7_2_271 క. నీ యుపదేశము దన చే దోయి బలువుఁ దోఁడు గాఁగఁ ద్రోణుఁ గడచి వే పోయి మొనఁ జొచ్చి సైన్యము పాయవడఁగఁ గలఁగఁ జెదరఁ బఱవఁగఁ జేసెన్.

7_2_272 క. కని కంభంజముఖ్యులు వా నిన పొదువఁగ నేముఁ జొచ్చి నిరతిశయ రయం బున వానికిఁ దోడ్పడుటకు జనఁ జనఁ జన మా కడ్డపడియై సైంధవుఁడు వడిన్.

7_2_273 వ. అతండు రుద్ర వరాను భావంబునం జేసి యక్షుద్రబలుం డగుట నే మతని మిగులం జాలక చిక్కితి మా సౌభద్రుం జుట్టుముట్టి గురు కర్ణ కృతవర్మ కృప గురుపుత్రాది యోధ వీరులు పెక్కండ్రు సిక్కువఱుపం జేవ సెడక వాఁడు బలంబు మెఱయఁ జలంబు నెఱయ నారాధేయ ప్రముఖులం బఱపియి బృహద్బల లక్ష్మణ ప్రభుతులగు రాజులు రాజకుమారులఁ బలువురం జంపియు సొంపారెం బదంపడు పదాతియు గదాపాణియు నై రథాంగపాణి యల్లుండు దూగాడుచుం బోరాడు నెడ దుశ్శాసన తనయుండు దాఁకి వానిచే విరథుం డై తానును గద గొని పెలుచం దలఁపడియె నత్తెఱంగున నైన గదా రణంబున వారిరువురుం బరస్పర నిహతులై పడి రివ్విధంబున నక్కుమారుండు దన తండ్రులకును మామలకును రూఢియగు రణక్రీడం గీర్తి పరిస్ఫుర్తియు తనకు నాక లోక సుఖంబునుం జేకొనియె నని చెప్పుటయు.

7_2_274 క. తెల్లముగ సుతుపడుట విని జల్లని డెందంబు సెదర సంధులు ప్రిదులం దల్లడ మగ్గల మై మూ ర్ఛిల్లె నరుఁడు బంధు లెల్లఁ జేష్టలు దక్కన్.

7_2_275 వ. ఇట్లు పరవశుం డైన గృష్ణయుధిష్ఠిరులు గరతలంబుల నెత్త నొక్కింత సేపునకు సేదదేఱి సైంధవుం దలంచి యతండు.

7_2_276 ఆ. అవుడు గఱచి యెఱ్ఱనగునాననంబుతో బొమలు ముడిచి చెమట పొడమ మేను కంప మొందఁ గనలు గదిరినకటికి న వ్వెసక మెసఁగ నన్న కిట్టు లనియె.

7_2_277 మ. వినుఁడీ నాదు ప్రతిజ్ఞ నీవు నిఖిలోర్వీనాథులున్ సింధురా జు నవశ్యంబును నెల్లి సంపుదు భయస్థుండై నినుం జొచ్చినన్ వనజాక్షున్ శరణంబు వేఁడినను గర్వంబేది నన్నుం దగం గనినం బోరు దొఱంగి పోయిన నెఱుంగం గాని సత్యవ్రతా.

7_2_278 క. బాల ధ్వంసకు నా దు శ్శీలుం గాచుటకు నన్నుఁ జెనకిన నస్త్ర జ్వాలలఁ గౌరవ యోధులఁ దూలించుచు వానిఁ గవియుదుం జటుల గతిన్.

7_2_279 ఆ. ఇట్లు సేయ నైతినేని గురుద్రోహి గతికి బ్రహ్మఘాతిగతికి మద్య పానరతుని గతికి మానార్హ జనవరి వారి గతికిఁ బోవువాఁడ నధిప.

7_2_280 వ. మఱియు నొక్క ప్రతిన యవధరింపుము.

7_2_281 చ. అనిమిష దైత్యకింపురుషు లాదిగ నెవ్వరు వచ్చి కాచినం దునుముదు నెల్లి సైంధవునిఁ దోయజమిత్రుఁడు గ్రుంక కుండుము న్న నరవరేణ్య యిత్తెఱఁగు నా కొనరింపఁగ రాక యున్న నే ననలము సొచ్చువాఁడ నృపులందఱుఁ జూడఁగ గాండివంబుతోన్.

7_2_282 వ. అని పెలుచం బలికి యప్పరమ కోదండంబు దెప్పించి సజ్యంబు గావించి గుణధ్వని నిగడం జేయుటయుఁ బద్మనాభుండు పాంచజన్యంబు పూరించె దేవేంద్ర పుత్రుండు దేవదత్తం బొత్తె నన్నాదంబులును దత్సైనిక సింహనాదంబులును దూర్యనినదంబులును నింగి వొంగం జెలంగె నగ్గాండీవంబును నృత్తంబు సేసిన చందంబు నొందె నస్త్రంబు గవదొనలు వెలువడి వెలింగె నయ్యవసరంబునం గొండొక దెలివొంది పవన నందనుం డప్పురందర నందను వదనంబు వీక్షించి.

7_2_283 క. అతి తీవ్రమైన నీదగు ప్రతిన కుపోద్బలము గాఁగఁ బరగిన ధీరో ద్ధతి పాంచజన్య రవమున ధృతి తూలకయున్నె కురుపతికి నింద్రసుతా.

7_2_284 వ. అని యగ్గించె నా సమయంబునం గోపంబు పెంపునను బూనికిపై భరంబునను భీమసేనుని సల్లాప సౌహార్దంబునను దన డెందఁబు శోకంబు డిందువడ నందఱఁ గలయె గనుంగొను విజయుని వందిమాగధ సందోహంబులు నుస్తుతించె నట్టియెడ నిక్కడ.

