కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/ఏది అహింస?
ఏది అహింస?
అహింసను సర్వోత్కృష్టంగా అంగీకరించని వేదంగాని, పురాణంగాని, మతంగాని, జాతిగాని లేదనే చెప్పవచ్చునుగాని యేదో విధంగా అందఱూ చేస్తూనే వున్నారు. దక్షిణ హిందూస్థానంలో వుండే పంచద్రావిళ్లు (బ్రాహ్మలు)న్నూ చాలామట్టుకు వీరి ఆచారాలనే ఆచరించి దినకృత్యాలు నడుపుకొనే వైశ్యులున్నూ, విశ్వబ్రాహ్మణులలో కొందఱున్నూ, యీ హింసకు దూరంగా వర్తిస్తున్నారని చెప్పవచ్చును. బ్రాహ్మణులలో శిష్ణులు "వైశ్వదేవం” చేయటం తప్పని విధిగా జరిగే స్వల్పజంతుహింసవల్ల సంభవించే దోషాన్ని పోఁగొట్టు కోవడానికే.
"పంచసూనాలు" అనేవి తప్పక సంఘటిస్తాయి. చీమలు, చెదపురుగులు, నల్లులు, పేలు, దోమలు మొదలైనవాట్లను బుద్ధిపూర్వకంగా కాక పోయినా హింసించకుండా జీవితం నెఱవేఱదు. వీటిలో నల్లులూ పేలూ అనే వాట్లను చంపకుండా కాలక్షేపం జరుగుతుంది. పందిరి పట్టిమంచాలు వగయిరాలు వదులుకొని చర్మాలమీద పరుండడంవల్ల నల్లులపీడ తప్పుతుంది. కాని ఆ పద్ధతిని చర్మాలకు గిరాకీ యొక్కువగా తగిలి యింతకన్న పెద్ద పాపానికి అవకాశం కలిగించుకున్నట్లవుతుంది. సూలదృష్టిని పోవలసిందేగాని యీ "అహింసను" సూక్ష్మదృష్ట్యా విచారిస్తే మటీ అయోమయంలో పడ్డట్లవుతుంది. మార్వాడీలలో "జైనమతస్థులు" రాత్రి దీపం పెట్టకపూర్వమే భోజనం నెరవేర్చుకుంటారు. నల్లులున్న మంచానికి కొంచెంసేపు తమ శరీరాన్ని విందుగా అర్పిస్తారు. వారిలో సన్యాసులు కట్టిన వస్త్రం వుతకరు. దంతధావనం చేయరు. సూక్ష్మ జంతువులేవో కొన్నిటికి హాని కలుగుతుందనియ్యేవే. యేదేనా అతిలోకిపోతే వెట్టిగా కనపడుతుంది, అందుచేతనే
"అతి సర్వత్రవర్ణయేత్" అన్నారు అభియుక్తులు. యీ అహింసా విషయంలో దాక్షిణాత్య బ్రాహ్మణులు (పంచద్రావిళ్లు) అవలంబించిన మార్గమే శాఘ్యంగా కనపడుతుందిగాని ఆయీ అయిదు తెగలలోనూ ఆంధ్రులున్నూ ద్రావిళ్లున్నూ యజ్ఞాలలో ప్రత్యక్ష పశుహింస చేయడం (వేదసమ్మతమే అయినా) ఘనోరంగా కనపడుతుంది. ఆయీ హింసకు వేదసమ్మతివున్నదని యెఱిఁగిన ఋషులే కొందఱు నిషేధించినట్లు ఆ పురాణవాక్యాలే రుజువిస్తాయి.
క. కర్మము లను నెపమున దు
ష్కర్మమ్మగు హింస సలుపంగాఁజేయుచు నం
తర్మదమువెంచు నాగమ
మర్మమ్ముల నామనంబు మసలదు తండ్రీ.
