ఆ భా 3 4 301 to 3 4 330
వోలం సురేష్ కుమార్
3_4_301 సీ. పదియాఱు వర్షముల్ పరమాయు వయ్యెడు ధరణీశ కలి యుగాంతమున వినవె యేడును నెనిమిది యెండ్ల ప్రాయంబునఁ బ్రజలుద్భవింతురు భామినులకు ద్రవ్య విహీనులై దాత యొక్కఁడు లేక యన్యోన్యతస్కరు లగుదు రెందు నెఱిఁగెడు వారును నెంతయుఁ గ్రూరులై చెనసి పాపంబు సేసెదరు సూవె.
తే. యన్న విక్రయ మొనరింతు రఖిల జనులు వేదవిక్రయ లగుదురు విప్రవరులు పణ్యయెనుల యగుదురు పద్మముఖులు గష్టతరమైన యక్కలి కాల వేళ.
3_4_302 తరువోజ. ఉక్కున శూద్రు లత్యుగ్రులై కవిసి యొడొండ పెక్కండ్ర నుఱక చంపుటయు దిక్కెవ్వరును లేక దీనులై వసుమతీ సురుల్ నాలుగు దెసలఁ బాఱెదరు మ్రుక్కడి చోరులు ముట్టి నిశ్శేషముగ ధనావలిఁ గొని మొగి వధియింప స్రుక్కి కాకుల యట్లు శూన్యులై చెదరి సొంపఱి యడవులు సొత్తురు జనులు.
3_4_303 క. శ్రుతి ధర్మంబులు శూద్రులు ప్రతిభం జెప్పంగ వినుచు బ్రాహ్మణ జాతుల్ ధృతి సెడి తత్సేవకులై యతి నిందిక కర్మకారు లయ్యెద రధిపా.
3_4_304 మత్తకోకిలము. దేవతాయ తనంబులున్ జగతీ సురాసథంబులుం బావనాశ్రమ భూములుం జెడి పాడగున్ శుభవృక్ష వ ల్లీ వనంబులు నాశమొందుఁ గలి ప్రచారమునందు దు స్స్త్రీ విహారము మద్యపానము జెల్లుఁబెల్లుగ నెల్లెడన్.
3_4_305 క. గరుఁ గొనియాడఁడు శిష్యుఁడు గురుఁడును శిష్యునెడ వంచకుండగు మది నొం డొరువుల నొల్లరు బంధులు పొరిఁబొరిఁ గఱవులగుఁ బ్రజకుఁ బొడమును భయముల్.
3_4_306 తే. ఇవ్విధంబున ధర్మంబు లెల్ల నపగ తమునఁ బడ జనులెల్లను దల్లడిల్ల బహువిధోత్పాతములు పుట్టుఁ బార్థివేంద్ర కడఁగి తత్కలికాల సంక్షయము నందు.
3_4_307 క. క్రమమున రాష్ట్రములును నగ రములును నాశంబునొందు రక్షాచ్యుతులై భ్రమియింతురు జను లతిదు ర్గమ గిరి సరిదంతికములఁ గడునాతురులై.
-కలియుగంబున విష్ణుండు గల్కి రూపంబున ధర్మంబు ప్రతిష్టించుట – సం. 3-188-89
3_4_308 వ. అంతఁ గలి యుగాంతంబు నందు భువన విదితంబయిన శంబళ గ్రామంబున కల్క్యాత్మకుండైన విష్ణుయశుం డను బ్రాహ్మణుండు జనియించి సంస్మరణ మాత్రన వేదశాస్త్రంబులును సమస్త శస్త్రాస్త్ర విశేషంబులు నధిగమించి సార్వభౌముం డయి.
3_4_309 మధ్యాక్కర. అసదృశ తేజుఁడు బ్రాహ్మణానీక సహితుఁడై కడఁగి వసుమతి యందు నధర్మవర్తులై యున్న మ్లేచ్ఛులను మసలక నిజశక్తిఁ జేసి మడియించి ధర్మంబు నిలిపి వసునిభుం డొనరించుఁ బేర్మి వాజిమేధము నిష్ఠయొప్ప.
