ఆ భా 3 5 211 to 3 5 240
వోలం సురేష్ కుమార్
3_5_211 క. వినుఁ డేను వహ్నివలనం గనిన కుమారుండు వాఁడు గడు నిజమిది మీ వనితలకుం బని గా దిటు సనునే కులసతుల విడువ సత్పురుషులకున్.
3_5_212 వ. అని యెంతసెప్పిన వా రొడంబడరైరి తదనంతరంబ విశ్వామిత్రుండు గమారుకడ కరిగి యద్దేవు శరణంబు సొచ్చి వివిధ వాక్యంబులం బ్రస్తుతించి తదాదేశంబున నతనికి జాతకర్మాది విధులొనరించిన నది యంతయు నెఱింగి యమరు లెల్ల నమరేంద్రుం గానఁ జని యిట్లనిరి.
3_5_213 ఉ. దారుణ శౌర్యధుర్యుఁ డతి దర్పితచిత్తుఁడు వహ్ని సూనుఁ డ న్వీరుఁడు నిన్నుఁ గైకొనక వీఁక మెయిం జనుదెంచు నిప్డు దు ర్వారత నీ పదంబు గొనువాంఛ నవశ్యముఁ గాన యింతలో నీరస మెత్తి వాని వధియింపుము చెచ్చెర విక్రమోద్ధతిన్.
3_5_214 వ. అట్లయిన నీకు నింద్రత్వంబు శాశ్వతం బగు నేమును బ్రదుకుదుము లోకంబు లవ్యాకులంబు లగు ననినం బురందరుం డప్పుడ సప్తమాతృకలం బిలిచి మీరు సని వహ్ని సంభవుండైన కుమారు నమయించి నాకుఁ బ్రియంబు సేయుం డని పంచినం బనిపూని వారు ఘోరంబుగా నతనిపై నడరి తదీయ తేజోవిశేషంబునకు భయంబంది యతని శరణంబు సొచ్చి యేము లోకమాతలము మా యందు నీవు మాతృభావంబు సేయ నర్హుండ వనినం గుమారుండు వారి నభినందించి చేకొనియె నంత నగ్నియు నిజపుత్త్రు పాలికి వచ్చి యతనిచేతం బూజితుం డయి తదీయ రక్షా పర్వతంబున నిలిచె మాతృ గణంబు క్రోధంబునం బుట్టినయది లోహితాస్య యను భామిని గుమారునకు దాదియై యుపలాలనంబు సేయుచుండె నఖిల భూత గణంబులుం బఱతెంచి క్రౌంచారిం బరివేష్టించి నది యంతయు విని కలుషించి.
- ఇంద్రుఁడు కుమార స్వామి పై నెత్తివచ్చుట – సం. 3-216-3
3_5_215 ఉ. స్కందుని మీఁద నెత్తి బలగర్వితుఁడై నడతెంచె నుద్భట స్యందన సామజాశ్వభట సంకుల సైన్య సమగ్ర దేవతా బృంద సమేతుఁడై భువన భీకర సంగర కాంక్ష నింద్రుఁ డ స్పందిత శౌర్యుఁ డగ్ని కణజాత భయంకర వజ్రహస్తుఁడై.
3_5_216 వ. అంత.
3_5_217 తరలము. తరళదీధితి పుంజ నిర్భర దారుణాయుధ పాణులై తెరలఁ ద్రోచి దివౌకసుల్ పఱతెంచి యార్చుచుఁ దాఁకి రా శరవణోద్భవు నాతఁడుం దగ సంభ్రమ స్ఫుట రోష వి స్ఫురిత నిష్టుర హాసజృంభణమున్ వహించినఁ జెచ్చెరన్.
3_5_218 తే. అతని ముఖ గహ్వరంబుల నద్భుతముగ నుగ్ర దహన శిఖావళు లుద్భవించి వేల్పుమూఁకల నరికట్టి వేల్వఁ దొడఁగె నంత నెంతయు సంభ్రాతు లగుచు సురలు.
3_5_219 చ. నీ కింకరులము మమ్ముం జేకొని కృపఁ గావు మనుచు శిఖినందను న స్తోకబలు శరణు వేఁడినఁ జేకొని దాహభయ ముడుగఁ జేసె నతండున్.
3_5_220 వ. ఇట్లు దేవతను గుమారు నాశ్రయించినం జూచి బలసూదనుండు క్రోధఘూర్ణిత నయనుండై యతనిమీఁద వజ్రంబు వైచిన నది తదీయ దక్షిణ పార్శ్వంబుఁ దాకిఁన నందొక్క పురుషుండు గాంచనవర్ణుండును శక్తి ధరుండును మేషవదనుండునై విశాఖుండను పైరం బ్రభవించె మఱియునుం గన్యాకుమార గణంబు లనేకంబులు పుట్టె నదియెల్లనుం గని జనిత భయుండై హరిహయుం డగ్ని సంభవు నభయం బని కొలిచె నంత నమరులు సంతసిల్లి సింహనాదంబులు సెలంగ షణ్ముఖ శకమఖులం బరివేష్టించి రని చెప్పి వెండియు మార్కండేయుం డిట్లనియె.
