ఆ భా 7 1 361 to 7 1 397
7_1_361
వ. అతండు మాయావి యగుట ననేక మాయలు గల్పించిన మొగిళ్లు వరసి పాషాణ వృక్ష వివిధాయుధంబులు వివ్వచ్చుపైఁ గురిసెం బదంపడి తమం బడరెఁ బిదప నీళ్లు వెల్లిగొనియె మఱియు మహోరగ శార్దూలాది క్రూర సత్వంబులు గవిసె వారి నెల్లను దోడ్తోన దివ్యాస్త్ర వేదియగు సవ్యసాచి యడంగించి యల్లని నగవుతో నిట్లనియె.
7_1_362 క. మాయలు జూదముతోడన పోయెం గా కింక నిచటఁ బొసఁగునో యవి మ త్సాయకము లడ్డసాళ్లే నీ యాచవి లేదు పొమ్ము నిలువక మామా.
7_1_363 క. అని పలికి వాలుటమ్ములు తనువున నినుచుటయుఁ గలఁగి ధైర్యము మానం బును వీటిఁబోవఁ బాఱెను జననాయక నీ మఱంది సరివారు నగన్.
7_1_364 ఉ. ఆతఁడు వాఱినం దెరలు నచ్చటి సేనలఁ గాల్కొనంగ నీ కాతత బహువీర్యుడు బకారియు సాత్యకియుం గడంగి తో డై తన పార్శ్వ భాగముల నార్చుచుఁ దోలఁగఁ దోలె ఖేచర వ్రాతము మెచ్చఁ గ్రీడి కురురాజును ద్రోణుఁడు నున్న నేలకున్.
7_1_365 ఆ. బలము విఱిగి రెండుపాయ లై యిట్టు ల మ్మనుజ విభుని గురుని మఱువు సొచ్చె ద్రోణుఁ బొదువుఁ డనుచు దుర్దమలీల నా దిక్కు వారు గవిసి రుక్కు మిగిలి.
7_1_366 క. చనుఁ డడ్డం బాచార్యున కను నెలుఁగుల తోడ నీ సుతావలి వెస మా ర్కొనుటయు మన సేనలు పురి కొని పాండవ బలముఁ దాఁకెఁ గురు వంశ నిధీ.
7_1_367 క. గురుఁ డొడ్డుగఁ దమకంబునఁ గురువీరులుఁ బాండుపుత్రకుల యోధులు ని ర్భర సమర ద్యూతకళా నిరతిం గ్రీడించి రుగ్ర నిపుణత మెఱయన్.
7_1_368 క. శరగురుఁ డెచటికిఁ దఱిమిన వెరవున నచ్చటికి నెల్ల విక్రాంతి ధురం ధరుఁ డు ధృష్టద్యమ్నుఁడు బరవసము దలిర్ప నడ్డపడి పోరాడెన్.
7_1_369 చ. కురుపతి ధర్మనందను లకుఠింత విక్రమ కౌతుకంబునం బురికొలుపంగ సైన్యములు వోక పెనంగెడు రౌద్రభంగి క చ్చెరువడు యున్కి నిట్లు లని చెప్పఁగ నిప్పుడు నేర నయ్యెదం గరిపురనాథ చూడ వినఁ గల్గునె యమ్మెయికయ్య మెయ్యెడన్.
7_1_370 వ. అట్టియెడ.
7_1_371 క. నీలుఁ డనురాజు గురుసుతు పై లీలం దేఱు వఱపఁ బటు విశిఖమునం గీ లెడసిన జంత్రము క్రియ నేలం బడ నేసె నతఁడు నృపుఁ డగ్గింపన్.
7_1_372 క. చచ్చిన నీలునిఁ గనుఁగొని విచ్చిన సైన్యంబు గురుఁడు వెనుకొనుటయు వే వచ్చిన ధృష్టద్యమ్నుని నచ్చిన యబ్బలము మగిడినం బో రొప్పెన్.
7_1_373 వ. అప్పుడు సంశప్తకులు నారాయణ గోపాల బలంబులం గూడికొని పఱతెంచి.
7_1_374 క. ఓడితిమె మేము రణమునఁ గ్రీడికిఁ గ్రేడించి రాక గెలుపే యతఁ డేఁ డీ డాఁగి పోయెనొకొ మా తోడిబనర మిట్లు దాను దొలఁగినఁ దెగునే.
