వోలం సురేష్ కుమార్


- మార్కండేయుఁడు ధర్మజునకు బ్రాహ్మణ ప్రభావంబు సెప్పుట - సం. 3-182-1

3_4_181 వ. అనిన వివి ధర్మనందనుండు బ్రాహ్మణ ప్రభావంబు వినవలతుం జెప్పవే యనిన మార్కండేయుం డిట్లని చెప్పెఁ దొల్లి హెహయ వంశోద్భవుండైన ధుంధుమారుం డను కుమారుండు మృగయాసక్తుం డై వనంబునఁ గ్రుమ్మరువాఁ డొక్కయెడం దృణలతాగుల్మ మధ్యంబునం గృష్ణాజినోత్తరీయుం డయు యున్నవాని నొక విప్రు దవ్వులం గని మృగం బను బుద్ధిం జేసి యేసి డాయం జని నిశ్చేతనుండైన యనతిం జూచి యత్యంత దుఃఖితుండయి పురంబునకుం బోయి నిజ వంశ వృద్ధులైన హైహయుల కంత వృత్తాంతబునుం జెప్పి వారిం దోడ్కొని వచ్చి యవ్విప్ర కళేబరంబు సుపిన.

3_4_182 తే. వారలందఱు వందురి వగ.చి యచటి కతిసమీపంబునను దార్క్ష్యుఁడను మునీంద్రు నాశ్రమంబున్న నయ్యెడ కరిగి కనిరి దేవముని సిద్ధలోక ప్రతీక్ష్యుఁ దార్క్ష్యు.

3_4_183 క. కని భక్తి మ్రొక్కుటయు న య్యనఘుఁడు దీవించి వారి కర్హమ్మగు పూ జనము లొనరింపఁ బంచెం దనశిష్యులఁ బరమ సంశ్రిత వ్రతుఁడు దయన్.

3_4_184 వ. హైహయులు నమ్మునీంద్రునకు సాష్టాంగ దండ ప్రణామంబు సేసి మహాత్మా యిక్కుమారుండు మృగయాసక్తుండై వచ్చి యింతకు మున్ను యివ్వనంబున నొక్క బ్రాహ్మణు గృష్ణాజిన సంవృతు నతి శాంతుం బాపంబునం జేసి మృగం బనుబుద్ధి నేసిన నతండు మృతుం డయ్యె నేము మహాపాతక దూషితుల మైతిమి గావున మీచేయు సత్కారంబుల కర్హులము గా మిప్పాపంబున కెయ్యది నిష్కృతి యనిన నవ్వుచు దార్క్ష్యుం డిట్లనియె.

3_4_185 క. వినుఁ డెన్నఁడు మా యాశ్రమ మున నెవ్వారలకు లేవు భూరిభయవ్యా ధి నిరోధ మృత్యు దోషా ద్యనేక దుఃఖములు త్రిజగదాశ్చర్యముగన్.

3_4_186 వ. అని పలికి దపపుత్త్రు నధిక తపోబల సమన్వితుం జూపి.

3_4_187 క. ఈతఁ డగునె మీ బాలకు చేత నిహతుఁ డైనవాఁడు సెప్పుఁ డనును వా రాతఁడ తమమును చూచిన యాతం డగుటకు మహాద్భుతాత్మకులగుచున్.

3_4_0188 క. మృతుఁ డయి క్రమ్మఱ సంజీ వితుఁడయ్యె నితండు కరము విస్మయ మిది భూ నుత యిట్టి మహిమ కలిమికి గదమెయ్యది యానతిమ్ము కారుణ్యమునన్.

3_4_189 వ. అని యడిగినఁ దార్క్ష్యుం డిట్లనియె.

3_4_190 శా. ఆలస్యం బొకయింతలేదు శుచి యాహారంబు నిత్యక్రియా జాలం బేమఱ మర్చనీయు లతిథుల్ సత్యంబ పల్కం బడున్ మేలై శాంతియు బ్రహ్మచర్యమును నెమ్మిం దాల్తు మట్లౌట నె క్కాలంబుం బటురోగ మృత్యు భయ శంకం బొంద మేమెన్నడున్.

