ఇంద్రాణీ సప్తశతీ/గాయత్రం/శశివదనా స్తబకము

1. శశివదనా స్తబకము


            1. హరిలలనే మే పథి తిమిరాణి |
               హర దరహాస ద్యుతిభి రిమాని ||

            2. అగతి మవీర్యా మపగత ధైర్యాం |
               అవతు శచీమే జనిభువ మార్యాం ||

            3. శ్రుణు కరుణావ త్యలఘుమఖ ర్వే |
               స్తవ మహమార్య స్తవ శచి కుర్వే ||

            4. త్రిజగ దతీతో విలసతి నిత్యః |
               అణు రణుతో, యో భగవతి సత్యః ||

            5. త్వ మఖిల కార్యే ష్వయి ధృత శక్తిః |
               ఉరుగతి రస్య ప్రభుతమ శక్తిః ||

            6. విదురిమ మేకే జగతి మహేంద్రం |
               జగురయి కేచి జ్జనని మహేశం ||

            7. అవగత వేదో వదతి మహేంద్రం |
               పరిచిత తంత్రో భణతి మహేశం ||

            8. జనని శచీ త్వం ప్రథమ దళస్య |
               భగవతి దుర్గా స్యపర దళస్య ||


1. ఓ ఇంద్రాణీ ! నా మార్గమందున్న యీ చీకట్లను నీ మందహాస కాంతులచే తొలగింపుము.

2. గతి చెడి, వీర్యము గోల్పోయి, అధైర్యముజెందిన నా పవిత్ర జన్మభూమిని శచీదేవి రక్షించుగాక.

3. ఓ శచీ ! ఆర్యుడనగు నేను శ్రేష్ఠమైన నీ స్తవము జేయు చుంటిని. వినుము.

4. ఓ భగవతీ ! సత్యస్వరూపుడైన యెవడణువుకంటె నణువగుచుండెనో, త్రిజగదతీతుడగు నాతడు నిత్యము ప్రకాశించు చుండెను.

5. ఓ దేవీ ! సర్వ కార్యములందు ధరించబడు శక్తి గలిగి, త్వరిత గతి గలదానవై నీవీ ప్రభునకు మిగుల సమర్ధమైన శక్తివి.

6. ఓ తల్లీ ! జగత్తునందు కొందఱీ పురుషుని మహేంద్రుడని తెలియుచున్నారు, మఱికొందఱు మహేశ్వరుడని గానము చేయుచున్నారు.

7. వేద విదులు మహేంద్రుడందురు, తంత్రశాస్త్ర పరిచితులు మహేశ్వరుడందురు.

8. ఓ తల్లీ ! నీవు మొదట చెప్పబడినవారికి శచీదేవి వగుచుంటివి, రెండవవారికి దుర్గవగుచుంటివి.


            9. న శచి శివాత స్త్వ మితర దైవం |
               బహు ముని వాణీ సమరస తైవం ||

           10. దివిచ సితాద్రౌ శచి వపుషోర్వాం |
               పృథ గుపలంభా దయి భిదయోక్తిః ||


           11. తనుయుగ మూలం వపురతి మాయం |
               కరచరణాద్యై ర్వియుత మమేయం ||


           12. త్వముదరవర్తి త్రిభువన జీవా |
               భవసి శచీ సా జనని శివా వా ||

           13. విభు శుచికీలా తతిరయి ధూమం |
               త్వ మమర మార్గం బత వమసీమం ||


9. ఓ శచీదేవీ ! నీ వందువలన శివవే కాని యితరదైవమవు కావు. ఇట్లనుట బహుమునుల వాణి ననుసరించి యుండును.


10. ఓ, శచీ ! స్వర్గ, కైలాసములందు మీరు (శచీ, దుర్గలు) వేఱ్వేరు శరీరములను ధరించుటవలన మీకు భేద మూహింప బడుచున్నది.

(స్వర్గమనగా నాకము = న + అకము = దుఃఖములేనిది యైనను కైలాసము మోక్షస్థానముగా నెంచబడుచున్నది. సుషుప్తికి సమాధికి గల సంబంధమువంటిదని పౌరాణిక భావము. కాని యివి యొకే లోకమునకు వైదిక తాంత్రిక పరిభాషలందున్న పేళ్ల భేదము. తేజస్సునుబట్టి యొకరు, శబ్దమునుబట్టి యొకరు కల్పించిరి.)


11. మాయకతీతమైనది, కరచరణాది విహీనమైనది. యమేయమైనది యైన శరీరము పై రెండుశరీరములకు మూలమైయుండెను. (ఈ రెండు శరీరములు ఆకాశ సంబంధములు, వీనికి మూలమైనది సచ్చిదానంద స్వరూపము. సృష్టికొఱకాకాశ శరీరము ధరింపబడుట శ్రుతిప్రసిద్ధము. దీనినే సగుణ బ్రహ్మలక్షణ మందురు.)