7_2_285 క. జననాథ పాంచజన్య ధ్వనిఁ గూడి చెలంగు దేవదత్త రవంబున్ విని భీతి సంభ్రమంబుల మన సైన్యము లెల్ల ఘూర్ణమానము లయ్యెన్.

7_2_286 క. అప్పుడు వేగుల వారలు సెప్పిన నంతయు నెఱింగి సింధువిభుఁడు దన్ గప్పెడు నెవ్వగ పెల్లున నిప్పులఁ బడినట్లు గాలు నిలువఁగ లేమిన్.

- అర్జునుని ప్రతిజ్ఞ విని సైంధవుఁడు భయంపడి దుర్యోధనునితోఁ జెప్పుకొనుట – సం. 7-52-1

7_2_287 క. చని యాప్తు లైన బలవ న్మనుజేంద్రులు గొలువ నున్న మానవ నాథుం గని యిట్లను సిగ్గు గడచి తన యుల్లముఁ గలఁచి వెఱపు దల్లడ వెట్టన్.

7_2_288 ఉ. ఏ నొకరుండనే తనకు నెగ్గొనరించితి నేల నా పయిం బూనినవాఁడు ఫల్గునుఁడు పోర వధింపగఁ నెట్టిపాడి మీ కీనెఱి సంతసంబు వగ పేటికి నా కెట యేని పోయెదన్ వాని ప్రతిజ్ఞ కడ్డుపడువారె సురాసుర సిద్ధ సాధ్యులున్.

7_2_289 వ. అనుచుం గొలువు గలయం గనుంగొని.

7_2_290 ఆ. ద్రోణ కర్ణ శల్య దుర్యోధనులుఁ గృప బాహ్లికులును జముఁడు వట్టికొన్న వానినైనఁ గావ వలతురు వలచిన నొల్లకున్న నెట్టులొకొ యెఱుంగ.

7_2_291 వ. అని వెండియు.

7_2_292 క. పెదవులు దడుపుచుఁ గాళ్లున్ గుదివడ వడఁకుచు మనంబు గొందలపడఁగా నిది యేటిమాట లాడెదఁ మదిఁ బార్థుఁడు గానకుండఁ దొలఁగన వలయున్.

7_2_293 వ. మీ యందఱచేత ననుజ్ఞాతుంన కదా పోయి వచ్చెద ననవుడు నిజకార్య ధురధరుం డగు నక్కురు ధరణీవరుం డతని కిట్లనియె.

7_2_294 మ. మును నీ వెన్నితి విక్రమఢ్యులని మమ్ముం గొందఱన్ ద్రౌణిపెం పును హార్ధిక్యు బలంబు సౌబలుని యేపుం జేవయున్ సోమద త్తుని ధైర్యంబును శౌర్యమున్ శలు మహాదోర్దర్పముం గూడ నె న్నిన నీ కెట్లగుఁ జూడు మిట్టి మగలు న్వేయేల ని న్నిత్తురే.

7_2_295 క. నమ్మును వెఱవకు మేనును దమ్ములును గోట నీకుఁ దాత్పర్యముమై నిమ్మేటి మగలు సూరెల నెమ్మి నిలువ నింద్రుఁ డైన నీ కెదు రగున్.

7_2_296 వ. అని చుట్ల నున్న రాజులం జూపిన నూఱడిల్లి యంత నిలువక నీ కొడుకుం దోడ్కొని ద్రోణుని కడకుం జని జయద్రథుండు దనకు నర్జునునకు ధనుర్విద్యా విభవంబు నందలి వాసి యెట్టి దని యడిగిన నతఁడు నీకు నతనికి నాచార్యకంబు సమప్రకారంబ యవ్వీరుండు వివిధ శ్రమంబుల యలజడి కోర్చి యలఘు ప్రయోగంబులు పెక్కులు సాధించుటం జేసి నీకంటె నధికుండై యుండు నది యట్లుండె నేను గలుగ నీ నా సవ్యసాచికి వెఱవ వలదు మద్బాణంబుల మఱువున నున్న నిన్ను దేవతల కైనను దేఱి చూడ వచ్చునే వివ్వచ్చునకుం బ్రవేశింపరాని బంధుర వ్యూహంబు పన్నించెదఁ గులధర్మంబు శిథిలంబు గాకుండ సమరంబు సేయు మని చెప్పి వెండియు.

7_2_297 క. శ్రుతు లభ్యసించి తతుల క్రతువులు సేసితి కులంబు రక్షించితి నీ వితరుల క్రియ మృత్యుభయా న్వితుఁడవు గాఁ దగునె మేదినీవర యింకన్.

7_2_298 క. యాదవ కౌరవ పాండవు లాదిగఁ గల యఖిల నృపులు నవ్యయ వృత్తిన్ మేదిని నిలుతురె క్రమమునఁ బోదురుగా కెల్లజనులుఁ బోవు తెరువునన్.

7_2_299 క. తపములు దానంబులుఁ జే సి పడయు లోకంబు లెల్ల జేయలఁతులు భూ మిపులకు సంగర విద్యా నిపుణతఁ దలఁ కుడిగి పోర నేర్చినఁ జాలున్.

7_2_300 క. అని యూఱడిల్లఁ బలికిన విని యతఁడు గలంకు దేఱి విభుఁడుం దానుం జని సంగ్రామోత్సాహం బునఁ బొదలిరి తూర్యఘోషములు దివి ముట్టన్.


http://www.volamsite.com