ఉషాపరిణయము/ద్వితీయాశ్వాసము

శ్రీ రాజగోపాలాయనమః

ఉషాపరిణయము

(పద్యకావ్యము)

ద్వితీయాశ్వాసము

ఉషాకన్య చెలులతోఁగూడి యుద్యానవనమున విహరించుట

వనకేళి—జలకేళి

శ్రీజయనిత్యనివాసా!
భూజనపాలనవదాన్య! భూజమహోద
గ్రాజిధనంజయ! దశది
గ్రాజితగుణహారి! విజయరాఘవశౌరీ!


వ.

అవధరింపుము.


క.

అని పలుకు చెలులపలుకులు
విని కన్నియ సమ్మతింప వెడ్కలు మదిలో
దనరఁగఁ దమతమయుడిగము
లనువొందగఁ జేయఁ బూని రాచెలు లంతన్.


సీ.

పణఁతి యొక్కతె చేరి బంగారుపావాలుఁ
        బదములఁ గీలించె బాగుమీరఁ
జెలియ యొక్కతె చేరి శృంగార మమరంగఁ
        గైదండ నొసఁగెను ఘనత మెఱయ

సకియ యొక్కతె చేరి సరిగంచుపనిచీర
        నెఱిఁ జక్కఁగాఁ దిద్దె నీటుగుల్కఁ
గొమ్మ యొక్కతె చేరి కొనగోళ్లచేతను
        గురులు నున్నగ దువ్వెఁ గొమరుమించ


గీ.

నతివ యొక్కతె పనిహర్వు హరిగఁ బట్టెఁ
బొలఁతి యొక్కతె యడపంబుఁ బొసఁగఁ బట్టె
సుదతి యొక్కతె కపురంపుసురఁటి విసరె
రమణి యొక్కతె వింజామరంబుఁ బూనె.

3


వ.

మఱియును.


సీ.

దండె తంబుఱ స్వరమండలంబుర బాబు
        వేటుగజ్జలు ముఖవీణె డక్క
చెంగు కామాచి యుపాంగంబు కిన్నెర
        వీణె తాళంబు(ను) బిల్లఁగోవి
చిటితాళము రమయు శేషనాదంబు రా
        వణహస్తమును జంద్రవలయములును
మురజంబు నావజంబును మొదలుగఁగల్గు
        కమనీయవాద్యముల్ గరిమెఁ దాల్చి


గీ.

రంగురక్తులు గులుకంగ రాజముఖులు
ముంగలను జేరి త్రిభువనమోహనముగఁ
జెలఁగి సంగీతమేళంబుఁ జేసి కొలువ
వేడుకలుమీర నెంతయు విభవ మలర.

4


సీ.

పదపద్మములచాయ పాఱినయెడలను
        బఱచినచెంగావి బాగుమీర
నెమ్మేనికాంతులు నిండినదిశలను
        బంగారునునుపూత రంగుగులుకఁ

గలికి లేఁజూపులు గలిగిన బయిటను
        గలువతోరణముల చెలువు వెలయ
నెఱికొప్పు బలుకప్పు నిగ్గుదోఁచినచోట్ల
        నీలముల్ వెదచల్లు నీటుదనర


గీ.

బాణనందనయైనట్టి పద్మగంధి
మందయానలు కొలువంగ నందముగను
మనసు నాథునిపై నిల్పి మచ్చికలర
వన్నెమీరిన యుద్యానవనముఁ జేరె.

5


వ.

అప్పుడు.


క.

రామా! రమ్మని చెలు లా
రామంబునుఁ జూపఁదలఁచి రమణీయవచ
శ్రీమెరయఁ బలికి రీగతిఁ
గోమలికిని బొద్దుఁబుచ్చు కోరికతోడన్.

6


సీ.

పరిమళంబులు నించు పసిఁడికైవడి మించె
        సంపెఁగల్ జూచితే సరసిజాక్షి!
పంచబాణునికీర్తిపగిది రాణించెను
        బొండుమల్లెలుఁ జూడు పువ్వుఁబోణి!
వనలక్ష్మిమౌక్తికవరహార మన మీరెఁ
        బొన్నమొగ్గలుఁ జూడు పుష్పగంధి!
యొప్పారె ధరసేసకొప్పుచందంబున
        సేవంతులను జూడు చిగురుఁబోణి!


గీ.

మాధవునికొలువుకూటాలమాడ్కిఁ దనరెఁ
గన్నె! చూడుము పుప్పొడిదిన్నె లిచట
ననుచుఁ జెలి నెచ్చరించుచు హర్షమునను
వనవిహారంబునకుఁ బూని వనజముఖులు.

7

రగడ.

జలజాక్షి! చూచితే సరవిఁ గనకములందుఁ
దొలఁగె నళులెల్లను దూరముగ నిటులిందుఁ
జెలియతోఁ బలుమాఱు సేయకుము వాదులను
వెలయాల! కైకొనుము వేగ విరవాదులను
గలకంటి! నేమున్ను గైకొంటిఁ జిగురాకు
వలదు నాతో వట్టివాదు ఘనమగు రాకు
కొమ్మ! యీవిరిబంతిఁ గొనఁగ నా చెలితరమె
తుమ్మెదలు ఝంకృతులఁ దొలఁగ నదిగో తరమె
సుదతిరో! వింతాయెఁ జూడు మిట నీడలను
మదనుని హజారములమాడ్కి దగె నీడలను
బొలఁతిరో! మకరందముల మీరెనిదె పొగడ
చెలరేఁగి పలుమాఱుఁ జెల్లదే యిఁకఁ బొగడ
హరిణాక్షి! పరికింపు మచటికింశుకములను
మెఱుఁగార విరుల నామెతసేసె శుకములను
పారిజాతముఁ జూచి పరువెత్తె మున్నయది
మారు నెలగో లిచట మలసి పిక మున్నయది
కంతునకు నర్పింప గమనజితవేదండ
వింతగాఁ గూర్చెదను వేగ యీవే దండ
నలురుగుత్తిది దాని నదట యిమ్మునికేల
కెలననున్నవి విరుల్ గిల్లుమీవె నీ కేల
నగువారిఁ జూడు మెన్నడు గాన మీవింత
చిగురాకునను రాపుసేతురా నీవింత
కోరి నేఁ దెచ్చితిని గోరంటవాసనను
నౌర! నే నెటులిత్తు నడిగె దీవాసనను
నదిర! దవ్వుగఁ బోయి యరికట్టె నిది రాఁగ

నెదురుగా విరిసరుల కింతి! యెంతటి ఱాఁగ
మల్లెమొగ్గలు మీఱె మరుని సెలగోల లన
నెల్లెడలఁ దనచాయ లెనయ నిదిగో లలన
బింబోష్ఠి! యేనె తగఁ బెంచితి [1]1రసాలమును
డంబైనయట్టి నీడల యీ రసాలమును
ఎంత దూరము చనియె నెందుకే యీ లేమ
కంతుపూజకు నన్నఁ గనకములె యీ [2]2లేమ!
వేడుకలు నించె నిట వెలఁది! నారంగములు
నాడగా గుంపులై యలరె సారంగములు
అవుర! బంగరుచాయ నలరె జంబీరములు
యువతి! నీ కుచము లెనయునె? వట్టిబీరములు
కురువిందగుత్తి గైకొను మేల జగడంబు?
పరికింపు దీనికిని ప్రతి యగునె పగడంబు?
చాలు నిఁక నన లనుచు సరసోక్తులను బెనుచు
బాళి మీఱఁగం జాల బాణనందన మ్రోల.


క.

వనకేళి సలిపి యీ గతి
నెనసిన తమ మేనిబడలి కెంతయుఁ దీఱన్
దనరెడు తామరకొలనికి
వనజేక్షణఁ దోడుకొనుచు వచ్చిరి వేడ్కన్.


సీ.

తావులు వెదజల్లు తామరవిరి యను
        ముద్దులుఁగుల్కు నెమ్మోముఁ దనర
డాలు గల్గినయట్టి వాలుగమీ లను
        కడు సోగలై మించు కన్ను లమర

మక్కువ గనుపట్టు జక్కవ లనియెడు
        కొమరు మీఱిన గబ్బిగుబ్బ లలర
ఒమ్ముగాఁ జెలువొందు తుమ్మెవగుం పను
        కప్పు మీఱిన గొప్ప కొప్పు మీఱ


తే.

హంసగమనంబు లను గతు లతిశయిల్లఁ
దరగ లనియెడు బాహులు తనరఁ జూచి
నరసి యనియెడు చెలికత్తె సంభ్రమమున
బాణతనయ నెదుర్కొనె భావమలర.


