ఆ భా 3 4 151 to 3 4 180
వోలం సురేష్ కుమార్
-శ్రీ కృష్ణుఁడు సత్యభామతోడఁ బాండవుల యొద్దకు వచ్చుట - సం. 3-180-7
3_4_151 సీ. శైబ్య సుగ్రీవాది జవనాశ్వయుక్తమై యాబద్ధనుత్న రత్నాంశు పటల భాసితంబై చారుపతగ పతాకా విభూషిత గగనమై పొలుపు మిగులు దివ్యరథంబున దేవకీ సుతుఁడు ప్రియంబున సత్యభామాన్వితముగఁ దరళసౌదామినీ దామసముజ్జ్వల ధారాధరోత్సంగ తలమునందు
ఆ. శచియుఁ దాను వెలుఁగు శతముఖుండునుబోలె నరుగుదెంచె ఘనరథాంగనేమి విపులఘోషతాండవిత బర్హి శబ్దశ బ్దాయమానవన విభాగుఁ డగుచు.
3_4_152 వ. ఇట్లు వచ్చి వాసుదేవుండు రథావతరణంబుసేసి ధర్మనందనున కభివందనం బొనరించి భీమార్జున నకుల సహదేవులం గౌఁగిలించుకొని ద్రౌపదిం గారవించి ధౌమ్యాది మహీవరుల చేత నభినందితుండయ్యె నంతఁ గౌంతేయాగ్రజుండు గదాధరునకు నర్ఘ్యాది సత్కారంబులు నిర్వర్తించి తమ్ములుం దానును విప్రజనంబులు నతనిం బరివేష్టించి యుండి రప్పుడు కృష్ణుండు ధనంజయుం దన చేరున నునిచికొని చిరకాల దర్శనోల్లసితంబులైన యాలోకనంబుల నతని యాకారం బత్యాదరంబున నభినందించి ధర్మరాజున కిట్లనియె.
3_4_153 సీ. భాగ్యంబుగాదె యీ పార్థుండు హరుఁ డాదియైన నిర్జర సమూహంబు వలన నెలమిఁ గృతాస్త్రుడై యేతెంచు టరయంగ ధన్యుండ వైతివి ధర్మతనయ నీ ధర్మ నిష్ఠయు నీ తపంబును జూవె యింతకుఁ గారణం బిద్ధచరిత రాజ్యంబు కంటెను రాజేంద్ర ధర్మంబె యిష్టమై యుండు నీ కెల్లనాఁడు
తే. వేదవేదాంగ విదుఁడవు వివిధ యజ్ఞ కర్తవైతి ధనుర్వేద కర్మరుఁడవు ధరణి యెల్ల నేలెడి రాజ ధర్మమున సులభమయ్యె నీకిహ పర శోభనంబు.
3_4_154 చ. దమమును సత్యయుక్తియును ధైర్యనిరూఢియు నిత్యతృప్తియున్ శమమును నీకు నైజములు సన్మతి నర్థవశంబుఁ గామలో భములును బొందపట్లగుటఁ బార్థివ కుంజర ధర్మరాజ నా మమునఁ ద్రిలోక పూజ్య మహిమం బొగడొందెత వివ్విధంబునన్.
3_4_155 వ. అని వెండియు.
3_4_156 శా. ద్యూతువ్యాజమునన్ సభాంగణమునన్ దుర్యోధనుఁ డట్లు దు ర్నీతిం గూరి యొనర్చి నట్లి యఘముల్ నిష్కంబ ధైర్యోన్నమ చ్చేతస్సారుఁడవైన నీకొకనికిం జెల్లెన్ సహింపంగ వి ఖ్యాతక్షాంతులు లేరె ధార్మికులు నిక్కం బిట్టిరే యెవ్వరున్.
3_4_157 ఉ. ఉల్లము సత్యసంయమము నూనినవాఁడవు నీవు విక్రమం బొల్లమిఁ గౌరవాధముల యుద్ధతి యమ్మెయిఁ జెల్లెఁగాక యొం డెల్లను నేల నీదుమది నించుక కిన్క జనించినన్ మహీ వల్లభ యప్డ రూపఱదె వారక వైరికులంబు సర్వమున్.
3_4_0158 చ. వినుత భవన్నియోగ మను వేల యలంఘ్యము గాన యిమ్మెయిన్ ఘనభుజ వీచివిభ్రమవికాసముఁ జూపక నిల్చెఁగాక స జ్జననుత చూడ నీ యనుజసాగరముల్ దఱితోడ విద్విష జ్జనలయకాలులై కడఁగు సర్వజగంబులు నాక్రమింపఁగన్.
3_4_159 ఉ. అంధక వృష్ణి భోజకుకురాన్వయ భూపతులెల్ల నీ దెసన్ బాంధవ సౌహృదయ ప్రణయ భక్తి విశేషము లొప్ప నీ మనో గ్రంధి యడంగఁ జేయ నెసకంబునఁ బూనిన వారు లోభమో హాంధులు ధార్తరాష్ట్రులు జనాధిప మార్కొను వారె వారలన్.
