ఆ భా 3 4 211 to 3 4 240
వోలం సురేష్ కుమార్
3_4_211 సీ. మేలగుక్రేపుతోఁ బాలు సాలఁగఁ గల్గి లాలితంబగు తొలిచూలు మొదవుఁ బాత్రభూతుండైన శ్రోత్రియునకు నిచ్చు సదదుల చరితుఁ డమ్మొదవుమేన నెన్ని రోమములుండు నన్ని వేలేఁడులు సురలోక సౌఖ్య విస్ఫురణనొందు భారంబునకుఁ జాలి భూరిసత్త్వాఢ్యమై బిరుదైనయెద్దు భూసురున కిచ్చి
ఆ. నరుఁడు ధేనుదశక మిరవొంద నిచ్చిని ఫలము వడయు మఱియు వలువ లొసఁగి చంద్రలోకమునకు సంప్రీతుఁడై చనుఁ గనక మిచ్చి నాకమునకు నరుగు.
3_4_212 క. కృతమతియై యేడేఁడులు హుతవహుఘృతమునను బ్రీతి నొందించిన సు వ్రతుఁ డేరేడు తరంబుల పితరులఁ గొని దివికి నేఁగుఁ బెంపెసలారన్.
3_4_213 క. సతతంబును శుచియై దే వతలఁ బ్రదీప్తాగ్నియందు వదలక సంత ర్పితులుగఁ జేసి వడయు నం చితముగ గోలోకవాస చిరసౌఖ్యంబుల్.
3_4_214 వ. ఆగ్నిహోత్రం బస్మదాత్మకం బని యెఱుంగుము సకల యజ్ఞంబులందుఁ గల్గంపంబడు విశిష్ట ద్రవ్యంబు లన్నియు మదీయంబు లేను మహనీయంబైన యగ్ని హోత్రముఖుం బునం బ్రభవింతు నాత్మజ్ఞులగు మహాత్ములకు నఖిల సంశయ చ్ఛేదంబు సేయుదు ననవరతస్వాధ్యాయ ధాన వ్రత పరాయణులైన తపోధను లెందేని వీతశోకులై వసియింతు రట్టిది మామకంబైన పరమ పదంబు వినుము ప్రచుర మధుక్షీర తోయంబులును శర్కరాసైకతంబులును మాంసాపూవ ప్రకర తీరంబులును బాయసకర్దమంబులు నైన యేఱులనేకంబు లుత్పాదించి యింద్రాగ్ని ప్రముఖు లైన దివిజులకుఁ దృప్తి సేసి యజన శీలురు మత్పదంబుం బ్రాపింతు రని చెప్పినఁ దార్క్ష్యుండు కృతాంజలియై.
3_4_215 ఉ. అంబ నవాంబుజోజ్జ్వల కరాంబుజ శారదచంద్ర చంద్రికా డంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న రోచిరా చుంబిత దిగ్విభాగ శ్రుతసూక్త వివిక్త నిజ ప్రభావ భా వాంబర వీధి విశ్రుత విహారి ననుం గృపఁ జూడు భారతీ.
3_4_216 వ. అని వినుతించి కృతార్థుండయ్యె ననిన విని మృకండు పుత్త్రునకు పాండు పుత్త్రుం డిట్లనియె మునీంద్రా వైవస్వతమను వెత్తెఱంగునం బ్రభావ సంపన్నుం డయ్యెఁ జెప్పవే యనిన మార్కండేయుం డిట్లనియె.
3_4_217 క. విను చాక్షుషమన్వంతర మున వైవస్వతుఁడు పరమ పుణ్యుండు దపం బొనరించె నిరాహారత ననుపమ ధైర్యుండు దశ సహస్రాబ్దంబుల్.
3_4_218 ఆనఘుఁ డూర్థ్వ బాహుఁడై యేకపాదంబు నందు నిలిచి బదరికాశ్రమమునఁ జలిపె మఱియుఁ బెక్కు సంవత్సరంబులు తపము సకల జనులుఁ దనునుతింప.