క.

ఒక రొకరిచేయి గ్రుచ్చుక
పకపక నవ్వుచును మిగులఁ బంతము మీఱన్
వికచాబ్జనయన లయ్యెడ
నకలంకం బైన సరసి నాడుచు వేడ్కన్.


సీ.

ఈఁత యిక్కడ నుఱ వింతిరో! ర మ్మని
        చేరంగఁ బిల్చెను జెలియ యొకతె
చిమ్మనఁగోవులఁ జిమ్మెద వేగమ్మె
        యొడ్డించుకొమ్మనె నువిద యొకతె
నేర్పున నీఁదెద నెలత! యిచ్చోటను
        దను జూడు మని పల్కె దరుణి యొకతె
కలువపువ్వులు గోసి కలికి! నీ కిచ్చెద
        వెన్నంటి రమ్మనె వెలఁది యొకతె


తే.

మాటిమాటికిఁ జాఱుగుఁబీఁట లెక్కి
సారసాక్షులు కొందఱు జాఱి సారె
నొండురులమీఁద జలములు నిండుకొనఁగఁ
జల్లు లాడిరి సరసిలో సరసముగను.

సీ.

ఒప్పైన కురులకు నోడిపోయినయట్లు
        తుమ్మెదగుంపులు తొలఁగఁబాఱె
స్తనయుగ్మములకును సరి రా మనెడులీలఁ
        జక్రవాకంబులు సరగ నెగసె

గమనంబులకుఁ గుంది కడ నుండుకైవడి
        సంచలు పార్శ్వాల నడఁగియుండె
గనుగోయితో సాటి గాంచలేమనురీతి
        జలములలోఁ దాఱె సారె మీలు


గీ.

కొమరుమీరుక రేణువుల్ కొలను జొచ్చి
మించువేడుకతో విహరించునట్లు
బాణనందనఁ గూడి యప్పద్మముఖులు
సరసిలోపల జలకేళి సల్పునపుడు.

13


క.

ఇవ్విధమున విహరించిన
జవ్వను లందఱును గూడి సంతసమమరన్
బువ్వుంబోణినిఁ దోడుక
నవ్వుచు గట్టెక్కి వచ్చి నైపుణిమీరన్.

14


ఉ.

బొమ్మలపట్టుకోకలను బొంకము మీరఁగఁ గట్టి మేలిమౌ
సొమ్ములు మేనఁ దాల్చి కడుసొంపమరన్ జడలల్లి వింతగా
నెమ్మిని గీఱునామములు నీటుగ దిద్దుచుఁ దీవమేనులన్
గమ్మజవాదివాసనలు ఘమ్మనిమీర నలంది వేడుకన్.

15


మన్మథారాధనము

క.

బటువగు మామిడికిందను
గుటిలాలకమదిని మించుకోర్కెలు వెలయన్
స్ఫుటముగ మదనునిభావముఁ
బటమున లిఖియించి తెచ్చి ప్రమదముమీరన్.

16

క.

పుప్పొడిని దిన్నెఁదీర్పుచు
నొప్పుగ మృగనాభి నలికి యొదవినవేడ్కన్
గప్పురపుముగ్గు లిడుచును
దెప్పలుగాఁ దమ్మివిరులుఁ దెచ్చుచు మఱియున్.

17


సీ.

ప్రతిలేని రతనాలపళ్లెంబులోపల
        గందంబు కుంకుమకస్తురియును
బసిఁడియక్షతలను బండ్లు టెంకాయలు
        పన్నీరుచెంబులు బాగుమీరు
కపురంపుబాగాలు కలువపూబంతులు
        మొగిలిరేకులు మంచిమొల్లవీరులు
కురువేరు దవనంబు గొజ్జంగసరులను
        బొండుమల్లెసరాలు పొన్నపువులు


గీ.

మొదలుగాఁగల వస్తువుల్ ముదముమీరఁ
దెచ్చి ముందఱ సవరించి తేజమమరఁ
బచ్చవిల్తుని నచ్చటఁ బరఁగ నిలిపి
బాణనందనఁ దోడ్తెచ్చి బాగుమీర.

18


సీ.

ధ్యానంబు నారాయణాత్మసంభవునకు
        నావాహనంబు రత్యాప్తునకును
సింహాసనంబు రాచిల్కతేజీరౌతు
        కర్ఘ్యంబు వారిచరాంకునకును
బువ్వులదుప్పటి పూవింటిజోదుకు
        గంధంబు మలయాశుగప్రభువునకు
నలరుదండలు కుసుమాకరసఖునకు
        ధూపంబు భూరిప్రతాపునకును

గీ.

దీప మఖిలానురాగప్రదీపునకును
సరసనైవేద్య మిదె యిక్షుచాపధరున
కనుచు వివిధోపచారము లాచరించి
యయ్యుషాకన్య మొక్కించి యందముగను.

19


సీ.

అఖిలజగన్మయుండైనట్టి హరియును
        శ్రీసతి నెదనుంచెఁ జెలువముగను
సకలంబు సృజియింపజాలిన బ్రహ్మయు
        వాణిని నెలకొల్పె వదనసీమ
నతిరౌద్రుఁడై యుండునట్టి ముక్కంటియు
        సామేన నుంచెను సతినిఁ బ్రేమ
నల పరాశరమౌనియంతటివాఁడును
        మత్స్యగంధినిఁ గూడె మమతచేత


గీ.

నితరు లన నెంత నీదాడి కెంచిచూడ
నీకు నెన యెవ్వరయ్య త్రిలోకములను
బాల యెటువలెఁ దాళు? నీ బాణములకు
కన్నెఁ గావుము మదన! నీ కరుణచేత.

20


వ.

అని సన్నుతించి యక్కన్నియచేత మ్రొక్కించిన.


క.

కుతుకము మీరఁగ నామదిఁ
జతురతఁ గలఁ గలసినట్టి సరసగుణాఢ్యున్
బతిసేయు మనుచుఁ గోమలి
రతిరాజును వేఁడుకొనియె రంజిలుభక్తిన్.

21


వ.

అంత.

సూర్యాస్తమయ చంద్రోదయవర్ణనములు

క.

అరుదగు తనసతినామముఁ
దిరముగ ధరియించునట్టి తెఱవకు నింకన్
బరితాపము బడరాదని
ఖరకరుఁ డస్త్రాద్రిఁ జేరెఁ గనికర మొప్పన్.

22


మ.

కమలంబుల్ ముకుళించె భృంగములఝంకారంబు తోరంబుగాఁ
గుముదశ్రేణులయందు మించె ఖగముల్ గూడుల్ వడిం జేరె సం
తమసంబుల్ దిశలందుఁ బేరెఁ గడువంతన్ గుందెఁ జక్రావళుల్
కమనీయద్యుతిఁ జెందెఁ దారకలు నాకాశంబునం దీరుగన్.

23


సీ.

చీఁకటు లనియెడు సింధురశ్రేణులఁ
        జెండాడవచ్చిన సింహ మనఁగ
నమరులు మథియింప నల క్షీరవారిధి
        వెలువడి కనుపట్టు వెన్న యనఁగఁ
దూర్పుదిక్కనునట్టి తొయ్యలి ధరియించు
        మురువైన ముంగరముత్తె మనఁగ
వెలిదీవిలో నున్న వెన్నునిసన్నిధిఁ
        బట్టిన బలుపగల్వత్తి యనఁగ


గీ.

వెలయఁగఁ జకోరములకెల్ల విందుఁ జేసి
కువలయామోద మొనరించి కొమరుమీరఁ
గూడియుండెడి విటులకుఁ గోర్కె హెచ్చఁ
జంద్రుఁ డుదయించె సత్కాంతిసాంద్రుఁ డగుచు.

24


వ.

అట్టి సమయంబున.

మన్మథుఁడు ఉషపై దాడి వెడలుట, మాన్మథవికారవర్ణన

క.

బల్లిదుఁడై మొల నరవిరి
చల్లడమన్ జివురుదట్టి సవిరించి తగన్
మల్లెవిరిబొమిడికం బిడి
మొల్లజిరాఁ దొడిగి మిగుల మోదముతోడన్.

25


సీ.

చెలరేఁగి యెలదేఁటియెలగోలుమూఁకలు
        దులదుల మునుమున్ను దుముకు లిడఁగ.
దండిమై రాయంచదండి బారావెంట
        మెండుగా నెల్లడ నిండి నడవ
నిరువంకలను జేరి గోరంకమన్నీలు
        బలుబింకములతోడఁ బ్రబలి కొలువ
గుంపుగూడుక గండుగోయిల మాస్టీలు
        వెన్నానికై మదోద్వృత్తి కాఁగఁ


గీ.

