ఇంద్రాణీ సప్తశతీ/గాయత్రం శతకమ్ఓం

ప్రధమం

గాయత్రం శతకమ్

1. శశివదనా స్తబకము


            1. హరిలలనే మే పథి తిమిరాణి |
               హర దరహాస ద్యుతిభి రిమాని ||

            2. అగతి మవీర్యా మపగత ధైర్యాం |
               అవతు శచీమే జనిభువ మార్యాం ||

            3. శ్రుణు కరుణావ త్యలఘుమఖ ర్వే |
               స్తవ మహమార్య స్తవ శచి కుర్వే ||

            4. త్రిజగ దతీతో విలసతి నిత్యః |
               అణు రణుతో, యో భగవతి సత్యః ||

            5. త్వ మఖిల కార్యే ష్వయి ధృత శక్తిః |
               ఉరుగతి రస్య ప్రభుతమ శక్తిః ||

            6. విదురిమ మేకే జగతి మహేంద్రం |
               జగురయి కేచి జ్జనని మహేశం ||

            7. అవగత వేదో వదతి మహేంద్రం |
               పరిచిత తంత్రో భణతి మహేశం ||

            8. జనని శచీ త్వం ప్రథమ దళస్య |
               భగవతి దుర్గా స్యపర దళస్య ||


1. ఓ ఇంద్రాణీ ! నా మార్గమందున్న యీ చీకట్లను నీ మందహాస కాంతులచే తొలగింపుము.

2. గతి చెడి, వీర్యము గోల్పోయి, అధైర్యముజెందిన నా పవిత్ర జన్మభూమిని శచీదేవి రక్షించుగాక.

3. ఓ శచీ ! ఆర్యుడనగు నేను శ్రేష్ఠమైన నీ స్తవము జేయు చుంటిని. వినుము.

4. ఓ భగవతీ ! సత్యస్వరూపుడైన యెవడణువుకంటె నణువగుచుండెనో, త్రిజగదతీతుడగు నాతడు నిత్యము ప్రకాశించు చుండెను.

5. ఓ దేవీ ! సర్వ కార్యములందు ధరించబడు శక్తి గలిగి, త్వరిత గతి గలదానవై నీవీ ప్రభునకు మిగుల సమర్ధమైన శక్తివి.

6. ఓ తల్లీ ! జగత్తునందు కొందఱీ పురుషుని మహేంద్రుడని తెలియుచున్నారు, మఱికొందఱు మహేశ్వరుడని గానము చేయుచున్నారు.

7. వేద విదులు మహేంద్రుడందురు, తంత్రశాస్త్ర పరిచితులు మహేశ్వరుడందురు.

8. ఓ తల్లీ ! నీవు మొదట చెప్పబడినవారికి శచీదేవి వగుచుంటివి, రెండవవారికి దుర్గవగుచుంటివి.


            9. న శచి శివాత స్త్వ మితర దైవం |
               బహు ముని వాణీ సమరస తైవం ||

           10. దివిచ సితాద్రౌ శచి వపుషోర్వాం |
               పృథ గుపలంభా దయి భిదయోక్తిః ||


           11. తనుయుగ మూలం వపురతి మాయం |
               కరచరణాద్యై ర్వియుత మమేయం ||


           12. త్వముదరవర్తి త్రిభువన జీవా |
               భవసి శచీ సా జనని శివా వా ||

           13. విభు శుచికీలా తతిరయి ధూమం |
               త్వ మమర మార్గం బత వమసీమం ||


9. ఓ శచీదేవీ ! నీ వందువలన శివవే కాని యితరదైవమవు కావు. ఇట్లనుట బహుమునుల వాణి ననుసరించి యుండును.


10. ఓ, శచీ ! స్వర్గ, కైలాసములందు మీరు (శచీ, దుర్గలు) వేఱ్వేరు శరీరములను ధరించుటవలన మీకు భేద మూహింప బడుచున్నది.

(స్వర్గమనగా నాకము = న + అకము = దుఃఖములేనిది యైనను కైలాసము మోక్షస్థానముగా నెంచబడుచున్నది. సుషుప్తికి సమాధికి గల సంబంధమువంటిదని పౌరాణిక భావము. కాని యివి యొకే లోకమునకు వైదిక తాంత్రిక పరిభాషలందున్న పేళ్ల భేదము. తేజస్సునుబట్టి యొకరు, శబ్దమునుబట్టి యొకరు కల్పించిరి.)


11. మాయకతీతమైనది, కరచరణాది విహీనమైనది. యమేయమైనది యైన శరీరము పై రెండుశరీరములకు మూలమైయుండెను. (ఈ రెండు శరీరములు ఆకాశ సంబంధములు, వీనికి మూలమైనది సచ్చిదానంద స్వరూపము. సృష్టికొఱకాకాశ శరీరము ధరింపబడుట శ్రుతిప్రసిద్ధము. దీనినే సగుణ బ్రహ్మలక్షణ మందురు.)


12. ఓ తల్లీ ! ఉదరమందిమిడించుకొనిన త్రిభువనములకు నీవు జీవమువై శచివైతివి. ఆ నీవే దుర్గగా కూడ నుంటివి.


13. దేవీ ! శుద్ధాగ్నియైన విభునియొక్క కిరణ సమూహమవై నీవు దేవయానమను ధూమమును గ్రక్కితివి. ఆశ్చర్యము.


(విభుడు మూలమందు సచ్చిదానందస్వరూపుడైనను సృష్టికొఱకు వ్యాపకత్వధర్మమును జెంది విభుడనబడెను. విభుడనగా వ్యాపకుడు. వ్యాపకత్వధర్మ మతని మహిమ.