- మార్కండేయుండు ధర్మరాజునకు వైవస్వతు వృత్తాంతంబును చెప్పుట – సం. 3-185-1
3_4_219 వ. ఆ వైవస్వతు డొక్కనాఁడు గృతస్నానుం డయి జలాశయ తీరంబున నున్న యెడ నొక్క మత్స్యంబు జలంబుల దరికిం జనుదెంచి యిట్లనియె నయ్యా యేను గడు నల్ప మత్త్యంబ నగుటం జేసి బలవంతంబు లగు జలచరంబుల వలన నాకుఁ దద్దయు భయంబు గలిగియుండు నిమ్మడువు మహా మత్స్య సంకులంబు గావున నపాయంబు నొందకుండ నన్నుద్ధరించి యొండెడం బెట్టవే యేను నీకుఏ బ్రత్యుపకారంబు సేయనోపుదు ననిన విస్మితుండై యతం డమ్మీను నెత్తకొనిపోయి యొక్క నూతియందు విడిచి దానిం బలుమాఱు నరసికొని యుండె నదియును గ్రమంబున వర్ధిల్లి యొక్కనాఁ డమ్మనువున కిట్లనియె.
3_4_220 ఆ, అనఘ నీ ప్రయత్నమున నా శరీరంబు పొదలె నాకు నిందు మెదల నెడము సాల దట్లుగాన మేలగు నొండొక యెడకుఁ గొంచుఁ బొమ్ము కడఁగి నన్ను.
3_4_221 వ. అనిన నాతం డా జలచరంబుఁ గొని చని యొక్క బావి యందు విడిచిన నది యెప్పటియట్ల యక్కజంబుగాఁ బొదని తనకు బావియందు నవకాశంబు పర్యాప్తం బగుటం జెప్పి యతనిచేత గంగ మడువున విడువంబడి కాల క్రమమున నచ్చోటఁ దిరుగం బట్టు చాలకున్న నమ్మనువున కెఱింగించిన నతం డెత్తికొని పోయి సముద్రంబునం బెట్టిన నది వాని కిట్లనియె.
3_4_222 క. ఉపకారం బొనరించితి కృపతో నాకిట్లు నీవుఁ గృతమతివై ప్ర త్యుపకారం బొనరించెద విపుల గుణాభరణ తెలియ విను నా పలుకుల్.
3_4_223 తే. తడవు లే దింక నిఖిలభుతములుఁ బ్రభయ మొందనున్నవి యిప్పుడొండొండ పొందగి కలయఁ బాఱుఁ బయోధు లుగ్రముగఁ బుణ్య చరిత యిదియ మన్వంతర సంధి యండ్రు.
3_4_224 వ. కావున నీవు దృఢరజ్జు బంధురంబును సకల ధాన్య తండుల కలితంబునుంగా నొక్క పేరొడ గావించి సప్త ముని సహితుండవై దాని నెక్కి సముద్రంబు దరియందు నన్నుం దలంచునది యేనును ఘనశృంగ శోభితం బయిన రూపంబునఁ బొడసూపి మీకు మే లొనరించెద నని యమ్మత్స్యంబు ననియె వైవస్వతుండును దదుక్త ప్రకారంబున నోడ నిర్మించి సప్తముని మహితుంబుగాఁ గృతారోహణుండై పయోధి దఱియం దొడంబగె నంత.
3_4_225 మ. మతి వైవస్వతుచేఁ దలంపఁబడి యమ్మత్స్యంబు దోఁతెంచె నా యతశృంగోన్నతమూర్తి నాతఁడుఁ దదాజ్ఞాయత్తుఁడై తచ్ఛిరో గతశృంగాగ్రమునం దగిల్చె నతి దీర్ఘంబైన పాశంబు న ద్భుతవేగంబున నోడ నీడ్చె నది యంభోరాశిమధ్యంబునన్.
3_4_226 వ. తదనంతరంబ.
3_4_227 సీ. గరుసులు గడవంగఁ గదలి యల్లల్లన యొత్తుచు నెడముల నుత్తరించి వేడుకఁ జేతులు విచ్చి యాడెడునట్లు లోలోర్మిపంక్తులఁ గ్రాలి క్రాలి ప్రచుర హాసస్ఫూర్తి పచరించు చాడ్పున నురుఫేనరోచులఁ దెరలు గవిసి యురువడి వర్ధిల్లుచున్న జలంబుచేఁ బొంగారి దెసలెల్ల మ్రింగి కొనుచుఁ
ఆ. బ్రబల విలయ కాల పటురయ బహుళ స మీర ణౌఘదుర్నివార మగుచు నుగ్రభంగిగాఁ బయోనిధు లొక్కటఁ బెల్లురేఁగి జగము లెల్ల ముంచె.
3_4_228 వ. ఇట్లు లోకంబెల్ల నేకావర్ణంబైన నమ్మత్స్యంబు దజ్జలాంతరంబున ననేక సహస్ర వర్షంబు లయ్యోడం దిరుగుచుఁ బదంపడి యప్పెనువెల్లి యల్లన దిగిచి పోవందొడంగు నెడం దుహిన గిరిశృంగ సమీపంబున నయ్యోడ నిలిపి వారలతోడ.
