోకాలూ పద్యాలూ వినివున్నాను. అవన్నీ బందరు ప్రవేశించేవరకూ వాచోవిధేయంగా వుండేవి. క్రమంగా బందరు టీచరీ రోజుల్లోనే ఆయీగాథలున్నూ వీట్లకి సంబంధించిన శ్లోకాలూ, పద్యాలూ నున్నూ అంతరించాయి. యిప్పడేకొంచెమో జ్ఞప్తిలో వున్నాయి. పనిలోపని యీలాటి కల్పనే యింకొకటి కాళిదాసుకు సంబంధించిందే వుదహరించి యీ వ్యాసాన్ని ముగిస్తాను. వొక రోజున కాళిదాసుగారికిన్నీ భోజరాజుగారికిన్నీ వాదం వచ్చిందఁట! యేమనంటే? "ఐశ్వర్యం యెక్కువా? కవిత్వం యెక్కువా?" అని - భోజరాజుగారు "ఐశ్వర్యానికే" అగ్రస్థానాన్ని యిచ్చి వాదించడానికి మొదలెట్టారు. కాళిదాసుగారో? "కాదు కవిత్వానికే అగ్రస్థానం యివ్వా"లన్నారు. సరే! యిది తేలడం యేలాగ? తేల్చుకోవడానికి దేశాలమ్మట బయలుదేఱారు. భోజరాజుగారు వస్తూవున్నారంటే ప్రతీరాజున్నూ యెదురుగా వచ్చి గౌరవంచేసి గౌరవంచేసి తీసుకు వెళ్లి పెద్ద పెద్ద మేడలూ, పువ్వులతోఁటలూ బసయేర్పఱచి సమస్తసదుపాయాలున్నూ జరిగించేవాఁడు. కాళిదాసుగారిని యేరాజున్నూరమ్మన్నట్టేలేదు. యేపండితుఁడి యింట్లోనో యింత “తదన్నంతద్రసం"గా కాలక్షేపం చేస్తూ శ్రమపడుతూ తిరుగుతూ వున్నాఁడు. మధ్య మధ్య భోజరాజుగారు "యేం నీవాదం వోడిపోయిందా?" అని డెకాయిస్తూ వుండేవాఁడుః కాళిదాసు- “యింకా పదండి ముందు చెపుతా" ననేవాఁడు. యీలా కొంతదేశం తిరిగారు. అంతట వొకానొక మకాం సింహళంలో రాజధానిలో పడింది. దీన్నిబట్టి ఆకాలంలో మనదేశస్థులు "సిలోనుకు" కూడా వెళ్లేవారని తేలుతుంది. అక్కడ జరిగిన విశేషమేమిటంటే? ఆదేశపప్రభువు కొన్ని మాసాలనుంచి వూరూ పేరూ లేనివ్యాధిలో వున్నాఁడఁట! యెందఱో ఘనవైద్యులు వస్తూనూవున్నారు, చూస్తూనూవున్నారు. 'తమకువున్న బాధయేమిటి?' అని ప్రశ్నిస్తే ఆయన 'సాతత్ర చిత్రాయతే' అని మాత్రం జవాబు చెపుతారు. మళ్లా మళ్లా గుచ్చిగుచ్చి అడిగితే మళ్లా మళ్లా ఆలాగే జవాబు చెబుతాడు. యీ వ్యాధికి వైద్యులు చేసే వైద్యమేమీ కనపడలేదు. రాణీగారేమి, మంత్రులేమి చేయవలసిన ప్రయత్నాలు యెన్ని చేయాలో అన్నీ చేస్తూవున్నారు. గ్రహజపాలు, భూతవైద్యజపాలు వకటేమిటి? మహారాజుకు లోటేముంటుంది కనక దేశదేశాలనుంచి వైద్యులు వస్తూ వున్నారు. నెత్తిన గుడ్డేసుకొని వెఱ్ఱిమొహాలతో నిష్క్రమిస్తూనూ వున్నారు. ఆసమయంలోనే మన భోజరాజుగారు దయచేశారు. పేరు వినీవినడంతోటట్టుగానే మంత్రులు వగయిరాలు యెదురువెళ్లి గౌరవించారు. తగిన బస యేర్పఱిచారు. యేముంది?
