ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 40
అధ్యాయం : 40
భారతదేశానికి తిరిగి రాక
కృతజ్ఞతాపూర్వకంగా భారతదేశపు భవ్య వాయువును మళ్ళీ శ్వాసిస్తున్నాను. మా ఓడ ‘రాజపుటానా,’ 1935 ఆగస్టు 22 తేదీనాడు విశాలమైన బొంబాయిరేవుకు చేరి నిలిచింది. ఓడ దిగిన, మొదటి రోజు సైతం, నిర్విరామ కార్యకలాపాలతో నిండబోయే పై సంవత్సరం అనుభవాన్ని ముందే రుచి చూపించింది. పూలమాలలతోనూ స్వాగతాభినందనలతోనూ రేవు దగ్గర కూడారు; మరి కాసేపట్లో తాజనుహల్ హోటల్లో మా గదికి, పత్రికా విలేఖరులూ ఫొటోగ్రాఫర్లూ ప్రవాహంలా వచ్చారు.
బొంబాయినగరం నాకు కొత్త. పాశ్చాత్యదేశాలనుంచి వచ్చిన అనేక నవకల్పనలతో, శక్తిమంతంగా ఆధునికం అయిన నగరంలా కనిపించింది. విశాల వీధుల వెంబడి వరసగా తాటిచెట్లు నిలిచి ఉన్నాయి; బ్రహ్మాండమైన ప్రభుత్వ భవనాలు ఆసక్తి కలిగించడంలో పురాతన దేవాలయాలతో పోటీ పడుతున్నాయి. దృశ్యావలోకనానికి వినియోగించింది తక్కువ కాలమే అయినా, మా గురుదేవుల్నీ ఇతర ఆత్మీయుల్నీ చూడాలన్న తహతహతో నాలో ఆదుర్దా కలిగింది. ఫోర్డు కారును సామాను రైలు పెట్టెలోకి ఎక్కించి, త్వరలోనే మేము ముగ్గురం కలకత్తా వేపు పోయే రైలులో వడివడిగా సాగిపోయాం.[1] హౌరా స్టేషన్‌లోకి మేము చేరేసరికి మమ్మల్ని అభినందించడానికి జనం విరివిగా గుమిగూడినందువల్ల, కొంత సేపటిదాకా మేము బండిలోంచి దిగడమే సాధ్యం కాలేదు. కాశింబజారు యువ మహారాజు, మా తమ్ముడు విష్ణు స్వాగత సంఘానికి నాయకత్వం వహించారు. మా బృందానికి స్వాగతం ఇవ్వడంలో వారు చూపించిన ఆప్యాయత, ఘనత నన్ను ముగ్ధుణ్ణి చేశాయి.
కార్లూ మోటారు సైకిళ్ళూ బారుగా ముందు సాగుతూ ఉండగా, మృదంగాలూ శంఖాలూ ఆనందధ్వానాలు కావిస్తూ ఉండగా మిస్ బ్లెట్ష్, శ్రీరైట్, నేనూ ఆపాదమస్తకం పూలదండలతో నిండిపోయి, మెల్లగా మా నాన్నగారి ఇంటికి సాగాం.
వృద్ధులైన మా నాన్నగారు, చనిపోయినవాడు మళ్ళీ బతికి వచ్చినప్పుడు హత్తుకునేటంత గాఢంగా నన్ను కౌగలించుకున్నారు; ఆనందంతో నోట మాటలేకుండా ఒకరినొకరం చూసుకుంటూ చాలాసేపు అలాగే ఉండిపోయాం. తమ్ముళ్ళు, అక్కచెల్లెళ్ళు, మామయ్యలు, అత్తలు, బావలు, విద్యార్థులు, చిరకాల మిత్రులు నా చుట్టూ మూగేశారు; మాలో చెమ్మగిలని కన్ను ఒక్కటీ లేదు. నా జ్ఞాపకాల పురావస్తు భండారంలోకి చేరిపోయిన, ఆ ప్రేమపూర్వక పునస్సమాగమ దృశ్యం మరవరానిదై నా గుండెలో స్పష్టంగా నిలిచిపోతుంది. శ్రీయుక్తేశ్వర్‌గారిని కలుసుకున్న సందర్భం వర్ణించడానికి నాకు మాటలు చాలవు; నా కార్యదర్శి చేసిన కింది వర్ణనతోనే సరిపెట్టుకుందాం:
“ఈ రోజు, గొప్ప ఉత్కంఠతో నిండిపోయి, యోగానందగారిని కారులో కలకత్తా నుంచి శ్రీరాంపూర్ తీసుకువెళ్ళాను,” అని రాసుకున్నాడు. శ్రీరైట్, తన ప్రయాణం డైరీలో.
“వింతవింత దుకాణాలు దాటి ముందుకు వెళ్ళాం. వాటిలో ఒకటి, యోగానందగారు కాలేజీలో చదివే రోజుల్లో, ఆయనకు ఇష్టమైన ఫలహారశాల. చివరికి, గోడల మధ్యగా సాగిన ఒక సన్న సందులోకి ప్రవేశించాం. చటుక్కున ఎడమవేపుకి ఒక్క మలుపు; అక్కడ మా కెదురుగా, సాదాగా ఉన్న రెండతస్తుల ఆశ్రమ భవనం; దాని బాల్కనీ, పై అంతస్తు నుంచి ముందుకు చొచ్చుకు వచ్చింది. చుట్టూ ప్రశాంతమైన ఏకాంతం.
