వోలం సురేష్ కుమార్


3_6_271 వ. ఆ వైశ్రవణుండు దన తండ్రి యగు పులస్త్యుని విడిచి తాతయగు చతుర్ముఖునకుం దపంబు సేసి నలకూబరుం డను కొడుకును లోక పాలకత్వంబును ధనేశ్వరత్వంబును లంక యను పురంబును శంకరు తోడి సఖ్యంబును వరంబులుగాఁ బడపి మహా విభూతితో వర్తిల్లుచున్నం గని యలిగి పులస్త్యుండు నిజ శరీరంబునం దర్ధంబున విశ్రవసుం డను వాని సృజియిచి యావైశ్రవణున కహితంబు సేయు మని పనిచిన నెఱింగి కిన్నరేశ్వరుండు విశ్రవసు పాలి కరుదెంచి మహాత్మా యేను నీకుం బుత్త్రుండ నయ్యెద నాకుం గరుణింపు మని యతనిం బ్రసన్నునిం జేసి నృత్త గీత విద్యా విశారద లయిన రాక్షస స్త్రీలం బుష్పోత్కటయు మాలినియు పాకయు ననువారి మువ్వుర నవ్విప్ర వరునకుఁ బరిచారికలం గా నిచ్చిన.

3_6_272 క. పురుడున నయ్యువతులు నొం డొరులం గడవంగ విలస దుపాచార సమా చరణ ప్రవీణ భంగులఁ బరితోషితుఁ జేసిరా తపస్వి వరేణ్యున్.

3_6_273 వ. ఇట్లు ప్రీతుం డై యతండు వారలకుఁ బుత్త్రదానంబు సేసిన నందుఁ బుష్పోత్కటకు రావణ కుంభకర్ణులును మాలినికి విభీషణుండును పాకకు ఖరుండును శూర్పణఖ యను కన్యకయు మిథునం బై ప్రభవించి రక్కుమారులకు నలువురకుఁ దజ్జనకుండు జాతకర్మాది సంస్కారంబు లొనరించి సగౌరవంబుగాఁ బెనిచి యుపనీతులం జేసెనందు.

3_6_274 ఉ. ఆతత తేజుఁ డున్నత భూజాగ్రుఁడు లోక భయంకరుండు వి ఖ్యాత పరాక్రముండు దశకంఠుఁడు సంతత రోష మానసుం డాతని యట్ల దుర్మదమయాత్ముఁడు క్రూరుఁడు గుంభకర్ణుఁడున్ భీతి విదూరుఁ డార్యుఁడు విభీషణుఁ డుత్తమ చిత్తుఁ డారయన్.

3_6_275 క. ఖరుఁడు ఖరతేజుఁ డవనీ సుర పరిభవకారి మాంస శోణిత భుజుఁ డు ద్దుర చిత్తుఁడు శూర్పణఖయు దురిత చరిత ధర్మకర్మ దూషిత యెపుడున్.

3_6_276 వ. ఆ రాక్షస కుమారులు దండ్రి వలన నఖిల వేద వేదాంగ ధనుర్వేద పారగులై గంధమాదన గిరియందు సుఖంబుండి యొక్క నాఁ డతనికి మ్రొక్కవచ్చు వాని నధిక విభవ సమన్వితు వైశ్రవణుం జూచి తత్ప్రభావంబు దపోలబ్ధం బగుట విని జాతమత్సరు లయి తారును బితామహు నుద్దేశించి తపంబు సేయం దొడంగిరి తత్ప్రకారంబు వినుము.

3_6_277 తే. మండు వేసవిఁ బంచాగ్ని మధ్యమున ఘ నాగమంబున బయల నత్యంత తుహిన సమయమున నీరియందు నిశ్చలత నిలిచి దశముఖుఁడు వాయు భక్షుఁడై తపమొనర్చె.

3_6_278 మ. నియతాహారుఁడు నిర్జితేంద్రియుఁడునై నిష్కంప వృత్తిన్ మహీ శయనుం డై వ్రతముల్ చరించె నధికెచ్ఛం గుంభకర్ణుండు ధై ర్యయుతుం డై ఘనుఁ డవ్విభీషణుఁడు పర్ణాహార వృత్తిన్ జపా ధ్యయనాసక్తిఁ దపంబు సేసె మది నత్యంతంబు సంశుద్ధితోన్.

3_6_279 వ. ఖరుండును శూర్పణఖయు వారికిం దగిన పరిచర్యలు సేయుచుండి రంత సహస్ర వర్షంబులు నిండినం బంక్తి వదనుండు దన మస్తకం బొక్కటి ఖండించి మండెడు నగ్నియందు వేల్చి మఱియు వేయేండ్ల కొక్కటిగాఁ దలలు దొమ్మిదియుం దఱిగి వేల్చి ధైర్యంబు దఱుఁగక పదియగు తలయును ద్రెంప సమకట్టినఁ బితామహుండు ప్రత్యక్షం బై వారించి వాని శిరంబు లెప్పటియట్ల కలుగ నొసంగి యమరత్వంబు దక్క నొండు నీ కభిమతం బగునది యెయ్యది యైనను నడుగు మనుటయు నన్నిశాచరుండు.

