ఆ భా 7 3 091 to 7 3 120
7_3_091
ఆ. ఆశనికరణి వచ్చి యాశ్రుతాయుధుని పై
నమ్మహోజ్జ్వలాయుధమ్ము వడినఁ
బార్థుచేత మున్ను బాహులు దెగిపడ్డ
యతఁడు గొండ గులినట్లు కూలె.
7_3_092 వ. ఇట్లు వరుణ తనయుఁడు పడినం గనుంగొని.
7_3_093 క. అచ్చటి బలములుఁ బ్రభువులు నచ్చెరువును భయము మనములం దడరం గా విచ్చిన నట చనియెండు వి వ్వచ్చునిఁ గాంభోజ విభుఁడు వడి మార్కొనియెన్.
7_3_094 వ. ఇట్లు మార్కొనుటయును.
7_3_095 సీ. అర్జునుం డతని నేమ్ముల నేసినఁ బదియేను శరములఁ బార్థుఁ గృష్ణు విశిఖ త్రయమున నవ్విభుఁ డేయ నాతని విజయుఁ డస్త్రద్వయ విరతుఁ జేయ బాణముల్ మూఁటను బటుశక్తిఁ గ్రీడి నొప్పించి కాంభోడజుండు పేర్చి యార్చె నరుఁ డల్గి వెసఁ బదునాలుగు దూపుల సూతాశ్వ కోదండ కేతనములఁ
తే. గూల్చి దొడ్డనారసమున గుండెకాయ వగుల బెట్టేయుటయు నతి ప్రబల పవన భూరి రయమునఁ గూలు మహీరుహంబు తెఱఁగు దోఁప సుదక్షిణుఁ డొఱలి కెడసె.
7_3_096 వ. ఇట్లు కాంభోజపతి వడుటయు శూరసేన శిబివసాతి ప్రముఖానేక దేశంబుల బలంబు లబ్బలమర్దన నందనుం జుట్టుముట్టిన నతండు దఱచు వాలంపగముల నాఱువేల రథంబుల రూపమాపినం గనుకనిం దెరలినం గని శ్రుతాయువు నయుతాయువును గాండీవి రెండు గెలంకుల సాయక సహస్రంబులు నిగిడిచుచుం గవిరి రప్పుడు శ్రుతాయువు చేతి తోమరంబున నొచ్చిన వివ్వచ్చుం బిడుగు వడిన వానిం గొఱవిఁ జూఁడిన తెఱంగున నయుతాయువు నాలోనన శూలంబు వైచి సోలం జేసిన విషాదంబున గరుడ ధ్వజుండు సొగయ నా కపిధ్వజుండు నిజధ్వజదండం బొక్కింత యూఁతగొనిన నక్కురు సైన్యంబుల సింహ నాదంబులుం దూర్య నినదంబులు జెలంగె నంత శౌరి ప్రబోధింపం దేఱి ధనంజయుం డైంద్రాస్త్రంబు ప్రయాగించుటయు నది వివిధాయు ధాకారంబు నం గవిసి యయ్యిరువుర హస్త మస్తక శకలంబులు ధరం దొరగించి తదనుచరులం బంచ శత రథిక వీర యోధుల వధియించి చూపఱకు విస్మయం బారాదింప నిలింప పతి సుతుండు దఱిమికొను పోవు తఱి నయ్యిద్దఱ కొడుకులు నియుతాయువు దీర్ఘాయువును శోక వేగంబున నరవాయి గొనక పయిం బడిన నుద్దవిడిఁ గవ్వడి వాలరం దండ్రులం గూడ ననిచి మహార్ణవంబు గలంచు మందరంబు చందంబున నీ బలంబులం దిరుగుడువడం జేయుచు నురవడించు సమయంబున.
7_3_097 ఆ. కురు నరేశ్వరుండు పురికొల్ప బ్రాచ్య క ళింగ దాక్షిణాత్యు లంగ బలము మ్లేచ్ఛ తతియు బెరయ మెయికొని తాఁకిరి గజ ఘటా సమృద్ధిఁ గారుకొనుచు.
7_3_098 వ. అట్టియెడ గండీవముక్త మార్గణ వర్గంబు వేగంబున.
7_3_099 క. చేతులుఁ దొండములు శిరో వ్రాతముఁ గుంభ స్థలములు వడిఁ దొరఁగె ధరి త్రీ తనమున నంకుశ బహుహేతి శకల సహితముగ మహీవర ముఖ్యా.
7_3_100 తే. ఇవ్విధంబున నుఱమాడ నీడఁ బోక యవన పారదశకబర్బరాదు లైన మ్లచ్ఛ బలములు ధైర్యంబు మిక్కుటముగఁ బొదివి పోరెను గ్రీడి యద్భుతము నొంద.
7_3_101 క. తుంగ మడువుఁ జొచ్చిన మా తుంగ మునకు మిగిలి యడవి దరికొను కార్చి చ్చుం గడచి యబ్బలంబుల భంగించె నతండు ఘోర బహువిధ గతులన్.
