ఆ భా 7 4 031 to 7 4 060
7_4_031
ఉ. ఒండొక చాప మెత్తికొని యుగ్రత శాంతనవాంతకుండు వే
దండము వోలెఁ గిట్టిన నుదగ్రత సింహ నభోపమస్ఫుర
త్కాండములం దదంగము రథంబుపయిం బడ నేసె భోజనా
థుం డది యాజికిం దొలఁగఁ దోలె రయంబున సూతుఁ డార్తుఁ డై.
7_4_032 వ. ఇట్లు శిఖండి గం డడంగి పోయినం గని మత్స్య చేది కేకయాది సైన్యంబులు బవరసంబు సేసి యురవడించిన నా కృతవర్మ మర్మ భేదన స్ఫారనారాచ పరంపరా ప్రవాహంబున వాని నెల్లం గలంచెఁ దత్కలకలం బాలించి సాత్యకి యట్లబ్బలంబులు వికలంబు లగుట యాలోకించి విజయునకుం దోడ్పడం బదంపడి పోఁదగు రాజువల నారయ వలయు నని యూహించి తనకు నడ్డ పడిన భారద్వాజునితోడి సమరంబు సాలించి మరలి యరదంబు దోలుకొని యరుగుదెంచి కృతవర్మునిం దాఁకి యేసిన నతండును బొగలేని మంట చందంబున నుద్దీపించి సాయక జ్వాలలు నిగిడించిన నవి మగిడించి యా శైనేయుండు.
7_4_033 శా. భల్లం బొక్కట విల్లు ద్రుంచి రయ మొప్పన్ నాల్గిటన్ వాజులం ద్రెళ్లన్ బెట్టుగ నేసి సూతు తల సందీప్తైక బాణాహతిన్ డొల్లం జేసి యదల్చి యి ట్లతని యాటోపంబు మాన్పించి యు త్ఫుల్లాస్యుం డయి పోవ నడ్డపడినం ద్రుంచెం ద్రిగర్తావళిన్.
7_4_034 వ. ఇట్లు కృతవర్మ విరథుం డైన రయంబునం బురికొని యురవడించిన పాండవ సైన్యంబులం గని కుంభ సంభవుండా శినివరుని విక్రమ విహారంబున కడ్డపడం గడంగక యా సైన్యంబుల సంరంభంబు దన విజృంభణంబున వారించి నిలిచె నిత్తెఱంగునం ద్రిగర్త సైనఁ జిక్కు వఱచి తఱిమి చను నయ్యాదవ రత్నంబు ప్రయత్నంబునకు భంగంబు సేయ నుత్తుంగ మాతంగంబును గొలిపి జలసంధుండు మదాంధుండయి మార్కొనుటయు.
- జలసంధుండను రాజు సాత్యకితో యుద్ధంబు సేసి చచ్చుట – సం. 7-91-24
7_4_035 క. ప్రదర ప్రవాహమున న మ్మదవద్ద్విరదంబు పటు గమన ముడిపి ముదం బొదివిన సాత్యకి విలు బె ట్టు దునిమె నమ్మగధ నాథుఁడు మహోగ్రుం డై.
7_4_036 తే. తునిమి నవ్వుచు నేఁబది తూపు లురము నందు నాఁటిన శైనేయుఁ డలిగి బెట్టి దంపు విలు గొని యాతని ధనువు నఱకి యుఱక యఱువది యమ్ములు వఱపె మేన.
7_4_037 వ. దానికిం జలింపక జలసంధుండు.
7_4_038 చ. పటుగతి నా శిని ప్రవరు బాహువు దోమర కీలితంబు సే యుటయును గాక త్రుంచె ధనువుగ్ర కృపాణము వైచి యాతఁ డు త్కటమగు నల్క నొండు విలు గైకొని వాని నికృత్త హస్తునిం ద్రుటిత శిరస్కునిం బ్రదర ధూతమదావళుఁ జేసి యార్చినన్.
7_4_039 క. పెలుకుఱి యచ్చటి మూఁకలు గలఁగినఁ గని తన ముఖంబు కయ్యంబునకున్ బలియురఁ గృవర్మాదుల నిలిపి గురుఁడు వచ్చి యా శిని ప్రభుఁ దాఁకెన్.
