ఆ భా 7 2 181 to 7 2 210
7_2_181
వ. అనుచు వినతుం డగుటయు నమ్ముని దనదైన యశోక వనంబునకుం జనియె నని పలికి పారశర్యుండు.
7_2_182 క. ఈ యితిహాసం బాయువు శ్రీయును నారోగ్యమును విశిష్టగుణంబుం జేయు జనములకు జగతీ నాయక వ్రాసినఁ బఠించినం దగ వినినన్.
7_2_183 వ. అబిమన్యుండును భండనంబునఁ బిఱుసనక శరశరాసనాది వివిధాయుధంబులఁ బర బలంబులఁ బడలు వఱచి వీర స్వర్గ సౌఖ్యంబును బ్రఖ్యాతియుం బడసె నీకు నడలం బని లే దని చెప్పిన విని ధర్మతనయుండు దన మనంబున నుత్తమ క్షత్త్ర ధర్మంబు తెఱం గిట్టిద యగుట దలపోసియు శూరులు పుణ్య లోకంబున సుఖం బుండుటయుం దెలిసియు నెవ్వగ విడిచి వెండియు వేద వ్యాస మునీశ్వరుతో నిట్లనియె.
7_2_184 ఆ. మును ప్రసిద్ధిఁ బొంది చనిన భూపాలక శ్రేష్ఠు లెవ్విధమునఁ జేసిరొక్కొ క్రతువు లవ్విశిష్ట కర్మ జాతముఁ దెలి యంగఁ జెప్పి నన్ను నాదరింపు.
7_2_185 వ. అనిన విని యమ్మనుజ పతి తలంపు గనుంగొని కృష్ణద్వైపాయనుండు నీ విట్లడుగుట నీ కొడుకు దొంటి మహారాజుల యట్టివాఁడు గావున నక్కుమారునకు వారలకుం బుణ్యగతి దారతమ్యం బెట్టిదియో యని యరయుట గా నోపు నని యూహించె దననవుడు నతండు మీ దివ్య చిత్తంబున నవధరించిన దానిం గా దన నెట్లు వచ్చు నవ్వానిని విన నలతు నానతి యిండు.
7_2_186 చ. అనుటయు నమ్ముని ప్రవరుఁ డాతని కి ట్లను నధ్వర ప్రవ ర్తనులు దపః ప్రదీప్తులును దాన సమగ్రులు దాత్త శీలురుం జనియెడు నట్టిచోటు లొక సంపదయే రణశూర కోటి క ర్జునసుతుఁ డత్యుదాత్త మగుచోట సుఖస్థితి నుండు భూవరా.
7_2_187 వ. అది యట్లుండె మహితాత్ము లయిన మహీపతుల వరిష్ఠ కర్మానుష్ఠానంబుల తెఱం గెఱుంగుట మేల కాదె యంత లంతలు మానుసులు మడిసిరి గాని పుడమి నిత్యు లై నిలువంబడ రది వినుటయు నీ మనశ్శోకోపశమనంబు సేయు జెప్పెద నాకర్ణింపుము.
- వేదవ్యాస మునీంద్రుఁడు ధర్మజునకు సువర్ణష్ఠీవి చరిత్రంబు సెప్పుట – సం. అను 1-8-300 పంక్తి
7_2_188 క. జనపాలక సృంజయుఁ జను మనుజేంద్రుఁడు పుణ్యమూర్తి మహిమాస్పదుఁ డి వ్వన నిధి వలయములోని య వని నొక్కఁడ యేలు దుర్నివారస్ఫురణన్.
7_2_189 వ. సంతానార్థి యయి సంతతంబును భూసుర పూజనంబులు సేయుచుండు వానరపతికి నారదుండు సఖుం డగుట నతని పాలికిఁ బలుమాఱు నరుగు దెంచుచుండు నొక్కనాఁడు విప్రవరు లతి ప్రయత్నంబునం గూడికొని యమ్మునివరునితో నిమ్మహీపతి కోర్కి దీర్ప వలదే యని చెప్పిన.
7_2_190 క. అతఁ డతని తోడ భవదీ ప్సిత మెయ్యది నాకు నేల చెప్ప వనుడు నం చిత గుణుఁడు రూపసియు నగు సుతుఁ గోరుదు నెపుడు నేను సురగణ వంద్యా.
