వోలం సురేష్ కుమార్


3_5_151 వ. అనిన నగ్ని దేవుం డిట్లనియె.

3_5_152 క. విను నా కీర్తి జగంబులఁ బొనుఁగు పడియె నీవు భువనపూజిత వృత్తిం బనుపడితి గానఁ దగు నీ యలనపదము నీక నాకు నలవడ దింకన్.

3_5_153 వ. నీవు ప్రథమాగ్ని వై యుండు మేను ద్వితీయం బగు ప్రాజాపత్య వహ్నినై వర్తించెద ననిన నంగిరసుండు దేవా యిట్లాన తీవలదు ప్రథమాగ్నిత్వంబు నీవ కైకొని నన్ను నీకుం బ్రథమ పుత్త్రుంగా నాదరింపు మనినం బావకుండు దాని కొడంబడియె నివ్విధంబున నంగిరసుం డగ్నికి నగ్రతనయుండై యగ్ని సారూప్యంబునం దేజరిల్లె నయ్యంగిరసునకు శివ యనుదానికి బృహత్కీర్తియు బృహజ్జ్యోతియు బృహద్బ్రహ్మయు బృహన్మనసుండును బృహన్మంత్రుండను బృహద్భానుండును బృహస్పతియును నన నేడ్వురు గొడుకులు మఱియు భానుమతియును రాగయు సినీవాలియుఁ గుహువు నర్చష్మతియు మహిష్మతియు నన నేడ్వురు గూఁతులు బుట్టిరి.

3_5_154 క. తనయుఁడు బృహస్పతికి న త్యనఘుఁడు శంయుండు పుట్టి యాగంబులలో మునుమును హవి షాజ్యము దైఁ గొనియెడువాఁ డయ్యె నధిక గుణయుక్తి మెయిన్.

3_5_155 వ. ఆశంయునకు ధర్మపత్ని యైన సత్యకు భరద్వాజుండును భరతుండును నా నిరువురు గొడుకులు పుట్టి రందు భరతునకు భారతుం డను కొడుకును భారతి యను కూఁతురుం బుట్టిరి భరద్వాజునకు వీర యనుదానికి వీరుండు పుట్టె.

3_5_156 క. వానికి సరయువునకుఁ బటు భాను డై పుట్టె సుతుఁడు భానుఁ డనఁగ నా భానునకు నిశ్చ్యవనుఁ డనఁ గా నాత్మజుఁ డుద్భవించెఁ గడు నుజ్జ్వలుఁడై.

3_5_157 చ. అతనికిఁ బుట్టెఁ బుత్త్రుఁడు నిరంతర తేజుఁ డు దారకీర్తిని ష్కృతి యనుపేరి వాఁడు విను కిల్బషభాజను లైన మానవుల్ సతతము నాకృశాను నతిసక్తమనస్స్థితిఁ గొల్చి దోషని ష్కృతి దగఁ గాంతు రట్లగుట గీర్తత మయ్యెఁ దదాఖ్య వానికిన్.

3_5_158 క. ఘనుఁడు రుజస్కరుఁ డనఁగా జనియించెను నాతనికి రుజస్కరునకు న త్యనుపమ కాంతిపరుండై జనియించెం గ్రోధుఁ డనఁగ జనవర తిలకా.

3_5_159 వ. ఆ క్రోధునకు రసుండు పుట్టె రసునకు స్వాహా యను కన్యకయుం గాముండను కొడుకును బుట్టిరి కామునకు నమోఘుండు పుట్టె నమోఘునకు నుక్థుండు పుట్టె మఱియుం గాశ్యపుండును వాసిష్ఠుండును బ్రాణుండును నాంగిరసుండును జ్యవనుండును ననువా రేవురు తేజస్వి యైన కొడుకుం బడయుదుమని యనేక వర్షంబులు ఘోరతపంబు సేసి మహా వ్యాహృతి స్మరణంబు సేయుచున్నంత.

3_5_160 చ. అనలము చాయమస్తకము నర్కనిభం బగు బాహుయుగ్మముం గనక సముజ్జ్వలంబులగు కన్నులుఁ జర్మము కృష్ణవర్ణ తం దన రిన జంఘలుం గల యుదాత్తపు దేహము దేజరిల్లఁగాఁ దనయుఁడు పుట్టె వారలకుఁ దద్దయు నద్భుత మంద లోకముల్.

3_5_161 వ. ఇట్లు పుట్టిన యప్పావకుండు పంచ జనక ప్రభువుండు గావునం బాంచజన్యుండను పేర బ్రసిద్ధుండై దశసహస్ర వర్షంబులు దపంబు సేసి నిజ మస్తకంబున బృహద్రథంతరు లను వారలను వదనంబున హరిని నాభియందు శివుని బలంబున నింద్రునిం బ్రాణంబుల వాయ్వగ్నులను బాహుయుగదంత పుటంబుల విశ్వభూతంబుల సృజియించె మఱియును.

3_5_162 క. తపుఁ డను వహ్ని నిరంతర తపోనిరూఢుఁ డయి పంచదశ పుత్త్రుల న త్యపరిమిత ఘోరతేజో విపులాత్ములఁ గనియెఁ గపట వృత్తి నిపుణులన్.