7_1_375 వ. అను నెలంగులు నింగి ముట్ట దక్షిణ భాగంబునం గవిసినం గవ్వడి యట నడచి వారికిం గయ్యం బిచ్చిన న త్తెఱపి గని తఱుము కౌరవ యోధులకోలు తలకుం గాక దమసేనలు దెరలిన భీమసేనుం డదల్చి మార్కొని.
7_1_376 క. తల మిగిలి వచ్చు బాహ్లికు నిలు మని విశిఖముల నొంచె నృపతియు గురు క ర్ణులు నశ్వత్థామయు న మ్ముల వానలు గురిసి రొక్కమొగి నతని పయిన్.
7_1_377 వ. అతం డందఱ కన్ని రూపు లై యార్చుచు నేట్లాడె నిట్లొక్కనిం బెక్కండ్రు వొదివినం గనుంగొని కౌంతేయాగ్రజుండు పురికొలుప నకుల సహదేవ సాత్యకి సౌభద్రు లా సమీర పుత్త్రునకు బాసట యై దుర్యోధనాతులం దలపడుటయు రెండు సేనలు గలయన్ బెరసె నిట్లపరాహ్ణంబునం గ్రందుకయ్యం బయ్యె నం దరదంబులు దాఁకు పెల్లువ డొల్లుకరులును గరవాల ధారలఁ గాననగు కుంభికుంభమౌక్తికంబులును దురగ ఖర పుటంబులం గరటి రదంబులను బెనంగొనుచు వ్రేలు ప్రేవులును దెగిపడియు నంకుశంబలు విడువక మిట్టి మిట్టి పడు బాహువులును దొండంబులం బెనఁచి యెత్తినం దారును హయంబులు వ్రేలురావుతులును ముందఱికాళ్లు దెగవ్రేసిన మ్రొగ్గి కూలు శుండాలంబులును సామజంబు లడరి రథ్య సారథి రథిక సహితంబుగా మల్లడిగొనం ద్రొక్కిన నేలం గలసిన రథంబులును నాశ్వికు లొక్కమొగిఁ జెక్కినం దునిసి పడి యేమిటి యంగంబులో యను సందేహంబునకుం బట్టలు యున్న పదాతి గాత్ర ఖండంబులును జూచు ఖేచరులకు వెక్కసం బొనర్చె నట్టి సంకుల సమరంబున ధృష్టద్యమ్నుండు.
7_1_378 క. మన కిది సమయము సుండీ యని ద్రోణునిఁ జూపి తఱుమ నమ్మొన రథికుల్ గని పొదువుఁడు సంపుఁడు పోరి గొనుఁడు దునుముఁ డనుచుఁ గూడుకొని యతని పయిన్.
7_1_379 చ. కవిసిన నమ్మహా భుజుఁడు గన్నుల దట్టపుఁగెం పెలర్ప భై రవముగ దివ్యబాణ నికరం బడరించినఁ దేఱి చూడ రా క వెఱఁగు నొంది చిత్తములకై వడి నా ఘనయోధు లుండ నీ రవుతులు జోదులున్ రథిక రాజియు వారమొనల్ గలంపగాన్.
7_1_380 మ. తను నత్యుద్ధతిఁ బిల్చి దుర్దమ భుజా దర్పంబు శోభిల్లఁ దాఁ కిన సంశప్తక కోటి నొంచి సమర క్రీడా కళా కౌతుకం బున నాభీల కపీంద్ర కేతన పరిస్ఫూర్జత్ప్రభాజాలముల్ వినువీథిం బరగంగ వచ్చె మగుడన్ వివ్వచ్చుఁ డచ్చోటికిన్.
7_1_381 క. చిచ్చునకుఁ దోడు గరువలి వచ్చిన క్రియ భీము కడకు వాసవి యిమ్మై వచ్చిన మన యోధావళి ఱిచ్చ వడియె వారి మొన దఱిమికొని వచ్చెన్.
7_1_382 ఉ. బాసట యై వృకోదరుఁడు పార్శ్వమునం దఱుమంగ వైరి సం త్రాసనమూర్తి వాసవి శరప్రతతిం దొరఁగించి ద్రోణును ల్లాసము మాన్చి కౌరవ బలంబులు నెత్తురువెల్లిఁ దేలఁగాఁ జేసినఁ గర్ణ కర్ణ మముఁ జేకొనవే యనుచున్ భయంబునన్.