“గంభీరమైన నమ్రతతో, యోగానందగారి వెనకనే నడిచి ఆశ్రమం గోడల మధ్యనున్న ముంగిట్లో అడుగు పెట్టాను. గుండెలు దడదడా కొట్టుకుంటూ ఉండగా, పాత సిమ్మెంటు సీడీలు ఎక్కడం ప్రారంభించాం. ఇంతవరకు వేలాది సత్యాన్వేషకులు వాటిమీదగా నడిచి ఉంటారనడంలో సందేహం లేదు. మేము అడుగుతీసి అడుగు వేస్తూంటే మాలో ఉత్కంఠ పెరుగుతూ వచ్చింది. మా కెదురుగా మెట్లపైన, ఋషిసహజమైన ఉదాత్తగంభీర భంగిమలో నిలబడి, ప్రశాంతంగా దర్శనమిచ్చారు, మహామహులు స్వామి శ్రీయుక్తేశ్వర్‌గారు.”
“వారి పవిత్ర సన్నిధిలో నిలిచే భాగ్యం కలిగినందుకు ధన్యుణ్ణి అయానన్న అనుభూతి కలుగుతూ ఉండగా నా గుండె ఎగిసి పడింది. యోగానందగారు మోకాళ్ళ మీదికి వాలి, తల వంచి సర్వాత్మనా కృతజ్ఞతాంజలులు అర్పిస్తూ చేతులతో గురుదేవుల పాదాలు స్పృశించి, ఆ తరవాత వినయాంజలిగా తమ నుదుటికి తాకిస్తూ ఉండగా, ఉత్సుకతతో చూస్తున్న నా చూపును అలుక్కుపోయేటట్టు చేశాయి, కన్నీళ్ళు. తరవాత ఆయన లేచారు; అప్పుడు శ్రీయుక్తేశ్వర్‌గారు ఆయన రెండు భుజాలూ హత్తుకొని కౌగలించుకున్నారు.
“మొదట్లో మాటలు పెకలలేదు; అయినా, ఆత్మకున్న మౌనభాషలో అత్యంత గాఢమైన అనుభూతి అభివ్యక్తమయింది. ఆత్మపునస్స మాగమంతో వారి కళ్ళు ఎలా మిలమిల మెరిశాయి. వాటిలో ఎంత ఆప్యాయత పెల్లుబికింది! ప్రశాంతమైన ఆ గదిలో స్నిగ్ధతా స్పందన ఒకటి వ్యాపించింది; ఆ సన్నివేశాన్ని అకస్మాత్తుగా దీప్తిమంతం చెయ్యడానికి మబ్బుల్ని తప్పించేసుకున్నాడు సూర్యుడు.
“నేను ఆ పరమ గురుదేవుల ముందు మోకరిల్లి, నా అవ్యక్త ప్రేమా ధన్యవాదాలు అర్పించుకున్నాను; కాలగతిలోనూ సేవలోనూ రాటుదేరిన ఆయన పాదాల్ని తాకి దీవెనలందుకున్నాను. అప్పుడు లేచి, అంతఃపరీక్షతో రగులుతున్న అందమైన రెండు లోతయిన కళ్ళను ఎదురుగా చూశాను; అయినా అవి ఆనందంతో వెలుగుతున్నాయి. వారు కూర్చునే గదిలోకి ప్రవేశించాం. అందులో ఒక పక్క అంతా, మొదట వీధిలోంచి కనిపించిన బాల్కనీలోకి తెరిపిగా ఉంది. పరమ గురువులు గచ్చునేలమీద పరిచిఉన్న పరుపుమీద కూర్చుని ఒక పాత బాలీసుమీద ఆనుకొన్నారు. యోగానందగారూ నేనూ పరమ గురువుల పాదాల దగ్గర, తుంగ చాపమీద కూర్చున్నాం, మేము సుఖంగా కూర్చోడానికి చేర్లబడ్డానికి నారింజవన్నె దిండ్లు ఉన్నాయి.
“స్వాములవార్లిద్దరూ మాట్లాడుకునే బెంగాలీ సంభాషణ అర్థం చేసుకోడానికి చాలా చాలా ప్రయత్నించాను (ఎంచేతంటే, స్వామీజీ మహారాజ్ - ఆ పరమగురువులను ఇతరులు అలాగే పిలుస్తారు - ఇంగ్లీషు మాట్లాడగలవారూ, తరచు మాట్లాడేవారూ అయినప్పటికీ కూడా, వారిద్దరూ కలిశారంటే అక్కడ ఇంగ్లీషు శూన్యమూ వ్యర్థమూ అయిపోతుందని కనిపెట్టాను). అయినా, స్వామిజీ మహారాజ్ ఋషిత్వాన్ని హృదయాహ్లాదకరమైన చిరునవ్వుద్వారా, “మిలమిలలాడే కళ్ళద్వారా సులువుగానే దర్శించాను. సరదాకు అన్నా, గంభీరంగా అన్నా, ఆయన మాటల్లో చటుక్కున గోచరించే లక్షణమేమిటంటే, చెప్పినదాంట్లో సునిశ్చితమైన అధికారికత - ఇది ఋషి లక్షణం; తమకు దేవుడు తెలుసు కనక, తమకు తెలుసని తెలిసినవారి లక్షణం. వారి మహత్తరమైన జ్ఞానం, కార్యదీక్ష , నిశ్చయాత్మకత ప్రతిదాంట్లోనూ కళ్ళకు కడుతున్నాయి.
