వోలం సురేష్ కుమార్


శ్రీ మదాంధ్ర మహాభారతము అరణ్య పర్వము - తృతీయాశ్వాసము

3_3_001 క. శ్రీమందిర బుధజనచిం తామణి కోదండపార్థ ధర్మవిచారో ద్దామ నలనృగ భగీరథ రామచరిత్రాభి రామ రాజ నరేంద్రా.

- అగస్త్యు చరిత్రము - సం. 3-98-1

3_3_002 వ. అక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె నట్లు ధర్మతనయుం డగస్త్యు మహాత్మ్యంబు విని వెండియుఁ దచ్చరిత్రంబు రోమశు నడిగిన నమ్ముని యిట్లనియె.

3_3_003 సీ. కృతయుగంబునఁ గాలకేయగణంబుతో వృత్రుఁ డన్నసుర గర్వించి యమర పతిఁ దొట్టి వేల్పుల బాధించుచున్నఁ దద్భయమున నమరులు బ్రహ్మకడకుఁ జని పోరిలో వృత్రుఁ జంప నుపాయ మెయ్యదియొ మా కానతిమ్మని నజుండు దివిరి సరస్వతీ తీరంబు నందు నిశ్చింతుఁడై తపమొప్పఁ జేయుచున్న

ఆ. యా దధీచి కడకు నరిగి వేఁడుండు ని జాస్థు లిచ్చు మీకు నమ్మహాత్ముఁ డవి జయుంచు వజ్రమాదిగా నిఖిల ది వ్యాయుధంబులై సురారివరుల.

3_3_004 వ. అందు వజ్రంబున నింద్రుండు వృత్రు వధియించు ననిన నమరులెల్లం గమలాసను శాసనంబున దధీచి పాలికిం జని కృత ప్రణాములై యిట్లనిరి.

3_3_005 క. భువన జనస్తుత నిజ గౌ రవ మెసఁగఁగ నమరపతి పురస్కృతు లగు ని ద్దివిజుల కెల్ల హితంబుగ భవదస్థిచయంబు లిమ్ము పరమ మునీంద్రా.

3_3_006 వ. అనిన విని దధీచి సంతసిల్లి కృతార్థుండ నైతి నని దేవరితార్థంబుగా నిజ ప్రాణంబుల విడిచె నమరు లెల్ల నమ్మహామునియస్థు లాయుధంబులుగా బరిగ్రహించి రందు.

3_3_007 త్వష్ట యంత నూఱు ధారల రమ్మమై యనల కణకరాళ మైన వజ్ర మొనరఁ జేసి దీన నోర్వుము దైత్యుల ననుచు నిచ్చె దాని నమరపతికి.

3_3_008 వ. అవ్వజ్రంబున నింద్రుండు వృత్రు వధియించె నంత.

3_3_009 చ. అనుపమ దివ్య శస్త్రధరులైన యమర్త్యుల కాహనంబులో మొనయక కాలకేయులు సముద్రమునఁ జొచ్చి దివంబు లెల్ల న వ్వనధి నడంగి యుండి బలవంతులు వెల్వడి రాత్రులెల్ల భూ జనులకు బాధసేయుచు భృశంబుగ నుండిరి క్రూరచిత్తులై.

3_3_010 వ. మరియు విద్యాతపోయుక్తులై ధర్మచరుతు లైన వారికారణంబున జగంబు లపాయంబు నొందక సుఖంబున్న యవి గావున నట్టి వారినరోసి వధియించి జగంబుల కపాయంబు సేయుదమని యసురులు వసిష్ఠాశ్రమంబున నూర్వురను బ్రహ్మమయుల వధియించి భక్షించి యిప్పాయ నవనతరంబు నఖిల మునిగణా శ్రమంబుల కుపద్రవంబు సేయుచున్న.

- దేవతలు వైకుంఠమునకుఁ బోయి విష్ణుని స్తుతియించుట - సం. 3-99-11

3_3_011 క. యాగాది పుణ్యకర్మ త్యాగము మర్త్యమున నైనఁ దా రధిక భయో ద్వేగంబునఁ బురుహూత పు రోగములై యగ్ని యమ వరుణ ధనదాదుల్.

