ఎన్ని యెన్ని నిశ్వాసము లెగసినవియొ
ఎన్ని యెన్ని నిశ్వాసము లెగసినవియొ
ఈ బ్రతుకె రూపు మాసిపోయినది గాని,
ఇంత విశ్వములో జాలి నింత నీడ
ఒదవగా లేద యొమ్మ నిట్టూరుపునకు.
కంట కురిసిన కార్చిచుమంట యేళ్ళ
కాలి నుసియై నశించె వాంఛా లవాలె;
ఏ రెరుంగుదు రని ఏ యెడారిదార్ల
నింకెనో చుక్కతడి జాడ యేని లేక.
కరుణపట్టున కీ బిచ్చగానిచేయి
చాచికొనినాడ మృత్యు ఘోషమ్మె మరచి;
వట్టిబయలున నొక మ్రోడుచెట్టు వోలె
ఎత్తినది మర మెత్తినట్లే కృశించె.
కనులు రెండును బండిచక్రము లయ్యె
చనవుచూపున కెరుకనవ్వునకు వెదకి;
ఎందులకొ వెర్రిమదిలోలె నిపుడు తిరుగు
చూపులే లేక అజ్ఞాత శూన్యసీమ.
స్వాగ తాశ్లేషమున విడజాలు నెదల
నల్ల ద్రావితి మున్ను దోసిళ్ళకొలది;
వలపుటాకలి స్రుక్కు నా బ్రతుకుమీద
ఇనుపపాదాల నిడి లోక మిపుడు నడుచు.
ఆశయమ్ముల ఆనందలేశముల, అ
లంతియాసల జీతిత మంత, ఇట్లె
యేడ్చివైచితి, వినువారె యేరు లేక
యేడ్పుసందడి నాలోననే చొరంగ!
వడవడ వడంకిపోదు జీవనపు కొనల
నెన్నడె నాసకళ తలయెత్తెనేని,
ఉభయ సంధ్యాంచలముల నెదో వెలుంగు
కలుగ కలవరపోవు ఘాకమ్ము వోలె.
మింట వెలుగు చుక్క గన్న మిణుగు రన్న
నేను సహియింపలే, నవ్వి యిరులు చెరుచు;
నాకు ప్రాణమే మెరపులే లేక యున్న
భాద్రపదమాసమున నమావాస్యరాత్రి!
రేయి కడుపున చీకటి చాయ వోలె,
తమసు టెడద దివాంధ గీతము విధాన,
ఘూక రావాన వలవంత రేక రీతి
నా విషాదమ్ములో దాగినాడ నేనె!