3_5_163 వ. ఆ పదియేవురు సుభీముండు నతిభీముండును భీముండును భీమబలుండును నతిబలుండు నను వా రొక్క మొగియును సుమిత్త్రుండును మిత్త్రవంతుఁడును మిత్త్రజ్ఞుండును మిత్త్రవర్ధనుండును మిత్త్రధర్ముండును ననువా రొక్క మొగియును సురప్రవీరుండును వీరుండును సువేషుండును సువర్చసుండును సురహంతయు ననువారొక్క మొగియునుగా నిట్లు మూఁడుమొత్తంబులై యజమానుల యజ్ఞఫలంబు లపహరించు చుండుదురు తత్ప్రశాంత్యర్థంబై యాగంబులందు నగ్ని చయనంబు సేయునది.

3_5_164 తే. అధిప విహగాకృతుల నొప్పు నగ్నిచయన ముల యుదగ్ర పక్షాఘాతములను విప్ర వరుల మంత్రఘోషములను వారు నిహతు లై భయంపడి చేరరు యజ్ఞభూమి.

3_5_165 వ. తపుండు మఱియు సకల యజ్ఞ భాగ భుజులైన పుత్త్రుల నేవురం గనియె నం దగ్రజుండు.

3_5_166 సీ. వైశ్వానరుం డను వహ్ని చాతుర్మాస్య విధులందు భూసుర వితతి చేతఁ బర్జన్య సహితుఁడై పరమార్చనముఁ గాంచు నధిప రెండగు నాతఁ డఖిలమునకుఁ బ్రభుఁడు దానై విశ్వపతి యన విలసిల్లు వినుము మూఁడగు వాఁడు విశ్వమునకు నాత్ముఁడై విశ్వకుం డన నొప్పు నాల వు నతఁడు భూతముల యాహార వితతి

తే. వెలయఁ బక్వము సేయుట విశ్వభుక్కు నాఁగఁ బెంపొందు గోపతి నామధేయుఁ డై సమస్త ధర్మ క్రియలందు హేతు వై ప్రశస్తి వహించు నేనగు నతండు.

3_5_167 వ. మఱియు భాను డను వహ్నికి సోమపుత్త్రియైన బృహద్భాసయందు బలదుండును మన్యుమంతుండును ధృతిమంతుండును నాగ్రయణుండును నగ్నియు సోముండును నన నార్వురు గొడుకులు నిశయను కూఁతురుం బుట్టిరి సకల తప ఫలంబులు నిర్వహించుటకయి పురందరుండు మనునామధేయుం డయిన కొడుకుం బడసె నమ్మనువు భానుపుత్త్రియైన నిశా కన్యం బెండ్లియై ప్రాజాపత్యుం డను పేరఁ బరగి పరమ బ్రాహ్మణుల చేత నర్చితుండయ్యె నివ్విధంబున ననేక వహ్నులు సకర ధర్మ క్రియా సాధకు లై వెలింగిరి దక్షిణాగ్ని ప్రముఖంబు లయిన వహ్నులు వాయుహతింజేసి యన్యోన్య సంస్పృష్టంబు లయ్యె నేనియు రజస్వలాది సంకరంబులం బొరసెనేనియు మృతక జాతకాది సంస్పర్శనంబునం బొందెనేనియుఁ దత్ప్రాయశ్చిత్తార్థంబై యష్టాకపాలేష్టి సేయవలయు నని చెప్పి మఱియు మార్కండేయుం డిట్లనియె.

3_5_168 క. ఆపుఁ డను వహ్ని యతులిత రూప యయిన ముదిత యను తరణియందు జగ ద్దీపకు నపారతేజు మ హా పుణ్యుం గనియె నగ్ని నద్భుతనామున్.

3_5_169 చ. అతఁడు త్రిలోక తంత్రము నిరంతరమై చన నిర్వహించుచున్ శతముఖుఁ డాదియైన సురసంతతికిం బ్రియ మొప్ప హవ్యముల్ సతతము మోచి యిచ్చుచు భృశం బు తద్భర మోర్వలేక సు వ్రతనిరతుం డధర్వుఁ డను వానికి నిట్లను నాదరంబుతోన్.

3_5_170 వ. ఏను దుర్బలుండ నైతి నీవు దేవతలకు హవ్యంబులు మోచి యిమ్మని వానిం బంచి తాను సముద్రంబు సొచ్చి యందు దాఁగుటయు దేవత లద్దేవముఖుండున్న యెడ రోయం దొడంగిన నబ్ధిచరంబు లైన మత్స్యంబులు సురలకు నగ్నదేవుండు జలధి నుండుట సెప్పుటయుం గనలి యనలుండు మీలం జూచి జనంబులు మిమ్ము నిర్దయులై వధియింతురు గావుతమని శాపం బిచ్చె నప్పుడు.

3_5_171 ఆ. హవ్వ వహనమునకు నమరోత్తములు దన్ను వేయు విధుల నొలసి వేఁడుకొనిన నెట్లు నియ్యకొనక యెంతయు విసిగి స మీర సఖుఁడు దనదు మేను విడిచె.

