కందర్పకేతువిలాసము
కందర్పకేతు(కేళీ)విలాసము
తెనాలి రామకృష్ణుఁడు
దీని కథేమిటో తెలియదు. లభించిన పద్యాల్లో నాయికానాయకుల విరహం, చంద్రవర్ణన ఉన్నాయి. రామలింగఁడు ఈ కావ్యాన్ని నాదెళ్ళ చిట్టమంత్రికి అంకితమిచ్చినాఁడట.
ఉ. అక్కమలాక్షిఁ గన్గొనిన యప్పటినుండియు నేమిచెప్ప నా
కెక్కడఁ జూచినన్ మదనుఁ డెక్కడఁ జూచిన రోహిణీవిభుం
డెక్కడఁ జూచినన్ జిలుక లెక్కడఁ జూచినఁ గమ్మగాడ్పు లిం
కెక్కడ [1]వెట్టి యోర్వఁగల నీ విరహానలతాపవేదనన్.
ప్రబంధరత్నాకరము 2.95
ఉ. ఆ నలినాక్షి వేనలికి నంబుధరంబు సమంబు గామిచేఁ
దా నిరువ్రయ్యలై చనినఁ ద ద్దశఁ జూచి దయార్ద్రులై బుధుల్
దాని పదాంతరంబునను దారు వసించినవారు గావునన్
బూని తదంశమున్ సమతఁ బోల్చిరి తత్సతి దృ క్కుచంబులన్.
కవిజీవితములు
ఉ. కామిని చంద్రుఁ జూచి మదిఁ గందు సరోరుహగంధి మందిరా
రామముఁ జూచి మ్రానుపడు రాజనిభానన సారె కింశుక
స్తోమముఁ జూచి యీ కఱుకు తొయ్యలి కోయిలఁ జూచి కంటగిం
పామతలీలఁ దాల్చు మదనానలతాపవిషాదవేదనన్.
ప్రబంధరత్నాకరము 2.79
సీ. తారామనోరంజనారంభ మే దొడ్డు
శిలలు ద్రవింపంగఁజేయు ననినఁ
జాకోరహర్షయోజనకేలి యేదొడ్డు
పేర్చి యంభోధు లుబ్బించు ననినఁ
గుముదౌఘతాపోపశమకృత్య మేదొడ్డు
సృష్టి యంతయుఁ జల్లసేయు ననిన
వరనిశాకామినీవాల్లభ్య మే దొడ్డు
వర్ణింప సత్కళాపూర్ణుఁ డనినఁ
తే. దనకు సర్వజ్ఞశేఖరత్వంబు గలుగ
హితసుధాహారవితరణం బేమి దొడ్డు
అనఁగ విలసిల్లె హరిదంతహస్తిదంత
కాంతినిభకాంతిఁ జెలువారి [2]కంజవైరి.
ప్రబంధరత్నాకరము 3.198
సీ. మౌళి గెంజడల జొంపము ఫాలపట్టిక
దీండ్రించు భసితత్రిపుండకంబు
కర్ణకీలితరత్నకామాక్షియుగళంబుఁ
బలుచని నెమ్మేనిఁ బట్టుకంథ
కరముల బంగారునరకట్టుఁ గిన్నెర
హరిణశృంగంబుఁ బేరురమునందుఁ
గరమూలమున భూరి[3]తరవారి సన్నంపు
నడుమున నొడ్డియాణంబు దిద్దు
తే. [4]పిఱుఁదుపై వ్యాఘ్రచర్మకౌపీనకలన
యోగవాగలు శూలంబు నాగసరము
పొలుపు దళుకొత్తు చెట్టునఁ బుట్టినట్లు
నిరుపమాకారసిద్ధుఁ డరుగుఁదెంచె.
ప్రబంధరత్నాకరము 4.116
చ. ధరభుజగైణసింహములఁ దద్గణవేణ్యవలోకనద్వయో
దరములకోడి వారిధిపదంబులఁ బుట్టలఁ బూరులన్ గుహాం
తరములఁ బూన నిక్కఁ దిన డాఁగ స్రవింపఁగ నూర్పులూర్ప స
త్వరముగ నేఁగి నీడఁ గని తత్తఱ మందఁగఁ జేసి తౌ చెలీ.
ఆంధ్రకవితరంగిణి (సంపుటం 8; పుట 39)
మ. లలితాస్యాంబురుహంబు నీలకచరోలంబంబు నేత్రాసితో
త్పల ముచ్చైఃస్తనకోక మోష్ఠవిలసద్బంధూక ముద్యత్కటీ
పులినం బుద్గతచిత్తజాతరసవాఃపూరంబు ప్రాణేశ్వరీ
జలజావాసము సొచ్చియాడక మనోజాతానలం బాఱునే.
ప్రబంధరత్నాకరము 2.96
ఉ. వారిజ! మీన! కోక! యళివర్గ! సితచ్ఛద! సల్లతావనీ!
మీ రుచిరాస్య మీ నయన మీ కుచ మీ యలకాలి మీ గతిన్
మీ రమణాంగి మత్ప్రియ నమేయగతిన్ విరహాతురాననన్
మీరును మీరు మీరు మఱి మీరును మీరును మీరుఁ గానరే.
ప్రబంధరత్నాకరము 2.97, ప్రబంధరత్నావళి 430