ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 17
అధ్యాయం : 17
శశి, మూడు నీలాలు
“నువ్వూ మా అబ్బాయీ శ్రీ యుక్తేశ్వర్‌స్వామి గురించి ఎంతో గొప్పగా తలుస్తున్నారు కనక నేనోసారి అలా చూసి వస్తాను.” అన్నాడు డా॥ నారాయణచందర్‌రాయ్‌గారు. ఆయన కంఠస్వరంలో, వెర్రిబాగుల వాళ్ళని వేళాకోళం చేసే తీరు ధ్వనించింది. అయితే, అవతలివాళ్ళని తన మతంలోకి మార్చడానికి ప్రయత్నించే ప్రచారకుడు పాటించే సత్సంప్రదాయాల్ని అనుసరించి నేను, నా కోపాన్ని పైకి కనిపించకుండా చేసుకున్నాను.
కలకత్తాలో పశువైద్యులుగా ఉన్న డా॥ రాయ్‌గారు, అచ్చుగుద్దిన అజ్ఞేయవాది (అగ్నాస్టిక్). ఆయన చిన్న కొడుకు సంతోష్, వాళ్ళ నాన్న గారి విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోమని నన్ను ప్రాధేయపడ్డాడు. ఇంతవరకు నా అమూల్యమైన సహాయం అదృశ్యంగానే ఉంటూ వచ్చింది.
ఆ మర్నాడు డా॥ రాయ్ నాతో శ్రీరాంపూర్ ఆశ్రమానికి వచ్చారు. తమను కలుసుకోడానికి గురుదేవులు ఆయనకి అనుమతి ఇచ్చిన తరవాత, వారు కలిసిన కొద్దిసేపూ ఇద్దరి మధ్యా మాటామంతీ లేకుండానే గడిచిపోయింది, చూడవచ్చినాయన హఠాత్తుగా లేచి వెళ్ళి పోయారు.
“చనిపోయినవాణ్ణి ఆశ్రమానికెందుకు తీసుకువచ్చావు?” అంటూ నావేపు పట్టిపట్టి చూశారు గురుదేవులు, ఆ సంశయాళువు వెళ్ళిపోయాక తలుపు మూసెయ్యగానే.
“గురుదేవా, ఆ డాక్టరుగారు సలక్షణంగా జీవించే ఉన్నారు కదండీ!”
“కాని త్వరలో చనిపోతాడు.”
ఆ మాటకు నేను అదిరిపడ్డాను. “ఆయన కొడుక్కిది పెద్ద దెబ్బ అవుతుంది. వాళ్ళ నాన్న గారి భౌతికవాద భావాల్ని మార్చడానికి టైము వస్తుందని సంతోష్ ఆశిస్తున్నాడు. ఆయనకి ఎలాగయినా మీరు సాయం చేయ్యాలని వేడుకుంటున్నాను.”
“సరే నీకోసం.” గురుదేవుల ముఖంలో ఉత్సాహమేమీ లేదు.
“ఈ పొగరుబోతు గుర్రాల డాక్టర్‌కి మధుమేహం బాగా ముదిరింది; ఆ సంగతి ఇతనికి తెలియదు. పదిహేనురోజుల్లో మంచం పడతాడు. ఇంక ఇతని పని అయిపోయినట్టేనని వదిలేస్తారు వైద్యులు; ఇతను ఈ లోకం విడిచిపోవడానికి సహజంగా నిర్ణయమైన కాలం, ఈవేళటికి ఆరు వారాలు, అయినా నువ్వు కలగజేసుకున్నావు కాబట్టి ఆ రోజున కోలు కుంటాడు. కాని ఒక్క షరతు; అతను గ్రహశాంతికోసం దండకడియం ఒకటి వేసుకునేటట్టు చెయ్యాలి. అయితే ఆపరేషను చెయ్యబోయేముందు గుర్రం ఎంత తీవ్రంగా విజృంభించి ప్రతిఘటిస్తుందో, అంత తీవ్రంగానూ అతను దాన్ని ప్రతిఘటిస్తాడనడంలో సందేహం లేదు,” అంటూ ముసి ముసిగా నవ్వారు గురుదేవులు.