             14. జయసి నభస్తో జనని వరస్తాత్ |
                 నభసిచ భాంతీ భవసి పురస్తాత్ ||


             15. త్వ మతనురంబ జ్వలసి పరస్తాత్ |
                 ఇహ ఖ శరీరా లససి పురస్తాత్ ||

ఆ మహిమ మతనియందుద్గారలీనములను జెందుచు సృష్టిప్రళయములకు కారణమగుచుండును. ఉద్గార మనెడి వికాసమును బొందినప్పు డచలమైన స్వరూపవస్తువు మహిమావంతమై తన యుపరిభాగములందు వ్యాపకత్వలక్షణముచే సూక్ష్మధూమసదృశమైన రజస్సగుచు, మహిమ యొక్క విజృంభణమువలన అగ్నినుండి క్రక్కబడు సూక్ష్మదూమమువలె విభునిస్వరూపము నుండి యది క్రక్కబడుచున్నది. ఈవిదముగా ఆనందస్వరూపవస్తువు తనకుతానే తనమహిమచే విషయలక్షణముగా వ్యాపించి ఆకాశనామమును బొందెనుగావున ఆకాశమానందము కాకపోదను నర్థముగల శ్రుతివాక్కు (యదేష ఆకాశ ఆనందో నస్యాత్) వ్యాఖ్యానమగును. ఈ యాకాశము సూక్ష్మమైనను దానిని వ్యాపింపజేయు మహిమ దానికంటెను సూక్ష్మమై దానికంతరమున నున్నట్లు మఱువరాదు. అంతరమున కేవలమైయున్న మహిమకు శుద్దత్వదశ చెప్పబడును : ఆకాశముతోగూడి వ్యాపించునప్పుడు విషయత్వదశ చెప్పబడును : ఈ రెండుదశలకు నడుమ నెక్కడ ఆకాశమును బొందుచు విడుచుచు నున్నటు లుండునో అ సంధి సంధానప్రాంతమందు మహిమ జ్వలించు చున్నందున దానికక్కడ తేజస్త్వదశ చెప్పబడును. ఈ విధముగా శుద్ధత్వ తేజస్త్వ విషయత్వదశలచే జ్వాలారూపమున వ్యాపించిన మహిమ కాశ్రయుడైన విభుడు శుద్ధాగ్నితోడను, విషయలక్షణముగా వ్యాపించిన సూక్ష్మ రజోభూతాకాశము ధూమముతోడను పోల్చబడెను. రెండింటికి నడుమ నున్న తేజస్త్వసంధిభాగము విషయమును వేఱుచేయుచు ఆనందస్వరూపముతో సంధానమొనర్చు చున్నందున దుఃఖములేని ప్రాంతముగా నెంచబడి నాక మనబడెను. (నాకము = న + అకము = దుఃఖములేనిది). ఇది కాంతులకు మార్గమైనందున ముక్తికి మార్గమగు దేవయాన మనియు పిలువబడుచున్నది (దిప్ = కాంతి). ఇది రజోమయాకాశమనెడి ధూమమున కంతరముననుండి దాని సంబంధముచే దేవయానధూమ మనబడెను. అట్లే ఆకాశపరముగా పరమాకాశమనియు పిలువబడుచున్నది. దీని నధిష్ఠించినది సచ్చిదానందస్వరూపమైనను, అధిష్ఠాన లక్షణమువలన కవులా స్వరూపమును శక్తిపురుషులుగా విభజించి పల్కిరి. ఆ శక్తి పురుషులే ఇంద్రాణీ యింద్రులని గ్రహించవలెను.)


14. ఓ తల్లీ ! నీవాకాశమునకావల (అనగా పరమాకాశము లేదా కేవల మహిమగా) ప్రకాశించుచు, నాకాశమందును దాని కీవలను (అనగా గోళాకృతులుగా రూపొందిన విశ్వమందును) గూడ నుంటివి.


15. ఓ తల్లీ ! ఆవల నీవశరీరవై జ్వలించుచు, ఆకాశమందును దాని కీవలనున్న గోళ ప్రపంచమందును గూడ ఆకాశ శరీరిణివై ప్రకాశించు చుంటివి.


               16. జనని పరస్తా న్మతిరసి భర్తుః |
                   అసి ఖ శరీరా పృథగవగంత్రీ ||

               17. సువిమల రూపం భగవతి శాంతం |
                   న భవతి శూన్యం తదిద మనంతం ||

               18. దివి దధతీంద్రే పురుషశరీరం |
                   జనని పురంధ్రీ తనురభవస్త్వం ||

               19. దృశి విలసంతం ప్రభు ముపయాంతీ |
                   భవసి విరాట్ త్వం నృతనుషు భాంతీ ||

               20. తవ గుణగానం జనని విధాతుం |
                   భవతి పటుః కో వియదివ మాతుం ||

               21. భగవతి తృప్తి ర్భవతు న వా తే |
                   అభిలషి తాప్తి ర్భవతు న వా మే ||

               22. భజతి తవాంఘ్రిం మమఖలు భాషా |
                   పతి మనురాగా త్ప్రియమివ యోషా ||


               23. అఘ మపహర్తుం శుభమపి కర్తుం |
                   అల మజరే తే గుణగణ గానం ||

               24. అవసి జగత్త్వం కులిశి భుజస్థా |
                   అవ మునిభూమిం గణపతి ధీస్థా ||


16. ఓ తల్లీ ! నీ వావల భర్తకు మతివై యుంటివి. ఆకాశ శరీరిణివై నీవు ప్రత్యేక చలన శక్తిగానుంటివి.


