ఆ భా 7 1 121 to 7 2 150
--ప్రకాశ్ స్వామినాథన్ 4:17, 25 జూన్ 2006 (UTC)
7_1_121
చ. అలవి యెఱుంగ కిమ్మెయి దురాశఁ దలంచిరి గాక ధార్తరా
ష్ట్రులు ద్రిజగంబులుం గొని పటుస్ఫురణం జనుదెంచి రేనియున్
బలవదరాతిపుంజమదభంజన నీ వని భంగపడ్డ నీ
యిల శకలంబులై చెడదె యింకదె వారిధి నింగి గూలదే.
7_1_122
ఆ. వారితలఁపు వొసఁగ నేరదు పోరఁ బ
రాభవంబు మనకు రా దెఱుంగు
కలన నద్దురాత్మకులచేత నాతలం
పిట్టు లున్నయది నరేంద్రముఖ్య.
7_1_123
వ. అని పలికిన విని యుధిష్ఠిరుండు సంతుష్టాంతరంగుండై శంఖభేరీమృదంగాది
సంగరమంగళతూర్యస్వనంబులు సెలంగ సకలసైన్యసమేతంబుగా వెడలి
నడచి మొగంబున నెలమి నెలకొనం గ్రౌంచవ్యూహం బమర్చె నం దగ్ర
భాగంబున.
7_1_124
మ. ధవళాశ్వంబులుఁ బూని కేతనకపీంద్రస్ఫూర్తిమార్తాండమూ
ర్తి విడంబింపఁగఁ జక్రగాండివధరుల్ దేజోమయాకారవై
భవ మారం దనపై వెలుంగ నతిదీప్తంబైనతేరొప్పె శా
త్రవసంఘెబు మనంబునన్ భయము గూరం గాలచక్రాకృతిన్.
7_1_125
క. ఆరథముకెలన నుజ్జ్వల
ధీరోద్భట రేఖ మెఱసె ధృష్టద్యుమ్నో
దారస్యందన ముద్ధత
సారథికముఁ జారురంగచటులాశ్యము నై.
7_1_126
వ. మఱియు వృకోదరాదిసోదరులను నభిమన్యుప్రభృతికుమారులను బాంచాల
పత్రిప్రముఖబాంధవులను ధృష్టకేతుముఖ్యదండనాయకులను దక్కునుం గల
పరివారంబును దగ నయ్యైయెడల బలుపును బొలుపును గలుగ నిలిపి
యుధిష్ఠిరుం డమ్మోహరంబునడుమ నుదాత్తసన్నాహంబునను గంభీరో
త్సాహంబునను బొలిచి నిలిచె నంతకు మున్న యక్కడ.
7_1_127
క. మనవారును రణకౌతుక
జనితోద్యమతీవ్రు లగుచు శికటవ్యూహం
బొనరించిరి యొప్పును బెం
పును దర్పము నుల్లసిల్ల భూవరముఖ్యా.
7_1_128
వ. అందు వలపట సింధురాజకళింగపతిసంగతుం డయిన వికర్ణుండును నతనికి
బాసటయై చటులహయబహుళం బగుబలంబులతో నక్కెలన సౌబలుండును
డాపటఁ గృతవర్మవివింశచిత్రసేనసమేతండై దుశ్శాసనుండును నతనికిఁ
బ్రాపై తత్పార్శ్వంబునఁ గాంభోజశకయవవమహీశ్వరులును నడుమం
ద్రిగర్తమద్రశిబిశూరసేనదేశాధీశపరివృతుండును గుంభసంభవపురస్సరుం
డునునై కరు భుండును నాముందట నంగజనపరచతురంగప్రథానసేనా
సముదీర్ణండై కర్ణుఁడును నిలిచిరి వెండియుం గలవార లెడ నెడం బన్ని
రట్టియెడ.
7_1_129
తే. దర్పదుస్సహతేజు రాధాతనూజుఁ
దిలకమైసైన్యముఖమునఁ బొలుచువాని
సైనికులు సూచి కడుసంతసమున నేచి
యెలుఁగు లడరంగఁ దమలోన నిట్టు లనిరి.
7_1_130
మ. అని రాధేయుఁడు పాంచనందనులబాహాశక్తి మాయించు నీ
తని దేవావలియైన మార్కొనునె దుర్దాంతుండు భీష్ముండు పో
రినయన్నాళ్లును బక్షపాతమున వారిం బట్టి పాలార్చెఁ గా
క నిజం బల్గ నితండు ధీరు లగు టింకం జెల్లునే వాంకిన్.
7_1_131
వ. అని యుబ్బుచుండి రవ్విధంబున నన్నాహంబు సువిహితం బైనయనం
తరంబ.
7_1_132
చ. తగ మనసైన్యమన్ గురుఁ డుదగ్రగతిన్ నడపింపఁ జొచ్చుడున్
గగనతలంబు నెత్తురులుఁ గండలు నెమ్ములు నొక్కయుమ్మడిన్
మొగిళులు లేకయుం గురిసె మొత్తములై పెనుగ్రద్దలాడె బె
ట్టుగ వివిచెన్ శివారుతము డుల్లెఁ గడున్ వడి నుల్క లెల్లెడన్.
7_1_133
తే. అమ్మహోత్పాతములకు భయంబు గొనక
కౌరవులు శంఖములు మ్రోయ భేరు లులియ
నగ్గలిక స్న నడపించి రంత సమద
గమనమున వారిసేనయుఁ గదియ నడచె.
7_1_134
వ. అప్పుడు.