7_2_191 వ. అక్కుమారుండును మాత్ర పురీశ లాలాశ్రు స్వేదంబులు సువర్ణంబు లగు నట్టి వాఁడు గావలయు ననిన నమ్మహీపతి నమ్మహాత్ముం డవ్వరం బిచ్చె నా సృంజయుండు నత్తంఱంగు తనయుం బడసి సువర్ణష్ఠీవి యను పేరిడి ప్రియంబునం బెనుచుచు వాని వలనం గనకం బను దినంబు నుత్తరోత్తరాభి వృద్ధి యగుచుండ సమృద్ధి నొంది శయనాసన సదన ప్రాకార ప్రభృతి సమస్త వస్తువులును గాంచన మయంబులు గావించికొని యసమాన మహిమా నందంబునం బ్రగాశుం డై.
7_2_192 క. విలసిల్లుచు నుండఁగ మ్రు చ్చిలి పట్టి కుమారునోరఁ జీరదుఱిమి వెం గలు లగు క్రూరుల గొందఱు వెలువడఁ గొనిపోయి యొక్క విపినములోనన్.
7_2_193 ఆ. కడుపు వచ్చి యొడలు గలయంగ జల్లించి పాపి పాపి చూచి పసిఁడి గాన కచట శవము వైచి యరుగుచు నుండి త త్కర్మ ఫలముఁ దమ్ముఁ గలచుటయును.
7_2_194 వ. ఆ పాపాత్ములు దమలోనం గలహించి యొండొరుల వధించి యందఱ్ు నధోగతిం జెందిరి సృంజయుండును గొడుకుం గానక వెదకి తత్కళేబరంబు గని పరలోక క్రియలు నిర్వర్తించి శోకంబునం బలవించుచున్న నన్నరేంద్రు కడకు నారదుం డరుగు దెంచి యతని చేత నర్చితుండై.
7_2_195 క. జననాథ యిట్లు శోకం బునఁ గుందినఁ దనువు విడిచి పోదె యసుఱు స చ్చిన వారలు వత్తురె యే డ్చిన జెలిమిం జేసి హితము సెప్పెద నీకున్.
- షోడశ రాజ చరిత్రము – సం. ఆను 1-8-360 పంక్తి
7_2_196 వ. అవధానాయత్తం బగు చిత్తంబుతో విను మని యిట్లనియె.
7_2_197 సీ. సంవర్తుఁ డను మహా సంయమి దేవతా గరుతోడి యీసున నరుగుదెంచి పూని యుపద్రష్ట యై నడపంగ హిమాచల పాదంబునందు శక్ర వరుణ ప్రభృతు లైన సురలు మహా మునీంద్రులును సహాయులై మెలఁగుచుండ శాలాప్రముఖ భవ్య సాధనంబులు గనక మయంబులుగ వస్త్రకాంచనాజ్య
ఆ. దధిపయః ఫలాది తర్పణ ద్రవ్య స మృద్ధి సకల జనులు మెచ్చఁ బెక్కు లధ్వరములు సేసె నట్టి మరుత్తుండు నిత్య పదవి నుండ నేర్చెనయ్య.
7_2_198 సీ. సన్మార్గమున రాజ్య సంపద నొంది భూ సుర పూజ లొనరించి సువ్రతముల బృందారకులఁ బ్రీతిఁ బొందించెఁ దన కర్థి బర్జన్యుఁ డేఁటేఁటఁ బసిఁడి వాన కనకమయము లైన కర్కట ఝషనక్ర కూర్మ చయము తోడఁ గురియు చుండ నయ్యర్థ మెల్ల ధనార్థుల కిచ్చుచుఁ గురుజాంగలంబున బరమ నిష్ఠ
ఆ. నశ్వమేధముఖము లైన రాజార్హ య జ్ఞములు పెక్కు సేసె సకలజనులుఁ బొగడునట్టిపాడి నెగడె సుహోత్రుఁ డ వ్విభుఁడు దెగియె ననఁగఁ వినమె యధిప.
7_2_199 సీ. కాంచనాలంకార కాంతబు లై రూఢి కెక్కిన గజములు పెక్కు వేలు జవసత్వ రూపాది సకల గుణములఁ బెం పెసఁగిన హయము లనేక లక్ష లమల సువర్ణ మయము లగు కొమ్ములం గొమరారు పశువులు గోటు లూర్జి తాంగకవిలస దజావికంబులు గణనాతీతములు కన్య లప్రమేయ
ఆ. లఖిల రత్న విరచితా భరణంబు ల నల్పములు మహీసురావళులకు నిచ్చి చేసెఁ గ్రతువు లెన్ని యేనియు నంగుఁ డతఁడు నవ్యలోక గతుఁడు గాఁడె.
