7_4_091

చ. మఱచితె యా సభన్ భువనమాన్యగుణోత్తర యాజ్ఞసేని నీ

పఱచిన పాటుఁ బాండవులఁ బల్కిన పల్కులు నాఁటి క్రొవ్వు నే

డ్తెఱయును నెందుఁ బోయె రణధీరుల వారల నల్గఁజేసి సి

గ్గఱి తుది నిట్టు లైతి తగు నక్కట తియ్యన గావె ప్రాణముల్.


7_4_092

ఆ. బ్రదుకఁ దలఁచి తేనిఁ బాండు నందనులకు

నింక నైనఁ బుడమి యిచ్చు నట్లు

గాఁగ నన్నతోడఁ గార్యంబుఁ జెప్పు మ

వ్వెడఁగు భీష్ముబుద్ధి వినక చెడియె.


7_4_093

వ. ఇట్లు సేయఁ జాల వై తేని.


7_4_094

క. ఎట వోవవచ్చు నిను ముం

దట నిడుకొని పోర నున్న తగు రాజుల నె

క్కట దోలెడి సాత్యకి నీ

వట దఱుముదు గాక యొదుఁగ నగునే నీకున్.


7_4_095

క. అనుటయు నతండు వినియును

వినని చెవులు సేసి మగుడ విక్రమమునకున్

గొనకొని యేమియుఁ బలుకక

చనియె శినిప్రవరు పజ్జ సమరంబునకున్.


7_4_096

వ. తదనంతరంబ యాచార్యుం డవార్యదోర్వీర్యంబు మెరయం దఱిమి

మెఱుంగు వాలమ్ముల వేఁడిమి సూపిన.


7_4_097

శా. పాండుక్ష్మావర సూను సైన్యములు దర్పం బేదుడున్ వీరకే

తుం డుగ్రంబునఁ దాఁకి యగ్గురుని సూతున్ నొంచి యేనమ్ము లు

ద్ధండుం డై తను వాడ నేయుటయు నాతం డల్గి దీప్తోజ్జ్వల

చ్చండాస్త్రంబునఁ గూల్చె నా ద్రుపద సంజాతున్ మహోదగ్రతన్.


7_4_098

వ. ఇట్లు వీరకేతుండు వడినం గినిసి యతని యన్నలుం దమ్ములు

నగు చిత్రకేతుండును సుధన్వుండును జిత్రవర్మయుఁ జిత్రరథుండును

ద్రోణు రథంబు బాణ మయంబు సేసిన నతండు.


7_4_099

క. వారల రథ్యంబులఁ ద

త్సారథులం బొడవడంచి ధరఁ దొరఁగించెన్

వారి శిరంబులు పువ్వుల

వారణమెయి డుల్చు గంధవహుఁడుం బోలెన్.


7_4_100

వ. అప్పు డాలోకించి ధృష్టద్యుమ్నుండు గెంజాయ రంజిల్లు కన్నులం

గన్నీరొలుకం గవిసి కుంభ సంభవు నురంబునం గ్రూరనారాచంబులు

సొనిపిన మన మూఁకలు హాహాకారంబు లెసఁగ నతండు మూర్ఛిల్లిన

నప్పాంచాల వరుండు.


7_4_101

తే. పలకయును వాలునుం గొని యలఘుజవము

మెఱయ నేలకు లంఘించి మెఱుఁగు మెఱచి

నట్లు సని తల గోయుట కప్పళించి

యెగిరె నగ్గురుతేరిపై కేపు మెఱయ.


7_4_102

వ. అంతటం దెలిసి యాచార్యుండు ధైర్య ధురంధంరుం డై యెదురు గదియంబడి

నప్పటికి సాధనంబు లగు జేనకొలందితూపుల నతని నొప్పించినం గడుఁ దురులు

గఱచిన వెగడు పడునట్లు మొగతిరిగి యా ద్రుపద నందనుండు

నిజస్యందనంబునకు వచ్చి విల్లు గొని పెల్లేసిన.


7_4_103

క. గురుఁ డతని సూతుఁ దునుముడుఁ

దురగములు రథంబు ననికి దొలఁగఁ దిగువ నా

ధరణీ సురోత్తముఁడు బం

ధుర పాండవ సైన్య సమితిఁ డోలెం బెలుచన్.


7_4_104

క. కలశజుని తెంపుఁ బెంపును

బలిమియునుం జూచి యపుడు పాండు నృప తనూ

జుల దెస సైనికు లెవ్వరు

నలవు మెఱపి కడఁగఁ జాల రైరి నరేంద్రా.


7_4_105

వ. అట్టియెడ.


7_4_106

ఆ. అవ్విధమునఁ బల్కి యాచార్యుఁ డట పుచ్చ

నరిగి దుస్ససేనుఁ డా శినిప్ర

వీరుఁ దాఁకుటయు గౌరవపతి ద్రిగ

ర్తుని బలంబుఁ బనిచెఁ దోడు పడఁగ.


7_4_107

వ. ఆ సంశప్తకులలో దండి మగలు మూఁడు వేల రథంబుల వారు బెట్టు గిట్టిన నా

వృష్ణివీరుండు పంచ శత ముఖ్య రథికులం బంచత్వంబు నొందించి పెఱచతురంగబలంబుల

నెత్తుట జొత్తిల్లం జేసిన నాత్రిగర్త సైన్యంబు దైన్యంబు నొంది ద్రోణు దెసకు బఱచెం

బఱచినం బోవక యువరాజు శైనేయు తోడ నానానిశితశరంబుల దురంబు సేయ నతండు.