3_6_280 శా. దేవా యేను సమస్త దైవ పితృ దైతే యాహి గంధర్వ ర భో విద్యాధర యక్ష జాతులకు నక్షోభ్యుండగాఁ బ్రీతితో నీ విశ్వంబునఁ గామ రూపగతి నాత్మేచ్ఛా విహారుండఁగా నీవే నావుడు వాని కవ్వర మజుం డిచ్చెం గృపా లోలతన్.

- బ్రహ్మ రావణ కుంభకర్ణ విభీషణులకు వరంబు లిచ్చుట – సం. 3-259-26

3_6_281 వ. మనుష్య జాతి యెక్కండు దక్క నీ చెప్పిన యందఱ వలనను నీకు మరణ భయంబు లేదని పలికి పరమేష్ఠి గుంభకర్ణుం జూచి వరం బడుగు మనిన వాఁడు దైవోప హతుండై తనకు నాత్యంతికం బైన నిద్ర యడిగిన నట్ల యగునని విభీషణున కభి ముఖుం డగుటయు నతండు కృతాంజలి యై జలజాసనుఁ బ్రస్తుతించి.

3_6_282 క. పరమాపద యైనపుడును దురితంబులు నా మనంబు దొడరమియును భా సుర మగు బ్రహ్మాస్త్రంబును గరుణింపవె యనిన నిచ్చి కమలజుఁ డనియెన్.

3_6_283 క. నిరతము రాక్షస భవమును బొరసియు నీ విట్లు ధర్మబుద్ధి వగుట య చ్చెరువిది గావున నీకును దిరముగ నమరత్వ మిచ్చితింత గృప వత్సా.

3_6_284 వ. అని పలికి పితామహుం డంతర్హితుం డయ్యెఁ దదనంతరంబ.

3_6_285 మ. వర గర్వోన్నతుఁడై దశాననుఁడు దుర్వారోద్ధతిన్ దాడిమై నరిగెం గిన్నరనాథు పై నతఁడు కార్యం బాత్మ నూహించి సం గర సన్నద్ధుఁడు గాక కింపురుష యక్ష శ్రేణితోఁ గూడఁ దా నరిగెన్ లంకఁ బరిత్యజించి రభసోద్యత్పుష్పకారూఢుఁడై.

3_6_286 వ. ఇట్లతుం గంధమాదనంబుకుం జను నెడ వెన్నడిం దగిలి దానవుండు వాని విమానంబు తోన విమానంబు నపహరించినం గనలి యక్షేశ్వరుండు గురుండ నగు న్ను నవమానించితివి గావున నివ్విమానంబు నీ పగతు పాలయ్యెడు మని శపించె నంత.

3_6_287 క. రాక్షస లక్ష్మీ మహిమకు రక్షకుడుగఁ బంక్తిముఖుని రాక్షస మాయా దక్షు నభిషిక్తుఁ జేసిరి రాక్షస బేతాళ వరులు రాగం బెసఁగన్.

3_6_288 వ. వాఁడును బల దర్ప మోహితుండై కడంగి యింద్రాది దేవతల నొడిచి తత్పదంబు లాక్రమించి యీసు మిగిలి జగద్రావణంబు సేయుటం జేసి రావణుండను పేర బ్రఖ్యాతి వహించి సకల భూత భయంకరుం డయ్యె నట్టి యెడ దేవర్షులును రాజర్షులును గూడి చని తత్ప్రకారం బగ్ని దేవునకుం జెప్పిన నతండు వారిం దోడ్కొని వారిజాసను పాలికిం జని యిట్లనియె.

3_6_289 ఉ. భూరిభుజుండు విశ్రవసు పుత్త్రుఁడు పంక్తి ముఖుండు దర్పదు ర్వారుఁడు రాక్షసేంద్రుఁడు భవద్వర శక్తి నవధ్యుఁడై మహా ఘోరముగాఁ ద్రిలోకములకుం గడుఁ బీడ యొనర్పఁ జొచ్చె వృ త్రారిపురోగమ త్రిదశు లందఱుం గింకరు లైరి వానికిన్.

3_6_290 ఉ. దానవు చేతఁ గష్టపడి దైన్యము నొందులు కోర్వలేక నీ దైన పదాంబుజంబు లభయం బని చేరితి మింక మమ్ము నె ట్లైనఁ గృపార్ద్ర మానసుఁడవై తగఁ జేకొన వయ్య మాకు ది క్కైనను కాకయున్నఁ గమలాసన నీవ కదయ్య యెయ్యెడన్.

