ఓ భావి భారత భాగ్యవిధాతలారా
ఇది పెళ్ళి చేసి చూడు (1952) సినిమా కోసం పింగళి నాగేంద్రరావు రచించిన లలితగీతం.
ఓ భావి భారత భాగ్యవిధాతలారా
యువతీ యువకులారా
స్వానుభవమున చాటు నా సందేశమిదే
పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకొని
చల్లగ కాలం గడపాలోయ్
ఎల్లరి సుఖము చూడాలోయ్
మీరెల్లరు హాయిగ ఉండాలోయ్
కట్నాల మోజులో మన జీవితాలనే బలిచేసి
కాపురములు కూల్చు ఘనులకు శాస్తి కాగా
పట్నాల, పల్లెల దేశ దేశాల
మన పేరు చెప్పుకుని ప్రజలు సుఖపడగా
ఇంటా బయటా జంట కవులవలె అంటుకు తిరగాలోయ్
కంటిపాపలై దంపతులెపుడు చంటిపాపలను సాకాలోయ్ || పెళ్ళి చేసుకొని ||
నవభావములా నవరాగములా నవజీవనమే నడపాలోయ్
భావ కవులవలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్ || పెళ్ళి చేసుకొని ||