డాక్టరుగారు దండకడియం వేసుకునేటట్టుగా బుజ్జగించి ఒప్పించడానికి, నేనూ సంతోషూ ఎలా ఒడుపులు వెయ్యాలా అని నేను ఆలోచిస్తూ ఉండగా శ్రీ యుక్తేశ్వర్‌గారు మరికొన్ని రహస్యాలు వెల్లడించారు. “ఆరోగ్యం మెరుగయిన తరవాత ఆయన్ని మాంసం తినొద్దని చెప్పు. అయినా నీ సలహా చెవినిపెట్టడనుకో; ఇంకో ఆరు నెల్లలో, తన ఆరోగ్యం అద్భుతంగా ఉందని అనుకునే రోజుల్లోనే చటుక్కున రాలి పోతాడు,” అని చెబుతూ మా గురుదేవులు, “ఆయుర్దాయంలో ఈ ఆరు నెల్ల పొడిగింపూ నువ్వు బతిమాలడంవల్లనే మంజూరయింది,” అని కూడా అన్నారు.
మరుసటి రోజున, కడియం చెయ్యడానికి ఒక కంసాలికి పురమాయించమని సంతోష్‌కు చెప్పాను. ఒక వారానికల్లా అది సిద్ధమైంది. కాని డా॥ రాయ్‌గారు దాన్ని వేసుకోనన్నారు.
“నా ఆరోగ్యం భేషుగ్గా ఉంది. జ్యోతిషానికి సంబంధించిన ఈ మూఢవిశ్వాసాలతో నన్ను మభ్యపెట్టలేవు,” డాక్టరుగారు నావేపు కొర కొరా చూశారు.
గురుదేవులు ఈయన్ని మొండికేసిన గుర్రంతో పోల్చడం సబబుగానే ఉందన్న సంగతి గుర్తుకు వచ్చి నవ్వుకున్నాను. మరో ఏడు రోజులు గడిచాయి; డాక్టరుగారు హఠాత్తుగా జబ్బు పడ్డారు. దాంతో ఆయన మెత్తబడి, కడియం వేసుకోడానికి ఒప్పుకున్నారు. మరో రెండు వారాలకి, ఆయనకి వైద్యంచేస్తున్న డాక్టరు, ఆయనమీద ఇంక ఆశ లేదని నాతో చెప్పాడు. మధుమేహంవల్ల లోలోపల కలిగే భయంకరమైన దుష్పరిణామాలు వివరించాడు.
నేను తల ఆడించాను. “ఒక నెల్లాళ్ళు జబ్బుతో బాధపడ్డ తరవాత డా॥ రాయ్‌గారికి మెరుగవుతుందని మా గురువుగారు చెప్పారండి,” అన్నాను.
ఆ డాక్టరు నా మాట నమ్మలేనట్టుగా నావేపు చూశారు. మరో పదిహేను రోజుల తరవాత, తన పొరపాటు తెలుసుకున్నట్టుగా నన్ను బయటికి పిలిచారు.
“డాక్టర్ రాయ్‌గారు పూర్తిగా కోలుకున్నారు!” అంటూ ఆశ్చర్యం ప్రకటించారు. “నా అనుభవంలో ఇంతకన్న ఆశ్చర్యకరమైంది మరొకటి లేదు. ఇంక రేపోమాపో అనిపించేటట్టున్నవాడు ఇంత చిత్రంగా కోలుకోడం ఎన్నడూ చూడలేదు. మీ గురువుగారు నిజంగా, రోగాలు నయంచేసే ప్రవక్త అయి ఉండాలి!”
డా॥ రాయ్‌గారిని ఒకసారి కలుసుకుని, మాంసం కలవని భోజనం చెయ్యమని శ్రీ యుక్తేశ్వర్‌గారు ఇచ్చిన సలహా మళ్ళీ గుర్తుచేసి వచ్చిన తరవాత, ఆరు నెలలదాకా ఆయన్ని చూడలేదు. ఒకనాడు సాయంత్రం నేడు గుర్పార్ రోడ్డులో ఉన్న మా ఇంట్లో వసారాలో కూర్చుని ఉండగా, ఆయన మా ఇంటిదగ్గర కాసేపు మాట్లాడిపోదామని ఆగారు.