- కర్ణార్జునుల యుద్ధము – సం. 7-31-49, 50
7_1_383 క. తన వెనుక దెసకు పాఱిన ఘన యోధులఁ జూచి బాహు గర్వస్ఫూర్తిం దనరుచు నోడకుఁ డోడకుఁ డని పలుకుచుఁ దాఁకెఁ గర్ణు డమరేంద్ర సుతున్.
7_1_384 వ. ఇట్లు దాఁకి యతనిపై నాగ్నేయాస్త్రంబు బ్రయోగించిన నతండు వారుణ బాణంబున వారించి వాలమ్ములు గురియం గూడుకొని భీమ సాత్యకి ధృష్టద్యుమ్నులు శరత్రయంబులు సూతసూనుమేన నాఁటించిన నతండు గాండీవ నిర్గత చండమార్గణంబుల మగిడించుచు నమ్మువ్వుర చాపంబులు నవ్వుచుం ద్రుంచి వారలు శక్తులు నైన వానిం దునిమి పేర్చి యార్చిన నర్జునుండు నారాచ సప్తకంబున నవ్వీరు నొప్పించి యతనిం దలకడచి తన్నుఁ దలపడిన యతని తమ్ముల తలలు మూఁడును భూమిదేవికి బసి సేసె నంత భీముండు రథంబు డిగ్గి వచ్చి గదా దండంబునఁ గర్ణ బంధువులం బదివేవురం బడలు వఱిచి మరలి రథస్థుఁడై వేఱొక్క విల్లు గొని విశిఖమంబులు వఱపి యంగపతి యంగంబులం దురంగ శరీరంబులను నొప్పించె నాలోనన యప్పాంచాల వర సుతుండును శైనేయుండును నొండు విండ్లు గొని యతని సారథి యొఱగను జాపంబు విఱుగను వేసి రా సమయంబున దుర్యోధనుండును ద్రోణ జయద్రథులును నెయిది శాత్రవ సముద్రంబున మునుంగకుండ నా రాధేయు నుద్ధరించి రట్టియెడ.
7_1_385 క. ఉబయ బలంబులుఁ బురికొని యిభ రథ తురగ భటతతి మహిం గూలఁగ న క్షుభితము లై పోరాడెం బ్రభువులు వెను దన్ని చూడఁ బార్థివ ముఖ్యా.
7_1_386 సీ. కాలువలై పాఱు కీలాల జలమునఁ దేలి పోయెడు మృత దేహములును బ్రేవుల ప్రోవుల పెల్లునఁ జిత్రితచ్ఛాయంబు లగు మాంస సంచయములుఁ గరి హయంబుల కళేబరముల క్రింద గొండొక తోఁచు భట గాత్ర నికరములును దలల పందఱచులో మిలమిల మెదలెడు కర పదంబుల నవ ఖండములును
తే. రౌద్ర భీభత్స నర్తన రంగ భంగి నపుడు సమరాంగణము ఘోర మయ్యెఁ జూడ ద్రోణ ఫల్గున నిష్ఠురోద్ధుర నివాత జాత మగు నమ్మహోద్భట సంకులమున.
7_1_387 వ. అంతం బతంగుండు పశ్చిమా చలంబునవులకుం జనిన సంధ్యా రాగంబు సొంపునఁ గెం పినుమడించు నెత్తురు మడువుల నోలలాడు భూత బేతాళంబులను శవ కబళ నలోలంబు లగు సృగాలంబులను మాంస చర్వణ కోలాహల బహుళంబులగు కంకగృధ్రాది పక్షి కులంబును జూచియుఁ బాండవ బలంబు సమయ సముచితం బగు సమర విరామంబునకు నున్ముఖం బగుట యెఱింగియు మున్ను సవ్యసాచి యురవడికిం గాక తమ మొన దెరలుచునికిం జేసియు నదియు మెయిగా నాచార్యుండు దొరలకుం జెప్పి సేనలం దివియ నియోగించెఁ బాండవ సైన్యంబులును మరలె నివ్విధంబున నుభయ సైన్యంబులు నిజస్కంధా వారంబులకుం జనునవసరంబున మన జనంబులు ద్రోణు ప్రతిజ్ఞా భంగంబును ఫల్గును పరాక్రమ స్ఫురణంబును నతనియెడ నచ్యుతునకుం గల సౌహార్ద విశేషంబులు నుగ్గడించుచు విన్న నై పోయిరి వైగుటయుఁ గయ్యంబునకు వెడలునప్పుడు విషాద వివర్ణ వదనుం డగుచు నీ తనయుఁ డెల్ల యోధులు వినం గుంభ సంభవున కిట్లనియె.
