ఆ భా 3 4 121 to 3 4 150
వోలం సురేష్ కుమార్
3_4_121 వ. అయ్యగస్త్యుచేత నిట్లు శాపగ్రస్తుండనై శక్రాసనంబు వలనం బాసి యిట వచ్చుచు నుండి మునీంద్రా నాకుఁ బూర్వస్మృతి సెడకుండను బలవంతంబు లైన సత్త్వంబులు నన్ను ముట్టునప్పుడ బహహీనంబులై భక్ష్యంబులు గాను శాప విమోక్షంబున కుపాయంబును బ్రసాదింపు మని కృతాంజలినై యున్న నాకుం గరుణించి మునివరుండు నావేఁడిన వరంబు లిచ్చి వెండియు నిట్లనియె.
3_4_122 క. క్రమమున నీ చేసిన ప్ర శ్నములకుఁ బ్రత్యుత్తరములు సన్మతి నత్యు త్తముఁ డెవ్వఁ డిచ్చు నతని క తమునను శాపాంతమగు బుధస్తుత నీకున్.
3_4_123 వ. అది దీర్ఘకాలంబునంగాని కాదనియె నేనును దద్వచనం బవలంబించి పెద్దకాలం బియ్యడవి నున్న వాఁడ నేఁడు నీ తమ్ముఁడు నాకు నష్టాప్రాప్తంబైన భక్ష్యం బయ్యెనోపుదేని నా ప్రశ్నములకుఁ బ్రత్యుత్తరంబు లిచ్చి వీని విడిపించు కొమ్మనిన ధర్మజుం డిట్లనియె.
3_4_124 క. నీ యడిగిన యర్ధాభి ప్రాయములకు నుత్తరంబు పరువడిఁ జెప్పెన్ ధీయుత బ్రాహ్మణులకుఁ గా కాయతమతు లయ్యు నొరుల కవి విషములే.
- ధర్మరాజు నహుష ప్రశ్నంబులకుఁ బ్రత్యుత్రంబు లిచ్చుట - సం. 3-177-13
3_4_125 వ. అయినను నా నేర్చు విధంబునం జెప్పెద నడుగుమనిన నజగరం బిట్లనియె.
3_4_126 ఆ. ఘనుఁడ యే గుణములు గలవాఁడు బ్రాహ్మణుం డతని కెఱుఁగఁ దగిన యట్టివస్తు వెద్ది దీని నాకు నెఱిఁగింపు మనిన ని ట్లనుచుఁ జెప్పెఁ బాండవాగ్రజుండు.
3_4_127 సీ. సత్య క్షమా దమ శౌచ దయా తపోదాన శీలంబు లెందేనిఁ గాన నగునట్టి వాఁడు బ్రాహ్మణుఁడు సుఖంబు దుఃఖంబునై నెడ విమోహంబు నొంద కునికియ వానికి నుత్తమం బగు విద్య యనిన నీ చెప్పిన గుణము లివియు క్రియ శూద్రునందుఁ గల్గిన నతండుత్తమ ద్విజుఁడుగా నేర్చునే నిజము విడిచి
ఆ. నట్టు లయిన బ్రాహ్మణాది వర్ణ విభాగ మెట్లు గలుగునయ్య హీను లధికు లను వివేక మదియపార్థకం బగుఁగాదె యనిన ననియె నంతకాత్మజుండు.
3_4_0128 వ. ప్రమాదంబున వర్ణ సంకరం బయినప్పుడు వర్ణ పరీక్షార్థంబుగా బ్రాహ్మణాదులకు వృత్తంబు వేఱువేఱ స్వాయంభువుండైన మనువు సెప్పె సత్యాది గుణంబులు శూద్రునందుఁ గలిగినేని వాఁడు సచ్ఛూద్రుండుఁ గాక బ్రాహ్మణుండు గానేర్చునే యవి బ్రాహ్మణు నందు లేనినాఁడు శూద్రుం డనంబడు గావున వృత్తంబ యుత్తమంబ.
3_4_129 తే. వృత్తవంతుండు వెండియు వివిధ గతుల వృత్తవంతుండు గా నేర్చు వృత్తహీనుఁ డైనవాడు విహీనుండ యండ్రుగాన విత్తరక్షకుఁ గడు మేలు వృత్త రక్ష.
