అధ్యాయం : 26

క్రియాయోగశాస్త్రం

ఈ పుటల్లో నేను తరచుగా ప్రస్తావిస్తూ వచ్చిన క్రియాయోగ శాస్త్రం, మా గురుదేవులకు గురువులయిన లాహిరీ మహాశయుల ద్వారా ఆధునిక భారతదేశంలో విస్తృతంగా పదిమందికీ తెలియవచ్చింది. క్రియా శబ్దానికి సంస్కృత మూలధాతువు ‘కృ’ : అంటే, చెయ్యడం, ప్రతిస్పందించడం అని అర్థం. కార్యకారణాల ప్రకృతినియమమైన ‘కర్మ’ శబ్దంలోనూ అదే ధాతువు కనిపిస్తుంది. ఈ ప్రకారంగా, క్రియాయోగం “ఒకానొక చర్యద్వారా, లేదా కాండ (క్రియ) ద్వారా పరమాత్మతో పొందే కలయిక (సంయోగం)” అవుతుంది. ఈ ప్రక్రియను నిష్ఠగా సాధనచేసే యోగి, కర్మనుంచి అంటే కార్యకారణ సమతౌల్యాల నియమబద్ధ శృంఖలం నుంచి క్రమక్రమంగా విముక్తి పొందుతాడు.

యోగసంబంధమైన కొన్ని ప్రాచీన నిషేధాల మూలంగా, జన బాహుళ్యం కోసం ఉద్దేశించిన పుస్తకంలో క్రియాయోగానికి పూర్తి వివరణ ఇయ్యగూడదు నేను. అసలయిన యోగప్రక్రియను, “యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్” వారి దగ్గర అధికారం పొందిన క్రియావంతుడి (క్రియాయోగి) దగ్గరే నేర్చుకోవాలి. ఇక్కడ మాత్రం స్థూలమైన ప్రస్తావన చాలు.

క్రియాయోగమన్నది, మనిషి రక్తంలో ఉన్న కర్బనాన్ని హరింపజేసి ఆక్సిజన్ [ప్రాణవాయువు/ఆమ్లజని] తో నింపే ఒకానొక మానసిక శారీరక ప్రక్రియ. మెదడులోనూ వెనుబాములోనూ ఉన్న కేంద్రాల్ని నవశక్తితో నింపడానికి, ఈ అదనపు ఆక్సిజన్ అణువులు, ప్రాణశక్తి ప్రవాహంగా మారిపోతాయి. ఒంట్లో కలుషరక్తం జమ కాకుండా ఆపి, యోగి కణజాలాల క్షయాల్ని తగ్గించడంకాని ఆపెయ్యడం కాని చేస్తాడు. ప్రగతి సాధించిన యోగి, తన శరీర కణాల్ని శక్తిగా మార్చేస్తాడు. ఎలిజా, ఏసు, కబీరు, ఇతర ప్రవక్తలూ, క్రియాయోగాన్నో ఆ మాదిరి మరో ప్రక్రియనో ఉపయోగించడంలో ప్రవీణులైన పూర్వులు; దాంతో వారు, తమ శరీరాల్ని తమ సంకల్పానుసారంగా ప్రత్యక్షమూ చేసేవారు, అదృశ్యమూ చేసేవారు.

క్రియాయోగం సనాతనమైన శాస్త్రం. లాహిరీ మహాశయులు దాన్ని మహాగురుదేవులైన బాబాజీ దగ్గరినించి పొందారు. ఇది అంధయుగాల్లో మరుగున పడిపోయిన తరవాత, బాబాజీ ఈ ప్రక్రియను పునరుద్ధరించి సులభగ్రాహ్యం చేశారు. బాబాజీ దీనికి సులువుగా క్రియాయోగం అని పేరు పెట్టారు.

“ఈ పందొమ్మిదో శతాబ్దంలో నేను నీద్వారా ప్రపంచానికి అందిస్తున్న ఈ క్రియాయోగం, కొన్ని వేల ఏళ్ళ కిందట కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన, ఉత్తరోత్తరా పతంజలికీ క్రీస్తుకూ, సెంట్ జాన్‌కూ సెంట్ పాల్‌కూ తదితర శిష్యులకూ తెలిసిఉన్న శాస్త్రానికి పునరుద్ధరణమే,” అన్నారు బాబాజీ.

భగవద్గీతలో కృష్ణభగవానుడు క్రియాయోగాన్ని రెండుసార్లు ప్రస్తావించాడు. ఒక శ్లోకంలో ఇలా ఉంది: “పీల్చేగాలిని విడిచే గాలిలో వేల్చి, విడిచే గాలిని పీల్చేగాలిలో వేల్చి, రెండు శ్వాసల్నీ తటస్థీకరిస్తున్నాడు యోగి; ఆ ప్రకారంగా అతడు ప్రాణాన్ని గుండెనుంచి విడుదల చేసి, ప్రాణశక్తిని తన అదుపులో ఉంచుకుంటాడు."[1] దీని తాత్పర్య మేమిటంటే; “యోగి, ఊపిరితిత్తులూ గుండే చేసే పనిని నెమ్మదిచేసి, దానిద్వారా అదనంగా ప్రాణం (ప్రాణశక్తి) సరఫరా అయేటట్టు చేసుకుని, శరీరంలో తరుగుదలను (జీవకణ క్షయాన్ని) అరికడతాడు; అంతే కాకుండా అతడు, అపానాన్ని (విసర్జక ప్రవాహం) అదుపు చేసుకోడంవల్ల ఒంట్లో పెరుగుదలకు సంబంధించిన మార్పుల్ని కూడా అరికడతాడు; ఈ ప్రకారంగా, తరుగుదలనూ పెరుగుదలను నిలుపుచేసి, యోగి, ప్రాణశక్తిని అదుపులో ఉంచుకోడం నేర్చుకుంటాడు.”