“మీ గురువుగారికి చెప్పు; తరచు మాంసం తింటూండడం వల్లే నేను పూర్తిగా బలం పుంజుకున్నానని. పథ్యాన్ని గురించి ఆయనకున్న శాస్త్రవిరుద్ధమైన అభిప్రాయాలు నా మీద పనిచెయ్యలేవు.” నిజమే డాక్టర్ రాయ్‌గారు ఆరోగ్యం రూపుగట్టినట్టున్నారు.
కాని ఆ మర్నాడే సంతోష్, పక్క బ్లాకులోఉన్న వాళ్ళ ఇంటినించి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, “నాన్నగారు పొద్దునే పోయారు!” అని చెప్పాడు.
గురుదేవుల సన్నిధిలో నాకు కలిగిన అతి విచిత్రమైన అనుభవాల్లో ఇది ఒకటి. ఆ పొగరుబోతు పశువైద్యుడు ఎంత అపనమ్మకంగా ఉన్నప్పటికీ గురుదేవులు ఆయనకి నయంచేశారు; ఆయన ఆయుర్దాయాన్ని మరో ఆరు నెలలు పొడిగించారు. నేను ప్రాధేయపడి కోరినందువల్లే ఇది జరిగింది. భక్తు డెవరయినా మనసారా ప్రార్థించినప్పుడు అతని కోరిక తీర్చడంలో గురుదేవులు చూపించే దయకు అవధులు ఉండవు.
మా కాలేజి స్నేహితుల్ని గురుదేవుల దర్శనానికి తీసుకురావడం నాకు గర్వకారణంగా ఉండేది. వాళ్ళలో చాలామంది, మత విషయపరమైన సంశయశీలత అనే, విద్యావంతుల షోకు ముసుగును. కనీసం ఆశ్రమంలో!- తీసి పక్కకి పెట్టేసేవారు.
మా స్నేహితుల్లో ఒకరు శశి. చాలాసార్లు వారం చివరి సెలవు రోజులు శ్రీరాంపూర్‌లో హాయిగా గడిపేవాడు. గురుదేవులకు వాడంటే వల్లమాలిన ఇష్టం కలిగింది. కాని వాడి ఆంతరంగిక జీవితం విచ్చలవిడిగా, అడ్డదిడ్డంగా ఉన్నందుకు ఆయన నొచ్చుకునేవారు.
“శశీ, నువ్వు కనక సరిగా మారకపోతే, ఇంకొక్క ఏడాదిలో నీకు చాలా పెద్దజబ్బు చేస్తుంది.” శ్రీ యుక్తేశ్వర్‌గారు మా స్నేహితుడివేపు, ఆప్యాయతతో కూడిన ఆగ్రహంతో చూశారు. “దీనికి ముకుందుడు సాక్షి; ముందే హెచ్చరించలేదని తరవాత నన్ననకు.”
శశి నవ్వాడు. “గురుదేవా, నాలాంటి దురదృష్టవంతుడి విషయంలో దేవుడు దయతలిచేలా చేసే భారం మీ మీదే పెడుతున్నాను! నా అంతరాత్మ అంగీకరిస్తోంది, కాని నా మనస్సు బలహీనంగా ఉంది. ఈ లోకంలో మీ రొక్కరే నాకు రక్షకులు; మరి దేన్నీ నేను నమ్మను.”
“కనీసం రెండు కారెట్ల నీలం ఒకటి ధరించాలి నువ్వు, అది నీకు సాయపడుతుంది.”
