కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/నేను-మా తిరుపతిశాస్త్రుల్లూ



నేనూ-మా తిరుపతి శాస్త్రుల్లూ

తిరుపతి శాస్త్రిగారు ప్రజోత్పత్తి సం. ఫాల్గునమాసంలో జన్మించాఁడు. నేను ప్రమోదూత సం. శ్రావణమాసంలో పుట్టడంచేత నాకన్న రమారమీ వత్సరంమీఁద యేడుమాసాలు చిన్న. నేను శ్రీ చర్ల బ్రహ్మయ్య శాస్త్రుల్లుగారివద్ద చదువుకోవడానికి వెళ్లేపర్యంతమున్నూ మాయిద్దఱికీ యేవిధమైన సంబంధమూ లేకపోవడమే కాక, ఒకరివూరు పేరు వేఱొకరికికూడా తెలియనే తెలియదు. శాఖకూడా ఒకటికాదు. “అడవియుసిరికాయ" పద్యం చూచుకోండి. నేను శ్రీ శాస్త్రులవారి విద్యార్థిత్వానికి ప్రవేశించిన "టయిము” సర్వధారి సం. ఆషాఢమాస మవడంచేత, అప్పటికి నావయస్సు రమారమి 19 టికి లోపు. నాకంటే సుమారు 4-5 మాసాలు ముందుగానే అతఁడు ప్రవేశించాఁడని అన్యత్ర వ్రాసేవున్నాను. ఆలోగా అతఁ డెక్కడెక్కడ శిష్యత్వం చేసిందీ, యేమేమి చదివిందీకూడా అన్యత్ర వ్రాసేవున్నాను. అతఁడు తీవ్రమైన బుద్ధిశాలి. ఆ బుద్ధి తీవ్రత అతని పురాకృత పుణ్యలబ్ధమే అయినా పితృప్రసాద మనికూడా అనుకోకతప్పదు. అతని తండ్రిగారు ఘనాంతస్వాధ్యాయపరులున్నూ, షోడశకర్మాధి కారులున్నూ అయి వుండికూడా తిరుపతిశాస్త్రికన్నా మిన్నా అని వప్పుకోఁ దగ్గంత బుద్ధిసూక్ష్మత కలవారుగా యేదేనా శ్లోకం అన్వయించవలసి వచ్చిన సందర్భంలో కనపడేవారు. ఛాందసులలో యెక్కడోగాని సాహిత్యపరులు వుండరు. వీరు ఛాందసులుగా వుండి కూడా తగుమాత్రం సాహిత్యం కలవారుగా వుండి పెద్దపెద్ద సాహితీ పరులకన్న మిన్నగా అన్వయించే శక్తి కలిగి వుండేవారు. దాన్నిబట్టి వారి బుద్ధివిశేషాన్ని నే నింతగా కొనియాడవలసి వచ్చింది. అంతేకాని తిరుపతిశాస్త్రి యందుండే అభిమానంచేత మాత్రం కాదు. యిందులోతప్ప ఛాందసులకు వుండే ఛాదస్తాలు అన్నింటిలోనూ యితరఛాందసులకు లేశమూ తీసిపోయేవారు కారు సరిగదా, అతిశయించేవారుకూడాను. మొఖం యొక్క ఆకారమున్నూ కాటుకకళ్లున్నూ, బుద్ధి చాకచక్యమున్నూ, మఱికొన్ని పట్టుదలలున్నూ తిరుపతిశాస్త్రికి పిత్త్రియమైనసోత్తే, “కన్యా పితృముఖీ ధన్యా ధన్యోమాతృముఖ స్సుతః" అన్నశాస్త్రం యిక్కడ తారుమాఱయింది. తగుమాత్రం కావ్యపఠనంలో తండ్రిగారే గురువులు; కొంతవఱకు స్కూలు మాస్టరుగారు. అప్పటిస్కూలు మాస్టర్లలో కొందఱు నికరమైన సాహిత్య పరులుండేవారు. మన తి. శా.గారి మాస్టరు వారిలో వొకరు. వారినియిటీవల నేను సందర్శించి వున్నాను, యితనిబుద్ధి చాకచక్యాన్ని గూర్చి వారెచెప్పఁగా విన్నానుకూడాను. తరవాత గంకలకుఱ్ఱు వగయిరా గ్రామాలల్లో తరవాయి కావ్యాలున్నూ తగుమాత్రం నాటకాలూ భాణాలూ చదవడం జరిగాక కొంచెం తర్కంలో ప్రవేశించి వేలెట్టి యేకొంచెమో చదివి శ్రీ బ్రహ్మయ్యశాస్త్రుల్లుగారు కాశీనుంచి దేశానికి వచ్చి విద్యార్థిపోషణార్థమై జల్లిసీమకు ప్రయాణమై రావడంలో వీరివూరు యండగండి వెళ్లడంలో వీరింటివద్దనే శాస్త్రుల్లుగారు మకాం చేశారు. ఆ గ్రామానికి యెంత మంది అతిథులు వచ్చినా వీరియింటనే అన్నప్రదానం జరిగేది. ఆ సందర్భాన్ని పట్టే మన తిరపతి శాస్త్రి "అన్న మెన్నం డేరికైన లేదనని యుత్తమురాలు తల్లి శేషమ సుసాధ్వి" అని వ్రాసి వున్నాఁడు. ఆ యిల్లాలిని నేనున్నూ బాగా యెఱుఁగుదును. మాయిద్దఱికి అనుబంధం యేర్పడ్డ తర్వాతకూడా ఆమె చాలా కాలం జీవించే వుంది. తండ్రిగారుకూడా డిటో, వారిద్దఱూకూడా నన్నుకొడుకు తిరపతిశాస్త్రికన్నాయినుమిక్కిలిగా ప్రేమించేవారు. తిరపతి శాస్త్రి సోదరులు మఱినలుగు రుండేవారు. వారుకూడా నన్ను ఒక సోదరుఁడుగానే భావించేవారు. మేనమామ లోనయిన బంధువులందఱూ వాడికంటేకూడా నన్నే మిక్కిలిగా ప్రేమించేవారు. మే మిద్దఱమూ యేదేనా విద్యావిషయంలో వాదం పెట్టుకున్నప్పుడు తి. శా, గారి తండ్రి వేంకటావధాన్లు గారు తీర్చవలసివస్తే నిష్పక్షపాతంగానే తీర్చేవారు కాని కొడుకని లేశమున్నూ పక్షపాతం చూపేవారు కారు. ఆ కాలానికీ సర్వత్రా వ్యాపకంలో వుండే శాఖాపక్షపాతంకూడా ఛాందసులైనా వారి దగ్గిఱ లేశమున్నూ నా విషయంలో వుండేది కాదు. దానికి తార్కాణం వారి తండ్రిగారి ఆబ్దికానికి వెల్నాటిశాఖీయులు పలువురు వున్నా నన్నే భోక్తగా నియంత్రణ చేసేవారు. “వొరే! నీవు కాళిదాసువురా" అని నన్ను శ్లాఘిస్తూ వెనక వ్యాసులూ, కాళిదాసూ యెక్కడో బ్రాహ్మణార్థం చేసినకథ వుపన్యసిస్తూ వుండేవారు. దీన్ని యిలా వుంచుదాం.

మన కథానాయకుఁడు బ్రహ్మయ్యశాస్త్రుల్లుగారి శుశ్రూషకు ప్రవేశించడం యేలా తటస్థించిందో అంతవఱకు ప్రస్తుతాంశం వ్రాసినట్లయింది. అతఁడు ప్రవేశించిన నాల్గు లేక అయిదు మాసాలకు నేను కంటిజబ్బు కొంత కుదుర్చుకొని శాస్త్రులవారి శుశ్రూషకు ప్రవేశించాను. అప్పటికి సిద్ధాంతకౌముది శబ్దాధికారం పూర్తిఅయింది తిరుపతిశాస్త్రికి. నాకు చామర్లకోట గురువులవద్ద లఘుకౌముదిలో అంతవఱకున్నూ అయిందికాని సహాధ్యాయిత్వం కుదరడం యేలాగ? విషయం ఒకటే అయినా సిద్ధాన్తకౌముది చదివినవాఁడితో లఘకౌముది చదివినవాఁడు సరీసమానంగానే కాదు, యేతాం పెట్టుగా కూడా తూఁగఁడు. ఆ కౌముది చదవడానికీ యీకౌముది చదవడానికీ భేదం వంటిపూఁటి తిండికీ ఆబ్దికపు బ్రాహ్మణార్థానికీ వున్నంత తేడా వుంటుంది. అందుచేత మఱికొన్నాళ్లదాఁకా మే మిద్దఱమున్నూ సతీర్థ్యులమే కాని సహాధ్యాయులం కావడం జరగలేదు. నాకు సంస్కృతాంధ్రాలలో సంగీతధోరణిగా పురాణం చెప్పేశక్తీనిన్నీ అంతో యింతో కవిత్వం అల్లేశక్తీనిన్నీ వుండేవి. పయిగా నేను ఫ్రెంచి టవును యానాంవాణ్ణి, పురాణంమట్టుకు సంగీతధోరణితో కాకపోయినా చెప్పేశక్తి అతనికిన్నీ వుండేది. అతఁడు శుద్ధపల్లెటూరివాఁడు. మే మిద్దఱమూ కలవడానికి యితరవిద్యార్థులకూ తిరుపతి శాస్త్రుల్లుకీ అప్పట్లో వుండే పార్టీకలహాలు ప్రతి బంధకాలుగా కూడా వుండవలసివచ్చింది. నేను అతని యెదుటిపార్టీ విద్యార్థులకు నాయకుణ్ణిగా వుండవలసి వచ్చింది. నేను వచ్చేలోపున తిరుపతిశాస్త్రి తెల్వితేటలను చూచి వోర్వలేని విద్యార్థులు అతణ్ణి సర్వవిధాలా ద్వేషిస్తూ, యెందుకూ తమతో కలియ నిచ్చేవారుకారు. వ్యాకరణంలో అయితే ఆ విద్యార్థులు తిరుపతిశాస్త్రికంటే చాలా గ్రంథం అధికంగా అయినవాళ్లేకాని వాదం వస్తే యితఁడు చదువుకున్న భాగంలోనేకాక చదువుకోని భాగంలో కూడా ప్రతిపక్షులను బుకాయించి వోడించేవాcడు. “బూకారిగాని... ... బోలరయా మితభాషులు” అని వుందికదా! దానితో వాళ్లకు కడుపులో మంటగా వుండేది. యితనివాదం న్యాయమైనదిగా వుండడం దృశ్యాదృశ్యమే కాని యేదో అగమ్యగోచరప్పుంతగా వాదించి ఆవలివాళ్లకు వాగ్బంధం కలిగించేవాcడు. వాదంలోనే కాదు, మావాడి నడకకూడా అలాటి మార్గంగానే వుండేది. ప్రయాణాలల్లో “అతణ్ణి ముందుతోవ తీయనీయవద్దు, ముళ్లత్రోవ తీస్తాఁ" డనేవారు గురువుగారు. శాస్త్రులుగారు కూడా తగవుదిద్దితే వకపట్టాన్ని సుఖసుఖాల సమ్మతించడం వుండేదికాదు. యిదంతా మనస్సులో పెట్టుకొనియ్యేవే.

“తోడకలార్థు లే ధూర్వహుతెల్వికీ
 ర్ష్యవహించి కలహముల్ సల్పుచుంద్రు"

అని అతని నిర్యాణానంతరం ఒకసభలో చెప్పినపద్యాలలో వ్రాసి వున్నాను. నేను ప్రవేశించిన రెండు నెలలదాఁకా మా యిద్దఱికీ అంతమైత్రిగాని, అంత వివాదంగాని లేదు. ఒక మాదిరిగా కాలక్షేపం జరుగుతూవుంది. త్వరగా త్వరగా చదివి వ్యాకరణంలో అతనితో నేను కలుసుకుందామంటే అతనిపాఠం అతఁడున్నూత్వరగానే చదువుతాఁడుకదా? అందుచేత నే నెంత పెద్దపాఠం చదివినా ప్రయోజనం లేదు. కాని అతఁడెప్పుడూ చదివినపాఠాన్ని మళ్లా చూడడమంటూ వుండేదికాదు. (ఎవఁడెన్నఁడును పొత్తమెలమి విప్పకయె వ్యాకరణపాండిత్య ప్రకర్షమూనె) నేనో? చదువుకున్న పాఠాన్ని బాగా స్వాధీనపఱచుకొనేవాణ్ణి. యిూ. స్థితిలో వుండ గణపతినవరాత్రాలు వచ్చాయి. ఆ వుత్సవాన్ని చేయడానికి యాచనకంటూ బయలుదేఱి వెళ్లడం జరిగింది. అందులో శాస్త్రుల్లుగారు నన్ను నాయకుణ్ణి చేశారు. కారణం యేవో నాల్గుడబ్బులు సంపాదించడానికి అనుకూలించే సభారంజకత్వం అప్పటికే నా దగ్గిఱ వుండడమే. వట్టి శాస్త్రంలో యెంత ప్రవేశమున్నా అది ధనార్జనకు సాధకం కాదుగదా! సరే, నలుగురం కలసి వెళ్లి లక్కవరంలో ఒకరోజు పురాణం చెప్పడానికి సభ జరిగించాం. తి. శా, గారు చదవడం, నేను రాగధోరణితో అర్థం చెప్పడం. విరాటపర్వం ఉత్తరగోగ్రహణం పురాణం జరుగుతూ వుంది. గంట గంటన్నఱ జరిగాక, యెవరో వక సభ్యుఁ డన్నాఁడు కదా "అయ్యా! మీరే చదివి కొంతసేపు మీరే అర్థం చెపితే వినాలని కొందఱు కుతూహలపడుతున్నా"రన్నాఁడు. వినీ విననట్టు మేము మామూలుగా చెప్పుకుపోతున్నాం. మళ్లా అలాగే అన్నాఁడాయన. దానిమీఁద తి. శా. పుస్తకం నాచేతికిచ్చేశాఁడు. మఱి కొంతసేపు నేనే చదివి నేనే అర్థం చెప్పడం జరిగింది. సమ్మానమున్నూ జరిగింది. కాని నామనస్సులో తి. శా. కి కష్టంగా వున్నట్టు అనుమానం వుదయించింది. దానికి తథ్యంగా ఆమర్నాడు నేను యాచనకు పనికివచ్చేలాగు చెప్పిన "శ్రీసుధాంశునిఁ బోల్పఁగా సరియౌ" అనే పద్యంలో మూఁడోచరణం, అంటే "భార్గవుండీ డనఁబరఁగు భార్గవునకుఁ గ్రోధాపవాదంబు కూడదేని" అనే చరణంలో వున్న పరశురాముణ్ణి దానవిషయంలో పోల్చడం కవి సమయవిరుద్ధ మంటూ పోట్లాట కారంభించాఁడు. చాలాసేపు పరశురాముఁడు మహాదాత నిన్నీ రాజుల నందఱినీ వధించి భూమి యావత్తూ బ్రాహ్మలకు ధారపోశాఁడనిన్నీ నేనున్నూ వాదించాను. కాని “అయితే అయింది కాక; అంతమాత్రంచేత లాభంలేదు. పూర్వకవు లెవ్వరూ వాడలేదు కనక వొప్పేదిలే"దన్నాఁడు. తుదకి “త్వం శుంఠా త్వం శుంఠా” “ముష్టియుద్ధం పునః పునః" దాఁకా వచ్చింది. కొట్టుకోవడంకూడా జరిగినట్టే జ్ఞాపకం. మఱి యిద్ధఱుకూడా వున్నారు కనక జుట్లు వదిలిపించారనుకుంటాను. యీవాదంలో “నిన్ను మట్టు పెట్టకపోతే నన్నీ పేర పిలవనే వద్ద"న్నాఁడు తి. శా. నాకు అప్పటికి పూర్వరకం గిరజాలు వుండేవి. మీసం వస్తూవస్తూవుంది. సిద్ధంగా వున్న ఆస్తి గిరజాలు కనక “నేను వోడిపోతే గిరజాలు గొఱిగించుకుని అప్పుడు ఆచరణం దిద్దుతానుకాని యాలోగా దిద్దేదిలే"దన్నాను నేను. గురువుగారిదగ్గిఱికి వెడితేనే కాని యీ తగవు తీరదు. ప్రస్తుతం ప్రయాణంలోవున్నాం. ఒకరికీ వకరికీ "పచ్చగడ్డేస్తే భగ్గు" మనే స్థితిలో వుంది. “యీలాటి తప్పుడు కవిత్వం చెప్పే నీతో నేను కలిసివచ్చేది లేదన్నాఁడు తి. శా. "నీవు రానేవ"ద్దన్నాను నేను. అప్పుడు యింకొక విద్యార్థిన్నీ అతఁడున్నూ కలసి జంగారెడ్డిగూడెం వెళ్లారు. నేనున్నూ, మఱోవిద్యార్థిన్నీ కామవరపుకోట వెళ్లాము. తి. శా. వెళ్లినచోట ద్రవ్యార్జనకు మంచిది కాని ఆదాత ఆసమయానికి తాగి వున్నాఁడు. అందుచేత శుద్ధశూన్య మయిపోయింది. కామవరపుకోటలో దుకాణానికి డబ్బూ, రెండు డబ్బులూ ముష్టెత్తి యేస్వల్పమో గణించుకొని నియమితకాలానికి గురుసన్నిధానానికి చేరుకున్నాం. మేం తెచ్చిన ద్రవ్యం కొంచెమే అయినా గురువుగారు సొంత ద్రవ్యంతో నవరాత్ర ప్రారంభం చేశారు. వెళ్లింది మొదలు గురువుగారి దగ్గఱ మాతగవు ప్రారంభమయింది. వారు శాస్త్రాలల్లోనే కాని యీలాటివిషయాలు ఆదరంగా చూచేవారు కారు.

అందుచేత యెవరికీ అనుకూలించేమాట చెప్పక “యిందులో యేముంది? పోనిస్తురూ, స్నేహంగా వుండి చదువుకోండి, బాగుపడండి" అంటూ సబోరీమాటలు చెప్పేవారు. అందుచేత తగవు తగవులాగే వుండిపోయింది. (కాని పరశురాముణ్ణి దాతృత్వానికి వుపమగా తీసుకోవడం కవిసమయసిద్ధమే. చెప్పడం మొదలెడితే ప్రయోగాలు బోలెడున్నాయి) మళ్లా మాట్లాడుకుంటూనే వుండేవాళ్లం. యితరులతో వాదాలు మా కిటీవల తటస్థిస్తూవచ్చాయి. కాని మొట్టమొదటినుంచీ మాలో మాకే వాదాలు యెప్పుడూ పడుతూవుండేవి. అప్పుడు విరోధంవచ్చి శంకించాఁడుగాని స్నేహంగా వుండి గ్రంథరచనచేసే రోజుల్లో కూడా అడ్డదిడ్డశంకలు చేయడం తి. శా. కి అలవాటు. “కాదన్నవాఁడు కరణం" అన్నట్లు శంకించడమే అతనిపని. దీన్నిగుఱించి వ్రాస్తే యెన్నో వ్రాయాలి. మే మిద్దఱమూ కలసి, క్షీరనీరన్యాయంగా రచన సాగిస్తూ వున్న రోజుల్లో జరిగిన వక సందర్భంమాత్రం వుదాహరిస్తాను. ఆత్మకూరు సంస్థాన గజారోహణోత్సవానికి హేతుభూతమైన శ్రీనివాసవిలాసాన్ని ఆంద్రీకరించడాన్ని గూర్చి చాలా సంగతులు నానారాజ సందర్శనంలో చదివే వుంటారు చదువరులు. అక్కడ పండితులతో మొట్టమొదట విద్యావివాదం జరిగిన పిమ్మట ఆ రాజుగారు మా శక్తి తెలుసుకొనే తలఁపుతో ఆంద్రీకరణానికి గ్రంథం యిచ్చి ఆరు మాసాలు మాత్రమే గడువు యిచ్చారు. మంచిదని వొప్పుకొని దేశానికి వచ్చేశాము. “యీ భాగం నీవంతు, యీ భాగం నావంతు" అని గ్రంథాన్ని ఆంద్రీకరణ విషయంలో తోవలోనే విభజించుకొని యెవరి గ్రామానికి వాళ్లం ప్రవేశించాము. యిఁక 15 రోజులలో కృతి యివ్వడానికి ప్రయాణ మనఁగా యిద్దఱమున్నూ కలుసుకొని, పిఠాపురంలో శ్రీవాడ్రేవు వేంకటరత్నంగారికి అతిథులుగా వుండి ఆదరించఁబడుతూ వారి పెరట్లో వున్న దివాన్ బంగాళామీఁద కూర్చుని సాపువ్రాఁత కుపక్రమించాము. యెప్పుడూ నేను స్వహస్తంతో వ్రాసుకోవడమే గాని యెవరిచేతా వ్రాయించడం అలవాటులేదు. యీ రోజు వఱకున్నూ వోపిక లేకపోయినా, చేయి వణుకుతూ వున్నా ఆలాగే జరుగుతూ వుంది. అతని దస్తూరీకూడా వీలైనదే అయినా శ్రద్ధగా వ్రాయఁడనే కారణంచేత అతఁడు చెపుతూవుంటే నేను వ్రాయడమే జరుగుతూ వుంది. యేవో శంకలు చేస్తూవుంటే, సమాధానం చెపుతూ వ్రాస్తూవున్నాను. ఒక్కొక్కశంక మఱీ తలతిక్కగా వుండేది. వున్నాసరే వోపికపట్టి సమాధానం చెపుతూ వ్రాస్తూవున్నాను. రాజుగారి వంశ వర్ణనదాఁకా గ్రంథం సాపువ్రాయడం జరిగింది. ఆరంభంలో వక పద్యంలో

“సచ్ఛూద్ర" పదందగ్గిఱ “సచ్ఛూద్రౌ గోపనాపితౌ” “యోగాద్రూఢిర్బలీయసీ" అని వుండడంచేత గొల్లలో, క్షౌరకులో అర్థం కావలసివస్తుంది కాబఁట్టి దిద్దాలన్నాఁడు. “నీశంక యుక్తమే కాని భారతంలో ఉత్తమశూద్రులు అనే అర్థంలో వాడివున్నారని సమాధానం చెపితే కూడా తృప్తిపడక పిడివాదానికి ప్రారంభించేటప్పటికి గత్యంతరం కనపడక సాపువ్రాసే కాగితాలున్నూ, చిత్తుప్రతిన్నీ ఆంద్రీకరణానికి రాజుగారు యిచ్చిన మాతృకసంస్కృతమున్నూ రెండేసి తునకలుగా చింపి ఆ మేడకింద వున్న తూముకాల్వలోకి విసిరేసి “యిక మనం ఆ రాజు గారిదగ్గిఱికి వెళ్లావద్దు, కృతి యివ్వావ"ద్దని అక్కడినుంచి లేచి యివతలికి వస్తూవుండఁగా, నవ్వడానికి మొదలెట్టి, సరే! నీకు మళ్లా చేతి నిండా పని కల్పించడానికే నే నిలా చేస్తూవుంటాను. తెలిసిందా? యింకో మాటు వ్రాస్తే దస్తూరీ మఱీ బాగుంటుంది" అంటూ ఆ తునకలన్నీ పైకి తీసి "మళ్లా చెపుతాను. రాఁతకు మొదలెట్ట" మన్నాఁడు. యిఁక నువ్వు వ్రాయవలసిందే నేను వ్రాసేది లేదన్నాను. “ఓ, యింతకంటే వుందా? నాకేం చేతకాదా? ఆలాగే వ్రాస్తా"నన్నాఁడు. "వ్రాస్తే సంతోషమే. తప్పులుపడితే తప్పు 1కి యింత అని యేర్పాటుచేసి మఱీ మొదలెట్టా"లన్నాను. "అది నావల్లకాదు, ఆ పద్ధతిని మళ్లా నీవు వ్రాసుకోవలసిందే" అన్నాఁడు. యీలాగే మాలో మేము కిందా, మీఁదా పడుతూ ఆయాగ్రంథాలు రచించడమూ, చించడమూ జరిగేది. యిద్దఱమ్మాత్రం వున్నప్పుడే యీ తలతిక్క వాదాలుగాని యితరులతో వాదం వచ్చినప్పుడు సాధ్యమయినంతవఱకు నామీఁదే వదిలేశేవాఁడు. తనవాదం ప్రామాణికవాదం కాదని అతనికి పూర్తిగా తెలిసే, పనిపడ్డప్పుడు నామీఁదే భారం వుంచేవాఁడు. ఆయాలక్ష్యాలు కష్టపడి వెదకడం అతనికి పట్టేదికాదు. వోపిక లేకకాదు గాని యెందుచేతో ఆపని పెట్టుకొనేవాఁడు కాఁడు. ప్రయాణాలల్లో వున్నప్పుడు యెవరేనా వచ్చి, యేదేనా లక్ష్యాన్ని గుఱించో, లక్షణాన్ని గుఱించో అడగడానికి వస్తే వారికి నన్నుచూపించే వాఁడు గాని లేశమున్నూ అందులో కలగచేసుకునేవాఁడే కాఁడు. ఆమరణాంతమూ యీ విషయం యిట్లాగే జరిగింది. యెప్పుడు గాని ఖండన మండనాలను గుఱించి యేపత్రికకూ మేటరు పంపేవాఁడే కాఁడు. వొక పర్యాయం కాఁబోలును ఆర్యమతబోధినికి వకరి కవిత్వాన్ని వెక్కిరిస్తూ వ్యాసం వ్రాసి పంపి, ఫయినల్ ప్రూఫు మాత్రం బందరులో వున్న నాపేర కాకినాడ నుంచి పంపడం జరిగింది. అది చాలా అందంగానూ, యుక్తియుక్తంగానూ వుందికాని ఖండిస్తే నిలిచేస్థితిలో లేదు. ఆ సంగతి తెలుపుతూ దాన్ని ప్రచురించవద్దని వ్రాశాను. దానితో ఆమేటరు పత్రికలో ప్రచురించలేదు. ఆ ప్రూఫుకాగితాలింకా నావద్ద వెదికితే దొరుకుతాయేమో? ఆయీకారణాలచేతనే అతఁడు సాహసుఁడనిన్నీ శ్రద్ధ తక్కువ వాఁడనిన్నీ నేను అన్యత్ర వ్రాశాను.

శ్లో. ఆస్థా స్వాస్థ్యే యదిస్యాతాం 1 మేధయా కిం ప్రయోజనమ్
    తే ఉభేయది నస్యాతాం ! మేధయా కిం ప్రయోజనమ్.

పూర్వజన్మసుకృత బలిమిచేతనే పుస్తకం విప్పి పాఠం వల్లించకుండానే వ్యాకరణపాండిత్యాన్ని ఆర్జించాడు.

“ఎవఁడెన్నఁడును బొత్తమెలమి విప్పకయె వ్యా
            కరణపాండిత్యప్రకర్షమూనె.”

అని సానుభూతిసభలో నేను వ్రాసినదాన్ని యిదివఱకే వుదాహరించి వున్నాను. గురువుగారు చెపుతూవుంటే వినేవాఁడు. అదేనా ఒకప్పుడు ఆయనక్కూడా గంగవెఱ్ఱులెత్తించే శంకలుచేసి వేధించేవాఁడు. ఆలాటప్పుడు గురువుగారికి కోపమైతే వచ్చేదిగాని, అంతరంగంలో సంతోషంకూడా కలిగేది. యెందుచేత? కొన్ని శంకలు పిచ్చిశంకల్లా వున్నా కొన్ని శంకలు యేభాష్యంలోనో, యేశేఖరంలోనో వున్నవిగా వుండేవి. (యీ విషయంలో యితఁడు బందరు “డుండుం” వంటి వాఁడు. ఆయనను గూర్చి అన్యత్ర వ్రాశాను) అప్పటికి ఆ గ్రంథాలు చదవకుండా వున్న వాcడినోట ఆలాటివిశేషాలు వెలువడుతూవుంటే యే గురువునకు సంతోషం కలగదు? యీలాటిశిష్యులను గూర్చే "గురూపదేశం ప్రతిభేవ తీక్ష్ణా" అని నైషధంలో వ్రాసివున్నాఁడు. తీవ్రమైనబుద్ధి గురువు చెప్పేదాఁకా నిరీక్షించలేదనీ దానితాత్పర్యం. ఆ లక్షణం మన తి. శా. గారి బుద్ధికి పూర్తిగా పట్టింది. కాని అట్టి గ్రహింపుతోపాటు కొంచెం మననం చేయడంకూడా వుంటే యింకా యెక్కువ వుపయోగపడేది. అది లేక పోవడంచేత యెప్పటికప్పుడు దాcటుకునే మార్గాలు తొక్కి ప్రతిపక్షులకు లొంగకపోవడమే తటస్థించేది గాని దాన్ని గ్రంథరూపంగా ప్రచురింపవలసివస్తే చిక్కురాక తప్పేదికాదు. యీ విషయం అతనికి పూర్తిగా తెలుసును. తెలిస్తేమాత్రం యేంచేస్తాడు? మొదటినుంచీ అలవాటు ఆలా పడింది.