జిఱుత తెమ్మెర దళవాయి సరసఁ జెలఁగఁ
దేజ మమరంగ రాచిల్కతేజి నెక్కి
తమ్మిదోదుమ్మిఁ గలువకేడెమ్ముఁ బూని
తలిరువిలుకాఁడు బోటిపై దాడి వెడలె.

26


ఉ.

పాయనిభీతిఁ బాంథులకు భగ్గున గుండెలు బెగ్గడిల్లఁగాఁ
గోయిల లంటి వెంట జని కోయని యార్చగ దంటతుంటవిల్
రాయలు తుమ్మికైదువ ఝరాయన దూయుచు దొమ్మి కొమ్మపై
ధేయని కల్కిరాచిలుకతేజిని నూఁకె దువాళ మొప్పఁగన్.

27


క.

ఆయడ వలరాయఁడు బలు
రాయిడికెందమ్మి జిగికరాచూరులచే
నాయమ్ములు గాయమ్ములు
సేయన్ మదిరాక్షి బెగడెఁ జిత్తములోనన్.

28

క.

కలఁ గలసిన యలచెలువుని
చెలువముఁ దమి నెంచనెంచఁ జిత్తములోనన్
వెలివిసరె సత్వసంభవ
లలితవికారంబు లపుడు లజ్జావతికిన్.

29


చ.

సరసిజపత్రనేత్ర కలచందము డెందములోనఁ బూని ప
ల్మరు మరుచూలియేలినక్రమంబు గణించ మరుండు నించఁగా
గరులకుఁ గాడి వాఁడి సరికట్టిన కల్వలకోరిచాలు మే
ల్మురువున రూపుమైపులకముల్ మెఱసెన్ మొరసెన్ ద్విరేఫముల్.

30


చ.

సలలితమైన చందనముచాయను మాయఁగఁ జేసి కప్రపుం
బలుకుల తళ్కుపూఁత నగుఁబాటొనరింపుచు గబ్బిగుబ్బలన్
నెలకొను సిబ్బెపున్ మెఱుఁగునీటును మాటు ననంగపాండిమం
బలవడె నింతిమేనఁ గుసుమాయుధకీర్తిసమానమూర్తియై.

31


సీ.

మించుమొగ్గలను రాణించు తీవియ నీస
        డించు చెల్వంబు వరింప నెంచి
డంబుముతైపుచెక్కడంబుడాల్ మరునిబె
        త్తంబునేల్ మెఱుఁగుమొత్తంబుఁ దాల్చి
యొసపరిమంచుచే నెసఁగు తొల్కరివిప్పుఁ
        బసిఁడిగేదఁగిరేకుమిసిమిఁ దెగడి
చిలుపనీలును బొందు నిలుపఁబోలు మెఱుంగు
        మలపఁ జాలుతెఱంగుఁ దెలుపమీరి


గీ.

మెఱయు చిరుచెమట నీన మేన చాన
యుల్లసిలువల్లభుని నెద నుండునట్లు
డాలువాలుగదొర పూలకోలలేటు
నాటి సాత్వికభావంబు తేటవఱప.

33

గీ.

వనజముఖి యౌర ! యబలయయ్యును జగత్ప్ర
సిద్ధు ననిరుద్ధుఁ దనలో నిరుద్ధుఁజేయ
బద్ధవైరంబు మరున కాభ్రమరకచకు
దానిచే నయ్యె సుతునకై పూనుకొనరె!

33


చ.

కనుఁదెఱఁగొప్పియున్ గనదు గాంచు గణించఁగఁ బారవశ్యమున్
వినుతికి నెక్కు నామధురవృత్తి వహించియు మాటలాడదౌ
మునుకొని యెట్టివారలకు మోహమొనర్చును గాఁక కిమ్మగున్
గనుఁగొన భేద మాకలువకంటికి మారునితుంటవింటికిన్.

34


క.

కలకల నవ్వుచునుండున్
బలుమాఱును దిశలుఁ జూచు భ్రమయుచునుండున్
నిలిచినచోటను నిలువదు
కలకంఠికి విరహ మెంత ఘనమో! యకటా!

35


ఉషాకన్యకు చెలులు శైత్యోపచారములఁ జేయుట

వ.

ఇవ్విధంబున.


క.

మరుకాఁకల భ్రమనొందుచుఁ
బరువడి నునురసురుమనుచు భామిని మదిలో
వరునిన్ దలఁచుచు నుండఁగ
వెరగందుచు నొక్కసకియ వెలఁదుల కనియెన్.

36


సీ.

అతివ! దాఁగిలిముచ్చులాట లాడుద మన్న
        సమ్మతించ దొకింతఁ జంద్రవదన
చెండుగోరింతము చెలియ! రమ్మని పిల్వఁ
        గనువిచ్చి చూడదు కలువకంటి

గుజగుజఱేకులకొమ్మ! యాడుద మన్న
        మోమెత్తి చూడదు ముద్దుగుమ్మ
పగడసాల మనము పడఁతి! యాడుద మన్నఁ
        బలుకదు మనతోను బద్మనయన


గీ.

యతివ! చదరంగ మాడుద మనుచుఁ బిల్వ
నించుకైనను నంగీకరించదయ్యె
ననిన దమలోన వగచుచు నతివఁ జేరి
మరునితాపంబుఁ జల్లార్చుమనసుతోడ.

37


సీ.

బాణనందన కప్డు పణఁతు లందఱుఁ గూడి
        శైత్యోపచారముల్ సలుపఁగోరి
చిగురాకుపాన్పుపైఁ జెలియ నొయ్యన నుంచి
        పూలదుప్పటి మేనఁ బొసఁగఁ గప్పి
కపురంపువాసనల్ ఘమ్మన వాసించు
        చలువగందముఁ బూసి చెలువుమెఱయఁ
బన్నీటఁ దడసిన పావడచేతను
        మొగమునఁ దడియెత్తి మోదమమరఁ


గీ.

గలువపూవులబంతులఁ గన్నుదోయి
మాటిమాటికి నొత్తుచు మమతమీరఁ
బూలసురఁటుల విసరుచుఁ బొంకముగను
మరునితాపంబుఁ జల్లార్చ మగువకపుడు.

38


సీ.

చెలువుమీరినయట్టి చిగురాకుపానుపు
        చిగురువిల్తుని వాఁడిచిలుకులయ్యెఁ
బొసగంగఁ గప్పిన పువ్వులదుప్పటి
        పంచబాణుని బాణపంక్తులయ్యెఁ

గన్నుల హత్తించు కలువపువ్వులబంతి
        వలరాజుమొలనున్న వంకి యయ్యెఁ
దనువున నించిన తామరతూఁడులు
        కుసుమసాయకు నీలకొఱ్ఱులయ్యెఁ


గీ.

జెలులు గావించు నుపచారములె తలంప
మససిజుని సాధనంబులై మనసులోన
దోచుచుండంగ విరహంబుఁ దోయలేక
నేమి సేయుదు? నెట్లోర్తు? నేనటంచు.

39


ఉషాకన్యయొక్క మాన్మథప్రలాపములు

క.

కలఁగుచు నుండెడు వేళను
గలలోపలఁ గలసినట్టి కాంతుండెదుటన్
నిలిచిన యటువలఁ దోఁపఁగ
బలుమఱు నెచ్చెలులతోడ భ్రమయుచుఁ బలికెన్.

40


సీ.

అంతఃపురంబున కళుకక వచ్చిన
        దిట్టను జూడరే తెఱవలార!
తనమానధనమెల్ల మునుగైకొనినయట్టి
        చోరునిఁ జూడరే సుదతులార!
పలుమాఱు మోవాని పలుగంటిజేసిన
        జూటును జూడరే బోటులార!
చెక్కిలి గొనగోర జీరలు జేసిన
        యీధూర్తుఁ జూడరే యింతులార!


గీ.

తొడలపై నుంచి పుక్కిటివిడె మొసంగి
కళల సొక్కించి మిక్కిలి గారవించి
కంతుకేళిని ననుఁగూడు రంతుకాఁడు
యెదుట నున్నాఁడు జూడరే ముదితలార!

41

సీ.

జూటుకాఁడగు వీఁడు జుణిఁగిపోవకయుండఁ
        దోయజాక్షిరొ! తల్పు మూయవమ్మ
కన్నగాఁడగు వీఁడు కదలిపోవకయుండఁ
        బడఁతి! సందిటగుచ్చి పట్టవమ్మ
వంచకుండగు వీఁడు వదలిపోవకయుండఁ
        జంచలేక్షణ! యడ్డగించవమ్మ
దిట్టయై తగు వీఁడు తేలిపోవకయుండ
        నతివ! పే రేమని యడుగవమ్మ


గీ.