"సాతత్ర చిత్రాయతే" అన్న వాక్యాన్ని విన్నారు. కర్తవ్యం తోఁచలేదు, వూరుకున్నారు. కాళిదాసుగారికి ఆలాటి సమయంలో దర్శనంయేలా అవుతుంది? కవి నని లేదా? కాళిదాసు ననే చెపుతాఁడనుకోండి! ఆ సమయంలో కవిత్వం యెవరిక్కావాలి?
"ఆతురస్య భిషజ్మిత్రమ్" అనికదా! అభియుక్తులు చెపుతారు. అందుచేత మనవాఁడునేను వైద్యుణ్ణనియ్యేవే చెప్పాఁడు. విన్నవాళ్లు “పోవయ్యా! నీతాతవైద్యులంతా వచ్చారు, బోల్తాగొట్టి పోయారు." అంటూ యీసడించడానికి మొదలుపెట్టారు. 'కాదు నేను తప్పకుండా రాజుగారి వ్యాధిని కుదురుస్తాను! నా ప్రజ్ఞ చూడండి. యెందఱినో చూచామన్నారుకదా! పోయిందేమిటి? నన్ను కూడా చూడండి!' అంటూ రాజ పురుషులని బతిమాలడాని కారంభించాఁడు. కాని ఆదరించినట్టు లేదు. తరవాత మెల్లిగా అంతఃపుర పరిచారికలలో కాస్త పెద్దగా తల తిప్పుకొనే దాసీలను ఆశ్రయించడానికి మొదలు పెట్టాఁడు. అందులో యెవత్తో వకత్తి అమ్మగారిచెవిని బడేసింది. “పోనీ యీయన వైద్యాన్ని కూడా చూద్దా"మని ఆపత్తులో వున్న రాణీగారు ఆయన్ని వెంటఁబెట్టుకు రావలసిందని ఆ దాసీకి ఆజ్ఞాపించారు. కాళిదాసుగారు కోటలోకి దయచేశారు. రాజుగారి దర్శనానికి వెళ్లారు. ప్రాణమాత్రావశిష్టులై మంచంమీఁద పరుండివున్న రాజుగారిని అందఱూ అడిగినట్టే “యేమిటి? తమకు వున్న బాధ" అని ప్రశ్నించారు- రాజుగారు యథాపూర్వంగానే 'సాతత్రచిత్రాయతే' అని జవాబిచ్చారు. కాళిదాసు దేవీ ప్రసాదలబ్ధ కవితావైభవుఁడవడంచేత పరేంగితజ్ఞత్వం కలవాఁడుకనుక, ఆ వ్యాధివారికి యెలా కలిగిందో అంతా క్షణమాత్రంలో అవగతంచేసుకున్నాఁడు. యిక్కడికి రాకపూర్వమే సర్వే సర్వత్రా యీ- 'సాతత్ర చిత్రాయతే' పాట "రోళ్లా రోకళ్లా" పాడుతూనే వున్నది కనక యిదివఱకే దాని ముక్కూమూలమూ కాళిదాసుకు అవగతమైవుందనుకోవలసి వుంటుంది. ఆపట్లాన్ని వైద్యం ఆరంభించాఁడు. యేలాగంటే? ఆ వైద్యం యీ శ్లోకమే- శ్లో. చిత్రాయ త్వయియోజితే తనుభువా సజ్జీకృతం స్వం ధను| ర్వర్తిం థర్తు ముపాగతే౽ంగుళియుగే బాణాగుణే యోజితాః| ఆరబ్ధే త్వయి చిత్రకర్మణి తదా తద్బాణభగ్నా సతీ! భిత్తింద్రా గవలంబ్య సింహళపతే! (సా తత్ర చిత్రాయతే) అని సమస్యాపూర్తి యథార్థ చరిత్రతోటి చేసేటప్పటికి సింహళపతిగారు లేచి కూర్చున్నారు, వ్యాధి