3_4_310 క. ఘనుఁ డిల యెల్లను బ్రాహ్మణ ధనముగ భాగించి యిచ్చి ధర్మయశో వ ర్ధనుఁడై వార్ధకమున న త్యనఘుండు దపోవనంబునందు వసించున్.
3_4_311 అతనిచేతం బ్రతిష్ఠితం బయిన ధర్మంబు ననుసరించి బ్రాహ్మణాది వర్ణంబులు సమర్యాదంబులై వర్తింపం గలయవి దననచేసి కృతయుగంబు సంప్రాప్తంబగు నందు.
3_4_312 శా. ఆరామ ప్రజచైత్య సద్మవనదేవాగార సౌమ్యంబులై భూరి బ్రహ్మ తపస్వి సంకులములై పుణాధ్వరారంభసం భారోదారములై నితాంత ఫలిత బ్రాజిష్ణు సస్యంబులై యారూఢ స్థితి నెల్లదేశమును నొప్పారుం బ్రకాశంబులై.
3_4_313 క. సమయముతోడఁ గురియు వ ర్షములు గరము తేజమెక్కి చరియించు నవ క్రములై గ్రహంబు లారో గ్యము సౌఖ్యము సమధికముగఁ గలుగు నరులకున్.
3_4_314 వ. ఇది కృతయుగ ప్రవర్తనంబు త్రేతాద్వాపర యుగంబులందుఁ ద్రితయద్వయ పాదంబుల ధర్మంబ వర్తిల్లు నిట్టి తెఱంగునం గాలగతు లనేకంబులు నాకుం బ్రత్యక్ష సిద్ధంబు లయ్యె నీ వడిగిన యతీతానాగతంబు లయిన విశేషంబు లెఱింగించితి నింక నొక్క హితోప దేశంబు సేసెద నాకర్ణింపుము.
3_4_315 క. ధరణీసురులకు నెప్పుడుఁ గరమిష్టము సేయుమయ్య కౌరవ వంశో త్తరు విప్రులు సంతుష్టిం బొరసినఁ జేకుఱు నశేష పుణ్య ఫలంబుల్.
3_4_316 సీ. సకల భూతములందు సదయాత్ముఁడవు గమ్ము పాలింపు ప్రజల నీ ప్రజలఁ బోలె విశద వృద్ధాచార వేదివే ధర్మంబు సలుపుము దురిత వర్జనము గాఁగ నెఱుఁగమిఁ బాప మొక్కించుక దొడరినఁ జయ్యన ప్రతీకార శాలివగుము గర్వంబు విడువుము గరము ప్రియంబును నిజమునుగా వచోనియతి నడపు
తే. కాల గతులెల్ల నెఱిఁగి యస్ఖలిత బోధ యుక్తుఁడవు గమ్ము భరత వంశోద్భవుఁడవు నీవు గావున నత్యంత నిర్మలుఁడవు ప్రాజ్ఞుఁడవు నీకు వేఱ చెప్పంగ నేల.
3_4_317 వ. అనిన విని యుధిష్టిరుండు మునీంద్రా నీ యానతిచ్చిన వాక్యంబు లన్నియు నవహితుండనై వింటి నింతకు మున్ను నా యోపిన తెఱంగున లోభమాత్సర్యాది దుర్గణంబులు పరిహరింతు నింకను భవదుక్తంబైన ధర్మశాసనంబును బ్రయత్నంబునం బాలించెద నని యతనికి ప్రణమిల్లి మఱియును బ్రాహ్మణ ప్రభావంబు విను వాఁడై యతనిం బ్రార్థించినఁ దద్విషయంబైన యితిహామం బతనికి నమ్మహాముని యిట్లనిచెప్పె.
- మార్కండేయుండు ధర్మరాజునకు బ్రాహ్మణ ప్రభావంబు సెప్పుట – సం. 3-190-1
3_4_318 చ. ఘనుఁడు పరిక్షితుండనఁ బ్రకాశితుఁడైన మహీవిభుండు భా నువిభుఁడు భాను వంశ్యుఁడు వినూత కీర్తి యయోధ్య యేలు వాఁ డనుపముఁ డొక్కనాఁడు మృగయారతుఁడై చరియించెఁ గానన మ్మున నొకరుండ యిమ్ముల నపూర్వ జవోగ్రహ యాధిరూఢుఁడై.