12. ఓ తల్లీ ! ఉదరమందిమిడించుకొనిన త్రిభువనములకు నీవు జీవమువై శచివైతివి. ఆ నీవే దుర్గగా కూడ నుంటివి.


13. దేవీ ! శుద్ధాగ్నియైన విభునియొక్క కిరణ సమూహమవై నీవు దేవయానమను ధూమమును గ్రక్కితివి. ఆశ్చర్యము.


(విభుడు మూలమందు సచ్చిదానందస్వరూపుడైనను సృష్టికొఱకు వ్యాపకత్వధర్మమును జెంది విభుడనబడెను. విభుడనగా వ్యాపకుడు. వ్యాపకత్వధర్మ మతని మహిమ.


             14. జయసి నభస్తో జనని వరస్తాత్ |
                 నభసిచ భాంతీ భవసి పురస్తాత్ ||


             15. త్వ మతనురంబ జ్వలసి పరస్తాత్ |
                 ఇహ ఖ శరీరా లససి పురస్తాత్ ||

ఆ మహిమ మతనియందుద్గారలీనములను జెందుచు సృష్టిప్రళయములకు కారణమగుచుండును. ఉద్గార మనెడి వికాసమును బొందినప్పు డచలమైన స్వరూపవస్తువు మహిమావంతమై తన యుపరిభాగములందు వ్యాపకత్వలక్షణముచే సూక్ష్మధూమసదృశమైన రజస్సగుచు, మహిమ యొక్క విజృంభణమువలన అగ్నినుండి క్రక్కబడు సూక్ష్మదూమమువలె విభునిస్వరూపము నుండి యది క్రక్కబడుచున్నది. ఈవిదముగా ఆనందస్వరూపవస్తువు తనకుతానే తనమహిమచే విషయలక్షణముగా వ్యాపించి ఆకాశనామమును బొందెనుగావున ఆకాశమానందము కాకపోదను నర్థముగల శ్రుతివాక్కు (యదేష ఆకాశ ఆనందో నస్యాత్) వ్యాఖ్యానమగును. ఈ యాకాశము సూక్ష్మమైనను దానిని వ్యాపింపజేయు మహిమ దానికంటెను సూక్ష్మమై దానికంతరమున నున్నట్లు మఱువరాదు. అంతరమున కేవలమైయున్న మహిమకు శుద్దత్వదశ చెప్పబడును : ఆకాశముతోగూడి వ్యాపించునప్పుడు విషయత్వదశ చెప్పబడును : ఈ రెండుదశలకు నడుమ నెక్కడ ఆకాశమును బొందుచు విడుచుచు నున్నటు లుండునో అ సంధి సంధానప్రాంతమందు మహిమ జ్వలించు చున్నందున దానికక్కడ తేజస్త్వదశ చెప్పబడును. ఈ విధముగా శుద్ధత్వ తేజస్త్వ విషయత్వదశలచే జ్వాలారూపమున వ్యాపించిన మహిమ కాశ్రయుడైన విభుడు శుద్ధాగ్నితోడను, విషయలక్షణముగా వ్యాపించిన సూక్ష్మ రజోభూతాకాశము ధూమముతోడను పోల్చబడెను. రెండింటికి నడుమ నున్న తేజస్త్వసంధిభాగము విషయమును వేఱుచేయుచు ఆనందస్వరూపముతో సంధానమొనర్చు చున్నందున దుఃఖములేని ప్రాంతముగా నెంచబడి నాక మనబడెను. (నాకము = న + అకము = దుఃఖములేనిది). ఇది కాంతులకు మార్గమైనందున ముక్తికి మార్గమగు దేవయాన మనియు పిలువబడుచున్నది (దిప్ = కాంతి). ఇది రజోమయాకాశమనెడి ధూమమున కంతరముననుండి దాని సంబంధముచే దేవయానధూమ మనబడెను. అట్లే ఆకాశపరముగా పరమాకాశమనియు పిలువబడుచున్నది. దీని నధిష్ఠించినది సచ్చిదానందస్వరూపమైనను, అధిష్ఠాన లక్షణమువలన కవులా స్వరూపమును శక్తిపురుషులుగా విభజించి పల్కిరి. ఆ శక్తి పురుషులే ఇంద్రాణీ యింద్రులని గ్రహించవలెను.)


14. ఓ తల్లీ ! నీవాకాశమునకావల (అనగా పరమాకాశము లేదా కేవల మహిమగా) ప్రకాశించుచు, నాకాశమందును దాని కీవలను (అనగా గోళాకృతులుగా రూపొందిన విశ్వమందును) గూడ నుంటివి.