3_5_221 సీ. అయ్యగ్ని సంభవు నాయతోన్నత బాహు నాముక్త కవచుఁ దేజో మహిష్ఠు నా లోహితాంబరు హారికుండల కర్ణు గనక రత్నోజ్జ్వల ఘనకిరీటు సంపూర్ణ యౌవను సర్వలక్షణ యుక్తుఁ గని యనురాగిల్లి కమల నిలయ సాకారయై వచ్చి యఖిలంబు జూడంగ సిత పద్మ హస్తయై యతనిఁ బొందె
ఆ. శ్రీ సమేతుఁ డై విశేష కాంతి స్ఫూర్తి నొలసి పూర్ణచంద్రు చెలువు దాల్చి యున్నవానిఁ జూచి రుత్ఫుల్ల లోచన కుముదు లగుచు మునులు నమరవరులు.
3_5_222 వ. అంత షష్ఠ దివసంబు సంప్రాప్తం బయ్యె నందు మహామును లందఱు మహాసేను నతిభక్తిం బూజించి కృతాంజలు లై యిట్లనిరి.
3_5_223 ఉ. పుట్టిన యాఱు నాళులకుఁ బొంపిరివోయి జగంబు లన్నియున్ దట్టుఁడవై జయించితి ముదంబున నీదు మహత్త్వ మెంతయుం జిట్జలు గాదె యిట్టి యవిజేయుఁడ వింద్రపదంబు నీక కాఁ బట్టము గట్టి యేలుము కృపన్ మము నెల్లను వహ్ని సంభవా.
3_5_224 వ. అనినం గ్రౌంచారి వారలం జూచి యింద్రపదవి నుండువారి కెయ్యది కరణీయం బని యడుగుటయు వా రిట్లనిరి.
3_5_225 మ. బలముం దేజము నించి లోకముఁ గృపం బాలించు టర్కేందుభూ జలతేజః పవనాంబరంబులకు నస్థైర్యంబు గాకుండ ని శ్చల శక్తి స్థితి నీగి శిష్టజన రక్షా దుష్ట శిక్షా సమా కలనం బింద్రపదస్థుఁ డౌనతనికిం గర్తవ్యముల్ షణ్ముఖా.
3_5_226
చ. అనునెడ నింద్రుఁ డిట్లనియె నట్లయినం గడులెస్స దేవ నీ
వనిమిష నాయకత్వమునయం దభిషిక్తుఁడ వై ముదంబుతో
ననుఁ బనిగొమ్ము నీదు కరుణన్ దొసఁగెల్లను దీఱి యుండెదన్
ఘనతర శౌర్య సారుఁడవు గావున నర్హుఁడ వింద్ర లక్ష్మికిన్.
3_5_227 వ. ఏను దేవేంద్ర పదవి నుండనోడుదు నెట్లనిన భవదీయ తేజో విశేషంబులు సూచి విస్మితులై కొందఱు నీకు నింద్ర పదవి యందు వేడ్క పుట్టునట్లుగా నేమేనిం జెప్పి నా వలనం గొఱగామి కల్పించి నీకును నాకును భేదంబు సేయం జూతురు దానం జేసి నీవు కుపితుండవై నా యెడం గృప దప్పిన నెవ్వారికి వారింప నలవి గాదు లోక భయంకరం బైన విగ్రహంబు ప్రవర్తిల్లుఁ గావున నవశ్యంబును దివిజ రాజ్యంబు నీక యొప్పించితి మమ్మెల్ల నేలి కొమ్మనినఁ గుమారుండు నవ్వుచు నిట్లనియె.
3_5_228 ఉ. అట్టివి యేల పుట్టు నమరాధిప నీవ జగత్ప్రభుండవై యిట్టులమైన తేజము వహించి సుఖంబున నుండు మేను నీ చుట్టమనై భుజాబలము సొంపున నీ కెలసంబు దీర్చెదం జట్టన నన్నుఁ బంపుము భృశంబుగ నెయ్యది కార్య మిత్తఱిన్.
3_5_229 చ. అనవుడు సంతసిల్లి యతఁ డాతని కిట్లను నట్టులైన నీ పనుపున నేను సత్యహితభాషణ యింద్ర పదంబునందు ని ల్చి నెగడువాఁడ నైతి సురసేనల కెల్లను నాయకుండవై ఘనభుజ నీవు సత్కృప జగద్భయ మోచన మాచరింపవే.
3_5_230 వ. అనినఁ గుమారుండు మరుత్పతి కిట్లనియె.
3_5_231 ఉ. నీకుఁ బ్రియంబుగా భవద నీకినికిం బతినయ్యెదన్ భుజో త్సేకపటు ప్రభావను లజేయములై పెనుపొందఁ బేర్చి ఘో రాకృతు లైన నీ రిపుల నందఱఁ దున్మెద సర్వలోక ర క్షాకరణైక వృత్తి నవికల్పుఁడ నయ్యెదఁ గట్టు పట్టమున్.
