కంకణము/ముక్తాసక్తితోఁ గంకణము రామునిఁ బ్రార్థించుట

ముక్తాసక్తితోఁ గంకణము రామునిఁ బ్రార్థించుట


శా. కారాకూరము, నక్రవిక్రమ, ముదగ్రగ్రాహచక్రమ్ము, దు
   ర్వారోత్తుంగతరంగవారమగు పారావారమున్ సంతత
   శ్రీరామక్షితినాథపాదయుగళీసేవారతిన్, యోగి సం
   సారంబుందరియించుచందమునమున్ సామీరిలంఘింపఁడే.

ఉ. చంచలకన్నఁ జంచలము సర్వవిధమ్ముల మర్కటంబు; క
   ల్పించె నయారె దాని కమలీమసయోగమహత్త్వసిద్ధి, దాఁ
   టించె మహాసముద్రము! ఘటించె జగజ్జనపూజనమ్ము! నే
   మంచు నుతింపవచ్చు మహిమాఢ్యము శ్రీరఘురామ నామమున్.

ఉ. రామ! రమాభిరామ! రఘురామ! యశోధనరామ! జానకీ
   రామ! పయోజమిత్రకులరంజనరామ! యయోధ్యరామ! సు
   త్రామముఖాఖిలామరవితాసన తాంఘ్రీసరోజరామ! శ్రీ
   రామ! సదాశ్రిత ప్రకరరక్షకరామ! నమోనమోనమ:.

ఉ. అప్పులుదీర వెన్నటికి నప్పులుదీరక పుట్టుచావులున్
   దప్పవు పుట్టుచావులటు తప్పనిచోట విముక్తిగల్గ దో
   యొప్పులకుప్ప! ఓయినకులోద్వహ! ఓరఘురామచంద్ర! ఈ
   యప్పులకుప్పనుండి యెటులైన ననుం దరిఁ జేర్చి ప్రోవవే.

శా. ధూతప్రాక్కృతపాతకమ్ములు, జగత్పూతంబులున్ మంగళ
   వ్రాతమ్ముల్ భవదీయచారుచరణాబ్జాతమ్ము లాసించినా
   నేతద్భూతమయాకృతిన్ విడిచి నేనెంతేని ముక్తాకృతిన్
   జేత:ప్రీతి వహింపఁజేయఁగదవే సీతామనోవల్లభా!

ఉ. భక్తజనావనాంకమును భానుకులాభరణంబ! యిట్టిచో
   రిక్త మొనర్పఁ బోక ప్రసరింపఁగఁ జేయఁగదయ్య, మౌక్తికా
   సక్తిని నున్న నాపయిని జల్లని నీకనుదోయి వెంబడిన్
   బ్రాక్తనపాపకర్మ పరిపాకవిపాక విలోకలోకముల్.

ఉ. భంగములం దగుల్కొను నవస్థయు, వక్రతనేగువారి దు
   స్సంగతినొందుదుస్థ్సితియుఁమర్జంచలజీవనయాత్రయున్, సతం
   బుం గలబుద్బుదాంగమునుబోవిడి దివ్యరుచిప్రయుక్తము
   క్తాంగము నొందఁ జేయుము దయానిధి! రామ! రఘు ప్రభూత్తమా!