15. ఓ తల్లీ ! ఆవల నీవశరీరవై జ్వలించుచు, ఆకాశమందును దాని కీవలనున్న గోళ ప్రపంచమందును గూడ ఆకాశ శరీరిణివై ప్రకాశించు చుంటివి.


               16. జనని పరస్తా న్మతిరసి భర్తుః |
                   అసి ఖ శరీరా పృథగవగంత్రీ ||

               17. సువిమల రూపం భగవతి శాంతం |
                   న భవతి శూన్యం తదిద మనంతం ||

               18. దివి దధతీంద్రే పురుషశరీరం |
                   జనని పురంధ్రీ తనురభవస్త్వం ||

               19. దృశి విలసంతం ప్రభు ముపయాంతీ |
                   భవసి విరాట్ త్వం నృతనుషు భాంతీ ||

               20. తవ గుణగానం జనని విధాతుం |
                   భవతి పటుః కో వియదివ మాతుం ||

               21. భగవతి తృప్తి ర్భవతు న వా తే |
                   అభిలషి తాప్తి ర్భవతు న వా మే ||

               22. భజతి తవాంఘ్రిం మమఖలు భాషా |
                   పతి మనురాగా త్ప్రియమివ యోషా ||


               23. అఘ మపహర్తుం శుభమపి కర్తుం |
                   అల మజరే తే గుణగణ గానం ||

               24. అవసి జగత్త్వం కులిశి భుజస్థా |
                   అవ మునిభూమిం గణపతి ధీస్థా ||


16. ఓ తల్లీ ! నీ వావల భర్తకు మతివై యుంటివి. ఆకాశ శరీరిణివై నీవు ప్రత్యేక చలన శక్తిగానుంటివి.


17. ఓ తల్లీ ! నీ నిర్మల స్వరూపము శాంతమైనను, శూన్యము మాత్రము కాదు. ఇచ్చటి (ఆకాశ) రూప మనంతమైయున్నది.


18. ఓ తల్లీ ! నీ వాకాశములో నింద్రునియందు పురుష శరీరమును ధరించి, నీవు స్త్రీ శరీరిణివైతివి.


19. ఓ తల్లీ ! దృక్కులలో విలసించు ప్రభువుతో గలసి నీవు మానవులందు బ్రకాశించుచు 'విరాట్‌' వైతివి.


20. ఓ తల్లీ ! ఆకాశమును కొలత జేయుట శక్యము గానట్లే నీ గుణగానము చేయుట యెవరికిని శక్యముకాదు.


21. ఓ భగవతీ ! నీకు దృప్తియగుగాక, కాకపోవుగాక, నాకోర్కె సిద్ధించుగాక, మానుగాక ;


22. ప్రియ భర్తననురాగముతో భార్య విడువనట్లు, నా భాష నీ పాదమును విడువక భజించును గదా.

(పాదమనగా అంశయగు నాకాశ రూపమునకును అన్వయించును. ఆకాశము శబ్ద గుణము కలది గావున భాషచే భజింప బడునట్టిదగును.)


23. దేవీ ! నీ గుణ గణగానము పాపములను నశింప జేయుటకును శుభముల నిచ్చుటకును సమర్ధమైనది.


24. ఓ తల్లీ ! ఇంద్రుని భుజములందుండి (భుజశక్తిగా) నీవు జగత్తులను రక్షించు చుంటివి. గణపతి బుద్ధియందట్లే నీ వుండి భారత భూమిని రక్షింపుమా.


             25. శశివదనాభి ర్గణపతిజాభిః |
                 శశివదనాద్యా పరిచరితా౽స్తు ||


2. తనుమధ్యా స్తబకము


              1. ధ్వాంతం పరిహర్తుం తేజాంస్యపి భర్తుం |
                 అంతర్మమ భూయా త్స్మేరేంద్ర పురంధ్రీ ||

              2. భీతా మరిధూతా మార్యావని మేతాం |
                 సమ్రాజ్ఞి బుధానాం దూనా మవ దీనాం ||

              3. ఇంద్రస్యసహాయాం విశ్వస్య విధానే |
                 ఆకాశ శరీరా మంబాం ప్రణమామః ||

              4. కర్తుర్భువనానాం మాయాసి శచి త్వం |
                 సత్యస్య తపో౽సి జ్ఞస్యాసి మనీషా ||

              5. ఆజ్ఞా౽సి వినేతు స్తేజో౽సి విభాతః |
                 నిర్యత్న సమాధే రానంద రసో౽సి ||

              6. తస్య త్వమనన్యా౽ ప్యన్యేవ ఖకాయా |
                 అత్యద్భుతమాయా జాయా౽సి సహాయా ||

              7. ఆకాశ శరీరాం జాయామశరీరః |
                 ఆలింగ్య విభుస్త్వాం నందత్యయి చిత్రం ||