7_1_388 మ. పెనుపారన్ వర మిచ్చి తట్లు గడిమిన్ భీమాగ్రజుం డాజిఁ గి ట్టినఁ బట్టం గడునగ్గ మైనయెడఁ గ్రేడి తెప్డు నిట్లైనఁ జా లని వాఁ డందురు నిన్ను నన్నుఁ గుటిలాలాపంబులను వెఱ్ఱిఁ జే సిన నీ కైనది యేమి యాశ్రిత గుణ శ్రేష్ఠుండు వంచించునే.
7_1_389 వ. అనిన విని గురుం డప్రీతుం డయ్యును గటకటం బడక యతనితో నిట్లనియె.
7_1_390 ఆ. నరుని విక్రమంబు నారాయణుని మహా త్త్వంబు నెఱిఁగి యెఱిఁగి తగునె యిట్లు వలుక ధర్మపుత్రుపైఁ జేయి వదలక వారు రారె పెక్కువరుస లధిప.
7_1_391 ఉ. ఎవ్వరి నెట్లు సేసెదనో యేర్పడఁ జుడుము నేఁడు పోరికిన్ గవ్వడి రాకయుండఁ దొలఁగం గొనిపోవఁగఁ జాలువారి నీ వెవ్వరి నైనఁ బంపు మిది యేటికి నొండొక బుద్ధి సేసెదే నవ్వుచుఁ బల్కినన్ ధరణినాథ యసత్యము గల్గ నేర్చునే.
7_1_392 వ. అనవుడు.
7_1_393 మ. విని సంశప్తకు లేము దక్క నొరు లావివ్వచ్చు భంగించి బె ట్టనికిం బాపి యలంప నేర్ప గలరే యంచున్ వెసం బోయి పి ల్చిన నప్పార్థుఁడు నుద్ధతిం జనుడు నక్షీణోగ్ర శస్త్రాస్త్ర వ ర్తన ఘోరం బగు సంగరం బచట రౌద్రస్ఫీత మైఁ జెల్లగన్.
7_1_394 వ. ఇక్కడ భారద్వాజుండు పద్మవ్యూహంబు గావించినం గౌంతేయాగ్రడు ననుమతి నభిమన్యుం డయ్యొడ్డు భేదించి సొచ్చి బృహద్బల లక్ష్మణ ప్రభృతులగు భూపతులను భూప కుమారులను బెక్కండ్రం బారి సమరి యనేక యోధ వీర విక్రమ సంకులంబునం జిక్కువడి యుక్కు మురిసినట్లు సమసిన మనమొనలు సెలంగుచుం బాండవ బలంబులు పొగులుంచుం దమతమ యునికి పట్లకుం జనియె నని సంజయుండు ధృతరాష్ట్రునకు సౌభద్రుండు వడుట సెప్ప ననిన విని నాఁటి సయ్యంబు కల రూపంతయు నేర్పడ నెఱింగింపు మనుటయు.
7_1_395 ఉ. సాత్త్యవత్య వాఙ్మయ విశాల గృహ స్ఫరిత ప్రదీపితా ప్రత్త్యయ గోచరా విహృతి భగ్న నిశాచర శాంత బోధ సం పత్త్యవినా భవ న్మహిమ భాసుర సంభృత భూ సురాళి సాం గత్త్య వివిక్త యుక్తజన కౌశల భావిత దేవ సేవితా.
7_1_396 క. వేద శిరోమణి చరణా నాందాంత స్సారకరణ నైషిక తరణా భేద రహిత ప్రకారా వాదవిదూరా విరించి వర్య విహారా.
7_1_397 మాలిని. అనుపమ హిత విద్యా వ్యక్త యాగానురక్తా దనుజ మథన లీలా స్తవ్య శాంతాను భావ్యా జనన మరణ దుఃఖోత్సారి సర్వోపకారీ సనక ముఖ యతీంద్రాసన్న నిత్య ప్రసన్నా.
గద్యము. ఇది శ్రీ మదుభయ కవి మిత్త్ర కొమ్మనామాత్య పుత్త్ర బూధారాధాన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతం బయిన శ్రీ మహాభారతంబున ద్రోణ పర్వంబునందుఁ బ్రథమాశ్వాసము.