యిది విద్యావిషయంలో మాత్రమేకాదు. శరీరారోగ్యవిషయం కూడా యీలాగే వుండేది. తుట్టతుదిరోజుల్లో అతిమూత్రవ్యాధి కనపడిందని నాపేర వుత్తరం వ్రాస్తే నూజవీటిసంస్థానాన్నించి నానిమిత్తం తెచ్చి వుంచుకున్న మంచి మందును పంపించాను. కొన్నాళ్లువాడి, వ్యాధి నివారణయిందని సంతోషిస్తూ జవాబు వ్రాశాఁడు. దానికి జవాబు వ్రాస్తూ వ్రాశానుకదా - అయితే అయిందిగాని యిఁకమీఁదట కాఫీ అలవాటు పూర్తిగా తగ్గించవలసిందని కఠినంగా వ్రాశాను. అంగీకారం తెలుపుతూ జవాబు వ్రాశాఁడు. మళ్లా అన్నవరం కొండమీఁద సత్యనారాయణ స్వామివారి వుత్సవసందర్భంలో కలుసుకున్నాం. అక్కడ ధర్మకర్తగారు వగయిరాలు కాఫీ పుచ్చుకుంటూ వుంటే వీఁడుకూడా సిద్ధపడ్డాఁడు. అప్పుడు నే నన్నానుగదా - "తొందరగా నిష్కారణంగా యెందుకు చస్తావురా? మళ్లా కాఫీ మొదలెట్టి" అన్నాను. దానికి వాఁడిమనస్సు చివుక్కుమంది. దానిమీఁద కాఫీపుచ్చుకొనేదైతే మానలేదుగాని “వొరేయి! నీనోరు విషపునోరు. నువ్వల్లా అనకురా!" అని మాత్రం అన్నాఁడు. వాఁడికి నావాక్కునందు 'తథాస్తుదేవత' లుంటారనే నమ్మకం పూర్తిగా వుండేది. పైకి 'యేమిరా' అనే పిల్చేవాఁడే అయినా వుత్తరాలల్లో “గారూ, నమస్కారాలూ పెట్టేవాఁడు. నే నెప్పుడో వొకప్పుడు అతనికి కూడా "గారూ, నమస్కారాలూ" పెట్టి వ్రాస్తే యెంతో నొచ్చుకుని “యిక యెన్నఁడూ యిట్టి అకార్యాన్ని చేయవ"ద్దని వినయపూర్వకంగానే మందలించాఁడు. నావాక్కునుగూర్చి వాఁడనుమాన పడ్డట్టే సత్యనారాయణ కొండమీఁద పూర్వోక్తమైన ఆ ప్రసంగం జరిగిన ఆఱుమాసాలకు అతఁడు స్వర్గతుఁడైనాఁడు. సకాలమందు వ్రాసిన జాతకం లేకపోవడంచేత అతని స్వర్గతికాలం గుఱితించడానికి వీలిచ్చిందికాదు. యిటీవల 20 వత్సరాల ప్రాయంలో తల్లిదండ్రులను కనుక్కుంటే ఉననకాలాన్ని వొక రొకలాగా, మఱొకరు మఱోలాగా చెప్పడం తటస్థించింది. దాన్నిబట్టి వేస్తే యేం రుజువిస్తుంది? ఆ జాతకాన్నిబట్టే అయితే యిప్పటిదాఁకానే కాదు. యింకా కొంత కాలందాఁకా అతcడు సజీవుఁడై వుండి కొడుకుల సంపాదన తినవలసినవాఁ డని అనుకొనేవాణ్ణి. అతడు *[1]కుంభలగ్న జాతకుడు, పంచమాధిపతి అయిన శుక్రుఁడు అంటే సంతానస్థానాధిపతి మీనమందు ఉచ్ఛపట్టి వున్నాఁడు. యీ శుక్రదశ రాకుండానే, మధ్య కేతుదశ ప్రారంభించిందో లేదో అనుకునే కాలంలో మారకం జరిగింది. అవసానానికి కొంచెం ముందుగా నాపేర వ్రాసిన ఉత్తరంలో "కేతుదశ ప్రవేశించినట్టున్నది" అని వ్రాసేవున్నాడు. ఆ వత్తరం అతని జీవితచరిత్రలో వుదాహరించి వున్నాను. ఆ కేతుదశ యేడేళ్లు జరిగాక, శుక్రదశ 20 సంవత్సరాల్లో అధమం పద్దెనిమిది యేళ్లదాఁకానున్నూ వెరశి 25 యేళ్లు అతఁడు వుంటాఁడనిన్నీ నేను 60 వత్సరాల ప్రాంతంలోనే అస్తమిస్తాననిన్నీ అందుచేత నాకన్న అతని ఆయుర్ధాయం హెచ్చనిన్నీ అనుకొనే వాణ్ణి. కాని 49 వత్సరాలు దాఁటకుండానే అతఁడు స్వర్గతుఁడైనాడు. నాకంటే కూడా అతఁడు చాలాకాలం సన్నంగానే వుండేవాఁడు. కాని ఆత్మకూరు సంస్థానానికి కృతి యివ్వడానికి వెళ్లిన సందర్భంలో మే మందఱమూ సర్వసేనా మూర్చగా జ్వరపడడం తటస్థించి దానితో సుమారు రెండేళ్లు తీసుకు తీసుకు తేఱుకున్నపిమ్మట నేను యధాపూర్వకంగానే వున్నానుగాని, అతఁడుమాత్రం కొంచెం సూలకాయుఁడైనాఁడు. యెప్పుడూకూడా దేహారోగ్యానికంటూ యే మందులో మింగుతూ వుండడం నాకు అలవాటు కాని, అతఁడికి లేశమూ ఆలాటి అలవాటులేదు. పైఁగా నన్ను “అస్తమానమూ ఏపాడుమందులో మింగడమే నీపని” అని తిడుతూ వుండేవాఁడు కూడాను. యెప్పుడో స్వల్పంగా లంఖణాలు చేసినా అది వక లెక్కలోనిదికాదు. జబ్బు అంటూ యెఱక్కుండానే యావత్తుజీవితాన్ని గడిపాఁడు. యిఁక జాముకో, అఱజాముకో జీవితం చాలిస్తాఁడనఁగా, కొడుకుచేత వ్రాయించిన పద్యత్రయంలో యీ సందర్భం అతఁడే చెప్పి వున్నాఁడు.

“మ. జననంబెత్తిన దాదిగా నెఱుఁగ నే జాడ్యంబు."

అనే పద్యం జీవితచరిత్రలో వుదాహరించి వున్నాను. మరణకాలం నాఁటికి అతని వయస్సు 50కి లోపే గాని అతఁడు తుట్టతుదకు చెప్పినట్టు “పంచాశాబ్దమేగంగ" అన్నది కాదనికూడా వ్రాసివున్నాను. ఇతఁడు తన వయఃపరిమాణాన్ని గూర్చికూడా యిదమిత్థమని నిర్ణయించే శ్రద్ధకలవాఁడు కాఁడని, జీవితకాలంలో జాతకం వుండికూడా పరిశీలించ లేదనిన్నీ యిటీవల అన్యులు ఆ నిర్ణయం చేయవలసివచ్చిందనిన్నీ విస్పష్టమేకదా! ఆ కారణంచేతనే యితఁడి విద్యావిశేషం సమస్తమున్నూ ప్రతిభాయుక్తమే కాని "ఆస్థాస్వాస్థ్య" ప్రయుక్తం కాదని నేను వ్రాయవలసివచ్చింది. "ఆస్థాస్వాస్థ్యము" లకు బొత్తిగా దాసుఁడుగాక లోకంలో నెవ్వనికిని లక్ష్యపెట్టనంతటి విద్యావిశేషం కలవాఁడు కావడానికి యెట్టి ప్రతిభ అంటే, "నవనవోన్మేషశాలిని" గా వుండే ప్రజ్ఞ అవసరమో చదువరులు గమనింతురుగాక.

నావలె యే రహస్యంగాని యితరులతో చెప్పే స్వభావం అతడిది కాదు. చాలా గుట్టుగా వుండేది అతని నడవడి. వోకవేళ యితరులవల్ల తెలిసి నేను అడిగినాకూడా “శనగలు తింటూ ఆముదాలు చేతులో పెట్టడానికే" శక్యమైనంతవరకు ప్రయత్నించేవాఁడు. అవధానాదులలో కొన్ని విషయాలు కొత్తరకాలు ప్రవేశపెట్టాలని అతనికి వుత్సాహం వుండేది. వాట్లకు నేను వొప్పుకునేవాణ్ణి కాను. యెందుచేతనంటే - ఆ విషయాలు గారడీబాపతులో చేరతాయి గాని కేవలం ప్రతిభైకస్ఫోరకాలు కావు. సార్వత్రికంగా కాకపోయినా క్వాచిత్కంగానేనా ఆ విషయాలు యితరులున్నూ చేసే కిటుకులు, మనం అవధానంలో ప్రవేశపెడితే ఆ కిటుకు కాస్తా బయటఁ బడ్డప్పుడు మన అవధానమంతా యీలాటిదే అనే అపప్రథకు అది కారణం కావలసివస్తుందని నాకుభయం. అతఁడు అప్పటికప్పుడు దాఁటుకుపోవడమే చూచేవాఁడు కాని, భవిష్యత్తునుగూర్చి విచారించేవాఁడే కాఁడు. మా యిద్దఱికీ యీ విషయంలో చాలా ప్రభేదం. దీన్ని పలువురు యెఱిఁగే వుంటారు. అతఁడు నిరామయుఁడు గానే యావజ్జీవితమున్నూ గడిపినట్లువ్రాసి వున్నాను. కాని, ఆతనికి తలనొప్పివకటిన్నీ వికారం ఒకటిన్నీ ఆశ్రయించుకు వుండేవి. అవి వొంటెద్దు బండిగాని, గుర్రపుజట్కాగాని యెక్కినప్పుడు తప్ప కనబడేవి కావు. యీ రెండిట్లో యేది యెక్కియేమాత్రం ప్రయాణంచేయవలసి వచ్చినా దిగేపర్యంతమూ అవి తోలేవాళ్లతో పోట్లాట తప్పేది కాదు. ఇంతకు తప్ప అతఁడు వ్రాసినట్టు యే జబ్బున్నూ అతఁడెఱఁగనే యెఱఁగఁడు. అతనిపేరు చెపితే జబ్బులు జంకుతాయనేవాఁడు. ఆమాట నిజమే. చిడుమూ, మొలగజ్జీమాత్రం విద్యార్థిదశలో అతణ్ణి సర్వదా ఆశ్రయించి వుండేవికాని, వీట్లనుగురించి లేశమున్నూ అతఁడు శ్రద్ధపుచ్చుకునేవాఁడే కాఁడు. శాస్త్రుల్లుగారే యెప్పుడేనా "యేమిటయ్యా! యేదో మందు రాసుకోరాదా?” అని కూకలేసేవారు. ఆత్మకూరి చలిజ్వరంమాత్రం తప్పించుకోవడానికి వీలులేనిది కనక, అందఱితోపాటు అతఁడుకూడా అనుభవించాఁడు! ఇంతకు తప్ప యే వ్యాధిన్నీ యెఱఁగని జీవితమంటే అతనిదే. యేదో మాదిరి వంట అతనికి నచ్చేదికాదు. తగినంత పాకనైపుణ్యం వున్నవాళ్ల పాకంగాని కవిత్వంలాగే ఆతనికి సొక్కేదికాదు. అయితే పని పడితే "నలపాక భీమపాకా" లన్నట్టు ఆతఁడు తయారుచేసే నేర్పుకలవాఁడు. ఎక్కడేనా వండుకోవలసిన కర్మం తటస్థిస్తే నేను పైవనిన్నీ, అతఁడు ప్రధానకార్యమున్నూ నెఱవేర్చేవాళ్లం. యెప్పుడోగాని మా ప్రయాణాలలో యీఅవస్థ తటస్థించేదే కాదు. అతనికి లేని ప్రజ్ఞలలో అంతో యింతో కూనిరాగం తీయడం నాకున్నూ నాకు లేని ప్రజ్ఞలలో పాకశాసనత్వం అతనికిన్నీ వుండేవని చదువరులు గమనించాలి. అయితే అతనికి యిటీవల సంగీత విషయంలో రాగాలు గుణితించేశక్తి కొంత వుండేది. రేఁగుప్తిమీఁదా, శుద్ధసావేరిమీఁదా పద్యం చదివేశక్తిన్నీ వుండేది. కల్యాణి, కేదారగౌళ వగయిరా రాగాలమీఁద కూడా పద్యాల్ని చదివేవాఁడు. ధాటీగా పద్యం చదివేవాఁడుకాని, యేమైనా వంశపరంపరగా వేదం వచ్చిన కుటుంబ మవడంచేతనో యేమో, గానవిషయం యేకొంచెమో పద్యం చదవడానికి మించి అలవడిందికాదు. కవిత్వం యేలాటి సహజవిద్యగా చెపుతారో గానంకూడా ఆలాటిదే. కాని, 18 సంవత్సరాలదాఁకా కవిత్వమంటే యొఱఁగని అతనికి వొకటేమాటుగా “కుండజల” లాగ ఆ మహాధార బయలుదేరింది. దాన్ని గూర్చి కాళీసహస్రంలో వకశ్లోకంలో అతఁడే వివరించివున్నాఁడు.

శ్లో. “సాహిత్యాం గురుపాణినీయజనితా పౌరాణ సంవర్ధితా,
     దేశాలోకన పుష్పితాచ కవితా కన్యా మయి ప్రత్యయాత్,
     వవ్రే మాం స్వయమేవ."

ఈ శ్లోకంలో వున్న"పుష్పితా" అనే విశేషణం తి. శా. గారి కిన్నీ కవితాకన్యకకున్నూ జరిగిన వివాహం శారదాబిల్లు రాcబోతూవుంది కనక, భవిష్యత్తులో, ఆ భయం మనస్సులో పెట్టుకుని చేసుకున్నదే గాని, నాలాగ బాల్యవివాహం చేసుకున్నట్టు లేదని విస్పష్టమే. పైఁగా “స్వయమేవ వవ్రే" అనడంచేత కన్యకకు 14 యేండ్లు నిండడం మాత్రమే కాదు, యింకా కొసరు నాలుగేండ్లు కలుపుకోవలసి వుంటుందనికూడా ధ్వనిత మవుతూ వుంది. ఈ విషయం అతఁడు పలుచోట్ల సూచించి వున్నాఁడు. -

(1) “గోచిపెట్టకమున్న కోమలకవితచె
      ప్పినవాఁడు సహపాఠి వేంకటకవి."

(2) “గోణము వెట్టుటాది బుధకోటి నుతింపఁ గవిత్వవైదుషీ
      వేణిక యౌచుఁ బేర్పడిన వెంకటశాస్త్రికి."

ఆయీ తి. శా, గారి వాక్యాలవల్ల మా మా కవితావివాహాల స్వరూపం స్పష్టమే కనక విస్తరించను. అయితే యిటీవల యింత లోకోత్తరమైన కవి కావలసినవాఁడు సుమారు 18 యేళ్ల పర్యంతమున్నూ, యేమాత్రమూ రచనే యెఱక్కుండా యెలా వున్నాఁడన్నది విచార్యంకాకపోదు. దీనికి జవాబు చెప్పడం కష్టం. ఒక్కొక్క గ్రహదశ వచ్చేటప్పటికి వొక్కొక్క యోగం బయటికి రావడానికి జాతకశాస్త్రం అంగీకరిస్తుంది. యిప్పుడు హస్తసాముద్రికం కూడా యోగాయోగాలకు సంబంధించిన కొన్ని రేఖలు పడుతూ నశిస్తూ వుండడాన్ని చెపుతూవుంటారు. తద్రీత్యా సమన్వయించుకోవలసిందే కాని గత్యంతరంలేదు. అంతకు మునుపే కవిత్వం చెపుతూవున్న నా సహవాసం కారణం అని సూలదృష్టు లనుకోవచ్చును. కాని యితనితోపాటుగా మాగురువుగారి వద్ద యెందఱు విద్యార్థులు లేరు? వారి కెవరికీ నా సహవాసం కవిత్వప్రాప్తిని కలిగించక యితనికే కలిగించడమేమీ అనే ప్రశ్నకు సమాధానం లేదు. కాఁబట్టి అది అతని పూర్వజన్మసంస్కార విశేషమేకాని, మఱొకటి కాదని విశేషజ్ఞులు నిర్ణయిస్తారు.

(1) "రెండుభాషలలోఁ దత్కృపం గవియయ్యు

(2) "మావెంకటశాస్త్రి నేఁ బొగడెదన్ శిష్యస్వరూపమునన్

(3) "కవితాసద్గురు వేంకటాభిధుని వక్కాణింతు నెక్కాలమున్."

(4) “ఆకవిరాజశిష్య పరమాణువు డీకొన మారుమూలలన్, డేఁకిన పాఱుఁబోతఁట?” (5) "వేంకటేశకవిదేశికు సన్నుతిసేతు నిచ్చలున్." లోనైన తి. శా. గారి వాక్యాలు ప్రతి విషయానికీ అంతఃకారణం దైవమే అయినా బాహ్యకారణాన్ని కూడా చూపవలసి వుంటుంది కనక ఆలా చూపి వున్నాఁడేకాని అన్యంకాదు. సంతానానికి బాహ్యకారణం స్త్రీపురుష సమాగమమే కాని అంతఃకారణం దైవమే. అతఁడు నమస్కరించి వుత్తరంవ్రాస్తే నేనుకూడా నమస్కరించి వ్రాయడానికి అతఁడు అంగీకరించకపోవడమే కాకుండా "చిరంజీవి" పదంతో వ్రాయవలసిందనడం కూడా పైకారణానికి అంటఁగట్టవలసిందే. వొకవేళ యేలక్షణప్పద్యాలో యెవరివద్దో యెవరో యేకొన్నో అభ్యసిస్తే మాత్రం యిటీవల వారికన్నా మిన్నాశక్తికలవారై వున్నప్పుడు లోకం వారిలో యెవరి కెంత గౌరవం యివ్వాలో అంతా యిచ్చి తీరుతారు. కాని నామకః జరిగిన ఆస్వల్పగురు శుశ్రూషను పురస్కరించుకొని యితరాన్ని అధఃకరించడం తటస్థింపదు. ఆలాటి సందర్భాలల్లోనే.

"గురువు శిష్యుఁడయ్యె శిష్యుఁడు గురువయ్యె"

అనుకోవలసి వస్తుంది. ద్రోణాచార్యులవారివద్ద శుశ్రూష చేయడం విస్తారమే అనుకుందాం. అర్జునుఁడు కృపాచార్లవారివద్దనో? యే కొంచెమోతప్ప శుశ్రూషచేసింది లేదుకదా! ఆకృపాచార్లవారికంటే అర్జునుఁడు తక్కువవాఁడని యెవరేని అనుకోఁగలరా? యీలాటి వుదాహరణాలు నేను చూపనక్కఱలేదు; చదువరులే చూపుకోఁగలరు. మాలో వుండే . తారతమ్యాన్ని నిర్ణయించుకోవడానికి యీవ్రాసిన విషయం అకించిత్కరం. యింకేవేనా వుంటే అవి యథార్థదూరాలు కాకపోతే పనికివస్తాయి. -

ఆ విషయంలో యీ వ్యాసానికి కారకులైన యేకలవ్యశిష్యుఁడు గారు వ్రాసిన వుత్తరంలో కొన్ని మాటలు మిక్కిలి ఆదరించవలసి వుంటాయి.

సంస్కృతసమాసాలువున్న కవిత్వం తి. శా. గారిదనిన్నీ తెలుఁగు జిలుఁగుపదాలు వెం. శా. గారిదనిన్నీ అనుకొనేవారు చాలా అమాయకులు. అలా వ్రాసేవారి వ్రాఁతలు ఆదరించే యెడల తి. శా. గారికి చాలా అన్యాయం జరుగుతుంది. చూడండి!

ఉ. "దగ్గఱ లేరు మామయును దండ్రియు, ద్రోణునితోడిపోరు కాఁ
     దగ్గది, భార్య గర్భవతి, తల్లి సుభద్ర త్వదేకపుత్ర, నీ
     పగ్గె నిరంకుశంబు, పసిపాపవు, పాపులు వారు మేనికిన్
     గగ్గురుపాటు వుట్టెఁ గొడుకా! నిను యుద్ధభరంబు పూన్పఁగన్"

చ. "పెనుగదఁ బూని మొత్తములు పిప్పియొనర్చుట తప్ప నెన్నడుం
     బనిఁగొని యిట్టివ్యూహములు పన్నుట విప్పుట నే నెఱుంగ నీ
     వనిమొన వాఁడిసూఁదిమొన యంత గదల్చితివేని చొచ్చి య
     మ్మొన గలగుండు వెట్టి పడమొత్తెద మత్తగజంబుచాడ్పునన్."

చ. “ఒరులకుఁ జేతఁకాదు, చనె నొండెడ కర్జునుఁ డంచుఁ జిత్తమం
     దరసి గురుండు పన్నిన మహాకపటం బిగి మొగ్గరమ్ములోఁ
     జొరుటకు దారిచూపి మము శూరులఁ జేయఁగదయ్య నేటిసం
     గరమునఁ గుంతిభోజుసుత కంటెను గోడలు వీరమాతగన్."

యెన్నని వుదాహరించేది? ఈలాటి బంగారమంతా నాకింద జమకట్టి యేవో నాతాలూకు పాషాణాలు “శాంతింపుడని రాయబారమౌరా" అనేవి అతనికి అంటఁగట్టి గౌరవాన్ని సంపాదించడానికి యత్నించేవారు నిజమైన విమర్శకులు గారు. సమాసభూయిష్ఠమైన రచన అతనిది బోలెఁడు వుంది. దాన్ని లోకాభిరామాయణంలో “ఱంతుల్ మానఁడు తిర్పతిద్విజుఁడు" అనే పదంతో వుంటుంది చూచుకోండి. అందులో యేకొంచెమో నాదిగాని చాలాభాగం అతనిదే. అదీ రచిస్తాఁడు, యిదీ రచిస్తాఁడు. ఆయాఘట్టాలకు అనుగుణంగా ఆయాధార నడుస్తుంది కాని అతనికి యెక్కువప్రీతి తెలుఁగు పదాలతో రచించడమందే. దానికి కొన్ని పద్యాలు చూపివున్నాను; యింకోటికూడా చూపి తరవాయి అందుకుంటాను.

చ. "బ్రతికిన నాల్గునాళ్లు ఋతవాది యుధిష్ఠిరుఁ డన్న మేటికీ
     రితి గలవాఁడనై ధరఁ జరించి తుది న్నృపకోటి మెచ్చ దు
     ర్గతి గనకుండ స్వర్గమునఁ గాఁపురముండఁదలంచునాకు నీ
     యతు కొనరించెదే కటకటా యదునందను పేరుమీఁదుగన్'

పుక్కిటిపురాణాలు అనాదిగా కవులను గుఱించేకాదు, అన్యులను గుణించిన్నీ వుంటాయి. వాట్లకు తలా తోఁకా అంటూ వుండదు. సరియైన హేతుహేతుమద్భావమున్నూ వుండదు. అవి యొన్నటికీ అంతరించవు.

అయితే యీ వ్రాయడం యెందుకంటే? ఆ యేకలవ్యశిష్యుణ్ణి అనాదరించ లేకేకాని యింకెందుకూ కాదు. యెంతో యెవరితోనో యీ విషయం రాఁబట్టే ఆయన వున్నదున్నట్టు వ్రాయుమని కోరివుంటాఁడు కాని వూరికే నా కీ పరిశ్రమని వార్ధక్యంలో కల్పించేవాఁడు కాఁడనియ్యేవే. . కవిత్వం సంగతి కొంత తెల్పినట్టయింది. యిఁక పాండిత్యం. దీన్ని గుఱించి అతని జీవితచరిత్రలో తెల్పేవున్నాను. అయినా ప్రసక్తి కల్గింది గనక మళ్లా వ్రాస్తాను. నేనున్నూ, తిరుపతిశాస్త్రిన్నీ కలుసుకునే టప్పటికి తిరుపతిశాస్త్రికి నాకంటే సంస్కృతసాహిత్యం హెచ్చు. అప్పటి కప్పుడే కొన్ని నాటకాలూ, చంపులూ కూడా అతఁడు గురుముఖతః చదివి బ్రహ్మయ్యశాస్త్రులవారి వద్దకు వ్యాకరణాధ్యయనానికి వచ్చాఁడు. నేనో? గురుముఖతః భారవివఱకే చదివి వచ్చానన్నమాట. యీ సందర్భాన్నిబట్టి మేమిద్దఱమూ కలుసుకొనే టప్పటికి, నాకంటే అతనికి సంస్కృతసాహిత్యం హెచ్చని వేఱే చెప్పనక్కఱలేదు. నేను ఆ స్థితిలోనే యావజ్జీవమూ నా సంస్కృతసాహిత్యాన్ని వుంచుకొనేయెడల యిప్పటి విమర్శకుల యుక్తులు సరిపోతాయి. ఆలా వుంచుకోలేదుగదా! అయితే ఆ పిమ్మట యే గురువుగారిదగ్గర సాహిత్యగ్రంథాలు అభ్యసించావు అంటే వినండి. ఆకాలంలో మా గురువుగారి దగ్గిరికి చాలామంది విద్యార్థులు వస్తూవుండేవారు. వ్యాకరణపాఠం తప్ప కావ్యపాఠాలు చెప్పడం నామీఁదా, తి. శా. మీదా వుండేది. చదువుకొన్నమీఁదట సమన్వయించి చెప్పే పాఠం తిరుపతిశాస్త్రిది. నాదో? కేవలం బుద్ధిని వినియోగించి చెప్పేది. ఆ కారణంచేత నేను చదవని మాఘకావ్యం వగయిరాలు పాఠంచెప్పేటప్పుడు యెక్కడేనా అసంప్రదాయపుతోవ యే కొంచెమో దొర్లేది. ఆలాటి సందర్భంలో అతని శిష్యులు నా శిష్యుణ్ణి ఆక్షేపించడం జరిగేది. అది వెంటనే అంటుకునేది; మా యిద్దరికీ వాదం పడేది; గురువుగారిదాఁకా వెళ్లేది. సంప్రదాయసిద్ధమైనదేదో వారు చెప్పేవారు కాని, మళ్లా యీవలికి వచ్చాక మాపిడివాదం మేము చేస్తూనే వుండేవాళ్లం. కాని యథార్ధం ఆ గందరగోళంలో గోచరించడం జరిగేది. అప్పటిమట్టుకు “నాదేన్యాయం నాదేన్యాయం" అని బుకాయించినా యిటీవల సంప్రదాయ సిద్ధమైనదేదో తెలిసిపోయేది. యీలాటి వాదోపవాదాలు నాకూ తిరుపతిశాస్త్రికీ మాత్రమే కాదు. యింకా మఱికొందఱు విద్యార్థులతో కూడా వచ్చేవి. ప్రత్యేకించి పనికట్టుకొని కొన్ని వూళ్లు దీనికోసం వెళ్లడంకూడా జరిగేది. ఆ విద్యార్థులకి వ్యాకరణంలో చింతనచెప్పడం మా యిద్దఱిలో యెవరో చెప్పవలసివచ్చేది. ఓపికపట్టి చెప్పడానికి అప్పుడే కాదు, యిప్పటికీకూడా నన్నుచెప్పి యితరులను చెప్పవలసి వుంటుంది. అందుచే నాపార్టీ యెక్కువగా వుండేది. అక్కడక్కడ మళ్లాయీచింతన చెప్పుకొనే విద్యార్థులు మమ్మల్ని యిద్దఱినీ వెక్కిరిస్తూ వుండేవారు కూడాను. కొట్టుకోవడం పర్యంతమూ జరుగుతూ వుండేది. వొక గాథ వుదాహరిస్తాను. మేమిద్దఱమూ కలిసి కవిత్వం చెప్పడం మొదలు పెట్టాక ధాతురత్నాకరపీఠికలో వక శ్లోకం.