17. ఓ తల్లీ ! నీ నిర్మల స్వరూపము శాంతమైనను, శూన్యము మాత్రము కాదు. ఇచ్చటి (ఆకాశ) రూప మనంతమైయున్నది.


18. ఓ తల్లీ ! నీ వాకాశములో నింద్రునియందు పురుష శరీరమును ధరించి, నీవు స్త్రీ శరీరిణివైతివి.


19. ఓ తల్లీ ! దృక్కులలో విలసించు ప్రభువుతో గలసి నీవు మానవులందు బ్రకాశించుచు 'విరాట్‌' వైతివి.


20. ఓ తల్లీ ! ఆకాశమును కొలత జేయుట శక్యము గానట్లే నీ గుణగానము చేయుట యెవరికిని శక్యముకాదు.


21. ఓ భగవతీ ! నీకు దృప్తియగుగాక, కాకపోవుగాక, నాకోర్కె సిద్ధించుగాక, మానుగాక ;


22. ప్రియ భర్తననురాగముతో భార్య విడువనట్లు, నా భాష నీ పాదమును విడువక భజించును గదా.

(పాదమనగా అంశయగు నాకాశ రూపమునకును అన్వయించును. ఆకాశము శబ్ద గుణము కలది గావున భాషచే భజింప బడునట్టిదగును.)


23. దేవీ ! నీ గుణ గణగానము పాపములను నశింప జేయుటకును శుభముల నిచ్చుటకును సమర్ధమైనది.


24. ఓ తల్లీ ! ఇంద్రుని భుజములందుండి (భుజశక్తిగా) నీవు జగత్తులను రక్షించు చుంటివి. గణపతి బుద్ధియందట్లే నీ వుండి భారత భూమిని రక్షింపుమా.


             25. శశివదనాభి ర్గణపతిజాభిః |
                 శశివదనాద్యా పరిచరితా౽స్తు ||


2. తనుమధ్యా స్తబకము


              1. ధ్వాంతం పరిహర్తుం తేజాంస్యపి భర్తుం |
                 అంతర్మమ భూయా త్స్మేరేంద్ర పురంధ్రీ ||

              2. భీతా మరిధూతా మార్యావని మేతాం |
                 సమ్రాజ్ఞి బుధానాం దూనా మవ దీనాం ||

              3. ఇంద్రస్యసహాయాం విశ్వస్య విధానే |
                 ఆకాశ శరీరా మంబాం ప్రణమామః ||

              4. కర్తుర్భువనానాం మాయాసి శచి త్వం |
                 సత్యస్య తపో౽సి జ్ఞస్యాసి మనీషా ||

              5. ఆజ్ఞా౽సి వినేతు స్తేజో౽సి విభాతః |
                 నిర్యత్న సమాధే రానంద రసో౽సి ||

              6. తస్య త్వమనన్యా౽ ప్యన్యేవ ఖకాయా |
                 అత్యద్భుతమాయా జాయా౽సి సహాయా ||

              7. ఆకాశ శరీరాం జాయామశరీరః |
                 ఆలింగ్య విభుస్త్వాం నందత్యయి చిత్రం ||


25. గణపతి కవివలన బుట్టిన యీ 'శశివదనా' వృత్తములచే నాదిశక్తియైన యింద్రాణి సేవింపబడుగాక.

_________


1. చీకటిని పరిహరించుటకు, తేజస్సును నింపుటకు ప్రకాశించు ఇంద్రాణి నా హృదయమందుండుగాక.


2. ఓ పండిత పరిపాలినీ ! భీతిజెంది, శత్రువుల యధీనమై, కంపించు దీనురాలైన ఈ యార్యావర్తమును రక్షింపుము.


3. విశ్వసృష్టియం దింద్రునకు సహాయురాలవై, యాకాశ శరీరముగల అంబవైన నీకు మేము నమస్కరింతుము.


4. ఓ శచీ ! నీవు భువనకర్తకు మాయవైతివి, సద్వస్తువునకు తపస్సువైతివి, పండితులకు బుద్దివైతివి.


5. ఈశ్వరునకు నీవతని యాజ్ఞ వైతివి, అగ్నికి తేజస్సువైతివి, నిర్వికల్ప సమాధియందుండు యోగికానందరసమైతివి.


6. అనన్యురాలవైనను, అన్యురాలవలె నాకాశ శరీరముతో నత్యద్భుత మాయారూపిణివై, నీ వతనికి సహాయమొనర్చు భార్య వైతివి !


7. దేవీ ! అశరీరుడైన ప్రభువు ఆకాశ శరీరముచే భార్యవగు నిన్నాలింగనము చేసికొని యానందించుచున్నాడు. ఇదియే చిత్రము. (నందతి ధాతువునుండి వచ్చిన 'ఆనంద' పదమునకు

                
                  8. వజ్రేశ్వరి ఘస్రే శీర్షేంబ బిభర్షి |
                     దీప్తం సవితారం మాణిక్య కిరీటం ||

                  9. నక్షత్ర సహస్రై శ్శుభ్రద్యుతిభి స్తే |
                     పుష్పాయితమేతై ర్మాతర్నిశి మస్తే ||

                 10. ఘస్రః ఖలుకాలో రాజ్యం శచి కర్తుం |
                     రాత్రి: ఖలుకాలో రంతుం రమణేన ||

                 11. నిశ్శబ్ద తరంగా స్వగ్లౌషు నిశాసు |
                     నూనం ఖశరీరే కాంతం రమయంతీ ||

                 12. సాంద్రోడు సుమస్ర గ్విభ్రాజిత కేశా |
                     ధ్వాంతాసిత చేలా శాంతా౽ప్యసి భీమా ||


సమృద్ధిమంత మర్ధమగును, సంతోషమనికాదు. ఆకాశ శరీరమునకు వస్తుసమృద్ధినిచ్చువా డానందస్వరూపుడు. అతని స్వరూపమందొక అంశమాత్ర మాకాశము. దాని నావరించి స్వరూపముండుట ఆలింగనమగును.