ఇది శ్రీశుకుని వాక్యం. ఇంతేకాదు “జన్నములు పెక్కు పశుహింస సలుపకుండ" అని శౌనకుఁడు సూతునితో ప్రసంగించే ఘట్టంలో కనపడుతుంది - కాఁబట్టి హింసకు మనస్సంగీకరింపక పూర్వ ఋషులు పిష్టపశువుతో యజ్ఞాలు సాగించుకొన్నట్లు స్పష్టంగా గోచరిస్తుంది. ఆయీ ఋషుల మతాన్ని వైదికమతానుయాయులు ద్వైతులూ, విశిష్టాద్వైతులూ (కొందఱుమాత్రమే) అవలంబించారుగాని అద్వైతులుమాత్రం అవలంబించలేదు. అయితే వీరు దయాదూరు లేమో అంటే, అట్టివారు కారు. వేదమును అతిక్రమించి చేసే యజ్ఞం నిష్ఫలమని వీరి తాత్పర్యం. పిష్ట పశువుతో కర్మకలాపాన్ని నిర్వర్తించుకొనే ద్వైతమతస్టులులోనైన వారి మీఁద వీరుకొన్ని పూర్వపక్షాలు చేస్తారు. కాని అవి యుక్తియుక్తంగా వున్నట్లు తోచినా ఆదరణీయాలు కావు. కనకనే జీవహింసకు జంకేవారెవ్వరూ పాటించినట్లులేదు. మాంసభక్షకులు మనుప్యేతర జంతువులన్నీ మనుష్యుని కుక్షిని పూరించడానికే జన్మించినట్లు చెప్పడం యేలాటిదో అద్వైతుల పూర్వపక్షాలున్నూ అట్టివే. వేయి చెప్పండి యీ విషయంలో బుద్దుఁడే ఆశ్రయణీయుఁడు. మనువు “న మాంస భక్షణే దోషం" అని వ్రాసిన మాట సత్యం. అప్పటికి సర్వులూ మాంసభక్షకులే కనక ఆలా వ్రాయవలసి వచ్చిందని తోస్తుంది. దానితోపాటు మఱి రెండుకూడా సమ్మతించి, వెంటనే-
"ప్రవృత్తి రేషా భూతానామ్" అని అనువదించి పిమ్మట తన అభిప్రాయాన్ని యీవిధంగా నిర్వచించాఁడు. “నివృత్తిస్తు మహాఫలా” ఆయీ తుదివాక్యం వల్ల దానినుండి తప్పుకున్నవారు ధర్మాత్ములు అని తేలింది. దీన్ని పురస్కరించుకొనే “మ్రానను రాతనుంగలదె? మాంసము ప్రాణుల మేనఁగాక" అని భారతంలో నిషేధం కనబడుతుంది. భీష్మడంతటివాఁడు దీన్ని ఖండితంగా నిషేధించలేక మనువులాగే మానడం మంచిదని వూరుకున్నాడు. కాని మొత్తం ప్రపంచంమీంద యావత్తు ఖండాలలోనూ పరిశీలిస్తే ప్రతిరోజూ యెన్నికోట్ల జీవరాసులు (కోళ్లు, మేకలు, యెడ్లు వగయిరాలు) మానవుల కుక్షిలో జీర్ణిస్తున్నా ఆయాజాతులు దినదినాభివృద్ధిగా పెరుగుతూ వుండడం చూస్తే మాంస భక్షకుల యుక్తికూడా సమంజసమేమో అనిపిస్తుంది. అంతేకాదు, బుద్దుని అభిప్రాయం ప్రకారం యావన్మందీ శాకభక్షకులే అయితే ఆయీ జంతువులు నివసించడానికిన్నీ ఆహారం సంపాదించుకోవడానికిన్నీ మఱికొన్ని ద్వీపాలను సృష్టించవలసివస్తుందేమో సృష్టికర్తకు అనిన్నీ స్థూలదృష్టులకు గోచరిస్తుంది. కానిఅట్టి అవసరమే కలిగితే 'యిచ్చామాత్రం ప్రభోస్సృష్టిః' కనక ఆ పరమదయాకరుడు అట్టి సదుపాయాన్ని చేయనే లేడా? క్షణంకూడా ఆయీ పనికి ఆయనకు పట్టదు. కనక మాంసభక్షకులు చెప్పేయుక్తి ఆపాతరమణీయమే కాని విమర్శకాని విమర్శనాసహంకాని కాదు. మాంసంతినే వారిలో బహుమంది సమ్మతిలేకుండా తినేవారుగానే వుంటారు. వారివారి గృహావరణలో యీహింస జరగకపోవడంచేత వారికి అంతగా మనస్సు చలింపదు. వేఁటలో ప్రవర్తించే జమీందార్లు వగయిరా దయాశీలురే అయినా “పిల్లికి చెలగాటం" సామెతగా వారి కది హింసగానే తోcచదు. దీని బాధముఖ్యంగా "కసాయీలకు" గోచరిస్తుందనుకోవాలి; కాని వారి కది నిత్యకృత్యంగా యేర్పడడంచేత దుఃఖ జనకం కాదనుకోవాలి. పాపం పంచుకోవలసివస్తే మాత్రం “మాంస భక్షకులకు" హింసకులతోపాటు భాగం తప్పదనే అనుకోవాలి
"చత్వారస్సమభాగినః" నాకు యింకోశంక తోస్తుంది. యేదోవొక ప్రాణికి వేఱొక ప్రాణివల్ల హింస తటస్థిస్తే బోలెఁడు పాపం వస్తుందని నిర్ణయించి దానికై ఎన్నో నరకాలు అనుభవించాలని శాస్త్రకర్తలు వ్రాశారుకదా? నేటి “డిక్టేటర్లు" కారణంగా యెన్నికోట్ల ప్రాణులో హతమవుతూ వున్నారుకదా? ఆయీ కారకులకు సరిపడ్డ నరకాలు యెన్ని కల్పాల కాలంలో సృష్టికర్త నిర్మించగలుగుతాడో పాపం!