“అప్పుడప్పుడు ఆయన్ని పూజ్యభావంతో పరిశీలిస్తూ నేను గమనించింది ఏమిటంటే... ఆయనది భారీ విగ్రహం, కసరత్తు చేసినట్టున్న శరీరం; సన్యాసంలో ఎదురయే పరీక్షలకల్లా త్యాగాలవల్లా రాటుదేరిన దది. ఆయన దేహభంగిమ రాజసం ఉట్టిపడేలా ఉంటుంది. ఊర్ధ్వలోకాల్ని అన్వేషిస్తూ ఉన్నట్టు కచ్చితంగా ఏటవాలుగా ఉన్న ఆయన నుదురు, ఆయన దివ్యముఖమండలంలోకల్లా ప్రముఖంగా కనిపిస్తుంది. ఆయనకు కొంచెం పెద్ద ముక్కే ఉంది; ఏమీ తోచనప్పుడు దాన్ని చిల్ల పిల్లవాడిలా వేళ్ళలో తాటిస్తూ, ఇటూ అటూ ఆడిస్తూ దాంతో ఆడుకుంటూ ఉంటారు. శక్తిమంతాలైన ఆయన నల్లటి కళ్ళ చుట్టూ ఆకాశ నీలం వన్నె వలయం ఏర్పడి ఉంది. మధ్యలో పాపిడి తీసి ఉన్న ఆయన జుట్టు, నుదుటి చుట్టూ తెల్లగానూ తక్కిన చోట్ల, నిగనిగలాడే బంగారు వన్నె నలుపు వన్నెనూ పోలిన చారలు ఏర్పడి, చివర భుజాల దగ్గర కొసలు ఉంగరాలు తిరిగి ఉన్నాయి. ఆయన గడ్డం, మీసం స్వతహానే కొద్దిగా ఉండవచ్చు! లేదా పలచబడిపోయి ఉండవచ్చు. అయినా ఆయన మొక్కట్లకు అవి అందం చేకూరుస్తున్నాయి; పైగా, ఆయన శీలం మాదిరిగానే అవి ఒత్తుగానూ పలచగానూ కూడా ఉన్నాయి.”
“కులాసాగా నోటి నిండా నవ్వే అలవాటు ఆయన కుంది; ఆ నవ్వు కూడా ఆయన రొమ్ములో లోతునుంచి వస్తుంది; దాంతో ఆయన, ఒళ్ళంతా ఊగిపోయేటట్టు విరగబడి నవ్వుతారు - అందులో ఎంతో ఉల్లాసమూ నిజాయితీ సృష్టమవుతాయి. ఆయన ముఖమూ విగ్రహమూ కూడా, కండలు తిరిగిన ఆయన చేతుల్లాగే, శక్తిమంతమైన వన్న సంగతి కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. ఆయన నిటారుగా, ఠీవిగా నడుస్తారు.
“ఆయన నిరాడంబరంగా, మామూలు పంచె కట్టుకుని చొక్కా వేసుకున్నారు. ఒకప్పుడు ఆ రెండూ కాషాయవన్నె అద్దినవే కాని, ఇప్పుడవి వెలిసిపోయిన నారింజవన్నెలోకి దిగాయి.”
“చుట్టూ పరకాయించి చూస్తూ, దాదాపు శిథిలావస్థలో ఉన్న ఆయన గది, తన యజమానికి భౌతిక సుఖాలపట్ల ఉన్న అనాసక్తిని సూచిస్తున్నట్టు గమనించాను. పొడవాటి ఆ గదికున్న తెల్ల గోడలు వాతావరణ ప్రభావానికి గురిఅయి, వెలిసిపోతున్న నీలిపూత చారల్ని కనబరుస్తున్నాయి. గదిలో ఒక చివర లాహిరీ మహాశయుల బొమ్మ ఒకటి వేలాడుతోంది. నిరాడంబరమైన భక్తిని ప్రదర్శించే విధంగా, దానికి ఒక పూలదండ వేసి ఉంది. అక్కడ యోగానందగారి పాత ఫోటో కూడా ఒకటి ఉంది; ఆయన మొదట బోస్టస్ వచ్చినప్పుడు, కాంగ్రెస్ ఆఫ్ రెలిజియన్స్ కు వచ్చిన ఇతర ప్రతినిధులతో కలిసి నిలబడి ఉన్న ఫోటో అది.”