8. ఓ యంబా ! పగటిపూట ప్రజ్వలించుచున్న సూర్యుని నీవు మాణిక్య కిరీటమువలె ధరించు చుంటివి.

(ఆకాశ రూపిణియొక్క వైభవమిది. శక్తికి రెండు రూపములు వచింపబడుచున్నవి. అందొకటి యాకాశరూపమై కిరీటమును ధరించి విశ్వపాలనమొనర్చు ప్రభ్వీరూపము ఇంకొకటి దివ్యస్త్రీ రూపము. రెండవది దిగువ 13, 14 శ్లోకములచే చెప్పబడుచున్నది.)


9. తల్లీ ! తెల్లని కాంతిగల యీ నక్షత్రసమూహములే రాత్రిభాగమున నీ శిరస్సునందు పుష్పములవలె నున్నవి.


10. ఓ శచీ ! రాజ్యమును పాలించుకాలము పగలేగదా ! భర్తతో రతిసల్పుకాలము రాత్రియేకదా !

(మొదటి దాకాశరూపమునకు. రెండవది స్త్రీ రూపమునకు జెందును.)


11. ఓ యాకాశ శరీరిణీ ! చంద్రుడు లేనట్టి, నిశ్శబ్ద తరంగములు గలిగినట్టి చీకటి రాత్రులందు నీవు భర్తను రమింపజేయు చుంటివి. నిశ్చయము.


12. ఓ దేవీ ! దట్టమైన నక్షత్రములనెడి పూలదండలతో విభ్రాజ మానమగు కేశములున్ను, చీకటియను నల్లని వస్త్రమున్ను గలిగి నీవు శాంతముగా నున్నను భయంకరముగా నుంటివి.

               13. రాజ న్మితతారా మందార వతంసాం |
                   మాత స్సితభాసా స్మేరాం హసి తేన ||

               14. జ్యోత్స్నా ఘనసార ద్రావై రనులిప్తాం |
                   త్వాం వీక్ష్య న శాంతిః కస్య క్షణదాసు ||

               15. బాలారుణ రోచి: కాశ్మీర రజోభిః |
                   ఆలిప్తముఖీం త్వాం ప్రాతః ప్రణమామి ||

               16. సాయంసమయ శ్రీ లాక్షారస రక్తం |
                   ప్రత్య క్ప్రసృతం తే వందే వరదేంఘ్రిం ||

               17. దీప్తార్క కిరీటాం సర్వాన్వినయంతీం |
                   వందే భువనానాం రాజ్ఞీమసమానాం ||

               18. ధూతాఖిల రోగా శ్శ్వాసాస్తవ వాతాః |
                   మాతర్వితరంతు ప్రాణస్య బలం నః ||

               19. ప్రాంచస్తవ వాతా శ్శ్వాసా శ్శముశంతు |
                   ప్రత్యంచ ఇమే నః పాపం శమయంతు ||

               20. మన్మాత రవాంచో వీర్యం వితరంతు |
                   సంతాప ముదంచ స్సర్వంచ హరంతు ||


13. ఓ మాతా ! జ్యోతిర్మయమైన నక్షత్రములనెడి మందార పుష్పములచే నలంకృతమైనట్టిన్ని, తెల్లని కాంతిగల నవ్వుచే శోభించు చున్నట్టిన్ని,


14. వెన్నెల యను కర్పూర రసముచే లేపన జేయబడినట్టిన్ని నిన్ను రాత్రి భాగములందు జూచిన వారికెవరికి శాంతి గలుగకుండును ?


15. బాలసూర్యుని కిరణములనెడి కుంకుమ ధూళిచే లేపనగావింప బడిన ముఖముగల నిన్ను నేను ప్రాతఃకాలమున నమస్కరింతును.


16. ఓ దేవీ ! సాయంసమయ కాంతియనెడి లత్తుకచే నెఱ్ఱబడి పశ్చిమమున వేఱుగా వ్యాపించిన నీ పాదమునకు నేను నమస్కరింతును.


17. ప్రకాశించు సూర్యుని కిరీటముగా గొని సకలజనులను శాసించు నట్టి, భువనములకు ప్రభ్వివై నిరుపమానవై నట్టి నిన్ను నేను కొలుతును.


18. ఓ తల్లీ ! సకలరోగనివారణమగు నీ శ్వాస మా ప్రాణములకు బలమిచ్చుగాక.


19. ఓ తల్లీ ! వెలుపలకు వచ్చు నీ శ్వాస మాకు సౌఖ్యము నిచ్చు గాక. లోనికి బోవు నీ శ్వాస మా పాపములను నశింప జేయుగాక.


20. తల్లీ ! దక్షిణముగా వచ్చు నీ శ్వాసవాయువులు మాకు వీర్యము నిచ్చుగాక. ఉత్తర దిక్కుగా వచ్చు శ్వాస మా సకల సంతాపములను హరించుగాక.