శ్లో. 'పశుపతిదయితాతృతీయపుత్రౌ ! తిరుపతివేంకటశాస్త్రిణౌ కవీంద్రౌ'

అని వ్రాసుకున్నాము. మా యిద్దఱికన్నా సాహిత్యంలో యెక్కువ గ్రంథాలు చదివి వ్యాకరణం చదువుకోవడానికి వచ్చిన వక కోనసీమ విద్యార్థి యీ శ్లోకాన్ని ఆక్షేపించడానికి బదులు మా యిద్దఱిదగ్గిఱా కావ్య పాఠం చెప్పుకొనే విద్యార్థులను “వీరు పశుపతి దయితా (పార్వతీదేవికి) "తృతీయ పుత్రులు" అంటూ వెక్కిరించడం మొదలు పెట్టడమే కాకుండా యిద్దఱిలోనూ వకరు తృతీయపుత్రులైతే రెండోవారు చతుర్థపుత్రులు కావలసివస్తుం దంటూ ఆక్షేపించడం జరిగింది. దీన్ని సమర్ధించిన విధానం యిక్కడ వ్రాస్తే చాలా పేజీలు పెరుcగుతుంది గనక వుపేక్షిస్తాను. యీ అభిప్రాయం న్యాయంగా సమర్ధించతగ్గదే గాని పిడివాదం చేసి సమర్థించేది కాదని చదువరులు తెలుసుకోవాలి. సారాంశం పార్వతీదేవికి పుత్రులిద్దఱే అనిన్నీ అందు వొకఁడు విఘ్నేశ్వరుఁడనిన్నీ రెండు కుమారస్వామి అనిన్నీ మూఁడు తి. వెం. కవులనిన్నీ ఆరోపిత పుత్రత్వానికి అందఱూ అర్హులే కనక, యెవరు ఆలా ఆరోపించుకుంటే వారందఱున్నూ ప్రత్యేకించి ప్రత్యేకించి మూఁడోవారుగానే పరిగణింపఁబడతారు. భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు వక పురుషుఁడు. 'తండ్రీ' అని సంబోధిస్తాఁడు. ఆ పురుషుఁడు కొడుకుకూడా “తండ్రీ" అనే సంబోధిస్తాఁడు. అంతేకాని తండ్రికి తండ్రి కనక వాఁడికి భగవంతుఁడు తాత కావాలనే శంక యేలాటిదో పైశంకా ఆలాటిదే. అయితే వ్రాసేది లేదని కూడా కొంచెం వ్రాశాను, యింకా వ్రాయాలి. దాన్ని వాదోపవాదనిష్ణాతులైన చదువరులే పూరించుకుంటారని తలుస్తాను. చెప్పొచ్చేదేమిటంటే? యీలాటి 'కైకురుబొయికురు' పోట్లాటలతో బ్రహ్మయశాస్త్రులుగారివద్ద చదువుకున్న ఐదారేళ్లున్నూ రేయుంబవళ్లు కాలంనడిచింది. దానితో నా సంస్కృతసాహిత్యంకూడా దిట్టపడింది. (వారి విద్యార్ధిత్వం యెంత సేపూ సంస్కృతానికే తప్ప తెలుక్కి సంబంధమే లేదు. కాలేజీలో ఇంగ్లీషుమాదిరిగా తెలుసుకోండి.) దీనికంతకీ బ్రహ్మయ్య శాస్త్రుల్లుగారి శుశ్రూషే కారణమవడంచేత గురువు లెందఱో వున్నా శ్రీహరిని ప్రధానంగా స్మరించడం. గాని “గురుభ్యోనమః" అనకుండా నేర్చుకున్న భాగంకూడా కొంతవుంది. దానికి గురువులు తోటివిద్యార్థులు. ఆ విద్యార్థులకూ మాకూ "అన్యోన్యం గురవోవిప్రాః” అనేమాదిరి గురుశిష్యభావం వుందనుకోవాలి. అంతేనేకాని వ్యాకరణంతోపాటు బ్రహ్మయ్య శాస్త్రుల్లుగారు నాకుఁగాని, ఇతరులకుఁగాని సాహిత్యగ్రంథాలు చెప్పలేదు. వారికి వాట్లలో అంతగా అభిరుచీలేదు, తీరికాలేదు. యేమంటే! గురువుగారు రాత్రి సుమారు రెండుగంటలప్పుడు విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి ఆరంభిస్తే పగలు 12 గంటలప్పటికి ఆఖరుపాఠమవడానికి అవకాశం కలిగేది. తక్కువపాఠం ప్రథమం ప్రారంభించడం సంప్రదాయం. యెక్కువ పాఠం వాళ్లందఱూ తక్కువ పాఠాలు వింటూ వుండాలి. యీలాటివిషయాలే స్వయంకృషివల్ల విద్య సాధించేవారికి తెలియకపోయేవి. యీలాటివిన్నీ

మఱికొన్నిన్నీ నేను బ్రహ్మయశాస్త్రుల్లుగారి శుశ్రూషాకాలంలో నేర్చుకున్నాను. అన్యోన్య సహాయంవల్ల నేను సంస్కృతంలో సాహిత్యం నేర్చుకున్నట్టయింది. తిరుపతిశాస్త్రి కూడా యిలా నేర్చుకున్నది కొంత లేకపోలేదుగాని యేమేనా నాకంటే కొంత శుశ్రూష సంస్కృతకావ్యనాటకాలకు అధికకాలంచేసి వున్నాఁడు. తుదకి “అవ్వాగుఱ్ఱమూ” వకటేఅయినప్పటికీ లోకంలో మొట్టమొదటపడ్డ అభిప్రాయం నిలిచివుంటుంది కనక పాండిత్యంలో వారికీ, వీరికీ యేమాత్రమో భేదంవుంటుందని అనుకోవడమున్నూ సయుక్తికమే. "వామనఇతి త్రివిక్రమ మభిదధతి దశావతారవిదః” కదా! వొక్క సంస్కృత వ్యాకరణమున్నూ, భారవిదాcకా కావ్యములున్నూ తప్ప నేను గురుశుశ్రూషవల్ల సంపాదించిన విద్య లేశమున్నూలేదు. తక్కినదంతా స్వయం కృషివల్లా, అన్యోన్యస్పర్ధవల్లా సంపాదించినదే అనడంలో అతిశయోక్తిలేదు. ‘లక్ష్యాలు వెదకడంలోగాని, తప్పులు వెదకడంలోగాని నీబుద్ధికి యేపుస్తకం చూచినా తప్పులే కనబడతాయిరా, నాబుద్ధికో? అన్నీ వొప్పులుగానే కనపడతా" యనేవాఁడు. అందుకే ఖండనమండనాలకర్మం అంతా నామీఁదే వుండేది. దీన్నిగురించి వ్రాయనక్కరలేదు. పలువురెఱిఁగినదే. యెవరేనా “అయ్యా! కాస్త నాగ్రంథాన్ని సంస్కరించి పెట్టవలసిం"దని మావాఁడికి పుస్తకం యిస్తే యేదో పదిరోజులు దగ్గఱ పెట్టుకొని "సర్వోత్కృష్టంగా వుం"దని యిచ్చేసేవాఁడు. తిరుపతిశాస్రులు గారు పరిష్కరించారుగదా అని గ్రంథకర్త అచ్చువేసుకోవడం జరిగేది. దానితో "తాడు తెగి తప్పేలా నూతులో పడేది". వొక మహాపండితుఁడు వొక సంస్కృతగ్రంథాన్ని రచించి ఇతణ్ణి పరిష్కరించడానికి ప్రార్థించడమున్నూ పైరీతిని మోసపోవడమున్నూ జరిగింది. అచ్చు పూర్తి అయిన పిమ్మట "లోకవెూ పాడో" అన్నట్టు వక పుస్తకం నాకు పంపించాcడాయన. ఆ సమయానికి నాదగ్గఱ మా పూర్వకాలపు సతీర్థ్యుఁడొక పండితుఁడున్నాఁడు. పుస్తకం విప్పీవిప్పడంతోటే ఆయన వక శబ్దాన్ని తప్పనడానికి మొదలుపెట్టాఁడు. నేను ఆయనతో "అయ్యా! దాన్ని రచించినవారు మహావిద్వాంసులు. తొందరపడకండి" అని వారించాను గాని ఆయన నన్నుకూడా ధిక్కరించాఁడు. పుస్తకం నాకు అందిచ్చిన పురుషుఁడు యిదంతా విని గ్రంథకర్తగారితో యేంచెప్పాఁడో, నేనేమో ఆయన పుస్తకంలో తప్పులున్నాయని అన్నట్టు తేల్చారు. మీ తి. శా, గారే దీన్ని సంస్కరించారంటూ ఆయన నన్ను అనడం మొదలెట్టారు. ఆ పుస్తకంలో మొత్తం వ్యాకరణ విరుద్ధాలు నూటికన్నా యెక్కువే వున్నాయి. ఆ విరుద్ధాలు తీసి చూపేటప్పటికి ఆయనకీ తెలిసినవే కనక ఆయన అంగీకరించారు పాపం!"తత్త్వార్టేనచ పండితమ్” కదా! తరవాత తి. శా. ని నేను కలుసుకున్నప్పుడు “యిదేం కర్మం. ఆయనపుస్తకం. ఆలా సంస్కరించా?” వంటే అన్నాఁడుకదా! యీబాడఖావుచాకిరీ యెవఁడికి పట్టింది? నీకుగాని నాకీలాటి వోపికలేదు, యేదో చూడమన్నాఁడాయన, చూస్తానన్నాను- చూచేదేమిటి, ఆయనకూడా పండితుఁడేకదా అనుకున్నాను. సరస్వతీప్రస్సులోనే కాఁబోలును అచ్చుపడింది. ప్రూఫులు ప్రూఫురీడరు దిద్దినట్టున్నాఁడు” అంటూ జవాబు చెప్పాఁడు. అతఁడు యితరుల గ్రంథాలవిషయంలోనే కాదు, మాసొంతాల విషయంలో కూడా యింతే; శ్రద్ధచూపేవాఁడు కాఁడు. కొత్తపల్లి సూర్యారావుగారు యింకా జీవించే వున్నారు. వారిని అడిగితే యింకా యీ విషయం సవిస్తరంగా తేలుతుంది. సరస్వతీ పత్రికకు మేటరివ్వడానికి ఆయన్ని పెట్టే తిప్పలు వగయిరాలు ఆయనే చెప్పాలి. వున్న పాండిత్యాన్ని శ్రద్ధపట్టి వినియోగించడంలో అతనికి వున్న పాలుమాలిక వాచామగోచరం. ఆపాలుమాలికవల్ల కలిగిన “జితకాశి"కే నేడు "చెళ్లపిళ్ల వెంకటయ్య"కు "దేవాదేవేషు" అంటూ నెల్లూరిపత్రికలలో వివాదాలు పడడమూ, వానికి నేను నోరు మూసుకు వూరుకోవడమూ యెవరో వెలమకన్ని శతావధానిగారు కల్పించుకొని కొంత వ్రాయడమూ ఆమధ్యతటస్థించింది. "జితకాశి" శబ్దానికి అర్థం శబ్దరత్నాకరంలో సమేతూవుంది. కాని దాన్ని కూడా చూచేపాటిశ్రద్ధ అతనికి వుండేదికాదు. ఆబుద్ధి చాకచక్యానికి శ్రద్ధ అనేదే వకటి వుంటే యీలోకమేకాదు, పద్ధాలుగు లోకాల్లో వుండే బుద్ధిమదగ్రేసరులు యేకీభవించినా అతనిముందు నిల్చేవారేకారన్నది అతిశయోక్తికాదు. యెప్పుడో సమయం వచ్చే దాకా అతఁడు తనబుద్ధికి పనిచెప్పేవాఁడే కాఁడు. అందుచేతే యేకొంచెమో వయస్సు ముదిరినపిమ్మట బుద్ధితీక్ష్ణత తగ్గినా యావజ్జీవమున్నూ అంతో యింతో అవధానం చెయ్యడానికి వెనుదీసేవాఁడు కాఁడు. నాకో, సర్వదా బుద్ధికి పని చెపుతూ వుండడంవల్ల బందరు ప్రవేశించే ప్రాంతంలో బుద్ధితీక్ష్ణత చాలా తగ్గింది. యీవిషయం యిటీవల గుంటూరిసీమ అవధానాలు చూచిన వాడికి విశదమే. వెనకటిసంగతులు వ్రాయవలసి వస్తేకాని, చెప్పవలసి వస్తేకాని యీ 68 యేళ్ల వయస్సులో కూడా పూసగుచ్చినట్టు అట్టపుట్టాణాళ్లతో నాకు మూఁడేళ్లవయస్సులో జరిగిన కథలదగ్గిరనుంచి వ్రాయడానికి జ్ఞాపకశక్తి వుంది. కాని ఆశక్తి యాదృచ్ఛికంగా వినియోగించడానికేగాని యేదేనా నిర్బంధంగా పనిపెట్టుకుంటే మాత్రం పనిచేసేస్థితిలో లేకపోవడం ఆరంభమై అప్పుడే యిరవైయేళ్లు కావచ్చింది. యేదేనా తన్మయత్వం తటస్థిస్తేమాత్రం యిప్పుడుకూడా అన్నాహారాలు తోచకుండా కవితాధార నడుస్తుందన్నందుకు నిన్న మొన్న రచించిన ‘జయంతిన్నీ" "క్షమాపణమున్నూ" లోకానికిసాక్ష్యమీయడానికి సందేహంలేదు. యిదే నాప్రకృతిలో వున్న విశేషం. ఇట్టి పట్టుదలగాని, తన్మయత్వంగాని ఆతని ప్రకృతిలో లేదు. వొక్కప్పుడు తాత్కాలికంగా ఈ గుణాలుకల్గినా అవి తుట్టతుద వరకున్నూ నిల్వక అంతంతలోనే అంతరించేవి. ఆ కారణంచేతే కొన్ని గ్రంథాలు మొదలుపెట్టి చక్కనిశైలిలో కొంత వ్రాసినపిమ్మట ఆఁగిపోవడం తటస్థించేది. “సువర్ణపాత్రికం" రెండంకాల ప్రాంతంలో ఆఁగడమున్నూ “వ్యసనవిజయం" కూడా డిటో స్థితిలోనే ఆఁగిపోవడమున్నూ పైదాన్ని సమర్థిస్తాయి. యింకా మఱికొన్ని యీలాటి చిలకకొట్లయితే వున్నాయిగాని అవి చక్కనిశైలిలో లేవు. ఆ మొదటి రెండు గ్రంథాలూ అవసానకాలంలోనికి కావు; అవసాన కాలానికి సుమారు పుష్కరకాలానికి పూర్వపువే. మొదలు పెట్టేటప్పుడే పర్యవసానం ఆలోచించుకొని మొదలుపెట్టడం అతనిపంథకాదు. ఆరంభించి, తోఁచినట్టువ్రాసి, యెక్కడ తోఁచకపోతే అక్కడ విరమించడమే అతని ఆచారం. పై పుస్తకాలు రెండూ తరవాయి నన్ను పూరించమని నా కిచ్చాఁడు. అవి ప్రకరణాలుగా తయారు కావలసినవి. పది అంకాలు వుంటేనే కాని ప్రకరణానికి పూర్వలాక్షణిక పద్ధతిని వొప్పించడానికి వీలు కనపడదు. “పై కథావిధానానికి నీమనస్సులో యేమి వూహ పెట్టుకున్నా" వని అడిగాను నేను. "యేమీ పెట్టుకోలేదు. నీవు చూచుకో వలసిందే" అన్నాఁడు. “అలాగైతే అవి అలా వుండవలసిందే. నీకులేని వూహ నాకెక్కడనుంచి వస్తుందని నేనన్నాను.

"పరిణతి రవధార్యా యత్నతః పండితేన" అనే భర్తృహరి వాక్యాన్ని ప్రతికవిన్నీ అనుసరించి తీరాలి. అది అతcడు యే విషయంలోనూ పాటించేవాఁడు కాఁడు. గ్రంథారంభం చేసేటప్పటికే ముగింపు మనస్సులో నాటుకుపోవాలి. కాని ముగింపును గూర్చి యెప్పుడో ఆలోచిద్దామంటే కార్యకారికాదు.

అతణ్ణి నేను గీరతంలో, “తిరుపతిసింహ మొక్కమొగిఁ దీవ్రతరమ్ముగవచ్చి" అని రూపించి వున్నాను కాని అంకుశంతో సంబంధించిన గజప్రకృతిగా నిరూపించవలసిన ప్రకృతిగా నేను అనుభవపూర్వకంగా యెఱిఁగివుండడంచేత కొన్నిచోట్ల ఆభావాన్నీ వెల్లడించివున్నాను.

చ. "తిరుపతి యేన్గుగాఁగ గడి దేఱినశిష్యు లనేకు లొప్పుమైఁ
     బొరిఁబొరి రోఁజుచున్ దనదు పొంతను బెబ్బులిపిల్లలట్టు చూ
     పఱులకుఁదోఁపఁ గేల నొక పాటిది బెత్తము పూని వేంకటే
     శ్వరుఁడు శతావధాన మను సర్కసుcజూపెడిఁ జూడుcడో బుధుల్”

అని నేను తన్ను యేనుఁగుగా రూపించి పద్యం చెప్పేటప్పటికి దానికి అంతగా అంగీకారం లేకో యేమో.

చ. "తిరుపతి వ్యాఘ్రమై బయలు దేఱినశిష్యులు గున్న యేన్గులై
     వఱలఁగఁ దేఱఁగాఁ తగిన వారలు బెబ్బులిపిల్ల లెల్లమా

   ర్తురు కవికుక్కురమ్ములయి తోఁపఁగ వేంకటశాస్త్రి వీరకే
   సరిగ శతావధాన మను "సర్కసు” చూపితివమ్మ! శాంకరీ!

అని సవరణచేసివున్నాఁడు. మొత్తం యెవరో వెనకాల వుండి ముల్లుకఱ్ఱతో పొడుస్తూవుంటేనే తప్ప రచన సాగించడం వుండేదికాదన్నది ఫలితార్థం. ప్రాచీనకవులలోనేకాదు, నవీనకవులలోనేకాదు యేదో తప్ప యొవళ్లకవిత్వమూకూడా అతనికి నచ్చడమంటూ వుండేదికాదు. అందుచేతే నే నెవరికేనా సర్టిఫిక్కట్టు యిస్తే విధిలేక దానిలో చేవ్రాలు పెట్టడమైతే జరిగేదిగాని అది వొక్కొక్కప్పుడు అన్యథాగా పరిణమింపచేసేవాఁడు. గుంటూరుసీమ గందరగోళానికి అదేకదా కారణమయింది - పోట్లాట తేవడంలో అంతలో తెచ్చేవాఁడు. తరవాత శాంతుఁడుగా వుండేవాఁడు. దాన్ని పట్టి పల్లార్చేదాఁకా నేను విరమించడం వుండేది కాదు. “ఆసీమాంత" పద్యం చూచుకోండి. యీ విషయం పలువురు యెఱిఁగిందే కనక విస్తరించేది లేదు. సర్వసామాన్యంగా మాత్రం "వెంకట శాస్త్రి పట్టుదలమనిషి" అనే పేరు నాకు వచ్చింది. పట్టుదల నాకు వున్నమాట సత్యమే కాని,ముందుగా కలహం తేవడంమట్టుకు అతఁడు తెచ్చేవాఁడు. అది నానెత్తిని బడేది. అందులోనుంచి బయటికి వచ్చేటప్పటికి రక్తమాంసాలు క్షీణించేవి. యెప్పడేనా నాలుగుపద్యాలు పంపితే పంపేవాఁడు; లేకపోతే లేదు ఉపేక్షాభావంతో వూరుకొనేవాఁడు. "యెవరితోఁగాని వివాదము లేకుండా మనకార్యం మనం నెఱవేర్చుకుందా"మని నేను మనస్సా అనుకొనేవాణ్ణి. కాని యెక్కడోగాని నా కోరిక నెఱవేఱేదికాదు. ఆఖరికి కలహప్రియుఁడనేమాట నాకు వచ్చేది. యిది యీరసంలో మాత్రమేకాదు; రసాంతరాల్లో కూడా డిటో ప్రకారమే. అవన్నీ వివరిస్తే గ్రంథం చాలా పెరుగుతుంది. అందుకు సంబంధించిన పద్యాల రికార్డుకూడా వుంది. ఆ పద్యాలు యిక్కడ వుదాహరించడంకన్న యితరుల వల్ల భవిష్యత్కాలంలో చదువరులు తెలుసుకోవడం వుచితంగా వుంటుంది.

మా యిద్దఱిలోనూ అతఁడు అమాయకుఁడని పలువురి అభిప్రాయం. యెవరిదాఁకానో యెందుకు? శ్రీ పోలవరపు జమీందారుగారే వొకమాటు యీ విషయం తేల్చారు. కాని, . అతcడు అమాయకుఁడు కాఁడు; చాలా గడుసువాడు. కవిత్వంలో ఎంత గడుసుతనం వుండేదో, ప్రవర్తనలోకూడా అంత గడుసుతనమూ వుండేది. అతి సాహసం కలవాఁడు. యేదేనా వివాదసందర్భపు పద్యాలల్లో నేను పద్యం వ్రాయవలసివస్తే మొట్టమొదట ఘాటుగా నడిచినా యెంతో తటపటాయించి, యెందఱికో వినిపించి, ఘాటు తగ్గించిగాని ప్రకటించేవాణ్ణిగాను. యీ విషయాన్నే శ్రీ వేమవరపు లాయరుగారు ఆ మధ్య చెన్నపురిసభలో వ్యాఖ్యానించి వున్నారు. అతఁడో? నాకు మాత్రం వినిపిస్తే వినిపించేవాఁడు. ^ ఒకప్పుడు నాకూ వినిపించేవాఁడు గాఁదు. “ఏటికి నాకు నీదురద" అంటూ వ్రాసి జమాయించి ప్రచురించేవాఁడు. సమయోచితంగా తప్పించుకునేశక్తి అతనికివుండేది. నాకు వున్నదున్నట్టుగా చెప్పి వొప్పించవలసిందేకాని సమయోచితంగా నడిచేశక్తి యిప్పటికీకూడా లేదు. అందుకే వక్రమార్గం తొక్కే వారికి శరణంటాను.

యీలాటిభేదాలు వ్యక్తిగతాలు కొన్ని వుండకుండా యెక్కడా ఐక్యం తటస్థించదుగదా! సభాముఖంలో వంకరమార్గం త్రొక్కి ముఖపిధానంచేసి, యెదటివాళ్లకు నోరాడనివ్వక పోవడంలో అతనికి మంచి శక్తి వుండేది. కాని అది తావన్మాత్రంలో ఆఁగిపోతే యేంలాభం? మర్నాడు మళ్లా అడిగితేకూడా నిలిచే పద్ధతివాదంగాని పనికిరాదనేవాణ్ణి నేను. అందుకోసం తాత్కాలిక విజయానికి యెన్నఁడూ ప్రయత్నించక, వొక్కొక్కదానికి యెన్నో ప్రయోగాలు వెదికివెదికి వేసారి అప్పడు దాన్ని బయటికి పెట్టడమే అప్పటికీ యిప్పటికీ నా ప్రకృతి. యిందుకోసం అతఁడు నాయందు ఆంతరంగికంగా చాలా కృతజ్ఞత చూపేవాcడు. నా మాటను పరమప్రమాణంగా భావించేవాఁడు. పోట్లాడినప్పుడు పోట్లాడేవాఁడే అనుకోండి. పోట్లాడినా ఆంతరంగిక విశ్వాసం మాత్రం యెక్కువగా వుండేది. ఆ కారణంచేతనే పయికి "కైకురుబొయికు" ర్లాడుకుంటూవున్నా మా మైత్రికి అప్పడేకాదు, యెప్పటికిన్నీ భంగంకలుగ లేదు. భంగంకలిగించాలని మా బాల్యంలో ప్రయత్నించిన పుణ్యజనులు కూడా కొందఱు కొంత ప్రయత్నించి విఫలు లైనారు.

వేంకటగిరిలో అలవేళ - అంటే, అబోధవేళదాఁకా అవధానంలో కూర్చో పెట్టడంచేత కొంచెం లోపం వస్తుందేమో అనే సందేహం సభ్యులకే కాదు నాకున్నూ కలిగింది. అది శ్రీ ముద్దుకృష్ణయాచేంద్రులవారి సభ. అంతకుపూర్వం శ్రీ చెలికాని గోపాలరావుగారు చేయించిన సభలో నేను అవధానం చేసివున్నాను. అది యేలోపమూ లేకుండా నెఱవేఱింది. యీసారి వంతు తిరుపతిశాస్త్రిది; కనక అతఁడు చేయవలసివచ్చింది. అక్షరం అక్షరంవంతున చెప్పడమూ, మూఁడేసి వ్యస్తాక్షరులు వేఱువేఱుగా యివ్వడం వగయిరాలు నేను చేసిన అవధానానికీ వున్నాయి. దీనికీ వున్నాయి. భేదమేమిటంటే - సమయం ఉదయం 8 గం. మొదలు సాయంకాలం ఆరుగంటలవరకున్నూనా సభకు తటస్థించింది. తి. శా, చేసేదానికి మధ్యాహ్నం 4 గంటలు మొదలు రాత్రి వంటిగంటవరకూ చెప్పవలసివచ్చింది. రాజుగారికేమి, ముఖ్యులైన సభ్యులకేమి, అవధానంచేసే మాకేమి రాత్రిభోజనం లేనేలేదు. పయిగా అవధానం ముగించేవేళ అబోధవేళ అయింది. కొన్నిటిలో ఈషద్వైషమ్యం కలిగింది. అట్టి సమయంలో వక కలహప్రియుఁడు నన్ను చాటుగాపిల్చి "మీయిద్దఱిలో కుడి యెడమభేద మేమేనా వుందా? అని శ్రీరాజావారు కనుక్కోమన్నారు" అంటూ ప్రస్తావించాడు. అప్పుడు నేను “మాలో కుడియెడమభేదం లేదుగాని మా ఇద్దఱిసభలకూ యేర్పరచిన టయిములో పూర్తిగా కుడియెడమ భేదం వుందని జవాబు చెప్పాను. (అవధానవిషయంలో కాదుగాని రసాంతరవిషయంలో కిర్లంపూఁడి సంస్థానోద్యోగి యీలాటి ప్రశ్ననే నన్ను అడిగి తగిన జవాబు పొందడం జరిగింది. విస్తరభీతిచే వుటంకించలేదు.) ఆప్రశ్న రాజుగారిమీఁదపెట్టి అతఁడు స్వయంగా అడిగిందేగాని, మఱోటి కాదని తరువాత రాజావారి అభినందన వాక్యాలవల్ల విస్పష్టపడింది.

సమయాసమయాలు ప్రతి మంచి కార్యానికిన్నీ ప్రతి చెడ్డకార్యానికిన్నీ అవసరమే కాని, అందులో కవిత్వానికి - అందులోకూడా అవధానానికి మఱీ అవసరమని చెప్పనక్కఱలేదు. “ఊహగలయంగల లేఖక పాఠకోత్తముల్, దొరికినఁగాక యూరక కృతుల్ రచియింపుమటన్నశక్యమే?” అనే పెద్దన్నగారి పద్యంలో వున్న సదుపాయంలో "వుయ్యాలా" వగయిరాలు కొన్ని అవధానులకు అవసరం లేదుగాని, వేళకు భోజనం వగయిరాలు అవసరం. అవధానిమనస్సే వకవుయ్యాలలాగా వుంటుంది; కనక వేఱే వుయ్యాలా అక్కఱలేదు. యీ ప్రసంగం జరిగిన కొంత సేపటికి అవధానం ముగిసింది. యేకొంచెమో పుష్పగణన వగయిరాలలో తబ్బిబ్బు కలిగింది. అప్పడు వక దివాణంనవుకరు - మంచి ప్రాజ్ఞుఁడు - వృదు లేచి రాజావారితో అన్నాఁడు కదా: “బాబూ! శ్రీమాడభూషి వెంకటాచార్యులవారు శ్రీ పిఠాపురపు సంస్థానంలో చేసిన అష్టావధానాన్ని నేను ప్రత్యక్షంగా చూచివున్నాను. ఆ అవధానానికీ, దీనికీ చాలా తేడావుంది. దానిలో పద్యాలు యెన్మిదిమాత్రమే. దీనిలో పద్యాలు యేభైకంటే కూడా యొక్కువ. ఇదే మాదిరిగా వ్యస్తాక్షరి వగైరాలు త్రిగుణంగానూ, చతుర్గుణంగానూ దీనిలో వున్నాయి. సుమారు నెలరోజులనాఁడు శ్రీ బావగారి (శ్రీ చెలికాని గోపాలరాయణింగారి) సభలో వెంకట శాస్త్రుల్లుగారు చేసిన అవధానంలో ప్రతీవిషయమూ త్రిగుణితమయిందిగాని యిందులో అంతకంటేకూడా అతిక్రమించింది. కాఁబట్టి అష్టావధానం యీలా పెంచడం న్యాయం కాదని ధైర్యంగా మనవిచేశాఁడు. దానితో రాజావారు “వారిశక్తి తెలుసుకోవడానికి యీలా పెంపుచేసి పెట్టవలసివచ్చింది కాని మఱోటికాదని పరిహారోక్తిగా సెలవిచ్చారు. ఆసభ నేనే చేసేదైతే మొట్టమొదటనే యిది వీలుకాదని చెప్పి నిషేధించేవాణ్ణి.

యెంత బరువేసినా పరిశీలించకుండా లొట్టిపిట్టలాగ భరించడమే కాని అతని ప్రకృతిలో దాన్ని తప్పుకుందామనే కోరిక వుండేదేకాదు. పయిగా దాన్ని నిషేధించే లౌకికోక్తి నైపుణ్యమున్నూ తక్కువే. లొట్టె మీఁద బరువు వేసేటప్పుడు కాళ్లకింద యిటుకలు పెట్టి ఆ యిటికలు చితికేదాఁకా వేస్తారనిన్నీ చితకడంతోటట్టే వేయడం చాలించి అది చూస్తూవుండఁగా యే వీసెఁడో, అఱవీసెఁడో తీసేస్తారనిన్నీ దానితో అది యావత్తూ తీసేశారనుకొని కార్యక్రమాన్ని జరుపుతుందనిన్నీ వినడం. దానికి ఆమాత్రం తీసివేయడమేనా అపేక్షితంగాని మావాఁడికి ఆమాత్రమున్నూ అవసరం వుండేదికాదు. యెంత బుద్ధిశాలీ కాకపోతే అంతకుముందు గోచీపెట్టీపెట్టని వయస్సునుంచిన్నీ కవిత్వం చెపుతూ లోపాయి కారీనైతేయేమి, పబ్లీకుగాఅయితేయేమి కొన్ని పండితసభలలో కొన్ని అష్టావధానాలు చేసివున్ననాతో కాకినాడ సభలో సంపూర్ణ శతావధాన శకటాన్ని నడపడానికి కొలఁదికాలంనుంచి మాత్రమే కవిత్వవ్యాపారంలో ప్రవేశించిన తిరుపతిశాస్త్రి సమానంగానో, నాకన్న అధికంగానో పూని పనిచేయంగలఁడా?

చెపితే నమ్ముతారో లేదోగాని కాకినాడ అవధానానికి ప్రారంభించేటప్పటికి అది చలికాలమైనా వొళ్లంతా చెమటతో తడిసిపోయింది. అప్పటికి మాకింకా శాలువులులేవు. సామాన్యమైన నూలుబట్ట పూర్తిగా కప్పుకున్నాను. ఆబట్టంతా తడిసిపోయింది. అతనికిమాత్రం యీ అవస్థ కలగలేదు. అతఁడు మహా సాహసుఁడు అని నేను వ్రాయడానికి యీలాటి వెన్నో కారణాలు అనుభూతాలే వున్నాయి. "గుండెలు తీసిన బంటు” అంటే అతఁడే. ముమ్మాటికీ అతఁడే. ఈ విషయాన్ని సమర్థించవలసి వస్తే చాలా సంగతులు వ్రాయాలి. యేదో వకటిరెండు ప్రస్తుతోపయోగంకలవి స్పృశించి విడిచాను. యింతకూ మా మైత్రిని భంగిద్దామని కొందఱు పుల్లింగాలు పెట్టఁదలఁచినా మామా శక్తులయందు మాకుమాకు వుండే గాఢమైన నమ్మికనుబట్టి వారి వారి పుల్లింగాలు విఫలమై మా మైత్రి ఆలాగే వజ్రలేపంగా నిలిచిపోయిం దనియ్యేవే.

యెల్లప్పుడూ పనిచేసి లక్ష్యలక్షణాలు సేకరించి సభలో ప్రతివాదులను ప్రమాణప్రమితమైన వాదంతో అరికడతాననిన్నీ సభారంజకతాశక్తి కలవాఁడననిన్నీ అతనికి నాయందు అమితమైన ప్రేమ వుండేది. బందరులో టీచరుగా ప్రవేశించాక యెక్కడికీ సభార్థం వెళ్లడానికి నాకు పూర్వంలాగ అవకాశంలేక "అబ్బాయీ! నువ్వు వెళ్లి వారిని సంతోషపెట్టి రారాదా?” అంటే దానికి అతఁడు నాకు వ్రాసిన జవాబు ఆతనికి నాయందు వుండే గాఢవిశ్వాసాన్నే కాక నిష్కపటత్వాన్ని కూడా వెల్లడిచేస్తుంది. గుంటూరు ఆహ్వానవిషయంలో అతణ్ణివెళ్లి రమ్మంటే వ్రాస్తాడు కదా, "నేను వెడతాను. అవధానాదికమున్నూ చేస్తాను. యెవరోవైదికప్పేరంటాలు వచ్చి వెళ్లిందంటారు. (యీమాట తలుచుకుంటే నాకు యిప్పుడు నవ్వు యేడుపూ రెండూకూడా వస్తాయి.) కనక నువ్వు వచ్చేదాకా వెళ్లేదిలే"దన్నాఁడు. శ్రీరావు చెల్లయ్యమ్మారావు బహద్దరువారి షష్టిపూర్తినాఁటికి నేను అప్పటికప్పుడే మూఁడు మాసాల నుంచి చలిజ్వరంతో కొట్లాడుతూవున్చాను. పైఁగా యింట్లో లేకలేక కలిగే సంతానానికి పురుడువచ్చే రోజులు, వున్నదేమో పరదేశం. అట్టి సమయంలో నేను వెళ్లడానికి యెలా కాళ్లాడతాయి? అందుచేత రాలేనంటే “డాక్టరు శేషగిరి నీ శిష్యుఁడేకదా. అతన్ని వెంటఁబెట్టుకొని రా. వచ్చి వూరికే సభలో కూర్చో. లేదా, సభలోనే పడుక్కో సర్వమూ నేను నిర్వహిస్తాను” అని పట్టుపట్టి రప్పించితీరాఁడు కాని వదిలిపెట్టలేదు. పైఁగా నేనున్నానంటే చాలు, యేమీ చేయనక్కఱలేదు. మొట్టమొదటినుంచీ అతనికి ఆలా అలవాటయింది.