గీతలో మరో శ్లోకం ఇలా చెబుతోంది: “కనుబొమల మధ్య బిందువు మీద చూపు నిలపడంవల్లా, ముక్కుల్లోనూ ఊపిరితిత్తుల్లోనూ (ఆడే) ప్రాణ, అపాన వాయువుల సమప్రవాహాల్ని తటస్థీకరించడంవల్లా సర్వోన్నత లక్ష్యాన్ని సాధించబూనిన ధ్యానయోగి (ముని) బాహ్య విషయాలనుంచి వెనక్కి తగ్గగలుగుతాడు; మనస్సునూ బుద్ధినీ అదుపు చెయ్యగలుగుతాడు. కోరికనూ భయాన్నీ కోపాన్నీ పారదోలగలుగుతాడు; శాశ్వతంగా విముక్తుడవుతాడు.”[2]

నాశరహితమైన ఈ యోగాన్ని, వెనకటి ఒక అవతారంలో, ప్రాచీన జ్ఞాని అయిన వివస్వతుడికి ఉపదేశించినవాణ్ణి నేనే ననీ, ఆ వివ స్వతుడు మహాధర్మ శాసకుడైన మనువుకు ఉపదేశించాడనీ కూడా కృష్ణుడు చెబుతాడు.[3] ఆ మనువు[4] సూర్యవంశ స్థాపకుడైన ఇక్ష్వాకుడికి ఉపదేశం చేశాడు. ఈ విధంగా ఋషులు రాజయోగాన్ని ఒకరిదగ్గరినుంచి మరొకరికి అందిస్తూ, భౌతిక వాదయుగాలు[5] వచ్చేవరకూ కాపాడారు. ఆ తరవాత, పురోహితుల గోపనప్రవృత్తివల్లా మానవుడి ఉపేక్షవల్లా ఈ పవిత్ర విద్య క్రమంగా అందుబాటులో లేకుండా పోయింది.

యోగవిద్యకు ప్రప్రథమ శాస్త్రకారుడైన ప్రాచీన ఋషి పతంజలి, క్రియాయోగాన్ని రెండుసార్లు పేర్కొంటూ ఇలా రాశాడు: “శరీర వ్యాయామం, మనోనిగ్రహం, ఓంకారం మీద ధ్యానం కలిసి క్రియాయోగ మవుతుంది.”[6] ధ్యానంలో వినవచ్చే ఓంకారమనే యథార్థమైన విశ్వనాదమే దేవుడని అంటాడు పతంజలి.[7] ఓంకారం సృజనశీలక శబ్దబ్రహ్మం; స్పందనాత్మక బ్రహ్మాండ చాలకయంత్ర ధ్వని; ఈశ్వర సత్తకు ప్రత్యక్ష సాక్షి.[8] యోగసాధన కొత్తగా మొదలుపెట్టిన వాడు సైతం, అద్భుతమైన ఓంకార నాదాన్ని త్వరలోనే తన లోపల వినవచ్చు. ఆనందమయమైన ఈ ఆధ్యాత్మిక ప్రోత్సాహంతో అతడు, తాను ఊర్ధ్వలోకాలతో సంపర్కం పెట్టుకున్నానని నమ్మగలుగుతాడు.

క్రియాయోగ ప్రక్రియ, అంటే ప్రాణశక్తి నియంత్రణగురించి పతంజలి రెండోసారి ఇలా ప్రస్తావించాడు: “ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాల గతిని విచ్ఛేదించడం ద్వారా జరిగే ప్రాణాయామంవల్ల ముక్తి సాధించవచ్చు. [9]

సెంట్ పాల్‌కు క్రియాయోగం, లేదా ఆ మాదిరి మరో ప్రక్రియ తెలుసు; దాని ద్వారా ఆయన, ప్రాణశక్తి ప్రవాహాల్ని ఇంద్రియాల్లోకి వదలడంకాని, ఆపడంకాని చెయ్యగలుగుతూండేవాడు. అంచేతే ఆయన ఇలా అనగలిగాడు: “క్రీస్తంటే మనకున్న పరమానందం మీద ఒట్టు వేసి చెబుతున్నాను, నేను రోజూ చనిపోతుంటాను.[10] సెంట్ పాల్ (సాధారణంగా ఇంద్రియ జగత్తువేపు సాగుతూ, తద్ద్వారా సత్యమనే అభాస దానికి కల్పిస్తూ ఉండే) తన శారీరక ప్రాణశక్తిని ఒకానొక ప్రక్రియ ద్వారా అంతర్ముఖంగా కేంద్రీకరింపజేసి ప్రతి రోజూ కూటస్థ చైతన్యం (క్రీస్తు చైతన్యం) లో మునిగి ఆనందిస్తూ యోగపరమైన నిజమైన తాదాత్మ్యాన్ని అనుభవిస్తూ ఉండేవాడు. ఆ ఆనందావస్థలో, మాయాప్రపంచపు ఇంద్రియ భ్రాంతులకు సంబంధించినంతవరకు, తాను “చచ్చినవాడి” కిందే జమ అనీ, లేదా వాటినుంచి విముక్తుణ్ణి అయాననీ ఆయనకు స్పృహలో ఉండేది.

దైవసంపర్కపు (సవికల్ప సమాధి) ఆరంభస్థితుల్లో భక్తుడి చైతన్యం ‘విశ్వాత్మ’లో విలీనమవుతుంది; అతని ప్రాణశక్తిని శరీరంలోంచి లాగేసినట్టు అవుతుంది, అప్పుడా శరీరం “చచ్చిపోయి” నట్టుగా కదలిక లేకుండానూ బిర్రబిగిసి ఉన్నట్టు కనిపిస్తుంది. తాను చైతన్యం స్తంభించిన శారీరక స్థితిలో ఉన్నానన్న స్పృహ, యోగికి పూర్తిగా ఉంటుంది. అయితే, ఉన్నత స్థితులకు (నిర్వికల్ప సమాధి) పురోగ మిస్తున్న కొద్దీ అతడు, శారీరక నిశ్చలత లేకుండానే, మమూలు జాగృత చేతనావస్థలోనూ తనను నిర్బంధించే లౌకిక విధుల మధ్యలోనూ కూడా దైవానుసంధానం చేస్తాడు.[11]

“క్రియాయోగం, మానవ పరిణామాన్ని త్వరితం చెయ్యడానికి ఉపకరించే సాధనం,” అని తమ శిష్యులకు వివరించారు శ్రీయుక్తేశ్వర్‌గారు, “విశ్వచైతన్యరహస్యం శ్వాస నియంత్రణతో గట్టిగా ముడిపడి ఉన్నదని సనాతన యోగులు కనిపెట్టారు. ప్రపంచ జ్ఞానభాండారానికి భారతదేశం ప్రసాదించిన విశిష్ట, వినాశరహిత బహూకృతి ఇది. సాధారణంగా, గుండె చేసే పని కొనసాగేటట్టు చెయ్యడంలో నిమగ్నమై ఉండే ప్రాణశక్తి, అంతకన్న పెద్ద పనులు చెయ్యడానికి స్వేచ్ఛ పొంది ఉండాలి; ఈ స్వేచ్ఛ పొందడానికి, నిరంతరాయంగా సాగే శ్వాసను శాంతపరిచి, నిలపగలిగే పద్ధతిని అనుసరించాలి.

