--ప్రకాశ్ స్వామినాథన్


7_4_301

వ. అది యర్ధచంద్రసాయకంబున నశ్వత్థామ త్రుంచె నంతం గాంచనభాసితం

బగుశరాసనంబు గొని రాధేయుండు రయంబునఁ దీవ్రశరంబులు వరగింప

నర్జునుండు నిలునిలు కర్ణ యర్జును నెఱుంగవే యనుచు ననేకచండకాండం

బులం గప్పినఁ గర్ణుండు నిలునిలు మర్జున కర్ణు నెఱంగవే యనుచు నతని

బహుపటుప్రదరంబులం బొదివె నట్లయ్యిరువురు నొండొరుల కదృశ్య

మూర్తులై సుర లగ్గింపం బోరుచుండం గౌరవపతి తనవారి నెలుంగెత్తి

కర్ణునకు దోడ్పడుం డని వనిచె నక్కొలందికిం గిరీటి గోపాటోపంబున.


7_4_302

మ. తురగవ్రాతముఁ గూల్చి సూతుతనువుం దున్మాడి విద్వేషి భీ

కరనారాచపరంపరానిహతి నంగం బార్తి నొందింప నా

తురుఁ డై కర్ణుఁడు దర్పహీనుఁ డగుడున్ ద్రోణాత్మజుం డెయ్ది యా

త్మరథస్థుండుగఁ జేసి యేసె విజయున్ మద్రేశుఁడుం దోడ్పడన్.


7_4_303

తే. కృపుఁడు వృషసేనుఁడును వారిగెడన కూడి

పార్థుతనువునఁ దూపులు వఱపి రట్లు

పొదువునలువురపిఱుఁదును బొంచి సింధు

వరుఁడు నిగిడించె నమ్ములు నరునిమీఁద.


7_4_304

క.గురుతనయప్రముఖరథిక

వరులభుజావిక్రమంబు వారించుచు ని

ర్భరరోషమునం బార్థుఁడు

శరంబు లఱిముఱి నిగిడ్చెసైంధవుమీఁదన్.


7_4_305

వ. ఆసమయంబున సుయోధనుండు సేనలకుం జేయి వీచిన నొక్కుమ్మడిం

గవ్వడిఁ గదిసి వివిధహేతివ్రాతంబులు మేన నించి నొంచినఁ గలంక లేక

కడంగి.


7_4_306

శా.గాండీవంబు గుణంబు ఘోరరవ మాకాశంబునం బర్వ వే

దండస్యందన ఘోటకంబులు మహాస్త్రక్రూరపాతంబుల

న్ఖండీభూతములున్ విదారితములు న్భగ్నంబులుం గా సము

ద్దండుండై యడరం గలంగి పఱచెం దత్యైన్యసంతానముల్.

7_4_307

వ.ఇట్లు ప్రచండమూర్తియై మధ్యందినమార్తాండుండునుం బోలె వెలింగి

వివ్వచ్చుండు వియచ్చరుల కచ్చెరు వందించె వెండియు దొరలందఱు

నొక్కటఁ దఱుమ నతం డదల్చి యమ్ములవెల్లిం దేల్చి తెరల్చి దీప్తబాణ

పాతపూర్వకంబుగా జయద్రథునకుం గవిసిన నమ్మహారథుండు.


7_4_308

క. పోవక హయకేతనగాం

డీవములం బార్థుమైఁ గడిందివడిన్ సై

న్యావళియు దేవతలు నా

నావిధములఁ బొగడ నాఁడె నారాచంబుల్.


7_4_309

క. విజయుం డతనివరాహ

ధ్వజమును సారథిశిరంబు ధర నొక్కట న

క్కజముగఁ బడ నేసిన నీ

ప్రజ తామరపాకునీటిభంగిం దలఁకెన్.


7_4_310

క. ప్రాణములు గలుగునంతకుఁ

ద్రాణపరాయణత నీదురథికోత్తము ల

క్షీణజవమునఁ బ్రసారిత

బాణు లగుచు నతని కడ్డపడిరి నరేంద్రా.


7_4_311

వ. ఇవ్విధంబునఁ గృపాశ్యత్థామశల్యవృషసేనులు దెంపు సేసి సైంధవున కడ్డం

బైనం జూచి యాసవ్యసాచి యతనిఁ దెగఁజూడ నెడ గానక యవుడు

గఱచుచుఁ బ్రొద్దుదిక్కు గనుంగొనినఁ గేశవుం డి ట్లనియె.


7_4_312

ఆ. చక్కఁ జలము పెనఁగఁ జన దింక నినుఁడు ప

శ్చిమధరాధరంబు సేర బోయె

దీని కొకయుపాయ మేను గల్పించెద

దానఁ జేసి కాని దాయ వడఁడు.


7_4_313

వ. అది యెయ్యది యంటేని.


7_4_314

క. ఇనమండలంబు మఱువడ

నొనరించెదఁ దమము పాండవోత్తమ యది గ్రుం

కినచందమైన సైంధవుఁ

డును గౌరవయోధులుం గడుం బ్రమదమునన్.


