ఆ భా 7 5 181 to 7 5 210
--రానారె 13:12, 15 ఆగస్ట్ 2006 (UTC)
7_5_181 వ.
అతండును గోపాటోపంబున.
7_5_182 క.
కరులకరంబులు హయంబుల
శిరములు రథసంచయంబు చెక్కలును సమి
ద్ధరఁ గప్పి క్రమ్మఱఁగ నె
త్తుటేరులు వఱపి వానిఁ దొలఁగం ద్రోచెన్.
7_5_183 క.
శినివరునద్భుతవిక్రమ
మునకోర్వక కలఁగఁబడిన మొనఁ గనుఁగొని నీ
తనయుఁడు దనయరదము నా
తనియరదముమీఁద నత్యుదగ్రతఁ బఱపెన్.
7_5_184 వ.
నయ్యిరువురు నక్కజంబగు కయ్యంబు సేయునెడనాశైనేయుండు.
7_5_185 క.
తురగముల సూతుఁ జంపినఁ
గురుపతి పొలివోక యతని గురుసున నేయం
గర మలిగి ధనువు దునుముడు
బరవస మఱి యొరుని తేరుపైకిం బోయెన్.
7_5_186 వ.
ఇవ్విధంబున.
7_5_187 తే.
పతిగలంగ శైనేయుఁడబ్బలము బాణ
నిహఁతిం దూలించె నక్కడ నీమఱంది
యడరి యర్జునుతో విస్మయావహముగ
నావాహము సేసెఁ దగుసహాయంబు కలిమి.
7_5_188 చ.
అతనిసుతుం డులూకుఁడు నుదగ్రతఁ గృష్ణునిమేనఁ బార్థుపై
శితశరకోటి నించి విలసిల్లఁగ సౌబలుసూతుఁ జంపి యు
ద్ధతిఁ దురగంబులం దునిమి తద్ఘనచాపము ద్రుంచె నన్నరుం
డతఁడు దనూజుతేరిపయికాత్మ చలింపఁగఁ బోయి వెండియున్.
7_5_189 తే.
వాఁడుఁ దోడ్పడఁ గడగిఁ నివ్వచ్చు నేసె
నతఁడు వారలు సేడ్పడునట్లు గాఁగ
గడఁక గలయోధవీరులు బడలు వడఁగ
బలము సెడి పాఱఁ దన వింటిబలువు సూపె.
7_5_190 వ.
ఇట్లు నివ్వచ్చుండు పేర్చినయాసమయంబున ధృష్టద్యుమ్నుండు.
7_5_191 క.
తఱిమి గురువింటిగొనయం
బఱిముఱిఁ దునియంగ నేయ నతఁ డాతని నే
డ్తెఱ నొండువింట నేసిన
నుఱక తునిమె నాతఁ డమ్మహోగ్రశరంబుల్.
7_5_192 వ.
వెండియు నాచార్యుం డేయుసాయకంబులు ద్రుంచుచు నంగంబులు
నొంచుచు మిగిలి మార్గణజాలంబుల సైన్యంబు బైన్యంబు నొందించె
నట్లు సాత్యకిసవ్యశాచిధ్రుష్టద్యుమ్నులచేతం గలయం గలంగి కౌరవానీ
కంబు గాందిశీకంబగుటయుఁ బాంచజన్యదేవదత్తాదిశంఖరవంబులు సెలగం
బాండవబలంబులు గూడికొని వెన్నండిం గవిసినం గని భీషణరోషాతిరేక
విధేయుం డయి రాధేయుండు.
7_5_193 మ.
తలలుం జేతులుఁ గాళ్ళునుం దనువులున్ ధాత్రీస్థలిం బెక్కుతి
ట్టలు గావించి రథప్రతానములు ఘోటశ్రేణులున్ వారణా
వలులుం జేడ్పడ పైపయిం దఱిమి దుర్వార్తైకదర్పోద్ధతిం
జలముం జేవయుఁ జూపి నుద్భటభుజాసంరంభరౌద్రంబుగన్.
7_5_194 వ.
ఇవ్విధంబున విజృంభించి నొంచినం బఱిపఱి యై పఱచునవ్వాహినుల వెను
కొను నాసూతనందనుం జూచి తలంకి ధర్మ తనయుం డర్జునునితో నిట్లనియె.
7_5_195 క.
