ఎందరో వికీమీడియన్లు/వికీసోర్సుకు దేవీప్రసాదం
వికీసోర్సుకు దేవీప్రసాదం
దేవీప్రసాదశాస్త్రి గారు 2020 ఏప్రిల్ లో తెవికీసోర్సులో స్వచ్ఛంద కృషి ప్రారంభించిన నాటి నుంచి దాదాపు నాలుగేళ్ళ కాలంలో ఆయన వికీసోర్సులో దిద్దుబాట్లు చేయని రోజులు ఏమున్నాయో వెతకడం, సముద్రపు ఇసుకలో పుంజీడు గుండుసూదులు పారేసి వెతకడం లాంటిది. ఉద్యోగానికి సెలవులు ఉంటాయి కానీ ఉద్యమానికి సెలవులు ఎందుకు అనుకున్నారో ఏమో కానీ నియమం ఉన్నట్టే స్వేచ్ఛా గ్రంథాలయంలో రోజూ కృషి సాగిస్తున్నారు. దాదాపు 40 వేల దిద్దుబాట్లు చేసారు.
ఒక్కో పేజీని టైప్ చేస్తూ, తప్పులు సరిదిద్దుతూ, ప్రూఫ్ రీడింగ్ చేస్తూ పుస్తకాలకు పుస్తకాలు పూర్తిచేస్తున్నారు. హంసవింశతి, ఉత్తర రామాయణము, హరవిలాసము, భక్తిరస శతక సంపుటాలు, గువ్వలచెన్నశతకము, రాధికాసాంత్వనము - ఇలా లెక్కపెట్టలేనన్ని రచనలను డిజిటలైజ్ చేసి వికీసోర్సు ద్వారా అందరికీ అందుబాటులోకి తెచ్చే యజ్ఞంలో పాలుపంచుకుంటున్నారు.
మేము ఇది రాస్తున్నపుడూ, మీరిది చదువుతున్నపుడూ కూడా దేవీప్రసాదశాస్త్రి గారు తెవికీసోర్సులో ఏదో ఒక పుస్తకాన్ని డిజిటీకరించి అక్షరమన్న పదాన్ని సార్థకం చేస్తూండొచ్చు.