క్రియాయోగి తన ప్రాణశక్తిని, వెనుబాములోని ఆరు కేంద్రాల్ని (ఆజ్ఞా, విశుద్ధ, అనాహత, మణిపూర, స్వాధిష్ఠాన, మూలాధారాలనే షట్చక్రాల్ని) చుట్టి, కిందినించి పైకి పైనించి కిందికీ పరిభమించేటట్టు మానసికంగా నిర్దేశిస్తాడు. ఈ ఆరు చక్రాలూ విరాట్పురుషుడికి సంకేతమయిన రాశిచక్రంలోని పన్నెండు రాశులకు సమానం. మానవుడి సున్నితమయిన వెనుబాముచుట్టూ అరనిమిషంసేపు పరిభ్రమించే శక్తి, అతని పరిణామంలో సూక్ష్మప్రగతిని సాధ్యం చేస్తుంది; ఒక్క క్రియకు పట్టే ఆ అరనిమిషం కాలం, ఒక సంవత్సరంలో జరిగే ప్రకృతిసహజమైన ఆధ్యాత్మిక వికాసానికి సమానం.

సర్వద్రష్ట అయిన ఆధ్యాత్మిక నేత్రమనే సూర్యుడి చుట్టూ పరిభ్రమించే ఆరు (ధ్రువత్వగణన రీత్యా పన్నెండు) ఆంతరిక నక్షత్ర రాశులు గల మానవుడి సూక్ష్మశరీర వ్యవస్థకు భౌతిక సూర్యుడితోనూ పన్నెండు నక్షత్ర రాశులతోనూ పరస్పర సంబంధమున్నది. ఆ ప్రకారంగా మానవులందరూ, ఒక అంతరిక విశ్వంవల్లా ఒక భౌతిక విశ్వంవల్లా ప్రభావితులవుతూ ఉంటారు. మానవుడి లౌకిక పారలౌకిక పరిసరం, పన్నెండేసి సంవత్సరాల ఆవృత్తుల్లో అతన్ని, అతని సహజమార్గంలో ముందుకు నెట్టుతుందని సనాతన ఋషులు కనిపెట్టారు. మానవుడికి తన మేధ, విశ్వ చైతన్యాన్ని అభివ్యక్తీకరించడానికి తగినంతగా పరిపూర్ణ వికాసం పొందేటట్టు చెయ్యడానికి పదిలక్షల సంవత్సరాల సహజ, వ్యాధిరహిత పరిణామం అవసరమని పవిత్ర గ్రంథాలు నొక్కి చెబుతాయి.

ఎనిమిదిన్నర గంటల కాలం సాధనచేసిన వెయ్యి క్రియలు యోగికి, ప్రకృతి సహజమైన పరిణామంలో వెయ్యి సంవత్సరాల్లో వచ్చే ఫలితాన్ని ఒక్క రోజులో కలిగిస్తాయి: 3,65,000 సంవత్సరాల పరిణామం ఒక్క ఏడాదిలో వస్తుంది. ఈ ప్రకారంగా, పదిలక్షల సంవత్సరాల్లో ప్రకృతి తీసుకువచ్చే ఫలితాన్నే క్రియాయోగి, ప్రతిభావంతమైన స్వయంకృషితో మూడేళ్ళలో సాధించగలడు. అయితే, గాఢంగా వికాసం సాధించిన యోగులు మాత్రమే క్రియాయోగమనే అడ్డదారి తొక్కగలరు. అటువంటి యోగులు, ఒక గురువు మార్గదర్శకత్వంలో, గాఢ సాధనవల్ల జనించే శక్తికి తట్టుకోడానికి, తమ శరీరాన్నీ మెదడునూ జాగ్రత్తగా సిద్ధంచేసుకుంటారు.

ఆరంభదశలో ఉన్న క్రియాయోగ సాధకుడు, రోజుకు రెండు, సార్ల చొప్పున, పధ్నాలుగు మొదలు ఇరవైనాలుగుసార్లవరకు మత్రమే యోగసాధన చేస్తాడు. కొందరు యోగులు ఆరేళ్ళలోకాని, పన్నెండేళ్ళలో కాని, ఇరవైనాలుగేళ్ళలో కాని, నలభై ఎనిమిదేళ్ళలోకాని విముక్తి సాధిస్తారు. ఒక వేళ, ఏ యోగి అయినా సంపూర్ణ సాక్షాత్కారం సాధించక ముందే చనిపోయినట్లయితే, వెనకటి క్రియాసాధన బాపతు సత్కర్మను తనవెంట తీసుకుపోతాడు; కొత్త జన్మలో అతడు స్వాభావికంగానే అంతిమ లక్ష్యం వేపు ఆకృష్టుడవుతాడు.

సగటు మనిషి శరీరం ఏభై వాట్ల కరెంటు బల్బులాంటిది; ఆ శరీరం, అత్యధిక క్రియాసాధనవల్ల ఉత్పన్నమయే లక్షకోట్ల వాట్ల శక్తిని ఇముడ్చుకోలేదు. సులభంగాను, నిర్దుష్టంగాను ఉండే క్రియాయోగ పద్ధతుల్ని క్రమక్రమంగా, నియమానుసారంగా పెంచుతూ సాధన చెయ్యడంవల్ల, మనిషి శరీరం రోజురోజుకూ సూక్ష్మరూపంలో పరివర్తన చెందుతూ ఉంటుంది; చివరికది పరమాత్ముడి, ప్రథమ భౌతిక, క్రియాశీలక అభివ్యక్తి అయిన విశ్వశక్తి తాలూకు అనంత సామర్థ్యాల్ని అభివ్యక్తం చెయ్యడానికి తగి ఉంటుంది.

క్రియాయోగానికీ, తప్పుదారి పట్టిన ఉత్సాహవంతులు కొందరు నేర్పే అశాస్త్రీయమైన శ్వాసనియంత్రణాభ్యాసాలకీ ఎంత మాత్రం పోలిక లేదు. ఊపిరిని బలవంతంగా ఊపిరితిత్తుల్లో బిగబట్టి ఉంచడం అసహజమే కాకుండా, నిస్సందేహంగా అసౌఖ్యమయింది కూడా. కాని క్రియాసాధనలో అలా కాకుండా, మొదటినించి కూడా ప్రశాంతతానుభూతులు కలుగుతాయి; అంతేకాక, వెనుబాములో పునరుత్పాదక ఫలితాన్నిచ్చే ఉపశమకారక సంవేదనలు కూడా తోడయి ఉంటాయి.

