ఉషాపరిణయము/చతుర్థాశ్వాసము

శ్రీ రాజగోపాలాయనమః

ఉషాపరిణయము

(పద్యకావ్యము)

చతుర్థాశ్వాసము

శ్రీకృష్ణుఁడు సపరివారముగా బాణునితో యుద్ధమునకుఁ జనుట

క.

శ్రీమహితరాజగోపకృ
పామహిమప్రాప్తపుత్రపౌత్ర! జయశ్రీ
ధామ! సుగుణాభిరామా!
రామాసుమచాప! విజయరాఘవభూపా!

1


వ.

అవధరింపుము.


గీ.

అపుడు కృష్ణుండు విప్రపుణ్యాహఘోష
పూర్వకముగాఁగఁ గదలుచోఁ బురయువతులు
చల్లతావులుగల విరుల్ జల్లి రెలమి
మ్రోసె వాద్యము లాశౌరి ముదముఁ జెంద.

2


గీ.

ఇట్లు బాణజయార్థమై యేగునట్టి
హారిని గనుఁగొని నారదుం డనియె నిట్టు
లోయదూద్వహ! వేగ తార్క్ష్యుని దలంపు
తత్పుర మతఁడు నొకముహూర్తమునఁ చేర్చు.

3

క.

ఖగకులనాథుఁడు దక్కఁగ
నొగి నేకాదశసహస్రయోజనములుఁ దా
మగటిమిఁ జని యతిదుర్గమ
మగు శోణపురంబుఁ జేర్చ నన్యుల కగునే.

4


చ.

అన విని కంసమర్దనుఁడు నట్లన నెమ్మదిలోఁ దలంచునం
తన వినతాతనూభవుఁ డుదారగతిం జనుదెంచి యచ్యుతుం
గని వినియావనమ్రుఁడయి గ్రక్కునఁ బార్శ్వమునందు నిల్చి య
య్యనఘునకుఁ బ్రమోదముగ నంజలిబంధముఁ జేసి యిట్లనెన్.

5


సీ.

దనుజభంజన! నన్ను దలఁచిన పనియేమి?
        యానతియిమ్ము నెయ్యంబు మీర
భవదీయబలగుప్తపక్షవిక్షేపంబు
        చే నెవ్వనిపురంబు? వో నడంతు
మీర చేపట్టిన మేలిమిచేఁ బాంచ
        జన్యచక్రంబులు శార్ఙ్గగదలు
మొదలైన యాయుధంబుల దర్పమునకు నా
        దర్పోద్ధతికి నసాధ్యంబు గలదె!


గీ.

యనుటయును శౌరి యాదరాయత్తదృష్టి
నతని వీక్షించి వినుము ఖగాధినాథ!
బలితనూభవుఁడగు బాణుఁ డలఘుశక్తి
గర్వదుర్వారపిశునతాఖర్వుఁ డగుచు.

6


గీ.

కదనమునఁ గిట్టి తనబలమదము నెల్ల
మాయఁ జేసిన యనిరుద్ధు మాయఁ జేసి
నాగపాశబద్ధునిగా నొనర్చినాఁడు
తెలియఁడో! కాక భవదీయతీవ్రశక్తి.

7

క.

అటు గనుక దూరమగు త
త్పుటభేదన మిపుడ చేరఁబోవలయుట ని
న్నిటుదలఁచితి మరియు సము
ద్భటుఁడగు నీవలనఁ గాక పరుచే నగునే.

8


వ.

అది యెట్లంటేని.


మ.

పటుజంఘాలభవద్గరున్మరుదురుభ్రామ్యన్మహాయోధమున్
జటులాదిత్యగణంబు వే గెలిచి తత్సంపాదితంబౌ యశః
పటలింబోలు సుధన్ హరించి యతులప్రఖ్యాతిచేఁ దల్లి యు
త్కటదాస్యంబును బాయఁజేసిన మహాధన్యుండ వీ వెంచఁగన్.

9


వ.

అదియునుంగాక.


క.

కడఁకమయి సురల వీపున
నిడికొని యసురుల జయించి హెచ్చగు జయముల్
బడిబడి నొసఁగు ఘనుండవు
సుడివడరే రిపులు నిన్ను చూచినయంతన్.

10


ఉ.

నీవు మహానుభావుఁడవు నిత్యము మద్రథకేతనాకృతిన్
ఠీవి వహించినాఁడవు గణింపఁగ యాదవులెల్ల నిన్ను సం
భావన చేయుచుండుదు రపారపరాక్రమధుర్య! యెప్పుడున్
గావున నిట్టికార్యముఁ దగన్ నెరవేర్పుము నేర్పుపెంపునన్.

11


క.

అని మధుసూదనుఁ డాడిన
విని భుజగాశనుఁడు హర్షవిస్మయములు నె
మ్మనమునఁ బెనఁగొన హరిఁ బే
ర్కొని యిట్లని విన్నవించె గురుతరభక్తిన్.

12

మ.

ఇటు లాడన్ దగునయ్య! మీరు కృపచే నెందే వసింపన్ జయం
బటఁ గల్గున్ మది నెంచి చూడఁగ ధ్రువం బాశ్చర్య మా యిప్పుడ
క్కట! లోకైకశరణ్య! నీవిటు ననుం గారుణ్యదృష్టి నుతిం
చుట నాభాగ్యముగాదె పద్మజముఖస్తుత్య ప్రభావాశ్రయా!

13


సీ.

కర్తవు సకలలోకములకు నాద్యుఁడ
        వఖిలకామప్రదాయకుఁడ వీవ
బ్రాహ్మణప్రియుఁడవు బహుయోగమానసాం
        భోజరాజత్పదాంబుజుఁడ వీవ
కల్యాణగుణుఁడవు కరధృతచక్రగ
        దాశంఖశార్ఙ్గనందకుఁడ వీవ
భక్తవత్సలుఁడవు భవ్యనాభిసరోజ
        జనితసరోరుహాసనుఁడ వీవ


గీ.

యిట్టి మిమ్ము నుతింప నే నెంతవాఁడ
నిపుడె తనమీఁద వేంచేసి రిపుజయంబుఁ
గను మటన్న జయార్థ మర్ఘ్యం బొసంగె
స్వామి యతనికి జయజయధ్వనులు చెలఁగ.

14


గీ.

అంత సాత్యకి మొదలైన యాదవులను
ద్వారక యుంచి శౌరి యుదారలీలఁ
బన్నగాశనుపై బలభద్రమకర
కేతనులతోడ నెక్కి సంప్రీతుఁ డగుచు.

15


ఖగవాహనారూఢుఁడై గగనమార్గమున నేగు శ్రీకృష్ణుని చారణులు స్తుతించుట

ఉ.

మాగధసూతవందిజనమౌనివరుల్ వినుతింప నేగుచో
వే గగనంబునందు జయవిశ్రుతభాషణులైన చారణుల్

నాగవిరోధిపై నతిబలస్ఫురణంబున నున్న శౌరికిన్
సాగిలి మ్రొక్కి యిట్లనుచు సంస్తుతి చేసిరి భవ్యసూక్తులన్.

16


సీ.

జయ శంఖచక్రాసిశార్ఙ్గగదాధర!
        కౌస్తుభశ్రీవత్సకలితవక్ష!
జయ నాభిపంకజసంభూతచతురాస్య!
        అంబుధికన్యావిహారలోల!
జయ భువనత్రయాశ్రయచరణాంభోజ!
        జగదుద్భవస్థితివిగమకరణ!
జయ దుష్టదైత్యకుం(జరసూ)దనమృగేంద్ర!
        కమనీయనారదగానలోల!


గీ.

అఖిలదేవేశ! కోటిసూర్యప్రకాశ!
జలధరశ్యామ! కామితఫలదనామ!
అమితగుణహార! భవ్యదివ్యావతార!
ఘనమ[హీధరవ]రధారి! కంసవైరి!

17


వ.

అని మఱియును.


క.

దురమున నెదరిన బాణా
సురు గెలుతువు సిద్ధమనుచు సొంపమరఁ బొరిన్
బొరిఁ బొగడువారి పలుకులు
సొరిది వినుచు నధికహర్షశోభితుఁ డగుచున్.

18


శ్రీకృష్ణుడు బలదేవాదులతో శోణపురి సమీపమునకుఁ జేరుట

ఉ.