నడురేయి తీవ్రభానుఁడు
పుడమి వెలసెనను తలంపు పుట్టించుచు ను
గ్గడు వగు తేజంబున వెలిఁ
గెడుఁ గర్ణుఁడు బాణరుచులు గిఱికొన దెసలన్.
7_5_196 ఆ.
ఇట్లు దఱిమెనేని యిప్పుడ యీతఁ డి
దిక్కువారి నెల్ల నొక్కయెత్తు
గాఁగ బిలుకుమార్చుఁ గావున నెమ్మెయి
నైనఁ బ్రతివిధాన మాచరింపు.
7_5_197 వ.
అనిన విని యతం డచ్యుతునాలోకించి రాధేయురభసంబున కిమ్మోహరం
బోహటించిన భూపతి భీతున్ డయ్యె భారద్వాజుండును బై కొని యొక్క
వలన మొనలఁ దెరల్చెడి నే నదల్చి యిక్కర్ణు నుక్కడించి యక్కుంభసంభ
వుసంరంభంబు వారించెదఁ దేరు నడుపు మనుటయు నద్దనుజమర్దనుం డతని కి
ట్లనియె.
7_5_198 క.
వినుము నిశాసనుయంబున
దనుజులకుం బేర్చు బాహుదర్పము శౌర్యం
బును గావున హైడింబుం
డనిఁ గర్ణుని నోర్చుఁ బనుత మతని నతనికిన్.
7_5_199 వ.
అని వెండియు.
7_5_200 క.
మన మంతకు వేఱొకది
క్కున నడతము భీమసుతునకును మాయలుఁ బెం
పొనరినదివ్యాస్త్రంబులు
ననేకములు గలవు వలవ దనుమానింపన్.
7_5_201 వ.
అని చెప్పి ఘటోత్కచుం బిలిచిన నతండు సన్నాహసమ్రంభమూర్తిస్ఫూర్తి
మెఱయం జనుదెంచి పని యేమి యనుటయు.
7_5_202 ఉ.
పాండవసైన్యముల్ సెదరి పాఱెడుఁ గర్ణుని చేత నొచ్చి యు
ద్దండత నీదుశౌర్యమును దర్పము నేర్పడ నిల్వరింపు మీ
తం డని రాత్రి నీకుఁ గడుఁ దక్కున దండ్రులకున్ జయంబు పు
త్రుం డొసఁగంగఁ గాన్పు మహి రూఢికి నెక్కదె గెల్వు మీతనిన్.
7_5_203 వ.
అనియె ధనంజయుండును దదనురూపంబు లైనయాలాపంబుల ననుమతి
సేసినం గడంగి ఘటోత్కచుండు గర్ణుదెసకు గవిసె నట్టియెడ జటాసుర
సుతుం డగునలంబుసుం డేతెంచి కురుపతిం గాంచి నాకు బాండవులదెసం
బూర్వవైరంబు గలదు నీకు బ్రియంబుగ వారిని వారివారిని వధియించెద
నని పలికి యతండు ప్రీతున్ డై యభినందింప నాసూతనందనుం గలసి తల
కడచి హిడింబానందనుం దాఁకిన దారుణరణంబయ్యె నయ్యిరువురును వివిధ
విశిఖస్ఫురణంబుల నొండొరులఁ దెరల్పం జాలక రథికు లగుట యుడిగి
మాయలకుం జొచ్చి మహోరగగరుడాకారంబులను హరణకంఠీరవ
రూపంబులను రవిసైంహికేయాకృతులను మేఘమారుతమూర్తులను
మఱియు బహువిధవికారాకారంబులను జూపుచుం బోరి యేపునం గదిసి
బాహాబాహిం బెనంగునపుడు మేనులు బెరసిన నాభీమనందనుండు.
7_5_204 క.
పట్టి బలువుగ జటాసురు
పట్టిం బడవైచి యురము పాదమున గడున్
బిట్టుగఁ ద్రొక్కి యతనితల
యట్టకుఁ బాయంగఁ జేసి యార్చెం బెలుచన్.
7_5_205 ఆ.
ఆర్చి నెత్తురుట్ట నమ్మస్తకము వట్టి
కొని యతన్ డుదాత్తఘోరభంగి
బ్రమరి వాఱి కురునృపాలకునరదంబు
నందు వైచి యిట్టులనియెనధిప.