ఈ సనాతన యోగ ప్రక్రియ శ్వాసను మనో ద్రవ్యంగా మార్చేస్తుంది. ఆధ్యాత్మిక ప్రగతి ద్వారా ఎవరయినా, శ్వాసను ఒక మనో భావనగా- అంటే మనస్సు చేసే ఒక పనిగా- ఒక స్వప్నశ్వాసగా గుర్తుపట్టగలుగుతారు.

మానవుడి శ్వాసక్రియ ప్రమాణానికి అతని చైతన్య స్థితులలోని వేరువేరు మార్పులకూ గణితపరమైన సంబంధాన్ని నిరూపించడానికి అనేక కారణాలు చూపించవచ్చు. అత్యంత సంకీర్ణమైన, బుద్ధిప్రచోదకమైన తార్కికవాదాన్ని ఆలకిస్తూ ఉండడం, అతిసున్నితమైన లేదా అతికఠినమైన అంగవిన్యాసం చేస్తూ ఉండడంవంటి సందర్భాల్లో తన మనస్సును పూర్తిగా ఒకదాని మీద లగ్నంచేసిఉన్నవాడు చాలా మెల్లగా శ్వాసిస్తాడు; ఇది దానంతట అది జరుగుతుంది. మనోలగ్నత మందశ్వాస మీద ఆధారపడి ఉంటుంది; భయం, కామం, క్రోధం అనే హానికరమైన భావావేశస్థితులకు తప్పనిసరిగా తోడై వచ్చేవి త్వరిత శ్వాసలూ విషమ శ్వాసలు. మనిషి సగటున నిమిషానికి 18 సార్ల చొప్పున ఊపిరి తీసుకుంటే, మనశ్చాంచల్యం గల కోతి 32 సార్ల చొప్పున తీసుకుంటుంది. దీర్ఘ ఆయుర్దాయానికి పేరుగన్న ఏనుగు, తాంబేలు, పామువంటి జీవుల శ్వాసక్రియ ప్రమాణం మనిషి శ్వాసక్రియ ప్రమాణం కన్న తక్కువ. మాటవరసకు, మూడువందల ఏళ్ళవరకు బతికే అవకాశమున్న రాకాసి తాంబేలు నిముషానికి 4 సార్లే శ్వాసిస్తుంది.

నిద్రవల్ల కలిగే పునరుజ్జీవన ఫలితాలకు కారణం, మనిషికి తన ఒంటిమీదా ఊపిరిమీదా తాత్కాలికంగా స్పృహ లేకపోవడమే. నిద్రలో ఉన్నప్పుడు ఊపిరి మరింత మెల్లగానూ సమంగానూ సాగుతూ ఉంటుంది. నిద్రపోతున్నవాడు యోగి అవుతాడు; ప్రతి రాత్రీ అతను, శారీరక స్పృహనుంచి తనను తాను విడుదలచేసుకుని, తన ప్రాణశక్తిని ప్రధానమైన మెదడు భాగంలోనూ వెనుబాము కేంద్రాలనే ఆరు ఉపశక్తిజనక స్థానా (సబ్ డైనమో) లలోనూ ఉన్న ఉపశమకారక ప్రవాహాల్లో లీనం చేస్తూ, అనుకోకుండానే యోగక్రియ చేస్తూ ఉంటాడు. ప్రాణులన్నిటినీ పోషించే విశ్వశక్తి, నిద్రపోతున్న వాణ్ణి, అతనికి తెలియకుండానే తిరిగి ప్రాణశక్తితో నింపుతుంది.

స్వచ్ఛందయోగి, సులువైన, సహజ ప్రక్రియ ఒకటి ఉద్దేశపూర్వకంగా సాధన చేస్తాడు; నిద్రపోతున్నవాడిలో మందగతిలో అసంకల్పితంగా సాగేటట్లు మాత్రం కాదు. క్రియాయోగి తన శరీర కణాలన్నిటినీ అక్షయ కాంతితో నింపి పరిపుష్టంకావించడానికి తద్ద్వారా వాటిని ఆధ్యాత్మికంగా అయస్కాంతీకరించిన స్థితిలో ఉంచడానికి ఈ ప్రక్రియను వినియోగిస్తాడు. శాస్త్రీయంగా, శ్వాసక్రియ అనవసరమయేటట్లు చేస్తాడు; అంతే కాకుండా (తన సాధన సమయాల్లో) నిద్ర, అపస్మారకం, లేదా చావువంటి వ్యతిరేక స్థితుల్లోకి పోకుండా ఉంటాడు.

మాయకు లోబడి, అంటే ప్రాకృతిక నియమానికి లోబడి ఉన్న మనుషుల్లో ప్రాణశక్తి ప్రవహించేది బాహ్యప్రపంచంవేపు; ఆ ప్రవాహాలు వృథా అవుతుంటాయి, ఇంద్రియ భోగాల్లో దుర్వినియోగమవుతుంటాయి. క్రియాసాధన ఈ ప్రవాహాన్ని వెనక్కి మళ్ళిస్తుంది; ప్రాణశక్తిని మానసికంగా అంతర్జగత్తుకు నడిపించి, అది వెనుబాములోని సూక్ష్మశక్తులతో తిరిగి ఐక్యమయేటట్టు చెయ్యడం జరుగుతుంది. ఈ విధంగా ప్రాణశక్తిని పునఃపూరణం చెయ్యడంవల్ల యోగి శరీరంలోనూ మెదడులోనూ ఉన్న కణాలు ఆధ్యాత్మిక అమృతంతో పునర్నవం చెందుతాయి.

సరయిన ఆహారం, సూర్యకాంతి, సమంజసమైన ఆలోచనల ద్వారా, ప్రకృతినీ దాని దివ్యప్రణాళికనూ అనుసరించి నడుచుకునే మానవులు పదిలక్షల సంవత్సరాల్లో ఆత్మసాక్షాత్కారం పొందుతారు. మెదడు స్వరూపంలో కనీసం స్వల్పమైన మెరుగుదల తీసుకురావాలన్నా కూడా పన్నెండు సంవత్సరాల ఆరోగ్యవంతమైన మామూలు జీవనం అవసరం; విశ్వచైతన్యావతరణకు అనువుగా మెదడనే అద్దెకొంపను పరిశుభ్రం చెయ్యాలంటే పది లక్షల సంవత్సరాలు తిరగక తప్పదు. అయితే క్రియాయోగి, ఒక ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అనుసరించి, అతిదీర్ఘకాలం ప్రకృతి నియమాల్ని జాగ్రత్తగా అనుసరించవలసిన అవసరం తనకు లేకుండా చేసుకుంటాడు.

