కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/కళలకోసరం దేవదాసిజాతి



కళలకోసరం దేవదాసీజాతి

విత్తమాత్రోపాధికమైన వేశ్యాసమాగమాన్ని కవులు పూర్తిగా యీసడించే వున్నారు. కాని మృచ్ఛకటికలో మాత్రం ఆవిషయాన్ని యెత్తుకొని మిక్కిలి చక్కఁగా రసపోషణ చేసివున్నాఁడు శూద్రకమహాకవి.

అందులోవున్న నాయిక వసంతసేన సంపదను వొక మహారాణీ సంపదగా వర్ణించాఁడు - అట్టి వసంతసేనను కేవల గుణానురక్తనుగా నిరూపించి ఆపెయందే పాతివ్రత్యాన్ని ఆపాదించి వున్నాఁడు కాని అట్టిది స్వీయగానే పరిగణింపఁబడుతుంది గనక వేశ్యాకులంలో పుట్టినంతమాత్రం చేత వేశ్యనుగా ఆపెను పరిగణించకూడదని పలువుర అభిప్రాయం. అనాదిగా మనలో ఈ జాతికి కొంత ప్రాధాన్యం వుంటూనే వుంది బ్రాహ్మణ కులంలో పుట్టి బ్రాహ్మణజాతికి విహితమైన స్నానసంధ్యాదినియమాలు లేకపోయినా ఆ వ్యక్తిని బ్రాహ్మడుగానే పరిగణించడమున్నూ పై నియమాలు వున్ననూ, అన్యుణ్ణి బ్రాహ్మడుగా పరిగణించకపోవడమున్నూ భారతాదికంవల్ల విస్పష్టమే. ఆలాగే సంసారిగా వుండేవేశ్యను సంసారిగా పరిగణింపక వేశ్యగానే పరిగణించడమని గమనింప వలసివుంటుంది. వేశ్యావృత్తిని నిర్మూలించడానికి మద్యపాన నిర్మూలనోద్యమం కంటే కొంత పూర్వమే సంఘసంస్కర్తలు ప్రారంభించారు. ఆ వృత్తి యెంత వరకు నిర్మూలింప బడిందో కాని ముందుగా దేవాలయాల్లో జరిగే నృత్తాదులు పూర్తిగా రూపుమాశాయి. ఆ నౌకరీ భూములు జిరాయితీలోకి చేర్చి పన్ను గట్టడమువల్ల గవర్నమెంటుకు దానివల్ల కొంత లాభము కలిగింది గాని గవర్నమెంటువారు స్వతహాగా యీ స్వల్పలాభానికి అపేక్షించారని అనుకోవడానికి అవకాశం లేదు. శారదాబిల్లువలెనే యీ బిల్లున్నూమనలో ప్రముఖుల కోరికమీఁదనే గవర్నమెంటు ఆమోదించడం జరిగింది. ప్రతిరోజున్నూ భగవదారాధన చేసుకునేజపితలు తుట్టతుదను- "నృత్తం దర్శయామి, గీతం శ్రావయామి" అనడం సర్వానుభవసిద్ధం. దీన్ని బట్టే మహారాజులు, ఆయా ఆలయాలల్లో నృత్తగీతాది వాద్యాదులకు వృత్తులేర్పఱిచి వున్నారనుట సత్యదూరం కాదు. అయితే యీ నృత్తగీతాలు మొగవాళ్లవల్లఁగాని లేదా సంసారి స్త్రీలవల్లఁగాని యెందుకు భగవత్సన్నిధిలో జరిగించకూడ దంటూ కొందఱనవచ్చును. సంగీతవిద్యలో మహావిద్వాంసు లనిపించుకొనే వాళ్లందఱున్నూ మొగవాళ్లే కాని రంజకత్వంమాత్రం స్త్రీగాత్రమందే కాని పురుష గాత్రమందు అంతగా వుండదు. నాట్యం విషయంలో చెప్పనే అక్కఱలేదు. మృచ్ఛకటికలో యిూ విషయాన్ని శూద్రకమహాకవి బాగా వివరించివున్నాఁడు. నాట్యాభి నయాలేమి, గానమేమి అవి స్త్రీలకు జన్మహక్కుగా వొప్పుకోవలసి వుంటుంది. స్త్రీవేషధారులుగా వుండి రంజింపజేసిన పురుషులున్నూ కొందఱు వుంటారు. పురుషవేషాన్ని ధరించి రంజింపఁజేసే స్త్రీలున్నూ కొందఱు వుంటారుకాని, అది సార్వత్రికంగాదు కనక ఆ యీ విషయం అంత గణించతగ్గది కాదు. అందుచేత నృత్తగీతాలకు భగవత్సన్నిధిని గాని యితరత్రా జరిగే శుభ కార్యాల్లోగాని, స్త్రీలే వుండవలసివస్తుంది. ఆ పద్ధతిని స్వతంత్రత్వంతో సంబంధించిన స్త్రీలు, అవివాహితులు తప్ప పనికిరారు- అందుకోసం యీ వేశ్యాజాతి యేర్పడ్డట్టు తోస్తుంది– “సగం చచ్చి సంగీతమూ, అంతాచచ్చి హాస్యమూ" అంటూ వక లోకోక్తి వుంది. అంటే సంగీతానికి లజ్ఞాత్యాగం అవసరం. అట్టి త్యాగం కులస్త్రీధర్మంకాదని వ్రాయనక్కఱలేదు. అభినయానికి బొత్తిగా సిగ్గుంటే పనికిరాదు కాcబట్టి యీ విద్యలో పేరు ప్రతిష్ఠలు సంపాదించడం అనాదిగా కుల స్త్రీలలో లేకపోవలసి వచ్చింది. యెక్కడో ఒకరిద్దఱు స్త్రీలు యుద్ధం కూడా చేసినట్టు చరిత్రజ్ఞులు వ్రాస్తూ వున్నారు. దాన్ని కాదనవలసి వుండదు. అంతమాత్రంచేత స్త్రీలందఱూ మిల్టరీలో చేర్చుకోతగ్గవారే అవుతారా?- "కడవంత గుమ్మడికాయా కత్తిపీఁటకు లోఁకువ" అనే సామెత వినలేదా? యీశ్వరుఁడు బ్రహ్మదేవుణ్ణి మహిషాసురుఁడికి స్త్రీలచేతిలో తప్ప యితరుల చేతులో చావు లేకుండా వర మిచ్చినందుకు యేలా మందలిస్తూ వున్నాఁడో, చూడండీ!