3_4_319 వ. ఇవ్విధంబునం బెక్కు మృగంబుల వధియించుచుఁ గ్రుమ్మరు వాఁడొక్కయెడ.
3_4_320 ఆ. మదగజాభిరామమృదులయానం బొప్ప నల్లఁబొలయుచును లతాంతరములఁ గరములీలఁ గమ్మవిరులు గోయుచునున్న పువ్వుఁబోఁడి నొక్కపొలఁతిఁ గనియె.
3_4_321 క. కని యంతఁ గదిసి యాకా మిని యొప్పులఁ జూడ్కి దగల మీఱిన తమకం బున నిమిష లోచనుఁడై జననాథుఁడు మదన బాణ సంహతిఁ దూలెన్.
3_4_322 వ. అదియును నతి సుందరంబైన తదీయ మూర్తి విభవంబునకు మెచ్చి సాభిప్రాయంబుగా నవలోకించె నంత నమ్మహీకాంతుఁ డక్కాంత కిట్లనియె.
3_4_323 ఉ. ఎవ్వరిదాన వంబుజ దళేక్షణ యేకత మిట్టులేల నీ వివ్వన భూమియందుఁ జరియించెదు నావుడుఁ దండ్రిపంపునం దివ్వనభుమియందుఁ జరియించెద సద్వరుఁ గోరి కన్య నే నెవ్వరిదానఁ గావలయు నేర్పడఁ జెప్పుము రాజనందనా.
3_4_324 వ. అనిన దాని ప్రగల్భ వచనంబులకు నధిక విలోలుండై భూపాలుండు దన యభిలాషం బెఱింగించిన నమ్మగువ నన్నెన్నండును జల విహారంబునకుఁ జొనుపకుండునది యట్లయిన నిన్ను వరియించెద ననిన వాఁడును దత్సమయంబున కొడంబడి దానిం దోడ్కొని పురంబునకుం జనుదెంచి యిష్టసుఖ తత్పరుండయి యుండెనంత నొక్క శరత్సమయంబు నందు.
3_4_325 చ. అతులిత పుష్ప పల్లవ ఫలాన్విత భూరుహ భూరి వల్లరీ వితతముఁ జారుకైరవన వీనసరోరుహషండ మండలా యత సరసీ మనోహరము నైన పురోపవనంబునన్ సము న్నత విభవుండు వాసభవనంబు లొనర్పఁగఁ బంచి యిమ్ములన్.
3_4_326 క. దేవీ సహితంబుగఁ బృ థ్వీవరుఁ డవ్వనమునందు విహరించె ఘనాం తావసర వాసరంబుల భావీత పద్మవన పవన పరిచితుఁ డగుచున్.
3_4_327 వ. అంత నొక్కనాఁడు నితాంత ఘర్మజల కణగలిత శరీరుండై ప్రియా సమేతంబుగా వస గృహంబు వెలువడి తత్సమీపంబున నతి మనోహరంబయిన కమలాకరంబు గని దాని తీరంబున నయ్యుగ్మలి దాను గృతావగాహుండై.
3_4_328 క. మేలై యున్నది జలము వి శాల నయన చెమట నోవఁ జయ్యన దేహ క్షాళన మొనరింపు మనిన నాలేమ దరస్మితాసనాంబుజ యగుచున్.
3_4_329 ఆ. మడుఁగు సొచ్చి మునిఁగి మాయమై పోయిన నద్భూతాత్ముఁ డగుచు నవని విభుఁడు మడుఁగు గలయ వెదకి మానినిఁ గానక జలములెల్ల వెదలఁ జల్లెఁ గడఁగి.
3_4_330 వ. ఇట్లు సల్లి యందు మండూకంబు లనేకంబు లున్నంజూచి యివి మత్ర్పియాంగనను మ్రింగినవి గాకేమియని కలుషించి యనుచరులం బిలిచి నాకుఁ బ్రియంబు సేయ వలసిన వారు గలిగినం బుడమిం గల కప్పల నెల్లం బొడవడంగించునది యని పంచిన నలుదిక్కులకుం జని తదీయ కింకర వర్గంబు.
వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com