“అది కొనే తాహతు నాకు లేదండి. అయినా గురుదేవా, కష్టం వస్తే మీరు తప్పకుండా నన్ను కాపాడతారని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను.” “ఇంకో ఏడాదిలో నువ్వు మూడు నీలాలు తెస్తావు,” అని చెబుతూ శ్రీ యుక్తేశ్వర్‌గారు, “అప్పుడింక వాటితో పని ఉండదు,” అని కూడా అన్నారు.
ఈ విషయంలో ప్రతిరోజూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉండేది. “నేను మారలేను!” అంటూ హాస్యాస్పదమైన నిస్పృహతో అంటూండే వాడు శశి. “అయినా గురుదేవా, మీ మీద నాకున్న విశ్వాసం, రాయి కన్న నాకు అమూల్యమయింది!”
ఒక ఏడాది గడిచింది, ఒకనాడు మా గురుదేవులు కలకత్తాలో నరేన్‌బాబు అనే శిష్యుడి ఇంట్లో ఉండగా నేను ఆయన దర్శనానికి వెళ్ళాను. పొద్దుట సుమారు పది గంటలవేళ. శ్రీ యుక్తేశ్వర్‌గారూ నేనూ రెండో అంతస్తులో కూర్చుని ఉండగా వీథి గది తలుపు తెరుచుకున్న అలికిడి అయింది. గురుదేవులు బింకంగా నిటారుగా మారారు.
“ఆ వచ్చినవాడు శశి,” అన్నారు గంభీరంగా. “ఇప్పటితో ఏడాది గడిచిపోయింది. అతని ఊపిరితిత్తులు రెండూ చెడిపోయాయి. అతను నా మాట లెక్క పెట్టలేదు. నే నిప్పుడు చూడదలుచుకోలేదని అతనికి చెప్పు.”
శ్రీయుక్తేశ్వర్‌గారి నిష్ఠురతకు నేను కొంచెం కొయ్యబారి, గబగబా మెట్లమీంచి కిందికి పరిగెత్తాను. శశి మెట్లెక్కుతున్నాడు.
“ఓ ముకుందా! గురువుగారు ఇక్కడే ఉన్నారనుకుంటాను. నా మనను కలా అనిపించింది.”
“ఉన్నారు. కాని ఇప్పుడెవరూ ప్రశాంతికి భంగం కలిగించడం ఆయనకు ఇష్టం ఉండదు.”
శశికి గభాలున కళ్ళనీళ్ళు వచ్చాయి. నన్ను దూసుకుంటూ పైకి వెళ్ళాడు. శ్రీయుక్తేశ్వర్‌గారి కాళ్ళమీద పడి, అందమైన మూడు నీలాలు అక్కడ పెట్టాడు.
“సర్వజ్ఞులైన గురుదేవా, నాకు ఊపిరితిత్తులకు సంబంధించిన క్షయరోగం వచ్చిందని డాక్టర్లు అంటున్నారు. ఇంక మూడునెల్లే ఆయుర్దాయ ముందంటున్నారు. మీ సహాయం కోసం సవినయంగా ప్రాధేయ పడుతున్నాను; మీరు నయం చెయ్యగలరని నాకు తెలుసు!”
“నీ జీవితాన్ని గురించి ఆందోళనపడ్డానికి ఇప్పటికే కాస్త ఆలస్యం కాలేదూ? నీ మణులు నువ్వు తీసుకువెళ్ళిపో; వాటి ఉపయోగం అయిపోయింది. ఆ తరవాత గురుదేవులు మాటాపలుకూ లేకుండా బింకంగా కూర్చున్నారు. మధ్యమధ్య ఆ అబ్బాయి దయతలచమని ఆక్రందన చేస్తున్నాడు.
రోగనివారణ చేసే దివ్యశక్తి మీద శశికి ఉన్న విశ్వాసం ఎంత గాఢమైనదో కేవలం పరీక్షించడానికే శ్రీయుక్తేశ్వర్‌గారు ఇలా చేస్తున్నారన్న దృఢవిశ్వాసం నా అంతర్బుద్ధికి స్ఫురించింది. ఒక గంటసేపు బింకంగా ఉన్న తరవాత గురుదేవులు, తమ కాళ్ళదగ్గిర పడిఉన్న కుర్రవాడి మీద జాలి చూపులు ప్రసరించినప్పుడు నేను ఆశ్చర్యపోలేదు.
