ఏను మరణించుచున్నాను; ఇటు నశించు

ఏను మరణించుచున్నాను; ఇటు నశించు

నా కొరకు చెమ్మగిల నయనమ్ము లేదు;

పసిడివేకువ పెండ్లిండ్ల పడిన యెవరు

కరగనేర్తురు జరఠాంధకారమృతికి?


నా మరణశయ్య పరచుకొన్నాను నేనె!

నేనె నాకు వీడ్కొలుపు విన్పించినాను!

నేనె నాపయి వాలినా, నేనె జాలి

నెదనెద గదించినాను, రోదించినాను!


బ్రతికియున్న మృత్యువునై ప్రవాసతిమిర

నీరవసమాధి క్రుళ్ళి క్రుంగినపు డేని

నిను పిలిచినాన, నా మూల్గునీడ ముసిరి

కుములునేమొ నీ గానోత్సవముల ననుచు?


ఇదియె నాచితి, పేర్చితి, నేనె దీని

వదలిపోని నా యవసానవాంఛ గాగ;

వడకని కరాలు రగులుచు దుడుకుచిచ్చు

లాలనల నింత నుసిగాగ కాలు త్రుటినె!


అలయు వాతెర యూర్చుగాలులు కదల్చి

రేపు నంతె నా కష్ఠాల రేగు మంట

మును బ్రతుకునట్ల నా దేహమును దహింపు!

పడదులే ఆర్పగా నొక బాష్ప మేని!