7_2_200 సీ. ఏడు దీవుల యందుఁ గ్రీడాగతులఁ దనరథము చరింప నరాతు లనఁగ వినియు నెఱుంగక విభవ మార్జించుచోఁ బ్రజల నొప్పింపని పరమ పుణ్య కర్మంబునకు మెచ్చి గారవంబునఁ దన కక్షయధనము ఫాలాక్షుఁ డొసఁగ నశ్వమేధములు జాహ్నవి పొంత శిష్ట జనాకీర్ణములుగఁ బె క్కాచరించెఁ
ఆ. దారకములు వృష్టిదారలు లెక్కింప వచ్చుఁ గాని యతని యిచ్చు గోవు లెన్నఁ గొలది గాదు సన్నుతి పాత్ర మా శిబికి నుర్వి నునికి సెల్లెనయ్య.
7_2_201 సీ. యౌవనంబునఁ దప మాచరింపఁగఁ దండ్రి పంపున నరిగిన పెంపుకలిమి సేతువు జలధిఁ బ్రఖ్యాతంబుగా నొనర్చిన మర్త్యలోక పావన విభూతి త్రైలోక్య కంటకు దశముశు బంధు యుక్తంబుగాఁ జంపిన కలితనమ్ము బాలుర మరణంబు వాటిల్ల కుండంగఁ జాసిన యత్యంత చిత్ర మహిమ
ఆ. గలిగి యశ్వమేధములు మున్నుగా ననే కాధ్వరము లొనర్చి యఖిల జనులఁ దల్లి వోలె నరసి దశరథ రాముండు గాలవశత నొందెఁ గాదె యధిప.
7_2_202 సీ. పూర్వ వంశ్యులఁ గావఁ బూని వియద్గంగ నవని భాగీరథి యనఁగఁ బఱపి శక్రుండు మెచ్చఁ బరాక్రమంబునఁ బేర్చి యప్రతిహతముగ నశ్వమేధ యాగంబు లొనరించు నప్పుడు వేయు వేలరదంబులందుఁ గన్యల నలంకృ తలం జేసి యునిచి రథంబు రథంబున కిభములు నూఱు నుఱేసి యేనుఁ
తే. గేనుఁగు నకు గుఱ్ఱములు వేయేసి పాటి హయము హయమున కట్ల గోచయ మమర్చి భూరిభూరియుతంబుగ భూసురులకు నొసఁగినట్టి భగీరథుఁ డున్న వాఁడె.
7_2_203 సీ. అర్థి విశ్వావసుం డాదిగాఁ గలుగు గంధర్వులు హృద్యవాదన మొనర్ప నస్సరోనికురుం మాటలుఁ బాటలు నై వినోదింపంగ నమర గణము బహువిధాలంకార భంగులు విన్నాణములు సూప దివ్యమునులు నుతింప మనుజలోకం బెల్లఁ గనకాన్న వస్త్ర భూషణ దానములఁ దృప్తి సనఁగ నశ్వ
ఆ. మేధ సమితిఁ శేసి మెప్పించె నింద్రుని శతతమాధ్వరమున నతఁడు హయము నాస పడిన నిచ్చె నా దిలీపునిఁ జూపు మా ధరిత్రి నిపుడు మనుజ నాథ.
7_2_204 సీ. జనన మాదిగఁ బాక శాసనుకరమునఁ బ్రభవించు నేయును బాలుఁ ద్రావి ద్వాదస దినము లాతఁడు గావింపంగ వర్థిల్లి పండ్రెండు వత్సరముల ప్రాయమై రాజ్య సంప్రాప్తికి నేతెంచి యర్కుని యుదయంబు నస్తమయము నగుపట్లు పొలిమేర లైన మహాక్షేత్ర మంతయు నొక్కొండ యనుభవించి
ఆ. యన్న పర్వతముల సాజ్యనదుల విప్ర భోజనము లొనర్చి రాజసూయ ములును నశ్వమేధములుఁ జేసె మాంధాతృఁ డింత నిలిచెనే నరేంద్ర ముఖ్య.
7_2_205 సీ. అనిమిషాసుర యుద్ధమున వసురావళి సమయించి వర్ణాశ్రమముల నేర్ప రించి భూమి యలంకరించి యగ్నిష్టోమ హయమేధ వాజపేయాతి రాత్ర పౌండరీకము లనఁ బరంగిన యధ్వరంబు లనేకములు సేసి భూసురులకు నఖిల భుములఁ గల యర్థంబు లెల్లను దన కని యేమియు నునుప కిచ్చె
ఆ. శుక్రునల్లుఁ డనఁగ శోభిల్లు తనయందు ధర్మతత్త్వ మూర్జితముగ నియమ నిష్ఠుఁ డై యయాతి నెగడె శాశ్వతుఁ డయ్యె నే నృపాల యమ్మహీశ్వరుండు.