సొరిది నల పోతుటీఁగకుఁ జొరఁగరాని
యిచ్చటికీ నేటి కీవేళ వచ్చి తనుచు
మంచిమాటలచే వీనిమను తలఁపుఁ
గలువకంటిరొ! తేటగాఁ దెలియవమ్మ.

42


వ.

అని మఱియు నిట్లనియె.


సీ.

కన్నెపాయముదానఁ గదిసి నామోవిని
        బలుగంటిసేతురా! భయములేక
యాటపాయముదాన నగడుగాఁ జన్నులఁ
        గొనగోరులుంతురా! కొంకు లేక
ముద్దరాలను నేను ముద్దుచెక్కిలి నొక్కి
        జీరలు సేతురా! చింతలేక
గోలను గౌఁగిట గుచ్చి నీసరిపెన
        గురుతులు నింతురా! సరకు లేక


గీ.

బాలికామణియైన నాపాన్పుఁ జేరి
పచ్చవిల్తునికేళిని ముచ్చువగల
వేగుదనుకను ననుఁగూడి వింతగాఁగ
గాసిసేతురే! నీవింత కరుణ లేక.

43

సీ.

పుక్కిటివిడె మిచ్చి బుజ్జగించిన నీకు
        మోవియ్యనైతినా మోహనాంగ!
కదిసి ప్రేమను నన్ను కౌఁగలించిన నిన్ను
        గుబ్బల నొత్తనా కోడెకాఁడ!
చెక్కిలి నొక్కినఁ జెలరేఁగి సందిట
        నెలవంక లుంచనా నీటుకాఁడ!
సమరతులను నన్ను సారె నీవలయించ
        నుపరతి సేయనా వోరి జాణ!


గీ.

నేర మేమిర? నామీఁదఁ జేరి యింత
తామసించిన నేనింత తాళఁగలనె
కౌఁగిలియ్యర నాసామి! కరుణమీర
భావజున గొప్పగింతురా! ప్రాణనాథ!

44


సీ.

అల చకోరము వెన్నెలతీవ కిచ్చినయట్లు
        మోవి యొసంగరా మోహనాంగ!
చెలువతోఁ గోకిల చెలఁగి పల్కినయట్లు
        మాటాడరా వేగ నీటుకాఁడ!
హంస తామరతూఁడు నబల కిచ్చినరీతి
        మడువులు గొఱికీర మన్నెరాయ!
జక్కవ వెంటితో జతఁగూడి నటువలె
        రతి నేలరా నన్ను రంతుకాఁడ!


గీ.

ననయు వాసనయును గూడి తనరినట్టు
లొప్పుమీరిన యీచల్వచప్పరమున
నమరు చౌసీతివగలచే ననఁగి పెనఁగి
కోర్కె లీడేర్చరా నేడు కోడెకాఁడ!

45

సీ.

పొలఁతి యెవ్వతె చేరి బుద్ధులు చెప్పెనో!
        పలుమాఱు నేఁ బిల్వ బలుక వేమి?
పూఁబోణి యెవ్వతె బోధించెరా నీకు
        బ్రేమఁ గౌఁగిటఁ జేర్చి పెనఁగ వేమి?
లేమ యెవ్వతె దయ లేకుండఁ జేసెనో!
        తియ్యని కేమ్మోని నియ్య వేమి?
చెలియ యెవ్వతె నీదుచిత్తంబుఁ గలఁచెనో!
        చెక్కిలిఁ బ్రేమతో నొక్క వేమి?


గీ.

యెవ్వతె మరులుఁ బుట్టించె నెసఁగ నీకు
నెయ్యమమరంగ నను జేరఁదీయ వేమి?
భావజాకార! నీదైన భావ మేమి?
తెలియఁబల్కర నీవింకఁ దేటగాఁగ.

46


ఉష మదనుని మదనబలముల నిందించుట

సీ.

ప్రేమతోఁ జక్కెరఁబెట్టి లాలించిన
        చిలుకలే వెగటుగాఁ బలుకసాగె
నాయెలదోఁటలోననె వృద్ధిబొందిన
        యళులే ఝంకృతుల నన్నళుకసేసె
నటనగుల్కంగ నేనడపించు నంచలే
        ప్రతికూలగతులయ్యె భావమునకుఁ
బూఁటబూఁటకు నీళ్లుఁ బోసి పోషించిన
        లతికలే మరునమ్ములపొదు లయ్యెఁ


గీ.

బాములకుఁ బాలు బోసినపగిది వీని
నెంత పెంచినఁ గనికర మింత లేక
పంత మలరంగ నే డల పంచబాణుఁ
గూడి యౌరౌర! నామీఁద దాడివచ్చె.

47

వ.

అని యాదనుజరాజపుత్రి వనజవైరిం జూచి యిట్లనియె.


క.

క్షీరాంబుధి జనియింపుచు
శ్రీరమణికి నన్న వగుచు జెలఁగిన నీకున్
గ్రూరమగు సెకలు జల్లుట
నారుద్రునిశిరసుఁ జేరు నావగను సుమీ!

48


వ.

అని పల్కిన యనంతరంబ యబాణపుత్రి పంచబాణు నుద్దేశించి.


క.

చలికరువలినెచ్చలివై
యెలమిన్ హరితనయుఁ డనఁగ నిల నెగడిన యో
కలువలచెలి మేనల్లుఁడ!
చెలువల నిటు లొంచ నీకుఁ జెల్లునె మదనా!

49


గీ.

బాణునకు నోడి చనిన గీర్వాణులెల్ల
మకరకేతన! నిను వేఁడ మచ్చరించి
చెలఁగి నామీఁద దాడివచ్చిన విధంబె
తెలిసె లేకున్న నీకింత ద్వేష మేల?

50


క.

అని మదను మదనబలముల
మనమున నిందించి మగువ మాటికి దూఱన్
విని నెచ్చెలు లందఱు నా
దనుజాధిపపుత్రిఁ జూచి తగ సనిరెలమిన్.

51


క.

అల చిత్రరేఖ మనతోఁ
దెలిపిన యటువంటి సప్తదినములు గడచెన్
దెలతెలవాఱఁగవచ్చెన్
గలఁగకు మిదె పటముఁ దెచ్చుఁ గమలదళాక్షీ!

52

సూర్యోదయవర్ణనము

వ.

అని నెచ్చెలు లచ్చెలువ నూఱడించు సమయంబున.


చ.

పలుమరు గాఁక నింపుచును బాణతనూభవ నింత యేఁచఁగా
బలితనయుండు వేగ తనపై నిఁక నెక్కడ దాడివచ్చునో!
చలమున నంచు వెల్లనగు చందురుచందముఁ జూచి మాటికిన్
వెలయఁగ నవ్వినట్టు లరవిందములున్ వికసించె నత్తరిన్.

53


చ.

ఎనయఁగ నాయెడన్ దిరిగి యీదనుజుల్ భయపెట్టులోకముల్
మనుమని బ్రోవఁగా దనుజమర్దనుఁ డీడకు వచ్చి నిచ్చలున్
దనుజుల కి మ్మొసంగితని దండనసేయునొ యంచు జాఱెనా
చనియెను రాత్రి యంతటను జక్క ననూరుఁడు దోఁచెఁ దూర్పునన్.

54


చ.

పురమున సాయకాసురుఁడు భూరిబలంబున లెక్కసేయకే
హరివరశౌర్యుఁడై యలరు నయ్యనిరుద్ధుని నడ్డగించినన్
దురుసగు వేయిబాహువులుఁ ద్రుంచు మటంచును బంపవచ్చునా
హరికరచక్రమో యనఁగ నంబుజమిత్రుఁడు తోఁచె నంతటన్.

55


ఉష చిత్రరేఖరాకకై యెదురుచూచుట, చిత్రరేఖ పటముల వ్రాసి తెచ్చుట

వ.

ఇట్లు సూర్యోదయంబైన యనంతరంబ యాయుషాకన్నెయు
నొప్పుమీరు నొక్కచలువచప్పరంబందుఁ గప్పురపుగంధులుఁ
దానును గొలువైయుండి చిత్రరేఖరాక కెదురుచూచుచు
నెచ్చెలులతోడ నిట్లనియె.


సీ.

అల విభునామంబు నన్వయక్రమమును
        నెన్నఁడు నే విన నిందువదన!
వానివయోరూపవరవైభవంబులుఁ
        జూడ నెన్నడు నేను శోభనాంగి!