ఆత్మను శరీరానికి బంధించే ఊపిరితాడు చిక్కుముడి విప్పుతూ క్రియాయోగం, ఆయుర్దాయం పెంచడానికి చైతన్యాన్ని అనంతం వరకూ విస్తరింపజెయ్యడానికి ఉపకరిస్తుంది. ఈ యోగప్రక్రియ, మనస్సుకూ భౌతిక బంధాల్లో చిక్కుపడ్డ ఇంద్రియాలకూ మధ్య సాగే పెనుగులాటలోంచి బయటపడేట్టు చేసి, భక్తుడు తన శాశ్వత రాజ్య వారసత్వాధికారాన్ని తిరిగి పొందేటట్టుగా స్వేచ్ఛ ప్రసాదిస్తుంది. అప్పుడు అతను తన అసలు స్వరూపం, శరీర కోశబంధానికికాని, ఊపిరికికాని అంటే, గాలికి ప్రకృతి భౌతిక నిర్బంధాలకూ మర్త్యమానవుడు బానిస అయి ఉండడానికి చిహ్నమైన శ్వాసకుకాని- కట్టుబడి ఉన్నది కాదని తెలుసుకుంటాడు. తన శరీరంమీదా మనస్సుమీదా తానే ఆధిపత్యం వహించిన వాడై, క్రియాయోగి చివరికి, “చివరి శత్రువు”[12] అయిన మృత్యువు మీద విజయం సాధిస్తాడు.

“మనుషుల్ని కబళించే మృత్యువును కబళించు నువ్వు;
మృత్యువే కనక మరణిస్తే, అటుపై మరణించడమే ఉండదు.”[13]

అంతఃపరిశీలన లేదా “మౌనంలో కూర్చోడం” అన్నది శాస్త్రీయమైన పద్ధతి కాదు; ప్రాణశక్తిచేత ముడిపడిఉన్న మనస్సునూ ఇంద్రియాల్నీ బలవంతంగా విడదియ్యడానికి చేసే ప్రయత్నమిది. తిరిగి దివ్యత్వం పొందడానికి ప్రయత్నిస్తూ ఉండే ధ్యానశీలత గల మనస్సును ప్రాణశక్తి ప్రవాహాలు నిరంతరం ఇంద్రియాలవేపు వెనక్కి లాగుతూనే ఉంటాయి. ప్రాణశక్తి ద్వారా మనస్సును ‘నేరుగా’ అదుపులోకి తెచ్చుకునే క్రియాయోగం, అన్నిటికన్న సులువయినది, ఫలవంతమయినదీను. అనంతాన్ని చేరుకోడానికి ఇది అనువైన - అత్యంత శాస్త్రీయమైన మార్గం కూడా. దేవుణ్ణి చేరడానికి ఉద్దేశించిన దైవశాస్త్రమార్గం నిదానమూ, అనిశ్చితమూ అయిన “ఎద్దుబండి” బాట; దానికి భిన్నంగా క్రియాయోగాన్ని “విమాన” మార్గం అనడం న్యాయం.

యోగశాస్త్రం అన్నిరకాల ధారణ, ధ్యాన సాధనల అనుభవ హేతువు మీద ఆధారపడ్డది. భక్తుడు తన సంకల్పానుసారంగా ప్రాణ విద్యుత్ ప్రవాహాన్ని దర్శన, శబ్ద, ఘ్రాణ, రసన, స్పర్శేంద్రియాలనే ఐదు టెలిఫోన్లలోకి పోకుండా ఆపనూ గలుగుతాడు, వాటిలోకి పంపనూ గలుగుతాడు. ఈ ఇంద్రియ సంబంధ భేదనశక్తి సంపాదించిన యోగి, తన మనస్సును సంకల్పానుసారంగా దివ్యలోకాలతో కాని భౌతిక ప్రపంచంతోకాని ఇట్టే కలపవచ్చునని గ్రహించగలుగుతాడు. మరింక తన సంకల్పానికి వ్యతిరేకంగా ప్రాణశక్తి అతన్ని, రౌడీ సంవేదనలకూ


. అశాంతిపరమైన ఆలోచనలకూ నిలయమైన పార్థివ మండలానికి లాక్కు రావడం జరగనే జరగదు.

పురోభివృద్ధిచెందిన క్రియాయోగి జీవితం, పూర్వకర్మల ఫలితాల వల్లకాక, కేవలం ఆత్మ నిర్దేశాలవల్లే ప్రభావితమవుతుంది. ఈ ప్రకారంగా భక్తుడు సామాన్య జీవితంలోని అహంకార పూర్వకమైన మంచీ చెడూ కర్మల విలంబిత, పరిణామాత్మక ఉపదేశాల్నించి తప్పించుకుంటాడు.-- గరుడవేగ, హృదయులకు ఇవి ఆటంకాలుగా, నత్తనడకల్లా ఉంటాయి.

ఆత్మ నిర్దేశానుసార జీవనమనే ఆత్యుత్తమపద్ధతి యోగికి స్వేచ్ఛ ప్రసాదిస్తుంది, అహంకార కారాగారం నుంచి విముక్తుడై అతను సర్వ వ్యాపకత్వమనే గాఢ వాయువును ఆస్వాదిస్తాడు. దానికి భిన్నంగా, ప్రకృతి సహజమైన జీవనమనే దాస్యం అతన్ని, అవమానకరమైన గతిలోకి నడిపిస్తుంది. తన జీవితాన్ని కేవలం పరిణామాత్మక వ్యవస్థకు బద్దం చేసుకున్నప్పుడు మానవుడు, ప్రకృతినించి తొందరగా విడివడే అధికారం పొందలేడు. తన శరీరాన్ని మనస్సునూ శాసించే నియమాల్ని ఉల్లంఘించ కుండానే అతను జీవించినప్పటికీ, అంతిమ విముక్తి పొందడాని కతనికి, మాయవేషాల్లో జన్మలెత్తుతూ పదిలక్షల సంవత్సరాల కాలం గడపవలసి వస్తుంది.

కాబట్టి, వెయ్యివేల సంవత్సరాలనగానే తిరుగుబాటు ధోరణిలో చూసేవాళ్ళకి, ఆత్మ వ్యక్తిత్వ సాధనకోసం శారీరక, మానసిక తాదాత్మ్యాల నుంచి విడివడే యోగి శీఘ్రఫలసాధనకు అనుసరించే పద్ధతుల్ని సిఫార్సు చెయ్యడం జరుగుతోంది. ఆత్మ సంగతి అలా ఉంచి, కనీసం ప్రకృతితో కూడా సామరస్యం లేకుండా జీవించే సామాన్య మానవుడి విషయంలో ఈ సంఖ్యాపరిధి ఇంకా చాలా విస్తరిస్తుంది; అతను అసహజమైన ఎండమావుల వెంటబడి పోతూ, తన ఆలోచనలతోనూ శరీరం తోనూ, ఆహ్లాదకరమైన ప్రకృతి నియమాల్ని ఉల్లంఘిస్తూ ఉంటాడు. అతనికి పదికి మరో పది లక్షల ఏళ్ళు కలిపినా కూడా విముక్తి సాధించడానికి వ్యవధి చాలదు.