3_4_130 వ. అనిన నజగరం బిట్లనియె.
3_4_131 వ. అప్రియంబు జేసియు మఱియు నృతవాది యయ్యు హింస గావింపని యమ్మహాత్ముఁ డేఁగు సుగతికి నండ్రది యెట్ల హింస యనఘ యింత విశేష మెట్లయ్యె చెపుమ.
3_4_132 వ. అనిన ధర్మతనయుం డిట్లనియె దానంబులు బ్రియంబు చేఁతయును సత్యంబును నహింసయు ననునవి నాలుగును సమంబులయయినను నహింస విశేషం బెట్లనిన దేవ మనుష్య తిర్యగ్యోనులను మూఁడు గతుల యందును మనుష్యుండు దానాది గుణంబులు గలిగి యహింసా పరుండయిన దేవగతి వడయు విపరీత వర్తనుండు తిర్యగ్యోనులం బొందు నని యిట్లు తన చేసిన ప్రశ్నంబులకు నుత్తరంబులు చెప్పిన ధర్మరాజున కతిప్రీతుండై భీమసేనుని విడిచి శాప విముక్తుండై దివ్యరూపంబు సేకొనియున్న నహుషు వలన నధ్యాత్మ విద్యా రహస్యంబు లిమ్ముగా నెఱింగి యుధిష్ఠిరుండు వృకోదరుం దోడ్కొని నిజాశ్రమంబునకు వచ్చి యున్నంత.
3_4_133 క. ఖర కిరణ తాపమున నురు తరదవ దాహమున శోషితములైన వనాం తరతరుతతి కాప్యాయన కరమై వర్షాగమంబు గడు బెడఁగయ్యెన్.
3_4_134 క. నాలుగు కెలఁకుల నవఘన జాలంబులు వ్రేని కురిసె ఝంఝానిల వే గాలోలములై బహు ల స్ధూల పయోధార లోలిఁ దుములంబులు గాన్.
3_4_135 క. ఘనతర ధర్మతమం బొకొ యనఁగ ఘనాఘన తమిస్ర మ విరళమై క ప్పినజనులకు వస్తువి భా వన మొక్కొక మాటు గలిగె వైద్యుతరుచులన్.
3_4_136 చ. అరుదుగ తత్పయోద సమయంబున నొక్కట విస్తరిల్లె నం బరమున నంబుద ధ్వనియుఁ బల్వల భుముల భూరి దర్దురో త్కర రవముల్ మహీరుహ శిఖండములందు శిఖండి తాండవాం తర మద మంజులస్వనము దారతరంబుగుచున్ వనంబునన్.
3_4_137 ధళిత నవీన కందశ కదంబ కదంబక కేతకీరజో మిళిత సుగంధ బంధుర సమీరణ మన్ సఖి యూచు చుండఁగా నులియుచు పువ్వు గుత్తులను నుయ్యెల లొప్పగ నెక్కి యూఁగె మ ల్లల దళినీ కులంబు మృదుల ధ్వని గీతము విస్తరించుచున్.
3_4_138 క. సురచాప చిత్ర గగన స్ఫురణం బురణించు నట్లు భూ వనిత నిరం తర చిత్రితయై యొప్పెను సురుచిర నవతృణ శిలీంద్ర సురగోపములన్.
3_4_139 వ. తత్సమయానంతరంబున.
3_4_140 ఉ. భూసతికిం దివంబునకుఁ బొల్పెసఁగంగ శరత్సమాగమం బాసకల ప్రమోదకరమై విలసిల్లె మహర్షి మండలో పాసిత రాజహంస గతి భాతి ప్రసన్న సరస్వతీ కమ బ్జాసన శోభితం బగుచు నబ్జజుయానముతో సమానమై.
3_4_141 ఉ. శారద రాత్రు లుజ్జ్వల లసత్తర తారక హార పంక్తులం జారుతరంబు లయ్యె వికసన్నవకైరవ గంధబంధురో దార సమీర సౌరభము తాల్చి సుధాంశు వికీర్యమాణ క ర్పూర పరాగ పాండు చిపూరములం బరిపూరితంబు లై.