తలఁపున నొకనాఁడు తలఁపని ప్రియుఁడేల?
        కలలోన వచ్చెనే కంబుకంఠి!
కలఁగన్నవారికిఁ గాఁకలు రెట్టింప
        వలపులు బుట్టునా వెన్నెలాఁడి!


గీ.

యిట్టివిరహాంబునిధి దాఁట నేది తేప?
చిత్రరేఖయు రాదాయెఁ జెలిమిమీఱ
నేమి సేయుదు దాఁ పెవ్వ రింకఁ దనకు?
నిమిష మేఁడయి తోఁచెను నీరజాక్షి!

56


వ.

అని యుషాకన్నె పారంబు లేని విరహభారంబున నచ్చెలులతోడ
ముచ్చటలాడుచు నుండె, నంతకుమున్న యక్కడ.


సీ.

రాణించు లత్తుకరసమును సంకును
        హళఁది కాటుక పచ్చయాదియైన
వన్నియలను బైఁడిగిన్నియలను నించి
        బాగుగా ఘటియించు పటమునందు
సొరిది బంతులుగాఁగ సూత్రముల్ హవణించి
        జోకగాఁ గప్పున రేకఁదీర్చి
యమర నయ్యైయడలందు వన్నెలు నించి
        యమరదైత్యాదిభావములు వెలయ


గీ.

వారివారికి దగునలంకారములను
వారివారికిఁ దగునట్టి వస్త్రమాల్య
ములును గనుపట్టునట్లు నేర్చున లిఖించెఁ
జిత్రతరలేఖయైన యాచిత్రరేఖ.

57


వ.

ఇవ్విధంబున.

సీ.

ఆ సఖీమణి సప్తవాసరములలోన
        నట్లన గీర్వాణయక్షవరుల
దనుజముఖ్యులను గంధర్వకిన్నరులను
        మహినిఁ బ్రసిద్ధులౌ మనుజపతుల
భావంబుమీఱ గొప్పపటంబునను వ్రాసి
        యాపటంబును గొంచు నతిజవమున
నెప్పుడెప్పుడటంచు నెదురుచూచుచు మదిఁ
        గలఁగుచుండెడు నుషాకన్యఁ జేరి


గీ.

తాను దెచ్చినపటము ముందఱను నిల్పి
కన్నె! కను మిప్పటంబున నున్నవారి
వన్నె మీఱు సురాసురకిన్నరోర
గప్రముఖులైన సౌందర్యఖనుల ఘనుల.

58


క.

వీరల నందఱఁ గనుఁగొని
కోరికలను నిన్ను ప్రేమఁ గూడిన పురుషున్
నీరజముఖి! యెఱిఁగించిన
జేరువకున్ దోడి తెత్తుఁ జెలువుగ నతనిన్.

59


చిత్రరేఖ చిత్రపటములందలి నాయకుల వర్ణించుట

వ.

అని పలికి తదనంతరంబ చిత్రరేఖ యిట్లని వివరింపఁదొణంగె.


సీ.

పరికింపు కృతనేత్రపర్వులై వెలయు సు
        పర్వులు వీర లోపద్మగంధి!
తమిఁ జూడు రుచిరగాంధర్వులై చెలఁగు గం
        ధర్వులు వీర లోతలిరుఁబోణి!

వీక్షింపు సురలోకరక్షణదక్షులౌ
        యక్షులు వీర లోయలరుఁబోణి!
కనుఁగొను మహితభంజనసద్విచారణల్
        చారణుల్ వీర లోసరసిజాక్షి!


గీ.

పన్నగేంద్రులు వీర లోపక్ష్మలాక్షి!
కిన్నరలు వీర లోరాజకీరవాణి!
సిద్ధవరులు వీరలు మణిస్నిగ్ధవేణి!
సాధ్యవర్యులు వీర లోసన్నుతాంగి!

60


వ.

అని మఱియును.


సీ.

అద్రిసముత్తుంగభద్రవారణసము
        నిద్రసైన్యుఁ డితఁడు మద్రవిభుఁడు
బాలామనోహరనాళీకశరరూప
        లాలితుం డితఁడు పాంచాలవిభుఁడు
ధాటీసముద్భూతఘోటీకృతారాతి
        పాటనుం డితఁడు కర్ణాటవిభుఁడు
దారుణపరవీరదారణకరవాల
        ధౌరేయుఁ డితఁడు సౌవీరవిభుఁడు


గీ.

భోటకాంభోజమగధభూభుజులు వీర
లంగవంగకళింగనాయకులు వీరు
చోళనేపాళకేరళమాళవాది
రాజకులముఖ్యనృపులు వీరలు మృగాక్షి!

61


గీ.

పుణ్యవంతుఁడు మిగులదాక్షిణ్యశాలి
సత్యవాది శుభావహస్తుత్యకీర్తి
రాజకులభూషణుండు ధర్మజుఁ డితండు
సారసోదరసోదరచారుగాత్రి!

62

క.

భూరిబలరూపవిద్యా
ధౌరేయుఁడు భీమనిజగదాత్రాసితగాం
ధారేయుఁ డితఁడు భీముఁ డు
దారయశోధనుఁడు వికచతామరసాక్షీ!

63


క.

గాండీవధరుఁడు సద్గుణ
మండిత దిఙ్మండలుండు మత్తారిశిరః
ఖండనపండితుఁ డితఁడా
ఖండలతుఁ డర్జునుండు కమలదళాక్షీ!

64


గీ.

ఆశ్వినేయకుమారుల నధికయశుల
నంగనాజనమోహనానంగసముల
నఖలభువనప్రసిద్ధుల నమితబలుల
నకులసహదేవులను జూడు నళిననేత్రి!

65


సీ.

సకలసంపదలచే జగతిలో వెలసిన
        రాజరా జీతఁ డోరాజవదన!
కార్యఖడ్గంబుల గరిమఁ గాంచినయట్టి
        యువరా జితండు నీలోత్పలాక్షి!
దానకీర్తులచేత ధరలోన నెగడిన
        కర్ణుఁ డీతఁడు సుమ్ము కంబుకంఠి!
సకలమాయోపాయచాతుర్యమున మించు
        శకుని యీతఁడు సుమ్ము చారుగాత్రి!


గీ.

సింధుకోసలజాంగలసింహసాళ్వ
గౌడకాశ్మీరలాటకేకయవిదర్భ
కుంతికుంతలసౌరాష్ట్రకుకురనిషధ
నాయకులు వీర లోహరిణాయతాక్షి!

66

క.

హాలాసేవనసంతత
హేలాలహరీవిహారి హీరహిమానీ
[3]హేలాకరసితగాత్రుఁడు
నీలాంబరుఁ డితఁడు నీలనీరదచికురా!

67


సీ.

కరుణారసోత్తుంగశరణాయితాపాంగ
        వీక్షణుం డఖిలైకరక్షణుండు
శరణాగతత్రాణకరణాదరధురీణ
        చరణాంబుజుండు శ్రీకరభుజుండు
తరుణారుణకిరీటభరణాత్తరుచికూట
        భాసురుండు పరాజితాసురుండు
[4]తరుణార్తజనతాపహరణాదరదురాప
        కీర్తనుండు శుభప్రవర్తనుండు


గీ.

పావనుండు భయార్తద్విపావనుండు
మాధవుండు బుధారామమాధవుండు
శ్రీధరుండు నవాంబుదశ్రీధరుండు
రాజగోపాలుఁ డీతఁ డోరాజవదన!

68


సీ.

హృదయలక్ష్యవిభేదిమృదుసురభిళబాణు
        నారీమనోహరణప్రవీణుఁ
బాకారినీలప్రపంచవంచకవర్ణు
        లలితకళాజాలలబ్ధవర్ణు
నిక్షుకోదండోపలక్షితనిజబాహుఁ
        జారువల్గనరాజకీరవాహు
శుకపికశారికానికురుంబపరివారు
        నంబుధివరతనయాకుమారు

గీ.

సురభిసారథ్యశోభితసురభిపవన
రథనియోజితమకరవరధ్వజాగ్ర
విధుతివేసితవిభ్రాంతవిరహిజాతుఁ
జిత్తజాతు విలోకించు చిగురుఁబోణి!

69


ఉష కలలోఁ గలసిన కాంతుని గనుఁగొనుట

వ.

అనుచు వారివారి కులగుణస్థానపౌరుషంబులఁ దెలియఁబలుకుచుఁ
జూపుతరి నయ్యుషాకన్యక సావధానంబుగా వినుచుఁ గ్రమంబున
నవలోకింపుచు వచ్చివచ్చి తదనంతరంబ నిజమనోనయనానంద
కరుండై ప్రకాశించు ననిరుద్ధు నభివీక్షించి సముత్ఫుల్లలోచ
నాంబుజయై విచిత్రతరనిజచిత్రరేఖయగు చిత్రరేఖం గనుంగొని.