కుదిరిందన్నారు, కాళిదాసుగారిని కౌగిలించుకున్నారు. యెంత గౌరవం జరగాలో అంతా జరిగింది. చాటుగా వుండి రాణీగారు సర్వమూ చూస్తూవున్నారు. “ఔరా! బక్క బ్రాహ్మఁడెంత మహానుభావుఁడూ?" అని అత్యాశ్చర్యపడుతూ వున్నారు. కోటకోటంతా ఆనందమయం అయిపోయింది. భోజరాజుగారు బిక్క మొగంతో వెలవెలపోతూ చూస్తూ వున్నారు. అప్పుడు యీయన రాజఱికాన్ని చూచేదెవరు? కాళిదాసుగారు- "యేమి రాజా! ఐశ్వర్యానికా అగ్రస్థానం? లేక కవిత్వానికా!" అన్నాఁడు. భోజరాజుగారు ముమ్మాటికీ కవిత్వానికే అని వొప్పుకున్నారు. రాణీగారు "వోహో వీరిద్దఱూ లోకంలో సర్వేసర్వత్రా చెప్పుకునే భోజకాళిదాసులు కాఁబోలు! వీరి వివాదంవల్ల మనకు యీలాటి లాభం కలిగింది. కవుల వివాదాలు కూడా లోకోపకారకాలు అవుతాయనడంయీలాటిదే అనుకుని సంతోషించారు. కథ కంచికి వెళ్లింది. మనం యింటికి వచ్చాం. కాని యీ శ్లోకానికి తాత్పర్యం కొంచెం వ్రాసి మఱీ వ్యాసాన్ని ముగిస్తాను. అసల కథేమిటంటే? సింహళ దేశాధీశ్వరుఁడు యేదో పనిమీంద యెక్కడికో వెళ్లాఁడు. అక్కడ వొక పట్నంలో వక సుందరి యీయన్ని చూచి మోహించింది. వెంటనే యీయన విగ్రహాన్ని చిత్రించడాని కాలోచించింది. మన్మథుఁడు ధనుస్సుకు నారి తగిల్చాఁడు. వ్రాసే కుంచె రెండు వేళ్లతోటీ పట్టుకుంటూ వుంది. పాపం! అంతట్లో మన్మథుఁడు పూవు బాణాలను నారితో చేర్చాఁడు. ఆ సుందరి చిత్రరచన కారంభించింది. ఆరంభించీ ఆరంభించడంలోనే బాణపాతం జరిగింది. దానితో తన సమీపమందు వున్న గోడను ఆనుకొని - ఆ సుందరియ్యేవే వక చిత్తరువుగా మాఱిపోయింది. తుట్టతుదనివున్న మాటకు చిత్తరువుగా మాఱిపోయిందనేమాటే అర్థం. అయితే ఆయీ సంగతి జ్ఞాపకం తెచ్చినంతట్లో రాజుగారికి వ్యాధికుదరడ మేమిటంటారేమో? వినండీ. ఆ కన్యకామణికి శృంగారరసావేశం వచ్చి చిత్రాకృతి యేలా ప్రాప్తించిందో యీ రాజుగారిక్కూడా తన్మయత్వంలోగతం అంతా మఱుపు తగిలింది. కాళిదాసుగారివల్ల మళ్లా ఆయాసంగతులు జ్ఞప్తికి వచ్చాయి. దానితో జ్ఞానోదయం కలిగింది. గనక యీ పైన కర్తవ్యాన్ని గూర్చి ఆలోచించుకోవడానికి కావలసినంత అవకాశం వుంటుందన్నమాట. అన్యోన్యమున్నూ ప్రేమ కలిగే వున్నారన్న అంశం తేలిందికదా? యీ పైన వీరిద్దఱున్నూ దాంపత్యధర్మమును పొందినట్లు తెలిస్తేనైతే