- దుశ్శాసనుఁడు సాత్యకితో యుద్ధంబు సేసి యోడుట –

7_4_108

క. ధనువు దునిమి నవ్విన నీ

తనయుఁడు పటు శక్తి వైచెఁ దలఁకక యది ప

ల్తునియలుగఁ జేసె సాత్యకి

విను మాతం డతని నొండు విలుగొని నొంచెన్.


7_4_109

ఆ. అలిగి కృష్ణు తమ్ముఁ డతని చాపంబును

సూతుఁ దురగములను గేతనంబు

దునిమి సొగయ సేసియును భీమసేన ప్ర

తిజ్ఞ దలఁచి చంపఁ దెగక చనియె.


7_4_110

వ. అట ధర్మజ భీమ నకుల సహదేవులు సాత్యకి సేనం దఱియం జొచ్చుట

యెఱింగి సైన్యంబులం బురికొల్పికొని ధృష్టద్యుమ్నాది యోధుల మున్నిడికొని

తఱిమిన మన వారును మార్కొని పెనంగిరా శైనేయుండును నీ సేన బడలు

వడం జేయుచు మున్నీటం బెనుఁజోఱ పోవు తెఱంగునం బోవుచుండె నంత

నక్కడఁ గవ్వడియును యుగాంత కాల రుద్రునికైవడి రౌద్ర రసమయ మూర్తి

యై తనమునుమ మొనల బారి సమరుచుండె మోహరంబు మొగంబున

గురుండును గౌంతేయ బలంబులం బొరిగొనుచుండె నివ్విధంబున నమ్మువ్వుర

చేతను బ్రజాక్షయం బగుచుండు గురుపతి భారద్వాజు నాజి యరసి పోవవచ్చి

యచ్చటం బాండవ సైనికుల సంరంభంబుఁ జూచి యేచి యొక్కరుండును

దలకడచి యమ్మొన వనజవనంబు సొచ్చు వారణంబును బోలెఁ దఱియం

జొచ్చి భీమసేనుం బది బాణంబులను నకుల సహదేవ ద్రుపద విరాట

ద్రౌపదేయుల సాయక త్రయంబులను గేకయ లేవురను శరద్వయంబులను

ధృష్టద్యుమ్నుని నిరువదింటను శిఖండిని మూఁటను ధర్మనందనుని నైదు

దూపులను నేసి మఱియు ననేక తురగద్విరద రథనికరంబులం బటు

ప్రదరశతంబుల నొప్పించె నప్పుడు.


7_4_111 1

తే. అతని చాపంబుఁ గుంతీసుతాగ్రజుండు

నఱకఁ బెఱవారు వొదివిన నుఱక వారి

నెల్లఁ గుంభజుఁ డమ్ముల వెల్లిఁ దేల్చి

యురవడించి యా సైన్యంబు నుబ్బడంచె.


7_4_112

వ. కౌరవపతియు మగిడి యా సైంధవు కడకుం జనియెఁ దదనంతరంబ కేకయ మహీనాథుండు మార్కొని.


7_4_113

క. గురుఁ డెన్ని శరము లేసిన

వెరపున నన్నింటి నన్ని విశిఖంబులఁ దా

మరలిచి బ్రహ్మాస్త్ర పరి

స్ఫురణము సూపినఁ దదస్త్రమున న యడంచెన్.


7_4_114

క. మఱియు నతని మెయి బాణము

లఱువది గిఱిగొలుప నా బృహత్క్షత్రుం డే

డ్తెఱ సూతు నొంప నాతం

డఱిముఱి నారాచ తతుల నవ్విభుఁ బొదివెన్.


7_4_115

తే. చిక్కువడఁ జేసి చనుమఱ యొక్కదొడ్డ

నారసమ్మున బిట్టేయ నరవరుండు

ద్రెళ్లె శిశుపాత తనయుండు ధృష్టకేతుఁ

డమ్మహావీరుపై వీఁక నడరి యపుడు.


7_4_116

క. పెనుమంట నుఱుకు శలభం

బును బోలెం గవిసి కోలుపులిఁ గోలన్ వ్రే

సిన మాడ్కి నేసె నఱువది

సునిశిత బాణమున నశ్వసూత యుతముగన్.


7_4_117

తే. బాణఘట్టనఁ గటకటఁ బడి గురుండు

విల్లు ద్రుంచిన నొండొక వింట నొంచె

నాతఁ డక్కుంభ సంభవుఁ డతని విరథుఁ

జేసి యావిలు దునిమినఁ జేవ సెడక.


7_4_118

క. గద వైచిన నది ద్రోణుని

ప్రదరంబుల నడఁగఁ దోమరము శక్తియు బె

ట్టిదముగ నతఁ డడరించిన

మదమున నయ్యోధవరుఁడు మడియించె నెడన్.


7_4_119

వ. ఇట్లు విగత సాధనుం జేసి.


7_4_120

క. ఆలోచన మెఱుఁగారెడు

నాలిక నారసము చేదివరు హ ృదయమునం

గీలించినఁ బొడ వెగయుచు

నేలం బడి తన్నికొని చనియెజము కడకున్.