ఉ. "తెచ్చితి వీయనర్ధమును దేవత లందఱకున్, వరంబు ము
      న్నిచ్చి; యిఁ కేమి సేయనగు? నెవ్వరికేనియు వాఁ డవధ్యుఁడౌ
      నచ్చపలున్ వధింపందగు నంగన లెవ్వరు? నీతలోదరిన్
      బుచ్చెదొ? నాతలోదరిని బుత్తునొ? పుత్తుమొ? వాసవాంగనన్."

యీశ్వరుని భార్య మహాకాళి యుద్ధసమర్థురాలే అయినా జనరల్ మీఁద స్త్రీ స్వభావం యుద్ధానికి అనుగుణమయినది కాదు కనుక యీశ్వరుఁడు అలా చెప్పినట్టు విస్పష్టమే. సంసారి స్త్రీలల్లో వేశ్యలతోపాటుగాని అంతకన్నా మిన్నఁగా గాని గానాభినయాలు అభ్యసించతగ్గ వ్యక్తులు కొందఱు వుంటే వుందురుగాక, ఆ స్త్రీలను ఆయా సభలకు పంపి తద్ద్వారా ఆయా భూములను అనుభవించడానికి యే గృహమేధిన్నీ ఆమోదించడం సర్వథా అసంభవం గనక యీవృత్తికై మన పూర్వులు వకజాతిని యేర్పఱిచినట్టు విస్పష్టమే. అవివాహితలైన కారణంచేత ఆ స్త్రీలను కొందఱు పురుషులు ప్రేమించడం వగయిరాలు కలిగినాయి. దానివల్ల కొంత అనర్ధమున్నూ కలిగింది. అంతమాత్రంచేత ఆ జాతి దూష్యమనిన్నీ వ్యభిచారానికే యేర్పడ్డదనిన్నీ భావించి “యితర ఖండాలలో యిట్టి జాతి లేదు; మన ఖండానికే తటస్థించింది యీ లజ్ఞాకరమైన ప్రారబ్ధం" అంటూ మనవారు యేవగించుకోవడం చూస్తే కొంత ఆశ్చర్యంగా వుంటుంది. ఆ దేశంలో వున్న లజ్ఞాకరత్వం ఆ దేశీయులు అన్యథాగా కమ్ముదల చేసుకుంటూ వున్నారు– అనాథశరణాలయాలు యెందుకోసం ఆ దేశంలో పుట్టఁబడ్డాయి? వేశ్యాపుత్రులకు తండ్రి యెవఁడో తెలియకపోవచ్చును గానీ తల్లి యెవరో తెలుస్తుందిగదా! ఆ శరణాలయంలో చేర్చఁబడ్డ వాళ్లకు తల్లినిగూర్చి గూడా తెలియదుగదా! ప్రతి జాతికిన్నీ యిట్టి కర్మం తటస్థింప చేయడంకంటె దీనికోసం వకజాతిని నిర్బంధం లేని పద్ధతిని యేర్పాటు చేసుకోవడమున్నూ ఆ జాతికి ప్రధానజీవనం గీతాభినయాల మీఁద జరగడానికి వృత్తులు కల్పించడమున్నూ యుక్తంగా వుందేమో చూడండీ! అయితే యీ వృత్తియం దెంతో తప్పిదం కనపడుతుంది కనక దీన్ని నిర్మూలిస్తేనేకాని వల్లకాదంటారా? అనండి. కసాయివ్యాపారం అంటూ వుందికదా? వెనుకటి రాజులు వగయిరాలు మాంసాన్ని తింటే తిన్నారుకాక, జంతు వధకంటూ శాలలు నిర్మించినట్టు గ్రంథాల్లో కనపడదు- యే అడవిలోనో వేఁటాడి తెచ్చిన మాంసాన్ని అమ్ముకునేవాళ్లు అమ్ముకొనేవారు. కొనుక్కుతినేవాళ్లు తినేవారు. అంతే. భారతంల్లో ధర్మవ్యాధుఁడు చెప్పిన మాటలుకూడా యీ అర్ధాన్నే బోధిస్తాయి. జంతువుల వధ్యస్థానానికిన్నీ వేశ్యాగృహానికిన్నీ చాలా భేదం వుంటుంది. మాంసం తినేవాళ్లంటూ లేకపోతే ఆవృత్తికి వకజాతితో అవసరం వుండేదేకాదు. ప్రస్తుతంకూడా పురుషు లందఱూ నీతిపరులే అయితే వీళ్లుకూడా అవివాహితులుగా వుండికూడా బ్రహ్మచారిణులుగానే వుండేవారేమో? కొందఱి అభిప్రాయం యీజాతి కులస్త్రీల పాతివ్రత్యాన్ని కాపాడడానికి యేర్పడ్డట్టుగా కూడా కనపడుతుంది. యీ అభిప్రాయాన్ని పురస్కరించుకొనియ్యేవే పాండవప్రవాసంలో మేమీ పద్యం వ్రాసింది

చ. “చపలులులేరె? యెందుఁ బెఱచానలె కావలెనే? స్వకాంతలే
     ల పనికిరారు? రా రనుము లంజలులేరె? భవాదృశుల్ నృపా
     లపశువు లంగనాజనములన్ గికురింతు రటంచుఁగాదె? శు
     ద్ధపశుసమానజాతి నొక దానిని ధీవరు లొప్పిరో జడా!"

యీ పద్యం ధర్మరాజు సైంధవుణ్ణి మందలించే ఘట్టంలోది- పైపద్యంలో వేశ్యలు పశుతుల్యలుగా పేర్కోఁబడ్డారు. అందుకు ఆధారం "పశువేశ్యాదిగమనే ప్రాయశ్చిత్తం సమాచరేత్" అనే ధర్మశాస్త్రం. యిప్పుడు లోకంలో స్త్రీలు వాళ్లంతట వాళ్లు యితరదేశాల నాగరికతకు లోcబడి తమతమశీలానికి భంగంతీరి కూర్చుని తెచ్చుకుంటూ వున్నారే కాని ప్రభుత్వంగాని, అందులోవుండే ప్రముఖులుగాని దుర్వినీతిపరత్వానికి లోcబడి బలవంతంగా స్త్రీల శీలాన్ని లేశమున్నూ భంగించడం లేదు - వెనకటికాలం ఆలాటిదికాదు. వకజమీందారున్నాఁడంటే వాఁడికి వాఁడి గ్రామాల్లో వుండే స్త్రీ లందఱున్నూ అవసరమైతే భార్యాత్వానికి అంగీకరించవలసిందే -యీ విషయం యిప్పుడు తగ్గిందేమో కాని నైజాంలో వుండే యెస్టేట్లు కొన్నిటిలో నిన్న మొన్నటి వఱకూ తఱుచుగా అమల్లోనే వుండేది.

