ఈ నడికి రేయి వెన్నెలయెద చలించు

ఈ నడికి రేయి వెన్నెలయెద చలించు

పిలు పెదో 'నా సఖా' యని వేగిరించు;

అనలమై కాల్చు నిశ్శబ్దమునె; కలంచి

పరువు లెత్తించు కడల నా బ్రతుకు నిపుడు!


ఎన్ని మారులు సవరించుకొన్న చూపు

తొలగ వేమో యలము నేమొ నెల మొగాన

చెదరునే బెదరి బెదరి చెలియకురులు

జాలిగా నీలమేఘ నిశ్వాసము లటు!


నా కొరకె చాచు సఖికంఠనాళమందు

మ్రోగక చలించి చెరవడ్డ మూగబాధ

ఎటు పిలుచు నన్ను ఆ చూపుటిరుల; కనులె

పలుక నేరక విడి విడి పగులు నేమొ!


అయ్యయ్యో! ఊర్వశీ విషా దార్ద్రమూర్తి

ఈ నిశీథాన, నా హృదయాన, నిండె,

పూర్ణిమా శుభ్రయామిని బొగ్గువోలె

ఈ యెడదవోలె కాలిపోయినది నేడు.


ప్రాణసఖి! నీ సుదూర తల్పమున సుప్తి

కట కలలు రావు, కలుగదు కలవరింత,

వేగిపో దిట నీ కయి వేలు రేలు

బ్రతుకు బ్రతు కెల్ల ఒక్కనేత్రముగ కాచి!