3_5_172 వ. ఇట్లు సంత్యక్త శరీరుండై ధరాతలంబు ప్రవేశించుటయు నతనిచేత విడువం బడిన దేహంబువలనం బూయంబున గంధకంబు నస్థుల దేవదారువును శ్లేష్మంబున స్ఫటికంబులు బిత్తంబున మరకతంబును వాతంబునఁ గృష్ణశిలయు నఖంబుల నభ్రకంబును స్నాయుసంచయంబునం బ్రవాభంబును బుట్టె నతండు భూగర్భ స్థితుండై ఘోరతపంబు సేయుచున్నంత భృగ్వంగిరః ప్రముఖులయిన మహామునులు నిజ తపో బలంబున నతనికి నాప్యాయంనంబు సేయుటయుఁ దేజస్వియై ధరణి వెలువడి వచ్చి యమ్మహాత్ముం డమ్మహా మునులం జూచి తదీయతేజంబు దనకు దుస్సహం బగుటయు భయంపడి క్రమ్మఱ నంబుధి సొచ్చి యడంగిన.

3_5_173 క. విను జననాయక సంయమీ జనములు వహ్నిపతి యంతఁ జాలించి ప్రియం బున నంచిత విధి సంగ్రహ ముకై పూజించి రధిక పుణ్యు నధర్వున్.

3_5_174 వ. అయ్యధర్వాగ్ని తేజంబును నమ్మును లతనికిం జేయు బహుమానంబునుం దన్ముఖంబున నమరులు దృప్తు లగుచునికియుం జూచి సహింపక పావకుండు సకల భూతంబులుఁ జూచుచుండ నంబుధి వెలువడి వచ్చి నిఖిలలోక హితార్థంబుగా నెప్పటియట్ల హవ్యవహత్వంబు నంగీకరించె నిట్లనేక శాఖంబయిన యగ్ని వంశంబు ప్రశంసాభాజనం బయ్యె నగ్నులెంద ఱైననుం దదాత్మయైన తేజం బొక్కటి యని చెప్పిన విని సంతసిల్లి యమ్మహా మునికి ధర్మతనయుం డిట్లనియె.

3_5_175 క. మునినాథ మహాసేనుం డనలునకుం గృత్తకలకు హరునకు సుతుఁడై న నిమిత్త మేమి తెఱఁ గే వినవతలతుం జెప్పవే సవిస్తర ఫణితిన్.

3_5_176 వ. అనిన మార్కండేయుం డతని కిట్లని చెప్పెఁ దొల్లి దైత్యులతోడ రణంబుసేసి యోటువడి దేవగణ సహితుండై దేవేంద్రుండు దొలంగిపోయి దానవుల నోర్వనోపునట్టి మహాసత్త్వుండగు సేనాపతి నెందుఁ బడయుదునొకో యని యొక్కనాఁడు మానసం బను శైలంబునకు జని యందొక్కయెడ నొక్కరుండ కార్యచింతాపరుంజై యున్నయెడ.

3_5_177 తే. ఒక దనుజాధముండు మొఱ్ఱోయనంగ నన్నుఁ జెఱగొని పోయెడు నన్నలార యెవ్వరిట విడిపింపరే యింతవట్టు పుణ్యమునఁ బోవరయ్య కారుణ్య బుద్ధి.

3_5_178 వ. అని యిట్లు సువ్యక్తంబైన వనితా విలాపంబు వీతెంచినం బురందరుండు నిజాతంరంగంబు గరుణాతరంగితం బగుటయు నోడకొడకు మిదె యేను వచ్చితిననుతు నద్దిక్కునకు నడచి ముందట నతి భయంకరాకారుం బటుగదా హస్తు నప్రచలిత విద్యుల్లతా రుచిరమూర్తి యైనదాని నొక్క కన్నియం గొని గగన తలంబునం బఙచువానిం బ్రబల వలాహక వినీల దేహూఁ గేశియను దానవుం గని సరభసుండై.

- ఇంద్రుఁడు గేశియను రాక్షసునిఁ బాఱఁదోలుట – సం. 3-213-10

3_5_179 ఉ. ఓరి దురాత్మ యీ యబల నోడక యేటికిఁ బట్టినాఁడ వం భోరుహ నేత్ర మెటవోయినఁ బ్రాణము గొందు నింకఁ బ్ర స్ఫార మహీధర ప్రకర భంగ విహా ధురీణ ముగ్రదై త్యారుణ రంజితోగ్ర కులిశాస్త్రము సుమ్మిదె యంచు డాసినన్.

3_5_180 మత్తకోకిలము. ఘోరవిక్రముఁడైన కేశియుఁ గ్రోధఘూర్ణిత చిత్తుఁడై ధీరుఁ డుక్కున నిల్చి యగ్గద ద్రిప్పి వాసవు వైచెన వ్వీరుఁడున్ గద చూర్ణితంబుగ వ్రేసె నాసుర భంగిఁ బొం గారి దారుణ వజ్ర పాతరయంబునం బటుహస్తుఁడై.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com