సంస్కారంలేని మనిషి, తన శరీరం ఒక రాజ్యమనీ ఆత్మ అనే చక్రవర్తి దాన్ని పాలిస్తున్నాడనీ, కపాల సింహాసనాన్ని ఆయన అధిష్టించి ఉండగా షట్చక్రాలనే సామంత రాజుప్రముఖులు ఆయన దగ్గర కొలువై ఉంటారనీ- అంటే చైతన్య మండలాలు ఆయన్ని పరివేష్ఠించి ఉంటాయనీ - గ్రహించడం అరుదూ కావచ్చు; గ్రహించకనే పోవచ్చు. ఈ దైవరాజ్య వ్యవస్థకు విధేయులైన పౌరులు అనేకమంది ఉన్నారు; ఇరవైఏడువేల లక్షల కోట్ల కణాలు (ఇవి స్వయంచాలితంగా భాసిస్తున్నప్పటికీ నిస్సందేహంగా ప్రజ్ఞ కలిగి, శారీరకమైన వృద్ధి, రూపాంతరణ, క్షయాలనే విధులన్నీ నిర్వర్తిస్తూ ఉండేవి), ఐదుకోట్ల అంతస్తరీయ ఆలోచనలూ, భావోద్రేకాలూ, అరవైఏళ్ళ సగటు జీవితంలో మానవుడి చైతన్యంలో, పాటూపోట్ల మాదిరిగా మారుతూ వచ్చే వివిధావస్థలూనూ.

ఆత్మసమ్రాట్టుకు వ్యతిరేకంగా, మానవదేహంలోనయినా మనస్సులోనయినా, వ్యాధిరూపంలోగాని అవివేకరూపంలోగాని వ్యక్తమయే ప్రత్యక్షమైన తిరుగుబాటుకు కారణం, ఆయనకు విధేయులైన పౌరులు తలపెట్టే రాజద్రోహం కాదు; మానవుడు తనకు దక్కిన వ్యక్తిత్వాన్ని లేదా స్వతంత్రేచ్ఛను, పూర్వమో, ప్రస్తుతమో దుర్వినియోగం చెయ్యడమే. ఆ స్వతంత్రేచ్ఛ అతనికి ఆత్మతోబాటు ఇచ్చినదే; అంతేకాదు, ఇచ్చింది మళ్ళీ వెనక్కి తీసుకోడానికి వీలులేకుండా ఇచ్చినదే.

మానవుడు తుచ్ఛమైన అహంకారంతో మమైకమై, ఆలోచనలు చేసేవాడూ, సంకల్పించేవాడూ, అనుభూతిపొందేవాడూ, అన్నం జీర్ణం చేసేవాడూ, తనను సజీవంగా ఉంచేవాడూ తానేనని అనుకుంటూ ఉంటాడు కాని, తన సాధారణ జీవితంలో తాను వెనకటి చేత (కర్మ) లకూ ప్రకృతికీ, లేదా పరిసరానికి కీలుబొమ్మను తప్ప మరేమీ కానని ఆలోచించుకుని (ఆ ఆలోచన కూడా రవ్వంత చాలు) అంగీకరించడు. ప్రతిమనిషి తాలూకు బౌద్ధిక ప్రతిస్పందనలూ, అనుభూతులూ, చిత్తవృత్తులూ, అలవాట్లూ వెనకటి హేతువులకు ఫలితాలే; హేతువులు ఈ జన్మలో వయినా కావచ్చు, ఏ పూర్వజన్మలోవయినా కావచ్చు. అయితే, అటువంటి ప్రభావాలన్నిటికీ అతీతంగా, సమున్నతంగా ఉంటుంది, రాజాధిరాజు సమమైన ఆత్మ. క్రియాయోగి స్వల్పకాలికమైన సత్యాల్నీ స్వాతంత్ర్యాల్నీ తిరస్కరించి మాయావరణ మంతటినీ దాటి విముక్త జీవుడవుతాడు. మానవుడు, జీవించే ఆత్మేకాని నశించే శరీరం కాదని ప్రపంచంలోని పవిత్ర గ్రంథాలన్నీ ఉద్ఘోషిస్తాయి; ఈ పవిత్ర గ్రంథాలు చెప్పే సత్యాన్ని నిరూపించడానికి అతనికి క్రియాయోగం ద్వారా ఒక పద్ధతి ప్రసాదించడం జరిగింది.

“బాహ్య కర్మకాండ అజ్ఞానాన్ని నాశనం చెయ్యలేదు; ఎంచేతంటే, అవి రెండూ పరస్పర విరుద్ధమైనవి కావు,” అన్నారు. ఆచార్య శంకరులు, ‘శ్లోక శతకం’లో. “అనుభవం ద్వారా కలిగిన జ్ఞానం ఒక్కటే అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఆత్మవిచారం వల్ల తప్ప మరే సాధనం ద్వారానూ జ్ఞానం ఉదయించదు. ‘నే నెవర్ని! ఈ జగత్తు ఎలా పుట్టింది? దీనికి కర్త ఎవరు? దీనికి భౌతిక హేతువు ఏమిటి?’ అంటూ, ఈ మాదిరిగానే విచారణ సాగాలి.”

ఈ ప్రశ్నలకు బుద్ధి సమాధానం చెప్పలేదు; అంచేతనే ఋషులు, ఆధ్యాత్మిక విచార ప్రక్రియగా యోగాన్ని రూపొందించారు.

నిజమైన యోగి, తన ఆలోచనల్నీ ఇచ్ఛాశక్తిని అనుభూతుల్ని వినయ వాంఛలతో తప్పుగా ఏకీభావం పెట్టుకోకుండా అరికట్టి, మేరుదండ మందిరాల్లో నెలకొని ఉన్న అధిచేతన శక్తులతో మనస్సును ఐక్యంచేసి, దేవుడు నిర్ణయించిన రీతిగా ప్రపంచంలో బతుకుతాడు; ప్రారబ్ధ ప్రభావోద్రేకాలవల్లకాని, మానవ అవివేకమూలకమైన నూతన ప్రేరణలవల్ల కాని ప్రేరితుడు కాడతడు. సర్వోత్తమ ఆకాంక్షను సఫలీకృతం కావించుకొని అతడు, అక్షయానందమయుడైన పరమాత్మ చరమాశ్రయంలో సుక్షేమంగా ఉంటాడు.