క.

ఈతనికులమును గుణము స
మాతతనిజబాహువిక్రమక్రమమును నీ
చాతుర్య మమరఁ బల్కుచుఁ
జేతోమోదంబుఁ గలుగఁజేయుము చెలియా!

70


వ.

అనినఁ జిత్రరేఖ యిట్లనియె.


సీ.

ఏ దేవుఁ డఖిలామరేశ్వరస్తవనీయ
        మహనీయపాదాబ్జమహిమశాలి
యే దేవుఁ డవినీతహృదయభూరినిశాట
        పటలభేదనబాహుపటిమశాలి
యే దేవుఁ డుజ్వలహేమాచలోత్తుంగ
        శృంగశృంగారకిరీటశాలి
యే దేవుఁ డబ్జసుహృత్కోటిభాస్వర
        శుభనిజదేహవిస్ఫూర్తిశాలి

గీ.

యట్టి శౌరికి మనుమం డుదారబలుఁడు
పంచబాణాత్మభవుఁడు శోభనగుణప్ర
[5]సిద్ధుఁ డతివిక్రమకళాసమృద్ధుఁ డీతఁ
డవని ననిరుద్ధుఁ డనఁ గడు నతిశయిల్లు.

71


ఉష యనిరుద్ధుని దోడితెమ్మని చిత్రరేఖను వేఁడుట

వ.

అనినఁ జిత్రరేఖకు నుషాకన్య యిట్లనియె.


క.

మానిని! యీతఁడు వోనా
మానధనముఁ గొల్లలాడి మక్కువమీరం
గా ననుఁ గూడిన ప్రియుఁ డను
మాన మొకింతయును లేదు మది నూహింపన్.

72


ఆ.

అనుచు దనుజపుత్రి యాచిత్రరేఖతో
మనముఁ దెలియఁబల్కి మఱియు ననియెఁ
జెలియ! యింకఁ దామసించిన నెటులోర్తు
వేగ తోడి తెమ్ము విభుని నిటకు.

73


వ.

అనినఁ జిత్రరేఖ చిఱునవ్వుతో నయ్యుషాకన్యఁ జూచి యిట్లనియె.


ఉ.

ఎవ్వరు? మెత్తు రీపలుకు లేణవిలోచన! చూడ నెంతయున్
దవ్వుల దుర్గమంబయిన తావున నుండెడువాని నొక్కనిన్
బువ్వులవిల్తుకేళిఁ గల మోదముమీరఁగఁ గూడి యీక్రియన్
నెవ్వగఁ జెంది యాపురుషు నీవిటఁ దెమ్మనిపల్కె దొప్పుగన్.

74


వ.

అని మఱియును.

సీ.

అనిరుద్ధు నిటకుఁ దోడ్కొనివచ్చు టదియెంత
        సులభంబుగాఁగను బలికెదమ్మ!
వనజాక్షి! యిటకుఁ బదినొకండువేల యో
        జనములద వ్వెట్లు చనుదునమ్మ?
చని ద్వారకను జేరినను రక్షిజను లుండ
        నంతిపురం బెట్లు గాంతునమ్మ?
కాంచిన నచ్చటి కామినుల్ గన నెట్లు
        నీవిభుచెంగట నిలుతునమ్మ?


గీ.

యింతయత్నంబు సేసి నే నిచటి కతనిఁ
దెచ్చినను బాణుఁ డెఱిఁగిన మచ్చరించు
శౌరి శోణితపురమును జేరవచ్చు
నతని గెల్వ నెవ్వరికి శక్యంబుగాదు.

75


గీ.

అట్లుగావున నన్ను నిన్నసురవిభుని
నీవు రక్షింపఁదలఁచిన నిట్టితలఁపుల
జెలియ! యిప్పుడు నాతోడఁ జెప్పవలదు
సాహ(సము) సేయఁ బాడియే చంద్రవదన!

76


వ.

అనిన దానవకన్య వియోగజనితవేదనానితాంతదోదూయ
మానమానసయై, కనురెప్పలం జిప్పిలు బాష్పకణంబుల నఖంబుల
నెగఁజిమ్ముచు దిట్టతనంబు వీడి యగ్గలంబుగ నిట్టూర్పువుచ్చుచు
డగ్గుత్తికతోఁ జిత్రరేఖంజూచి యిట్లనియె.


క.

మనమలరఁగ నీవల్లభు
వనితా! తోడ్కొనుచువత్తు వగవకు మని ప
ల్కిన నీవె మగుడ నిపు డి
ట్లని పలికిలి వింక నేమి? యనఁ గలను చెలీ!

77

వ.

అని మఱియును.


ఉ.

పున్నమనాఁటిచందురునిఁ బోలిన నాథుని నెమ్మొగంబు హ
ర్షోన్నతిఁ జూచికాని సరసోక్తులుఁ బల్కుచు వానిఁ గౌఁగిటన్
జెన్ను వహించికాని బహుచిత్రగతిన్ గుసుమాస్త్రుకేళికన్
మన్ననఁ గాంచికాని యిఁక మానిని! ప్రాణము నిల్పనేర్తునే.

78


గీ.

వేయిమాటలు నిం కేల వెలఁది! నీవు
కావలె నటన్నఁ గార్యంబు కాకపోదు
నాదుప్రాణంబు నిలుపుచందంబయేని
ప్రాణవిభుఁ దోడితెమ్ము శీఘ్రంబుగాఁగ.

79


చిత్రరేఖ యనిరుద్ధుని దెచ్చుటకై ద్వారకాపురి కేఁగుట

వ.

అనినఁ జిత్రరేఖ నితాంతస్నేహాయత్తచిత్తయై యత్తరలాక్షిం
గనుంగొని.


సీ.

ఘనమైనకార్యంబుగావున నీమనం
        బరయుటకై యిటు లంటినమ్మ!
యెంతదవ్వైనను నేమి నేఁ గావలె
        నన నిమిషంబునఁ జనఁగలేనె!
యెట్టికార్యంబైన నేనుండఁగా నీకు
        సరసీరుహాక్షి! విచారమేల?
క్షణములో నిదె ద్వారకాపురంబును జేరి
        యనిరుద్ధుఁ దెచ్చెద నతిజవమున


గీ.

ననుచు నయ్యుషాకన్యను హర్షజలధి
నోలలాడించి నిజకళాలీల మెఱయ
నితరు లెఱుఁగకయుండ నదృశ్యయగుచు
గగనమార్గంబుఁ జెంది శీఘ్రమునఁ జనియె.

80

వ.

ఇట్లు చనిచని.


సీ.

శ్రీకరగోపురప్రాకారరుచిరంబు
        బహురత్నమయహర్మ్యభాసురంబు
కేతనదీవ్యన్నికేతననికరంబు
        హారిరూపప్రమదాకరంబు
భూరితురంగమవారణప్రకరంబు
        భవ్యతూర్యనినాదభాస్వరంబు
సమరసముద్భటసద్భటవిసరంబు
        సురుచిరాలంకారసుందరంబు


గీ.

చారునిజపరిఘాయితసాగరంబు
మహితసంపత్పరాజితామరపురంబు
నూత్నమణిగణధారణీనూపురంబు
కాంచె నాచంద్రముఖి ద్వారకాపురంబు.

81


వ.

ఇట్లు గాంచి యనిరుద్ధుం దోడ్కొనిపోవునదియై తదీయభవన
సమీపంబున సూక్ష్మాకారంబున నిలిచి తాను కైతవంబునఁ
బ్రద్యుమ్నసూనుఁ దోడ్కొని చనిన వనజలోచనుఁడు కోపించి
తన్ను శపించు ననుతలంపున నొక్కింతఁ జింతింపుచుఁ దత్ప్రాం
తంబున.


చిత్రరేఖ నారదమునీంద్రుని గాంచి యతనికి సకలవృత్తాంతముల నెఱింగించి తదనుమతిని బడయుట

క.

అరవిందముకుళవిగళ
ద్ద్విరేఫఝంకృతివినిద్రవిహగోత్కరమున్
పరిసరవిసృమరకేసర
పరిఫుల్లేందీవరమును బద్మాకరమున్.

83

వ.

కని తత్తటాకమధ్యంబునందు.


శా.