“లే శశీ! పరాయివాళ్ళింట్లో ఎంత కల్లోలం చేస్తున్నావు నువ్వు? ఈ నీలాలు దుకాణంలో తిరిగి ఇచ్చెయ్యి. వాటివల్ల అనవసరపు ఖర్చు ఇప్పుడు. అయితే గ్రహశాంతికి పనికివచ్చే కడియం తెచ్చి వేసుకో. భయపడకు; కొద్ది వారాల్లో నీకు నయమవుతుంది.”
కన్నీళ్ళతో తడిసి ముద్దయిన శశి ముఖంలో విరిసిన చిరునవ్వు, నానిన నేలమీద చటుక్కున పడ్డ ఎండలా ఉంది. “గురుదేవా, డాక్టర్లు చెప్పిన మందులు వాడమంటారా?” "నీ ఇష్టం― తాగినా సరే, పారబోసినా సరే; ఏదైనా పరవాలేదు. సూర్యుడూ చంద్రుడూ ఒకరి స్థానంలోకి మరొకరు మారడం ఎంత అసంభవమో, నువ్వు క్షయవల్ల చనిపోవడం అంత అసంభవం,” అని చెప్పి శ్రీయుక్తేశ్వర్‌గారు చటుక్కున, “నేను మనస్సు మార్చుకోకముందే వెళ్ళిపో ఇంక!”
గాభరాగా వంగి నమస్కారంచేసి గబగబా వెళ్ళిపోయాడు మా స్నేహితుడు. ఆ తరవాతి వారాల్లో వాణ్ణి చూడ్డానికి నేను చాలాసార్లు వెళ్ళాను; కాని వాడి పరిస్థితి రానురాను మరీ దిగజారిపోతుండడం చూసి నివ్వెరపోయాను.
“శశికి ఈ రాత్రి గడవదు.” అంటూ వైద్యుడన్న మాటలూ దాదాపు ఎముకల గూడులా దిగజారిపోయి వాడు కనిపిస్తున్న తీరు చూసి ఉండబట్టలేక నేను హుటాహుటిని బయలుదేరి శ్రీరాంపూర్ వెళ్ళాను. నేను కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ చెప్పిన సమాచారమంతా ఉదాసీనంగా విన్నారు.
“నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎందుకొస్తావిక్కడికి? శశి కోలుకుంటాడని నేను హామీ ఇవ్వడం నువ్వు విన్నావే!”
నేను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆయనకు ప్రణామంచేసి గుమ్మం దగ్గరికి వెళ్ళాను. శ్రీయుక్తేశ్వర్‌గారు వీడుకోలు మాట ఏమీ చెప్పకుండా మౌనంలోకి వెళ్ళిపోయారు. రెప్పలార్పని ఆయన కళ్ళు అరవిచ్చి ఉన్నాయి; ఆయన చూపు లోకాంతరానికి పయనించింది.
వెంటనే నేను కలకత్తాలో శశి ఇంటికి వెళ్ళాను. మావాడు మంచం మీద కూర్చుని పాలు తాగుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాను.
“ముకుందా! ఎంత అద్భుతం జరిగిందనుకున్నావు! నాలుగు గంటల కిందట ఈ గదిలో గురుదేవుల ఉనికి నాకు అనుభవమయింది; వెంటనే నా భయంకర రోగ లక్షణాలన్నీ మటుమాయమయాయి. ఆయన దయవల్ల, నాకు పూర్తిగా బాగయినట్టు అనిపిస్తోంది.”
కొద్ది వారాల్లో శశి బాగా ఒళ్ళు చేశాడు. అదివరకు ఎన్నడూ లేనంతగా వాడి ఆరోగ్యం మెరుగుపడింది.[1] అయితే రోగం నయమైన మీదట వాడి వైఖరిలో కృతఘ్నత మిళితమైంది; మళ్ళీ శ్రీయుక్తేశ్వర్ గారిని దర్శించడం అరుదైపోయింది! ఒకనాడు వీడు నాతో అన్నాడు, తన వెనకటి జీవన విధానానికి గాఢంగా పశ్చాత్తాపపడుతూ, గురుదేవుల ఎదుట పడాలంటే ముఖం చెల్లడంలేదని అన్నాడు.