యోగవిద్యకున్న అమోఘ, క్రమానుగత సాఫల్యశక్తిగురించి ప్రస్తావిస్తూ కృష్ణుడు, దాన్ని శాస్త్రోక్తంగా సాధన చేసిన యోగిని ఈ విధంగా ప్రశంసిస్తాడు:

“శారీరక క్రమశిక్షణ సాధనచేసే తపస్వుల కన్న గొప్పవాడు యోగి; జ్ఞానమార్గాన్నికాని, కర్మమార్గాన్నికాని అనుసరించే వాళ్ళకన్న కూడా గొప్పవాడు; కాబట్టి, ఓ శిష్యా! అర్జునా! నువ్వు యోగివి అవు!”[14] భగవద్గీతలో పదేపదే ప్రశంసిస్తూ వచ్చిన నిజమైన “అగ్ని కార్యం” క్రియాయోగమే. యోగి మానవ సంబంధమైన తన అభిలాషల్ని అసదృశుడైన దేవుడికి అర్పిస్తూ అద్వైతహోమాగ్నిలో హవనం చేస్తాడు. భూత, వర్తమాన వాంఛలన్నీ దివ్యప్రేమాగ్నిలో హుతమయే నిజమైన, యోగ సంబంధమైన అగ్నికార్యం ఇదే. ఆ పరమాగ్నిజ్వాల మానవో న్మాద హవిస్సు నంతనీ, అందుకొంటుంది; కల్మష క్షాళనం జరిగి, మానవుడు పరిశుద్ధుడవుతాడు. అలంకారికంగా చెప్పాలంటే అతని ఎముకలు కోరికల కండనుంచి విడివడి, కర్మసంబంధమైన అస్థిపంజరం సూక్ష్మ క్రిమినాశకుడై న జ్ఞానసూర్యుడి కిరణాలతో క్షాళిత మవుతుంది; మరో మానవుడివల్లకాని అతని సృష్టికర్తవల్లకాని ఎటువంటి ఆపదకూ లోను కాజాలనివాడై, మానవుడు చివరికి పరిశుద్ధుడవుతాడు.

  1. అపానే జుహ్వతి ప్రాణః ప్రాణే౽పానం రథాపరే
    ప్రాణాపానగతీ రుద్ద్వా ప్రాణాయామ పరాయణాః
                                                            భగవద్గీత 4 : 9

  2. స్పర్శాన్‌కృత్వా బహిర్సాహ్యాంశ్చక్షుశ్చైవాంతరే భ్రువో!
    ప్రాణాపానౌ సమౌకృత్వా నాసాభ్యంతర చారిణౌ

    యతేంద్రియ మనోబుద్ధి ర్మునిర్మోక్షపరాయణః
    విగతేచ్ఛాభయక్రోధో యస్సదా ముక్త ఏవ సః.
                                               అందులోనే 5 : 27-28.

  3. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నహ మవ్యయం
    వివస్వాన్ మనవే ప్రాహ మను రిక్ష్వాకవే౽బ్రవీత్.

    ఏవం పరంపరా ప్రాప్త మిమం రాజర్షయో విదుః
    స కాలే నేహ మహతా యోగో నష్టః పరంతప.
                                                      అందులోనే 4 : 1 - 2

  4. మానవధర్మశాస్త్రాలు లేదా మనుస్మృతి రచించిన ప్రాక్ చారిత్రక కాలపు గ్రంథకర్త. శాసనబద్ధం చేసిన ఈ సామాన్యధర్మవ్యవస్థలు భారతదేశంలో ఈనాటికీ అమలులో ఉన్నాయి.
  5. హిందూ పవిత్ర గ్రంథాల లెక్కల ప్రకారం భౌతికవాద యుగాల ఆరంభం, క్రీ. పూ. 3102లో జరిగింది. 12,000 సంవత్సరాల, అయన చక్రంలోని అవరోహణ క్రమంలో వచ్చే చివరి ద్వాపరయుగమూ, సుదీర్ఘమైన విశ్వ చక్రంలోని కలియుగమూ ఆ ఏటనే ఆరంభమయాయి.

10,000 ఏళ్ళ కిందట మానవజాతి అసభ్యమైన శిలాయుగంలో జీవించేదని నమ్మే మానవ శాస్త్రవేత్తలు చాలామంది, లుమేరియా, అట్లాంటిన్, భారతదేశం, చైనా, జపాను, ఈజిప్టు, మెక్సికో దేశాల్లోనూ అనేక ఇతర దేశాల్లోనూ విస్తృతంగా వ్యాప్తమైన అత్యంత ప్రాచీన నాగరికతల్ని “కట్టుకథల” కింద కొట్టిపారేస్తారు.