3_6_291 వ. అనినం బరమేష్ఠి వారల కిట్లను నిక్కార్యంబునకు నేను మున్న తగిన యుపాయంబు నిశ్చయించి నారాయణుం బ్రార్థించితి నద్దేవుండు మనుష్య భావంబున నవతరించి యా రాక్షసు వధియించు వాఁ డయ్యె నింద్రాది సురులును దమ తమ యంశంబులం జేసి ఋక్ష వానర జాతులయందు జనియింప గలవారు మీకు భయంబు వలవదని యగ్ని ప్రముఖులైన యమ్మహామునుల సమ్ముఖంబున దుందుభి యను గంధర్వ కామినిం బిలిచి నీవు కుబ్జ రూపంబున మంథర పేర భూ లోకంబున నుద్భవించి నీ నేర్చు విధంబున దేవ కార్యంబులు నిర్వహింపు మని పనిచి వారి వీడ్కొలిపెఁ బదంబడు దివిజుల యంశావతారంబులం జేసి.

3_6_292 మ. గురుశైలోన్నత గాత్రు లుద్ధత భుజోగ్రుల్ వజ్ర పాషాణ క ర్కరు లర్క ప్రతిమాన తేజులు గుణాకల్పుల్ మహా కల్ప భీ కర కాలాంత కల్పు లాజినిపుణుల్ గర్వోన్నతుల్ ఋక్ష వ్ నర వీరులన్ జనియించి రెల్ల యెడలన్ నాగాయుత త్రాణులై.

3_6_293 క. అన విని యుధిష్ఠిరుం డ మ్ముని వరుతో ననఘ ధర్మమూర్తిని నా రా ముని నేల యరణ్యంబున కనిచెను దశరథుఁడు సెపుమ యక్కథ యెల్లన్.


3_6_294 వ. అని యడుగుటయు మార్కండేయుం డిట్లనియె దశరథుడు నిజ సుకృత పాకంబునం జేసి రామ ప్రముఖు లయిన కొడుకుల నలువురం గని త్రైలోక్య రాజ్యంబు సంప్రాప్తం బయిన యట్లు సంతసిల్లె నక్కుమారుల క్రమంబున నుపనీతులు నఖిల వేద వేదాంగ వినీతులు యథా క్రమ పరిణీతులు నై విలసిల్లు నంత.

3_6_295 సీ. అభినవ పద్మ దళాక్షు నక్షీణ విస్తృత వక్షు నాజాను దీర్ఘ బాహు మధుర స్మితానను మద గజగమను నారూఢయౌవను నభిరూప తేజు శ్రీరమణీయుఁ బ్రసిద్ధ యశోరమ్యు నిఖిల విద్యాగమ నిపుణ చిత్తు నింద్ర సమాను జితేంద్రియు ధర్మజ్ఞుఁ బౌరబాంధవ జన ప్రార్థనీయు

ఆ. దుష్ట నిగ్రహైక ధుర్యు విశిష్ట సం రక్షణాభి లోలు రామ భద్రుఁ గుల పవిత్రుఁ బెద్ద కొడుకుఁ గనుంగొని రాజవరుఁడు గరము రాగ మెసఁగ.

3_6_296 వ. యౌవన రాజ్య పదంబునకు నతని నభిషేకం బాచరింపం గోరి యాప్త మంత్రి జన సమ్మతంబునఁ బురోహిత నిరూపితం బైన శుభ దినంబున నక్కార్యంబునకు సమకట్టు నెడ భరతు దాది మంథర యనునది యమందగతిం గైకేయి పాలికిం జని యిట్లనియె.

3_6_297 ఉ. అక్కట నీ దెసం బతికి నాఱడి కూరిమి యయ్యె మాయపుం జొక్కులు నీవు నిక్కముగఁ జూచి మనంబున మోసపోయి తా టక్కరి కోసలాత్మజ యెడం బ్రియుఁడై యదె తత్తనూజు నిం పెక్కఁగ యౌవరాజ్యమున నిప్పుడు పట్టము గట్టఁ బూనెడున్.

3_6_298 ఆ. పుడమిఱేని మదికి నెడ యైతి నీ వింక నేమి సెప్పఁగలదు వామనయన కడఁగి నిన్నుఁ గొడుకుఁ బెడవడ వైచి యా సవతి కొడుక యేలు నవని యింక.

3_6_299 క. అనిన నుదరిపడి కేకయ తనూజ గడు సంభ్రమమునఁ దత్క్షణమ నరేం ద్రుని పాలికిఁ జని యేకత మున నిట్లనుఁ బ్రణయ పూర్వకముగ నాతని తోన్.

3_6_300 క. ధరణీశ తొల్లి నాకుం గరుణించిన వర మొకండు గల దది మదిలోఁ బరికించి యిప్పు డొసఁగుము చిరముగ సత్యవ్రతంబు సెల్లింపు తగన్.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com