అయితే, శశికి వచ్చిన జబ్బు ఒక పక్క వాడి సంకల్పశక్తిని దృఢంచేసి మరోపక్క వాడి నడతకు చెరుపుచేసి విరుద్ధ ఫలితాలు చూపించిందని నాకు నిర్ధారణ అయింది.
స్కాటిష్ చర్చి కాలేజిలో నా మొదటి రెండేళ్ళ చదువు పూర్తి కావచ్చింది. తరగతి గదుల్లో నా హాజరు అరుదయిపోయింది. నేను సాగించిన కొద్దిపాటి చదువూ ఇంట్లో పోరులేకుండా చేసుకోడానికే. నా ప్రయివేటు ట్యూటర్లు ఇద్దరూ యథావిధిగా వస్తూండేవారు; నేను మాత్రం యథావిధిగా గైర్‌హాజరు; నా విద్యాభ్యాస జీవితంలో కనిపించే క్రమబద్ధత ఇదొక్కటే అనుకుంటాను!
భారతదేశంలో కాలేజిలో రెండేళ్ళ చదువు పూర్తి చేసి ఉత్తీర్ణులయితే ఇంటర్మీడియట్ ఆర్ట్స్ డిప్లమా వస్తుంది. ఆ తరవాత విద్యార్థి, మరో రెండేళ్ళకు బి. ఏ. డిగ్రీకోసం ఎదురు చూడవచ్చు.
ఇంటర్మీడియట్ ఆర్ట్స్ చివరి పరీక్షలు అరిష్టంలా ఎదుట కనిపిస్తు న్నాయి. వెంటనే పూరీ పరిగెత్తాను. మా గురుదేవులు కొన్ని వారాలుగా అక్కడుంటున్నాడు. పోన్లే, నువ్వు చివరి పరీక్షలకి వెళ్ళక్కర్లేదని ఆయన అంటారేమోనని రవ్వంత ఆశపడుతూ, నేనా పరీక్షలకి బొత్తిగా సిద్ధంకాకుండా ఉన్నానన్న సంగతి ఆయనకి నివేదించుకున్నాను.
శ్రీయుక్తేశ్వర్‌గారు చిరునవ్వు నవ్వుతూ నన్ను సముదాయించారు. “నువ్వు మనసారా ఆధ్యాత్మిక సాధన చేశావు. అంచేత కాలేజి చదువు ఉపేక్షించకుండా ఉండలేకపోయావు. వచ్చేవారం మాత్రం జాగ్రతగా పుస్తకాల్లో మునిగి ఉండు; ఓటమి లేకుండా గండం దాటతావు.”
అప్పుడప్పుడు నాలో సహేతుకంగా తల ఎత్తే సందేహాల్ని అణిచేసుకుంటూ కలకత్తాకు తిరిగి వచ్చాను. నా బల్ల మీదున్న పుస్తకాల గుట్టను పరకాయిస్తూ, నట్టడివిలో దారి తప్పిన బాటసారిలా ఆందోళన పడ్డాను.
చాలాసేపు ధ్యానం చేసిన మీదట నాకు శ్రమను తగ్గించే ఉత్తేజం కలిగింది. ప్రతి పుస్తకం అలవోకగా తెరిచి, ఎదుట కనిపించిన పుటలు మాత్రమే చదువుతూ వచ్చాను. ఇలా రోజుకు పద్దెనిమిది గంటల చొప్పున వారం రోజులపాటు ఈ పద్ధతి కొనసాగించే సరికి కంఠస్థం చెయ్యడమన్న కళలో నేను ఆరితేరాననిపించింది.
