కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/హితబోధ

                              
సీ. తనకృపారసవృష్టి దాసులతాపంబు
లణఁగించి నిగడించు ఘనుఁడెవండు
    తనదివ్యతేజంబునకు భక్తజనతమె
నిచయంబు మాయించునినుఁ డెవండు
    తనశీతలాలోకమునఁ గువలయమున
వెలయించుచల్లని వేలుపెవఁడు
    తనజగద్వ్యాపకత్వంబుమై లోకాళిఁ
బాలించు నలజగత్ప్రాణుఁడెవఁడు
    అట్టిపరమేశ్వరుండు దయాసముద్రుఁ
    డాదరాయత్తచిత్తుఁడై హర్ష మెసఁగ
    మాదువిన్నపమాలించి మఱచిపోక
    మమ్ముననిశమ్మునుభృశమ్ముమనుచుఁగాత.
                  

                          

హితబోధ




ఉ. కారణయుక్తమౌనటులు కావ్యవిమర్శన మాచరింపఁగా
    నోరువలేక కూళకవియొక్కఁడు నోరికివచ్చునట్లు దాఁ
    గారణ హీనమైనవెడకాఱు లటంచును వానిఁ బ్రేలు ని
   ష్కారణ మాత్మదోషములు చాల బయల్పడె నన్న చింతచే.

క. తనపుస్తకమే సత్కృతి | యనుకొ గుణదోషములను నారయువారిన్
   వినరానికాఱు లఱచెడి | జనకంటకు మించునట్టిజడుఁ డిలఁగలఁడే?

చ. కతిపయమిత్రసత్తములఁ గాంచి కడుం బొగడించుకొంటనే
    యతులితసత్ప్రబంధ మగు నాచెడుపొత్తక మెన్నఁడేనియు౯?
    నుతు లొకలక్షమానుమలు నోరికి వచ్చినరీతిఁ జేసిన౯
    క్షితిశునకం బొకప్పుడును సింహము గాఁగలదే గుణప్రధన్ ?
                                    ....................................
                                    అనంతి ప్రెస్ రాజమండ్రి