“పాతకొత్తల మేలు కలయిక ఒకటి ఇక్కడ గమనించాను. కొవ్వొత్తి దీపాల గాజు చాందినీ ఒకటీ గోడమీద కాలెండరు ఒకటీ; వాడకపోవడంపల్ల ఆ చాందినీ నిండా సాలీళ్ళు గూళ్ళు కట్టేశాయి, ఇక్కడ గోడమీదున్నది అందమైన సరికొత్త కాలెండరు. గది అంతా శాంతిసౌఖ్యాల సుగంధాన్ని వెదజల్లుతోంది. బాల్కనీకి అవతల, మౌనంగా నిలబడి రక్షణ ఇస్తున్నట్టున్న పొడుగాటి కొబ్బరి చెట్లను చూశాను.”
“అక్కడ ఆసక్తికరమైన విషయ మేమిటంటే - పరమగురువులు ఒక్కసారి ఇలా చప్పట్లు చరిస్తే చాలు, ఆయన అది పూర్తి చేసే లోగానే, ఒక బాలశిష్యుడు చటుక్కున వచ్చి ఆయనకు కావలసింది కనుక్కునేవాడు. అక్కడి కుర్రవాళ్ళలో ప్రఫుల్ల[2] అనే సన్నటి కుర్రవాడు నన్ను బాగా ఆకర్షించాడు; భుజాల మీదికి వేలాడే నల్లటి జుట్టూ, గుచ్చిగుచ్చి చూసే కాంతిమంతమైన రెండు కళ్ళూ, దివ్యమైన దరహాసమూ అతనివి. అతను చిరునవ్వు నవ్వినప్పుడు, కళ్ళు మెరుస్తూ, మూతి చివరలు పైకి లేస్తుంటే, సంజె వెలుగులో పొడుస్తున్న చుక్కలూ నెలవంకా లాగ ఉంటాయి.”
“తమ ‘శిష్యుడు’ తిరిగి వచ్చిన సందర్భంగా స్వామి శ్రీయుక్తేశ్వరులకు కలిగిన ఆనందం సహజంగా గాఢమైనది (తమ ‘శిష్యుడి శిష్యు’ణ్ణి అయిన నా గురించి కూడా ఆయన కొంతమట్టుకు ఆసక్తి చూపిస్తున్నట్టు కనబడింది). అయినప్పటికీ, పరమగురువుల స్వభావంలో జ్ఞాన విషయానికున్న ప్రాబల్యం, అనుభూతిని బాహ్యంగా వ్యక్తీకరించకుండా ఆటంకపరుస్తుంది.”
“యోగానందగారు ఆయనకు కొన్ని కానుకలు సమర్పించారు; శిష్యుడు తన గురువు దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు అలా కానుకలు సమర్పించడం ఆచారం కనక. తరవాత కొంతసేపటికి మేము భోజనాలకు కూర్చున్నాం; చక్కగా వండిన సాదా భోజన మది. వంటకాలన్నీ కూరగాయలతో అన్నంతోనూ తయారయినవే. నేను భారతీయాచారాలు కొన్ని పాటిస్తున్నందుకు శ్రీయుక్తేశ్వర్‌గారు ఎంతో ముచ్చటపడ్డారు; మాట వరసకు, ‘చేత్తో తినడం.’ ”
“కొన్ని గంటల సేపు బెంగాలీ భాషలో, సంభాషణలు సాగి, స్నిగ్ధమైన చిరునవ్వులూ ప్రసన్నమైన చూపులూ ప్రసరించిన తరవాత, మేము ఆయన పాదాల ముందు వాలి, ప్రణామం[3]తో సెలవు తీసుకొన్నాం; ఆ పవిత్ర సమాగమం తాలూకు చిరస్మరణీయమైన అనుభూతితో కలకత్తాకు బయలుదేరాం. నేను ముఖ్యంగా, పరమగురువుల గురించిన బాహ్య విషయవర్ణనలే చేసినప్పటికీ, ఆయన ఆధ్యాత్మిక మహిమ నా కెప్పుడూ స్పృహలోనే ఉంది. వారి శక్తి నాకు అనుభూతమయింది; ఆ అనుభూతిని దివ్యమయిన ఆశీస్సుగా ఎప్పటికీ నిలుపుకొంటాను.”
అమెరికానుంచి, యూరప్‌నుంచి, పాలస్తీనానుంచి నేను శ్రీయుక్తేశ్వర్‌గారి కోసం చాలా కానుకలు తెచ్చాను. వాటిని ఆయన చిరునవ్వుతో స్వీకరించారు; కాని ఏమీ వ్యాఖ్యానించలేదు. నా కోసమని నేను జర్మనీలో గొడుగూ చేతికర్రా కలిసిన బెత్తం ఒకటి కొనుక్కున్నాను. ఇండియాలో, ఆ బెత్తం గురుదేవులకు ఇవ్వాలని నిశ్చయించుకున్నాను.