ఫుల్లాంభోరుహమిత్రు సుస్మితముఖాంభోజాతు నిందీవరో
ద్యల్లీలాకరగాత్రుఁ గౌస్తుభలసద్వక్షున్ సువర్ణాంబరున్
ముల్లోకంబులు నేలు నా హరి హృదంభోజంబునన్ భక్తిసం
ధిల్లన్ ధ్యానము సేయు నారదముని న్వీక్షించి హర్షంబునన్.

83


వ.

చేరవచ్చి తదీయచరణసరసీరుహయుగళంబు సేవించి వినయా
వనతవదనయై కరంబులు మొగిచి యున్న యయ్యంగనం గనుం
గొని సకలతత్వాకలనవిశారదుండగు నారదుం డాశీర్వదించి
యో భామిని! నీవిటకు వచ్చిన కార్యం బేమని యడిగిన నయ్యింతి
సంతసంబున నతని విలోకించి యోమునీంద్రా! శోణితపురా
ధీశ్వరుండైన బాణాసురునిపుత్రి యుషాకన్య కాత్యాయనీవర
ప్రభావంబున ననిరుద్ధు(నియందు) నత్యంతానురక్తయై యయ్యని
రుద్ధుఁ దనవద్ధికిం దోడి తెమ్మనిన నప్పనిఁబూని యిచ్చటికి వచ్చితి
నట్లన యనిరుద్ధుం దోడ్కొని యరిగెద, నిక్కార్యంబు శ్రీకృష్ణుండు
విని తనపయిఁ గోపించకుండునట్లుగాఁ గటాక్షింపు, మదియునుం
గాక బాణుండు బాహుగర్వంబునం జేసి యనవరతంబు సంగ
రంబుఁ గోరుచున్నవాఁడు గావునఁ గన్యాంతఃపురంబున నున్న
యనిరుద్ధు నెఱింగి యవశ్యంబు యుద్ధసన్నద్ధుండై యతనిం
గదియవచ్చు, నయ్యనిరుద్ధుండు బాలుండు గావున నతని జయిం
చుటకు సమర్థుండు గాఁ డటుగనుక రేపకడ నీవృత్తాంతంబంతయు
శౌరికిఁ దేటపడం బలుకవలయు ననిన నారదుం డెంతయు సంత
సించి చిత్రరేఖం జూచి యిట్లనియె.


సీ.

మానిని! యట్లన కానిమ్ము వెఱవకు
        మనిరుద్ధుఁ దోడ్కొని యరుగు మివుడు
కలహావలోకనకౌతూహలంబును
        జనియించ నెంతయు మనసులోన

నాహవం బచట దైవాధీనమై కల్గె
        నేని మమ్ముఁ దలంపు మేమఱకుము
క్షణములో నట వచ్చి రణకేళి వీక్షించి
        మగుడి యెఱింగింతు మాధవునకు


గీ.

దనుజమదభంగకరచక్రధారి శౌరి
శోణితపురంబుఁ గదిసినచోఁ ద్రిణేత్రుఁ
డైన నెదిరించి యనిమొన నానఁగలఁడె
బాణుఁడును గీణుఁడన నేల? భయము నీకు.

84


చ.

అనుటయుఁ జిత్రరేఖ మది నంతయు నట్లన కాఁదలంచి సం
జనితఘనప్రహర్షుఁడగు సంయమివర్యునిచే ననుజ్ఞఁ గై
కొని మఱియుఁ బ్రణామములుఁ గోర్కెలుమీర నొనర్చి వేగమే
చని యల శౌరిమందిరముచాయ నభంబున నిల్చి వేడుకన్.

85


సీ.

పంచరత్నంబులపనిహర్వులను జాల
        బాగుమీరిన మొకపడకయింటఁ
గొమరైన యపరంజికోళ్ళమంచంబున
        మేరువుపై నున్న మేఘ మనఁగ
శృంగారములకెల్ల శృంగారమై మించు
        శ్రీరాజగోపాలశౌరి నపుడు
రుక్మిణిమొదలుగా రూఢి కెక్కినయట్టి
        కులసతుల్ పెక్కండ్రు కొలువు సేయఁ


గీ.

జూచి సేవించి యెంతయు సోద్యమంది
జగతిఁగల మాయ లెల్ల నీస్వామి యెఱుఁగు
నితని వంచించి యనిరుద్ధు నెత్తికొనుచు
నేఁ బురముఁ జేరఁగ నుపాయ మెద్ది! యనుచు.

86

క.

తడవాయ వచ్చి యిట కా
పడతుక నన్నెట్లు దూఱిపలుకునొ! యనుచున్
జడధారిన్ మదిఁ దలఁపుచుఁ
దడయక యనిరుద్ధు దెచ్చుతలఁపున నరిగెన్.

87


చిత్రరేఖ యనిరుద్ధుని దోడ్కొని చనుట

వ.

ఇట్లరుగు సమయంబున.


సీ.

మణిసౌధరుచిజాలమహిమచే మిక్కిలి
        నందమౌ బలభద్రుమందిరంబు
భద్రేభజవనాశ్వభటసమూహంబుల
        దనరారుచున్న సాత్యకిగృహంబు
తతనృత్తగీతవాద్యవిశేషములచేత
        భాసిల్లుప్రద్యుమ్నభవనసీమ
లక్షణాన్వితమయి లక్ష్మిచే నెంతయు
        డంబుమీరినయట్టి సాంబునగరు


గీ.

చారుదేష్ణసుదేష్ణసుచారుభాను
భద్రచారుసంగ్రామజిద్భానువింద
ముఖ్యహరిసూనువరగేహములను వేడ్కఁ
జెలఁగఁ గనుఁగొంచు వచ్చి యాచిత్రరేఖ.

88


సీ.

గమకంబులైన బంగారుకంబంబులు
        గొప్పలౌ విద్రుమకుట్టిమములు
మగరాలనిగరాల మలచినతిన్నెలుఁ
        దులలేని వైడూర్యతోరణములు

మరకతమాణిక్యమయములౌ మేడలు
        నుప్పరం బంటిన చప్పరములు
నెమ్మిగుంపులసొంపునెలవైన వలభులు
        హదవులుమీరు గవాక్షములును


గీ.

గలిగి యెల్లెడ సౌరభకలితకుసుమ
మాలికాలంకృతంబును మహితగంధ
గంధసారసిక్తంబునై ఘనత గాంచు
నట్టి యనిరుద్ధుకేళీగృహంబుఁ గాంచి.

89


వ.

అందు.


సీ.

పడఁతి యొక్కతె హడపంబు బాగుగఁ బూని
        మక్కువమీరంగ మడుపు లొసఁగఁ
గలికి యొక్కతె కరకంకణక్వణనముల్
        పరిఢవిల్లఁగ జీనిసురఁటి విసరఁ
గమలాక్షి యొక్కతె గంధోదకంబులు
        నించిన గిండి ధరించి నిలువ
రమణి యొక్కతె బహురాగభేదంబులు
        నింపుగా వీణె వాయింపుచుండ


గీ.

మఱియు గొందఱువనితలు మమతతోడఁ
దనదుచుట్టును గొల్వంగ ఘనతమీరి
సరససల్లాపములఁ బొద్దు జరపుచుండు
నట్టి యనిరుద్ధుఁ గనుఁగొని యాత్మలోన.

90


క.

వనితాజనపరివృతు నీ
యనిరుద్ధుని నెవ్విధమున? నటఁ దోడ్కొనిపో
ననువగు నని చింతింపుచుఁ
దనతామసవిద్యపేర్మి తనరన్ మిగులన్.

91

క.

ముచ్చు వగమీర నెచ్చెలి
యచ్చటిసతు లెఱుఁగకుండునట్లుగ వేగన్
బచ్చవిలుకాని తనయుని
నచ్చెరువుగఁ దోడి తెచ్చు నాసమయమునన్.

92


అనిరుద్ధుని దోడ్కొనివచ్చుటకై చనిన చిత్రరేఖ రాకయున్నందులకు నుష చింతించుట

క.

అనిరుద్ధునిఁ దోడ్కొని యిదె
వనితామణి చిత్రరేఖ వచ్చు నటంచున్
దనరెడు చెలిమిని బాణుని
తనుజన్ గైసేయునట్టి తలఁపమరంగన్.

93


సీ.

పన్నీటి చేతను బాగుమీరఁగ నంత
        జలకంబు లాడించె సకియ యొకతె
పొసఁగంగ నవరత్నభూషణావళులచే
        నెలమి శృంగారించెఁ జెలియ యొకతె[6]


గీ.

విదియచందురుమించిన వెలఁదినుదుట
దిలక మొప్పఁగఁ దీర్చెను గలికి యొకతె
తీరుమీరఁగఁ బాపటఁ దీర్చి చెలికిఁ
గొప్పు సవరించె నొప్పుగఁ గొమ్మయొకతె.