అడ్డాదిడ్డిగా కనిపించే నా దైవాధీనం చదువును, పరీక్ష హాళ్ళలో గడిచిన ఆ తరవాతి రోజులే సబబని నిరూపించాయి. పరీక్షలన్నీ ప్యాసయాను, వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పించుకొని. నా స్నేహితులూ మా ఇంట్లో వాళ్ళూ కురిపించిన అభినందనల్లో, నమ్మకశక్యం కానిదేదో జరిగినప్పుడు కనబరిచే ఆశ్చర్యం కూడా పొడగట్టింది. పూరీనుంచి శ్రీరాంపూర్ తిరిగివచ్చిన తరవాత శ్రీయుక్తేశ్వర్‌గారు నన్ను ఆనందచకితుణ్ణి చేశారు.
“ఇంక నీ కలకత్తా చదువు అయిపోయింది. యూనివర్సిటీ చదువులో చివరి రెండేళ్ళూ నీకు ఇక్కడే, శ్రీరాంపూర్‌లో సాగేటట్టు చూస్తాను.”
నేను బిత్తరపోయాను. “గురుదేవా, ఈ ఊళ్ళో బాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్సు లేదండి,” అన్నాను. ఉన్నత విద్య బోధించే ఏకైక సంస్థ అయిన శ్రీరాంపూర్ కాలేజిలో రెండేళ్ళ ఇంటర్మీడియట్ కోర్సే ఉంది.
గురువుగారు కొంటెగా చిరునవ్వు నవ్వారు. “నీ కోసం బి. ఏ. కాలేజి పెట్టాలని చందాలు పోగు చెయ్యడానికి తిరగాలంటే ఈ ముసలితనంలో నా వల్ల కాదు. ఈ పని మరొకరి ద్వారా ఏర్పాటు చేయించాలనుకుంటాను.”
రెండు నెలల తరవాత శ్రీరాంపూర్ కాలేజి అధ్యక్షులు ప్రొఫెసర్ హోవెల్స్, నాలుగేళ్ళ కోర్సు నడపడానికి కావలసిన నిధులు సంపాదించండంలో తాము కృతకృత్యులమయామని బహిరంగంగా ప్రకటించారు. శ్రీరాంపూర్ కాలేజీ, కలకత్తా విశ్వవిద్యాలయానికి పూర్తి అనుబంధ శాఖ అయింది. శ్రీరాంపూర్‌లో బి. ఏ. తరగతిలో చేరిన తొలుతటి విద్యార్థుల్లో నే నొకణ్ణి.
“గురుదేవా, నా మీద మీ కెంత దయండి! కలకత్తా విడిచిపెట్టి, శ్రీరాంపూర్‌లో మీకు దగ్గరగా ఉండాలని ఎంతకాలం నుంచో ఉవ్విళ్ళూరుతున్నాను. పెదవి కదపకుండా మీరు చేసిన సహాయానికి ప్రొఫెసర్ హోవెల్స్‌గారు మీకు ఎంత ఋణపడి ఉన్నారో ఆయనకు తెలియదు!”
శ్రీయుక్తేశ్వర్‌గారు, తెచ్చి పెట్టుకున్న బింకంతో నావేపు చూపు సారించారు. “ఇప్పుడు నువ్వు రైళ్ళలో గంటలకొద్దీ గడపవలసిన అవసరం ఉండదు. నీ చదువుకు ఎంత తీరిక చిక్కుతుందో! బహుశా నువ్వు చివరి క్షణంలో కంఠస్థం చెయ్యడం తగ్గించి సరైన విద్యార్థివవుతా వనుకుంటాను.”
కాని ఎంచేతనో ఆయన కంఠస్వరంలో విశ్వాసం కొరవడింది.[2]
- ↑ శశి ఆరోగ్యం ఇప్పటికీ అద్భుతంగానే ఉందని 1956 లో ఒక స్నేహితుడు చెప్పగా విన్నాను.