7_4_040 వ. ఇవ్విధంబునం గడంగిన కుంభ సంభవుం జూచి యతని ప్రాపున దుర్మర్షణ దుస్సహ వికర్ణ దుర్ముఖ దుశ్శాసన చిత్రసేన ప్రముఖులగు కురు కుమారు లొక్కపెట్ట కవిసి మిక్కుటంబగు తూర్య రవంబులతోఁ బెక్కమ్ములు సాత్యకిం బొదువ నత్తుములంబునకు దుర్యోధనుం డేతెంచి తమ్ములం గలసినం గునుంగొని గురుండు వారలతని కోపుదు రను బుద్ధిఁ బాండవ సేనా ముఖంబునకుం జనుదెంచిన నయ్యచ్యుతానుజుం డా రథికు లందఱ కన్నిరూపులయు వారల శరాసారంబులు నివారించుచు వారి నొకని నొకని ననేక బాణ జాలంబులం నొప్పించుచుండ నక్కౌరవేశ్వరుం డుద్దామ గతిని గవిసి వాలమ్ము లాతని తనువునం జొనిపిన నతండు.
7_4_041 క. నగుచు విలు దునిమి తీవ్రా శుగముల నొంచుటయు నీదు సుతు లెల్లను నా మృగపతి విక్రము పైఁ దఱ చుగ నిగిడించిరి ప్రదీప్త సునిశిత శరముల్.
7_4_042 క. చిక్కు వడక సాత్యకి యొ క్కొక్కరు నయిదయిదు దృఢ మహోగ్రాస్త్రములన్ స్రుక్కించి యెనిమిదిటఁ బే రుక్కున నక్కురు నృపాలు నొడలం గ్రుచ్చెన్.
7_4_043 ఉ. అంతటఁ బోక రత్నమయ మైన భుంజంగ పతాక గూల్చి య త్యంత రయంబు మై ధనువు నశ్వచయంబును సూతు మేను నిం తింతలు వ్రయ్యలై పడఁగ నేసిన బెగ్గిలి తేరు డిగ్గి భూ కాంతుఁడు వాఱె సేన కలఁగంబడి మ్రోయ నతండు నవ్వఁగన్.
7_4_044 వ. ఇట్లు వాఱి చిత్రసేను నరదం బెక్కె నక్కోలాహలం బాలించి కృతవర్మ దన రథంబు రయంబున నద్దెసకుం బఱపం బనిచి యురవడి నరుగు దెంచినం గని శిని పుంగవుండును నిజస్యందనంబు సమ్ముఖంబు సేయించె నయ్యిరువురుం గొఱవి గొఱవిం దాఁకిన తెఱంగునం దలపడి యొండొరుల పైఁ బ్రచండ బాణంబులు వరగించుచుం బోరునెడ జనార్దనానుజుండు హార్దిక్యు నతిక్రమించి.
7_4_045 తే. హయములను సూతు నొంచి శరాసనంబుఁ ద్రుంచి మెఱుఁగులు వెరిఁగిన దొడ్డనార సంబు మే నుచ్చిపో నేయఁ జచ్చినట్ల మూర్ఛ వోయి మోఁకాళులు మోవఁ బడియె.
7_4_046 వ. ఇత్తెఱంగునం దేరిపయిఁ గూలిన కృతవర్మం దెగియెనకాఁ దలంచి ధనంజయుం గలయం దమకించి సాత్యకి యక్కడఁ బోవ నా భోజపతి దెప్పిఱి సన్నద్ధుండై మరలి చని యెప్పటి నెలవున నిలిచి యనిల తనయ ప్రముఖుల కడ్డపడినం జూచి యాచార్యుం డచ్చోటి కతనిం జాలించి శౌర్యధుర్యుండగు నా శినివరుండట సనుట సైరింపం జాలక రయంబున.
7_4_047 క. మగుడఁ జని యాఁగి నిశితము లగు నారాచములు మూఁట నతని నుదుట బె ట్టుగ నాఁటినఁ ద్రిశిఖర యుత నగము క్రియం బొలిచె నతఁడు నరవర ముఖ్యా.