తీరా ఆ సభ జరిగేటప్పుడు మామూలు ప్రకారం మొదటిచరణం నీవే చెప్పాలన్నాఁడు. చెప్పేశక్తి నాకులేదు. స్వరం హీనస్వరంపడి అప్పటికప్పుడే నెల్లాళ్లయింది. అయినా తప్పదన్నాఁడు. ధారణ పట్టనక్కఱలేదులే అన్నాఁడు. అప్పుడే నే నీ పద్యాలు చెప్పవలసివచ్చింది :

చ: “దినదినమున్ జ్వరార్తిమెయి దేహబలమ్ముడివోయి యున్నప
     ట్టున ననుఁ జెల్లయాంబిక కడున్ ముదమారఁగఁ బిల్వనంపటల్
     మనమున భేదమోదము లమర్చుకతమ్మున “లంఘనమ్ములన్
     మనుగుడు” పన్నసామెతకు మంచియుదాహృతి చిక్కె నేఁటికిన్,

చ. జ్వరపడియున్న హేతువున సాయము నీ కొనరింపఁజాల నో
    తిరుపతిశాస్త్రి! నీకు నలదేవి పరాంబిక యుండ వేంకటే
    శ్వరుఁ డొనరించుసాయ మొక బ్రాఁతియె? నీవు దలంచినన్ ధరా
    ధరములు ముక్కముక్కలగు ధారుణి క్రుంగు నభం బభం బగున్.

ఉ. పూనుము కార్యభారమును “బూన సుదర్శన" మన్న దేవకీ
    సూను కథావిధానమును జూపఱు లాత్మల సంస్మరింప నే
    మౌనము పూని నీ శుభ సమగ్రతకై జపియించుచుందు నీ
    పై నొకచూపు తక్కుసభపైనొక చూపునుగా మెలంగుదున్."

యీలా యెంతచెప్పినా మొదటిచరణం నీవే మొదలుపెట్టాలని బలవంతపెట్టాఁడు. ముఖ్యకారణం గుట్టువిడిచి వ్రాస్తూవున్నాను. అవధానానికి ధారణాశక్తి ప్రథమసోపానం. పాండిత్యం వుంటే పండితులను సంతోష పెట్టవచ్చు - ప్రయోగవిశేషాలద్వారా. లేదా, లేకపోతుంది. అనేకులు అడ్డదిడ్డంగా ప్రశ్నిస్తారు. ముందు చరణంలోనే ఆ చిక్కులన్నీ వుంటాయి. వాళ్లమనస్సు నొచ్చకుండా మృదువుగానే వాళ్ల ప్రశ్నలు తప్పని వాళ్లకు బోధించేలాగు పరాక్రమించాలి. ఈ విషయంలో వుండే తెల్విని యేమని పేర్కొనాలో నాకు యిప్పటికీ తెలియదు. అది నావద్దనే కాని యెక్కడా లేనేలేదని అతనికి పిచ్చినమ్మకం వుండేది. అందుచేత అసమర్ధుఁడుగా వున్నాసరే నన్ను ఆలా బలవంతపెట్టడం తటస్థించేది. దానికి తథ్యంగా నేను ఆవేళ చేసిన ఘనకార్యాన్ని కూడా వ్రాస్తూవున్నాను. దీన్నినేను యెంత మభ్యపెట్టి వ్రాసినా ఆత్మోత్కర్షగా వుండకపోదు. యేంచేసేది? “రోట్లో తల దూర్చి రోఁకటి పోటుకు జంకితే యేమవుతుంది?"

సరే! చెప్పడానికి ప్రారంభించాను. కొన్ని ప్రథమచరణాలు చెప్పడం జరిగింది. అంతా పండితులూ, కవులే పృచ్ఛకులు. అందులో వక పృచ్ఛకుఁడు పిచ్చివాఁడుగా వుంటాఁడు. కాని మంచి సాహితీపరుఁడున్నూ, కవిన్నీ అతఁడు అడిగినప్రశ్న లక్ష్మీదేవిని పృథ్వీ వృత్తంలో వర్ణించవలసిందని మాత్రమే. ఇందులో కష్టం లేశమున్నూ లేదు, సాబీగానే చెపితే తీరిపోతుంది. కాని “వుత్పన్నమందబుద్దు" లన్నట్టు తాత్కాలికంగా కన్నుమూసి తెఱచేలోపుగా పుట్టే అనేక చిత్రవిచిత్రాలు ప్రతిఫలించే బుద్ధిగల నేను వక అగమ్యగోచరప్పుంతగా ప్రథమచరణం ఆరంభించాను. ఆవూహ అంతలో నాకెలా తట్టిందో యిప్పటికీ నేను చెప్పలేను. యెవరేనా చెపుతారేమోకాన యిఁక ముందున్నూ నేను చెప్పలేను.

“సరోజనిలయాం సరోజనికరామ్"

అని చెప్పాను. యిది పృథ్వీవృత్తపాదం అనుకోవడానికి అవకాశం లేనేలేదు. యేలాటి లాక్షణికుఁడున్నూ పృథ్వీవృత్తపాదంగా మాఱుతుందని అనుకోఁడు. నాకేనా పాదారంభంలో యీలా మోసంచేదామనేదురూహలేదు. కాని సరోజనిలయాం దాఁకా చెప్పేసమయంలో చట్టనయీ దురూహ పుట్టింది. యిది దురూహే అనండి, లేదా సదూహే అనండి. యీలాటి చణుకులు సభలో - అందులో అవధానసభలో – మిక్కిలిగా వుపకరిస్తాయి. ఆ వుపకరించడం యేలాంటిదో వివరిస్తాను. యెప్పుడయితే నే నీచరణాన్ని చెప్పి పృథ్వీవృత్తపు నడకలోకాక వేఱొక వృత్తపు నడకలో లయవేసి చెప్పడానికి ఆరంభించానో, వెంటనే పృచ్ఛకుఁడు "బావా! వృత్తం తప్పిం"దన్నాఁడు. నేను “తప్పితే తప్పిందిలే. తరువాత తి. శా. సవరించుకుంటాడులే. వ్రాసుకో"మన్నాను. యిదంతా నా కొంటెతనపు నటనే. "కొంటెలలోనఁ గొంటెయున్ గావలెఁ" గదా! దానిమీఁద శివరామశాస్త్రి (శిష్యుడు) అన్నాఁడుకదా : "మళ్లా తి. శాస్త్రిగారు సవరించుకోవడమెందుకు? తమరేసవరించండి" అన్నాఁడు. "నాకు వోపిక లేనిసమయంలో తి. శాస్త్రిగారి బలవంతాన్ని పట్టి చెప్పే చెప్పడంలో యింతకంటె అనుకూలంగా చెప్పడం కుదరదు. "పుణ్యానికి పెట్టే అమ్మా, నీ మొగుడితో సమానంగా పెట్ట"మంటే యెలాగ? సవరించఁబోతే మఱీతప్పుతుందేమో" అన్నాను అతనితోటి. దానిమీఁద తిరపతిశాస్త్రి అన్నాఁడు కదా- "బాగుందిరోయ్! మొట్టమొదటినుంచీ మొదటిచరణం నువ్వు చెప్పడం ఆచారం కనక చెప్పమన్నాను కాని చేతకాక కాదు. తప్పని తెలుస్తూ వున్నప్పుడుకూడా తప్పులే చెప్పమన్నానానే" నన్నాఁడు. యిక్కడికి “సభంతా గొల్లలే” అన్నట్టయిందా? అయినా యింకా యెవరేనా యీగుట్టు తెలుసుకున్నవారు సభలో వున్నారేమో అని "అయ్యా! తప్పిందని మావాళ్లందఱూ అంటూ వున్నారు. నాకు తప్పలేదని తోస్తూవుంది; మీ రేమంటా"రన్నాను. వారున్నూ "తప్పినట్టే వుం"దన్నారు. “అలా అయితే యిప్పడు చూడండీ” అంటూ “వరాం భాస్వరామ్" అనే అక్షరాలు తుట్టతుదనుచేర్చి స్వరంకాదు, గమనాన్ని మార్చి చదివేటప్పటికి పృథ్వీవృత్తపాదంగా కనపడడంతోబట్టే అందఱూ డిల్లపోయారు.

ఈ వ్రాతకు ఫలితం నాకు సంబంధించిన వుత్తరకుమారప్రజ్ఞలను ఈ “ముదిముప్పన బాలపాపచిన్నె"గా లోకానికి వెల్లడిచేసి తద్ద్వారాగా అపహసించబడడమేనా? నాటి అవధానాని కేమేనా వుపకరిస్తాయా? అంటే, నాకు తోcచినమాటలు వ్రాస్తాను వినండి. యీపోకడ తప్పుకాని దాన్ని తప్పుగా కొమ్ములు తిరిగిన పండితకవులను, అందులో నాకన్నా మిన్నా అనుకోతగ్గ తిరుపతిశాస్త్రి అంతటివాణ్ణి నమ్మించి మళ్లా వొప్పుకింద వొప్పించడం జరిగింది. కనక, యీపైని నిజమైన తప్పుచెప్పినా పృచ్ఛకులు తలవంచుకొని కిక్కురుమనక వ్రాసుకోవడమేగాని మళ్లా నోరు మెదపడం అంటూ వుంటుందా? దానితో అవధానభారం యెంతో తేలికవుతుంది.

యీలాటి లబ్జులు నావద్ద వుండడం తి. శాస్త్రికి బాగా తెలుసును. నా సహవాసం వల్లకూడా యివి అతనికి అబ్బలేదు. యివి యేలాటివి? అంటే "పుట్టి నేర్చుకొనెనొ, పుట్టక నేర్చెనో చిట్టి బుద్దు లిట్టిపొట్టి వడుగు" అని పోతరాజుగారు చెప్పినమాదిరివి. ఆ యీ చిట్టిబుద్దులకు సంబంధించిన యితిహాసాలు యింకా చాలా ఉన్నాయి. వీట్లనుబట్టే మాతిరుపతి శాస్త్రికి నాయందు యెక్కువగౌరవం వుండేది. దాన్నే నేను అతని అనంతరమందు జరిగిన సానుభూతిసభలో

“ఎవఁడు నా కెక్కుడయ్యు నాయెడలఁ గార
 ణాంతరమ్మున గురుభావ మంతరంగ
 ముననెకాక పయికిఁగూడఁ గనఁగఁజేసె
 నట్టి తిర్పతికవి దివికరిగె నకట."

అని గూఢంగా, సూత్రప్రాయంగా వుటంకించి వున్నాను.

యీలాంటి “వుత్పన్నమందబుద్దులకు" సంబంధించిన నా చేష్టలను బట్టేనేను “అభినవ రామలింగ బిరుదాంకుఁడను" అంటూ వక రాజసభలో వొకానొక సందర్భంలో ప్రత్యేకించి నన్నుఁగూర్చి పేర్కొని వున్నాను. మాకు వున్న బిరుదులన్నీ వుమ్మడి దమ్మడిగా వుండవలసినా యిదివొక్కటీ పృథక్కుగా వుండడానికి కారణం యీ “వుత్పన్న మందబుద్దులే" అని విజ్ఞులరయుదురుగాక! యీ సందర్భాలు నేను వ్రాయడం అపహాస్యాస్పదమయినా వ్రాయవలసి వచ్చింది, క్షంతవ్యమని కోరుతాను.

తిరుపతిశాస్త్రులుగారు ముక్కుకు సూటిగా వెళ్లేవారేకాని యీ మార్గంలో వారు కారన్నంతలో ఆయనకి వచ్చేలోటులేదని నా నమ్మకం. దీనివల్ల అధఃకృతి రాకపోవడమే కాక పురస్కృతికూడా కలుగుతుందనే ధైర్యంతో దీన్నిందు పేర్కొన్నాను.

కలహం యెవరితోనేనా సంఘటించినా నేను దాన్ని పాటించకుండా ఆవలివారు మాట్లాడితే మాట్లాడడానికి యిష్టపడతాను. మావాఁడికి అదికిట్టేదికాదు. కొప్పరపువారిని తిరుపతిశాస్త్రితో సంప్రతించకుండానే అభినందన పద్యాలు వ్రాసి బందరుకు అవధానార్థం రావలసిందని ఆహ్వానించింది నేను మాత్రమే. ఆ విషయం “అయ్యా! కొప్పరపుం గవీశ్వరులు" అనే పద్యాలు చెపుతాయి. అతనిసమ్మతికూడా వున్నట్టు అందలి "తిరుపతి వేంకటేశ్వరులు" అనే చేవ్రాలు చెప్పినా అది మా ఆచార ప్రకారం చేసిన చేవ్రాలేకాని అతనిసమ్మతిని నిరూపించేదికాదు. అప్పుడే కాదు యిప్పుడే కాదు, వారియందు నాకు పరమాదరమే. వారికున్న శక్తి సామర్థ్యాలను యెంతవఱకు గౌరవించాలో అంతవఱకేకాక హెచ్చుగా గౌరవించడం నాకు యిష్టమే. అయితే యేంచేసేది? మా తిరుపతి శాస్త్రికి సమకాలికులలో యెవరికవిత్వమూ నచ్చేదికాదు. అందులో వారి కవిత్వమంటే మఱీ యెదురు తిరిగాఁడు. "ముసుఁగులో గుద్దులాట" తటస్థించింది. యెవరికేనా "సర్టిఫికట్టు" యివ్వవలసివస్తే “బ్రహ్మిష్ఠో బ్రహ్మం" మీఁద నాతో పాటు చేవ్రాలుచేసేవాఁడే కాని మనఃపూర్వకంగా కాదు. (యీ సర్టిఫికెట్టుగాథకు సంబంధించిన వక చిత్రమైన విషయం నెల్లూరులో జరిగిందివుంది. దాన్ని శ్రీ వేమూరి శ్రీరామశాస్త్రులుగారు బాగా యెఱుఁగుదురు. వారు చెపితే వినఁగలందులకు కోరుతాను.) “నీకు బాగుండని కవిత్వమంటూ లేనేలేదు. అన్నీ బాగానేవున్నాయంటావు. నీమాటకు విలువేమిటి?” అని నన్ను సణిగిపోసేవాఁడు. యెంత సణిగినా చేవ్రాలుమాత్రం చేసేవాఁడు. యీ విషయంకూడా ఆలాగే జరిగిపోతుం దనుకున్నాను. పూర్తిగా పట్టుపట్టాఁడు. ఆ కవీశ్వరులున్నూ మఱికొందఱు పెద్దలున్నూ వచ్చి మమ్మల్ని విందుకు ఆహ్వానించే సందర్భంలో నేను వారిని అభినందిస్తూ వుంటే అనభినందనానికి ప్రారంభించాఁడు. యేంచేసేది? మళ్లా అతని వాక్యాలు ఖండించి అభినందనానికే వుపక్రమించాను. కాని మళ్లాపూర్తిగా యెదురు తిరిగాండు “తోఁటకూరలో పురు"గన్నట్టుగా వారి ఆశుధారాప్రజ్ఞను యీసడించడానికి ఆరంభించాఁడు. నాకు “ప్రాణగొడ్డం"గా కనపడింది. తరవాత వూరువెలపలికి వెళ్లి రహస్యంగా మందలించాను. కాని ప్రయోజనం లేకపోయింది. తలతిక్కపట్టు పట్టి కూర్చున్నాఁడు. 'ససేమిరా’ అన్నాఁడు, ఆ యీ విషయం 'గుంటూరిసీమ'లో సూత్రప్రాయంగా వివరించే వున్నాను. పలువురు యెఱిఁగిందికూడాను. తుదకు సభలో యేదో యితఁడు రసాభాసు చేస్తాఁడని నాకు పూర్తిగా భయంకలిగింది. దానికి తథ్యంగా ఆసనచర్చ వచ్చింది. అప్పుడు అతఁడు చేసే రసాభాసు ముందు జరగఁబోతుందని యెఱిఁగివున్న నేను - అంతకంటే కొంత పాయంటు వున్నది గదా అని చెప్పి నేనే ప్రాచీనావీతిమార్గం త్రొక్కిసభలో తినవలసినతిట్లూ, దీములూ నేనే భరించవలసివచ్చింది. అతఁడుమాత్రం నిస్తరంగ సముద్రంలాగ వూరుకున్నాఁడు సమయానికి. అతఁడు చేయఁదలఁచిన రసాభాసేమిటంటే; అది నాకు ముందే వివరించాఁడు- "వారు గనక యీవేళ సభలో మనలనుగుఱించి అభినందన పద్యాలు ఆశువులో చెప్పేయెడల అవి రసవంతంగా, నిర్దుష్టంగా వుంటే వూరుకుంటాను. ఆలా వుండకపోతే వారిని నే నేమీ అనేది లేదు గాని నారాయణ! నారాయణ!’ అంటూ చెవులు మూసుకుంటా"నన్నాఁడు. అయ్యా! యెంతటి మహా కవికేనా గంటకు వందలకొలఁదిగా లెక్క వచ్చేటప్పుడు రసం రావడమున్నూ నిర్దుష్టత్వమున్నూ సాధ్యమవుతుందా? పయిఁగా వారు మమ్మును అభినందించే సందర్భంలో వారిని యీసడించడం యెక్కువ రసాభాసుగా వుంటుందని నాకు భయంవేసింది. యెంత చెప్పినా తోవలోకి రాలేదు. యీలాటి పెంకెపట్టుపట్టడం అతనికి తఱుచు వుండేది. అది అతని అన్నలదగ్గిరా వుంది. యింకా యిప్పటికీ వక అన్నగారు జీవించే వున్నారు. ఆయనతో కొత్తగా మాట్లాడవలసివస్తే విధిగా పోట్లాటవచ్చి తీరుతుంది. కాని యెంతో మంచివాఁడు. ఆ మంచి యెవరికి తెలుస్తుంది? అందఱికీ తెలిసేది “తలతిక్కపట్టే". యీ విషయం మనస్సులో పెట్టుకొనే

చ. "తిరుపతిసింగమున్ సరిగఁద్రిప్పి ప్రశాంతమొనర్ప వేంకటే
     శ్వరునకుఁ దక్క నీయనుఁగు బావకు గీవకు నోజగూర్చు నీ
     గురునకుఁ జర్ల చంద్రునకుఁగూడ వశం బెటు లయ్యెడున్ దురు
     ద్ధర మది నేను దానిబలు ధాటికి నొక్కొకవేళ జంకెదన్"

అని గీరతంలో వ్రాసివున్నాను. సర్కసులో సింహాలను ఆడించే మానేజరుకి దినదినగండంగా వుండడం అంతా యెఱిఁగిందే. ఒక్కొక్కప్పుడు యితఁడు యెదురు తిరిగితే నాగతికూడా ఆలాగే వుండేది.

సరే! గుంటూరువిషయం తుదకి నామీఁదకే వచ్చింది. అంతా నన్నే దూషించారు. తిరుపతిశాస్త్రి మంచివాఁడే అయినాఁడు. యేదో జరిగిపోయింది. ఆ తర్వాతకూడా కొప్పరపు సోదరులకు నాయందు అంతరంగప్రేమ పోలేదు. వారిని నేను యెంతో ప్రేమతో ఆహ్వానించినవాణ్నని వారు గుర్తించకుండా వుంటారా? దానికి తార్కాణంగా యిటీవల కొన్నాళ్లకు శ్రీ రాజా మంత్రిప్రగడ భుజంగరావుగారి కుమార్తె వివాహంలో తారసించాము. అన్నదమ్ములందఱూ అప్పటికి బాగానే వున్నారు. భోజనాలవేళ కలుసుకున్నాం. క్షేమసమాచారం అడిగారు. ప్రీతిగా మాట్లాడారు. నాకూ యెంతో సంతోషమయింది. ఆ కాస్తసేపూ చక్కగా ఒక్క కడుపునఁ బుట్టినవాళ్లలాగ మాట్లాడుకున్నాం. తిరుపతిశాస్త్రి ఆ పెళ్లికి అసలే రాలేదో, అక్కడికింకా రాలేదో బాగా జ్ఞాపకంలేదుగాని, పెళ్లిలోకాక మళ్లా జరిగిన యింకోకొత్త పెండ్లిసభలో శ్రీ జమీందారుగారు కవిత్వ సభా యాజమాన్యాన్ని నామీఁదే వుంచారు. వారిని, మమ్మల్నీ అందఱినీ సమానంగా గౌరవించారు. మావాఁడి వుద్దేశం వారికీ మనకీ గౌరవంలో యేదో కొంచెమేనా తేడా వుండాలని. నాకున్నూ యీ చేదస్తం లేకపోలేదుగాని, యిదేమేనా పరీక్షార్థం యేర్పడ్డసభ కనకనా ఆలాటి తేడాపాడాలకు? భోజనంలో అందఱికి అన్ని పిండివంటలూ సమంగా వడ్డించడం యేలాటిదో, యిదీ ఆలాటిదే అని సరిపెట్టుకోవడం నా తాత్పర్యం. అందుచేత నాకేమీ లోటుగా కన్పించలేదు. యితఁడేనా యేమీ అంటాఁడనుకోలేదు నేను. అంతట్లో జమీందారుగారిని అభినందించడానికే అనుకున్నాను వకపద్యం ప్రారంభించాఁడు. దాని చివరచరణాలలో వివాదాంకురబీజాల్ని నాటుతూ “పులులన్ మేఁకల నొక్క చెర్వున జలమ్ముంద్రావంగాఁ జేయు చర్యలు చూపించితివయ్య!" అన్నాడు. ఆపట్లాన్ని కొప్పరపుసోదరులలో పెద్దాయన అనుకుంటాను, అందులోవున్న "మేఁకలు” అనేది తమ కన్వయించుకోవలసినదిగా అనుమానపడి యేదో పద్యం మళ్లా ప్రారంభించి "గజంబుల సింగంబుల నొక్క చెర్వున జలంబున్ ద్రాగఁగా” అని చదివి తమయందు సింహత్వం సంపాదించుకొని సంతుష్టిపడవలసివచ్చింది. అంతట్లో ఆవిషయం అప్పటికయితే ముగిసింది. కాని, లోపాయికారీని యింకా వీరికి లోలోపల రగులుతూనేవుంది. నేనైతే “అనవసరం, గతించిందేమో గతించింది. మళ్లా యెందుకురా" అని దిగపీఁకుతూనే వున్నాను కాని, బసలో నామీఁదికి యెదురుకొని గర్జిస్తూ "గోరీ కట్టింపనె? కాకవిప్రతతి కర్థిన్నేఁడు హేలాపురిన్" అని దూఁకుతూవున్నాఁడు. ఆ సందర్భంలో కర్మం చాలక నే నన్నానుగదా "దీనిపేరే వెఱ్ఱివెల్నాటీయం" అనిపించుకొంటుందన్నాను. దానితో తోఁకతొక్కిన తాచులాగ నామీఁదకి లేచి “క. వెలనాటివాఁడఁ గవితకు, వెలనాఁటినవాఁడ" అని హుంకరించాఁడు, కొడతాఁడేమో అనికూడ భయపడ్డాను. ఆయీపద్యాలన్నీ “సందర్శనం"లో వుంటాయి చూచుకోండి. మా శివరామశాస్త్రి బావమఱది మైలవరపు కృష్ణమూర్తిగారి గృహంలోనే యీ కోలాహలమంతా జరిగింది. తుట్టతుదకు జమీందారుగారి దాఁకా వెళ్లి యీ పద్యాలువినిపించే దాఁకా ఆతని ఆవేశం ఆఁగిందేకాదు. "యేదో మావాఁడు తొందర మనిషి ఆయీపద్యాలు చెప్పాఁడు. చెప్పినవి మీకువినిపించకపోతే ప్రకటనానికి అర్హం కాపని వినిపించవలసి వచ్చిం"దంటూ సబోరీగా జమీంద్దారు గారికి నచ్చఁజెప్పాను.

యింతటితో యిది ముగిసినట్టే. కాని ఆ యేలూరులో తత్కాల మందు శ్రీ వేమూరి శ్రీరామశాస్త్రి శతావధానిగారు నివాసంగా వున్నారు. ఆయన శ్రీ వ. సు. రాయకవిగారినీ, శ్రీ కొప్పరపుసోదరకవులనూ, మమ్మల్నీ శిష్యుఁడు శివరామశాస్త్రినీ విందుకు పిల్చారు. ఆ విందుకు వెళ్లడం అతనికి సుతారామున్నూ యిష్టంలేదు. తుదకు యేలాగో రావడం వచ్చాఁడు. మొత్తం యేలాగయితేయేమి, శివరామశాస్త్రిని విడఁదీశాఁడు. “మా యిద్దఱికీ యీపూఁట భోజనం అవసరంలేదు. అజీర్తిగావుం"దన్నాఁడు. కాదుకూడదని బలవంతంచేస్తే మఱింతచెడి రసాభాసులోకి దిగుతుందని నాకు పూర్తిగా తెలిసేవుండడంవల్ల అసలు కుల్లస్సు యెఱిఁగిన నేనుకూడా "వాళ్లని బలవంతపెట్టకండి 'అజీర్ణే భోజనంవిష' మన్నారుకదా?" అని వాళ్లమాటలనే బలపఱిచాను. వారిద్దఱూ వినాగా భోజనం జరుగుతూవుంది. అప్పుడువచ్చి "అబ్బా! మా మిక్కటంగా ఆఁకలవుతూఉంది. త్వరగా వద్దనకావా"లంటూ ప్రారంభించాఁడు. యీలాటి ప్రయోజనం మాలిన కొంటెతనాలు ఆమరణమూ ఆతన్ని వదలనే లేదు.

శృంగారంలో అంతగా రచించిన రచన అతనిది లేదుగాని కొంటెతనపు పద్యాలుమాత్రం కొన్నివున్నాయి. అవి రికార్డులో యిప్పటికీ జాగ్రత్తపెట్టఁబడే వున్నాయి గావి వుదాహరిస్తే యీకాలపు నాగరీకం అంతగా ఆమోదించదేమో! -

“ఒంటిమిట్టను గాఁపురం బున్నయట్టి ! సిద్ధిసానికి సంకల్పసిద్ధిరస్తు,
 చెలఁగిమాఁమీఁదఁ బద్యమ్ముచెప్పినట్టి | పాపరాజుకు నిధువనప్రాప్తిరస్తు."

అనే కంకంటివారి పద్యం మాదిరిలో కొన్ని వుంటాయి. కొన్ని యింకా ముదరపాకంలో వుంటాయి. వాట్లకుపోలిక -

చ. "వదలక మ్రోయునాంధ్రకవి వామపదమ్మున నున్న నూపురం
      బుదితమరాళకంఠ నినదోక్తుల నేమని పల్కెఁ బల్కుఁడీ
      గుదియలసాని ... ... ... ... ... ... గల భాగ్యరేఖ నీ
      నుదుటను లే దటం చమర నూత్నపురంధ్రులతోడఁ బల్కెడిన్."

అనేపాకంలో వుంటాయి. యీ పద్యం అల్లసాని పెద్దన్నగారిని గూర్చి శ్రీకృష్ణదేవరాయలు పెద్దన్నగారి మరణానంతరం ప్రశ్నించినప్పుడు రామలింగం వేళాకోళంగా పెద్దన్నగారి శృంగారానుభవస్ఫోరకంగా చెప్పినట్టు చెప్పుతారుగాని .. కృష్ణదేవరాయలు పెద్దన్నగారి మరణానంతరం జీవించివుంటేనేకాని ఆయీవిషయం - సమన్వయించదు. కృష్ణదేవరాయల మరణానంతరం పెద్దన్నగారు-చెప్పిన "ఎదురైనచోఁ దన మదకరీంద్ర" పద్యం అందఱూ-యెఱిఁగిందేకనక విస్తరించను. "పక్కిటిపురాణ" వ్యాసంలో యీలాటి విషయాలెన్నో చర్చించివున్నాను. ఆ కవుల జీవితానంతరం వారినిగూర్చి పుక్కిటిపురాణాలెన్నో బయలుదేరాయి. కాని మమ్మల్ని గురించి మా యిద్దఱి జీవితకాలంలోనే యెన్నో పుక్కిటిపురాణకథలు బయలుదేఱాయని మే మిద్దఱమున్నూ యెఱుంగుదుము. ఇటీవల అతని జీవితానంతరం మఱికొన్ని బయలుదేరడం యింతకుపూర్వమే నేను యెఱుఁగుదును.

ఆయీరకం కొంటెపద్యాలు తి. శాస్త్రిగారివి కొన్ని వున్నాయనే ఘట్టంలో మన మిప్పుడు వున్నామనేది ప్రస్తుతం. ఆ పద్యాలల్లో వక్కటీ వుదాహరించకపోవడం యిప్పటి నాగరికులకు బొత్తిగా రుచించవనేకాని మఱొకటికాదు. ఆ పద్యాలల్లో కొన్ని శ్రీనాథుఁడు పల్నాటిసీమలో చెప్పిన వాట్లని పోలివుంటాయి. యీలా వూరించివూరించి వకటీ వుదాహరించకపోతే కొందఱు చదువరులు బొత్తిగా హతాశులవుతారు కనక, చాలా మృదుపాకంలో వున్నదాన్ని వకదాన్ని వుదాహరిస్తాను.