3_4_160 క. చతులంభోదిపరీత క్షితితల సామ్రాజ్యలక్ష్మికిం బతివి జగ న్నుత నీవ నీవు దలఁచిన నతిదుష్కర మెందు లే దనర్గళ మహిమన్.
3_4_161 వ. అనిన సంతసిల్లి కుంతీనందనుండు దేవకీ నందనుతోడ దేవా యెవ్విధంబున నైన నల్పావశిష్టం బైన వనవాస కాలంబును నజ్ఞాతవర్తనంబును దీర్చి లోకనింద్యంబు గాని విక్రమంబునం బగఱ జయింపఁ గోరెదము దీని నంతయు నిర్వహించు భారంబు నీయదియ నిన్ను శరణంబు సొచ్చిన మాకుం బరమ శోభనంబులును సులభంబు లగట నిశ్చయంబు గాదె యనియె నప్పుడు కృష్ణుండు నిజసమీపంబున నున్న పాంచాలిం జూచి యిట్లనియె.
3_4_162 సీ. నీ పుత్త్రు లేవురు నీరజలోచన యదుకుమారులుఁ దారు ముదముతోడ ననుపస స్నేహసమాహిత హృదయులై కరిహయారోహణ పరతఁ దగిలి యాడుచు వివిధ శస్త్రాస్త్ర ప్రయోగముల్ గఱచుచు నొండెల్ల మఱచి యున్న వారు ప్రద్యుమ్నుండు వారికి దివ్యాస్త్రజాతంబు లెల్లను బ్రీతినొసఁగెఁ
ఆ. దన్వి యా సుభద్ర తన పుత్త్రుకంటె నీ తనయులందుఁ గూర్మిఁ దనరఁ జేయు నూఱడిల్లు మింక నుజ్జ్వలోన్నతులఁ బెం పారఁ గాల మనతి దూరమయ్యె.
- మార్కండేయండను మహాముని పాండవుల యొద్దకు వచ్చుట - సం. 3-180-39
3_4_163 వ. అని యాశ్వాసించు సమయంబునం బరమతపోవృద్ధుం డయిన మార్కండేయుండు ననుదెంచినం గృష్ణుండును బాండవులు నతని నెదుర్కొని యథోచిత విధులం బూజించిరి మునీంద్రుఁడును బ్రత్యేకంబ వారి కుశలంబు లడిగెఁ దదనంతరంబ యందఱు నాసీనులై యున్నయెడఁ బాండవ హితార్థియై వనజోతరుం డమ్మునివరుల కిట్లనియె.
3_4_164 ఉ. ఏనును బాండు నందనులు నిమ్మునిముఖ్యులు నిప్డు లోకస మ్మానిత వాక్య నీదయిన మంజులవాగమృత ప్రవాహమున్ వీనులదోయి నించుచును వేడుకఁ గ్రోలికొనంగ నాత్మలం బూనెద మస్మదీప్సితము పూర్ణము సేయఁగ నర్హ మెమ్మెయిన్.
3_4_165 వ. కావున.
3_4_166 క. దేవనర దేవధరణీ దేవచరిత్రములు భర్తృదేవత లనఁగా భూవినుత లయిన సతుల ప్ర భావము లెఱిఁగింపు మోలిఁ బ్రస్ఫుటములుగన్.
3_4_167 వ. అని యడుగుచున్నయెడ నారదుం డేఁగుదెంచిన నందరు ప్రత్యుద్గతులయి ప్రణమిల్లి యాతని నుచిత సత్కారంబులం బ్రీతునిం జేసిన నమ్మహాముని మార్కండేయునిం జూచి కృష్ణపాండవ ప్రియార్థంబుగాఁ బరమపుణ్య కథాకథనం బొనరింతువు గాకయని పలికి వారల నామంత్రణంబు సేసి నిజేచ్ఛం జనియెఁ దదనంతరంబ ధర్మతనయుండు మార్కండేయున కిట్లనియె.
3_4_168 సీ. కడఁగి ధర్మముతోడ నుచుచు నేమిట్లు దందడి దుఃఖంబు బొందుటయును నేపున నెప్పుడు పాపంబు సేయుచు ధృతరాష్ట్రజులు సుఖోన్నతు లగుటయుఁ గని యివ్విపర్యయమునకు నేనూహింతుఁ బాయక నరుఁ డిప్డు సేయుకర్మ మున ఫల మిందుఁ బొందునొ పరలోకంబు నందుఁ బొందునొ యిందు నందుఁ గననొ
ఆ. విశ్వకర్త యైన యీశ్వరుఁ గానని పురుషుఁ గర్మఫలము పొరయకున్నె యొడలితోనఁ గృతము వెడలిపోవునొ యిది దెలియ వలయు నాకు నలఘు పుణ్య.
