ఆ భా 3 3 061 to 3 3 090
వోలం సురేష్ కుమార్
3_3_061 సీ. అశ్వమేధంబు సేయంగ దీక్షితుఁడయ్యె సగరుండు వాని యశ్వంబు సగర తనయులచే రక్షితంబై వసుంధర యెల్లఁ గ్రుమ్మరి తోయహీనమైన జలధిలోపల నదృశ్యంబైనఁ గానక సగరున కెఱిఁగించి సగరసుతులు జనకు శాసనమునఁ జని భూతలమునందుఁ దడయక రోసి పాతాళతలము
ఆ. నందు రోయఁ గడఁగి యఱువదివేవురు నొక్క మొగిన గ్రొచ్చ రుదధిలోన జలధిపంకమగ్న సత్త్వముల్ నిశితకు ద్దాలహతి విదారితములు గాఁగ.
3_3_062 వ. ఇట్లు గ్రొచ్చి గ్రొచ్చి సగరసుతులు సముద్ర పూర్వోత్తర దేశంబునం గపిలుండను మహాముని యాశ్రమ సమీపమునందుఁ దమ గుఱ్ఱంబుఁ గని సంతోసిల్లి.
3_3_063 ఆ. అశ్వమేధమునకు నర్చితంబైనయీ యశ్వరాజు నిట్టు లపహరించి మ్రుచ్చు గొఱక యీ సముద్ర దేశంబున నోట మెడఁదలేక యున్నవాఁడు.
- సగరసుతులు గపిలమహాముని కోపాగ్నిచే భస్మమగుట - సం. 3-106-3
3_3_064 వ. అని పలికి కపిలుం బరిభవించిన నమ్మునివరుఁ డలిగి యనలశిఖలు దూల నతి ఘోరదృష్టిం జూచిన నప్పుడు సగర సుతు లందఱు భస్మంబైన.
3_3_065 క. వీరు లగు సగర తనయుల దారుణ దాహంబుఁ జూచి తడయక చని యం భోరుహగర్భ తనూజూఁడు నారదుఁ డంతయును సగరునకు నెఱిఁగించెన్.
3_3_066 క. దాని విని సగరుఁ డురుశో కానల దందహ్య మానుఁడయ్యును నయ్యీ శాను వచనంబు దలఁచి ధ రానాథుఁడు శోక భరపరావృత్తుండై.
3_3_067 వ. అసమంజస పుత్త్రు నంశుమంతుం దన మనుమనిం జూచి యయ్యా నీయయ్య లఱువది వేవును నొక్కటఁ గపిలకోపానల కబళిత శరీరు లయిరి భవజ్జనకుండతి క్రూరహృదయుండై పౌరబాలకుల నకారణంబ వధియించి మహానదిలో వైచుచున్న నెఱిఁగి పౌరజనాక్రోశంబు నం దనుక్రోశపరుండవై వాని విడిచితి.
3_3_068 క. కొడుకులకు వగవ మును నా కడఁగిన హయమేధమఖము గడచనమికి నేఁ గడు దుఃఖితుండ నయ్యెదఁ దడయక నీవిపుడు దీని దలఁగుము కడఁకన్.
3_3_069 వ. అనిన నంశుమంతుం డాక్షణంబ చని సగరసుత ఖాత ద్వారంబున సముద్రంబు సొచ్చి యందు సూర్యసహస్రద్యుతియై వెలుంగు చున్న కపిలమహామునికి నమస్కరించి నిజగమన ప్రయోజనం బెఱింగించినఁ గపిరుండును వానికిం గరుణించి యాజ్ఞీయంబైన యశ్వంబు నిచ్చి యిట్లనియె.
3_3_070 క. ఘనభుజ నీ కారణమునఁ జనఁ గాంతురు పుణ్యగతికి సాగరులు ముదం బున సగరునకు దొరకును నొనరఁగ సుతవంతులైన యుత్తముల గతుల్.
3_3_071 వ. మఱియు నీచేత నుపనీతం బైన యియశ్వంబున నశ్వమేధంబు సేసి సగరుండు కృతార్థుండగు నీ పౌత్రుండైన భగీరథుఁ చేత దేరం బడియెడు గంగా జలౌఘంబులం జేసి సంసిక్తులై సగరసుతులు స్వర్గగతు లగుదురు సముద్రంబు సంపూర్ణంబగు ననిన నంశుమంతుండు సంతుష్టుండై కపిల ప్రసాదంబున నశ్వంబుఁ దెచ్చి సగరున కిచ్చి కపిల వచనంబు నెఱింగించిన సగరుండును బుత్త్రశోకం బుడిగి యశ్వమేధంబు సేసి సముద్రుం దృనకు బుత్త్రుఁగాఁ గల్పించిన నది మొదలు సముద్రంబు సాగరంబు నాఁబరగె నిట్లు సగరుండు పెద్దకాలంబు రాజ్యంబు సేసి నిజరాజ్యభారం బంశుమంతు నందు సమర్పించి చనిన.