3_4_229 తే. ఈ నగంబు శృంగంబున నిపుడు మీరు గట్టుఁ డియ్యోడ ననిన నక్షణమ వారు నట్ల చేసిరి విను మమ్మహాద్రిశృంగ మనఘ నౌబంధనంబన నవనిఁ బరగె.
3_4_230 క. మను సహితులై మునులం గనుఁగొని యమ్మీను గరము గారవమున ని ట్లనుఁ బ్రళయంబున కీడునఁ జలకుండఁగ మీకు రక్ష సలిపితిఁ గరుణన్.
3_4_231 క. మునులార యేను విశ్వం బునకుఁ బరమ కర్తయగు ప్రభుఁడ వాత్సల్యం బున మత్స్యమైన రూపం బున నిమ్మెయి నిన్ని చందములఁ జనవలసెన్.
3_4_232 వ. మీరు నిర్భయులై చరియించునది మఱియు నిమ్మనువును దేవాసుర మానుషంబైన జగం బఖిలంబును సృజియించు మత్ప్రసాదంబున నతనికిఁ బరమ జ్ఞానోదయం బగునని చెప్పి యయ్యాది మత్స్యం బదృశ్యం బయ్యె వైవస్వతుండును మఱియు నధిక తపంబు సేసి సకల చరాచర భూతంబుల సృజియించె.
3_4_233 క. పరమంబగు వైవస్వతు చరితం బతి భక్తి వినినఁ జదివినను మహా దురితంబు లడఁగు జనులకు నిరవుగ సిద్ధించు ననఘ యిహపర సుఖముల్.
3_4_234 వ. అనిన నమ్మేదినీశ్వరుం డమ్మునీశ్వరునకుఁ బ్రణతుండై యిట్లనియె.
3_4_235 క. పరమేష్ఠి కల్పుఁడవు ని ర్భర భూరి తపః ప్రభావ పరిపూర్ణుఁడ వ చ్చెరువు భవన్మహాత్మ్యము సురముని లోక ప్రణామ శోభిత చరణా.
3_4_236 క. అడరి నిఖిలాండ కోటియుఁ జెడునప్పుడుఁ జెడక నీవు జీవించెద వే ర్పడ జగములు గ్రమ్మఱఁ గలి గెడు నప్పుడు సూచెదవు వికృతి రహితుఁడవై.
3_4_237 చ. తొడరి చరాచర ప్రతతితో జగమంతయు వార్ధి దొట్టి న ప్పుడు లలితాబ్జ పీఠమునఁ బొల్చు చతుర్ముఖుఁ బద్మగర్భుఁ బెం పడర భజించి తీవు జగదాదిజుఁడైన ప్రభుండు నీ యెడం గడు ననురక్తుఁడై యొసఁగెఁ గాదె మునీశ్వర యీ ప్రభవమునన్.
3_4_238 క. జగముల నెల్లను మ్రింగెడు జగదంతకు మౌళి వామ చరణం బిడి పె ల్లగు రోగజరో భరముం దిగ విడువఁగఁ జెల్లె నీకుఁ ద్రిభువన వినుతా.
3_4_239 వ. సకల చరాచరోత్పత్తి స్థితి విలయ ప్రకారంబులు నీకుం బెక్కు మాఱులు ప్రత్యక్షంబులయి కానం బడియుండుఁ గావున నిన్నడిగెద లోకంబులు విలయ కాలంబున నెట్టి భంగి యగు నెఱింగింపు మనిన మార్కండేయుం డిట్లనియె.
- మార్కండేయుఁడు ధర్మరాజునకుఁ బ్రళయ ప్రకారంబు సెప్పుట – సం. 3-188-13
3_4_240 సీ. శాశ్వతు నఖిల భూతేశ్వరు నవ్యయు నాదిదేవుని జగదాది జన్ము నాది మధ్యాంత విచ్చేద విదూరు నాశ్చర్య కారణ కర్మధుర్యు నజరు నీకిష్ట సఖుఁడును నీకుఁ బ్రెగ్గడయునై వెలుగొందుచున్న యీ యలఘ పుణ్యు లలితా దీర్ఘ విశాల సితేక్షణుఁ గనక వర్ణాంబరు వనజ నాభు
ఆ. నింద్ర నీలవర్ణు నింద్రాది సురగణ వినుతుఁ గృష్ణుఁ గరము వినయ మొప్పఁ దలఁచి యతని యాజ్ఞ దలకొని యెఱిఁగింతు వినుము వరుస తోడ మనుజ నాథ.
వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com