బాగుండేది కాని ఆ విషయం నాకు చెప్పినవారు చెప్పలేదు. అందుచేత నాకున్నూ తెలియదు. యీ శ్లోకానికి సంబంధించిన కథకూడా యెవరిచేతో కల్పించబడిన బాపతే అని నేననుకుంటాను. శ్లోకంలో వున్న విషయం కల్పితం కాకపోవచ్చును కాని భోజ కాళిదాసుల వివాదమున్నూ, వారిద్దఱున్నూ దీనికోసం ఆయాదేశాలు తిరగడమున్నూ, అందులో ద్వీపంగాని ద్వీపం ఆరోజుల్లో పనికట్టుకొని వెళ్లడమున్నూ యీ సమస్తమున్నూ కల్పనే అని నా అభిప్రాయం. కాని వినేవాళ్లకు నిశ్చయంగా ఈలా జరిగివుంటుందేమో? అనే భ్రాంతినిమాత్రం పుట్టిస్తుంది. యింతకున్నూ ఈ రెండో కథవల్ల తేలేసారాంశం ఐశ్వర్యంకన్న విద్యకే యెక్కువ గౌరవం యివ్వవలసి వుంటుందనియ్యేవే. యీ మాట అందఱున్నూ అంగీకరించేదే కాని యెవరోతప్ప విద్వాంసులలో చాలామంది ఐశ్వర్య వంతులను ఆశ్రయిస్తూనే వుంటారు. "మహాభాష్యం వా పాఠయేత్ మహారాజ్యం వా పాలయేత్" అంటూ అనాదిగా వినఁబడుతుంది. భవతు. యెందరో రాజులు జ్ఞానులై రాజ్యపరిత్యాగం చేసిన కథలున్నూ వున్నాయి. యెందఱో విద్వాంసులు అజ్ఞానులై ధనార్థం చేయరాని పనులుకూడా చేసినట్టున్నూ కొన్ని కథలు వున్నాయి. వాట్ల విషయం చర్చించడానికి యీ వ్యాసాన్ని వుపక్రమించ లేదు కనుక స్పృశించి వ్యాసం ముగించఁబోతూ వున్నాను. కవికి భాషాజ్ఞానమున్నూ, వ్యాకరణాది జ్ఞానమున్నూ యెంత అవసరమో, యీలాటి పుక్కిటిపురాణాలు దేశాటనంవల్ల మఱీ యెక్కువగా తెలుస్తాయి. మఱిచిపోయినవి మఱిచిపోఁగా యింకా కొన్ని పుక్కిటి పురాణాలు జ్ఞప్తిలో వున్నాయి. అందులో కొన్ని అసభ్యపుగాథలుకూడా వున్నాయి. అవి అసభ్యులు చెప్పకుంటూవుంటే విన్నవే. కవికి సభ్యమనీ అసభ్యమనీ అంటూ భేదంతో పనివుండదు. సర్వమున్నూ వినవలసిందే, తెలుసుకోవలసిందే. యీమాట వక సందర్భంలో వక సంస్థానంలో వ్యాఖ్యానించే వున్నాము. ఆ మాటలు వుదాహరించి వ్యాసాన్ని ముగిస్తాను
(నానారాజసందర్శనమునుండి)
“శ్రీ వెలయంగ సత్కవిత చెప్పెడివాఁడనఁ బండితుండునుం
గావలె లౌకికోత్తరుఁడు గావలె బుద్ధివిశేషధుర్యఁడుం
గావలె భోగి యోగియును గావలెఁ గొంటెలలోనఁ గొంటెయున్
గావలె మంచి చెడ్డలనకన్ సకలంబు నెఱుంగఁగావలెన్
గావున నెల్లరున్ గవులు గాఁదగ రట్టికవీంద్రుభావముం
గేవలు లాదరింతురె? ... ... ... ... ... ... ..."