దానవభంజనుం డహిమధామసుధాకరపాకభేదివై
శ్వానరదుర్ణిరీక్షతరసర్వదిగంతవిసారిభూరితే
జోనుగుణాత్మదేహుడయి యష్టభుజంబుల దాల్చె నప్పు డా
దానవసూదనాగ్రజుఁడు దానును బాహుసహస్రభాసియై.

19

క.

అతిభాస్వరమగు రూపము
నతిమానుషదివ్యతేజ మమరఁగఁ దాల్చెన్
రతిపతియు సత్ప్రభావో
దితమైన సనత్కుమారుదేహముఁ దాల్చెన్.

20


గీ.

వినుము రాజేంద్ర! యటువలె వెలసె విహగ
వాహనారూఢుఁడైన యావాసుదేవు
నిపుడును దలఁచితలఁచి మాహృదయపంక
జంబు లానందరసభరితంబు లయ్యె.

21


గీ.

అపుడు మధువైరి దక్షిణహస్తములను
జక్రకౌమోదకీఖడ్గశరము లలరె
సవ్యకరముల నాల్గిట సరవితోడ
శంఖకార్ముకఫలకపాశములు నమరె.

22


చ.

అట గరుడుండు పక్షజనితామితభీషణఘోషణానిల
స్ఫుటదచలేంద్రకూటతటచూర్ణమహావిటపావనీజుఁడై
తటిదయుతప్రభాజటిలతారతనుద్యుతి నిండ దిక్కులన్
బటుజవయుక్తిచేఁ బఱచె భాసురలీల నభోంతరంబునన్.

23


వ.

ఇట్లు గరుడుండు గగనమార్గంబునం జనుచుండఁ గృష్ణుఁ జూచి
బలభద్రుం డిట్లనియె.


క.

హారిహరిద్రావర్ణము
లీరూపము లొదవె మనకు నేమిట నిపు డా
మేరుశిఖరిచేరువ ను
న్నారమె యిదియేమి చెపుము నలినదళాక్షా!

24

క.

అనుటయు నతనికి హరి యి
ట్లనియెను బలదేవ! యిచట నాహవనీయం
బనువహ్నిదివ్యతేజము
ఘనమై పొదువంగ నిట్టికాంతులు గలిగెన్.

25


చ.

అనవుఁడు రేవతీరమణుఁ డాయదునందనుతోడ దైత్యభం
జన! యటులైన శోణపురిచాయకె వచ్చితి మౌర! యిప్పు డీ
యనలము శాంతిఁ జెందఁగ నుపాయము నొక్కటి చూడుమన్నఁ దా
ర్క్ష్యునకు మురారి యెంతయును సొంపుజనింపఁగఁ బల్కె నీక్రియన్.

26


గీ.

అమృతహరణప్రవీణ! యీయనల మిపుడు
కడచి చనఁగ నుపాయంబుఁ గనఁగవలయు
ననిన గరుడుండు సురసరిదంబువులను
దెచ్చి నించిన నగ్ని యదృశ్యమయ్యె.

27


వ.

అంత.


శ్రీకృష్ణుఁడు శంభుబలములగు పావకులతోఁ బోరుట

మహాస్రగ్ధర.

జలజాక్షానంగసంకర్షణులు ముగురు నిస్తంద్రశక్తిన్ ద్రిలోకం
బులు గెల్వంజాలు శూరుల్ భుజగరిపుజవస్ఫూర్తిచే నిట్టుల(త్యు)
జ్వలకీలాజాలఘోరజ్వలనమును వ(డిన్) శాంతిఁ బొందించి యంతే
బలదర్పప్రాభవంబుల్ బలీయం జనిరి తత్పట్టణాభ్యర్ణసీమన్.

28


క.

అది గని శంభు(నియో)గము
న దివానిశమును ద(దీయనగరావన)కో
విదులగు ననేకపావకు
లదరి బెదరి గుంపు గూడి యందఱుఁ దమలోన్.

29

ఉ.

భూరిబలాడ్యుఁ డీవిహగపుంగవుఁ డీతనిమీద నెవ్వరో!
వీ(రులు శూరులౌ) ముగురు వీర లవక్రపరాక్రమాద్భుతా
కారు లుదారబాహుపరిఘస్ఫురదాయుధు లంచు నెంచి యే
(వారలు)గాఁగ నేమి? యని వారలఁ (జంపఁగ) నిశ్చితాత్ములై.

30


క.