21. అస్యా ఇవ భూమే ర్భూత ప్రసవాయాః |
    ఏకైకశ ఆహు ర్యేషాం మహిమానం ||

22. అద్రే రుపలానాం నద్యాస్సికతానాం |
    యేషాంచ న కశ్చి చ్ఛక్తో గణనాయాం ||

23. రోమాయిత మేతై ర్గోళైస్తవకాయే |
    వ్యాఖ్యాత మనేన శ్లాఘ్యం తవభాగ్యం ||

24. విశ్వం వహసీదం జంభారి భుజస్థా |
    ఆర్యాన్వహ మాత ర్వాసిష్ఠమతిస్థా ||

25. ఆద్యాం భువనానాం భర్తు స్తనుమధ్యాం |
    భక్తస్య భజంతా మేతా స్తనుమధ్యాః ||

_________

3. ముకుళా స్తబకము

1. పౌలోమ్యా శ్శుచయో హాసానాం ఘృణయః |
   భూయాను ర్విమల ప్రజ్ఞాయై హృది మే ||

2. ఇంద్రాణ్యాః కరుణా లోకా శ్శోక హృతః |
   భూయాను ర్భరత క్ష్మాయై క్షేమ కృతః ||


21. భూతములకు తల్లియైన భూమియొక్క మహిమను బూర్తిగా చెప్పలేనట్లే, యే గోళమహిమను గురించియైన నొక్కొక్క భాగముకంటె హెచ్చుగా చెప్పజాలకుండిరి.


22. కొండలయొక్క ఱాళ్ల సంఖ్య. నదులయొక్క యిసుక (తిన్నెల) సంఖ్య చెప్పజాలనట్లే, గోళముల సంఖ్యయు చెప్పశక్యము కాదు.


23. ఓ దేవీ ! ఇట్టి యసంఖ్యాకమైన గోళములే నీ శరీరమందు రోమములు (అల్పాంశలు). ఇంతమాత్రముచేతనే కొనియాడ దగియున్న నీ భాగ్యము వ్యాఖ్యానమయ్యెను.


24. ఓ తల్లీ ! దేవేంద్రుని భుజములందు నీవుండి విశ్వమును వహించుచుంటివి. వాసిష్ఠుని (గణపతిముని) బుద్ధియందు నీవుండి ఆర్యులను వహింపుము.

25. భువనములకు పూర్వమేయున్న శక్తిని, యీశ్వరుని తను మధ్యను (భార్యను, ఇంకొక అర్ధము శరీరమధ్యమందుండు నాకాశరూపిణిని) భక్తునియొక్క యీ తనుమధ్యావృత్తములు పొందుగాక.

__________


1. ఇంద్రాణియొక్క శుభ్రమైన హాసకాంతులు నా హృదయ మందు విమలమైన ప్రజ్ఞ నిచ్చుగాక.


2. దుఃఖమును హరించు ఇంద్రాణీ కృపావలోకములు భారత భూమికి క్షేమకరము లగుగాక.

3. వ్యక్తి ర్వ్యోమ తను శ్శక్తిత్వా ద్వనితా |
   జ్ఞాతృత్వా త్పురుషః కేషాంచి ద్విదుషాం ||

4. వ్యక్తిం వ్యోమతనుం యేప్రాహుః పురుషం |
   తేషాం తత్త్వవిదాం కల్పస్స్యా త్త్రివిధః ||

5. రుద్రం కేపి జగు శ్శక్రం కేపి విదుః |
   భాషంతే భువన ప్రాణం కేపి విదః ||

6. వ్యక్తిం వ్యోమతనుం ప్రాహుర్యే వనితాం |
   తేషాంచ త్రివిధః కల్పశ్శాస్త్ర విదాం ||

7. దుర్గా సూరివరైః కైశ్చిత్సా గదితా |
   శచ్యన్యై ర్విబుధై ర్జ్ఞైరన్యై రదితః ||

8. ఏకేషాం విదుషాం వ్యక్తి ర్వ్యోమతనుః |
   నస్త్రీ నో పురుషో బ్రహ్మై తత్సగుణం ||

9. త్వం విశ్వస్య మహా న్ప్రాణః కః పరమే |
   త్వం రుద్రః ప్రణవ స్త్వం శక్రో౽భ్ర శిఖీ ||


3. ఆకాశము శరీరముగా గలదొక వ్యక్తియనియు, శక్తిత్వమువలన వనితయనియు, జ్ఞాతృత్వముచే పురుషుడనియు కొందఱు పండితుల యభిప్రాయము.

(ఒకే శరీరము శక్తి పురుషుల కన్వయింపబడెను.)


4. ఎవరు వ్యోమతనువైనది వ్యక్తి యనియు, పురుషుడనియు చెప్పు చున్నారో, ఆతత్త్వవేత్తలు మూడు విధములగు కల్పన తిరుగ చేయుచున్నారు. (ఎట్లనగా,)


5. కొందఱా పురుషుని రుద్రుడనియు, మఱికొందఱు ఇంద్రుడనియు నెఱుగుచున్నారు. ఇంకను కొందఱు లోకములకు ప్రాణమే యావ్యక్తి యందురు.


6. వ్యోమతనువు నెవరు వ్యక్తియనియు, వనితయనియు చెప్పు చున్నారో, ఆ శాస్త్రవేత్తలయందును కల్పన త్రివిధములుగా నున్నది. (ఎట్లనగా,)


7. కొందఱిచే ఆ వనిత 'దుర్గ' యనియు, మఱికొందఱిచే 'శచీ' యనియు, నింకను కొందఱిచే 'అదితి' యనియు చెప్పబడు చుండెను.