“నిజంగా ఈ కానుకను మెచ్చుకుంటాను” అంటూ గురుదేవులు, ఆనవాయతీలేని ఈ వ్యాఖ్య చేస్తూ, ఆప్యాయమైన అవగాహనతో కళ్ళు నా వేపు తిప్పారు. నే నిచ్చిన బహుమతులన్నిటిలోకీ, సందర్శకులకు చూపించడానికి ఆయన ఎన్నుకున్నది ఈ చేతికర్ర.
“గురుదేవా, కూర్చునే గదికోసం కొత్త తివాసీ ఒకటి తెప్పించడానికి నాకు అనుమతి ఇయ్యండి.” శ్రీయుక్తేశ్వర్‌గారి పులిచర్మం, చిరుగుల కంబడి మీద పరిచి ఉన్న సంగతి అంతకుముందు గమనించాను.
“నీకంత సరదాగా ఉంటే అలాగే కానియ్యి.” గురుదేవుల గొంతులో ఉత్సాహమేమీ లేదు, “చూడు, నా పులిచర్మం చక్కగా, శుభ్రంగా ఉంది; నా చిన్న రాజ్యంలో నేనే రాజును. దీనికి అవతలున్నది, బాహ్య విషయాల మీద మట్టుకే ఆసక్తి ఉన్న విశాల ప్రపంచం.”
ఆయన ఈ మాటలు అంటూంటే, ఏళ్ళు వెనక్కి దొర్లిపోయినట్టనిపించింది; చీవాట్ల చిచ్చుల కొలిమిలో రాజూ స్వర్ణశుద్ధి జరిగే బాల శిష్యుణ్ణి అయిపోయాను మళ్ళీ.
శ్రీరాంపూర్‌నుంచి, కలకత్తానుంచి బయట పడగలిగిన వెంటనే నేను, శ్రీ రైట్‌తో కలసి రాంచీకి బయలుదేరాను. అక్కడ ఏం స్వాగతం! ఏం ఆనందోత్సాహం! నేను లేని ఈ పదిహేనేళ్ళలో విద్యాలయ పతాకాన్ని ఉవ్వెత్తున నిలిపి ఉంచిన, నిస్స్వార్థ బుద్ధిగల ఉపాధ్యాయుల్ని కావలించుకుంటూ ఉంటే, నా కళ్ళలో నీళ్ళు నిలిచాయి. అక్కడి ఆశ్రమవాసి విద్యార్థుల్లోనూ పగటి విద్యార్థుల్లోనూ ఆనందోజ్జ్వలమైన ముఖాలూ ప్రసన్నమైన చిరునవ్వులూ చూస్తుంటే, జాగ్రత్తగా ఆ ఉపాధ్యాయు లిచ్చిన విద్యాలయశిక్షణకూ యోగశిక్షణకూ ఉన్న విలువకు సమృద్ధిగా దాఖలా కనిపించింది.
అయినా, దురదృష్టవశాత్తు, రాంచీ సంస్థ దుర్భరమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. రాచఫాయీకి తగ్గ విరాళాలెన్నో ఇచ్చిన కాశింబజార్ మహారాజు - సర్ మణీంద్రచంద్ర నందిగారు గతించారు; వారిచ్చిన కాశింబజార్ భవనాన్నే ఇప్పుడు కేంద్ర విద్యాలయ భవనంగా మార్చడం జరిగింది. ప్రజాదరణ తగినంతగా లేకపోవడంవల్ల, విద్యాలయంలో ఉచితంగా, ఉదారంగా కల్పించే వసతులు అనేకం తీవ్రంగా దెబ్బతిన్నాయి.
నేను అమెరికాలో ఉన్న అన్నేళ్ళూ, అక్కడి వ్యవహార జ్ఞానమూ అడ్డంకు లెదురై నప్పుడు చూపవలసిన మొక్కవోని కార్యదీక్షా నేర్చుకోకుండా ఉండలేదు. క్లిష్ట సమస్యలతో కుస్తీపడుతూ రాంచీలో ఒకవారం రోజులు ఉండిపోయాను. తరవాత కలకత్తాలో ప్రముఖ నాయకులతోనూ విద్యావేత్తలతోనూ ఇంటర్వ్యూలు జరిగాయి. యువకుడైన కాశింబజారు మహారాజుతో చాలా సేపు మాట్లాడాను. ఆర్థిక సహాయంకోసం నాన్న గారిని అర్థించాను. ఇక చూడండి! కదలబారుతున్న రాంచీ విద్యాలయం పునాదులు చక్కబడ్డం మొదలయింది. సరయిన సమయంలో, మా అమెరికా విద్యార్థుల నుంచి కూడా విరాళాలు వచ్చాయి.
నేను భారతదేశానికి వచ్చిన కొన్ని నెల్లలోనే, రాంచీ విద్యాలయం చట్టబద్ధంగా నమోదు కావడం చూసి ఆనందించాను. చిరస్థాయిగా ఒక యోగవిద్యాకేంద్రాన్ని నెలకొల్పాలన్న నా జీవిత స్వప్నం సఫల మయింది. ఆ మహదాశయమే నన్ను, 1917 లో ఏడుగురు విద్యార్థులతో చిన్నగా మొదలుపెట్టడానికి పురికొల్పింది.
