ముందుమాట



ఆంధ్రసాహిత్య పరిషత్కార్యాలయమున ‘వనమాలి విలాసము’ యొక్క అసమగ్రమగు వ్రాతిప్రతి యొకటి కలదు (సంఖ్య 158/20) ఇందలి తొలిపుటలో “శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారి తాటియాకు ప్రతినిఁ జూచి పరిషద్భాండాగారమునకై వ్రాయఁబడినది” అని అప్పటి పరిషత్పండితులగు శ్రీ చిలుకూరి పాపయ్యశాస్త్రిగారి సంతకముతోఁ గూడిన వివరణము కలదు.

ఈ ప్రతియందు గద్య పద్యములు మొత్తము 446 కలవు. ప్రథమాశ్వాసమున అవతారికా కథాప్రారంభములకు సంబంధించిన గ్రంథభాగము లేదు. ఇందు భీష్మకనృపాలుఁడు తన కొమార్తయగు రుక్మిణికి స్వయంవరము చాటించె ననియు, రుక్మిణి వాసుదేవునిపై మాత్రమే వలపు నిలిపియున్న దనియు ఏకాంతముగ నొక్క తన్వంగి వాసుదేవునకు శుభవార్త నివేదించును. వాసుదేవుఁడు రుక్మిణిపై వలవంతగొని వేగుచుండ ఆ వేడిమి చల్లార్చుటకై నారదుఁడు విచ్చేయును. ఇది ప్రథమాశ్వాస మందలి కథాభాగము.

కృష్ణునకు రుక్మిణిమీఁది వలవంత వేడిమి యట్లే యుండఁగా దానిని చల్లార్చుటకు బదులు నారదుఁడు వేఱొక క్రొత్తవేడిమి దరికొల్పెను. అది మిత్రవింద మీఁది వలపు. అవంతిదేశ ప్రభువగు విందుని చెల్లెలు మిత్రవింద. ఆమెయు కృష్ణుని మీఁదనే మనసు నిల్పియున్నది. దుర్యోధన మిత్రుఁడగు విందుఁడు అందుకు ప్రతికూలుఁడై అనేకరాజుల చిత్రపటములు వ్రాయించి వారిలో నెవ్వరినేని వరింపుమని కోరఁగా నామె వడవడ వణఁకి పోవును. నారదు నుపదేశానుసారము కృష్ణుఁడు మిత్రవింద యొద్దకు మందారమాలికయను నర్మసఖిని పంపును. వలపు రాయబారము ముగించుకొని వచ్చి, యామె మిత్రవింద కృష్ణునిపై నెంత విరాళిగొని యున్నదో వివరించి, తత్స్వయంవరము జరుగుచున్న వార్తయు నివేదించును — ఇది ద్వితీయ తృతీయ చతుర్థాశ్వాసము లందలి కథాభాగము. చతుర్థాశ్వాసము అసమగ్రము.

కావ్యనామము ‘వనమాలివిలాసము’ కనుక రుక్మిణి మిత్రవిందల వృత్తాంతములే కాక తక్కిన నాయికల వృత్తాంతములు కూడ పంచమాద్యాశ్వాసములలో నుండునేమో! విజయవిలాసాదులగు గ్రంథనామములు వనమాలివిలాసము వంటివే.

‘వనమాలి విలాస’ మందలి కథారచనాదివిశేషములు కొంతవఱకైన రుచిచూపుటకై పరిషత్ప్రతియందలి 446 పద్యగద్యములను 160 పద్యగద్యములుగా ఎడనెడ సంక్షిప్తపఱిచి యిందు అనుబంధముగా యిచ్చుట జరిగినది. ఆశ్వాసాంత పద్య గద్యములు మాత్రము యథాతథముగా ముద్రింపఁబడినవి. పద్య గద్యముల క్రమసంఖ్య పరిషత్ప్రతి ననుసరించి కూర్పఁబడినది

పరిషత్కార్యాలయమందలి వనమాలివిలాసప్రతి ఉదయనోదయ ప్రతికి తీసికట్టుగా లేదు. ప్రక్షిప్తభాగములు, స్ఖాలిత్యములు అనన్విత పద్యగద్యములే కాక, పాదములకు పాదములు, పంక్తులకు పంక్తులు పలుతావుల లుప్తములై యున్నవి. ఉదయనోదయ పరిష్కరణ మెంతక్లిష్టమో యిదియు నంతే యయినను యదావకాశము, యథామతి పరిష్కరించి సంక్షిప్తప్రతిని సిద్ధము చేయుట జరిగినది.