8. కొందఱా వ్యోమతను వ్యక్తి స్త్రీయు కాదు, పురుషుడు కాదని, అది బ్రహ్మయొక్క సగుణరూప లక్షణ మనిరి.


9. ఓ దేవీ ! నీవే విశ్వమునకు మహాప్రాణమవు, నీవే బ్రహ్మవు, రుద్రుడవు, ప్రణవమవు, ఇంద్రుడవు, వైద్యు తాగ్నివి,


10. త్వం కస్యా స్యదితి స్త్వం రుద్రస్య శివా |
    త్వం శక్రస్య శచీ శక్తి స్సర్వ గతే ||

11. ప్రాణశ్చ ప్రణవో జ్యోతిశ్చాంబరగం |
    వస్త్వేకం త్రిగుణం నోవస్తు త్రితయం ||

12. శక్తేరంబ పరే శక్తస్యాపి భిదా |
    జ్వాలా పావకవద్భాషా భేదకృతా ||

13. సర్వం దృశ్య మిదం భుంజానే పరమే |
    పుం నామ స్తుతయో యుజ్యంతే ఖలు తే ||

14. కుర్వాణే౽మ్బ సత స్సంతోషం సతతం |
    స్త్రీనామ స్తుతయ శ్శోభాం తే దధతే ||

15. సద్బ్రహ్మ బ్రువతే విద్వాంసో విగుణం |
    త్వం మాత స్సగుణం బ్రహ్మా౽సి ప్రథితే ||

16. శబ్దాద్యై ర్వియుతం సద్బ్రహ్మా౽మలినం|
    శబ్దాద్యై స్సహితా త్వం దేవ్యార్యహితా ||

17. సాక్షి బ్రహ్మ పరం త్వం మాతః కురుషే |
    సర్వేషాం జగతాం కార్యం సర్వ విధం ||


10. ఓ తల్లీ ! నీవు కశ్యపబ్రహ్మ కదితివైతివి, రుద్రునకు శివవైతివి, యింద్రునకు శచివైతివి. నీవే శక్తివై యుంటివి.

(పురుషలక్షణమునుగూడ భరించు శక్తివైతివని భావము.)


11. ప్రాణమని, ప్రణవమని, ఆకాశగత తేజస్సని త్రిగుణములతో నున్న దొకే వస్తువు, వస్తువులు మూడుగా లేవు.


12. ఓ యంబా ! శక్తిక్తి, శక్తునకు భేదము జ్వాలకు, అగ్నికి గల భేదమువంటిది. మాటయే భేదమును గలిగించుచున్నది.

(వస్తుతః లేదని భావము.)


13. కనబడు సర్వము భుజించు నో దేవీ ! పురుషనామ స్తోత్రములు నీకు యుక్తమే కదా. (అయినను,)


14. ఓ యంబా ! సద్రూపబ్రహ్మకు సంతోషమునిచ్చునట్టి నీకు స్త్రీనామ స్తోత్రములు మాత్రము శోభనిచ్చు చున్నవి.


15. తల్లీ ! విద్వాంసులు గుణములేని దానిని సద్బ్రహ్మగా చెప్పుచున్నారు. నీవు సగుణ బ్రహ్మ వైతివి. (8 వ శ్లోకముచూడుడు)


16. ఓ దేవీ ! శబ్దాదులతో గూడక యున్నది నిర్మల బ్రహ్మమగును. శబ్దాదులతో గూడిన నీ వార్యులకు హితకారిణి నగుచుంటివి.

(స్తుతింప వీలగు రూప మిదియే)


17. ఓ తల్లీ ! పరబ్రహ్మము సాక్షిగా నుండును. నీవు సకల జగత్తులయొక్క సర్వవిధకార్యములను జేయుదువు.


18. ద్యౌర్మాతా జగతో ద్యౌ రేవాస్య పితా |
    దృశ్యం విశ్వ మిదం వ్యాప్తం భాతి దివా ||

19. ఆకాశా ద్రజసో ద్యౌరన్యా విరజాః |
    ఆకాశే౽స్తి పున స్తత్పా రేచ పరా ||
20. తాం లోకస్య మహా రంగే వ్యోమతనుం |
    పారే శుద్ధ తమాం విద్మస్త్వాం పరమే ||
21. త్వాం పూర్ణామదితిం శక్తిం దేవి శచీం |
    నిత్యం శబ్దవతీం గౌరీం ప్రబ్రువతే ||


18. జగత్తున కాకాశమే తల్లి, ఆకాశమే తండ్రి. దృష్టిగోచరమగు సర్వము ఆకాశముచే వ్యాప్తమై ప్రకాశించుచున్నది.


19. ధూళిరూపమైన ఆకాశముకంటె ధూళిరహితాకాశము వేఱుగా గలదు. దాని కన్యమైన దింకొకటి యున్నది. ఈ మూడింటి కంత్యమందు పరాకాశము గలదు.

(పరాకాశము నిర్గుణము. అదియే గుణత్రయమును బొంది మూడు స్థితులుగా వ్యాపించెను. 11 వ శ్లోకము చూడుడు. వీనినే భూర్భువస్సువర్లోకము లనిరి. అంత్యమున కేవల మహిమమే పరాకాశమగును. సచ్చిదానంద త్రిరూపాత్మక వస్తువీ విధముగా మహిమచే రూపత్రయలక్షణమై జ్యోతిరాకృతిగా ప్రకాశించినట్లు భావించవలెను.)