7_4_315

వ. ప్రతిజ్ఙాభంగం బయ్యె నని కయ్యంబు కడంక దక్కివిచ్చలవిడి నొండొరుల

మెచ్చుచుఁ బొంగి చెలంగుదు రప్పుడు నీపూన్కి దీర్చికొ మ్మని పలికినం

బరాక్రమంబు సవ్యాజం బయ్యె నని మనోవ్యథం జెందు సవ్యసాచిం గనుం

గొనుచు నమ్మాధవుండు మాయాతిమిరంబునఁ దిమిరవైరిం గప్పిన.


7_4_316

క. అది రవి గ్రుంకుటగాఁ గొని

మద మెసకం బెసఁగ నార్చి మనసైన్యంబుల్

వొదలెఁ దల యెత్తిహర్షా

స్పదమతి సింధుపతి యపుడు పడమర సూచెన్.


7_4_317

వ. తదవసరంబున.


7_4_318

ఆ. ఎలమిఁ దేరిమీఁద నిలుచుండి పడమ ర

ఱ్ఱెత్తి చూచుచున్న యిద్దురాత్ము

మస్తకంబు దునుము మసలక యని యర్జు

నునకుఁ జూపె సైంధవుని మురారి.


-: అర్జునుఁడు సైంధవుని తల దునుముట :-

7_4_319

క. అతఁడు గని గంధమాల్యా

ర్చితమైదొన మెఱయుచున్నశితశర ముగ్రో

ద్దతి నేయ డేగ పులుఁగును

గతిఁ గొనుక్రియ నది హరించె గ్రక్కున శిరమున్.


7_4_320

వ. అప్పుడు సత్వరుం డై.


7_4_321

ఆ. శౌరి పార్థపార్థసైంధవుతల యిలఁ

బడిన నొర్ప దది నభంబునంద

నిలువఁ జేయు మేను నీ కెఱంగించెద

నత్తెఱంగు దెలియ ననిన నతఁడు.


7_4_322

క. పటుశరముల మీఁదికి డా

పటికిన్ వలపటికి నపరభాగమునకు ముం

దటికిఁ జదల నడసె సము

త్కటరయమున శిరముఁ గందుకక్రీడగతిన్.


7_4_323

వ. అట్టియెడ.


7_4_324

క. మాయపుఁజీఁకటి విరయుడుఁ

దోయజమిత్త్రుండు మగుడఁ దోఁచెఁ బ్రజకుఁ గో

పాయత్తులై బలంబులఁ

జేయంగలవారు గడఁగి శితబాణములన్.


7_4_325

క. నరుఁ బొదివి రతఁడు వారల

యురవడి వివిధాస్త్రతతుల నుడుపుచు నింగిం

దిరుగ మును నడుపుచుండెడు

శిరమును నేమరక యుండెఁ జిత్రస్ఫురణన్.


7_4_326

వ. ఇట్లత్యాశ్చర్యకరణ పరిణతబాహువీర్యుండై విక్రమవిహారంబు సలుపు

చుండి.


7_4_327

ఆ. దనుజవైరి యెంతదడ వింక నిలుపంగ

వలయు సింధురాజుతల నభమున

నెచట వైచువాఁడ నేమిటి కివ్విధ

మూచరింపవలసె ననిన నతఁడు.


7_4_328

వ. వినుము వృద్థక్షత్త్రుం డనుసింధుదేశాధీశుఁడు సంతానకరతపోవిశేషంబున

నీజయద్రథుం బడసె నితండు కుమారుండై వర్తిల్లుసమయంబుననొక్కనాఁ

డశరీరవాణి వీఁడు సంగ్రామంబున నేమఱి తల దునుమం బడు నని యాదే

శించిన నతం డెల్లవారును విన వీనిమస్తకంబు మహింబడ నెవ్వఁ డేసె

వానిశిరంబు శకలశతం బయ్యెడు మని తనతపంబు బలిమిం బలికి యతనిఁ

బట్టంబు గట్టి వనంబునకు నియతుండై యరిగె నట్లు గావున.


7_4_329

క. ఈతల పుడిమిం బడనీ

కాతనితొడ మీఁద వైచునది యాపని వి

ఖ్యాతం బగుపాశుపతము

చేతన యగుఁ గాక యొంటఁ జెల్లునె మనకున్.


7_4_330

వ. ఆవృద్ధక్షత్త్రుండు శమంతపంచకసమీపంబున నుండునీవమ్మహనీ

యాస్త్రంబునాశ్రయింపుమనవుడు నర్జునుం డట్ల కాక యని భక్తియుక్తం

బుగా నియతమతిం దత్ప్రయోగం బాచరించిన నద్దివ్యసాధనంబు సాయక

పరంపరాకారం బయి యాశిరం బట గొని చని తదాశ్రమద్వారంబు

సొచ్చునప్పుడజ్జనపతి జపయుక్తుండైయుండ నమ్మహాస్త్రంబు మాహా

త్మ్యంబున నమ్మస్తకం బతనితొడమీఁదఁ బడిననతండు తదీయస్పర్శంబున

నెఱంగి దిగ్గన లేచుచుం ద్రోచిన నది భూతలపతితం బగుటయు.