కోపాటోపనితాంతో
ద్దీపితులై వారిఁ జేరి తీక్ష్ణశరంబుల్
బైపై దళముగఁ గురియు(చుఁ)
జూపిరి తమశక్తియుక్తి! జూప(రి) మెచ్చన్.

31


వ.

అట్టి సమయంబున.


క.

విని బాణుం డాకలకల
మును దన వేగరులలోన ముఖ్యుం(డగు) నొ
క్కనిఁ బిలిచి తెలిసి రమ్మని
ఘనసైన్యము లేర్పఱించెఁ గదనాపేక్షన్.

32


ఉ.

వాఁడును వచ్చి యవ్విహగవాహనముఖ్యులతోడఁ బావకుల్
వాఁడిమిఁ బోరఁ గన్గొని జవంబున నేగి సుపర్వవైరితో
నేఁ డిపు డెవ్వరో ముగురు నిస్తులదీప్తి మరుత్సఖాళితో
వేడిమిమైఁ బెనంగెదరు వీరవరేణ్య! యటంచుఁ బల్కినన్.

33


వ.

బాణాసురుండును నది సరకుగొనక యకంపితధైర్యుండై యుండె.
అంత నిక్కడ కల్మాషుండును, కుసుముండును, దహనుండును,
(తి)ష్టనుండును, తపనుండును, పటలుండును, పతంగుండును,
స్వర్ణుండును, భ్రాజుండును, జ్యోతిప్టోముండును, హవిర్భాగుం
డును, అంగిరుండును మొదలగు ననేక పావకులు నిజానీకపరి
వృతులై వచ్చి ప్రద్యుమ్నవాసుదేవసంకర్షణులతో యుద్ధంబు

సేయునెడ వాసుదేవుండు రథారూఢుండై ముంగలన్ బ్రకా
శించు నంగిరుం జూచి యిట్లనియె.


క.

నీవును మఱియును గల యీ
పావకులును రణమునందు భయకంపితులై
పోవక నిలిచిన మఱి నా
లావుం గనియెదరు మీదులావును దెలియున్.

34


గీ.

అనినఁ గోపము రెట్టింప నంగిరుండు
కృష్ణుపైనిఁ ద్రిశూలంబుఁ ద్రిప్పివైవ
నంతలోననె శౌరియు నర్ధచంద్ర
విశిఖముల నేసి కావించె విశిఖముగను.

35


వ.

మఱియును.


క.

స్థూణాకర్ణాస్త్రము హరి
తూణంబునఁ దిగిచి రొమ్ముఁ దూఱఁగ నేయన్
శోణితము లొలుక నతఁడున్
బ్రాణంబులు తల్లడిల్ల వ్రాలె న్నేలన్.

36


అంగిరుని గూల్చి శ్రీకృష్ణుఁడు బాణుపురమును బ్రవేశించుట

వ.

ఇట్లుగ్రచరుండైన యంగిరుండు మూర్ఛాపరవశుండై పడిన
శేషించిన పావకు లతని రథమున నుంచుకొని బాణపురంబుఁ
బ్రవేశించి రంత.


గీ.

అంబుజాక్షుండు సింహనాదంబుఁ జేసి
భవ్యతరలీలఁ బూరించెఁ బాంచజన్య
మప్పు డాశౌరి గనుపట్టె నమృతకరుని
వెడలఁ గ్రాయు నభంబన విను నరేంద్ర!

37

క.

బలదేవప్రద్యుమ్నులు
నలఘుతరస్ఫూర్తి మెఱయ నట్లన శంఖం
బులుఁ బూరింపంగ నల హరి
బలిమిఁ బ్రవేశించె వేగ బాణునిపురమున్.

38


వ.

అప్పుడు శోణితపురంబునందు.


స్రగ్ధర.

ప్రద్యుమ్నాపేతసంకర్షణముఖకమలప్రస్ఫురద్దివ్యశంఖ
ప్రోద్యద్భూరిప్రణాదంబులు బహుపటహవ్యూహభేరీరవంబుల్
సద్యస్సన్నద్ధయోధాలఘురచితమహాసాహసక్ష్వేళనంబుల్
మాద్యత్పక్షీంద్రపక్షోల్లసితమహితఝంపాధ్వనుల్ గూడినిండెన్.

39


గీ.