  • [తపఃస్వాధ్యా యేశ్వరప్రణిధానాని క్రియాయోగః] యోగ సూత్రాలు 2 : 1. క్రియాయోగమన్న మాట వాడడంలో పతంజలి, ఉత్తరోత్తరా బాబాజీ ఉపదేశించిన ప్రక్రియనికాని, దాదాపు అలాటి మరో ప్రక్రియనికాని ఉద్దేశించి ఉండవచ్చు. మొత్తానికి పతంజలి, ప్రాణశక్తిని అదుపులో పెట్టే కచ్చితమైన ఒకానొక ప్రక్రియను చెబుతున్నాడన్న విషయం యోగసూత్రాల్లో ఆయన చెప్పిన 2 : 49 సూత్రం (దీన్ని ఇక్కడే మరోచోట ఉదాహరించడం జరిగింది) వల్ల రుజువవుతోంది
  • [తస్య వాచకః ప్రణవః] అందులోనే 1 : 27
  • “దేవుడు చేసిన సృష్టి ఆదికి విశ్వసనీయమైన, సత్యమైన సాక్షి ‘ఆమెన్,’ ఈ సంగతులు చెబుతోంది.”- రివలేషన్ 3: 14. “ఆదిలో ఉంది శబ్దం; ఆ శబ్దం దేవుడి వద్ద ఉంది, ఆ శబ్దమే దేవుడు... అన్నీ ఆయన (శబ్దం లేదా ఓం) చేసినవే; ఆయన లేనిదే సృష్టిఅయినదేదీ సృష్టిఅయి ఉండేది కాదు.” - యోహాను 1 : 1-3. వేదాల్లో చెప్పిన ‘ఓం’కారం, టిబెటన్ల ‘హుం’ గానూ, ముస్లిముల ‘ఆమీన్ ’గానూ, ఈజిప్టువారూ గ్రీకులు రోమన్లూ, యూదులూ, క్రైస్తవులూ అనే ‘ఆమెన్’ గానూ అయింది. హిబ్రూ భాషలో దీనికి ‘నిశ్చయమైన, విశ్వాసం’గల అని అర్థం.
  • [తస్మిన్ సతి శ్వాసప్రశ్వాసయో ర్గతివిచ్చేదః. ప్రాణాయామః] -యోగ సూత్రాలు : : 49.
  • కోరింథియన్లు 15 : 31 (బైబిలు),
  • ‘వికల్ప’మనే సంస్కృత పదానికి ‘భేదం, తాదాత్మ్య రాహిత్యం’ అని అర్థం. సవికల్పం “భేదంతో కూడుకున్న సమాధి స్థితి,” నిర్వికల్పం “భేదం లేని” సమాధి స్థితి. అంటే సవికల్ప సమాధిలో భక్తుడు, భగవంతుడికంటె తాను భిన్నంగా ఉన్నానన్న అనుభూతి కొద్దిగా నిలుపుకొంటాడు, నిర్వికల్ప సమాధిలో ఆ పరమాత్మతో తాదాత్మ్యం అనుభవిస్తాడు.
  • “నాశనం కావలసిన చివరిశత్రువు మృత్యువు. ... 1 కోరింథియన్లు 15: 26 (బైబిలు). పరమహంస యోగానందగారి మరణానంతరం ఆయన భౌతికకాయం చెడిపోకుండా ఉండడం, ఆయన పూర్ణసిద్ధి పొందిన క్రియాయోగి అని నిరూపించింది. అయితే, చనిపోయిన తరవాత శారీరక అవినాశాన్ని మహాపురుషులందరూ ప్రదర్శించరు. అటువంటి అలౌకిక చర్యలు ఏదో ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం మాత్రమే జరుగుతాయని హిందూ పవిత్ర గ్రంధాలు చెబుతాయి. పరమహంస యోగానందగారి విషయంలో ఆ “ప్రత్యేక ప్రయోజనం” పాశ్చాత్యులు యోగశాస్త్రం విలువ తెలుసుకుని దాన్ని ఒప్పుకోడమే నన్నదాంట్లో సందేహం లేదు (ప్రచురణకర్త గమనిక)
  • షేక్‌స్పియర్ : సానెట్ 146.
  • [తపస్విభ్యో౽ధికో యోగీ, జ్ఞానిభ్యో౽పి మతో౽ధికః
    కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున.]
                                                     - భగవద్గీత 4 : 46

    శ్వాసించకపోవడంవల్ల శరీరంమీదా మనస్సుమీదా పడే అసాధారణమైన, నూతన శక్తిదాయకమైన ప్రభావాల్ని కనిపెట్టడం, ఆధునిక విజ్ఞానశాస్త్రం ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తోంది. న్యూయార్కులో ఉన్న కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్‌లో పనిచేసే డా॥ ఆల్వన్ ఎల్. బరాచ్ శ్వాసకోశాలకు స్థానికంగా విశ్రాంతి నిచ్చే వైద్యపద్ధతి ఒకటి రూపొందించాడు; దీనివల్ల క్షయరోగ పీడితులు చాలామందికి ఆరోగ్యం చేకూరుతోంది. ఊపిరి ఒత్తిడిని సరిసమానం చేసే గది (ఈక్వలైజింగ్ ప్రెషర్ ఛాంబర్ ) ని ఉపయోగించడంవల్ల రోగి ఊపిరి తీసుకోడం, ఆపెయ్యగలుగుతున్నాడు. 1947 ఫిబ్రవరి 1 తేదీ నాటి,

    “న్యూయార్క్ టైమ్స్” పత్రికలో, డా॥ బరాచ్ చెప్పినది. ఇలా పేర్కొన్నారు: “శ్వాస ఆగిపోవడంవల్ల కేంద్ర నాడీవ్యవస్థ మీద కలిగే ప్రభావం చాలా ఆసక్తికరమైనది. శరీరం చివరి భాగాల్లో ఉండే స్వయంపాలకమైన కండరాల్ని కదపాలన్న కోరిక చాలా తగ్గిపోతుంది. చేతులు కదపకుండాను, భంగిమ మార్చకుండాను కూడా రోగి, గంటల తరబడి ఆ గదిలో పడుకొని ఉండవచ్చు. స్వయంప్రేరితమైన శ్వాసక్రియ ఆగిపోయినప్పుడు రోగికి, పొగ తాగాలన్న కోరిక మాయమవుతుంది; రోజుకు రెండేసి పెట్టెల సిగరెట్లు కాల్చే అలవాటున్న వాళ్ళకు కూడా ఆ కోరిక పుట్టదు. అనేక సందర్భాల్లో, అటువంటి స్థితిలో కలిగే విశ్రాంతి ఏ విధంగా ఉంటుందంటే, రోగికి మనస్సును రంజింపజేసేవి ఏవీ అవసరం కావు. ఈ వైద్యం విలువను బహిరంగంగా రూఢిచేస్తూ డా. బరాచ్, 1951 లో ఇలా అన్నాడు, “ఇది ఊపిరితిత్తులకు మాత్రమే కాక , శరీరమంతకూ విశ్రాంతి ఇస్తుంది. మనస్సు విషయంలో ఇది మరీ స్పష్టం, మాట వరసకి, గుండె చేసే పనిలో మూడోవంతు తగ్గిపోతుంది. రోగులు ఆందోళన పడడం మానేస్తారు. ఎవరికి విసుగు పుట్టదు.”

    ఈ యథార్థాల్నిబట్టి యోగులకు, మానసికంగాగాని శారీరకంగాగాని నిర్విరామ కార్యకలాపాలు జరపాలన్న అభిలాషలేకుండా సుదీర్ఘకాలాలు నిశ్చలంగా కూర్చోడం ఎలా సాధ్యమవుతుందో గ్రహించడం మొదలుపెడతారు. అటువంటి ప్రశాంత స్థితిలో మాత్రమే ఆత్మ, తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళేదారి కనుక్కుంటుంది. శ్వాసించకపోవడంవల్ల నిర్దిష్టమైన కొన్ని లాభాలు పొందడానికి, మామూలు మనిషికయితే ఈక్వలైజింగ్ ప్రెషర్ చాంబర్ తప్పకుండా ఉండవలసిన అవసరం ఉన్నప్పటికీ, యోగికి మాత్రం, శారీరకంగానూ మాససికంగానూ ఆత్మజ్ఞానపరంగానూ లాభాలు పొందడానికి, క్రియాయోగం తప్ప మరేమీ అక్కరలేదు.