20. దేవీ ! లోకములనెడి మహారంగమందా వ్యోమతనువును, దాని యంత్యమందు శుద్ధతమమైన నిన్నును తెలిసికొనుచున్నాము.

(ఆమె పరాకాశ స్వరూపిణియైనను స్థూల - సూక్ష్మ - కారణ శరీరములు గల తనువును మనము పొందినట్లే త్రైవిధ్యమును బొందిన ఆకాశతనువుచే పొంది, యంతటను వ్యాపించెను. ఆ రూపమును ధ్యానించువా రందలి పరదేవతాతత్త్వమును తెలియుదురు.)


21. ఓ దేవీ ! పూర్ణమైన నిన్నదితిగాను, శక్తిగాను, శచిగాను, ప్రణవముగాను, గౌరీదేవిగాను వచించుచున్నారు.


22. పుం నామా భవతు స్త్రీనామా౽స్త్వథవా |
    వ్యక్తి ర్వ్యోమ తను ర్లోకం పాత్యఖిలం ||

23. నాకే సా కిల భా త్యైంద్రీ రాజ్యరమా |
    బిభ్రాణా లలితం స్త్రీరూపం పరమా ||

24. శక్తాం దేవి విధే హ్యార్తానా మవనే |
    ఇంద్రస్యేవ భుజాం వాసిష్ఠస్య మతిం ||

25. పూజా శక్రతరు ణ్యేతై స్సిద్ధ్యతు తే |
    గాతౄణాం వరదే గాయత్రై ర్ముకుళైః ||

_________

4. వసుమతీ స్తబకము

1. మోహం పరిహర న్యోగం వితనుతాం |
   దేవేంద్ర దయితా హాసో మమహృది ||

2. ఆభాతు కరుణా సా భారత భువి |
   సుత్రామ సుదృశో యద్వన్నిజ దివి ||

3. వందారు జనతా మందార లతికాం |
   వందే హరిహయ ప్రాణప్రియతమాం ||

4. శోకస్య దమనీం లోకస్య జననీం |
   గాయామి లలితాం శక్రస్య దయితాం ||


22. పురుష నామ మగుగాక, స్త్రీ నామ మగుగాక. వ్యోమతను వ్యక్తియే నిఖిలమును రక్షించుచున్నది.


23. ఆమె లలితమైన స్త్రీరూపమును ధరించి యుత్తమ రాజ్యలక్ష్మి గాను, ఇంద్రాణిగను స్వర్గమున భాసించుచున్నది.


24. ఓ దేవీ ! ఆర్తినొందినవారిని రక్షించుట కింద్రుని భుజమున కెట్లు సామర్ధ్యమిచ్చితివో, వాసిష్ఠుని మతి కట్లే శక్తినీయుమా.

(భారతీయుల ఆర్తిని దొలగించుటకు)


25. నిన్ను గానముచేయువారికి వరములిచ్చు వో యింద్రతరుణీ ! ఈ గాయత్రీ ఛందస్సంబంధ ముకుళ (వృత్త)ములచే నీ కొనర్చు పూజ సిద్ధించుగాక.

__________


1. మోహమును పరిహరించు ఇంద్రాణీహాసము నా హృదయ మందు యోగమును జేయుగాక.


2. ఇంద్రాణి తన (నిజ)లోకమం దెట్టి కరుణ జూపునో (స్వర్గమందు). అట్టి కరుణనే భారత భూమియందామె చూపుగాక.


3. నమస్కరించువారికి గోర్కెలనిచ్చుచున్న దేవేంద్ర ప్రాణసఖిని నేను కొలుచుచున్నాను.


4. దుఃఖములను శమింప జేయునది, లోకమాతయు, ఇంద్రుని భార్యయు నగు సుందరిని నేను స్తుతింతును.


5. రమ్యా సుమనసాం భూపస్య మహిషీ |
   సౌమ్యా జనిమతాం మాతా విజయతే ||

6. వీర్యస్యచ ధియ స్త్రైలోక్య భరణే |
   దాత్రీ మఘవతే దేవీ విజయతే ||

7. వ్యాప్తా జగదిదం గుప్తా హృది నృణాం |
   ఆప్తా సుకృతినాం దైవం మమ శచీ ||

8. ఖేశక్తి రతులా పారే చిదమలా |
   స్వశ్చారు మహిళా దైవం మమశచీ ||

9. శస్త్రం మఘవతో వస్త్రం త్రిజగతః |
   శాస్త్ర స్తుతగుణా దైవం మమశచీ ||

10. యుక్తస్య భజత శ్శర్మాంత రతులం |
    వర్మాపిచ బహి ర్దైవం మమ శచీ ||

11. వీర్యం బలవతాం బుద్ధి ర్మతిమతాం |
    తేజో ద్యుతిమతాం దైవం మమ శచీ ||

12. ఏకైవ జనయ న్త్యేకైవ దధతీ |
    ఏకైవ లయకృ ద్దైవం మమ శచీ ||


5. రమ్యయు, దేవేంద్రుని పట్టపుదేవియైనది. దేహధారులకు సౌమ్యమైనది యగు మాత ప్రకాశించుచున్నది.


6. త్రిలోకములను భరించుట కింద్రునకు బుద్ధిని, బలమును ఇచ్చు దేవి ప్రకాశించుగాక.


7. ఈ జగత్తునందు వ్యాపించియున్నది, మానవ హృదయము లందు గుప్తమై యున్నది, పుణ్యాత్ముల కాప్తురాలైనదియగు శచీదేవి నా యొక్క దైవము.