పట్టణము నాల్గుదిక్కులఁ బ్రబలి యిట్లు
భీషణంబగునట్టి యాఘోష మమరె
వననిధులు నాల్గు నొక్కదిక్కునను గూడి
భాసురంబుగ నొక్కట మ్రోసె ననఁగ.

40


శంభుబలములు శ్రీకృష్ణాదుల నెదుర్కొనుట

ఉ.

శోణపురంబు వారలును జొచ్చుతరిన్ బహుయక్షపూర్వగీ
ర్వాణమహోద్భటప్రమథరాక్షసకోటులు విస్ఫురద్గదా
బాణమహోగ్రతోమరగృపాణములన్ ధరియించి యంబుద
శ్రేణులలీల గర్జనము సేయుచు నెంతయు భీషణాకృతిన్.

41


క.

ఒక్కుమ్మడి వడి నడచుచు
నక్కజముగ నార్చి పేర్చి యతితీష్ణములౌ
పెక్కమ్ముల నానలుగురి
వెక్కసముగఁ బొదవి రెల్లవీరులు మెచ్చన్.

42

వ.

మఱియు నప్పుడు సమరనిశ్శంకంబులగు ననేకకింకరసైన్యంబులు
జంగమనీలశైలంబులకైవడిఁ జనుదెంచి ప్రద్యుమ్నబలభద్ర
వాసుదేవవైనతేయులమీఁదఁ బ్రళయానలదారుణంబులైన
బాణంబులుఁ బ్రయోగించి తదీయాంగంబులం దొరగు రక్త
పూరంబులు దుర్మదంబునం ద్రావి రౌద్రంబుగా నార్చుచు
విజృంభించుసమయంబున బలభద్రుండు వాసుదేవునిఁ జూచి
యిట్లనియె.


ఉ.

అంబుజనాభ! యింక సముదగ్రత వీరల భూరిబాహుద
ర్పం బెడఁబాప కిట్టిసమయంబున నూరకయుండరాదు వే
గంబున నీదు తీష్ణశరకాండములన్ నిగుడంగఁ జేసి నీ
లాంబుదశైలదేహుల మహాసురలం బొలీయింపఁగాఁ దగున్.

43


చ.

అనవుఁడు నట్లకాక యని యామురవైరియు నంతకోపమం
బును నతిభీషణంబు[1]నయి పొల్చు మహాజ్వలనాస్త్రమున్ రయం
బెనయఁగ నేసి తద్బలమునెల్లను గూలఁగఁ జేసి ముందఱం
జని మఱియు గనుంగొనియె సైన్యముఁ గాంక్షితఘోరజన్యమున్.

44


వ.

అంత.


మ.

పరశుప్రాసకుఠారతోమరగదాపాశాంకుశేష్వాసము
ద్గరశక్త్యష్టిముఖాయుధంబుల మహోగ్రప్రక్రియన్ దాల్చి భీ
కరభేతాళపిశాచభూతగణరక్షస్సంఘముల్ భూరిసం
గరకౌతూహలయుక్తి నార్చెఁ బెలుచన్ గ్రౌర్యం బవార్యంబుగన్.

45


ఉ.

వారలఁ జూచి యిట్లనియె వారిజనేత్రునకున్ బ్రలంబసం
హారి యుపేంద్ర! యిచ్చటియుదారబలంబుల నేనుఁ గిట్టి దు

ర్వారత గెల్చెద విహగరాజును నియ్యెడ డిగ్గి నావుడున్
శౌరియు నట్లకాక కదనంబును సేయుద మంద ఱొక్కటన్.

46


యుద్ధముఁ జేయ బలభద్రాదుల వేర్వేరుచోట్ల శ్రీకృష్ణుడు నియోగించుట

వ.

అని పల్కి సుపర్ణుని డిగ్గె నప్పుడు బలభద్రప్రద్యుమ్నులును
తోడన డిగ్గి నప్పు డప్పంకజాక్షుండు పన్నగాశనప్రద్యుమ్నబల
దేవులఁ బేర్వేరం బేర్కొని యిట్లనియె.


సీ.