7_1_135
క. నరుండును రాధేయుఁడు నొం
డొరువులతోఁ బెనఁగువేడ్క లుల్లంబులలో
గురువులు వాఱఁగ నిలిచిరి
యిరుదెఱఁగుల సైనికులకు నేడ్తెఱ మిగులన్.
7_1_136
తే. ఇట్టు లొండొంటిఁ గదియంగ నెలమి నడచి
బలము లొక్కింతసేపు నిశ్చలతఁ బొలిచె
మవ్వ మెసఁగువనంబుల మావు లెంత
యైనఁ జెలువార సొగసి యున్నట్ల పోలె.
7_1_137
క. తదనంతరంబ ద్రోణుం
డుదితార్కునిఁ గ్రోణిసేయు నజ్జ్వలరథ మె
ల్లదిశలు వెలిఁగింపఁగ బె
ట్టిదముగ మును గవిసె మొన గడిమితోఁ గదియన్.
7_1_138
క. మనబలము గదియుబలువిడిఁ
గనుఁగొని యర్జునుఁడు దొలుతఁ గవియఁగఁ బేరు
బ్బునఁ దఁకె వారిసైన్యము
వినువీథి నమర్త్యగణము వేడుకఁ జూడన్.
7_1_139
సీ. రథకరితురగోత్థ వృథివీపరాగంబు దెసల నాకసమున దీటుకొనఁగ
బాణాదిహేతిసంపాతజాతము లగుమంట లర్కాంశుల మరలఁ ద్రోవ
హస్తికపాలరథావయవములు భగ్నము లగురవము లుగ్రముగఁ జెలఁగ
వివిధ సేనాంగాంగవిదళనంబునఁ గ్రమ్మురక్తపూరములు ఘోరఁబు గాఁగఁ
తే. గలయ బెరసినపాండవకౌరవప్ర
చండసైన్యద్వయంబు నుద్దండసమర
గతులు వెక్కస మొనరించె ఖచరసాధ్య
సిద్ధులకు ననుబోంట్లకుఁ జెప్ప నేల.
7_1_140
వ. ఇవ్విధంబునం దొడంగి చెల్లు సంకులసమరంబునం దనకనకరథం బరుణతురం
గంబుల చటులచిత్రసంచారంబునం గొఱవి ద్రిప్పిన తెఱంగున నేదిక్కు
సూచినం దానయై పెక్కురథంబు లనుబుద్ధి పాండవ పాంచాలయోధులకుఁ
బట్టునట్లుగా విహరించి వివిధ విశిఖనిచయంబులు నిగిడించుచుఁ గుంభసంభ
వుండు.
7_1_141
క. కూల్చుచు గజముల నెత్తుటఁ
దేల్చుచుఁ దురగముల వీఁకఁ దేరులు మరలన్
వెల్చుచుఁ గాల్బలములఁ బొరి
మాల్చుచు రౌద్రముగ మారిమసఁగనభంగిన్.
7_1_142
వ. సంగరక్రీడ సలుపు నయ్యవసరంబున.
7_1_143
క. సాయవడు రథచయంబులు
సాయకహతిఁ జెదరుఁ బ్రళయ జలధర పటుగ
ర్జాయతతర్జనలీలఁ బ
లాయిత మగు పాండు సుతబలంబు నరేంద్రా.
7_1_144
క. పొదువుచు విచ్చుచు బలువిడి
నెదురుచుఁ బాఱుచును మఱి మహీభాగము గ్ర
క్కదలం గార్ముకవిద్యా
విదుఁ డగుగురుతోడఁ బోరె వివిధబలంబుల్.
-: ద్రోణుఁడు పాండవసైన్యంబుపై రేఁగి దివ్యాస్త్రంబులశ క్తి సూవుట :-
7_1_145
వ. అట్టి యెడ నాచార్యుండసమానశౌర్యంబును మాననీయదోస్సారంబును
దివ్యాస్త్రప్రభావంబును జూపినం గౌంతేయసైన్యంబునందు.
7_1_146
సీ. తఱుచుగాఁ దెగిపడ్డధవళచామరములు డిండీరములయొప్పుఁ బుండరీక
ములు మరాళంబులపొలుపును గరవాలములు మీనభంగియుఁ దలలు శిలల
చాడ్ఫును దేశముల్ శైవాలరేఖయు మాంసంబు పంకసమానతయును
దాల్ప భటాశ్వమాతంగాంగభగ్నరథముల తిట్టలు పులినములు గాఁగఁ
తే. ధీరవరకోటి ద్రెళ్ళినవీరతతికి
సంభ్రమము పుట్ట సంభృతోత్సాహలీల
నుబ్బి భూతబేతాళంబు లోలలాడ
నిట్టలం బగు నెత్తురుటేరు వఱసె.
7_1_147
వ. అప్పుడు.
7_1_148
తే. గగనమధ్యంబునకు వచ్చి ఖరకరుండు
దేఱి చూడంగ రాక యుద్దీప్తుఁ డగుచు
నెట్లు వెలుఁగొందు ద్రోణుండు వెలుఁగు
చున్నఁ గనుఁగొని ధర్మజుం డురవడించి.
7_1_149
వ. ధనంజయ ధృష్టద్యుమ్నులనాలోకించి యమ్మహావీరు వారించుటకు నియో
గించిన.
7_1_150
శా. చంచత్తుంగతురంగసత్వరగతి స్ఫారీభవత్కేతనొ
దంచద్దీప్తులు ప్రజ్వరిల్ల నతిసాంద్రంబై శరశ్రేణికా
సాంచారంబు నితాంతఘోరముగ నాచార్యున్ పడిం దాఁకె న
ప్పాంచాలక్షితిపాలనందనుఁడు శుంభద్వీర్యసంరంభుఁ డై.