7_3_102 వ. ఇట్లు నారాయణ మారుత ప్రేరితం బగు నర జ్వలనంబు శరజ్వాలా జాలంబున భవత్సేనా కాననంబు రూపుమాపె నప్పుడు.
7_3_103 తే. అర్జునుం డను పర్జన్యు నస్త్రవృష్టిఁ బల్లమును మిఱ్ఱు నని యేఱు పఱుపరాక యుండ నెత్తురు వెల్లు లొండొండ పెరిఁగె నుబ్బి భూత భేతాళంబు లోలలాడ
7_3_104 వ. ఇమ్మెయి నద్భుత విక్రమంబున నతిక్రమించి కడంగు కవ్వడి నంబష్ఠ పతియగు శ్రుతాయువు మార్కొని నొగ నొగం దాఁక నరదంబు వఱపుటయు.
7_3_105 చ. అతని శరాసనంబును హయంబులఁ ద్రుంచిన నా శ్రుతాయు వు ద్యత గద నొప్పఁ బట్టి దనుజాంతకు వ్రేసె నరుండు దద్గదా హతి యొనరించె నొండుగద నాతఁడు వెండియు విక్రమించినన్ శత మఖసూతి యాతని భుంజంబులుఁ గంఠముఁ ద్రుంచె వ్రేల్మిడిన్.
7_3_106 వ. ఇత్తంఱంగున ద్రోణాచార్యుం గడచి కృతవర్ముని బెట్టపఱిచి శ్రతాయుధునిం గూల్చి కాంభోజ పతిం బడవైచి శ్రుతాయుః ప్రభృతుల నులిపి తఱిమి భవదీయ సైన్యంబు సొచ్చి బహువిధ యోధ ప్రాణంబుల బామ నాళంబులం బీల్చికొనుచుం చెలువ నడరు ఫల్గునుం గనుంగొని నీ కొడుకు దేరు దోలుకొని యొంటిమై నక్కుంభ సంభవు కడకుం జని కటకటం బడుచు నతని కిట్లనియె.
- దుర్యోధనుఁడు ద్రోణుని దూఱనాడుట – సం. 7-69-1
7_3_107 చ. నిను నవలీల దాఁటి ప్రజ నేలకుఁ గోలకుఁ దెచ్చుచున్న య ర్జునుఁ దలయెత్తి యైన నటు సూడవు పాండవ పక్షపాతి నీ మన మటు గాన నెప్పుడును మా దెసఁ గప్ప యెలుంగుఁ బామ వై యునికి యెఱుంగ వచ్చె నటు లూఱటగా వరమిచ్చి నాఁడవో.
7_3_108 క. నిను నమ్మి యొండ వలనికిఁ జనక జయద్రథుఁడు నిలిచి సైన్యములో నా తనిఁ జంపెడు తేనియ పూ సిన కత్తివి గాక మానిసివె యూహింపన్.
7_3_109 వ. అని పలికి కార్య దాహంబునం జేసి తన రాజసం బడంచుకొని యతండు.
7_3_110 తే. సైంధవున కడ్డ మున్న రాజవ్రజంబు పార్థు రాకకు వెలువెలఁ బాఱఁ జొచ్చె నార్తిఁ బలుకు నా మాటల కలుగ కకట చావకుండంగ నాతనిఁ గాన వయ్య.
7_3_111 వ. అనిన విని యాచార్యుం డతని కిట్లనియె.
7_3_112 క. నీ మాటకు మా యశ్వ త్థామ వచనములకు నేఁ బదరుదునె విను మా దామోదరు మతి ముంగలి గా మారుత వేగ ఘోటక స్ఫురణ మెయిన్.
7_3_113 క. చనునప్పు డతని యమ్ములు వెనుకఁ బ్రజం దాఁకుచుండు వివ్వచ్చుని నే జన నీక యాఁగు వాఁడనె కని కని యిటు లేల పలుకఁ గౌరవ నాథా.
7_3_114 వ. అది యట్లుండె నొక్క హితంబు సెప్పెద నాకర్ణింపుము సేనాముఖంబు విడిచి యే నర్జును వెనుకం బోయినం బాండవ బలంబు లురులం దోఁతెంచు మనయొడ్డు గలంగిన సైంధవుం గాచు టరికి యట్లుంగాక రాజ మధ్యంబున ధర్మరాజుం బట్టెద నని యాడిన నాకు నప్పని యేమఱం దగనే యతనిన వేచి నిలిచెద విశేషించి వృ్దధ నగుటం జేసి శీఘ్రయానం బశక్యం బయి యుండు గాండీవియు నీవును దుల్య వయోవర్తనులరు శంక లేక వానితో విరోధంబు గొన్నవాఁడవు తగు సహాయులం గూర్చికొని యడ్డపడుము చయ్యనం జను మి పలికిన నతండు.