పన్నగాశన! నీవు వెన్నాసగా నిల్చి
        యటవచ్చు నహితుల నడఁచవలయు
రేవతీప్రియ! నీవు నావలపలిదిక్కు
        నను నిల్చి రిపులతోఁ బెనఁగవలయుఁ
బ్రద్యుమ్న! నీవు డాపలిదెసకై నిల్చి
        యరిసంఘములనెల్ల నుఱుమవలయు
బలములఁ జెదిరి విచ్చలవిడి వడి నేను
        దోశ్శక్తిఁ దునిమెదఁ దునుమవలయు


గీ.

నసురనివహమునెల్ల నటంచుఁబలుకు
నంతలోననె తద్బలమంత నింతఁ
గదియవచ్చిన శౌరియుఁ గదిమె నంత
గురుతరంబుగ నల పోరు ఘోరమయ్యె.

47


ఘోరయుద్ధమున శంభుసై న్యము పరాజయమునొందుట

క.

హలధరుఁడు నుగ్రుఁడై లాం
[2]గలమున దానవగణంబు గదియుచుఁ బెనుఁగు
ప్పులుఁగాఁ బడఁజేయుచుఁ దన
బలస్ఫురణ రణమునందుఁ బ్రబలఁగఁజేసెన్.

48

వ.

మఱియును.


చ.

ప్రళయహుతాశనప్రకరభాసురుఁడై యెదిరించు వీరులన్
హలమున నీడ్చియీడ్చి ముసలాగ్రమునన్ బడఁ గ్రుమ్మి చిమ్ముచున్
బలుమరు నిట్లు రౌద్రనిజభావముఁ జూపుచునుండఁ గోట్లు కొం
[3]డలుగఁ బడందొణంగి రచటన్ బ్రమథప్రబలారిసైనికుల్.

49


క.

ప్రద్యుమ్నుం డరితిమిర
ప్రద్యోతనుఁ డగుచు నిశితబాణవితతిచే
విద్యున్నిభదంష్ట్రుల సమ
రోద్యుక్తులఁ ద్రుంచె దనుజయూథాధిపులన్.

50


గీ.

శంఖచక్రగదాఖ్యశార్ఙ్గధారి
కంసవైరియు నిజకరకౌశలంబు
మెఱయ రయమున శరములు నెరయఁజేసి
రక్కసుల భూరిదర్పంబు నుక్కడంచె.

51


క.

పక్షికులాద్యక్షుఁడు సం
ధుక్షితనిజపక్షతీక్ష్ణతుండాగ్రములన్
రక్షోనివహంబుల ముఖ
వక్షంబుల నడఁచి వ్రచ్చి వందఱలాడెన్.

52


క.

ఈపగిది నలుగురు భుజా
టోపంబులుఁ జూపు నప్పుడు సురారిభటుల్
చాపంబులు దిగవిడిచి
కాపికలై చనిరి (మి)గులఁ గలఁగంబడుచున్.

53

గీ.

అంత బలదేవమదనవిహంగనాథు
లెంతయుం బేర్చి యార్చిరి సంతసమున
నసురభీకరఘనరవంబయిన పాంచ
జన్యమును వేగ పూరించెఁ జక్రధరుఁడు.

54


మహేశ్వరశక్తిపీడితుఁడగు బలదేవుఁడు శ్రీకృష్ణునివలన తద్విముక్తిఁ జెందుట

వ.

అంత నిట్లు కింకరసైన్యంబు దైన్యంబుఁ జెంది సంగరంబుఁ
జాలించి భయంబున దిశలన్ సంభ్రమించు నవసరంబున మహే
శ్వరప్రేరితంబైన మహాజ్వరంబు భయంకరాకారంబై హస్త
మస్తకచరణత్రితయంబులు గలిగి భసితప్రహరణంబై ధారాధర
సహస్రంబునుంబోలె గర్జింపుచు వచ్చి వాసుదేవాగ్రజునిం గని.


మ.

ఎటు బోవంగలవాఁడ వింక నిదె యుద్వృత్తిన్ నినుం గిట్టి మ
త్పటుబాహాబలయుక్తిఁ జూపెద మదాంధత్వంబు ప్రాపించి న
న్నిటులేలా యెఱుఁగంగఁజాల విటమీఁ దెట్లయ్యెదో యంచు ను
త్కటహాసంబు నొనర్చి పైఁబడియె నుద్యన్ముష్టిబంధోగ్రమై.

55


గీ.