3_4_191 వ. ఇది యస్మదీయ ప్రభావంబు మీకుఁ బాతకభయంబు వలన దరుగుం డనినం దార్క్ష్యు వీడ్కొని హైహయులు నిజ నివాసంబులకుం జనిరి భరత వంశోత్తమ యిట్టిది బ్రాహ్మణ ప్రభావం బని మఱియు మార్కండేయుండు బ్రహ్మ క్షత్త్ర స్వరూప నిదర్శనం బయిన యొక్క యితిహాసంబు సెప్పెద విను మని ధర్మరాజున కిట్లనియె.

3_4_192 చ. వినుత చరిత్రుఁ డత్రి యను విప్రవరుండు తపంబొనర్పఁ గా ననమున కేఁగుచుండి తననాతిఁ గనుంగొని యిట్లనుం దపం బున కిదె యేను బూని వనభూమికిఁ బోవుచు నున్నవాఁడ నో వనరుహ నేత్ర నీవు నట వచ్చెదొ పుత్త్రుల యొద్ద నుండెదో.

3_4_193 చ. అనుటయు భార్య యిట్లనియె నక్కట పుత్త్రులకుం గుటుంబ భా రనీయమ వృత్తులెల్లను దిరంబుగఁ జేయక యాశ్రమాంతరం బునకు మహాత్మ నీకు నిటు వోవుట ధర్మువు గాదు వైన్య భూ జనపతు యిచ్చునర్థులకుఁ జాలఁగ నర్థము వేఁడు మవ్విబున్.

3_4_194 వ. అనినం గొండొక విచారించి భార్య పలుకులు ధర్మయుక్తంబు లగుటకు సంతసిల్లి యమ్మహాద్విజుం డప్పుడు చని యశ్వమేధాధ్వర దీక్షితుం డయి విప్రులకు నపార ధనంబు లిచ్చుచున్న వైన్యుంగని యాశీర్వాద పురస్సరంబుగా నిట్లనియె.

3_4_195 ఉ. నీవ విధాత వింద్రుఁడవు నీవ సమస్తజనేశ్వరుండవున్ నీవ యశేష ధర్మములు నీవ యెఱుంగుదు నిన్నుఁ బోలఁగా నీవసుధా తలంబున మహీశ్వరు లెవ్వరు లేరు సన్మునీం ద్రావలి యెప్డు నిన్నుఁ గొనియాడుఁ బరిస్ఫుటవాక్య భంగులన్.

3_4_196 చ. అని పలుకంగ గౌతమ మహాముని యచ్చటనుండి యంతయున్ విని కలుషించి యేల యిటు వీఁకున నోరఱుగంగఁ బ్రేలెదీ జనపతియే విధాతయును శక్రుఁడు నీశుఁడు నర్థకాంక్షి వై మనమున శంకలేక యొకమానవు నింతనుతింప నేటికిన్.

- అత్రి గౌతముల పరస్పర సంవాదము - సం. 3-183-11

3_4_197 వ. అనుటయు నత్రి యిట్లనియె.

3_4_198 ఉ. ఊఱక మీఱ నాడెదవు యుక్తమయుక్తము నాత్మఁజూడఁగా నేరవు సర్వలోకములు నిర్మల నీతి పరాక్రమంబు లొ ప్పారఁగ నేలి ధర్మముల కన్నిటికిం గుదురై వెలుంగు ధా త్రీరమణుండు మేటిగ నుతింపఁగ వోలదె నాకు నిమ్మెయిన్.

3_4_199 వ. అని తన్నాక్షేపించిన గౌతముండు.

3_4_200 ఆ. కలయ నరలు వచ్చి తల తెల్లనైనంతఁ జేసి నీకునెట్లుఁ జేరు నెఱుక జ్ఞాన వృద్ధుఁడైన వాని మాటలు గదా సభలఁ జెల్లు నార్యజనుల కెక్కి.

3_4_201 వ. అని తొడంగి యయ్యిరువురు మహానాదంబుగా వివాదంబు సేయుచుండఁ గాశ్యప నామధేయుండైన ముని సభాసదులైన మునులం జూచి వీరల వాదు మనచేతఁ జక్కంబడదు సకల ధర్మజ్ఞుం డయిన సనత్కుమారు నడుగుద మనిన నా సదస్యు లందఱు సనత్కుమారు పాలికిం జని యత్రిగౌతముల వివాదంబు తెఱంగెఱింగించిన నతండు వారల కిట్లనియె.