7_5_206 క.
కొను మిదె నీమిత్రునితల
విను మిట్టుల మాఱులేని విక్రమమునఁ గ
ర్ణుని ద్రుంచెద వరుసం బొరి
గొనియెద విను భీమసేనుకొడుక నెఱుఁగవే.
7_5_207 వ.
అని పలికి యసురవరుం డరుణం బగుతనయరదం బెక్కి గృధ్రకేతనంబు
గ్రాల నీలోన్నతం బయినతనరూపంబున కనురూపం బైనదంష్ట్రాయుగళం
బును బింగళోద్బద్ధజటాకేశకలాపంబును భీషణంబులుగాఁ గనకభూషణం
బుల కతంబునఁ దటిల్లతావికటం బగునంబుదంబుకైవడిఁ గర్ణుపయిం గవిసి
ఘనశరంబులేయ నతండును జండభంగి నెదుర్కొని నిశితనారాచంబులఁ
గప్పె నిప్పరుసునం దలపడి యమ్మనుజదనుజులు మహాద్భుతకరం బగు
సంగరంబు సేయునెడ వివిధాయుధవ్యాపారఘోరవిచేష్టితవిగళితరక్తసి
క్తంబు లగునంగంబులయచలత్వంబున గైరికగిరిద్వయంబుచందంబున
నొప్పిర ట్లెక్కువతక్కువలు లేక పోరిపోరి రాధేయుండొక్కదివ్యాస్త్రంబు
ప్రయోగించిన నది భైమసేను ప్రత్యస్త్రంబున నడంచి మాయాసైన్యం బడ
రించిన నమ్మాయాసైన్యంబు సాయకశూలముద్గరాదిహేతివ్రాతంబులును
బలలవర్షంబులునుం గురియం గురువాహిని గలంగి పాఱిన నాసూతసూనుం
డొక్కరుండును నవష్తంభవిజృంభణంబు మెఱయ నిలిచి మహనీయాస్త్ర
బలంబున నమ్మాయ మాయించుటయు హైడింబుడు చక్రంబు వైచినం
జక్కడిచె గద నిగిడించిన మగిడించె గగనంబున కరిగి తరుపాషాణపటలం
బులు వరగించినం దునిమి ధరం దొరగించె మఱియు రథికత్వంబునం గడం
గిన నయ్యోధవరుండు తురగసారథిసహితంబుగా రథంబు శకలంబులు సేసి
యతనితను వేదు వెఱిగినతెఱంగుగా మెఱుంగుటమ్ములు గిఱిగొల్పినం
గెరలి యన్నిశాచరనాథుండు.
7_5_208 సీ.
మాయాముఖంబున మార్గణజాలంబు ద్రావఁ గర్ణుండది వ్రయ్య నేసి
చెలఁగినఁ గడుబెక్కుశిరములతోడి మహాకృతి గైకొన నదియుఁ దునుమ
జచ్చె వీఁ డని మనసైన్యంబు లుబ్బంగఁ బడియుండి వివిధరూపములుదాల్చి
భంగించె నవియును ద్రుంగఁగ నేసిన శైల మై తద్వజ్రసాయకమున
తే.
సమసి రథికుఁ డై తనచుట్టుఁ జాతురంగ
మైనబల మేచి తఱుమంగ నడరి దీప్త
భూరిశరముల నాసూతపుత్రునొంచి
యెక్కు డై త్రుంచె నతని విల్లక్కజముగ.
7_5_209 వ.
ఆసమయంబున బకునితోడంబుట్టు వగునలాయుధుం డనునసురేంద్రుండు
వడముడివలనివైరంబు పెద్దకాలం బేనియు మనం బెరియింపం దఱి వేచి
కొని యుండి యన్నిశాసంగ్రామంబునకు ససైన్యంబుగాఁ జనుదెంచి
దుర్యోధనుం గని తన్నెఱింగించుకొని యతనితో నిట్లనియె.
-: అలాయుధాసురుండు ఘటోత్కచునితో యుద్ధము సేసి చచ్చుట :-
7_5_210 క.
భీమునిఁ దత్సోదరులను
భూమీశ్వర యిపుడ పట్టి పొరివుచ్చెద ను
ద్దామత మ్రింగెదఁ గృష్ణుని
తో మిత్రగణంబుతో సుతులతోఁ గూడన్.