ఉ. “నన్నొకనాతి 'రేపటిదినమ్మునఁ బోయెదుగాక' యంచుఁ గ్రా
     ల్గన్నుల నీరు జాఱ వికలమ్ముగ గద్దదకంఠి యయ్యెన
     య్యన్నులమిన్నతోడ 'వల' దంచుఁ బెనంగిన మానదయ్యె నన్
     మన్ననఁ జూడు రేపటి దినమ్మునఁ బోవుదమయ్య మిత్రుఁడా"”

ఆ యీ రచనవల్ల తి. శాస్త్రిగారి శృంగార రచన యేలాటిదో రసజ్ఞులు తెలుసుకుంటారు. ఇందులో “మిత్రుఁడా" అనే సంబోధన నన్ను ఉద్దేశించినదని వ్రాయనక్కరలేదు. అతనికి నావలెనే విడివిడి పదాలతో రచన సాగించడమే యిష్టంకాని, యేవో సమాసాలతో పద్యాన్ని పూరించడం యిష్టంకాదు. అయితే రసానుగుణంగా సమాసభూయిష్ఠమైన రచన కావలసివస్తే "సంస్కృతం బుపచరించిన పట్టున భారతీవధూటీ తపనీయ" అని పెద్దన్నగారు అందుకున్నట్టు అందుకుంటాఁడు. అట్టిది, అతనిది అవునా కాదా అనేశంకకు అవకాశం లేనిది వకటి వుదాహరిస్తాను.

శా. “మాకన్నన్ మహనీయులైన కవులీ క్ష్మామండలిన్ లేకపో
     రీకాలమ్మున యుష్మదీయకవితా ద్వీపమ్ము ముంచంగ న
     స్తోకశ్రీక మదాశుధారకవితా తుంగార్భటీ ఘోరగం
     గాకల్లోలవతీ ప్రవాహభరవేగ ప్రక్రియల్ చాలవే?"

అతని సమాసప్పోకడ యేలా వుంటుందో దీనివల్ల కొంత తెలుస్తుందా? అయినా యింకొకటికూడా వుదాహరిస్తాను.

చ. “గరువము మాటలందుఁ జెలఁగన్ జగమెల్లఁ జరిపఁజాలు ద్రి
     మ్మరితన మేకవీంద్రులకు మైకొనజాలు నిరర్గళాద్భుతా
     కరరసపుంజ మంజుల వికస్వర చారుకథా సుధాధురం
     ధరబహుళ ప్రబంధ కవితా వనితా చతురోక్తి లేనిచోన్"

యివి రెండూ సమాసధోరణినేకాక విడిపదాలకూర్పునుకూడా తెలుపుతాయి. ఫలానావారి కవిత్వమని చెప్పకుండా వుండేపద్ధతిని యే నన్నయ్యభట్టు కవిత్వమో అనే భ్రమను కలిగించితీరుతుందో, లేదో పయిధార విజ్ఞులు విచారించడానికి అర్హులు. నన్నయ్యగారి పద్యంకూడా వకటి వుదాహరిస్తున్నా

చ. “జలధివిలోల వీచి విలస త్కలకాంచి సమంచితావనీ
     తలవహనక్షమం బయిన దక్షిణహస్తమునన్ దదున్నమ
     ద్దళదురుఘర్మవారికణ కమ్రకరాబ్జము వట్టి నూతిలో
     వెలువడఁ గోమలిం దిగిచె విశ్రుతకీర్తి యయాతి ప్రీతితోన్."

యీ వుదాహరించిన నన్నయ్యగారి పద్యంగాని, తిరపయ్యగారి పద్యాలు రెండూగాని కేవలమూ పద్యమంతా యేకసమాసంగా వున్నవి కావు. అట్టివి యెన్నో వుభయులవీ వుంటాయి చూచుకోండి. ఉన్నప్పటికీ నేను వీట్లని వుదాహరించడానికి కారణం యేమిటంటే, జవాబు చెప్పలేను. చెప్పకపోయినా విజ్ఞులు తెలుసుకుంటారు. చెప్పినా తెలుసుకోలేరు తదితరులు. అందుచేత “మౌనవ్రతాలంబినః”. యిఁక నా రచనల్లో నుంచి కూడా ఒకటిరెండుదాహరిస్తాను. - -

శా. "బాలమ్మన్యులపోరు కీర్తికరమో? ప్రాగల్భ్యసందర్భమో?
      శీలాలంకృతియో? భవత్సుకవితా సీమంతినీ చారులీ
      లాలాస్యాసుగుణంబొ? యేమిపనికై లాభించునో? తెల్పు మీ
      యాలం బింతటఁ జాలుcజాలు నింక నే లా తూలికాచాలనల్?

మ. మొనగాఁ డొక్కరుఁ డారుమాసములు సామున్ జేసి మార్మూలఁబం
     బిన భీపెంపున డాఁగియున్న ముసలాపెన్ బోరికిన్ జీఱులా
     గునఁ గూపస్థితదర్దుర ప్రకర దుర్గోష్ఠీ విరావార్భటీ
     జనితాహంకృతిశాలివై పెనఁగు టే చందంబు నీబోఁటికిన్?"

గీరతం మందలింపుపర్వాన్నుంచి వుదాహరించిన యీ పద్యాలు కూడా నారచనలో పూర్తి సమాసధారను బోధించవు. దానికి “శాంతింపుడని రాయబారమవురా!" అనేవిన్నీ లోకాభిరామాయణంలో వున్న "ఱంతుల్ మానఁడు తిర్పతిద్విజుఁడు" అనే పద్యాలలో కొన్నిన్నీ చూచుకోండి. ఆ “తిర్పతిద్విజుఁడు" అనే వాట్లలోమాత్రం నాలుగువంతులలో మూఁడువంతులు తిరపతిశాస్త్రివిగా తెలుసుకోండి అని గతంలో వ్రాసేవున్నాను. కవి యెవఁడుగాని, యెక్కడఁగాని సమాసం పెట్టాలని పెట్టడు, విడిపదాలేగా వ్రాయాలనీ వ్రాయడు, ఆయా రససందర్భాన్ని పట్టి "అర్ధాశ్శబ్దచయా" అని కుట్టికవి చెప్పినట్టు దొర్లుతాయి.

చ. "జిలిబిలిపల్కులున్ సొగసుc జిల్కెడి ముద్దులు తాఱుమారులున్
      వలపులచోద్యముల్ మిగుల వన్నెలు చిన్నెలుగల్గు కౌఁగిలిం
      తలు బతిమాలుటల్ కసరి తప్పులు వట్టుటలున్ జెలంగు కాం
      తలరతమే రతంబు మఱి తక్కిన వెల్లఁ గ్రియాప్రధానముల్."

అనే పద్యం తెలుఁగుమాటలతో చెప్పాలని “చెప్పిందేనా?” కొన్ని పద్యాలు తెలుఁగు పదాలతోటే ప్రారంభమవుతాయి. అంతట్లో సంస్కృతంలోకి దూఁకుతాయి. ఆ పట్లాన్ని యిఁక సంస్కృతంగానే పద్యమంతా పూర్తి అవుతుంది. కాఁబోలు ననిపిస్తుంది. అంతట్లో మళ్లా తెలుఁగులోకి దొర్లుతాయి. దీనికి తల్లక్రిందులుగా కొన్ని నడుస్తాయి. యీ కర్మాలన్నీ వివరించవలసివస్తే చాలా పెరుఁగుతుంది. యీ తుట్టతుదిమాటలకు కొంచెం వుదాహరణంగా వుండే వకపద్యాన్ని వుదాహరించి విషయాంతరం వుపక్రమిస్తాను.

మ. "ఉరువేగ స్ఫురణాగపాటన పటుద్యోవాహినీ వార్ఘరీ
       పరిణాహారభటీ పటాత్కృతులకున్ బ్రభ్రష్టసారంబులౌ
       తరుషండమ్ములు నిల్చెనేని భవదుద్యద్వాగ్ఘరాసారపు
       ష్కరకోలాహలమున్ సహింపఁగలుగున్‌గాకవ్యహంకారముల్

యీ పద్యంలో తి. శాస్త్రిగారి కవిత్వాన్ని వెం. శాస్త్రి వర్ణిస్తున్నాడు. సమాసంతో ప్రారంభమైంది. మళ్లా విడివిడి తత్సమ పదాలు కొంచెం దొర్లాయి. మళ్లా సమాసం ప్రారంభమయింది. మళ్లా విడివిడి తత్సమాలతో పూర్తిఅయింది. “మొనగాఁడొక్కరుఁడు" అన్నదో కేవలం తెలుగుతో ప్రారంభమైంది. మళ్లా సమాసంలోకి దూకింది. మళ్లా విడివిడి పదాలల్లోకి వచ్చింది. ఆయీవిధానమంతా తిరుపతిశాస్త్రిగారివని వుదాహరించినవాట్లల్లో కూడా చూచికోండి. వ్రాసినకొద్దీ వ్రాయవలసే వుంటుంది. లోకాన్ని మోసపుచ్చడానికి వ్రాయాలంటే, కొన్నిసమాసాలు వ్రాయవచ్చును. అందులో అర్థం లేకుండా "దశదాడిమాది" వాక్యంవలె వ్రాసినా యెవ్వరూ అసలు గ్రంథకర్త చెప్పేదాఁకా కనిపెట్టనేలేరు, యెందుచేత? “యేదో అర్థంలేకుండా వుంటుందా? మనకు గోచరించింది కా"దనుకుంటారు. అట్టిది శ్రవణానందంలో వకటి వ్రాశాను. యిక్కడ వుదాహరిస్తాను.

ఉ. "వేసవి వచ్చె భాస్కర నవీనగవీ నమితా౽మితాచ్చ గు
     చ్ఛాసవ వాసనైక వలనా కలనా కులనాయికా సము
     చ్ఛ్వాసన శాసనాదికృతి ఝంకృతి సంకుల షట్పదావళీ
     భాసుర శుష్కపుష్ప విటపప్రకర ప్రతిభాసమానమై.”

యీ పద్యంలో అర్థంలేదని యెవ రనుకుంటారు? వుందే అనుకుంటారు. తీరా లేదని యెవరేనా సాహసించి అంటారే అనుకుందాం. యెవరో చెప్పి సమన్వయిస్తారు. మా జీవితకాలంలో అయితే మేమే చెపుతాము. దీనిపేరేమిటి? కవిత్వంకాదు; పాండిత్యం అనిపించుకుంటుంది. చూడండి, యీమధ్య బ్రహ్మశ్రీ చర్ల భాష్యకారశాస్త్రులుగారు "మేకాధీశా” అనే నాలుగక్షరాలు పల్లవిగాగ్రహించి, సుమారు క్రౌనుసైజులో అయిదారు వందల పుటలగ్రంథం వ్రాశారు. దానిలో భారత, భాగవత, రామాయణాదులన్నీ వ్యాఖ్యానించారు. యేమీ ఆలా యెందుకు వ్యాఖ్యానించకూడదు? ఓంకారంలో సమస్తవేదాలూ, స్మృతులూ, శాస్త్రాలూ అన్నీయిమిడి వున్నాయని ఋషులు చెపుతూవున్నారా, లేదా? అది అసత్యమా? కాదు. ఆలా వున్నట్టు నిరూపించడం యేమనిపించుకుంటుంది? కవిత్వమనిపించుకుంటుందా? అనిపించుకోదు, పాండిత్యమనిపించుకుంటుంది.

చాలాదూరం వ్రాశాను. బాగా విచారిస్తే కవిత్వం వేఱూ, పాండిత్యంవేఱూకాదు. కాఁబట్టే "సూరిః పండితః కవి" అని అమర కారకుఁడు పర్యాయపదాలుగా వాడివున్నాఁడు, కాని కవిపదం వేదాల్లోకూడ తఱుచు వాడఁబడి వుంది. పండితపదం కూడా వాడఁబడి వుందేమోకాని కవిపదానికి వున్నంత ప్రయోగబాహుళ్యం దానికి లేదేమో? యేమీ వేదం రానివాళ్లకు కూడా “శుచిర్విప్రశుచిః కవిః" "కవిం కవీనా ముపవశ్రమస్తమమ్” అంటూ బోలెఁడు ప్రయోగాలు దొరుకుతాయి.

యేమైనాసరే, క్రమంగా కొన్నాళ్లకు కవివేఱూ, పండితుఁడు వేఱూగా వాడకంలోకి డేఁకింది ప్రవృత్తి, సామాన్యుల ప్రవృత్తి అనుకున్నారేమో? మహాపండితుల ప్రవృత్తే. అందుచేతేకదా అప్పయ్యదీక్షితులవారు "పిళ్లః కవిరహం విద్వాన్" అనడం తటస్థించింది. యీ అనడంలో పిళ్ల'కుఁ యెక్కువగౌరవం యిద్దామనికాదు. కవికంటే విద్వాంసుఁడే మాననీయుఁడనే తాత్పర్యంతోనే దీక్షితులవారి నోటమ్మట ఆవాక్యం దొర్లింది. అప్పయ్యదీక్షితులు మహాకవి. అయినా ఆయనకు పండితుణ్ననిపించుకోవాలనే కుతూహలం. పిళ్ల అంటే వేదాంతదేశికులు. ఆయన మహాకవియై, మహావిద్వాంసుఁడు కూడా అయివున్నారు. ఆయనకు కవితార్మికసింహుఁడనే బిరుదం. ఆ కాలంలో మహావిద్వాంసులంతా యేకవాక్యతగా శిరసావహించినది వుంది. అట్టివాణ్ణికూడా కేవల కవులలో జమకట్టి తద్ద్వారాగా ఆత్మపాండిత్యోత్కర్షను వెల్లడించుకోవడానికి అప్పయ్యదీక్షితుల వారి ప్రయత్నం. యిందుకోసం కొంత స్వార్ధత్యాగం చేయాలి. కనక తాను మహాకవియై వుండికూడా ఆ కవిత్వ ధనాన్ని త్యజించినట్లయింది.

యీ పండితుల ప్రవృత్తులు ఎంత విమర్శించినా తేలవు. వీరి తారతమ్యనిర్ణయం చేయడానికి యెవరికీ శక్యంకాదు. యెఱిఁగినవిజ్ఞులు క్వాచితంగా లేకపోలేదు గాని, వారిమాటలు సామాన్యులు విని తాత్పర్యాన్ని అవగతంచేసుకోలేరు. వారి వారికి తోఁచినట్టల్లా ప్రచారం చేస్తూ వుంటారు. వారికి యెవరియందుఁగాని ద్వేషం వుండదు. “శివకేశవ"వాదంలాగ యీ వాదం యెడతెగకుండా యెల్లప్పుడూ జరుగుతూనే వుంటుంది. ఆ శివకేశవులు ప్రత్యక్షమై "నాయనలారా! మీ రెందుకు వాదించుకుంటారు? మా యిద్దఱికీ భేదం లేదు. “శివాయ విష్ణు రూపాయ... శివస్య హృదయం విష్ణుః" అంటూ నిష్కపటంగా బోధించినా ఆకాస్తసేపూ వూరుకొని మళ్లా “పూర్వేతి పూర్వా” అని మామూలు వాదాలకు దిగడం తప్పదు. హిరణ్యకశిప్వాదులు మహాసమర్దులై, మంచి రాజకీయధురంధరులై, యెంతో విజ్ఞానులై భగవత్సత్తనుమాత్రం 'తోసిరా' జని సర్వలోకాలూ పాలించడం జరిగింది. యజ్ఞయాగాల్లో హవిర్భాగాలు కూడా తమకే యిమ్మన్నారు. తుదకు ప్రహ్లాదుఁడుద్వారాగా భగవత్పత్త ప్రత్యక్షీకరింపఁబడ్డది. అంతతో ఆ అపోహ తొలఁగవలసిందేనా? తొలఁగిందా? తొలఁగలేదని చెప్పఁగలమా? తొలఁగా తొలగింది. యెన్నాళ్లు? కొన్నాళ్లుమాత్రమే, మళ్లా మామూలాటే! ఇప్పుడు మనలో దాన్ని నమ్మనివారెందఱు? ఆ నమ్మనివారు పండితులు కారా? విజ్ఞానులు కారా? పండితులూ, విజ్ఞానులూ అనిపించుకోవడానికి సంస్కృతభాష చదివితేనేకాని వల్లపడదా? యే భాష చదివినాసరే అనడానికి విజ్ఞులు అంగీకరిస్తారు. అట్టి విజ్ఞులు యిప్పుడు తొక్కేతోవలు చూస్తే భగవంతుఁడున్నాఁడనే నమ్మిక వారికి లేశమేనా ఆత్మలో వున్నట్టు కనఁబడుతుందా? ఓహో! ప్రసక్తానుప్రసక్తంగా చాలదూరం వచ్చాం. వెనక్కి మళ్లదాం.

నేనున్నూ తిరుపతిశాస్త్రులున్నూయే స్థితిలోనైతే యేమి అవిచ్ఛిన్నంగా ముఫ్ఫైయేళ్లు కలిసి మెలిసి వర్తించాము. యెన్నో గాథలు వ్రాస్తే వ్రాయవలసివుంటాయి. ఆ పద్ధతిని వక మహాభారతమంతేనా వ్యాససమితి పెరుఁగుతుంది. అతఁడు మహావిద్వాంసుఁడు, మహాకవి. ఛాందసకుటుంబంలో పుట్టినా ఆ బాపతు ఛాందసం- “భోజనం దేహి రాజేంద్ర ఘృతసూపసమన్వితమ్” వంటిది అతని కవిత్వంలో మచ్చుకు కూడా వుండదు. నడవడిలోమాత్రం కొంతేనా కనపడుతుంది. అభ్యాసకాలంలో యెవరికేనా లోపాలు వుండడమున్నూ, యెవరో సవరించడమున్నూ తప్పనిదే. దాన్నే “కావ్యజ్ఞ శిక్షయాభ్యాసః" అని లాక్షణికులు వాక్రుచ్చారు. ఆ పరిశ్రమ నేఁటి బి. యల్. పరీక్షలో కృతార్థులైనవారు “అడ్వకేటు" పదవికి కృషిచేయడం వంటిది. ఆలా కృషిచేయనివారిలో కూడా పూర్వం భాష్యమయ్యంగారు మొదలైన మహామహులున్నారు. యితఁడు వారిలోవాఁడు కాఁడు. నేఁటి "అడ్వకేట్ల" తరగతిలోవాఁడు. కొంత వయస్సు అతీతమైనపిమ్మట కవిత కారంభించినా యితని కవిత "బలా దాకృష్యమాణా" కాదు, ముమ్మాటికీ కాదు. వయస్సతీతం కావడానికి వేఱు, దాన్ని వ్రాస్తాను కాని పలువురు విశ్వసించరు. జాతకనమ్మిక కలవారు విధిగా విశ్వసిస్తారు.

యివటూరి అయ్యన్నగారు పూర్వకాలపు ప్లీడరు వకరు వుండేవారు. ఆయన యింజరం అనే బ్రాహ్మణాగ్రహారంలో స్కూలుమాస్టరుగా వుండేవారు. అప్పటికి పెళ్లికాలేదు ఆయనకి. ఎవరేనా "అయ్యా! మీరింకా పెళ్లి చేసుకోలేదేమి, యీపాటికి పెళ్లిచేసుకోరాదా?" అని ఆప్తులు ప్రశ్నించి ప్రోత్సాహపఱిస్తే ఆయన యేంచెప్పేవారంటే “యిదిగో యిప్పుడు నా జాతకంలో కుజమహాదశ జరుగుతూ వుంది. వచ్చేవత్సరం కాక ఆవచ్చే పైవత్సరంలో రాహుదశ ప్రవేశిస్తుంది. అప్పడు నాకు వివాహాది సమస్త వైభవాలూ వక్కమాటుగా పడతాయి. ఆ రాహువు ఆలాటివాఁడు. మిథునరాహువు" అని చెప్పేవారఁట. తుదకు రాహువు వచ్చాఁడు, అన్నట్టే జరిగింది. ఆయన్ని మేం బాగా యెఱుఁగుదుము. ఆయన భార్య సాక్షాత్తూ మహాలక్ష్మీ అవతారమే. ఆ పతివ్రతాత్వం వర్ణనీయం. దాన్ని యిప్పుడు అభినందించదు లోకం. శాంతం, పాపం! నా జాతకానికి కూడా రాహువు మిథునరాహువే. ఆ అయ్యన్నగారు నా జాతకంచూచి ఆలాగే యోగిస్తాఁడని చెప్పడం సందర్భంలో వెనక నేను వింజరంలో విన్నసంగతుల యాథార్థ్యాన్ని ఆయనముఖతః కూడా వినికాని వూరికే నమ్మి యిందు వ్రాయలేదు.

చెప్పొచ్చే దేమిటంటే? తిరుపతిశాస్త్రి మహాకవి కావలసినవాఁడై జన్మించినప్పటికీ సుమారు పద్దెనిమిదేళ్లదాఁకా ఆ కవిత్వానికి కారకత్వంగల గ్రహదశ రాలేదనిన్నీ అప్పుడు వచ్చిందనిన్నీ, ఆ సమయానికి యేదో బాహ్యకారణంకూడా వుండాలి కనక, అంతకు ముందే యేకొంచెమో అల్లుతూవున్న నాతో స్నేహం కలిగిందనిన్నీ అనుకోవాలి. సహజ కవి అతఁడు కాఁడనే అర్థం యిచ్చే మాటలు విమర్శనాదూరములు. నాకంటే అతఁడు యెక్కువ పండితుఁడనేవిషయం యేలాటిదేనా నేనుత్తరించతగ్గది కాదు. దానికోసం లోకం కొట్లాడుకోవలసిందే. అది నా వల్ల యెప్పటికీ తేలేదికాదు. కొన్నిట్లో నన్నెక్కువగానూ, కొన్నిట్లో అతణ్నెక్కువగానూ చెప్పుకోవడమున్నూ "అది కాదు యిది, యిది కాదు అదీ" అని పోట్లాడుకోవడమున్నూ నిన్న నేఁడు పుట్టలేదు. చాలాకాలమై పుట్టింది. రామకృష్ణకవులేమో మమ్మల్ని యిద్దఱినీ ద్వేషించినప్పటికీ అందులో నాయందే వారికి ప్రధానద్వేషం అని అందఱూ యెఱిఁగిందే. అట్టివాళ్లు “...వేంకటేశ్వరుని యాదరణమ్మునఁ జేసి కాక ఆ తిరుపతి మార్గ మిట్టిదని తెల్ప నెఱుంగ నెవండెఱింగెడిన్” అంటూ అతణ్ణి అధఃకరిస్తూ వ్రాసారు. దానికి తి. శాస్త్రికి కొంచెం కోపం వచ్చి మళ్లా ఆలాటి శ్లేషతోటే జవాబిచ్చాఁడు. అవి పలువు రెఱిఁగినవే అయినా ప్రసక్తి కలిగింది కనక వుదాహరిస్తాను.

చ. "తిరుపతిఁ బట్టి నీకుఁ గల తేజ మటంచును, నిన్నుఁ బట్టియే
    "తిరుపతి" కంచు మూర్ఖులు పదింబది తంత్రము లెన్నియేని యే
     ర్పఱచినఁగాని మీర లవి పాటియొనర్పరు బ్రహ్మచేఁతలె
     వ్వరు ప్రతిసేయఁగాఁ గలుగు వారలు తిర్పతివేంకటేశ్వరా!"

యీ పద్యంలోవున్న ‘బ్రహ్మ' పదము గురువుగారైన బ్రహ్మయ్య శాస్త్రులుగారిని కూడా చెపుతుందని తెలుసుకోవలెను. వెం. రా. లు అతణ్ణి మాత్రమే అధఃకరించి వ్రాసినా నన్ను కూడా అధఃకరించి మాట్లాడుకొనే వారు అప్పడున్నూ వున్నట్టు పద్యారంభంవల్లనే తేలుతూవుంది కనక యీ వివాదం కొత్తదికాదనిన్నీ వెం. రా. లు మాత్రమే తెచ్చిపెట్టింది కాదనిన్నీ విస్పష్టం.

ఉ. “ఏగిరియందు నీవు వసియింతువొ? లీలలుచూపుచుందువో?
     ఆగిరి పల్లెయైన జనులందుకు తిర్పతి యంచు దానితో
     యోగమె గాని యేటికి వియోగము నీకు ఘటించు? “వీడినన్
     భోగము లేదు నీ" కనుట మూర్ఖత తిర్పతివేంకటేశ్వరా!"

యిందులో ఆగిరి + పల్లె అనిన్నీ “ఆగిరిపల్లె" అనిన్నీ వ్యస్తంగానూ, సమస్తంగానూ చూచుకోవాలి. (ఆగిరిపల్లె అనేది శ్రీ నూజివీటి వారి యిష్టదైవం శోభనాద్రీశ్వరుఁడు వున్న క్షేత్రం.) అనర్గళప్రవాహంగా యీలా కవిత్వం వ్రాసే తిరుపతిశాస్త్రి సహజకవి కాఁడనిగాని, యేదో ప్రయత్నించి చెప్పే కవులలో చేర్చతగ్గవాఁడనికాని యెవరేనా అనుకున్నా ఈ పయినేనా అనుకోరని నమ్ముతాను.

అయితే యెంత యేకీభావం మాయిద్దఱికీ వున్నా లోకమే కాక మాలో మేము కూడా యెఱిఁగిన కొన్ని భేదాలు లేకపోలేదు. అతఁడు నాలాగ యేపిచ్చిపడితే ఆపిచ్చిని పట్టి పల్లార్చే స్వభావం కలవాఁడు కాఁడు. "సుగ్రీవబొబ్బ" అన్నట్టు వొక బొబ్బపెట్టి మళ్లా దాన్ని తలపెట్టేదే లేదు. నాచేదస్తం ఆలాటిది కాదు. అది తేలేదాఁకా నిద్రాహారాలు సమేతూ తోఁచకపోవడం నా ప్రకృతిలో వుంది. దీన్ని తప్పించుకోవాలని నేనైతే చాలా ప్రయత్నంచేసి చూచానుగాని ప్రయోజనకారి కాలేదు. దీన్ని అతఁడు యెప్పుడూ గర్హిస్తూ వుండేవాఁడు.

ఇంకోటి - తోఁచిందేదో చట్టనవ్రాసి పాఱేయడమే కాని దాన్ని మళ్లా పరిశీలించడ మంటే అతనికి పట్టేదికాదు. నేను మళ్లామళ్లా చూడడమే కాకుండా వ్రాసినదాన్ని యెందఱికో వినిపిస్తేనేకాని నాకు తోcచకపోవడంకూడా వుంది. (యీసంగతి లోగడ వ్రాసిందే.) యిది కూడా అతనికి సహ్యం కానిదే. వినిపించడం యెందుకనేవాఁడు.

యీలాటి ప్రకృతిభేదాలు వేఱువేఱు వ్యక్తులైనాక యేలాగా వుండకుండా వుండవు. అప్పటంతకాకున్నా మాటాడితే "డిఫర్మేటరీ" లకు కొంచెంగానేనా సిద్ధపడే ఆ కాలంలో అతనికి ఆ లక్ష్యం లేశమూ వున్నట్టేలేదు. ఆలాటి పదాలుకూడా ప్రయోగించి "తీసేదామురా" అంటే ఫరవాలేదని, ఆలాగే వుండనిమ్మనేవాఁడు. అక్కడికీ నేను కొన్ని తీసేసి వాణ్ని అతఁడు “సాహసుఁడు" అని నేను వ్రాయడానికి యిది వొక కారణం.

సరే పయిఘట్టానికి సంబంధించిందే యింకొకటికూడా వుదాహరిస్తాను.

చ. “కలవు రసప్రవాహము లఖండఘనాగమశృంగ గౌరవం
     బులు గల వద్భుతాధికవి పోషణ జాతమహాఫలంబులుం
     గల వని యెంచి నీ కలిమి గల్పిరి తిర్పతితోడ దాని మూ
     ర్ఖు లెఱుఁగలేక గుట్ట యనుకొందురు తిర్పతి వేంకటేశ్వరా!”

ఆయీపద్యాల అర్థం బాగా విచారిస్తే తిరుపతి శాస్త్రులుగారు ఆత్మ గౌరవం చెడకుండా, నా గౌరవం చెడకుండా ప్రత్యర్థులకు వాకట్టు కల్పించడంలో యెంత నైపుణ్యాన్ని చూపిందీ విజ్ఞులు గ్రహిస్తారుగదా! -

మాలో మేము మా మా తారతమ్యాన్ని గూర్చి వ్రాయవలసివస్తే యింతకన్న వ్రాయడం చేతకాదు, యితరులో? వ్రాస్తే వ్రాస్తారు. యీ మధ్య మా - అంటే కేవలం నాకుమాత్రమే - గురుపరంపరలోవున్న వకరు యీ విషయం యెత్తుకొని కొన్ని అక్షరాలు వ్రాశారు. యెంతో సుళువుగా మా తారతమ్యాన్ని అరంటిపం డొలిచినట్టు తేల్చి చూపి వున్నారు. ఆ అక్షరాలవల్ల యిప్పుడు లోకంలో కొందఱు అనుకొనే మాత్రమేకాక యింకా యెంతో తేడాపాడాలు మాయిద్దఱికీ పాండిత్యంలోనే కాక కవిత్వంలో కూడా వున్నట్టయితే స్పష్టమవుతూవుందిగాని ఆ వ్రాఁతను లోకం అంతా విశ్వసించలేదని అవగతమవుతూవుంది. అంత విస్పష్టంగా వకరు మా యిద్దఱినీ యెఱిఁగిన పరమపూజ్యలు వ్యంగ్యంగా కాకుండా వాచ్యంగా కూడా తెల్పినప్పటికీ తేలకపోతే యింకా తేలడం యేలాగ? బహుశః వారి వ్రాయడం అసూయాప్రయుక్తంగా తోసేసి, మళ్లా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూన్నా రన్నది సత్యదూరం కాదు. అయితే వినండి.

