ఎందరో వికీమీడియన్లు/తెవికీసోర్సు రాయంచ
తెవికీసోర్సు రాయంచ
స్ఫుటమైన వ్యక్తిత్వం, కచ్చితమైన అభిప్రాయాలు, లక్ష్యాలు ఉన్నవారు గుంటుపల్లి రామేశం గారు. అలాంటి లక్ష్యాల్లో కొన్ని - మరుగున పడుతున్న ప్రాచీనాంధ్ర సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావాలన్నది ఒకటి. ఆ లక్ష్యమే ఆయనకు తెలుగు వికీసోర్సులో విస్తృతంగా పనిచేసేందుకు ఇంధనం.
తెలుగు వికీసోర్సు ఒక గ్రంథాలయం. కాపీహక్కుల పరిధిలో లేనివీ, ఎవరినీ అనుమతి అడగక్కరలేకుండా ఎవరైనా పంచుకోదగ్గవీ అయితే చాలు ఏ తెలుగు పుస్తకమైనా అప్లోడ్ చేసి, టైప్ చేసి అందుబాటులోకి తేవచ్చు. అయితే, రామేశం గారు అలా ఏ పుస్తకం మీదైనా పనిచేసేసే వ్యక్తి కాదు. ఆయన పుస్తకాన్ని ఎంచుకున్నారంటే దానికి ఎన్నో ప్రత్యేకతలు ఉండాల్సిందే.
ఉదాహరణకు కట్టా వరదరాజ కవి రచించిన ద్విపద రామాయణాన్ని ఆయన తెవికీసోర్సులో అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేశారు. అసలు ఏమిటీ ఈ పుస్తకం అని చూస్తే - వాల్మీకి రామాయణ మూలాన్ని దగ్గరగా అనుసరిస్తూ రచించిన మొట్టమొదటి తెలుగు ద్విపద రామాయణం ఇది. కృష్ణదేవరాయల తదుపరి కాలానికి చెందినవారు ఆ కట్టా వరదరాజ కవి. ఆ రచన తర్వాతి కాలంలో విస్మృతిలో పడిపోయి ఒకే ఒక్క తాళపత్రం ఎక్కడో తంజావూరు సరస్వతీ మహల్లో ఉంటే నిడుదవోలు వెంకటరావు గారు 1950ల్లో పరిష్కరించి, ప్రచురించి తిరిగి వెలుగులోకి తెచ్చారు. అదిగో - అలాంటి అరుదైన, విలువైన రచనను ఎంపికచేసుకుని తెలుగు వికీసోర్సు ద్వారా టైపుచేసి, దిద్ది ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చినవారు మన రామేశం గారు. వాశిష్ఠ గణపతి ముని విరచిత ఇంద్రాణీ సప్తశతి, వీరేశలింగం పంతులు రాసిన ఆంధ్ర కవుల చరిత్రము, చిలకమర్తి లక్ష్మీనరసింహము రచించిన మహాపురుషుల జీవితములు, పింగళి సూరన ప్రణీత కళాపూర్ణోదయము, గణపవరపు వెంకటకవి కృత శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము - ఇలా ఏ రచన తీసుకుని పనిచేసినా దాని వెనుక ఆయనకంటూ ఒక ఆలోచన ఉంటుంది. తనకు మంచివని తోచిన పూలను వెతికి వెతికి ఇష్టంగా కష్టపడి గుదిగుచ్చి భగవంతునికి భక్తుడు సమర్పించినట్టు అరుదైన, విలువైన, చక్కని సాహిత్య సంపదను ఎంపికచేసుకుని తెలుగు వికీసోర్సులో పెంపొందిస్తున్న గ్రంథమాలి మా గుంటుపల్లి రామేశం.