94


వ.

అంత.


సీ.

ప్రతి లేని పసిఁడిచప్పరపుమంచంబునఁ
        బరఁగు కుంకుమపూలపఱఫుఁ బఱచి
కళుకుసూర్యపటంబుతలగడ లమరించి
        బాగైన సకినలబటువు లుంచి

కలువడంబులుగల కలువడంబులు గట్టి '
        రాణించు బుర్సాకురాడ మునిచి
సామ్రాణిధూపవాసనలను నెరయించి
        రమణీయరత్నదీపములు నిల్పి


గీ.

పొసఁగఁ దెలనాకు కవిరెలు పోఁకముళ్లు
పచ్చకపురంబు జవ్వాది మెచ్చువిరులు
మీరిపలికెడు బకదారిపారువములు
నందముగ నించి రొకకేళిమందిరమున.

95


క.

చెలు లిటువలెఁ గై సేయఁగఁ
బొలఁతుక ననశయ్య నుండి పురుషుని మదిలోఁ
దలఁచుచు మదనునిగాసికి
నులుకుచు నిట్లనుచుఁ బలికె నువిదలతోడన్.

96


సీ.

తనచెల్మి నెంచి యిత్తరి ద్వారకాపురిఁ
        జేరునో! చేరదో! చిత్రరేఖ
పొరి నలంగముచుట్టుఁ దిరుగుయామికులచేఁ
        గూడునో! కూడదో! కోటఁ జొరఁగ
నవరంగజాల లింతకు బీగముద్రలు
        సేతురో! మఱపున సేయకుండ్రొ!
నెమ్మది నాప్తులు నిదురించుసమయంబు
        కలుగునో! కలుగదో! కమలముఖికి


గీ.

సకలమర్మంబు లెఱిఁగిన స్వామిగాన
తనమనుమనిఁ దోడ్కొనిపోవు తలఁ పెఱింగి
ద్వారకాపురి నెవ్వరుఁ జేరకుండ
భద్రపఱచిన భామ యేపగిదిఁ దెచ్చు?

97

వ.

అని పలుకు నుషాకన్యక జూచి నెచ్చెలు లిట్లనిరి.


సీ.

ఆచిత్రరేఖ దా నఖిలలోకంబులఁ
        బొలుపుమీరుచు నున్న పురుషవరుల
భావంబులెల్లను బటమున వ్రాసిన
        [7]మహిమ నెఱుంగవా మగువ! నీవు
మహిలోనఁ గల్గిన మాయావిశేషముల్
        దండ్రిచే నేర్చె నాతలిరుఁబోణి
మన్ననమీర నీమగనిఁ దోడ్కొనివచ్చుఁ
        గలకంఠిరో! నీవు కలఁగకమ్మ!


గీ.

ముజ్జగంబులఁ గల్గిన ముదితలెల్లఁ
జిత్రరేఖకు నెనయె విచిత్రమహిమ
నేవిధంబుననైన నాయిందువదన
వేడుకలుమీఱ ననిరుద్ధుఁ దోడితెచ్చు.

98


చిత్రరేఖ యనిరుద్ధుని నుషవద్దికి జేర్చుట

వ.

అని యూఱడించు సమయంబున.


సీ.

వాయుతనూజుండు వాయువేగంబున
        సంజీవనిం దెచ్చుచందమునను
వినతాతనూజుండు వేడుకమీరంగ
        నమృతంబు దెచ్చినయందమునను
నల్ల భగీరథుం డాత్మ నుప్పొంగుచు
        నమరనదిం దెచ్చునట్టిలీలఁ
జెలువంబు వెలయంగా శ్రీరాజమన్నారు
        పారిజాతముఁ దెచ్చు భావమునను

గీ.

సత్యవతిని భీష్ముఁడు దెచ్చుసరవి మెఱయఁ
గుండలము లుదంకుఁడు దెచ్చుకూర్మి నెరయ
నమరసౌగంధికంబుల ననిలజుండు
దెచ్చుకైవడి ననిరుద్ధుఁ దెచ్చు వేగ.

99


క.

ఈకైవడి ననిరుద్ధుని
బ్రాకటముగఁ దెచ్చి నిల్పి పానుపుమీఁదన్
రాకేందుముఖులు మెచ్చఁగ
నాకలికిన్ జూచి పలికె హర్షముతోడన్.

100


క.

వనజాతనేత్ర! కనుఁగొను
మనిరుద్ధు మహాప్రసిద్ధు నంబుజనేత్రున్
గనకనిభగాత్రు మురభం
జనపౌత్రుని మదనపుత్రు సద్గుణపాత్రున్.

101


క.

చెలువునిఁ దెచ్చితి నీతో
బలికిన యటువంటి నాదుపంతము జెల్లెన్
నెలయును రోహిణియుం బలె
నలివేణీ! విభునిఁ గూడి యలరుము వేడ్కన్.

102


వ.

అనిన నచ్చెలిం జూచి యచ్చిగురుఁబోణి యిట్లనియె.


సీ.

నిఖిలలోకంబుల నీవంటి నేర్పరిఁ
        గని విని యెఱుఁగనే కంబుకంఠి!
కలలోనఁ గలసినకాంతునిఁ దెమ్మన్న
        క్షణములోఁ దెచ్చితి చంద్రవదన!
కందర్పుచేతను గాసిఁ జెందిననాఁడు
        ప్రాణంబు నిలిపితే పద్మగంధి!
ధర నెంతవారికిఁ దలఁచఁగూడనియట్టి
        తలఁపు లీడేర్చితే తలిరుఁబోణి!

గీ.

కలికి! నీవు చేసిన యుపకారమునకు
నిపుడు ప్రత్యుపకారంబు లేమి సేతు?
ననుచు సొమ్ములుఁ గోకలు నతివ కొసఁగి
గదిసి కౌఁగిటఁ జేర్చెను గారవమున.

103


క.

శ్రీరఘునాథసుధాంబుధి
కైరవిణీమిత్ర! సకలకవినుతపాత్రా!
భూరిభుజాబలనిర్జిత
వైరిజనస్తోమ! విపులవైభవధామా!

104


క.

చెంగమలేశపదాంబుజ
[8]సంగస్ఫురితాంతరంగ! సదయాపాంగా!
సంగీతసాహితీప్రియ!
సంగరకౌంతేయ! సకలసజ్జనగేయా!

105


ద్రుతవిళంబిత వృత్తం

సుజనరక్షణశోభనవీక్షణా!
విజయకారణవిశ్రుతవారణా!
విజయశాత్రవవీరనుతాహవా!
విజయరాఘవ! విక్రమభార్గవా!

106


గద్య.

ఇది శ్రీమద్రాజగోపాలకరుణాకటాక్షవీక్షణానుక్షణప్రవర్ధమాన
సారసారస్వతధురీణయు విచిత్రతరపత్రికాశతలిఖితవాచికార్థావగా
హనప్రవీణయు తత్ప్రపత్రికాశతస్వహస్తలేఖనప్రశస్తకీర్తియు
శృంగారరసతరంగితపదకవిత్వమహనీయమతిస్ఫూర్తియు అతు
లితాష్టభాషాకవితాసర్వంకషమనీషావిశేషశారదయు రాజనీతి

విద్యావిశారదయు విజయరాఘపమహీపాలవిరచితకనకాభిషే
కయు విద్వత్కవిజనస్తవనీయవివేకయు మన్నారుదాసవిలాస
నామమహాప్రబంధనిబంధసకృతలక్షణయు మహనీయరామా
యణభాగవతభారతకథాసంగ్రహణవిచక్షణయు పసపులేటి
వెంకటాద్రిబహుజన్మతపఃఫలంబును మంగమాంబాగర్భశుక్తి
ముక్తాఫలంబును రంగద్గుణకదంబయు నగు రంగాజమ్మ వచన
రచనాచమత్కృతిం జెన్నుమీరు ఉషాపరిణయంబను మహాప్రబం
ధంబునందుఁ ద్వితీయాశ్వాసము.

శ్రీరాజగోపాలాయనమః

  1. అనురాగరూపనీరములతో - అని యర్థము
  2. ఈయలేమ?-అని యర్థము
  3. లాలకర
  4. తరుణార్థ
  5. సిద్ధుఁ డతివిక్రమకళాసమృద్ధుఁ డితఁ డ
    వని ననిరుద్ధుఁ డనఁగ గడు నతిశయిల్లు.
  6. ఈ పద్యమున సీసపాదములు రెండు మాత్రమే యున్నవి.
  7. మయిమెరుంగవా
  8. సంగి