శా. “ఆ రాజేంద్రుఁడు రాత్రియుం బవలుఁ గామాసక్తిచే నూరిలో
     నీరేజేక్షణలన్ బలాత్కృతిగ నెంతే బాధ పెట్టంగ నా
     యూరన్ గాఁపుర ముండువార లొకరోజొక్కొకఁ డాత్మీయ యౌ
     దారం బంపెద నన్న నొప్పెనఁట! యాతం డెంత ధర్మాత్ముండో?"

రాజులూ, రాజపురుషులూ పూర్వం బకాసురుఁడులాగ నిన్న మొన్నటిదాఁకా సంసారి స్త్రీలను బాధించడం వుండేది. ఆగర్భ శ్రీమంతులుగా పుట్టి దుర్వినీతులైన నౌకర్లచేత పెంచఁబడి దుర్వినీతులై యెందఱో జమీందార్లు లోకబాధకులుగా వుండడం చూచే అనుకుంటాను. ఆనాఁటి విద్వాంసులు రాజులకు ప్రతి వుపచారానికిన్నీ స్త్రీలనే యేర్పఱచినట్టు కనపడుతుంది. కాదంబరివగైరా గ్రంథాలిందుకు వుదాహరణంగా ఉంటాయి. మహా నీతిధురంధురుఁడైన బుద్ధభగవానులుకూడా యీ స్త్రీమయమైన బోనులో కొంతకాలం యితరరాజులవలెనే ఆయా వుపచారాలు అనుభవించి వున్నాఁడు. యొక్కడో తప్ప రాజులకు తఱచు దాసీ సంపర్కం తప్పదన్నమాటే! యెందుచేత? ప్రతిక్షణమందున్నూ వాళ్ల సాన్నిధ్యం కలిగి వుంటుందిగదా?- “కలుగనే కలుగదు కలిగెనేనియును రాజునకు దాసస్త్రీ గమనము గల్గు" అని మేము వ్రాసిందికూడా పైసందర్భాన్ని మనస్సులో పెట్టుకొనియ్యేవే. మొత్తం చామరగ్రాహిత్వం మొదలు పాదసంవాహనకృత్యందాఁకా పూర్వపురాజులకు స్త్రీలవల్లనే జరగడానిక్కారణం చూస్తే వీరిబాధ పతివ్రతాలోకానికి తప్పించడానికేమో అనుకుంటాను. వాళ్లనే రాజదాసీలంటారు. అగ్నిమిత్రుఁడు పెండ్లాడిన మాళవిక యీ తెగలోదే కనక నా వూహను కొంత బలపఱుస్తుంది. కాని ఆపెను రాజకుమారికగా కాళిదాసు సమర్ధించివున్నాఁడు. అది నాటక సాంప్రదాయపు మార్చనుకోవాలి. వీళ్లలో యెక్కడో తప్ప విద్యావంతులుండరు. విద్యతో సంబంధించినజాతి దేవదాసీజాతి. ఆ జాతికే వేశ్యాది శబ్దాలు వర్తిస్తాయి. దక్షిణాదిని యీ కుటుంబాల్లో యెక్కడోతప్ప దేవాలయపు నౌకరీ వుండకుండా వుండదని విన్నాను. స్త్రీలల్లో అనాదిగా నాట్యాభినయాలేమి గానమేమి యీ జాతివల్లనే కాపాడఁబడుతూ వుంది. మేము రంభవంశంవాళ్ల మనిన్నీ వూర్వశి వంశంవాళ్ల మనిన్నీ మేనక వంశంవాళ్ల మనిన్నీ చెప్పుకొనేవాళ్లు