3_4_202 ఉ. అత్రి నిజంబ పల్కెఁ దగ నాతని వాక్యము ధర్మయుక్త మీ ధాత్రి సమస్తమున్ బృహదుదగ్ర భుజాగ్రమునందుఁ దాల్చు స త్క్షత్రుయుఁడెల్ల వారలను గావను బ్రోవఁ బ్రభుండు గావునన్ శత్రునిషూదనుం డతఁడు శక్రుఁడు నీశ్వరుఁడున్ విధాతయున్.

3_4_203 క. జనులకు నెల్లను బూజ్యుఁడు జన పాలుం డతని మహిత శాసనమున స జ్జనులును మునులును సద్విధిఁ జనువారలు గాక కడవఁ జన దెవ్వరికిన్.

3_4_204 వ. క్షత్త్రియ ప్రభావం బేమనవచ్చు విరాట్టు సమ్రాట్టు విధిజితుండు సత్యమన్యుండు యథాజీవుండు ధర్ముండు ననుభవ్యనామంబుల నిగమంబులు పార్థివుం గొనియాడుఁ దొల్లి యధర్మంబునకు వెఱచి బ్రాహ్మణులు నిజతేజో బలంబులు క్షత్రియులందు నిక్షేపించిరి నాఁటగోలె బ్రాహ్మ్యంబు వలన క్షత్త్రంబు ప్రవర్తిల్లుచుండు బ్రహ్మక్షత్త్రంబులు పరస్పర సంశ్రయంబులు వెలిగా వర్తింపనేరవు క్షత్త్రియుండు బ్రాహ్మణ సంసేవనంబునం దేజోనిరూఢుండయి యాదిత్యుండు చీకఁటి నడంచునట్లు దురితంబుల నడంచు నట్లగుటంజేసి క్షత్త్రియుండు సర్వాధికుం డగుట నిశ్చయం బనిన నమ్మును లందఱుఏ జని వైన్యునకుఁ దత్ప్రకారం బంతయు నెఱింగించిన నాభూవరుం డత్రిం జూచి.

3_4_205 క. నను నెల్లజనులకంటెను ఘనుఁడని కొనియాడి తీవు కడు నిజముగఁ గా వున నిదె ప్రీతుఁడనైతిన్ గొను మిచ్చెద నీకుఁ నేను గోటిధనంబుల్.

3_4_206 క. అని యిష్ట ధనము లిచ్చినఁ గొని వచ్చి మునీశ్వరుండు గొడుకులకుఁ బ్రియం బునఁ బంచి యిచ్చి యిమ్ములఁ జనియె వనంబునకు ధర్మ సంహిత బుద్ధిన్.

3_4_207 వ. అని చెప్పి మార్కండేయుండు పాండవేయునితో నిట్లను సరస్వతీ గీతయను నితిహాసంబు సెప్పెద నందు విశిష్ట ధర్మంబు లెఱుఁగనగుఁ దొల్లి తార్క్ష్యుం డను మునివరుండు భారతి నారాధించిన నద్దేవి ప్రత్యక్షంబగటయు నిట్లని యడిగె.

3_4_208 క. పురుషున కెయ్యది ధర్మువు పురుషుం డెద్దానఁ బరమ పుణ్యాత్మకుఁడై చిరపుణ్యగతులు వడయును దిరముగ నిదియానతిమ్ము దేవీ నాకున్.

3_4_209 వ. అనిన వానికి నప్పరమేశ్వరి యిట్లనియె.

3_4_210 మ. ధృతి వేదంబులు నాలుగుం జదివి భూదేవుండు నానాధ్వర వ్రతుఁడై యుండెడు నట్టి పుణ్యుఁ డమరా వాసంబునం దుండు ను న్నత వృత్త స్తనభాా మంధరమరున్నారీ పరీరంభసం భృత రోమాంచ సమంచితాంగుఁ డగుచుం బెక్కేండ్లు సంప్రీతితోన్.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com