7_2_206 సీ. ఓర్వక పెక్కండ్రు రుర్వీశు లొక్కటఁ బైనెత్తి వచ్చిన భండనమున వారహేతిచ్ఛత్ర వాహన ధ్వజములు నఱికిన నడు నడు నడిఁకి వార ల భయంబు వేఁడిన నందఱఁ గృపఁ గాచి యేలె నీ పెన్నేల యెల్లఁ దాన కొని యధ్వరములు పెక్కు లొనర్చి వేడుకఁ బాయసమ్ములు నపుపములు మోద
ఆ. కములు లోనుగాఁగఁ గల వంటకముల ను ర్వీసురావళులకుఁ బ్రీతిఁ జేసి దక్షిణలుగ మణివితానంబు లిచ్చిన యంబరీషుఁ డేమి యయ్యెఁ జెపుమ.
7_2_207 సీ. లక్ష భార్యల నుపలాలించి యొక్కొక్క వెలఁదికి వేవురు నేవు రాత్మ జులు గాఁగఁ బదికోటు లలఘు మూర్తులఁ గాంచె వారును దోర్బలోజ్జ్వలులు నార్య చరితులు నై పేర్చి తురగ మేధంబు లందఱు బహుదక్షిణోదాత్త భంగిఁ జేయుచుఁ దనపంపు సేసి వర్తింపంగఁ దానును విశ్రుతాధ్వరము లొప్పఁ
తే. బెంపు సొంపును సువ్రత సంపదయును నిర్మల శ్రద్ధయును కర్మ నిపుణతయును నెఱయ శశిబిందుఁ డొనరించి నెగడె నతఁడు వడయఁ జాలెనె యెన్నఁడుఁ జెడని యొడలు.
7_2_208 సీ. అదిక తపంబున నగ్ని నారాధించి ప్రత్యక్ష మగుటయు బ్రహ్మచర్య వృత్తంబు దమమును వేద విత్త్వము నహింసయు బాత్రదనంబు శమము వరము గాఁ గోరికొని వేదికాస్థలి మణికనకాత్మిక యై ముప్పదాఱు యోజ నముల దైర్ఘ్యము నంత కమరు విస్తారంబుఁ గలుగంగ నొనరించి క్రతువు సేసి
తే. విప్రతతులకు దాని నతి ప్రియముగ నిచ్చి తనపేర గయ నుతి కెక్క వటము పొగడు వడయంగఁ బుణ్యుఁ డై నెగడె గయుఁడు భూవరోత్తమ యతఁ డెందుఁ బోయెఁ జెపుమ.
7_2_209 సీ. ఇరువది వేవురు పరిణత పాచకు లభ్యాగతులకును నతిథులకును బాటించి క్రొత్తగాఁ బవలును రేలును వలయు నన్నము లిడ వెలసెఁ బశువు ల్థనుత్తమ గతి కై తాను చనుదేర విశసించు నమరులు వేడ్కతోడఁ బొడసూపి కడుపారఁ గుడువ హవిర్భాగములు నెట్లు నివ్విధమున మహాద్భు
తే. తముగ నొనరించె సత్త్రయాగము దదుత్స వంబు గొనియాడ వచ్చిన వార లెల్ల బ్రచుర పుణ్యాత్ముఁడన నొప్పె రంతిదేవుఁ డవ్విభునకును వలసె లోకాంతరంబు.
7_2_210 సీ. శరభ సింహ వ్యాఘ్ర సత్త్వ చయంబుల నేడిక లెట్లట్ల యెక్కి యాడి కట్టుటు విడుచుచుఁ గణ్వాశ్రమంబున దమియింపఁగా సర్వదమన నామ మిడియె నమ్ముని పదంపడి మహారాజ్య పదస్థుఁ డై కాళింది తటము నందు భాగీరథీ తీర భాగంబునను సరస్వతి సమీపంబున వాజిమేధ
తే. రాజసూయాది వివిధా ధ్వరము లొనర్చి కనక నర్మిత కరి తురంగ మరథంబు లసదృశ ప్రీతి విప్రుల కొసఁగె భరతుఁ డన్నరేంద్ర చంద్రుండును జన్నవాఁడ.