- నన్నయభట్ట కవిత్వము సంపూర్ణము - - ఇక్కడ నుండి యెఱ్ఱాప్రెగ్గడ కవిత్వము -
3_4_142
చ. స్ఫురదరుణాంశు రాగరుచిఁ బొంపిరివోయి నిరస్తనీరదా
వరణములై దళత్కమల వైభవ జృంభణ ముల్లసిల్ల ను
ద్ధురతర హంస సార మధువ్రత స్వనముల్ సెలంగఁగాఁ
గరము వెలింగె వాసర ముఖంబులు శారద వేళఁ జూడఁగన్.
3_4_143 శా. దానాంభః పటలంబునం బృథు పయోధారావలిం దాల్చి గ ర్జానిర్ఘోషము బృంహిత చ్ఛలనఁ బ్రచ్ఛాదించి ప్రావృట్పయో దానీకంబు శరద్భయంబున నిగూఢాకారతన్ డిగ్గె నాఁ గానొప్పారె మదోత్కటద్విరద సంఘంబుల్ వనాంతంబునన్.
3_4_144 క. కల నీలకంఛ కోలా హల లీలలు సెలఁగె రాజహంస కులంబుల్ విలసించె సప్తవర్ణా వలి విగళిత కుసుమ కూటజ వాటిక లడరెన్.
3_4_145 మ. అతి గాంభీర్య విభూతి నేక చుళు కాహంకార నిశ్శేషశో షిత పాథోధిపయస్కుఁ డైన ముని దోఁచెం బుణ్య తేజోమయా కృతి నయ్యామ్యదిగంత వీథిఁ బ్రకట క్రీడాకళా గర్వగ ర్జిత మండూక కళంకితాంబుశు చితా సిద్ధి ప్రదాచార్యుఁడై.
3_4_146 తే. విశదశారదాంబుద పరివేష్టమునఁ బొలుచు గగనంబు ప్రతి బింబములొ యనంగ వికచకాశ వనీ పరివేష్టమున నతిశయిల్లె నిర్మల కమలాకరములు.
3_4_147 వ. అట్టి శారదాగమంబున నుత్ఫుల్ల కమలకల్హార కేసర కరాళ కలితకల్లోల మాలినియు ననేక మునిలోక సతత సంసేవ్య మాన విపుల పులినోత్సంగయు నిరంతర తీర వానీరవన మండలీ విలసితయు నాకశ సంకాశ విశద సలిలయునైన సరస్వతీ మహానది ననుదిన స్నానపానాది విశేషంబులం బరితోషంబు నొందుచుఁ బాండు నందనులు మరుభూమిం గొన్ని దినంబులు వసియించి తదనంతరంబ ధౌమ్యాది భూసురులు నింద్రసేనాది భృత్యులు దోడ నరుగుదేరఁ గామ్యక వనంబునకు వచ్చి యచ్చటి మునుల చేత నభినందితులై యందు సముచిత వర్తనంబుల నున్నంత నొక్కనాఁడు.
3_4_148 క. వాసవ నందన సఖుఁ డగు భూసురుఁ డొకఁ డరుగుదెంచి భూవినుత గుణో ద్భాసితు ధర్మజు విప్రస భాసీనుం గాంచి యిట్టు లనియెం బ్రీతిన్.
3_4_149 చ. జనవర నీవుఁ దమ్ములును సమ్మద మొప్పగ నివ్వనంబునం దునికి ధ్రువంబుగా విని మహోజ్జ్వల తేజుఁడు దేవకీ సుతుం డనఘుఁడు మిమ్ముఁ జూచుటకై యిదె వచ్చుచున్నవాఁడు మీ కును ననిశంబుఁ దా హితమ కోరుచు నుండు నతండు నెయ్యుఁడై.
3_4_150 వ. మఱియు ననేక యుగ సహస్రజీవియు నప్రమేయ తపః ప్రభాసియు వినుత విధేయుఁడునైన మార్కండేయుండును భవదీయ దర్శనార్థం బీక్షణంబ చనుదెంచు నని చెప్పిన యనంతర ముహూర్తంబున.
వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com