3_4_169 వ. ఇంతయు నెఱింగింప నీవ యర్హుండ వనినఁ బరమజ్ఞాన నిధియైన యత్తపోనిధి యతని కిట్లనియెఁ దొల్లి విధాత ప్రథమ కల్పంబున నత్యంత నిర్మలంబులును ధర్మతంత్రంబులును నైన శరీరంబులు సృజియించె నట్లు పుట్టింపఁబడిన యా మనుష్యులు మహా సతత్త్వ సంపన్నులు సత్యవాదులు సత్యసంకల్పులు బ్రహ్మ భూతాత్ములు స్వచ్ఛంద జీవులునై దేవయానంబుల విహరించుచు ననాయాసంబున నధిక ఫల సిద్ధిం బొందుచు సర్వధర్మజ్ఞులై విగత మత్సరులై బహు సహస్ర సంతానులై బహు సహస్ర సంవత్సరాయుష్యులై వర్తిల్లుచుండి రంతఁ గాలాంతరంబునం గామ క్రోధాది గుణంబులు దమ్ముం బొందుటయు మాయాప్రవరాతనులై దేవతలచేత విడువంబడి యల్పాయువులు నల్పబల శరీర సత్త్వులును దరిద్రులును నిష్ఫలారంషులును బహురోగ పీడితులును నాస్తికులును నై యొండొరుల మెచ్చక దురితంబులు సేయుచుఁ దిర్యగ్యోనులం బుట్టుచు నరకాగ్నులం గ్రాఁగుచు గతాగత భ్రమణంబుల నలయం దొడంగి రిట్లు దిరుగుచున్న సంసార చకరంబునందు.
3_4_170 చ. మనుజులు పుణ్యపాపములు మానకు యిట్లొనరించుచుం దుదిం దనువు దొఱంగి పోవునెడఁ దప్పదు నీడయవోలెఁ గర్మమున్ వెనుకన యేఁగి భూరిసఖ విస్మృతియుం బటు దుఃఖదైన్యముం దనుకఁగఁ జేయు గ్రమ్మఱఁగ దాన యొనర్చు భవంబు దేహికిన్.
3_4_171 క. విను మనుజున కెవ్విధమునఁ దనచేసిన సుకృత దుష్కృతంబులు నెఱయం దన కనుభవింపఁ బాలివి తనువుసెడుం గాని కర్మతతి సెడ దనఘా.
3_4_172 వ. మఱియు నొక్క నిదర్శనంబు సెప్పెద.
3_4_173 క. ఈ లోకము యగుఁ గొందఱ కాలోకము కొందఱకు నిహంబును బరమున్ మేలగుఁ గొందఱ కధిపా యేలోకము లేదు వినవె యిలఁ గొందఱకున్.
3_4_174 వ. అది యెట్లంటేని.
3_4_175 చ. ధనములు సాలఁ గల్గి సతతంబును నింద్రియవాంఛ సల్పుచున్ మనమున నెన్నఁడున్ సుకృతమార్గము పొంతకుఁబోక లోభమో హ నిహతబుద్ధులై తిరుగునట్టి జనుల్ పరలోక సౌఖ్యముల్ గనుటసు నేర రిప్పటి సుఖంబులు మేలయి తోఁచు వారికిన్.
3_4_176 మ. ఉపవాస వ్రత సంతతాధ్యయన తీర్థోపాసనాది క్రియై క పరత్వంబునఁ జేసి యైహికము దుఃఖప్రాయ మై పోవఁగా విపులానందముఁ బొందఁ గల్గుఁ దుది నావిర్భూత భోగైకలో లలుబుద్ధిం జిరపుణ్యశీలురకు నాలోకంబునన్ భూవరా.
3_4_177 ఉ. ధర్మమ సల్పుచుం దగిలి ధర్మపథంబునఁ జేసి యర్థముం చేర్మియుఁ గాంచి ధర్మవిధిఁ బెండిలియై ప్రజలన్ సృజించి స త్కర్మములం బ్రశస్తములుగాఁ గ్రతువుల్ వొనరించు సజ్జనుల్ ధర్మజ యిందు నందును ముదంబునఁ గాంతు రభీష్ట సౌఖ్యముల్.
3_4_178 క. వాసవ నందన సఖుఁ డగు ఆ. సత్యమును శమంబు శౌచంబు లేక నా స్తిక్యమును నిషిద్ధ సేవనంబు గలిగి తిరుగు దుష్ట కష్ట జన శ్రేణి పొలియు నుభయలోకములకుఁ గాక
3_4_179 వ. ఇది మనుష్యుల కర్మగతి ప్రకారంబు.
3_4_180 చ. జనవర మీరు దివ్యులరు సమ్మతి దేవహితార్ధ మిమ్మహిన్ జననము నొందినారరు ప్రశక్త పరాక్రమలీలఁ బేర్చి యిం క నఖిల శత్రు నిర్మథన కర్మ మొనర్చి మహీభరంబు దీ ర్చి నియతిఁ బెక్కు జన్మములు సేసి చ. జనవర మీరు దివ్యులరు సమ్మతి దేవహితార్ధ మిమ్మహిన్ జననము నొందినారరు ప్రశక్త పరాక్రమలీలఁ బేర్చి యిం క నఖిల శత్రు నిర్మథన కర్మ మొనర్చి మహీభరంబు దీ ర్చి నియతిఁ బెక్కు జన్మములు సేసి భజింతురు దేవ భావమునన్.
వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com