పీఠిక.

శ్రీ మాతండ్రిఁగారు నావిద్యా బుద్ధి కౌశలపరిశ్రమముల విషయమై శార్వరి సంవత్సరమున (1839 సంవత్సరము కొనను) నన్ను కలకత్తాకుఁబంపిరి. అక్కడ నేను కీలక సంవత్సరము తుది మాసముల వరకు (1849 సంవత్స రారంభమున కొద్ది మాసముల వరకు) నుంటిని. అపుడు నాయుపాధ్యాయులలో నొకరై యుండిన శ్రీ యుక్తబాబు రామచంద్ర మిత్రిగారి సత్సహవాసము వల్లను, మహనీయులైన శ్రీరాజా రామమోహన రాయల వారిచే వికృతి (1830) సంవత్సరమున స్థాపింపఁబడి, మహిర్షియని యెన్నిక కెక్కిన దేవేంద్రనాథ ఠాకురుఁ గారి చేత నుద్ధరింపఁ బడిన "ఏక మేవా ద్వితీయమ్" అనునట్టి బ్రహ్మసమాజములోని వారిచే శ్రుతి స్మృతులలో నుండి సంగ్రహింపఁ బడిన గ్రంథములను చదువుట వల్లను, నాకుఁ గలిగిన తత్త్వచింతయు, నేనుమరల విశాఖపట్టణము వచ్చిన పిమ్మటను నాకుటుంబము వారికి అనాదిగా మతగ్రంథోపదేశక సం తతివారైన మహామహోపాధ్యాయ శ్రీపరవస్తు వేంకట రంగాచార్యులయ్యవారలుఁ గారి వలన నేను విన్న వేదాంతార్థ రహస్యముల వల్లను, ఇతరగ్రంథముల వ్యాసంగమువల్లను, నిస్సమాభ్యధికుండై యపార కరుణానిధియై యుండు పరమాత్మ నుపాసించుటయె కర్తవ్య మను నా యభిప్రాయమును బలపఱిచి నాకు మిక్కిలి యానందమును గలిగింప, సంస్కృత భాషలో నుండు నట్టి వేదాంత వాక్యములకు తెనుఁగున సరియైన గీతములు రచియింపించిన బ్రహ్మవిద్య గాన పూర్వకముగా నందఱకును తెలిసి కొన సులభ మగునని తలంచి నేను ప్రార్థింపఁగా ఆ శ్రీపరవస్తు వంశకలశాబ్ధి కళానిధియగు మహామహోపాధ్యాయ శ్రీవేంకట రంగాచార్యులయ్యవారలుఁ గారు సిద్ధార్థ నామ సంవత్సరమునం దొడంగి యెనుబదినాల్గు గీతములు రచియించిరి. అందు బహుతర గీతములకు సంగీత విద్యాధురంధరులని పేరెన్నికగన్న ధార్వాడ మాధవరావు పంతుల వారును, కొద్ది గీతములకు సంగీతవిద్యాతత్త్వజ్ఞులును వీణావాదనప్రవీణులునగు గుమ్ములూరి వెంకట శాస్త్రులుఁగారును, ఒకటి రెండు గీతములకు మాత్రము పూర్వ కాలమున విజయనగర సమస్థానమున సంగీత విద్య యందును వీణావాదనమందును సర్వంకష ప్రజ్ఞ గలిగి సుప్రసిద్ధులై యుండిన పెద్ద గురురాయాచార్యులవారి మనుమలును తత్పరృశులునైన గురురాయాచార్యులుఁగారును, రాగతాళములు గుదిర్చిరి. అవి నాయుపాసనాకాలములందు పాడింపబడుచు నాకు ఆనంద సంధాయకములై యుండినవి. మఱియు నపుడు స్థాపింపఁబడిన గాయక పాఠశాలయందు అనేకులకు నేర్పింపం బడియు నీవరకు రెండు పర్యాయములు ముద్రింపఁబడియు చాలప్రదేశములను భక్త జనాహ్లాదకములుగా వ్యాపించి యున్నవి. మరల నిపుడుపైగా నిరువదియెనిమిది గీతములు ఆమహామహోపాధ్యాయులవారిచే రచియింపఁబడినవి. వీరి యన్నఁగారు బాల్యముననే శాస్త్ర పాండిత్యమునను సరసకవితా ప్రౌఢిని రూఢి కెక్కి మహనీయులై యుండిన శ్రీ రామానుజా చార్యులయ్య వారలుఁగారి పుత్రులు శ్రీ శ్రీనివాస భట్టనాథాచార్యులయ్యవారలుఁగారు అస్మదభి మతానుకూలముగా నాయిరువది యె నిమిది గీతములకు రాగతాళములమర్చి పూర్వ గీతములతోఁ గలిపి యెనిమి దెనిమిది గీతము లొక్కొక యష్టకముగాఁ జేర్పి ప్రత్యష్టకమున నుపదేశార్థగీతము లయిదాఱు నుపాసనార్థ నమస్కారమంగళార్థ గీతములు రెండు మూడు నుండు నటుల సమకూర్చి పదునాలుగ ష్టకములుగా విభాగించిరి - కాగా నీనూటపండ్రెం డుపనిషత్సార గీతములు నిపుడు మూడవ పర్యాయము ముద్రింపించితిని. ఇఁక లోకులు వీని యర్థ గౌరవమును గ్రహించి యుపయోగించి కొనఁ గోరుచున్నాను. జగత్ప్రసవితియును వరేణ్యుండును జగత్పతియు నపార కృపానిధియు నగు భగవంతునకు అపరాధియును మహాపాపియునగు నేను నాభక్తి శ్రద్ధలతో సమర్పించు నుపహారంబుగ నిది యంగీకరింపఁ బడుఁ గాత.

ఓం బ్రహ్మకృపాహి కేవలమ్‌.


గొడే నారాయణ

గజపతి రాయఁడు.

ఖర సం
విశాఖపట్టణము.