రౌహిణేయుఁడు నెదిరించి బాహుయుద్ధ
కౌశలముఁ జూపి మండలాకారముగను
దిరిగెఁ దిరుగ మహేశ్వరజ్వరము నొంచి
యతని యతిఘోరముష్టిప్రహారములను.

56


వ.

మఱియు నమ్మహేశ్వరజ్వరంబు.


క.

తన సవ్యకరమునందలి
ఘనభసితము బలునిరొమ్ముఁ గదియఁగ వ్రేయన్
జని యదియు నతనివక్షం
బునఁ బడె నొకకొండభంగి భూరిస్ఫూర్తిన్.

57

క.

గ్రక్కునఁ బ్రలంబవైరియు
నక్క జముగ భసిత మెడలు(నట్లు)గఁ ద్రోయన్
జిక్కిన తచ్ఛేషంబును
మిక్కిలిఁ దాపంబు నతని మేనం జూపెన్.

58


సీ.

బలభద్రుఁ డపుడు కన్నుల నిద్రజేరంగ
        నావులింపుచు భ్రమం బావహిం(చి)
(చు)ట్టుఁ దిరుంగుచు నిట్టూర్పువుచ్చుచు
        రోమాంచమిళితగాత్రుండు నగుచు
నల్లనల్లన వచ్చి యల్ల జనార్దను
        జేరి దేవోత్తమ! చిత్స్వరూప!
కృష్ణ! హృషీకేశ! యిప్పు డీతాపంబు
        నేర్పుమై శాంతిఁ బొందింపు మనినఁ


గీ.

గమలదళనేత్రుఁ డాబలుఁ గౌఁగలించి
జ్వరకృతంబైన తాపంబుఁ జనఁగఁ జేసె
నంత యెప్పటియట్ల యనంతబలుఁడు
[4]ప్రబలుచుఁ బ్రకాశించెను భవ్యలీల.

59


శ్రీకృష్ణుఁడు మహేశ్వరశక్తితో యుద్ధము చేసి జయించలేక ప్రతిశక్తిని నిర్మించుట – రౌద్రవైష్ణవశక్తుల యుద్ధము

వ.

ఇవ్విధంబున నిజాగ్రజుం బృహృష్టాంతరంగుఁ గావించి పుండరీ
కాక్షుండు మహేశ్వరజ్వరంబునగ్రంబున నిలిచి యిట్లనియె.


గీ.

దుర్మదము మాని తొలఁగు నీపేర్మి యింకఁ
జెల్ల దీయడఁ గాదని చేరితేనిఁ
గఠిననిర్ఘాతసమముష్టిఘాతములను
నీదుగర్వం బణంచెద నిక్కువంబు.

60

క.

అనుటయు నది కోపంబున
ననలంబును బోలె నుజ్వలాకారంబై
తనసవ్యేతరబాహువు
లను భసితము విసరె నతఁడు లక్ష్యముగాఁగన్.

61


వ.

అంత.


సీ.

శౌరి మహేశ్వరజ్వరకల్పితంబగు
        సంతాప మందె నొక్కింతతడవు
జ్వర మంతలోనె భుజంగమాకృతులైన
        తనభూరిహస్తంబులను దదీయ
కంఠంబుఁ జఱచి తత్కఠినవక్షమునందు
        ముష్టిచేఁ బొడిచిన మురహరుఁడును
శీఘ్రం(బ) యుగ్రముష్టిప్రహారంబుల
        జ్వరముశిరంబు వక్షంబు నొంచె


గీ.

నదియు నతనియురంబును హస్తములను
జఱచి కరచిన నాహరి సస్మితముగఁ
దన (కరగదను) దాని వక్త్రంబు నడఁచి
త్రోసె నది బల్మి మఱియును డాసె నతని.

62


వ.