రచనాపద్ధతిని బట్టి చూడ ‘వనమాలివిలాసము’ ‘ఉదయనోదయము’ కంటె ముందే వ్రాయఁబడినదని స్పష్టమగును. ‘ఉదయనోదయము’ వంటి పరిణతకావ్యరచనకు వనమాలి విలాసము అభ్యాసరచన మనియు తోఁపకపోదు. కథాకథనమందును వర్ణనవిశేషములందును దాని కనురూపములైన యంశము లనేకములు గలవు. నారదుఁడు సహస్రానీకునొద్దకు వచ్చి, మృగావతిని గూర్చి వర్ణించి చెప్పినట్లే కృష్ణునొద్దకు వచ్చి మిత్రవిందను గూర్చి వర్ణించి చెప్పును. మృగావతికి చిత్రపటములందలి రాకుమారులను నెచ్చెలి వర్ణించి చెప్పినట్లే మిత్రవిందకు స్వయంవర సందర్భమున దాది రాకుమారులను వర్ణించి చెప్పును. కథాసరిత్సాగరమందలి ఉదయనకథ మనసులో మెదలుచుండగా సూరన వనమాలి విలాస రచన చేసియుండు ననిపించును. విరహవర్ణనలో సంకల్పసురతాది వర్ణనలు రెండు కావ్యములందును పరమ సాదృశ్యము వహించుచున్నవి. సులక్షణమైన ‘ఉదయనోదయ’ ప్రబంధ రచనకు అభ్యాసరూపమైన కవితా రచన ‘వనమాలి విలాసము’లో కొట్టవచ్చినట్లు కన్పట్టుచున్నది. కవి మానసిక పరిణామక్రమము తెలిసికొనుటకు రెండు రచనలను పరిశీలించుట యావశ్యకమగునని ఈ ‘వనమాలి విలాస’ సంక్షిప్తప్రతి అనుబంధములో చేర్పఁబడినది.

సూరన ఈ కృతిని కొండూరి అక్కయ దండనాథున కంకిత మిచ్చెనని ఆశ్వాసాద్యంతపద్యములవలన తెలియుచున్నది. ఇతఁడు ఎల్లమాంబకు పుత్రుఁడనియు ఐతమాంబకు భర్తయనియు, మీఁదుమిక్కిలి సోమయాజి యనియు తెలియుచున్నది.

ఈ అక్కయదండనాథుని గూర్చిన చారిత్రకవిశేషములు అన్వేషిపఁదగియున్నవి.

‘ఆంధ్రకవుల చరిత్రము’లో కందుకూరి వీరేశలింగము పంతులుగారు తమ యొద్ద వనమాలి విలాసము యొక్క అసమగ్రప్రతి యొకటి కలదని వ్రాసియుండిరి. మానవల్లివారియొద్ద నున్నతాళపత్రప్రతి అదియో వేఱొకటియో తెలియదు. పరిషత్ప్రతి మానవల్లివారి తాళపత్రప్రతి ననుసరించి వ్రాయఁబడినదే. ఇది అసమగ్ర మనుట స్పష్టము. వనమాలి విలాసము యొక్క సమగ్రప్రతి యెప్పటికైన లభించుచో సూరన కవితావిశేషములు ఇంకను కరతలామలకము కాఁగలవు. పరిశోధకులైన జిజ్ఞాసువులు అన్వేషింపవలసియున్నది.

ప్ర. సంపా.