వ్యాకరణం యిద్దఱమూ సమానంగానే చదువుకున్నాం. మధ్య కాలంలో నేను కాశీ వెళ్లినా చాలామంది మహాపండితులను సందర్శించడంతప్ప దేశంలోవున్న తిర్పతిశాస్త్రికంటే విశేషం చదివిందేమీలేదు. మళ్లా దేశంలో యిద్దఱమూ కలిసే తరవాయిగ్రంథాలు మొదటి గురువు గారిదగ్గిఱే అభ్యసించాము. సంస్కృతంలో కావ్యనాటకాలు చదవడంలో నాకన్న అతని గురుశుశ్రూష హెచ్చు. నాశుశ్రూష ఆ విషయంలో అతని కంటె కొంచెం లొచ్చు. యీభేదం మేము కలుసుకొన్న కొన్నియేళ్ల వఱకు - అంటే, అధమం రెండేళ్లవఱకూ - వుండేది. పిమ్మట సరిసమానంగానే మామాసాహిత్యాలు తయారైనాయి. ఆతఁడు తీవ్రమైన బుద్ధిశాలి. అయినా నాలాగ సర్వదా విద్యావ్యాసంగాన్ని చేస్తూ దాన్నే వక తపస్సుగా పెట్టుకొనే స్వభావం కలవాఁడు కాఁడు. నేనో? సర్వదాదాన్నే మననం చేస్తూ కాలక్షేపం చేసే స్వభావం కలవాణ్ని అందుచేత శుశ్రూషావిషయంలో తక్కువ అయినా పరినిష్ఠిత సాహిత్యంలో అతనికంటే కూడా అంతో యింతో నా శక్తి అతిశయించిందని పరిశీలకులు గుర్తించవలసివస్తుంది. యీ అతిశయం దేనిలోను? యేవేనా ఖండన మండనాల ప్రసక్తిలో మాత్రమే. దేనేనా అన్వయించడం వస్తే నాకన్న అతఁడే అధికంగా అన్వయించేవాఁడు. యీలాటి స్వల్పభేదం వున్నా అతనివాదం "యే యెండకు ఆ గొడుగు" గా వుండేదవడంచేత దురుద్ధరంగా పూర్వపక్షాలు చేయడానికే కాని శాశ్వతమైన సిద్ధాంతకల్పనకు పనికివచ్చేది కాదు. యీ వ్రాసిన సోదెవల్ల ముఖ్యఫలితం, సంస్కృత సాహిత్య విషయంలో అతనిది సర్వమూ అంతో యింతో గురుశుశ్రూషా లబ్దం; కాని తక్కిన యావత్తూ స్వయంకృషిచేత, తోడివిద్యార్థులతో కయికురు బొయికురులాడడం వగయిరా వ్యాసంగంవల్ల సంపాదించుకున్నదనిన్నీ చదువరులు తెలుసుకోవలసి వుంటుంది. అందుకు మా కాలంలో వారినే వుదాహరణంగా చూపుతాను.

శ్రీయుతులు కాశీభట్ల బ్రాహ్మయ్యశాస్త్రుల్లుగారిని యొఱగనివారే లేరుగదా? వారితమ్ములు సుబ్బయ్య శాస్త్రుల్లుగారున్నూ సుప్రసిద్దులే. బ్రహ్మయ్యశాస్త్రుల్లుగారు పూర్వపు మెట్రిక్కులేషన్ చదివి ఆ యింగ్లీషుతో పాటు యేమాత్రమో ప్రయివేటుగానో, లేక స్కూల్లోనో రఘువంశమో, కుమారసంభవందాఁకానో సంస్కృతంలోకూడా గురుముఖతః అభ్యసిస్తే అభ్యసించారో, లేక ఆ మాత్రమో అభ్యసించనేలేదో - కాని యేదేనా విషయం వ్యాకరణశాస్త్రానికి సంబంధించింది వచ్చినాసరే, మఱో శాస్త్రానికి సంబంధించింది వచ్చినాసరే ఆయన దాన్ని గురించి వ్రాయవలసి వస్తే ఆ శబ్దాన్ని గూర్చి పాణిని మొదలుకొని మII తాతారాయఁడు శాస్త్రుల్లుగారి పర్యంతమూ వున్న గ్రంథకర్తలు ఎక్కడెక్కడ యేయే పంక్తి వ్రాశారో దాన్నంతనీ సవిమర్శంగా వుదాహరించి, చర్చించి సిద్ధాంతీకరించేవారు. ఆ వ్రాఁత చూచినవారు వీరు పాణినీయం మొదలయిన శాస్త్రాలు పూర్తిగా గురుశుశ్రూషా పూర్వకంగా అధ్యయనం చేసిన వారే అని గోచరించేది. వారి తమ్ములు సుబ్బయ్యశాస్త్రుల్లు గారున్నూ, నేనున్నూ లఘుకౌముదిలో చామర్లకోట విద్యార్ధిత్వంలో సతీర్థ్యులం. తరవాత ఆయన శ్రీ మహామహోపాధ్యాయ బిరుదాంకితులు, షడ్దర్శనీవేత్తలు, యింకా యెన్ని విశేషణాలు వేసి వర్ణించినా తృప్తికలగని పాండిత్యం వున్న శ్రీ పరవస్తు రంగాచార్యులవారి శుశ్రూషచేసి వ్యాకరణాన్ని సమగ్రంగా అభ్యసించారు. యింకా వీరు శ్రీనోరి సుబ్రహ్మణ్యశాస్త్రుల్లుగారి శుశ్రూషకూడా చేస్తే చేసివున్నారేమో? యిట్టి తమ్మునికన్న అన్న బ్రహ్మయ్యశాస్త్రుల్లుగారు చేసిన శుశ్రూష చాలా తక్కువ దనడానికి వొప్పనివా రుండరు. అయితే సుబ్బయ్యశాస్త్రుల్లుగారు కచేరీవుద్యోగం అప్రధానంగానూ, యీ వుద్యోగం ప్రధానంగానూ పెట్టుకోవడంచేత సర్వదా గ్రంథావలోకనంతో కాలక్షేపం చేయవలసి వచ్చింది. మాయిద్దఱికీ వుండే ప్రభేదంకూడా కొన్నాళ్లదాఁకా యీలాటిదే. పిమ్మట యీ ప్రభేదంకూడా లేదు.

"నేను చదవనిగ్రంథం పాఠం చెప్పవలసి వచ్చిందనుకోండి. గురుశుశ్రూషచేసి చదవని కారణంచేత "సపాదం భక్షయేత్ అని వుంటే "సః వాఁడు, పాదం కాలిని, భక్షయేత్ తినవలసినది” అని అసంప్రదాయార్ధమే చెప్పాననుకోండి; వెంటనే నన్ను వెక్కిరిస్తారుగా! వెక్కిరించి వూరుకుంటారా? “అక్కడ సపాదం అనేది సమస్తపదం, సేరుంబావు అనే అర్థం చెప్పాలిగాని మీ గురువుగారు చెప్పింది సరిగాదు" అని వానితో అంటారు. అప్పుడు వుండే దశను పట్టి నాదే న్యాయమైన అర్థం అంటూ బుకాయించినా యథార్థం వాళ్లు చెప్పినదే అని గోచరించక పోతుందా? అయితే యీలాటి అసంప్రదాయాలు సర్వత్ర వుండడానికి నేను బొత్తిగా కావ్యాలే చదవనివాణ్ణి గానుగదా! ఆలాటి వాళ్లయితే “కుండంతా వోటుగా" వుండవలసి వస్తుంది. (లోకంలో వుండే సాహిత్యపరులేనా ప్రతీకావ్యమూ అంతా చదవడం వుండదు.) యీలాంటి సంప్రదాయాలు యెంత శుశ్రూషచేసిన వాళ్లకీకూడా పండితులవల్లనే కాక పామరులవల్ల కూడా తెలుసుకోఁదగ్గవి మఱికొన్ని యావజ్జన్మమూ తెలుసుకోవలసే వుంటాయి. సంస్కృత కవిత్వంలో శ్లోకం నాలుగుచరణాలూ యేకసమాసం పెట్టడం తప్పనే సంగతి మాకు యేలాతెలుసుకోవలసి వచ్చిందో ఆమధ్య బహుశః "మహదైశ్వర్యాభివృద్ధి" అనే వ్యాసంలో వివరించినట్టు జ్ఞాపకం. ఆవివరణఘట్టంలోనే “ఉ. ఒక్కొకచోట నొక్కొకనియొద్ద నొకొక్కొకమాట చొప్పునన్, జక్కఁగ సంగ్రహించితిమి" అనేపద్యంకూడా వుదాహరించినట్టున్నాను. ఆయీపద్యం శ్రీ విజయనగరం మహారాజులుంగారి మీఁద చెప్పిన పద్యాల్లో వుంటుంది చూచుకోండి.

విద్యాసంపాదనకు, నన్నడిగితిరా, గురుశుశ్రూష నిమిత్తమాత్రం కాని స్వయంకృషే ముఖ్యం. (శాస్త్రాలకు మాత్రం అల్లాకాదు “అనభ్యాసే విషం శాస్త్రమ్") సాహిత్యాదికానికి గురువు మార్గప్రదర్శకుఁడు. అంతేనేకాని సమస్తమూ చెప్పఁడు. ఆయన చూపిన మార్గాన్ని పట్టి శిష్యుఁడు స్వయంకృషితో పైకి రావాలి. భోజరా జేమన్నాఁడు? "మధు మయఫణితీనాం మార్గదర్శీ మహర్షిః" అన్నాఁడు, మా యిద్దఱికీ బ్రహ్మయ్య శాస్త్రుల్లుగారు పరమగురువు లంటే, యెందులోను? వ్యాకరణంలోనే. ఆంధ్రాని కెవరు? స్కూలుమాస్టర్లు, భాగోతాలు, వీథినాటకాలు, యివన్నీ యీలా వుంచుదాం.

యిప్పుడు యేశాస్త్రాన్నిగూర్చి వ్రాయవలసివచ్చినా దస్తాలకొలఁది నేను బరుకుతానుగదా! ఆయాశాస్త్రాలు నాకు వచ్చునా? రావు. నేను చదివింది వ్యాకరణం వొక్కటే. తరవాత నిన్న మొన్న బందరువుద్యోగం చాలించుకునివచ్చే రోజుల్లో శ్రీ జంధ్యాలగౌరీశాస్త్రుల్లుగారి వద్ద సూత్ర భాష్యాన్ని చతుస్సూత్రిదాఁకా చదివాను. చదివింది యింతే అయినా దానిలోకూడా “వుప్పులేనిదే ముప్పందుంగా" వుపన్యసిస్తాను, రాస్తాను. యిదంతా గురుశుశ్రూషాలబ్ధమేనా? దేవీభాగవతం పద్దెన్మిదివేల గ్రంథం ఆంద్రీకరించడంలో యెంతో వేదాంతవిషయం వెడుతుంది. దానికి ఆ పురాణమే గురువు. దానిలోవున్న వేదాంతానికీ భగవద్గీతా వేదాంతానికీ యెక్కడో భేదంగాని అట్టే భేదం వుండదు. గీతలు నేను గురుముఖతః చదివింది లేదు. నూటయెన్మిది వుపనిషత్తులున్నూ ఆవేదాంతాన్నే భంగ్యంతరంగా బోధిస్తాయి. అవికూడా తిరగేస్తూవుంటే యెక్కడేనా సంప్రదాయార్థం తెలియకపోయినా అంతా తెలియకపోదు. ఆలాటిది వకటి చూపుతాను.

శ్లో. "యదా చర్మవ దాకాశం వేష్టయిష్యంతిమానవాః
      తదా శివ మవిజ్ఞాయ దుఃఖస్యాంతో భవిష్యతి"

యీశ్లోకం శ్రీ దేవీభాగవత సప్తమస్కంధంలోనిది. శ్వేతాశ్వత రోపనిషత్తులోనున్నూ వుంది. యిది ఆంద్రీకరించే రోజుల్లోనే కాక యిటీవల జరిగిన ముద్రణనాఁటికి కూడా అర్ధం - అంటే ముడి అర్థంకాదు. తాత్పర్యార్ధం - మా యిద్దఱికీకూడా గోచరించిందే కాదు. కొందఱు వేదాంతపండితులని అడిగాం; తేలలేదు. తుదకు "గోఁడమీఁది పిల్లి వాటం”గా ఆంద్రీకరించాము. ఆ ప్రకారమే షష్టిపూర్తిముద్రణంకూడా జరిగింది. అప్పుడు నేను మఱీ దుస్థితిలో వున్నాను. అందుచేత యీ విచారమే కాదు; యేవిచారమూకూడా అచ్చుకి సంబంధించింది నాకు పట్టనేలేదు. పిమ్మట యేదో కొంచెం ఆరోగ్యం కలిగాక యేదో గ్రంథం చూస్తూవుంటే యీశ్లోకం కొంత టిప్పణిసహితంగా కనపడింది. కాని దానివల్ల కూడా సంప్రదాయార్థం గోచరించిందేకాదు. తుదకి వకపిల్ల వాఁడు - వేదాంతశిరోమణికి చదువుకుంటూ వున్నవాఁడు - నా దగ్గరికి వస్తే అతణ్ణి అన్వయించమన్నాను. చక్కఁగా అన్వయించాఁడు. యేముంది? “వడ్లగింజలోది బియ్యపుగింజ”గా తేలింది. ఆకాశాన్ని చర్మంలాగ యెప్పుడయితే మనుష్యులు చుట్ట చుట్టఁగలరో అప్పుడు శివుణ్ణి తెలుసుకోకుండా దుఃఖం యొక్క అనఁగా సంసారం యొక్క నాశం కలుగుతుంది. అనఁగా, ఆకాశం చుట్టచుట్టడమూ అసంభవమే; శివజ్ఞానం వినాగా దుఃఖం తొలఁగడమూ అసంభవమే అని తాత్పర్యం. “మరువదుశీనరేషు జలం” అన్నరీతిని అన్వయించుకోవలసి వుంది. దీనిలో నిజానికి అంతగా గూఢమైన విషయమున్నూ లేదు, స్వయంకృషిచేత ఆర్జించిన పాండిత్యాలవారికి యీలాటివి అక్కడక్కడ అడ్డు తగులుతాయి. అందుచేత “గురుశుశ్రూషయావిద్యా” అన్నారు. అందుచేతే “గురువులేని విద్య గ్రుడ్డివిద్య” అనుకోవలసి వచ్చింది. అట్లని సర్వమూ గురువు చెప్పడమూ, శిష్యుఁడు వినడమూ తటస్థిస్తుందా! అదల్లా వక్క వేదానికి మాత్రమే. తక్కిన విద్యలకో? యేకొంచెమో గురువు మార్గం చూపుతాఁడు; తక్కినదంతా శిష్యుని స్వప్రయోజకత్వానికి సంబంధించిందే. “శతశ్లోకేన పండితః” అని యెందుకన్నారు? కాళిదాసుగారి పూర్వోత్తర మేఘాలు రెండూ కల్పితే నూఱుశ్లోకాలకు కొంచెం సుమారు వుంటాయి. దాని వ్యాఖ్యానంలో యెన్నో సంప్రదాయాలు వున్నాయి. ఆశ్లోకాలనాఁటికి వ్యాఖ్యానం చెపుతూనే పాఠంచెపుతారు గురువులు. అవి నూఱూ వ్యాఖ్యానంతో వల్లిస్తే వాఁడు పండితుఁ డవుతాఁడంటే, పరశ్లోకాన్వయజ్ఞానం చాలావఱకు కలుగుతుందన్నమాట.

పోతరాజుగారు యీ మాత్రమూ చదవనివారు కారు. కాని చదివి కూడా “సహజపాండిత్య” బిరుదాన్ని యెందుకు వేసుకున్నారనేది విచార్యం కాకపోదు. యింతమాత్రం చదివితే శ్రీమద్భాగవతం అనువదించడానికి కొఱకఁబడదు. నాకు తోఁచినమాటలు వ్రాస్తాను. రుచిస్తే అంగీకరించండి; లేదా, త్యజించండి. ఆయన పూర్వజన్మసంస్కారం మంచిది. కనుక యింతమాత్రం చదివేటప్పటికే శ్రీమద్భాగవతం పఠిద్దామనే వూహ కలిగివుంటుంది. ఆపట్లాన్ని ఆ గ్రంథం సంపాదించడం అవసరమయి వుంటుంది. అప్పుడు అచ్చులు లేవు. దానికోసం యెవరినో ఆశ్రయిస్తే వారు పరశ్రేయస్సహనం వున్న యోగ్యులయితే రోజూ ఒకటో రెండో తాటాకులవంతున వారి సమీపంలోనే కూర్చుని రాసుకోవడానికి అనుగ్రహించి యిచ్చేవారు. యీ యివ్వడం వగయిరాలు నేను స్వయంగా నయితే నారోజుల్లో చూడలేదుగాని మాముత్తాతగారి గ్రంథాలు యెవరికేనా యివ్వవలసివస్తే మాతాతగారు యీలాగే యిచ్చేవారని మాతండ్రిగారు చెప్పఁగా విన్నాను. ఆ ధనాన్ని యింత జాగ్రత్తగా మా తాత తండ్రులు వంశస్థులకోసం భద్రపఱిస్తేకూడా అందులో ముఖ్యగ్రంథం మాముత్తాతగారి కవిత్వం “యామినీపూర్ణతిలకావిలాసం" చెట్టెక్కడం తటస్థించింది. “పుస్తకం వనితా విత్తం పరహస్తంగతం గతమ్" అనేమాట ఆకాలంలో బాగా అమల్లో వుండేది. యిప్పుడు పుస్తకానికి ఆబాధ పూర్తిగా తొలంగింది. కాని విత్తానికి మాత్రం అప్పటికంటేకూడా యెక్కువ దురవస్థ తటస్థించి, "ఋణస్య దానస్య న కించిదంతరం మృతస్య సుప్తస్య న కించిదంతరమ్" అనేది పూర్వంకంటే యెక్కువ అమల్లోకి వచ్చింది. కాలపరిస్థితులని బట్టి యిట్టి అభియుక్తోక్తులు పుడతాయి. అవి మాఱిన పిమ్మట ఆయీ అభియుక్తోక్తులకు అర్థం అపార్థంగా కనపడుతుంది. -

మునుపు మనదేశంలోనూ, యితర దేశాల్లోనూ జమీందార్లువారి వారి తాహతు ననుసరించి చిన్నదో, పెద్దదో కోట అంటూ కట్టుకొనేవారు. యిటీవల బ్రిటిషు ప్రభుత్వం వచ్చాక అనోన్యకలహాలు యుద్ధరూపంలో అమలుజరగడానికి వీలులేక కోర్టుల్లో మొదలు పెడుతూ వున్నారు. అందుచేత ఆ కోటల మరమ్మత్తులో పనీ లేకపోయింది. పోనీ, వున్నదాన్నేనా నిలఁబెట్టుకుందా మంటే సర్వాధికారంకల చక్రవర్తి అందుకు అంగీకారం యివ్వడమూలేదు. ఇది విషయాంతరం.

పోతరాజుగారు ఆలాకప్టించి భాగవతం వ్రాసుకోవడంలో అంతకు ముందు యేస్వల్పంగానో వున్న సంస్కృతశ్లోకాన్వయజ్ఞానం పెచ్చు పెరిఁగి వుంటుంది. ఆలా పెచ్చు పెరిఁగినా యింకా సందేహాలు - యిందాఁకా నేను చూపినమాదిరివి, వ్యాఖ్యానసహాయం వున్నా తీరనివి వుంటే ఆ వ్రాసుకునేటప్పుడో, లేక అనువదించేటప్పుడో, "అయ్యా! యేమిటి యీస్థలంలో తాత్పర్యం?" అని అడిగి తెలుసుకొని వుంటారు. (లేదా వుపాస్య దైవం వల్లనేనా ఆ సందేహాలు నివర్తించివుంటాయనుకోవాలి) యిదంతా నీస్వకపోలకల్పితంగాన ఆలా జరగలేదంటారా? అయితే - “విబుధజనులవలన విన్నంత కన్నంత" అని పోతరాజుగారు కృత్యాదిని వ్రాసిన మాటకు తాత్పర్యం యేమిటో చెప్పండి;

యింతకూ ఫలితార్థం యేమిటంటే? కవికిన్నీ యితరులకున్నూ విద్యాసంపాదనలో చాలా తేడా వుంటుంది. కవి "చూపితే పుచ్చుకుపోతాడు" యితరవిద్యార్థులో, గురువుగారు “చింతచెట్టుకింద పిచికి సమర్తాడింది" అని పాఠం చెపితే దాన్ని జాగ్రత్తగా వల్లించి వొప్పగించడమే కాని, "పిచికేమిటి? సమర్తాడడమేమిటి? అథవా ఆడిందే అనుకుందాం. అది యితరులకు గోచరించడం యేలాగ?” అనే విచారణ అంతగా తగలదు. అందుచేతే “క. విద్యలలోపల నుత్తమ విద్య కవిత్వంబు" అని యెత్తుకొని పూర్వలాక్షణికులు "అది తెలియుట లోకమెల్ల నరయుటకాదే?” అని పరిసమాప్తి చేశారు. “వ్రతానా ముత్తమ వ్రతమ్" అన్నట్టుగా పై వాక్యాన్ని అర్థంచేసుకోకూడదు. కవికి యావత్తు-సామగ్రిన్నీ హృదయంలో లీనమై వుంటుంది. దాన్ని వెలువరించడానికి గురువులున్నూ, ప్రపంచకమున్నూ సహాయపడడ మనుకోవాలి. యిది నా అనుభవంలో సంగతి.

నేను తిరుపతిశాస్త్రికి కవితాగురువనన్నా నాకు తిరుపతిశాస్త్రీ వగయిరా సతీర్థ్యుల సాంగత్యం సాహిత్యంలో గురువయిం దన్నా అదంతా యీలాంటిదే._అందుకే అతఁడు స్పష్టంగా నన్నుగూర్చి "తత్కృపం గవియయ్యు" అని వ్రాసినా, నేను అతని జీవితచరిత్రలో దాన్ని అన్యథాకరించి "అన్యోన్యం గురవో విప్రాః” అని వ్రాయవలసి వచ్చింది. అతఁడు ఆలా వ్రాయడమే యుక్తం. నేను ఈలా వ్రాయడమే యుక్తం. నేను అంత యథార్థంగా అహంకారనిరాసార్థం ప్రయత్నించినా అందులో యింకాయేదో కృత్రిమం చేసినట్టే ఒక పూజ్యులు “మూఁకవుమ్మడి మాట" ఒకటి వ్రాసి వున్నారన్నది అందఱున్నూయెఱిఁగిందే. అట్టి స్థితిలో మాటదక్కాలంటే యేలా దక్కుతుంది? అందుకే “యేగతి రచియించిరేని సమకాలమువారలు మెచ్చరేకదా?" అన్నాఁడు అన్యాపదేశంగా విజయవిలాసగ్రంథకర్త. అందులోనూ ఆత్మ వంచకులను గూర్చి మఱీ భయపడాలి.

తిరుపతిశాస్త్రికీ నాకూ వుండేభేదం ఒక్క స్వయంకృషిలోనే. నేనెప్పుడూ - "చింత కవులందుఁ దపసుల చిత్తమందు" అని మొల్ల వ్రాసిన పద్యపాదానికి వుదాహరణంగా వుంటాను. అతడు నావలెకాక యెప్పుడో పనిపడ్డప్పుడు రచన చేసినా చాలాకాలం స్నేహితులతో యితర కాలక్షేపంతో వెళ్లించేవాఁడు. అందుచేతనే నాకంటే అతని ఆరోగ్యం బాగా వుండేది. నా ఆరోగ్యం యెప్పుడూ అంతంతగానే వుండేది. ఆరోగ్యంలో వున్నప్పటికంటే కూడా అనారోగ్యంలో వున్నప్పడే నాకు విశేషించి రచన సాగడం అనుభూతం.

మేమిద్దఱమూ పట్టుదలకలవాళ్లమే కాని, నాకు ఎవరేనా ఎక్కడేనా శబ్దతప్పో, అర్థతప్పో పడితే దానికి సమాధానం వ్రాసేదాఁకా అన్నమూ పానమూ, నిద్రా గిద్రా యేమీ తోcచదు. యీ బాధ అతనికి లేదు. యిప్పటికికూడా నా కీ పీడ వదలే లేదు, శేష జీవితంలో కూడా వదులుతుందని తోఁచదు. అట్లని 'పిడివాదా'నికి సిద్ధపడను. వొప్పు \ తప్పంటేనే పరాక్రమిస్తాను గాని తప్పు తప్పంటే వొప్పుకుంటాను. తప్పుకూడా మార్గాంతరంగా సాధిస్తానుగాని, దానితత్వం యీలాటిది అని వెంటనే కాకపోయినా నిజం మఱి కొన్నాళ్లకేనా చెప్పేస్తాను. "నా౽మూలం లిఖ్యతే కించిత్” అని వ్రాసిన పెద్దిభొట్లుగారి వాక్యం నాకు యెక్కువగా ప్రాణపదం. ఆ "మూలం" కోసం యెంత వెదకాలో అంతా వెదకడం నాకు అలవాటు. యిప్పటివారిలో నాలాగ పరిశ్రమ చేసేవారు మిక్కిలి తక్కువగానే వుంటారో, అసలే వుండరో? ఆ విషయం నిర్ణయించుకొనే భారం లోకానిది గాని నాది కాదు. నేను వ్రాసుకోవడం మాత్రం - -

“శ్లో. పాపం భవేదపిచ పుణ్య మహం యథార్థం
     వచ్మీశ! మత్సమవయస్కజనేషు కో౽-పి,
     నా౽ తిక్రమే న్మమ పరిశ్రమ మాత్తవిద్యః
     కావ్యజ్ఞతావిషయ ఇత్యభితో౽ స్తి గర్వః"

యీలా వ్రాయడం, కాదు వ్రాసుకోవడం తప్పయినా వ్రాశాను. యీమాట సాక్షాత్తు సర్వజ్ఞుఁడైన పరమేశ్వరుఁడితో చెప్పేమాటగాని మనుష్యమాత్రులతో చెప్పేదికాదు. నిన్న మొన్నవ్రాసిన "క్షమాపణ" గ్రంథంలోది. యిట్టి ధైర్యస్థైర్యాలు విద్యావిషయంలోనేనా నాకు యెంత వఱకూ వుంటాయంటే ఆవలివారు "లీగల్" చర్యలోకి దింషేవఱకే. ఆలా దింపడానికి వుపక్రమించిన వుత్తరక్షణమందే ఆవలివారు యేవిధంగా క్షమాపణ చెప్పమంటే ఆ విధంగా క్షమాపణచెప్పి విరమించడమే నాకృత్యం. ఆలా చెప్పడం గురుత్వం వున్న విషయంలోనే కాదు యితరవిషయంలోకూడా అంతే. యిది బొత్తిగా వోపికలేని హేతువు చేతనే అనుకో నక్కఱలేదు. వోపికవున్న రోజుల్లోనేనా ఆ విషయం విద్యావిషయానికి అర్హమయిందని నాకు విశ్వాసం లేదు. యిది విషయాంతరం.

చాలా సోదె వ్రాయడంవల్ల ముఖ్యాంశం తేల్చుకోవడం కష్టమవుతుందేమో అని సంశయంగా వుంది. అందుచేత ముఖ్యమైన అంశాన్ని యిక్కడ మళ్లా వ్రాస్తాను. తిరుపతిశాస్త్రిన్నీ నేనున్నూ సమాన బుద్ధిమంతులం. వ్యాకరణంలో సమానంగా చదువుకున్నాము. సంస్కృత సాహిత్యం అతనిది యావత్తూ గురుశుశ్రూషా సంపాదితం. నాది కొంత శుశ్రూషాసంపాదితమున్నూ, కొంత స్వయంకృషి సంపాదితమున్నూ, స్వయంకృషిసంపాదితంలో నాకు తిరుపతిశాస్త్రి మొదలైన తోడివిద్యార్థుల గొండ్లాటలు గురువులు, నేనతనికి కవిత్వరహస్యాదులకు నామ మాత్రగురువును. నాకుసర్వదా కవిత్వమే వ్యాపారము. అతనికి దీనిలో నా అంతటి వ్యసనంలేదు. ఆలాగే అతనికూడా వ్యసనం వుంటే మాగ్రంథాలు యింకా చాలా సంపుటాలు పెరిఁగేవి. ఆయీ ముఖ్యాంశాలు చదువరుల కొఱకున్నూ, భావివిమర్శకుల కొఱకున్నూ వ్రాయడం తప్పదని వ్రాశాను. ఆ యీ సందర్భాలు మా గ్రంథాలు పరిశీలకతాదృష్టితో చదివిన వారికి విధిగా గోచరించేవే అయినా నేను వ్రాయడం పునరుక్తిప్రాయం.

లోకం యేమనుకుంటేయేం గాని, అతనిశక్తి నాకూ, నాశక్తి అతనికి యెంతా నచ్చకపోతే మామైత్రి అంత నిరంతరాయంగా సాఁగదుగదా. నేనా, గర్విష్ఠుణ్ణి. అతఁడా, ఆ విషయంలో నావృద్దప్రపితామహుఁడు. యిట్టి మాకు విద్యావిషయంలో కలవడ మంటే, అన్యోన్నాన్ని బంధించే ప్రబలకారణాలు యెన్నేనా వుండితీరాలి. అతని పద్యాలవల్ల నన్ను అతను ప్రేమించడానికి, తగ్గహేతువులు యిదివఱకే చదువర్లు గుఱితించి వుంటారు. నావాట్లవల్లా అతణ్ణి నేను ప్రేమించడానికి తగ్గగుణాలు - అతనికి సంబంధించినవి - గుఱితించే వుంటారు. అయినా దిఙ్మాత్రం రెండింటికీ ఆధారాలు యింకా చూపుతాను.

