ఇట్టిచక్కఁదనాలెల్లా నిందే కానఁగవచ్చె
ఇట్టిచక్కఁదనాలెల్లా నిందే కానఁగవచ్చె
చుట్టిచుట్టీపె వొరపు చూడరమ్మ చెలులు
నగితే వెన్నేలగాసీ నలినాక్షి సెలవుల
నిగిడి చూచితే మించీ నీలాలరంగు
మొగమెత్తితేఁ దొలఁకీ మోవి మదనకళలు
సొగిసి యీపె వొరపు చూడరమ్మ చెలులు
మాటలాడీతే మెరిచీ మాణికాలు నోరునిండా
పాటించితే నిలువెల్లా బంగారు నిగ్గు
పాటావాడితేఁ బెదవిఁ బచ్చితేనె లూరీని
జూటరి యీపె వొరపు చూడరమ్మ చెలులు
పెనఁగితే నురమునఁ బెరిగీని జక్కవలు
చ(చె)నకితే గొనగోళ్ళఁ జెందీ వజ్రాలు
యెనసె శ్రీవేంకటేశుఁ డీకెఁ గడు మన్నించి
జునుఁగ కీపె వొరపు చూడరమ్మ చెలులు 29-112