ఇట్లు భుజత్రయంబుగల మహేశ్వరజ్వరంబును నెనిమిది భుజం
బులుగల గరుడధ్వజుండును బ్రకటగిరికటకనికటకటపతితనిర్ఘాత
తులితధ్వానంబులైన ముష్టిఘాతంబులఁ బరస్పరంబు నురస్థ
లంబు నొంచుచు ధారాధరస్తనితగంభీరంబుగా నార్ఛుచు

ఘోరంబుగాఁ బోరునట్టియెడ, వియచ్చరవరు లచ్చరుపడి
మున్నెన్నఁడు నిట్టిసమరంబు గన్నవిన్నయది గాదని పొగడు
వచనంబులు గగనంబున నిగుడ నంత దానవాంతకుండు
నెంతయుఁ గోపాటోపంబు దీపింప నమ్మహేశ్వరజ్వరంబును
నిగ్రహింపఁ దలంచి కుపితసమవర్తి(వశవ)ర్తిప్రతిఘంబ(న)ఁ
దగు నిజభుజాపరిఘంబున వజ్రకఠినంబగు తద్వక్షంబు గుల
గులలుగా నగల్చి గర్జించి బాహువులఁ బట్టి నేలఁ బడఁద్రోచిన,
తద్భాహువుల వెంబడిఁ దదీయహృదయంబుఁ బ్రవేశించి మఱియు
భేదంబుఁ బుట్టించె, నమ్మధుసూదనుఁడును మహేశ్వరజ్వర
ప్రవేశవ్యాకులితాంతరంగుండై క్షణమాత్రంబు గాత్రంబు
గగుర్చడ నావులింపుచు నిద్రపరవశత్వంబు నొంది, యిట్టి
గుణంబు(లఁ గలది తజ్జ్వరమని మనంబు)న నెంచి గోపించి
తజ్జ్వరంబు నిగ్రహింపఁజాలిన ప్రతిజ్వరంబుఁ గల్పించిన,
నదియును నాల్గుభుజంబులును నాల్గుము(ఖంబులును నాల్గు
విధము)లైన యాయుధంబులు ధరించి మాహేశ్వరజ్వరంబు
నెదిరించి సింహనాదంబుఁ జేసి బాహుయుద్ధంబునకుం జొచ్చి
(వివిధగతుల యుద్ధముఁ జేయుచునుండ గం)ధర్వగణంబు
లంతరిక్షంబున నిల్చి విస్మయాయత్తచిత్తులై వీక్షింపుచుండి,
రంత మహేశ్వరజ్వరంబు.


క.

పనిసమహస్తమ్మున వై
ష్ణవ(బలములు మిగు)లఁ గూలం జఱచిన నదియున్
జవమరి బహువికృతస్వా
రవములు గావించె మిగుల రౌద్రముగాఁగన్.

63

గీ.

అంతఁ గోపము రెట్టింప నంతకోప
మాకృతిని వైష్ణవజ్వరం బాజ్వరంబు
మస్తకంబులు నిజఘోరహస్తములను
జదియ మోదుచు మఱియు వక్షంబు నడిచె.

64


చ.

అడిచిన శాంకరజ్వ.............జేసి తజ్జ్వరం
బుడుగక పైఁబడ సునిశితోగ్రరవంబులచే తదీయమౌ
వెడద యురంబున............................
..... యుద్ధము నహీనబలంబునఁ జేయు నత్తరిన్.

65


ఆ.

వైష్ణవజ్వరంబు వడి శాంకరజ్వరం
బును నిజోగ్ర.......................
...................................
...................లను జాలగాసి నేసె.

66


వ.

అంత.
ఉ. ఘోరతరస్వరంబునను గూయిడునట్టి జ్వరం..........
...రము సేసెదం గను మటంచును బెట్టుగనార్చె శౌరియున్
గ్రూరమహేశ్వరజ్వరము గూలు.........................
..................................డె నద్భుతంబుగన్.

68


గీ.

కృష్ణదేవ! యదూద్వహ! యీజ్వరమును
గృపను వీక్షించి.........................
......................................
...........ముగా బల్కె నచట నాకాశవాణి.

69

క.

వనజాక్షుఁడు తద్వాక్యము
విని రౌద్రజ్వర..........................
......................
.............యుచు నదియు నధికహర్షముతోడన్.

69


మ.

అనుతాపంబును జెంది శౌరికిని సాష్టాంగ......
.........ము............మంబునం జేర్చియో
దనుజారాతి! త్రిలోకనాయక! సురేంద్రస్తుత్యపాదాంబుజా!
నను రక్షింపుమట..............................

70

  1. భీషణంబునై
  2. గలమున దానవగణంబు గదిశికు
  3. డలుగఁబడందొణంగి రచటన్ ప్రమథప్రముఖప్రబలారిసైనికుల్
  4. ప్రబలి ప్రకాశించె భవ్యలీల