“ఒరులు నచ్చని నాదుగరువంబు సడలింపఁ జాలె నెవ్వని మనీషాబలంబు” యీసీసచరణం యెంత అంతరంగశుద్ధితో వ్రాసిందో చదువరులు గమనించవలసి వుంటుంది. అతని బుద్ధి చాకచక్యము యెంతటిదీ కాకపోతే అతని మరణానికి సంబంధించిన సానుభూతిసభలో నైనాసరే నేను ఇంతగా పొగడడం తటస్థించదు. గురువుగారు అతణ్ని మెచ్చుకొనేవారని మొట్టమొదట యెత్తుకొన్న “గురుఁడు బ్రహ్మయశాస్త్రి కొనియాడు నెవనిఁ గర్నాట సీతారాముసాటిఁ జేసి” అనే సీసచరణానికి యెందఱికో సంప్రదాయార్ధం తెలియదు. యీ కర్నాట సీతారామశాస్త్రులుగారు యీ లోకానికే కాక మూఁడులోకాలకీ సరిపడ్డ మహా తార్కికులు. యిట్టివారితో తిరుపతిశాస్త్రికి గురువుగారు పోలిక చెప్పడ మంటే సామాన్యంకాదు. ఆ సీతారామశాస్త్రులుగారి వాదమంటే అందఱూ 'యిది బంగారం' అంటే 'కాదు, మన్ను' అనిన్నీ, మట్టి అంటే 'కాదు బంగారమే' అనిన్నీ సమర్థించేది. అట్టివాదం ప్రమాణప్రమితమా, కాదా అనే ప్రశ్న వేఱు. యిక్కడ పాండిత్య ప్రతిభనే విమర్శకులు గమనించాలి. “కర్తుమకర్తు మన్యధాకర్తుం సమర్థు” లంటే అట్టివారికే చెల్లుతుంది. “మయి జల్పతి కల్పనారినాథే రఘునాథే మనుతాం తదన్యథైవ” అనేది తర్కశాస్త్రజ్ఞుల ప్రతిజ్ఞావాక్యమే. కాశీ కాశీఅంతా యేకీభవించినా సీతారామశాస్త్రులుగారి వాదాన్ని భంగించలేక పోయినారని మా గురువులు సెలవిచ్చేవారు. నేనైతే కాశీ వెళ్లినప్పుడు సదరు శాస్త్రులుగారిని సందర్శించానేకాని, వారి సామర్థ్యం తెలుసుకోతగ్గంత వ్యక్తి విశేషం అప్పటికే కాదు యిప్పటికీ నాకు లేకపోవడం చేత ఆ యా విశేషాలు తపిసీలుగా వ్రాయఁజాలను.

అట్టి మహావ్యక్తితో తిరుపతిశాస్త్రిని గురువుగారు పోల్చి మాట్లాడడంకన్న జన్మకు యింకొక అదృష్టం వుంటుందా? అంతటివాఁడు కనకనే నేను అతణ్ణి ఆమోదించానని వేఱే వ్రాయనక్కఱలేదు. తి. శా. వాదం ప్రమాణ ప్రమితమా, కాదా అనేశంక యిక్కడ చేయకూడదు. వొక అప్సరస్త్రీని, లేదా భూలోకస్త్రీనే అనుకుందాం -

క. “ఈలలన వేలుపున్ జవ
     రాలో? యచ్చరయెు? కిన్నరవధూమణియో
     వ్యాళాంగనయో? కా కీ
     భూలోకస్త్రీల కిట్టిపొంకము కలదే?”

అని వకకవి వర్ణించాండు. యిక్కడ అందాన్నే చూచుకోవాలి గాని, ఆపెహృదయం యథార్థంగా వుంటుందా, వుండదా అని విచారించడం, దుర్యోధనుఁడి కిరీటంమీఁద వుండే రత్నాలు డుల్లిపోయేటట్టు అర్జునుఁడు బాణాలతో కొట్టాడంటే అప్పుడు ఆరత్నాలు యెవరు యేఱుకున్నారని అడిగే ప్రశ్నవంటిది.

అతని బుద్ది పాదరసంవంటిది. అది దేనిలో పడితే దానిలో పనిచేసేది అనేదే మనకు కావలసింది. నేనీమాట అభిమానంచేత వ్రాశానని అనుకోవడానికి అవకాశంలేదు. యీ మాట మాగురువుగారిది గాని నాది కాదుగదా! పైఁగా స్వశాఖీయుణ్ణి నేనుండఁగా అన్యశాఖీయుణ్ణి ఆలా పొగడడానికి అసూయపడవలసింది. అట్టిస్థితిలో వారి వాక్యాన్ని నేను అనువదించడంలో నాఅంతరంగాభిప్రాయం విస్పష్టమే కనక విస్తరించేదిలేదు. నాయందుకూడా అతనికి యెంతోగాఢమైన గౌరవం వుండేది. దాని ఫలితాన్ని పొందే అదృష్టం నాకు పట్టలే దనికూడా నేను ఆ సానుభూతిసభలోనే ఒక పద్యంలో సూచించాను.

మ. "మృతులంగూరిచి యేడ్చుపద్యములు నేనేనాఁడుఁ జెప్పన్ మహా
      మతి! యో తిర్పతిసత్కవీ! త్రిజగతీ మాన్యాత్మ విక్టోరియా
      సతి మున్నౌమృతు లెల్ల నీకతననే స్వర్గం బధిష్టించి రే
      నతిపాపాత్ముఁడ నాకు నీకతన లేవాలాటిసౌభాగ్యముల్."

నన్నుఁగూర్చి అతఁడే సానుభూతిసభలో విచారాన్ని వెలిపుచ్చ వలసివస్తే యేవిధంగా వెలిపుచ్చేవాఁడో . యిప్ప డేలా తెలుస్తుంది? ఆభాగ్యం నాకు పట్టింది కాదని నేను విచారించడం అయుక్తం కాదుకదా! అయితే ఆ విషయం మాత్రం కొంత సూచించడం మాత్రం జరిగింది. అట్టిదాన్ని ఒకదాన్ని వుదాహరిస్తాను.

ఉ. “చుక్కలు రాలలేదు రవిసోముల పోకడ మాఱలేదు న
    ల్దిక్కులు కూలలేదు జలధిజ్వలనం బుబుకంగలేదు నేఁ
    డక్కట రామకృష్ణకవు లర్భకు లేగతిఁ జేయనేర్తు రా
    ధిక్కృతవైరి వేంకటసుధీకవిమౌళికి శృంగభంగమున్?”

యిత్యాది పద్యములవల్ల అతఁడే నన్నుఁ గూర్చి ప్రసంగించవలసివస్తే యేలా ప్రసంగించేవాఁడో విస్పష్ట మవుతూవుంది. అయితే దైవం అన్యథాకరించాఁడు.

మామాసంబంధం యెట్టిదో నేను వివరించలేదు. కాని యిప్పటికీ కూడా మే మిద్దఱమూ కలిసి సభలు చేస్తూనే వుంటాము. అతఁడు గతించి 16 యేండ్లు కాఁబోలును అయింది. అయినా మా సాహచర్యం తప్పనేలేదు. జీవితకాలంలో నేనంటే అతనికి ఆంతరంగికంగా కొంత భయమూ, భక్తీ కూడా వుండేవి. పైకేమో “త్వంశుంఠా త్వంశుంఠా" గానే మాట్లాడేవాఁడు. యిప్పటి స్వప్నావధానాలల్లో కూడా అచ్చంగా ఆలాగే ప్రసంగం జరుగుతుంది. యీవ్యాసం వ్రాయడాని కారంభించాక అప్పుడే ఒక సభ జరిగింది. అతనికి యిప్పటికీ నామీఁద ప్రేమవున్నదన్నందుకు యిప్పటికి సుమారు పదియేళ్లనాఁడు జరిగిన ఒకగాథ వుదాహరిస్తాను.

అతనికి పురుషసంతానమే కాని స్త్రీ సంతానం లేదు. "ఒరేయ్! నేను కట్నం కానుకా పెట్టలేనని కాఁబోలును నాకు భగవంతుడు స్త్రీ సంతానాన్ని యిచ్చాఁడు కాఁ"డని చమత్కారంగా నాతో అనేవాఁడు. పయిఁగా “జన్మించి అంతరించినవాళ్లు కూడా కొందఱు మగవాళ్లేరా" అనేవాఁడు. అప్పటికింకా నాకును స్త్రీ సంతతి లేదుకాని, "లేకపోతే వకపిల్లనిపుచ్చుకోరా" అని అనేవాణ్ణి. మాకు శాఖాభేదంవున్నా శాస్త్ర విరుద్ధం గాని యితరశాఖాబాంధవ్యం అంగీకారమే. యేకులంతో పడితే ఆకులంతో చుట్టఱికం చేయడానికి తగ్గంత జ్ఞానం అతనికిఁగాని, నాకుఁగాని కలగలేదు. బ్రాహ్మలలో బ్రాహ్మల కేంచిక్కు? అందుచేతే నాకు సంతానంలేని రోజుల్లో నేను పెంచుకోవలసివస్తే అతని పిల్లవాణ్ణి పుచ్చుకుని మాశాఖపిల్లని పెళ్లి చేయాలనుకొనేవాణ్ణి. దీనికి మా తిరుపతిశాస్త్రి శిష్యుఁడున్నూ మా గురువుగారి స్యాలకుఁడున్నూ నా భార్యా మేనమామ కూఁతురిభర్తయున్నూ అయిన రాఘవభట్ల విశ్వనాథశాస్త్రి తనకు కూఁతురు కలిగితే సరేసరి, ఆలా కలక్కపోతే పెంచుకొనేనాసరే పిల్లనిస్తాననే వాఁడు. తుదకి యివేవీ జరగలేదు కాని మా మా అనుబంధం యేలాటిదో అంతా యెఱిఁగిందే అయినా యెఱఁగనివాళ్లు తెలుసుకోవడానికి వ్రాసూవున్నాను.

సరే, తి. శాస్త్రిగారికి స్త్రీ సంతతి లేదన్నది ప్రస్తుతం. ఆకారణం చేత అన్న సుందరరామశాస్త్రి కూఁతుళ్లలో మూఁడోదాన్ని తాను కన్యాదానం చేసుకుంటానని అనడమున్నూ అందుకు అన్న వగయిరాలు ఆమోదించడమున్నూ జరిగింది. కాని ఆ పిల్లకు వివాహపు. యీడువచ్చేదాఁకా తి. శా. జీవించడం తటస్థించలేదు. ఆకోరిక తీరకుండానే అతఁడు స్వర్గతుఁడైనాఁడు కాని యింకో శిష్యునిబాపతు ఆఁడపిల్లని దగ్గఱదీసి పెళ్లి పేరంటాలుమాత్రం చేశాఁడు. చేసినా ఆత్మలో యీ కోరిక నిలిచే వుండడంచేత కాఁబోలును, యేపిల్లని తాను కన్యాదానం చేయాలని అనుకున్నాఁడో ఆపిల్ల పెళ్లిసమయానికి తిరుపతిశాస్త్రి ఆత్మవచ్చి ఆపిల్లని ఆవేశించింది. పిశాచమైనాఁ డనుకుందామా - అంతకు మునుపుకాని, యిటీవలఁగాని మళ్లాయెప్పుడూ యెవరికీ కనపడ్డట్టుగాని, పీడించినట్టుగాని లేదు. ఆ సమయానికి యింకా నేను ఆ పెళ్లిజరుగుతూవున్న “వుండి" అనే గ్రామానికి వెళ్లలేదు. నా భార్యా, పిల్లలూ మాత్రం వెళ్లివున్నారు. పూర్వకాలంలో యేవిధంగా మాట్లాడేవాఁడో ఆలాగే నాభార్యతోటి ఆ పెళ్లికూఁతురిద్వారాగానే మాట్లాడినట్టు తరవాత నాభార్యేనాకు చెప్పింది. వెం. శాస్త్రినికూడా చూచివెడతానని అన్నట్టున్నూ అతఁ"డీరాత్రికిఁ గాని రాఁడు, వచ్చేదాఁకా నీ ఆవేశం వుంటే శుభకార్యం అడ్డడమేకాక మనిషి నలిగిపోవడం తటస్థిస్తుం"దని అన్నగారు వగయిరాలు కోరినమీఁదట తావన్మాత్రంతో ఆ ఆవేశం తగ్గినట్టున్నూ చెప్పఁగావిన్నాను. కాని నేను వెళ్లి చూచేటప్పటికికూడా యింకా ఆ పెళ్లికూఁతురు తేఱుకున్నట్టు కనిపించలేదు. ఆవేశపుమాటలలోకూడా నాప్రసక్తి కొంత వచ్చినట్టు తి. శాస్త్రి అన్నగారు వగయిరాలవల్ల విన్నట్టయితే కొంచెం జ్ఞాపకం వుందిగాని ఆ మాటలు తబిసీలుగా జ్ఞాపకంలేక వ్రాయలేదు. బహుశః అప్పుడు తిరుపతిశాస్త్రి పెద్దకొడుకు వేంకటావధానికూడా దగ్గిఱవుండి చూచినట్టే విన్నట్టు జ్ఞాపకం. నే వెళ్లినతరవాత యేవేనా కొన్నిమాటలు మాట్లాడించి చూదామనిన్నీ తద్ద్వారాగా చిరకాలానికి మళ్లా ప్రాణస్నేహితుణ్ణి కలుసుకొని మాట్లాడినట్టు సంతుష్టి కలుగుతుందనిన్నీ ప్రయత్నించి చూచానుగాని, నేనంటే భయపడి మౌనం తాల్చినట్టు నాకే కాక అతని బంధువులందఱికిన్నీ తోఁచింది.

ఆత్మ నిత్యమనిన్నీ దేహం నశించినంతలో అది నశించేది కాదనిన్నీ మన విజ్ఞానులందఱూ చెవి నిల్లుగట్టుకొని పోరడానికి యీలాటి విషయాలెన్నో అనుభవించి వుండడమే కారణమనుకుంటాను. యీలాటి ప్రబలాధారాలెన్నో వున్నా నేఁటి సంస్కర్తలు పెడతోవలే పడతారు. మహాభారతయుద్ధంలో మృతులైన దుర్యోధనాదులనేమి, అభిమన్యాదులనేమి, వేదవ్యాసులు వారివారి సన్నిహితబంధుజాలానికి చూపినట్టు మహాభారతంలో స్పష్టంగా వుంది. ఆ భారతం పంచమవేద మని మనవిజ్ఞానులందఱున్నూ శిరసావహించినప్పటికీ యీకాలానికి అది పనికిమాలిన చెత్తకిందకూడా మాఱడంలేదు. వర్ణాశ్రమాచారాలకు సంబంధించిన ధర్మాలెన్నో అందులో "స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మోభయావహః" అన్న వాక్యానికి వ్యతిరేకించే సంస్కారాలకే యిప్పటి వారు సర్వత్రా ప్రాధాన్యం యివ్వడంవల్ల పై సంగతి విస్పష్టమవుతూ వుంది. ఆట్టే చెప్పేదేమిటి? మునుపు యేవేవి అకార్యాలో అవి యిప్పుడు చేస్తే యెంతో గొప్ప, యెంతో గౌరవం. ఓహో! మొదలెట్టిన విషయం మళ్లా విషయాంతరంలోకి దూఁకుతున్నట్టుందే! తి. శా. స్వర్గస్థుఁడైనా నాకున్నూ అతనికిన్నీ వున్నసంబంధం విడిపోలేదనేది ప్రస్తుతం. అధమం నెలకొక మాటేనా మేమిద్దఱమూ కలుసుకుంటూనే వుంటాము. ఆయీ స్వప్నగాథలు వ్రాయవలసివస్తే గ్రంథం చాలా పెరుంగుతుంది.

శరీరాలు పృథక్కుగా వుండడంచేత శారీరకధర్మాలు మాకువేఱు గావలసివచ్చింది గాని మానసికప్రవృత్తి కవితావిషయంలో మాయిద్దఱిదీ ఒకటిగానే వుండేది. కవితారచనకంటె అన్యవిషయాలలోనో? మనస్సులు కలవడమూవుంది. కలవకపోవడమూ వుంది. ఒకటి దీనికి వుదాహరిస్తాను. నేను చప్పట్లపర్వానికి పూర్వం కాకరపర్తి వెళ్లి వద్దాం రమ్మన్నాను. అక్కడ అల్లరి జరుగుతుంది, వద్దని అతఁడన్నాఁడు. ఆలా జరగడం ముందుగాథకు మనకు మఱీ మంచిది కనక వెళ్లితీరాలన్నాను నేను. అయితే నీకర్మం నీవొక్కఁడవే వెళ్లు, నేను రానన్నాఁడు. నేను చేసే ఆలోచన దూరాలోచనో, ఆతఁడు చేసేదే దూరాలోచనో చదువరులే పరిశీలించుకోండి. చదరంగంలో యెత్తులు మాదిరిగా యిల్లాటివిషయాలల్లో నా ఆలోచన ప్రసరిస్తుంది. అతనిది పేకాటవైఖరిగా నడుస్తుంది. “అడుసుతొక్కనేల? కాలు కడుగనేల?” అని అతనితాత్పర్యం. "తొక్కితే మలిఁగిపోయిం దేమిటి? పిమ్మట బాగా పాదప్రక్షాళన చేసుకుంటే, కొత్తదీ పాతదీకూడా మాలిన్యమంతా పోయి నిష్కళంక మవుతుం"దంటాను నేను. యింకోటికూడా వుదాహరిస్తాను. కొప్పరపువారికీ మాకూ, యేలాగయితేనేం కలహ మారంభ మయిం దనుకోండి. అందులోకి మనం స్వయంగానే వెళ్లాలి గాని మనశిష్యులను ప్రవేశించడానికి అంగీకరించకూడదని నావాదం. ఆలాకాదు, శిష్యులచేతనే వోడించే ప్రయత్నం మంచిదని అతనివాదం. నా వుద్దేశ మేమిటంటే సోదరకవులు చాలా కాలాన్నుంచి గంటకు వందలలెక్కని చెపుతూ వున్నారాయె. మన శిష్యులు కొత్తగా మొదలుపెట్టి ఆ భారాన్ని నిర్వహించంగలరో, లేదో మనకీపరాధీనవ్యాపార మెందుకని నాతాత్పర్యం. శిష్యులు వోడినా మనం వోడినట్టే అనిపించుకోవలసి వస్తుందికదా! అందుచేత ఆతోవ మంచిది కాదని నావాదం. యీలా నేను చెప్పినా వాఁడికి తోఁచినట్టే చేశాఁడు చివరికి. శివరామశాస్త్రి చేతా, చౌదరిగారి చేతా “ఛాలెంజి” పద్యాలు నాతో చెప్పకుండానే తాను బాసటగా వుండి నడిపించాఁడు.

యిప్పటివారి కొత్తపోకళ్లు కొన్ని అతనికి యిష్టం, నాకు యేం కర్మమో, వాట్లయందు యిష్టం వుండేదికాదు. దీనికి వకటి వుదాహరిస్తాను, ఎవరితోటో విద్యావివాదం తటస్థించిందనుకోండి; ఫలానా తేదీని యిన్ని గంటల యిన్ని నిమిషాలకు ఆ వివాద జరిగేసభకు రావాలని యేర్పఱచుకొన్నా మనుకోండి. మేము ముందుగానే వెళ్లి సభలో కూర్చున్నామనుకోండి. ప్రతివాదులు అనుకొన్నట యిముకు రానేలేదనుకోండి. ఆపట్లాన్ని ఆవలివారు వోడిపోయినట్టే. యిఁక మనం యిక్కడ వుండనక్కఱలేదు. పోయి యిలా పత్రికల్లో ప్రకటిద్దామనేవాఁడు. యీలాటి విద్యావిజయాలూ, కోర్టుద్వారాగా సంపాదించే విద్యావిజయాలూ, బాకీ తార్మానాలూ యివి యశఃకాములు అంగీకరించతగ్గవేనా? నోటుకు సహకాలదోషం పడితే ఘరానామనుష్యులు దాన్ని గణించక మళ్లీ తిరగరాసి యివ్వడమో, సొమ్మే యిచ్చి లేదనిపించుకోవడమో చేస్తారు. చేయరే అనుకోండి. అంతమాత్రంచేత ఋణంతీర్చినట్టు లోకం విశ్వసిస్తుందా? అని దానికి నేను సుతరాము వొప్పుకొనేవాణ్ణికాను.

అతఁడు నాకన్న చాలా విషయాలలో ఛాందసుఁడుగానే వుండేవాఁడు గాని, యీలాటి - విషయాలు కొన్నిటిలో లౌకిక మర్యాదలకు లోఁబడేవాఁడు. నాకు యీలాటి విషయాలకేమి, - వేషభాషలకేమీ ఛాందసుల ఆచారాలే యిష్టం. వాఁడికి యింగ్లీషు చదువంటే కొంత యిష్టం. అందుచేతే చిరంజీవులకందఱికీ దాన్నే చెప్పించాఁడు. నాకో, మనపూర్వపు చదువే చాలా యిష్టం. అందుచేతే - “పై జననమ్మందును నా కొసంగు మెటులో సంగీతసాహిత్యముల్" అని సంతానం కలక్క పూర్వం చెప్పిన కామేశ్వరిలోనున్నూ కలిగిన తర్వాత చెప్పిన ఆరోగ్య కామేశ్వరిలో,

మ. “కలిగెన్ లేదనుకొన్న సంతతియు భాగ్యం బబ్బె నానందని
      స్తులమయ్యెన్ జని షష్టిపూర్తియును నాకున్ దాపు గావచ్చెనో
      లలితాంబాఁ యిఁక నొక్కకోర్కె అది వాలాయంబు మద్విద్యల
      ర్మిలి మత్పత్రులయందమర్చుటయె సుమ్మీ తల్లి కామేశ్వరీ!"

అనిన్నీ వ్రాసివుండడమే కాకుండా, మా రెండో చిరంజీవి యేమాత్రమో కవిత్వం చెప్పడమే కాకుండా హైదరాబాదులో అవధానం చేసినట్టు యేకలవ్యశిష్యులు వ్రాయడానికి వుబ్బి తబ్బిబ్బై షష్టిపూర్తికి దరిమిలాను "ఇటీవలిచర్య అని వ్రాసుకుంటూవున్న నా జీవితచరిత్రలో ఒకపద్యం నా అభిప్రాయాన్ని తెలిపేదాన్ని

క. “నాకొమరుం డే మాత్ర
    మ్మో కవియై నా కొసంగు మోదమ్మను శ్రీ
    "హైకోర్టు ఛీపుజడ్జీ"
     యైకూడ నొసంగనేరఁ డనుకొందు మదిన్."

అనే మాటలతో వ్రాసివున్నాను. యిప్పుడు యెన్ని పరీక్షలు ప్యాసైనా వుద్యోగభాగ్యం - లేకపోవడ మనేది యెందఱో బ్రాహ్మలకు విచారకరమైనా నాకు సంతోషకరమే అయింది. ఆలాగే కాకపోతే నాబంధువు లందఱూ నన్ను "కొడుకులకు యింగ్లీషు చెప్పించాఁడు కాఁడు యీచేదస్తుఁడు" అంటూ గాఢంగా దూషించడానికి అవకాశం యిచ్చేది. నేను జవాబు చెప్పలేక చిక్కుపడవలసి వచ్చేది. యిప్పుడు “అవ్వా గుఱ్ఱమూ ఒకటే" కావడంచేత నాకు ఆ చిక్కు తప్పిందని సంతోషిస్తూ వుంటాను.

నే నయితే కర్మిష్ఠినిగాను గాని వేదోక్తకర్మకలాపాన్ని ఆచరించేవారిని చూస్తే నాకు చాలా ఆనందం. అంతేకాదు- "స్వధర్మే నిధనం శ్రేయః" అనే భగవద్గీతావాక్యమందు నాకు యెక్కువ విశ్వాసం. దీనికి వ్యతిరేకించి చేసే సంస్కారాలు నాకు గిట్టవు. అందుచేత ప్రసక్తాను ప్రసక్తంగా నా అభిప్రాయాలు ప్రస్తుతలోకం పాటించదని పూర్తిగా యెఱిఁగుండీ కూడా వ్రాస్తూవుంటాను. ఆ వ్రాతవల్ల జరిగేపని గడ్డిపఱకంతకూడా లేకపోయినా యెందఱో ఖండనమండనాలకి వుపక్రమిస్తూ వుంటారు. కొందఱు గాఢంగా దూషిస్తారు కూడాను. ఆలా దూషించి అంతతోకూడా తృప్తికలగక కొందఱు యింకా యేదో “వక్రః పంథాః”లోకి దిగి వంచించాలని ప్రయత్నిస్తారు. నేను వ్రాసిన వాక్యాలను యింట్లో కూర్చుని సమర్థించ మంటే సమర్ధిస్తాను కాని పడకకుర్చీ వదిలి యెక్కడికీ వచ్చి వక్రమార్గాలకు తగ్గ వక్రమార్గాలు తొక్కి సమర్ధించే వోపిక నాకు అంతరించి అప్పుడే నాలుగైదేళ్లు కావచ్చింది. వోపిక వున్నప్పటికీ ధర్మాధర్మ నిర్ణయానికి గాని, యుక్తాయుక్తనిర్ణయానికికాని ఆలాటి “వక్రః పంథా" ప్రకరణాలు కార్యకారులు కావని నానిశ్చితాభిప్రాయమని లోకానికి తెల్పుతూ ప్రకృతం వుపక్రమిస్తూవున్నాను.

మావాఁడికి పట్నవాసంలో వుండడం యిష్టం. నాకు పల్లెటూరి నివాసం యిష్టం. అతఁడు స్వగృహం లేకుండాకూడా కాకినాడలోనే యిటీవల శ్రీ పోలవరపు జమీందారుగారి నిర్యాణానంతరంకూడా నివసించడం పైకారణంచేతే అని చెప్పనక్కఱలేదు. పయిగా నన్ననేవాడు కదా "నేను నెల 1 కి రు. 10లో, లేక 8 రూపాయిలో అద్దెతో కాకినాడలో తక్కువ వ్యయంతో కాలక్షేపం చేస్తున్నాను. వేయిరూపాయిల మీఁద వచ్చే వడ్డీకన్న నా అద్దెకు అవసరం లేదు. నీవేమో సుమారు అయిదాఱువేలు ఖర్చుపెట్టి గోడిరాళ్లదిబ్బ కడియంలో యిల్లంటూ కట్టావు. నీకన్న మూర్జుఁడంటూ నాకు కనపడ" డనేవాఁడు. అయితే అతనివూహ యింటికి పెట్టిన అయిదాఱువేలూ వడ్డీకి వేసుకుంటే లాభకారిగా వుండే దనేకాని మఱోటి కాదు. నిజంగా ఆలాగే చేసుకొని వుండే టట్టయితే యిప్పటి కొత్తరూల్సుప్రకారం “ఉభయతో భ్రష్టత్వం” సంభవించేది. కాని అప్పటికి యీలాటి మహోపద్రవం వస్తుందని అతఁడు తెలుసుకోవడానికి అవకాశం లేదు కనక నాకంటే అతని ఆలోచన సర్వథా ప్రశంసనీయమే అని వొప్పుకోక తప్పదు. యేవిద్యార్థేనా చదువుకోవడానికి వస్తే తెలివికలవాఁడా, కాఁడా అనే వివేచనతో పనిలేకుండా చెప్పడానికి మొదలుపెట్టడమే నాప్రకృతి-ఆతనిదో? దీనికి అంగీకరించేది కాదు. అందఱూ తనంతటి బుద్ధిమంతులుగానే వుంటే తనదగ్గిఱికి శుశ్రూష కెందుకు వస్తారని అతనికి తట్టేదే కాదనుకుంటాను. సరే! తనకి నచ్చిన విద్యార్డు లెక్కడ తటస్థిస్తారు? అందుచేత యెవఁడికోకాని తాను చెప్పడమంటూ వుండేదే కాదు. పయిగా నాదగ్గిఱ చదువుకొనేవాళ్లనూ, నన్నూ వెక్కిరించడం కూడా వుండేది. వెక్కిరించడం అంటే వట్టిమాటలతో మాత్రమేకాదు. పద్యాలతోటే!

మ. “గురువై శిష్యులఁ జేర దీయునెడఁ దక్కుంజెయ్వు లెట్లున్నఁద
      త్పరబుద్ధిం దిలకింపఁగా వలయుఁ "జెప్పందగ్గవాఁడౌనొ? కా
      దొ? రహస్యంబులు, తెల్వియున్ గలదొ? లేదో?" యంచునావేంకటే
      శ్వరశార్దూల మమాయికం బెఱుఁగ దీచర్చాప్రకారమ్ములన్."

యీ మత్తేభం వుపన్యసించే వుపన్యాసంలో వున్న శార్దూలం నేనే అని వేఱే చెప్పనక్కఱలేదుకదా! తిరుపతి వెంకటేశ్వరుఁడితో అభేదాధ్యవసాయం చేస్తూ దాని వెనకాల వుటంకించిన వేంకటేశ్వరపదమే వ్యాఖ్యానం చేస్తూవుంది. పయిఁగా నన్ను వాఁడు “అమాయికుఁ"డని కూడా అనుకొనేవాఁడన్నదికూడా దీనివల్ల తేలుతూవుంది. బందరు హైస్కూలు హెడ్మాస్టరుగారు కూడా నన్ను వెఱ్ఱివాళ్లల్లోనే జమకట్టే వారు. యీ అమాయికత్వమూ, వెఱ్ఱివాలకంగావుండడమూ “స్వరాజ్యం నాజన్మహ"క్కని శ్రీయుతులు తిలకుగారు చెప్పినట్టు మాకు వంశపరంపరాహక్కుగా మా బంధువులు చెప్పుకుంటారు. కనక నేను దీన్నిగూర్చి మావాఁడితో యేమాత్రమూ చర్చపడలేదు. కాని నా అమాయకత్వం మాయ తెలియని అమాయికత్వం కాదనిన్నీ అది తెలిసికూడా పరలోక భీతిచేత దాన్ని యెన్నఁడున్నూ వినియోగించేవాణ్ణి కాననిన్నీ జిజ్ఞాసువులు తెలుసుకోఁగోరుతాను. యీ అన్యాపదేశసందర్భంలోనే నన్నుఁ గూర్చి యింకోపద్యంకూడా వ్రాశాఁడు.

మ. "ఒడ లెల్లం బలుచార లుండుటయు వాలోపాంతమం దూని ముంద
       దడుగుల్ మోవఁగఁ గూరుచుంటయును మున్నౌచిహ్నముల్ కంటగ
       న్పడురంగున్ దిలకించి మీసములచందమ్మున్ విలోకించి వీ
       ఱిఁడిపిల్లిన్ దనశాఖలోని దనుచున్ బ్రేమించె శార్దూలమున్."