3_3_072 తే. తన పితామహు నట్టుల ధరణి యేలి యంశుమంతుండు నిజ పుత్త్రుఁడగు దిలీపు నందు రాజ్యభారముఁ బూన్చి యఖిలలోక పూజీతుండు దపోవనంబునకుఁ జనియె.
3_3_073 వ. దిలీపుండును దన పితామహులైన సాగరు లధోగతులు గాకుండ గంగావతరణంబునందు యత్నంబు సేసి యశక్తుండై.
3_3_074 చ. ప్రథితయశున్ సుతుంబడసె భారసహిష్ణు మహారథున్ భగీ రథుఁడను చక్రవర్తి నపరాజితతేజు నిజాస్వవాయదు ష్పథ వినివర్తకున్ సకరపార్థివ జైత్రు మదోద్ధతాసుహృ న్మథను సురాపగానయ సమర్థ తపోగుణ యుక్తు నుత్తమున్.
3_3_075 వ. ఆ భగీరథు నపార భూభార ధురంధరుం జేసి దిలీపుండు తపోవనంబున కరిగిన.
3_3_076 తే. కపిలు కోపాగ్నిఁ జేసి సాగరులు గ్రాఁగి రనియు గతిఁ గానకున్న వారనియు నెఱిఁగి వారలకు హిత మొనరింప వగచి గంగఁ దేరఁ గడఁగె వీరుండు భగీరథుండు.
3_3_077 వ. ఇట్లు భగీరథుండు గంగావతరణంబునందుఁ గృతనిశ్చయుండై యరిగి బహువిధాకార ధాతుమంతంబు లైన యుత్తుంగ శృంగంబులను జలభర వినమ్ర ప్రబల బలాహక వ్యూహ సంఛాదిత శ్యామాయమానంబు లైన తుహిన స్థలంబులను సిద్ధవి ద్యాధర గంధర్వ గీర్వాణ మిథున సంసేవ్యమానంబులైన నానారత్న కందరంబులను శుక పిక పారావత శుక్లాపాంగ సారంగ శతపత్ర పుత్ర ప్రియదాత్యూహ వ్యూహశబ్ధశబ్ధాయమానంబు లైన తరువన రేఖలను సింహ శరభ శార్దూల శుండాల గోలాంగూల కోలాహలాన్వితంబులైన గుహాగహ్వారంబులనుం జేసి రమణియ భయానకం బైన హిమవత్పర్వతంబున.
3_3_078 చ. సతతకృతోపవాసముల శాకఫలోదకమూల పారణ వ్రతముల దేవపూజల నపారజపంబబఁ జేసి నిష్ఠతో నతులతపంబు సేసె నమపరాగ నుర్వికిఁ దెచ్చు వేడ్కతో ధృతియుతుఁడై దిలీపకుల దీపుఁడు దివ్య సహస్ర వర్షముల్.
3_3_079 వ. ఆ భగీరథ తపంబునకు మెచ్చి గంగాదేవి ప్రత్యక్షంబై నీ యిష్టంబు సెప్పుమనినం గృతాంజలియై యిట్లనియె.
3_3_080 సీ. తపనతేజుండైన కపిలు కోపంబున గతజీవులై పుణ్యగతుల యందు నిహతులై మత్పితామహులున్న వారు నీదగు పుణ్యజనముల సగరసుతులు సిక్తులై స్వర్గానుభుక్తిఁ బ్రాపింతురు గావున దేవి యిద్దేవ పథము నందుండి వసుమతి కొందంగఁ జనుదేరవలయు నావుడు మహీవలయునకు
ఆ. నేను వచ్చునపుడు నా నిరంతర జలౌ ఘంబు దాల్ప నీలకంఠుఁ డోపుఁ గాని యొరులు దాల్పఁగా నోప రయ్యుమా నాథు కరుణఁ బడయునన్నుఁ దాల్ప.
3_3_081 వ. అనిన గంగా దేవి వచనంబునఁ గైలాసంబున కరిగి భగీరథుండు భగవంతు నంతకాంతకు నీశ్వరు గుఱించి పెద్దగాలంబు దపంబు సేసిన నీశ్వరుండు వానికి సన్నిహితుండయి నీవు భూలోకంబునకు గంగావతరణంబు సేయు మేను గంగ ధరియించెద ననిన భగీరథుండు వెండియు గంగ నారాధించిన నాతనికిం గరుణించి.