7_4_048 వ. ఆ రథిక వరుండును గురునిపైఁ గ్రూర నారాచంబులు నిగిడించె నిట్లు దొడంగి యయ్యిరువురు నొండొరు శరజాలంబులు వారించుచుఁ దురంగంబుల యంగంబుల రుధిరంబులు పూరించుచు సారథుల నొప్పించుచు మేనుల వాలమ్ములు గుప్పించుచు నసదృశంబులగు కర లాఘవంబులు సదృశంబులుగాఁ బోరునప్పుడు.
7_4_049 మ. ధనురాచార్యుఁడు కేశవానుజు ధనుర్ధండంబు ద్రుంచెన్ గదం గొని వైచెన్ వడి నాతఁ డగ్గురుఁ డెడం గ్రూరంపు భల్లంబునం దునుమం గ్రక్కున నొండు విల్లు గొని యాదోర్దర్ప దుర్దాంతు మై ఘన బాణంబుల నొంచె నించె నతఁ డాకాశంబు గర్జా ధ్వనిన్.
7_4_050 వ. అలిగి గురుఁడు శక్తి నడరింప నది విధి ప్రేరణమునఁ జేసి తేరు దాఁ కెఁ గాని యతనిఁ దాఁకఁ గానద యతఁడు ద ద్బాహు శాఖ నొంచెఁ బటు శరమున.
7_4_051 వ. నొంచినం గోపించి.
7_4_052 క. చాపాచార్యుఁడు సాత్యకి చాపము దునుమాడి సూతునమ్మూర్ఛితుఁగా నేపారి యేయ రథ్య వ్యాపారము దాన నడపి యతఁ డని సేసెన్.
7_4_053 వ. ఆలోన నతని రథ చోదకుండు దెలిసిన నెలమిం బొంది.
7_4_054 క. బలువిడి బహు భంగుల ను జ్జ్వల శరములఁ బోరి పోరి శైనేయుఁడు బె ట్టిలఁ బడ సారథి నేసినఁ దొలఁగంగాఁ బఱచె ద్రోణు తురగములు వెసన్.
7_4_055 ఆ. అచటి రాజ లోక మగ్గురు నరదంబు సనిన దిక్కు సనుచు సంభ్రమమున నాఁగి కొనుఁడు పట్టుఁ డదలుపుఁ డేయుఁ డ శ్వముల ననఁగఁ దెరలె సైన్య సమితి.
7_4_056 వ. ఇవ్విధంబున నిజ రథంబు విఫల మనోరథం బై పోయిన నదియ పోకగాఁ బోయి సన్నద్ధుండై సముద్ధతం బైన పాంచాల బలంబు చేతం గలంగు తన మూఁకలం బురికొలిపి కొని కుంభ సంభవుం డవష్టంభ విజృంభణంబున సేనా ముఖంబునం బొలచి నిలిచె నిత్తెఱంగున ద్రోణ కృతవర్మ దుర్యోధనాదు లగు జెట్టి జోదుల బెట్టువఱచి చిఱున వ్వొలయ సాత్యకి సారథితో నిట్లనియె.
7_4_057 క. ఇక్కడఁ గృష్ణుల తేజము నక్కడఁ బవమాన నందనాది జనుల పే రుక్కును గెలిపించె మనలఁ జిక్కక వెడలితిమి శత్రుసేనల చేతన్.
7_4_058 వ. అని పలికి యర్జునుం డున్న దిక్కునకు రథంబు రయంబునం బఱపం బంచిన వాఁడును నట్ల చేయ విమలాశ్వ వేగంబునం జారు భీషణంబగు నత్తేరు నీ వారికి దుర్నిరీక్ష్యంబై నభంబున భాను రథంబు సను చందంబున.
- సుదర్శనుఁ డను రాజు సాత్యకితో యుద్ధంబు సేసి చచ్చుట – సం. 7-84-6
7_4_059 క. అరుగఁగ సుదర్శనుండను ధరణీపతి యడ్డపడియె దర్ప మలర న య్యిరువురుఁ బెనంగుటయు న చ్చెరువుం గావించె నచటి సేనల కెల్లన్.
7_4_060 వ. అట్టియెడ నమ్మహీనాథుండు.