పలువురు యీ జాతిలో వున్నారు– “రహి వుట్ట జంత్ర గాత్రముల ఱాల్గరఁగించు విమల గాంధర్వంబు విద్య మాకు” అని పెద్దన్నగారు అప్సర స్త్రీ అయిన వరూధినిచేత చెప్పించివున్నారు. కాదంబరిలో వీళ్ల వంశాలనిగూర్చి చాలా విస్తరించి వుంది. ఆ వంశ వృక్షాలు ‘ఆ కవిస్వకపోలకల్పితమో పూర్వాధారం యేమేనా వుందో ఆలోచించాలి- ఆ వంశ వృక్షాలు అప్సరసలకు సంబంధించినవి. ప్రస్తుతం మన దేశంలో వేశ్యాజాతి ఆ జాతికి సంబంధించిందో కాదో చెప్పలేము. బ్రాహ్మణాదులు ఋషి వంశజుల మని చెప్పినట్లే వాళ్లున్నూ చెపుతారు. అందఱూ సానులుగానే వుండాలనే నియమంగాని, నిర్బంధంగాని లేదు- సంఘ సంస్కర్తలు ఆయీ జాతి స్త్రీలకు పెండ్లి చేసుకొనే అధికారాన్ని కొత్తగా కల్పించలేదు. ఆ అధికారం అనాదిగానే ఆ యీ జాతికి వుంది. యిప్పుడల్లా దేవాలయాల నౌకరీమాత్రం తప్పించినట్టయింది. పయిఁగా సంగీతకళనున్నూ దానిలోనే అంతర్భూతమైన నాట్యకళ నున్నూ నిర్మూలించడానికి సంకల్పించినట్టు పరిణమిస్తూంది - యే కొంచెమో యీ కళలు సంసారులవల్ల అభ్యసింపఁబడినా ప్రత్యేకించి యిందుకోసం వక జాతి అంటూ వుంటేనే తప్ప యీ కళలు నశించిపోక తప్పదు. వ్యభిచారం నశింపచేయడానికి బ్రహ్మక్కూడా తరంగాదు. వేశ్యాజాతి దాన్నిన్నీ దేవాలయాల్లో నాట్యాలున్నూ మానివేసినంతలో లోకంలో వ్యభిచారం నశిస్తుందన్న మాట సర్వకల్ల - కాఁబట్టి సంగీతంకోసమున్నూ అభినయం కోసమున్నూ యీజాతి వకటి వుండడానికి అంగీకరించడం యుక్తమే అని నేననుకుంటాను- దుర్నీతి విషయంలో యితర దేశాలలో కంటే మనదేశంలో సదుపాయాలు తక్కువగానేవున్నాయని ఋజువుచేయడం మిక్కిలీ సుళువు. గానాభినయాలకోసమంటూ వకజాతి రిజర్వు చేయఁబడ్డదై ఉన్నంతమాత్రంచేత దుర్నీతి హెచ్చడానికి అది ఉపోద్బలకంకాదు. జారత్వ చోరత్వాలు రెండున్నూ వకటే తరగతిలోవికదా! జారత్వానికి మనదేశంలో వకజాతి యేర్పడి వుందే అనుకుందాం, చోరత్వానికి పెద్దలచేత అలా యేర్పఱచఁబడి లేదుకదా? లేనప్పడు అది యెందుకు వృద్ది పొందాలి? యీ రెండున్నూ నశించవలసివస్తే జ్ఞానంవల్లనేతప్ప “అన్యథా శరణం నాస్తి".