8. ఆకాశమందు నిరుపమానశక్తిగా నున్నది, ఆకాశమున కావల నిర్మలచిత్తుగా నున్నది, స్వర్గమందు సుందరస్త్రీగా నున్నది యగు శచీదేవి నా యొక్క దైవము.


9. ఇంద్రునకు శస్త్రము, ముల్లోకములకు వస్త్రము (ఆకాశమే వస్త్రము) అగుచు, శాస్త్రములచే సుతింపబడు గుణములుగల శచీదేవి నా యొక్క దైవము.


10. యోగయుక్తుడై భజించువాని యాంతర్యమున నిరుపమాన సుఖము నిచ్చుచు, బాహ్యమున కవచమై రక్షించు శచీదేవి నా యొక్క దైవము (ఇంద్రాణీ విద్యాఫలమిది)


11. బలవంతులందు వీర్యరూపముగను, మతిమంతులందు బుద్ధి రూపముగను, కాంతిమంతులందు తేజోరూపముగను నున్న శచీదేవి నా దైవము.


12. తానొక్కతెయే సృష్టిచేయుచు, తానే ధరించుచు (స్థితి), తానే లయ మొనర్చు శచీదేవి నా దైవము.


13. శక్తీ రవితధాః క్షేత్రేషు దధతీ |
    బీజేషుచ పరా దైవం మమ శచీ ||

14. చిన్వన్త్యపి పచం త్యేకా పశు గణం |
    ఖాదంత్యపి భవే దైవం మమశచీ ||

15. దృష్టౌ ధృత చితి ర్దృశ్యే తతగుణా |
    విశ్వాత్మ మహిషీ దైవం మమశచీ ||

16. రాకా శశిముఖీ రాజీవ నయనా |
    స్వః కాపి లలనా దైవం మమ శచీ ||

17. స్థాణావపి చరే సర్వత్ర వితతా |
    సాక్షాద్భవతు మే స్వర్నాధ దయితా ||

18. యన్మాతరనృతం జుష్టంచ గదితం |
    ధ్యాతంచ హరమే తద్దేవి దురితం ||

19. మాం మోచయ ఋణా దింద్రాణి సుభుజే |
    మా మల్పమతయో మానిందిషు రజే ||

20. శత్రుశ్చ శచిమే సఖ్యాయ యతతాం |
    దృప్తశ్చ మనుజో మామంబ భజతాం ||

21. కష్టం శచి విధూ యేష్టం విదధతీ |
    ఆనందయ జనం ప్రేయాం స మిహమే ||


13. క్షేత్రములందు, బీజములందుగూడ వ్యర్ధముగాని శక్తులను ధరించు పరా దేవియైన శచి నాదైవము.


14. ఒక్కతెయైనను జీవరాసులందు వెతకుట, పచనమొనర్చుట, నాశనమొనర్చుట యను సంసారత్రయముగా నున్న శచీదేవి నాదైవము.


15. దృష్టియందు ధరింపబడు చిత్స్వరూపిణి, దృశ్యములందు గోచరించు గుణరూపిణి యగు దేవేంద్ర భార్యయైన శచి నా దైవము.


16. పూర్ణ చంద్రునివంటి ముఖము, పద్మముల బోలు నేత్రములు గలిగి స్వర్గమందుండు నొకానొక స్త్రీ యైన శచి నా దైవము.


17. స్థాణువులందు, చరవస్తువులందు సర్వత్ర వ్యాపించుఇంద్రాణి నాకు ప్రత్యక్ష మగుగాక.


18. ఓ తల్లీ ! యే యనృతము (నాచే) పొందబడెనో, పలుకబడెనో, ధ్యానించబడెనో, ఆ నా పాపమును హరింపుము.


19. ఓ యింద్రాణీ ! ఋణమునుండి నన్ను విముక్తుని గావింపుము. అల్పబుద్ధులు నన్ను నిందించకుందురుగాక.


20. ఓ యంబా ! శత్రువైన వాడు నా సఖ్యమునకు యత్నించుగాక, గర్వితుడు నన్ను సేవించుగాక.


21. ఓ శచీ ! కష్టములను తొలగించి, యిష్టముల నిచ్చు దానవై నా కిచ్చటగల ప్రియజనులను సంతోషబరచుము.


22. అస్త్రం మమ భవ ధ్వంసాయ రటతాం |
    సుత్రామ తరుణి శ్రీమాతర సతాం ||

23. సంపూరయతు మే సర్వం సురనుతా |
    స్వర్గక్షితి పతే శ్శుద్ధాంత వనితా ||

24. సంవర్ధయ శచి స్వందేశ మవితుం |
    బాహోరివ హరే ర్బుద్ధేర్మమ బలం ||

25. ఏతైర్వసుమతీ వృత్తైర్నవ సుమైః |
    భూయాచ్చరణయోః పూజాజనని తే ||
 


_________ప్రథమం గాయత్రం శతకమ్ సంపూర్ణమ్.


22. ఓ తల్లీ ! అరచుచున్న దుర్మార్గుల వినాశముకొఱకు నా కస్త్ర మగుము.


23. దేవతలచే నుతింపబడు యింద్రాణి నా కోర్కెలనన్నిటిని సంపూర్ణ మొనర్చుగాక.


24. ఓ శచీ ! స్వకీయమైన దేశమును (స్వర్గమును) రక్షించుకొనుట కింద్రుని భుజములకు బలమిచ్చినట్లు, నా బుద్ధిబలమును వృద్ధిజేయుము.


25. ఓ తల్లీ ! ఈ వసుమతీ వృత్తములనెడి నూత్న కుసుమములచే నీ పాదములకు పూజయగుగాక.


___________