3_3_082 మ. ఇలకున్ గంగ తరంగు సంగతులతో నేతెంచి నాశాంతరం బులు నాకాశముఁ గప్పుచుం దగ మహాభూత ప్రపంచంబుతోఁ జెలువై యుండఁగ దాని నీశ్వరుండు దాల్చెన్ సంగతోత్తుంగపిం గళ జూటూగ్రము నందుఁ బద్మదళ సంగాశంబుగా లీలతోన్.
3_3_083 సీ. సురముని సిద్ధఖేచరవరుల్ వచ్చి యచ్చెరువంది చూడంగ హరుశిరంబు నందుండి భువనైకవందిత సురనది ధరణీ తలంబున కరుగు దెంచి కలహంస గతియు నిర్మల ఫేనహాసంబు నా కీర్ణ మీన విలాకనములు నాలోల పవన వాచాలిత కల్లోల సిత మృదూక్తులు నెసఁగు చుండఁ
తే. బ్రీతితో భగీరథుఁడను దూత చేత నీతయై మహాముని పరిపీత రిక్త మగు సరిత్పతిఁ గూడి యా సగరజులకు హితముగా దానినించె నాతత జలముల.
3_3_084 క. సాగరులకు సద్గతిగా సాగరమున కట్లు సలిల సంపూర్ణముగా భూగతమై భాగీరథి భాగీరథ కీర్తి భువన పంక్తుల నించెన్.
3_3_085 వ. అని యుట్లు గంగావతరణంబును భగీరథ మహాత్మ్యంబును రోమశుండు సెప్పిన విని ధర్మజుండనుజ సహితుండై యరిగి నందయు నపరనందయును నను మహానదుల యందుఁ గృతస్నానుండై హేమకూటంబున నుపలంబుల వలన వెలువడు దహనంబున నాహూతంబులై వచ్చు మేఘంబులను జూచి విస్మయంబంది దాని విధంబడిగిన వానికి రోమశుం డిట్లనియె ఋషభ కూటంబున ఋషభుండను ముని యతికోపనుండై యెవ్వరు పలికిన నపుడె యుగ్రానలాకారుండై యుపలంబులవలన వెలువడు మేఘంబులం బిలిచి వారల వారించు దానం జేసి తపోదాన ధర్మ శమదమరహితులైన జనుల కది దురారోహంబు దేవతలు దేవదర్శనులైన ఋషులు నమ్మునిం జూడవత్తురిందు దేవఋషులు యజ్ఞంబు సేసిన యజ్ఞభూములందుఁ గుశాకారంబు లయిన దూర్వాంకురంబులు యూపాకారంబులైన వృక్షంబులుఁ గానంబడుననిన నాపుణ్య తీర్థంబున స్నానంబుసేసి యరుగుచున్న ధర్మరాజునకు రోమశుం డిట్లనియె.
3_3_086 క. ఇది విశ్వామిత్రుని యా స్పద మిది కౌశికి యనంగఁ బరగినయది య ల్లది ఋష్యశృంగుఁ డను ముని హ్రద మనవుడు ధర్మతనయుఁ డమ్ముని కనియెన్.
- రోమశుఁడు ధర్మరాజునకు ఋష్యశృంగు చరిత్రము సెప్పుట - సం. 3-110-6
3_3_087 వ. ఋష్యశృంగుండను ముని జన్మంబులు దచ్చరితంబును వినవలయు నది యెట్లది యడిగిన రోమశుం డిట్లనియెఁ దొల్లి కశ్యప పుత్త్రుండగు విభాంకుం డను మునివరుం డఖండిత బ్రహ్మచర్యంబునం దపంబు సేయుచు నొక్కనాఁ డొక్క మడువున నీళ్ళాడుచున్న యవసరంబున.
3_3_088 క. సురుచిర సురూప గణ సుం దరి యూర్వశి యను లతాంగీ తద్దర్శనగో చర యగుడు నపుడ రేత స్స్ఖలనం బమ్మునికి నయ్యెఁ గామకృతమునన్.
3_3_089 వ. అయ్యమోఘ వీర్యంబుతో మిశ్రమంబయిన జలంబు నొక్క దుప్పి పెంటి ద్రావి గర్భంబు దాల్చిన నందు ఋష్యశృంగుం డను కుమారుండు జన్మించి తండ్రినిం దదాశ్రమంబునుం గాని యొండెఱుంగక ఘోరతపంబు సేయుచన్నంత.
3_3_090 తే. బలియుఁ డంగాధిపతి రోమపాదుఁ డనఁగ ధరణిఁ బరగిన వీరుండు దనపురోహి తాపరాధకృతమున బ్రాహ్మణుల చేత విడువఁబడినఁ దన్మహి కనావృష్టి యయ్యె.
వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com