3_5_232 వ. అనిన నతి ప్రీతుం డగుచుఁ బురుహూతుండు సకల సుర ముని గణ సమేతుండయి తత్క్షణంబ కుమారునకు నఖిల దేవ సేనాధిపత్యంబు నం దభిషేకం బొనరించె మునివరుల జయజయ శబ్దంబులు నమరుల సింహనాదంబులుం గిన్నర గంధర్వ గానంబులు మంగళ తూర్యారావంబులు నప్సరోనర్తనంబులుఁ గల్పతరు కుసుమ వర్షంబులు సమకాల ప్రవృత్తంబు లయ్యెం బరార్థ్య భూషణ మణి ప్రభాలంకృతం బైన కుమారు మౌళి భాగంబున నుజ్జ్వలంబైన ధవళాత పత్రం బురగిరి శిఖరోపరిగతంబగు శల చ్ఛంద్ర బింబంబు ననుకరించు చుండె నట్టియెడ.
- ఈశ్వరుండు గుమారస్వామి యొద్దకు వచ్చుట – సం. 3-218-25
3_5_233 శా. నానా సిద్ధ గణంబు గొల్వఁ బరమానందంబునం జంద్రరే ఖాన వ్యాంచిత మౌళి భూరిభుజ గాకల్పోజ్జ్వలాకారుఁ డీ శానుం డాలత శంకరుండు గిరిజా సంయుక్తుఁడై వచ్చెఁ ద త్సేనానిం బ్రియసూను షణ్ముఖుని వీక్షింపం గడుం బ్రేమతోన్.
3_5_234 వ. ఇట్లు వచ్చి మహా దేవుండు మహా సేనుం గౌఁగిలించుకొని యతనికి విశ్వకర్మ నిర్మితంబును హేమ మయంబును నయిన పుష్పమాలిక యొసంగె నని చెప్పిన విని ధర్మజుండు కుమారుఁడు రుద్రాంశుజుఁ డని చెప్పుదు రది యెట్లనిన మార్కండేయుండు పాండవేయున కిట్లనియె వినుము రుద్రుండు మున్ను నిజ వీర్యంబు వహ్నియందు సంగ్రహించినఁ దత్తేజో విశేషంబునం జేసి పావకుండు గుమారు నుత్పాదించె నదియునుం గాక యగ్ని రుద్రుం డని వేద విదులైన విప్రుల వలన వినంబడు నట్లగుటం గుమారుండు వహ్ని సంభవుండును రుద్రసూనుండును నని చెప్పం బడియె నగ్ని భామిని గృత్తకాఖ్యలైన ముని పత్ను లార్వుర రూపంబులు గైకొని ప్రియ సమాగమంబు సలిపి శ్వేత శైలంబున రేతస్కందంబు సేయుటం బ్రభవించిన వాఁడు గావునఁ గార్తికేయ స్కంద నామంబులం బరగె నని చెప్పి యిట్లనియె.
3_5_235 తే. అప్పు డింద్రుండు మున్ను దా నబ్జ భవు ని యోగమున సురక్షితముగ నునిచి నట్టి దేవసేనకుఁ గన్యకా తిలకమునకుఁ జెలువముగ నలంకారంబు సేయఁ బనిచి.
3_5_236 వ. సముచిత ప్రకారంబున నచ్చటికిఁ దెప్పించి కుమారుం జూచి యిక్కన్నియ భవదర్థంబై బరమేష్ఠిచేత సృజియింపం బడియెం గావున నివ్వర వర్ణినిం బరిగ్రహింపు మనిన నప్పార్వతీ నందనుండు మందస్మిత సుందర వదనారవిందుండయి యమ్ముహూర్తంబునందు.
3_5_237 ఉ. మానిత విక్రమోజ్జ్వలుఁడు మంగభతూర్య నినాద మొప్పఁ దే జోనిధి వహ్ని సాక్షిగ విశుద్ధ విధిజ్ఞుఁడు దేవమంత్రి మం త్రానుగమం బొనర్పఁగఁ బ్రియం బెసలార వరించెఁ జారు ప ద్మాసన దేవసేనఁ గరియానఁ గర గ్రహణ ప్రయుక్తితోన్.
3_5_238 ఆ. గుహుఁడు దేవసేనఁ గోరి పెండిలియైన యా దినంబు షష్ఠి యగుటఁ జేసి యర్చనీయ మయ్యె నా దివసంబు లో కముల నెల్ల వెలసె గారవమున.
3_5_239 క. ఏ దినము నందు షణ్ముఖు శ్రీదేవి వరించెఁ గమల చిహ్నిత కరయై యా దివసము పంచమి లో కాదరణీయంబు లక్ష్మి కాస్పద మయ్యెన్.
3_5_240 వ. ఇట్లు విహిత మంగళాచారుం డయిన కుమారు పాలికిం జనుదెంచి నిజ భర్తల జేతం బరిత్యక్త లైన మునీ భార్య లార్వురు నధిక దైన్య వివర్ణ వదన లై యిట్లనిరి.
వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com