యీ రెండు పద్యాలు నన్ను "యద్దేవా" చేసేవే అయినా యెంత ప్రౌఢంగా వున్నాయో, యెన్ని విడివిడిపదాలతో కూర్చఁబడివున్నాయో, యెంత గమకంగా వున్నాయో చదువరులు తెలుసుకొందురు గాక. యీ పద్యచమత్కృతి తెలపడానికే ప్రసక్తిలేని ప్రసక్తి కల్పించి యీ ఘట్టంలో వుదాహరించాను. అతఁడని అతఁడేకాదు వేఱొకరేనా యీలాటి పద్యాలతో నన్ను తిట్టినా నేను సంతోషిస్తాను. ఇది నా ప్రకృతి. యీ పద్యం నేను బందరు భైరవప్రస్సుకు వుత్తరాన్నివున్న చవిటి అరుగు మీఁద బొత్తినకాళ్లు వూఁతగా కూర్చుని యేదో తదేకదీక్షతో ప్రూఫులు దిద్దుకొనేదృశ్యాన్ని చిత్రిస్తూవుంది కాని “వంటియందు చారలుండడం" యెందుకు చెప్పాఁడో యిప్పుడు గోచరించిందికాదు. వెనకేనా వాణ్ణి నేను అడిగి తెలుసుకున్నట్టున్నూ లేదు. లేక తెలుసుకునే మఱచిపోయానో? 'జీవితః కవేః ప్రష్టవ్యమ్‌' కదా! బహుశః అతనివుద్దేశంలో యీ 'చారలు' విభూతిరేఖలై వుంటా యనుకుంటాను. 'యద్దేవా' కవిత్వం చెప్పడానికేమి, వీరరసకవిత్వానికేమి, తగాయిదాలు తెచ్చే కవిత్వం చెప్పడానికేమి అతఁడు మంచి మొనcగాడు.

శ్రీ ఆత్మకూరి రాజావారి మేనల్లుఁడుగారు "తిరిపపు. ... తమిదీరద యేచెలి నాశ్రయింతునో?" అని ఒక సమస్యను యొక్కడినుంచో సంపాదించినదాన్ని ప్రతిరోజూ మాకు వినిపించి "సామీ! నాకు దీన్నిపూర్తి చేసిపెట్టాలని కోరుతూ వుండేవారు. యేరోజుకు ఆరోజు నేను "తిరుపతి శాస్త్రిగారికి యీలాటి పూర్తివిషయంలో మంచి ప్రజ్ఞకనుక ఆయన్ని తమరు కోరండి" అని తప్పించుకొనేవాణ్ణి, ఆలా సుమారు నెలపైదాఁకా జరిగింది కాలం. మా ప్రయాణం రోజులు సమీపించాయి. అట్టి సదర్భంలో ఆయన ఒకరోజున “యీవేళ పూర్తిచేస్తేకాని మిమ్మల్ని కదలనిచ్చేది లే"దని గట్టిగా పట్టుపట్టి కూర్చున్నారు. అనుచితమైనదే అయినా పూరించడం తప్పిందికాదు. తి. శా. గారినే వప్పఁజెప్పాను. క్షణంలో పూరించి వ్రాసి యిచ్చాఁడు. యిచ్చిన సమస్యకు తగినభాషనే వుపయోగించాఁడు. రేఫప్రాస కనక “తిరుమణిఁ దాల్చు" అని ప్రారంభించాఁడు. శృంగారరసంలోనే దక్షిణనాయకశృంగారం వర్ణించాఁడు. బాగానేవుంది, యెవరినీ దూషించే వుద్దేశం లేకపోయినా మాకు అక్కడ విరోధులుగా వుండే వైష్ణవులను గూర్చి అది చెప్పినట్టు వారిలో కొందఱు అభిప్రాయపడ్డారు. అది పూర్తిగా సత్యదూరమే అయినా “రంధికిమూలమే ఱంకులకోడలా!" అన్నట్టు అందులో మొట్టమొదటనే వారి ప్రధాన చిహ్నం ‘తిరుమణి" పడింది. యింకా కుంకుమ, విభూతి వగయిరాలు ఆ పద్యంలో వున్నా అవి ప్రథమంలో లేవు. దానితో ఆవూరివారేమీ కలిగించుకోలేదు గాని, గద్వాలలో మాకు ప్రతిపక్షులుగా వుండే వైష్ణవ పండితులు కలిగించుకొని మా యిద్దఱినీ నీచాతినీచోక్తులతో నిందిస్తూ ఒక చంపకమాల రచించి వారిశిష్యుఁడు భట్రాజు చేతికిచ్చి పంపించారు. అ భట్రూజు విద్యార్థి దూరంగానే నిల్చుండి "మా గురువులు దీన్ని మీ కిమ్మన్నారు" అనిచెప్పి మామీఁదికి విసిరేసి పాటిపోయాఁడు. ఆ పద్యం చూచుకొని మేము నవ్వుకొని వూరుకున్నాము. మా ప్రయత్నం లేకుండానే యీ సంగతి యేలాగో సంస్థానం వారికి తెలిసింది. అప్పుడు అమ్మగారు రాజ్యంచేస్తూవున్నారు. జడ్జీ ఒక మహమ్మదీయ పండితకవి. ఆయనకు తెలుఁగురాదు. అమ్మగారి సెలవు ప్రకారం మా యిద్దఱి పద్యాలూ మామావల్లనే అర్థం విని యోగ్యతా యోగ్యతలు విమర్శించారు. మా పద్యమేమో జనరల్‌గా వుంది. వారిదేమో కేవలమూ "తిరుపతి వేంకటేశ్వరుల” అని మా యిద్దఱిపేర్లతోనూ వుండడంచేత అందులో వున్న గ్రామ్యపుతిట్లన్నీ మాకే సంబంధిస్తూ వున్నాయి. దానికి ఆ పండితులు “యిది వీరికి సంబంధించిన దూషణకాదు; తిరుపతి వేంకటేశ్వరస్వామికి సబంధించిం” దంటూ అనాలోచనగా అర్థం చెప్ప మొదలేశారు. ప్రక్కనే తెరచాటున వున్న మహారాణీగారు విని "అయ్యా చాలించండి, మీరూ మీరూ మనుష్యులు తిట్టుకున్నా తిమ్ముకున్నా అంత చిక్కులేదు. దీనిలో దేవుణ్ణికూడా యెందుకు తిడతా"రని మందలించారు. మా పద్యంలో వక్క మాట మాత్రం గ్రామ్యదోషం తగిలేది వుంది. అదే లేకపోతే ఆ పద్యంలో లేశమూ అయుక్తం లేనేలేదు. ఆ మాట తెలఁగవడంచేత నధికారికి అయుక్తమనే సంగతి గోచరించిందికాదు. పైఁగా మేము వ్యాఖ్యానం చేయడంలో వేదాంతపరంగా ఆపద్యం మొత్తాన్ని వ్యాఖ్యానించి, ఆయన కూడా కవే కనక ఆయన్ని సంతోషపెట్టడం జరిగింది. ఆ పద్యంలో మూడక్షరాలు మాత్రం అనర్హంగా వున్నాయి గాని తక్కినదంతా మంచి పాకంలోనే వుంది. జనరల్‌గావున్న పద్యంలో కొన్ని అక్షరాలను మాత్రం పుచ్చుకొని తమమీఁద పెట్టుకొని మమ్మల్ని పేరెట్టి ఆడరాని మాటలు ఆడడం తప్పని అధికారికిన్నీ అమ్మగారికిన్నీ పూర్తిగా బోధపడింది. అయినా ఆ సంస్థానాల్లో, యిప్పుడేమో చెప్పలేను గాని, అప్పటికింకా బ్రాహ్మలని శిక్షించతగ్గపని చేసినా శిక్షించడం లేదు. కనక వారికి యేమీ శిక్ష వేయలేదు. శ్రీ ఆత్మకూరిరాజావారి ముద్రను సృష్టించిన వక గ్రామకారణాన్ని ఖైదైతేచేశారుగాని ఏపూట కాపూట స్నానసంధ్యాద్యనుష్టానాలకిన్నీ భోజనానికిన్నీ బ్రాహ్మణ గృహానికి తీసుకువెడుతూ వుండేవారు. పండితులందఱు సంస్థానానికి వార్షికాలకు వచ్చే వుత్సవ దినాల్లో ఆ కరణాన్ని మొదటిదర్వాజాలో సంకెళ్లసహితంగా కూర్చోపెట్టేవారు. ఒకనాఁడు రాజుగారున్నూ, మేమున్నూ కలిసి వచ్చే సమయంలో ఆబ్రాహ్మణ్ణి గూర్చి రాజుగారు మేము అడగకుండానే "స్వామీ! యేంచేసేది? బ్రాహ్మడు. మళ్లా మంచినిష్టాపరుఁడు. పెద్దహానికి తగ్గ పనిచేశాఁడు అందుచేత ఖయిదుచేయడం తప్పిందికాదు. కులాచారానికి మాత్రం భంగం కలిగించకుండానే జరుపుతూ వున్నాం" అంటూ సెలవిచ్చారు.

మన్వాది ధర్మశాస్త్రాలను ఆరీతిగా శూద్రప్రభువులుకూడా చెక్కుచెదరకుండా కాపాడుకొనివస్తే కలియుగంలోకూడా కొందఱు కాకపోతే కొందఱేనా ఆ ఆచారాలు యే కొంచెమో ఆచరించడం తటస్థించింది. క్రమంగా "కంచే చేనుమేయడం" దగ్గఱికి వచ్చింది. కనక యిఁక ఆ ఆశ పూర్తిగా వదులుకోవలసిందే. యిట్టి సమయంలో సనాతనులు సభలు సాగించడం వగయిరాలు వృథాపరిశ్రమగా నాకు తోస్తుంది. అస్పృశ్యులు దేవాలయంలోకి వస్తే అభ్యంతరంపెట్టడంకూడా పొరపాటు. వొక్క ఆ యా ఆలయాలవల్ల జీవనం వున్న అర్చకులు తప్ప తక్కిన పూర్వాచారపు చేదస్తంగల చాతుర్వర్ణ్యంవారంతా తమకు యిష్టం లేకపోతే ఆ ఆలయాలలోకి వెళ్లడం మానుకొని హరిజనుల వశంచేస్తే యెంతో బాగుంటుందని నాకు తోస్తుంది. అయితే అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నించే మహామహోపాధ్యాయుల పాదరేణువుకుకూడా నిజానికి సరిపోని నాకు తోఁచేమాత్రంవూహ వారికి తోఁచదనుకోడం కూడా పొరపాటులో మఱో పొరపాటు కాకపోదు. అయినా యింతకన్న కర్తవ్యం యీకాలానికి లేదని నాకు తోఁచి వెళ్లఁగక్కాను. అర్చకులు హరిజనులపాఠశాలల్లో వుండే బ్రాహ్మణ టీచర్లతో పాటున్నూ, అక్కడికి వెళ్లి పరీక్షించే యినస్పెక్టర్లతో పాటున్నూ ఆ ఆలయాలని కనిపెట్టుకునే వుండడానికి అంగీకారం వుంటే, అంతకుమించిన జీవనం మఱోటి లేకపోయిన పక్షంలో యింకా కొంతకాలం కనిపెట్టుకు వుంటారు. వారిని భోజనభాజనాదులలో యెవరుగాని నిషేధించకూడదు. జీవనార్థం యెవరేనా యేపనికేనా సిద్ధపడక తప్పదుగదా! తమకు దేవుఁడు కావలసివస్తే గృహదేవతార్చన యేమయింది! తన యింట్లోకి కూడా వచ్చి హరిజనులు అడ్డుతగిలేకాలం యింకా రాలేదు. కనక కొన్నాళ్లదాఁకా యీలా సంతృప్తి పడచ్చును. ఆస్థితికూడా వస్తేనో 'నందో రాజాభవిష్యతి' దీన్ని సవరించవలసివస్తే దేవుఁడు సవరించఁగలఁడేమో కాని పండితులూ, గిండితులూ యెన్ని వేదశాస్త్రాలు చదివి ఎంత కొమ్ములు తిరిగినవారైనా సవరించలేరు. పండితులన్నా వారిమాటలన్నా యిప్పుడు లోకానికి పూర్తిగా యేవగింపు. దేవుఁడు కలఁగజేసుకోని పద్ధతిని పండితులు తమవాదమే తప్పనుకొని ఆయా ధర్మశాస్త్రాల్లో వుండే నిషేధప్రతిపాదకస్మృతులను త్యజించి దైవసమ్మతమైన మార్గంలోనే తాముకూడా ప్రవర్తించడం యుక్తమని నాకు తోస్తుంది. దేవుఁడేమో యీ అనాచారానికి శిక్షిస్తాఁడనికదా వీరికి భయం.దేవుఁడే వూరుకుంటే యింక భయమెందుకు? యిది విషయాంతరం.

మా సమస్యాపూర్తి మహారాణీగారి యొక్కానున్నూ వారి జడ్జీ యొక్కానున్నూ సమ్మతికి పాత్ర మయిం దన్నది ప్రస్తుతం. వారు మమ్మల్ని తిట్టినతిట్లకు బ్రాహ్మలవడం కాకుండా సంస్థానపండితులు కూడా అవడంచేత వూరికే వాచా మందలించడం జరిగేదే కాని జరిమానా వగైరా లేమీ జరగలేదు. అట్టి కోరిక మాకున్నూలేదు. అట్టిపని ఆ సంస్థానాలలో యెన్నఁడూ పండితుల విషయంలోనే కాదు, తదితర విషయంలోకూడా బ్రాహ్మలవిషయంలో జరగనే లేదని విన్నాను. అందులోనూ గద్వాలవిషయం మఱీ యెక్కువగా చూడాలి. దానికి కారణం కేశవభొట్లనే బ్రాహ్మణపిల్లవాఁడిద్వారా ఆ వైభవమంతా వారికి తటస్థించినట్టు ఒక యితిహాసం విన్నాము. ఆపిల్లవాడి పేరుమీఁదనే దేవాలయం కట్టించి ఆ కేశవస్వామికి యేఁటేఁటా జరిగించే వుత్సవాల మిషమీఁదనే కార్తిక మాఖమాసాలలో వేద శాస్త్ర కవిత్వ గానాదివిద్యలకు యోగ్యతానుసారంగా సుమారు యేభైవేలదాఁకా ఖర్చు చేస్తారు. ఆభక్తి తాత్పర్యాలు వర్ణనాతీతాలు. యీ ధర్మఖర్చుకుగాను శ్రీనైజాం ప్రభువు ముజరాకూడా యిస్తారని వినడం. ఆకేశవభొట్లు బ్రాహ్మణ్యమందు వుండే గౌరవాన్ని పూర్తిగా ప్రదర్శించడంవల్ల ఆయీ సందర్భాలు కలిగాయి. ఆ యితిహాసం వ్రాస్తే చాలా పెరుగుతుంది. చాలామంది యెఱిగిందే. సుమారు రెండువందలేళ్లనాఁటిది. యిప్పుడు ఆ మాత్రం బ్రాహ్మలే లేరో? లేదా, అప్పుడు కూడా లేకపోయినా ఆ సంస్థానంవారు అమాయకులై యీబ్రాహ్మణపూజకు వుపక్రమించారో నేను నిశ్చయించలేను. యీ సందర్భమంతా ఒక్క గద్వాల సంస్థానానికి సంబంధించిందే. వీరు యేదో మిషమీద వేదాదివిద్యలను సమ్మానించి యశస్సుపొందుతూ తద్ద్వారా పరమార్ధాన్ని సేకరిస్తూవున్నారు కదా అని సమీపంలోనేవున్న ఆత్మకూరు, వనపర్తి సంస్థానప్రభువులున్నూ చిరకాలాన్నుంచి గద్వాలవారితోపాటు యీవిద్వత్సమ్మానాన్ని ఆచరించి యశస్సును పొందుతూ వున్నారు.

మళ్లా ప్రసక్తి కలగడంచేత యితర విషయమే రాసినట్టయింది. తుట్టతుదకు పిశాచం పట్టుకొనీ మనుష్యులను కొట్టడానికి బదులు భూత వైద్యులు ఆ మనిషినీడను కొట్టినట్టు ఆ వైష్ణవపండితులను వదలి వారి శిష్యుణ్ణి భట్రాజును అరెస్టుచేసి శిక్షించికూడా మా సమ్మతిమీఁద వదలిపెట్టారు. యెన్నఁడూకూడా పాండిత్యం పాండిత్యంవల్ల తేల్చుకోవడ మందేకాని వక్రమార్గాలచేత తేల్చుకోవడమంటే మాకు గిట్టదు. ఈ సందర్భమంతా కీ. శే. శ్రీ గద్వాల రామభూపాలుడిగారి సాంవత్సరికం నాఁడు అంటే, ప్లవ సం|| మాఖ శుద్ధ ద్వాదశినాఁడు జరిగింది. “మ. ప్లవసంవత్సర మాఖమాసమున శుక్లద్వాదశిన్" అనే పద్యం సందర్శనంలో వుంటుంది. దాదాపు 40 యేళ్లనాcటిది యీ ముచ్చట. ఆ సందర్శనంలో వుండేపద్యాలకు వొక్కొక్కదానికి యీలాగే యెంతో గాథ కొన్నిటికి వ్రాయవలసి వుంటుంది.

ఆయీ గాథలు యెందఱో యెఱిఁగే వున్నవే. ఎందఱో చెప్పుకొనేవేకాని యెన్నో మార్పులు చెందుతూ వుంటాయి. ఆదేశంలో మాకేమో ప్రయోగతంతు తెలుసునని చెప్పుకుంటారు. అది అసత్యం. యెవరిదాఁకానో యెందుకు? మా తిరుపతిశాస్త్రిచెప్పేటప్పుడే అక్కడి దిక్కడా, యిక్కడి దక్కడా పడవలసి వచ్చేది. సందర్శనపద్యాలు చదవవలసివస్తే అతనికి అంత వాచోవిధేయంగా వుండేవికావు. వల్లించడం నేనూ లేదు, అతఁడూ లేదు గాని తాత్కాలికధారణ తప్ప చిరకాలధారణా గుణం అతని బుద్ధిలో లేదనుకోక తప్పదు. అందుచేత ఆయీ పద్యాలల్లో మధ్యమధ్య కొత్తవాక్యాలు చేరడమేకాక అసలు కథా సందర్భాలే మాఱడం తటస్థించేది. యిదేమిటంటే “యిదేం వేదమా? శాస్త్రమా? పోనీ పొ” మ్మనేవాఁడు.

సుమారు ముప్ఫైయేండ్లకాలం కలిసి మెలిసి సంచారంచేసి సభలు చేసినవాళ్లం మేము. నన్నుగూర్చి అతఁడు వ్రాయవలసి వచ్చినా, అతణ్ని గూర్చి నేను వ్రాయవలసివచ్చినా వుభయుల చరిత్ర వచ్చేతీరుతుంది. యెన్ని పేజీలు వ్రాసినా తేలదు. యేదో తరవాయి వున్నట్టే కనబడుతుంది. పాండిత్యాల కేమి? యిద్దరమూ సమానులమే. బుద్ధికిన్నీ డిటో కవిత్వానికీ డిటో, వంటిబలంలో మేమిద్దఱమూ కలఁబడవలసివస్తే అతఁడే నన్నుకొట్టేటట్టే మొదటినుంచీ వుండేవాఁడుగాని, పాపం, ఆలాటి ప్రసక్తి యెప్పడేనా కలిగినా వూరికే దెబ్బ చూపించి ఆఁగిపోయేవాఁడే కాని కొట్టేవాఁడు కాఁడు. దానికి కారణం వ్రాయ నక్కఱలేదు. యిదివఱకు వ్రాసినదానిలో వుంది. "క. నాకన్న బుద్ధిబలమున నే కాదు తనూ బలమున" అని నేను సానుభూతిపద్యాలల్లో వ్రాసిన విషయం కొంత వ్యాఖ్యానాపేక్షతో చేరివుంటుంది. దానివ్యాఖ్యానం అతని జీవితచరిత్రలో చేసివున్నాను. తనూబలాన్నిగూర్చి గీరతంలో వివరించి వున్నాను. “చ. ఒడలిబలమ్మునన్ గెలుతు రొప్పితి నందునుగూడఁ దిర్బతిన్, దడఁ బడఁ గొట్టఁ జాల రొక “దద్దదదిందకట్టు" పట్టినన్ గెడపుదురు" నన్నెప్పుడూ కొట్టలేదుగాని మఱికొందఱిని కొట్టడమేకాదు, చార్జిదాఁకా రావడం కూడా జరిగింది. కొట్టేవాఁడు తొందరమనిషే, వెనకా ముందూ చూచేవాఁడు కాఁడు. చురుకుపాలు.

అతనికంటె అంతో యింతో నేను వయస్సా పెద్దవాణ్ణి, అందుచేత సభాస్థానాల్లో కాని, యితరత్రాకాని పెత్తనమంతా నామీఁదే నడిచేది అందుచేత అతఁడు కొంత అశ్రద్ధగా వుపేక్షాతాత్పర్యంగా వుండేవాఁడు. ద్రవ్యవిషయమైన వివాదాలు మా కెప్పడూ లేవు. విద్యావిషయాలు కొన్ని తెల్పేవున్నాను. అతఁడు శ్రద్ధగా వుండడమల్లా అవధానంలో తనవంతు చరణం చెప్పవచ్చినప్పుడు మాత్రమే. అందులో పూర్ణమైన శ్రద్ధ వహించేవాఁడు. ఆలా వహించకపోతే అసలు ఆ శకటం నడవనే నడవదని వేఱే వ్రాయనక్కఱలేదుగదా! ఆ అవధానపద్యాలు వెంటనే మఱిచిపోవడమంటూ వుండేది కాదుగాని యేమేనా కొన్నాళ్లకేనా “శనగలు తినిచేయి కడుక్కోవడం" జరిగేది. యిద్దఱమూ వుంటే అదో అందంగా వుండేది. ఆయాసభలలో వొక్కొక్కప్పుడు మాలో మేముకూడా “కయికురుబొయికురు” లాడుకోవడమున్నూ పలువురెఱిఁగిందే. నారాయణ దాసుగారు (ఆదిభట్ట)అన్న పేరన్నగారి వశంలో వున్నట్టుగానే అనుకోండి, తిరుపతి శాస్త్రిగారు నావశంలో వుండేవాఁడు. యిది నేను వినయంగా వ్రాసేదానికింద భావించకండి. సర్వవిధాలా సమర్థుఁడైన వక వ్యక్తి యింకొక వ్యక్తివశంలో వుండడం సామాన్యమైన విషయంకాదు. మాయీ అనుబంధానికి యేవో కొన్ని బహిఃకారణాలు కనపడినా అంతఃకారణం దైవనిర్ణీతమయింది యేదో ఒకటి వుండితీరుతుంది. లోకం చెప్పుకొనే మాటలకేమి? కొన్ని నిజాలూ వుంటాయి. కొన్ని అసత్యాలూ వుంటాయి. అవి యెప్పుడూ అంతరించేవి కావు. సుమారు అప్పటి నా నివాసగ్రామం యానానికి ఆఱేడు ఆమడలదూరంలో వున్న అతనిపేరు తిరపయ్యేమిటి? నాపేరు వెంకన్నేమిటి? మేమిద్దఱమూ తిరుపతి వేంకటేశ్వరులుగా కలుసుకోవడ మేమిటి? యిది దైవనిర్ణయమంటారా. మనుష్య నిర్ణయ మంటారా? యిటీవల యెందఱో జంటకవులు బయలుదేఱినా యీ విధంగా పేరులు కలశాయా? కొందఱు నేఁటికికూడా "తిరుపతి" అనేది యింటిపేరనే అనుకునేవారున్నారు. కొందరు తిరుపతిలో వుండే కవులు గనక తిరుపతికవులని అనుకొనేవారున్నారు. కొందఱు యీమా కడియం గ్రామానికి నాపేర వుత్తరం వ్రాస్తూ “తిరుపతి శాస్త్రులుగారికి” అని యిప్పటికి వ్రాయడంకలదు. సుమారు పుష్కరకాలం దాఁటినా తిరుపతిశాస్త్రులు యింకా వున్నాఁడనుకున్నారనుకోవాలా? లేక స్వర్గతులైనవారు యీ యిద్దఱిలో యెవరో తెలుసుకోలేకపోవడంచేత యీ తబ్బిబ్బు కలుగుతూ వున్నదనుకోవాలా?

ఆయీ సందర్భాలన్నీ తిరుపతి వెంకటేశ్వరకవులకు వుండే ఐకమత్యం అనన్యసామాన్య మనే అంశాన్ని బోధిస్తాయి. తేడాపాడాలకేమి? యేవో లవలేశాలు వుండకపోవు, వాట్లని కొందఱోలాగా, మఱికొందరు మఱోలాగా చెప్పుకుంటూ వుంటారు. యెన్నో యింకా యీలాటి వున్నాయి. విస్తరభీతిచేత వదులుతూవున్నాను.

నావిషయం రాకుండా అతని విషయమే వ్రాయడానికి యేర్పడ్డ యీ వ్యాసంలో చాలాచోట్ల నావిషయంకూడా యేకొంచెమో కాక విస్తారంగానే తగులుతూ వచ్చింది. యెవరేనా వ్రాయవలసి వస్తే యింతకన్న బాగా వ్రాయఁగలరేమో? మాకూ మాకూ వుండే అనుబంధాన్ని బట్టి వకరిని తప్పించి వకరినిగూర్చే వ్రాయడానికి వీలిచ్చింది కాదు. అంతేకాని దీనిలో నా గొప్పతనాన్ని కూడా వెల్లడించుకోవాలని నేను ప్రయత్నించలేదు. అతణ్ణిగూర్చి వ్రాసేది సమస్తమూ విద్యకు సంబంధించిందయితే లోకం నాకూ అన్వయించుకుంటుంది. నన్ను గూర్చి వ్రాసేదిన్నీ అంతే. అట్టి స్థితిలో "యేడ్చినదాని మగఁడొస్తే యేకులొడికినదాని మగఁడూ వస్తా"డని వూరుకుంటే బాగుండదా? బాగుంటుంది. కాని చంద్రచంద్రికాన్యాయంగా సంచరించిన మా సంచారాన్ని ఆలా వ్రాయడానికి అవకాశం కలిగింది కాదు.

లోకులు అనుకునే స్వల్పభేదాలు వ్యక్తిభేదాన్ని ಬಲ್ಜಿ కొన్ని సత్యదూరాలున్నూ కావు. కొన్ని మాత్రం సత్యదూరాలే. యితరవిషయాలంటే? పాండిత్యభేదాన్ని గురించి మాట్లాడుకొనే మాటలవల్ల వచ్చే చిక్కంతగా లేదుగాని జిలిబిలిపదాల కవిత్వమంతా నాసొత్తుగానూ, సమాసభూయిష్టమంతా అతని సొత్తుగానూ జమకట్టుకొనేవారిని మాత్రమే నేను సాంజలి బంధంగా “నాయనలారా! మీరు ప్రమాదపడుతూ వున్నా"రని విన్నవింపవలసి వచ్చింది. యీ విషయమే అతని జీవితచరిత్రలో యెత్తుకొని కొంత వ్రాశాను. ఆలా అనుకొనే మాటలవల్ల నాకే యెక్కువ లాభం కలుగుతుందని, నేనే కాదు కవితాసర్వస్వవేదులందఱూ ఒప్పుకుంటారు. కాని అది అంతా సత్యేతరమవడంచేత అంగీకరించడానికి వీలులేక యథార్థం తెలిపి అతని ప్రత్యేకరచనచేత దాన్ని నిరూపించవలసి వచ్చింది. కవిత్వమంటే యేవో నాలుగు సమాసాలు కూర్చడమే పరమావధిగా కలదికాదు. "సాధ్యోహిరసోయథాతథం కవిభిః” వున్నంతలో వోపిక తెచ్చుకుని వ్రాశాను. యిందులో తిరుపతిశాస్త్రినిగూర్చి 'మావాడు' కూడా వదులుకొన్న తరగతిలోనివి కదా? అట్టిస్థితిలో నేను వాటిని వాడడానిక్కారణం మామా సంభాషణ యేలా వుండేదో దాని స్వరూపాన్ని క్రొత్తవాళ్లకి తెల్పడానికే కాని అన్యంకాదు. మా విద్యార్థిదశనాటికింకా దేశం యింతటి మహోన్నతస్థితికి రాలేదు, యీనాటి నాగరికత వగయిరాలు యితరుల విషయం వ్రాయడంలో యేంచిక్కు వస్తుందో అనే శంకతో పనివున్నది కాదు కనక పాటించలేదు. 68 వత్సరాల వయస్సులో వున్న నన్ను యిప్పుడుకూడా తి. శా. అన్న మత్సమానవయస్కుడో లేక యేస్వల్పమో పెద్దో అయిన సుందరరామశాస్త్రి 'యేమిరా’ అనేపిలుస్తాడు. నేనున్నూ ఆలాగే పిలుస్తాను. మా రోజులుమట్టుకు యీలాటి నాగరికత తోటే వెడితే మాకు సంతోషం. యిదే యిప్పటి నాగరికులను గూర్చినదయితే “లీగల్"గా తప్పుగా పరిణమిస్తుంది. సందేహంలేదు.

వకటి రాయడం మఱిచాను. యిటీవల వ్రాసిన తిరుపతిశాస్త్రి జాతకచక్రాన్నిబట్టి చూస్తే గురుఁడు వృషభంలో వుండడంవల్ల నా జాతకంలో మిథునంలో వుండడంచేత అతడు నాకన్న కొంచెం మాసాలో దినాలో పెద్ద కావలసివస్తుందేమో? యీ సంశయం యింతదాకా వ్యాసం వ్రాశాక తట్టింది. లేదా వక్రగతిచేత ఆలా తటస్థించిందా? అది కూడా గురుణ్ణి అంతదూరం లాగదు. అయినా యీకాకదంతపరీక్ష యిప్పుడెందుకు? అంతో యింతో నాకన్న వయస్సులో మాత్రం అతడు చిన్నవాడే.


★ ★ ★

  1. *ఆయీ సంపుటంలోని “అతడు కుంభలగ్న జాతకుడు. పంచమాధిపతి అయిన శుక్రుడు అంటే సంతానస్థానాధిపతి మీనమందు ఉచ్ఛపట్టి ఉన్నాడు" అనే వాక్యాలు వ్యాసరచయిత పరిశీలనలోని ప్రమాదపతితాలే కాని వేరుకావు. కుంభలగ్నమునకు పంచమ (సంతాన) స్థానాధిపతి బుధుడేకాని శుక్రుడుకాడు. మీనం బుధునకు ఉచ్ఛరాశికాదు. ఈ జాతకం ఇప్పుడు లభ్యపడనందున ఈ ప్రచురణలోనే ఆవిషయం సవరింప వీలుచిక్కినదికాదు. ఈ విషయం భోగట్టాచేసి పునర్ముద్రణలో సవరింతును- దుర్గేశ్వరశాస్త్రి.