7_3_115 చ. నినుఁ గృతవర్మ గెల్చి యవనీ పవర ప్రకరంబు నోర్చి పే ర్చిన నరు నేన కాదు సురసేనయు నింద్రుఁడు నైనఁ దాఁక నే ర్చునె యది కార్యతంత్రముగఁ జూచిత యేని భవన్నియోగమున్ గనకొని చేసెదన్ యశము గోల్పడ కుండఁగఁ జూడు మెమ్మెయిన్.
7_3_116 వ. అనుటయు నగ్గురుం డక్కురుపతిఁ గనుంగొని నీవు నిక్కంబు పలికితి కిరీటి యట్టివాఁడ నేఁ డొక్క యద్భుతంబు సూపెద నిక్కవచ ధారణంబు చేత రక్షితుండ నై యతనిం దలపడుము కృష్ణుండును సమస్త జనంబులు వెఱఁగుపడం దదీయ శరంబులు నీ తనువు దాఁక కుండం గలయవి యని చెప్పి యొక్క పసిండి కత్తళంబునందా శక్తి యావహించి యిచ్చినం బుచ్చుకొని ప్రీతుం డగుచు నియతాత్ముండై దానిం దొడుగునప్పు డాచార్యుం డిది దొల్లి దేవ సంరక్షణార్థంబుగా నజుండు దేవేంద్రున కిచ్చె నది యతండంగిరసునకు నంగిరసుండు బృహస్పతికి బృహస్పతి యగ్ని వైశ్యునకు నగ్ని వైశ్యుండు నాకును దీని నొసంగి రని యెఱింగించి సమంత్రకంబుగాఁ దొడిగి నానా విధ వాక్యంబుల దీవన లిచ్చి పొమ్మని యనుజ్ఞ సేసిన నమ్మహీపతి యుబ్బి యరతంబు సత్వరంబు సేసి యనేక రథ కరి తురగ నరనికరంబులు దన్నుం బరివేష్టింప వివిధ తూర్య నాదంబులు నింగి ముట్ట వివ్వచ్చు వెనుకొనియె నట్టియెడ నిక్కడ.
7_3_117 చ. సురభ సవృత్తిఁ బాండు సుత సైన్యము లొక్కట నేచినం గడుం దిర మయి నీ బలంబును సుదీర్ణత సూపిన జాహ్నవీసము ద్ధుర యమునాభి ఘట్టనముతో నెన వచ్చె నరేంద్ర యప్డు సం గర మతి ఘోర మయ్యె నొక కాలము నట్టివి సూడ మెయ్యెడన్.
7_3_118 వ. అయ్యవసరంబున.
7_3_119 ఆ. నడుమ భానుఁ ధాల్చు నకముఁ గనుంగొని దాని మిగులు బుద్ధి ధరణి భాను యుగముఁ దాల్చె ననగఁ నొప్పిరి తీవ్ర తే జమున గురుఁడు ద్రుపద సంభవుండు.
7_3_120 వ. ఇట్లు ద్రోణ ధృష్టద్యుమ్నులు మెఱసి పోరి రప్పు డప్పాంచాల వరుండ గురుని శర వర్షంబులు వారించుచు మిగిలి మన వాహిని పై నడరి నేల నెత్తుటం దోఁచిన నతని కోల్తలకుం గాక యొదిఁగి యచ్చటి ప్రజ మూఁడు గుంపులయ్యె నప్పుడు ద్రోణుండు గినిసినం బాంచాల కేకయ ప్రముఖ బలంబులు గలంగం బడిన మగుడ నమ్సత్సైన్యంబు పురికొనుటయు ధర్మసూనుండు సోదరాది యోధ వీర సహితంబుగా నురవడించినం గని వికర్ణ వివింశతి చిత్రసేనులు భీమసేనుని బాహ్లికుండు ద్రౌపదేయులను దుశ్శాసనుండు సాత్యకిని శకుని నకుల సహదేవులను సామదత్తుండును శిఖండిని నలంబుసుండు ఘటోత్కచుని దలపడిరి శల్యుండు సింధురాజు కడ నుండియు నగ్గలిక నమ్మొగ్గరంబు మొగంబునకుం జనుచు మరలునికిం జేసి తత్కాల సన్నీహితుండయిన యుధీష్ఠిరుం దాఁకె నివ్విధంబునం దార్కొనిన యద్దొరలు నానా ప్రకార దారుణ విచిత్ర సంగరంబులు సేసి పల్లవితా శోక పుష్పితకింశుక వనంబులం బోలి పొలిచిరా సమయంబున దుస్ససేనుండు శైనేయుని మూర్ఛితుం జేసిన నాలోనన తెలిసి యితండు ప్రచండ భంగిం బెనంగెఁ గవల యమ్ముల కోహటించి గాంధార రాజు ద్రోణు దెసకుం బాఱె నట్టియెడ.