చాలును. అవసరమైనంతవఱకే వుదాహరించాను. యిందులో - 'అనకన్' అనేచోట వ్యతిరేకక్త్వార్ధకం కళగదా? దానికి ద్రుతమేలా చేరిందంటూ కొందఱు శంకిస్తారు. దీనికి ప్రౌఢవ్యాకరణంలో నన్నయభట్టుగారి ప్రయోగాన్ని చూపి చేసిన సమర్ధనం వుంది. కావలసినవారు దానిలో చూచుకుంటారు. కనక దాన్ని గూర్చి యిక్కడ చర్చించేదిలేదు. గ్రంథకర్త యెఱిగిన్నీ ప్రయోగించినప్పుడు దానికేదో బలవత్తరమైన ఆధారం వుంటుందనుకోవలసిందే కాని వృథాగా శంకించి పని కల్పించకూడదని విజ్ఞప్తి. ప్రస్తుతం రెండుశ్లోకాలకు సంబంధించిన పుక్కిటిపురాణగాథలు వివరించఁబడ్డాయి. మరొకటి కూడా పనిలోపనిగావుదాహరించి మఱీదీన్ని ముగిస్తాను. కాదంబరి వ్రాసిన బాణమహాకవికూడా కాళిదాసుగారి రోజుల్లోనే వున్నట్టున్నూ, తానురచించిన కాదంబరిని కాళిదాసుకు వినిపించిరమ్మని వేశ్యాగృహంలోకి తనకుమారుణ్ణి పంపించినట్టున్నూ, కొడుకు వినిపించివచ్చాక "యేమన్నాఁడు కాళిదాసు?" అని కొడుకును అడిగినట్టున్నూ, అంతా విని– “యీఁగలు ముసురుతూ వున్నాయి కాదంబరికి" అన్నాఁడు కాళిదాసని చెప్పినట్టున్నూ “కాళిదాసు యీసడించిన కవిత్వం యేం కవిత్వ"మనుకొని ఆ గ్రంథాన్ని తగలఁబెట్టినట్టున్నూ తరువాత యీ సంగతి కాళిదాసు విని చాలా నొచ్చుకొని- "నేనేమో? కాదంబరీ (యీఁతకల్లు) శబ్దగతమైన శ్లేషార్ధాన్ని పురస్కరించుకొని ఆలా చమత్కరించి అన్నమాట సత్యమే. ఆమాట ప్రశంసకు సంబంధించిందే కాని యీసడింపుగా భావించడానికి కాదు. నీకావ్యం సర్వవిధాలా సర్వోత్కృష్టంగా వుంది. అట్టే చెప్పేదేమిటి?- "బాణోచ్చిష్ట మిదం జగత్' అని చెప్పవలసి వుంది". అని చెప్పి “సరే నేను విన్నంతమట్టుకు నేను మళ్లా యేకరుపెడతాను వ్రాసుకోవలసిం"దని అలా చేసినట్టున్నూ, వినిపించని భాగం మాత్రం కొఱఁత వుండఁగా బాణుఁడు స్వర్గానికి వేంచేసినట్టున్నూ, తరువాయి అంటే? ఉత్తరకాదంబరిని బాణుఁడి కొడుకు పూర్తిచేసినట్టున్నూ చెప్పఁగా విన్నాను. దీన్నిబట్టి బాణ కాళిదాసులు వొకటే కాలంలో వుండవలసి వస్తుంది. కాలాన్ని సహేతుకంగా పరిశీలించేవారు దీన్ని బొత్తిగా అంగీకరించరు. యీ పుక్కిటి పురాణకథను బట్టి, అంత మహాకవికి బాణుఁడికి కూడా కాళిదాసంటే, యెంతో గౌరవం వుండేదని తెలుసుకోవడమే ఫలితం. యీ గౌరవం వుండడానికి యేక కాలీనత్వంతో అవసరం వుండదు. ఆ యీ కథలన్నీ కాళిదాసుని పోలినకవి- 'న భూతోనభవిష్యతి" అని తెలుసుకోవడానికే పనికివస్తాయి. కాళిదాసు "కేకసంథాగ్రాహి అనేకాక ఆ యేకసంథాగ్రాహిత్వం ఛందోబద్ధవిషయమే కాదు; వచనంలో కూడా" అని పైకథవల్ల తేలుతుంది. యీ విషయం యితర భాషలలో కూడా సమర్థించాఁడు మన తెలుఁగువాఁడు పండిత రాయలు. పైపనినే కోర్టులో వొకానొక దావాలో సుమారు నెలరోజులు తానిచ్చిన సాక్ష్యాన్ని మళ్లా తూ-చా తప్పకుండా అనులోమంగానూ, విలోమంగానూ కూడా వొప్పఁజెప్పి “అభినవ పండితరాయ" బిరుదాన్ని పొంది వున్నారు నిన్న మొన్నటిదాఁకా సజీవులుగా వున్న శ్రీమాన్ మాడభూషి వేంకటాచార్యలవారు. బాణుఁడున్నూ భవభూతిన్నీ సభలో విద్యావిషయంలో వివాదపడ్డట్టున్నూ అపుడు బాణుఁడు - శ్లో. నిశ్శ్వాసో౽పిన నిర్యాతి బాణే హృదయవర్తిని, కిం పునః ప్రకటా౽౽టోపపదబద్ధా సరస్వతీ" అని తన పేరును శ్లేషించి భవభూతిని తిరస్కరించి నట్టున్నూ, దానిమీఁద భవభూతికి కోపంవచ్చి - శ్లో. హఠా దాకృష్టానాం కతిపయపదానాం రచయితా జన స్స్పర్ధాళుశ్చే దహహ! కవినా వశ్యవచసా| భవే దద్యశ్వో వాకిమిహ బహునా పాపిని కలౌ| ఘటానాం నిర్మాతు స్స్త్రిభువనవిధాతు శ్చకలహః" అని భవభూతి బాణుణ్ణి యీసడించినట్టున్నూ వక కథ వుంది. యీ కథలని పట్టిచేస్తే ఆ యీ కవులు యేకకాలికులు కాకపోయినా, వొకవేళ యేకకాలికులే అయితే వొకరికి వొకరు తీసిపోయేవారు కారనే ఫలితార్థం తేలుతుంది. ఆలా తేలడంలో కాళిదాసంటేమాత్రం ఆయీ పెద్ద పెద్ద కవులందఱూ శిరసా వహించేవారే అనిన్నీ కొన్నిటివల్ల తేలుతుంది. ఆంజనేయులు రచించి కారణాంతరంచేత చించి పాఱవేసినబాపతు రామాయణంలో చిలక్కొట్లు దొరకడమున్నూ, వాట్లని దండి భవభూతి కాళిదాసులు వారి వారి కల్పనలతో పూరించడమున్నూ అందులో తారతమ్య నిర్ణయమున్నూ భోజరాజసభలోనే జరిగినట్లు చెప్పుకుంటూ ఆనందించడం నేను బహుధావినివున్నాను. యేకకాలీనులు కానిపక్షంలో కూడా ఆలాటి పూర్తి జరగడానికిన్నీ భోజరాజుకాకపోతే మఱివకరాజేనా ఆ విషయాన్ని గూర్చి తనసభలో చర్చ జరిగించడానికిన్నీ అభ్యంతరం వుండదనిన్నీ, దాన్ని సుప్రసిద్దుఁడుకనక భోజుఁడికి అంటఁగట్టారనిన్నీ మనం సమన్వయించుకోవచ్చునని నేను అనుకుంటాను. బాణుఁడు కాళిదాసురోజుల్లో వున్నాఁడనేకథలు అంతగా లేవుగాని దండిభవభూతులను గూర్చినవి మాత్రం చాలా వున్నాయి. కాళిదాసును గూర్చి అతనితో సమకాలికులేకాక అతనికి పూర్వీకులుగా వుండే ఋషులుకూడా వొప్పుకొన్నట్టే కొన్ని కథలు- “చకారకుక్షిగాcడు" అనే వాక్యానికి సంబంధించినవి వగయిరాలు కనపడతాయి.
"అయి ఖలు విషమః" అనేదాని పూర్తివిషయంలో కాళిదాసు ఆంజనేయుఁడికన్నా విశేషజ్ఞుఁడని తేలుతుంది. మొత్తంమీఁద, కాలమ్మాటదేవుc డెఱుఁగునుగాని కాళిదాసు పేరు చెప్పకొంటూ మన ఖండంలోనేకాదు; యూరపుఖండంలోకూడా ఆనందిస్తూవుండడం అనుభవసిద్ధంగా కనపడుతుంది. విషయభేదంవుంటే వుండనివ్వండిగాని కాళిదాసుకన్న కూడా మిన్నగా ఖండాంతరాల్లో గౌరవింపఁబడేపేరు మళ్లా కవర్గాదిలోనే- "గాంధీ" గారికి కనపడుతుంది. రామకృష్ణాదులనేనా యితరఖండవాసులు యీసడిస్తారేమో కాని పై పేళ్లవారిని మాత్రం యీసడిస్తారని తోcచదు. కల్పనా కథలు యథార్థచరిత్రం వున్న వారి విషయంలోకూడా బయలుదేఱుతూనే వుంటాయి. వాటిని ఆఁపడానికి శక్యంకాదు. యీ బయలుదేఱడాన్ని గూర్చి మఱొకప్పుడు విస్తరిస్తాను, యిప్పుడు దీన్ని ముగిస్తాను.
★ ★ ★