యోగదా సత్సంగ బ్రహ్మచర్య విద్యాలయం అన్న ఈ బడి, ప్రాథమిక భాషాబోధన స్థాయిలోనూ ఉన్నత పాఠశాలా విషయస్థాయిలోనూ జరిగే తరగతులు ఆరుబయట నడుపుతుంది. ఆశ్రమవాసి విద్యార్థులూ పగటి విద్యార్థులూ కూడా ఏదో ఒక రకం వృత్తివిద్యా శిక్షణ పొందుతారు.
స్వయంనిర్ణయాధికారం గల సంఘాల ద్వారా, విద్యార్థులే తమ కార్యకలాపాల్ని క్రమబద్ధం చేసుకుంటారు. మాస్టరును బోల్తా కొట్టించడ మంటే సరదాపడే పిల్లకాయలు, తమతోటి విద్యార్థులు పెట్టే కట్టుబాట్ల నయితే సంతోషంగా అంగీకరిస్తారన్న సంగతి నేను, నా ఉపాధ్యాయ వృత్తిలో చాలా తొలిరోజుల్లోనే కనిపెట్టాను. ఎన్నడూ ఆదర్శ విద్యార్థిని కాని నేను, కుర్రకారు కూతలకూ వాళ్ళ చిక్కులకూ అన్నిటికీ వెంటనే సానుభూతి చూపిస్తాను.
ఆటల్నీ పోటీల్నీ ప్రోత్సహించడం జరిగింది; హాకీ, ఫుట్‌బాల్ ఆటల అభ్యాసంతో మైదానాలు దద్దరిల్లుతూ ఉంటాయి. రాంచీ విద్యార్థులు ఆటల పోటీల్లో తరచుగా కప్పులు సంపాయిస్తూ ఉంటారు. సంకల్ప శక్తి ద్వారా – అంటే, ప్రాణశక్తిని ఒంట్లో ఏ భాగానికయినా సరే మానసికంగా పంపడం ద్వారా – కండరాలకు మళ్ళీ సత్తువ చేకూర్చే “యోగదా” వ్యాయామ పద్ధతిని కుర్రవాళ్ళకు నేర్పుతారు. వాళ్ళు ఆసనాలు, కత్తిసామూ, కర్రసామూ, జుజిట్సు కూడా నేర్చుకుంటారు. ప్రథమ చికిత్సలో శిక్షణ పొందిన రాంచీ విద్యార్థులు, తమ రాష్ట్రంలో వరద, కరువు వంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఎంతో సేవచేసి మెప్పు పొందారు. కుర్రవాళ్ళు తోటలో పనిచేసి చాలా కూరగాయలు పండిస్తారు.
రాష్ట్రంలో ఉన్న కోల్, సంతాల్, ముండా జాతులనే ఆదిమ గిరిజనుల తెగలవారికి ప్రాథమిక విద్యావిషయాలు బోధిస్తారు. దగ్గరి పల్లెల్లో ఆడపిల్లలకు మాత్రమే తరగతులు నడుపుతారు.
రాంచీ విద్యాలయం విశిష్ట లక్షణం క్రియాయోగ దీక్ష ఇవ్వడం. కుర్రవాళ్ళు ప్రతిరోజూ తమ ఆధ్యాత్మిక అభ్యాసాలు సాధనచేస్తూ ఉంటారు. గీతా పారాయణ చేస్తారు; నిరాడంబరత, స్వార్థత్యాగం, గౌరవం, సత్యం అన్న గుణాల్ని ఉపదేశం ద్వారానే కాకుండా ఆచరించి చూపించడమనే ఆదర్శం ద్వారా కూడా బోధించడం జరుగుతున్నది. దుఃఖాన్ని కలిగించేదాన్ని చెడుగానూ నిజమైన సుఖాన్ని ఇచ్చే పనులే మంచిగాను వాళ్ళకు నిర్దేశించడం జరుగుతుంది. చెడును విషం కలిపిన తేనెతో పోల్చవచ్చు; అది మనకు మోహం పుట్టిస్తుంది, కాని అందులో మృత్యువు పొంచి ఉంది.
ధారణ ప్రక్రియలు, శరీరానికి మనస్సుకూ ఉండే అశాంతిని జయించడంలో అద్భుతమైన ఫలితాలు సాధించాయి. కంటికి ఇంపు కలిగించే రూపురేఖలు గల తొమ్మిది పదేళ్ళ కుర్రవాడొకడు, నిశ్చల మన స్కుడై, రెప్పలార్పకుండా జ్ఞాననేత్రం వేపు చూపు సారించి, గంటకు పైగా అలాగే నిలిపి కూర్చుని ఉండడం రాంచీలో వింతేమీ కాదు.
పండ్ల తోటలో ఒక శివాలయ ముంది. పూజ్యపాదులైన పరమ గురువులు లాహిరీ మహాశయుల విగ్రహం ఒకటి అక్కడ ఉంది. నిత్య ప్రార్థనలూ పవిత్ర గ్రంథబోధన తరగతులూ తోటలో మామిడిచెట్ల గుబురుల నీడన జరుగుతూ ఉంటాయి.