- ↑ శ్రీయుక్తేశ్వర్‌గారు, చాలామంది ఋషులలాగే, ఆధునిక విద్యలోని భౌతికవాద ధోరణిని విచారించేవారు. సంతోషం కోసం ఆధ్యాత్మిక నియమాల్ని ప్రబోధించడం కాని, ‘దేవుడి మీది భయం’తో- అంటే సృష్టికర్త పట్ల భయ భక్తులతో- జీవితం సాగించడంలోనే జ్ఞానం ఉందని బోధించడంకాని చేసే విద్యాలయాలు చాలా తక్కువ.
మానవుడు కేవలం “ఉన్నత స్థాయి జంతువు” అంటూ ఈనాడు కళాశాలల్లోనూ ఉన్నత పాఠశాలల్లోనూ చెప్పగా వినే కుర్రవాళ్ళు తరచు నాస్తికులవుతూ ఉంటారు. వాళ్ళు ఆత్మశోధన ఏమీ చెయ్యరు; తమ మూలప్రకృతిని “దేవుడి ప్రతిరూపం”గా పరిగణించరు. ఎమర్సన్ ఇలా అన్నాడు: “మన లోపం ఏముందో అదే బయట చూడగలుగుతాం. మనకు దేవుళ్ళెవరూ తటస్థ పడడం లేదంటే, మన మెవర్నీ ఆశ్రయించకపోవడమే దానికి కారణం.” తన పశుప్రకృతి ఒక్కటే వాస్తవంగా భావించేవాడు దివ్యాభిలాషలకు దూరమవుతాడు. మానవ అస్తిత్వానికి పరమాత్మను కేంద్ర బిందువుగా చూపని విద్యావ్యవస్థ ‘అవిద్య’ నేర్పుతున్నట్టే. అంటే మిథ్యాజ్ఞానాన్ని బోధిస్తున్నట్టే లెక్క. “నేను సంపన్నుణ్ణి అనీ, వస్తుసంపాదనతో అభివృద్ధికి వచ్చాననీ, నా కింకేదీ అవసరం లేదనీ అంటావు నువ్వు. కాని నీకు తెలియదు. నువ్వు వట్టి దిక్కుమాలిన వాడివనీ, దౌర్భాగ్యుడవనీ, దరిద్రుడివనీ, గుడ్డివాడివనీ, దిగంబరుడివనీ.” (రివలేషన్ 3-17).
ప్రాచీన భారతదేశంలో కుర్రవాళ్ళ విద్యాభ్యాసం ఆదర్శవంతంగా ఉండేది. తొమ్మిదేళ్ళ వయస్సులో విద్యార్థిని గురుకులం (గురువుల కుటుంబ నివాసమే విద్యాలయం) లో “పుత్రుడిగా” చేర్చుకునేవారు. “ఈ కాలపు కుర్రవాడు తన కున్న టైములో (ఏడాదికి) ఎనిమిదోవంతు మాత్రమే పాఠశాలలో గడుపుతాడు; కాని భారతీయుడు అన్ని వేళలా అక్కడే గడుపుతాడు,” అని రాస్తారు ప్రొఫెసర్ ఎస్. వి. వెంకటేశ్వర , ‘ఇండియన్ కల్చర్ త్రూ ఏజెస్’ (సంపుటి 1; లాంగ్మన్స్ గ్రీన్ అండ్ కంపెనీ) అన్న గ్రంథంలో. “ఆ రోజుల్లో ఐకమత్యమూ బాధ్యతతో కూడిన ఆరోగ్యకరమైన అనుభూతి ఉండేది; స్వావలంబన, వ్యక్తిత్వ వికాసాల సాధనకు సంపూర్ణావకాశం ఉంటుండేది. అత్యుత్తమ సంస్కారం, తనకు తానుగా విధించుకొన్న క్రమశిక్షణ, విధివిధేయత, నిస్స్వార్థకృషి, త్యాగ బుద్ధి, ఆత్మగౌరవం, ఇతరుల మీద గౌరవం ఉంటుండేవి. ఉన్నత ప్రమాణంలో విద్యాసంబంధమైన హుందాతనం, ఔదార్య స్పృహ, మానవ జీవిత పరమార్థ దృష్టి ఉండేవి”