సంగీతమున్నూ అభినయమున్నూ అవసరమైన కళలే అని అంగీకరించే యెడల యిదివఱకువున్నవేశ్యాజాతి కాకపోతే మానెఁగాని యింకో జాతినేనా స్త్రీజాతిని స్వతంత్రమైన దానిని దానికోసం రిజర్వు చేసి పెట్టడం అవసరమనియ్యేవే. సంసారిణులవల్ల మాత్రం ఆ కళలు యే కొంచెమో నామమాత్రావశిష్టంగా నిలిచి కొనవూపిరితో నిల్వఁగలిగినా పూర్ణవికాసాన్ని పొందడంమాత్రం పుస్తకాపేక్షే అని నా తలంపు. “యీ కళలే అక్కఱలేదు, వీట్లవల్ల కలిగే ప్రయోజనం లేనేలే దంటారా? అట్టి వారికి చెప్పవలసిన జవాబేలేదు - వకవేళ - శ్లో, సంగీతసాహిత్య రసా౽నభిజ్ఞ స్సాక్షాత్పశుః పుచ్చవిషాణ శూన్య" అంటూ అభియుక్తులు పూర్వం చెప్పివున్నారని నేను ఉదాహరించినా అట్టివారు అఅక్షణంలో దాన్ని ఖండిస్తారని యెఱుఁగుదును. వొక మంచికోసం యింకో చెడ్డని అంగీకరించ వలసివస్తూ వుంటుందని వేఱే వ్రాయనక్కఱలేదు.


★ ★ ★