రాంచీ ఎస్టేట్‌లో ఉన్న యోగదా సత్సంగ సేవాశ్రమం భారత దేశంలోని వేలాదిమంది బీదవాళ్ళకు ఉచిత వైద్యసహాయం, శస్త్ర చికిత్సా సదుపాయం చేస్తూంటుంది.
రాంచీ సముద్ర మట్టానికి 2,000 అడుగుల ఎత్తున ఉంది. వాతావరణం మందంగా, సమశీతోష్ణంగా ఉంటుంది. డెబ్భై బిగాల భూమిలో దేశమంతటిలోకి చక్కనిదని చెప్పదగ్గ పండ్లతోట కూడా ఒకటి ఉంది; అందులో ఐదువందల ఫలవృక్షాలున్నాయి - మామిడి, ఖర్జూరం, జామ, లీచీ, పనస.
రాంచీ గ్రంథాలయంలో అనేక పత్రికలూ, ఇంగ్లీషూ బెంగాలీ భాషల్లో రాసిన వేలకొద్దీ గ్రంథాలూ ఉన్నాయి; తూర్పు, పడమటి దేశాల వాళ్ళు విరాళంగా ఇచ్చిన వవి. ప్రపంచ పవిత్ర గ్రంథాల సేకరణ గ్రంథరాశి కూడా అక్కడ ఉంది. పురాతత్త్వ, భూవిజ్ఞాన, మానవశాస్త్ర సంబంధమైన ప్రాముఖ్యం గల అమూల్య, శిలల్ని చక్కగా వర్గీకరించి అమర్చి పెట్టిన పురాణ ప్రదర్శనశాల (మ్యూజియం) ఒకటి ఉంది; వాటిలో చాలామట్టుకు, వైవిధ్య సమృద్ధమైన ఈశ్వరుడి భూమి మీద నేను జరిపిన సంచారాల్లో సేకరించినవే.[4] రాంచీలో మాదిరిగా ఆశ్రమవాస, యోగసాధన అవకాశాలు గల బ్రాంచి హైస్కూళ్ళు స్థాపించడం జరిగింది; అవి ఇప్పుడు బాగా వర్ధిల్లుతున్నాయి. అవి ఏవంటే: మగపిల్లల కోసం లఖన్‌పూర్‌లో ఉన్న ‘యోగదా సత్సంగ విద్యాపీఠం,’ ఇస్మాలీ ఛక్‌లో ఉన్న ‘యోగ విద్యాలయం,’ ఆశ్రమం – ఇవి పశ్చిమ బెంగాల్లో పురులియా, మిడ్నపూర్ జిల్లాల్లో ఉన్నాయి.[5]
1938 లో దక్షిణేశ్వరంలో గంగానదికి ఎదురుగా రాజప్రసాదం లాంటి భవనంలో యోగదా[6] మఠాన్ని స్థాపించడం జరిగింది. కలకత్తాకు ఉత్తరాన చాలా కొద్దిమైళ్ళ దూరంలోనే ఉన్న ఈ ఆశ్రమం, నగరవాసులకు శాంతి నిలయంగా ఉపకరిస్తుంది. దక్షిణేశ్వర మఠం, యోగదా సత్సంగ సొసైటీకి భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో దానికున్న విద్యాలయాలకూ కేంద్రాలకూ ఆశ్రమాలకూ ప్రధాన కార్యాలయం. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయానికి చట్టబద్ధంగా అనుబంధమై ఉంది; ఈ కార్యాలయం అమెరికాలో కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిలస్‌లో ఉంది. యోగదా సత్సంగ కార్యకలాపాల్లో, ‘యోగదా మేగజైన్’ అనే త్రైమాసిక పత్రిక ఒకటి ప్రచురించడం, భారతదేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఉన్న విద్యార్థులకు నెలనెలా పోస్టులో పాఠాలు పంపడం కూడా ఉన్నాయి. ఈ పాఠాలు శక్తి పూరణ, ధారణ, ధ్యాన ప్రక్రియల్ని వివరణాత్మకంగా బోధిస్తాయి. సంపూర్ణ విశ్వాసంతో వాటిని సాధన చేసినట్లయితే, అర్హులైన విద్యార్థులకు ముందు ముందు వచ్చే పాఠాల్లో బోధించే క్రియాయోగమనే ఉన్నత విద్యకు అవి అత్యవసర ప్రాతిపదిక ఏర్పరుస్తాయి.
యోగదా విద్యా, మత, ప్రజాహిత కార్యకలాపాలకు అనేకమంది ఉపాధ్యాయులూ కార్యకర్తల సేవాతత్పరతలు అవసరమవుతారు. అలాటి వాళ్ళు అసంఖ్యాకంగా ఉన్నారు కనక, వాళ్ళ పేర్లు ఇక్కడ ఇవ్వడం లేదు; కాని వారిలో ప్రతి ఒక్కరికీ నా హృదయంలో ప్రేమాపూర్ణమైన స్థాన ముంది.