అన్నిటికీ ఒకటే జవాబు - 'ఇచ్ఛామాత్రం ప్రభోసృష్టిః' పాపమంటూ భయపడేవానికే భయంగాని అది లేనివానికి భయమేలేదు. -
“నరకేసతి కో దోషో, మరణే సతి కిం భయమ్" వొకఁడేమో వరుసగా యేడు కఱవులు వస్తాయని భయపడుతూ వుంటే వేఱొకఁడు చూచి, వొరేఁ ఆ కఱవులలో మొదటిదానిలోనే మనం నశిస్తే తక్కిన ఆఱింటివల్ల మనకేం భయం కలుగుతుంది, అన్నాఁడని పెద్దలు చెబుతారు. అందుచేత లోకనాశకారకుల శిక్షానిర్ణయాన్ని కూర్చి భగవంతుఁడు భయపడవలసినదే గాని అనుభవించేవాళ్లు లేశమూ భయపడరు.
"కర్మణో గహనాగతిః" అన్నట్టు దేన్ని గుఱించేనా పైపైని చర్చించి వూరుకుంటే తప్ప లోలోపలికి పోయివిచారిస్తే దురవగాహంగానే కనపడుతుంది. “ఈశ్వరస్సర్వ భూతానాం హృద్దేశే౽ర్జున తిష్ఠతి" అనేమాట తోసివేయతగ్గదికాదు. ఏనుగులో వున్నట్టే దోమలోనో యింకా కింది తరగతి సూక్ష్మజంతువులోనో యీశ్వరసత్తను-
"అణోరణీయాన్ మహతో మహీయాన్" కనక వొప్పితీరాలి. నల్లికి మరణభయం వుందని దానిచేష్టలవల్ల గోచరిస్తుంది. చీమలు వగైరా సూక్ష్మజీవులలో యీభయం అన్నిటికీవున్నా నల్లిని పేర్కొనడానిక్కారణము అక్కడ బాగా గోచరిస్తుందనియ్యేవే. కర్మఠులు ఆయీ సూక్ష్మజంతువులనుకూడా బుద్ధిపూర్వకంగా చంపరు కాని అప్రయత్నంగా విధిలేక కొన్ని తమవల్ల చచ్చుట తప్పదని తద్దోష పరిహారానికి యేదో వుపాయం-
"వైశ్వదేవం” లోఁగడ వుదహరించాను. దానిచేవారు 'యదహ్నాత్కురుతుపాపం తదహ్నాత్ర్పతి ముచ్చతే' అని నరకభయవిదూరులై జీవించుచున్నారు. దీనినిబట్టి చూస్తే ఆయీ వైదికమతం యెంతపుణ్యం చేసుకున్నవాళ్లకోగాని సంఘటింపదని చెప్పనక్కరలేదు. కాని అయితే యేం లాభం. ఆయీ మతస్థులుగా జన్మించిన్నీ యే నికృష్ణులూ చేయని పనులుచేసే సంతతినిగని భ్రష్టులమగుచున్నాం గదాయని విచారించవలసి వచ్చింది. ఆయీ విపత్తు యుగదోషం కింద జమకట్టి వూరుకున్నారు ధర్మశాస్త్రకర్తలు. యుగదోషానికి అంగీకరిస్తూ కృతయుగం పుణ్యభూయిష్టమే అయినా క్వాచిత్కంగా అక్కడక్కడ "పాపాత్ములు” వున్నట్టే యీకలిలోకూడా “పుణ్యపురుషులు" వుండే వుండవచ్చునని పురాణవాక్యాలు కనపడుతూన్నాయి. యిది విషయాంతరం. ప్రస్తుతం "అహింస" దీనికి యెంతదగ్గిరలో సంచరిస్తే అంత పుణ్యజన్మ అనడంలో విప్రతిపత్తిలేదు. శాక భక్షకులకు కూడా "హింస" అనివార్యమని కొందఱంటారు. చెట్లకు, లతలకు, వీట్లకు నోరులేదుగాని "సుఖదుఃఖాలు" కలవనే పరిశీలిస్తే తోస్తుంది.
“పృథివ్యా ఓషధయః, ఓషధీభ్యోన్నం" అనడంవల్ల , భగవంతుcడు మనకు జీవనోపాధిగా యేర్పఱచిన "అన్నం" ఓషధులవల్లనే నిష్పన్నంకావాలి. అందుచేత అహింస తప్పదనుకోవాలి. అన్నీ హింసలే అయినా వాట్లలో- "తారతమ్యం" వుంటుంది. యేనుగుకూ దోమకూ భేదం పాటించక తప్పదు. “అతిసర్వత్ర వర్జయేత్" తోటకూరవంటిదే గోవూ అని వాదిస్తే లాభంలేదు. తనకు వీలున్నంతలో “అహింసాపరుఁడై" వర్తించేవాండు యేజాతివాఁడైనా ధన్యుఁడు! ధన్యుఁడు! ధన్యుఁడు!
★ ★ ★