శ్రీ రైట్, రాంచీ కుర్రవాళ్ళతో చాలా స్నేహాలు చేశాడు. సాదా పంచె కట్టుకొని వాళ్ళతోనే కలిసి కొన్నాళ్ళు ఉన్నాడు. బొంబాయి, రాంచీ, కలకత్తా, శ్రీరాంపూర్ - ఎక్కడికి వెళ్ళినా సరే, నా కార్యదర్శి తన సాహస కృత్యాల్ని ప్రయాణం డైరీలో రాస్తూ వస్తాడు; వివరంగా వర్ణించే ప్రతిభ అతనికి ఉంది. ఒకనాడు సాయంత్రం నే నతన్ని ఒక ప్రశ్న అడిగాను.
“డిక్ , భారతదేశాన్ని గురించి నీకు కలిగిన అభిప్రాయం ఏమిటి?”
“శాంతి,” అన్నాడతను సాలోచనగా. “ఈ జాతి తత్త్వం శాంతి.”
- ↑ వార్ధాలో మహాత్మాగాంధీని చూడ్డానికని దేశమధ్యంలో ఉన్న మధ్య పరగణాల్లో మా ప్రయాణం ఆపాం. ఆ రోజుల్ని గురించి 44 అధ్యాయంలో వివరించడం జరిగింది.
- ↑ గురుదేవుల దగ్గరికి తాచుపాము ఒకటి వచ్చినప్పుడు అక్కడున్న కుర్రవాడు ప్రఫుల్లుడే (12 అధ్యాయం చూడండి).
- ↑ అంటే, “సంపూర్ణమైన నమస్కారం.” సంస్కృతంలో ‘నమ్’ అనే ధాతువుకు మొక్కడం లేదా వంగడం అనీ, ‘ప్ర’ అనే ఉపసర్గకు ‘సంపూర్ణంగా’ అని అర్థాలు; వాటితో వచ్చిన పదమిది.
- ↑ శ్రీశ్రీ పరమహంస యోగానందగారు సేకరించిన ఆ మాదిరి వస్తువులతో పాశ్చాత్య ప్రపంచంలో కూడా ఒక పురావస్తు ప్రదర్శనశాల ఉంది; అది కాలిఫోర్నియాలోని పసిఫిక్ పాలిసేడ్స్‌లో, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ సరోవర మందిరంలో ఏర్పాటయి ఉంది. (ప్రచురణకర్త గమనిక).
- ↑ ఉత్తరోత్తరా, మగపిల్లలకూ ఆడపిల్లలకూ కూడా ఉపకరించే విధంగా అనేక యోగదా విద్యాసంస్థలు దేశంలో చాలా చోట్ల ఏర్పడి, ఇప్పుడు బాగా వర్ధిల్లుతున్నాయి. ఈ సంస్థలు కిండర్ గార్టెన్ స్థాయినించి కళాశాల స్థాయివరకు ఉన్నాయి. (ప్రచురణకర్త గమనిక).
- ↑ ‘యోగదా’ శబ్దం యోగ, దా అన్న రూపాలతో ఏర్పడింది. యోగమంటే కలయిక, సామరస్యం, సంతులనం; దా అంటే ఇచ్చేది. ‘సత్సంగ’ శబ్దంలో సత్ అంటే సత్యం; సంగమంటే స్నేహం.
‘యోగదా’ శబ్దం, 1916లో పరమహంస యోగానందగారు పెట్టిన పేరు; మానవ శరీరాన్ని, విశ్వమూలశక్తి నుంచి తీసుకొనే శక్తితో తిరిగి నింపే విధానాల్ని ఆయన కనిపెట్టినప్పుడు రూపొందించిన పేరు. శ్రీయుక్తేశ్వర్‌గారు తమ ఆశ్రమ వ్యవస్థకు ‘సత్సంగం’ అని పేరు పెట్టారు; ఆయన శిష్యులు పరమహంస యోగానందగారు సహజంగా ఆ పేరే అట్టే పెట్టాలనుకున్నారు. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా, చిరస్థాయిగా నిలిచి ఉండేటందుకుగాను రూపొందించిన, లాభాసక్తి లేని సంస్థ. ఆ పేరుకింద యోగానందగారు భారతదేశంలో తమ కృషినీ తాము నెలకొల్పిన సంస్థల్నీ రిజిస్టర్ చేయించారు. వాటి పాలన వ్యవహారాల్ని, పశ్చిమ బెంగాలులో దక్షిణేశ్వరంలో ఉన్న యోగదామఠంలో ఒక పాలక మండలి సమర్థంగా నిర్వహిస్తోంది. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో వై. ఎస్. ఎస్. ధ్యాన కేంద్రాలు అనేకం ఇప్పుడు వర్ధిల్లుతున్నాయి.
పాశ్చాత్య దేశాల్లో, సంస్కృత శబ్దాలు లేకుండా ఉండడం కోసం యోగానందగారు, తమ సంస్థను సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ పేర రిజిస్టర్ చేయించారు. శ్రీశ్రీ దయామాత 1955 నుంచి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్‌లకు అధ్యక్షురాలుగా ఉంటున్నారు. (ప్రచురణకర్త గమనిక).