3_3_012 క. చని వైకుంఠంబునఁ ద్రభు వనపతి వైకుంఠు గరుడ వాహను విష్ణున్ దనుజ విభంజను గని యి ట్లని రెంతయు భక్తితోఁ గృతాంజలు లగుచున్.

3_3_013 దేవా నీవు వరాహరుప ధరుండవై మహీతలంబెత్తి నరసింహ రూపంబు దాల్చి యాదిదైత్యు హిరణ్యకశిపు వధించి వామనుండవై బలింగట్టి యజ్ఞమూర్తివై యజ్ఞవిఘ్నకరుండైన జంభుం డను దానవుం జంపి యండజ జరాయుజ స్వేదజోద్భిజ్జంబు లనం బరగిన చతుర్విధ ప్రజల రక్షించుచున్న జగద్రక్షకుండవు గావున నీకు విన్నపంబు సేసెద మిప్పుడు జగంబులకైన యుపద్రవంబు చిత్తగింపుము.

3_3_014 సీ. కాలకేయులు మహాకాయులు పగలెల్ల జలదుర్గ బలమున జలధి నుండి రేలెల్లఁ జని నలిరేఁగి మునీశ్వరా శ్రమముల సద్ధర్మచారులైన బ్రాహ్మణ ప్రవరులఁ బాయక వధి యింతు రెట్టి పాపాత్ములు నెయ్యుగముం బ్రాహ్మణ హింస యాపాదింతురే యది వీరల వలనన వినఁగఁ బడియెఁ

ఆ. బరమ సాధులైన బ్రాహ్మణులకు బాధ యగుడు మహికి బాధయగు ధరిత్రి కైన బాధఁజేసి యఖిల లోకంబులుఁ గరము బాధ నొందుఁ గమలనాభ.

3_3_015 వ. ఎట్లనిన వేదంబులు ధరియించి విప్రులు వేదచోదితంబు లైన పుణ్యకర్మంబులు విధియించుటం జేసి హవ్యకవ్యంబుల దేవతలుం బితరులుఁ దృప్తులైన వారివలన నెల్ల లోకంబులకు సుఖం బగుం గావున బ్రాహ్మణోపద్రవంబు పరిహరించి లోకంబులు రక్షింపు మనిన దేవతలకు విష్ణుదేవుం డిట్లనియె.

3_3_016 మత్తకోకిలము. కాలకల్పుల నుగ్రతేజులఁ గాలకేయుల భూరిర త్నాలయస్థుల వీర్యవంతుల నర్ణవంబు సమస్త స త్త్వాలి దోఁపఁగ వట్టినన్ విషయం బగున్ వధియింపఁగాఁ బోల దొండు విధంబునం బరిపూర్ణ వార్ధి జలోన్నతిన్.

3_3_017 క. వరుణ జలంబుల మిత్రా వరుణ తనూజుండు వీర్యవంతుండై చె చ్చెరఁ ద్రావనోపు నిందఱు నరుగుఁడు ప్రార్థింపుఁ డమ్మహాత్ము నగస్త్యున్.

3_3_018 వ. అనిన నమరు లెల్ల నగస్త్యు పాలికిం జని యమ్ముని వరు స్తుతియించి యిట్లనిరి.

3_3_019 క. అమరహితంబుగ జగదహి తము దలుగుము పేరితో బుధస్తుతగుణ విర్మ ధ్యము దొల్లి పెరిఁగి కగదహి తము సేసిన నీవకావె తలగితి దానిన్.

3_3_020 వ. అని దేవతలెల్ల నగస్త్యుఁ గీర్తించి రనిన విని ధర్మజుం డిది యెట్లు వింధ్యంబేల పెరిఁగె దానిం బెరుఁగకుండ నగస్త్యుం డెవ్విధంబున వారించె నని యడిగిన నాతనికి రోమశుం డిట్లనియె.

- అగస్త్యుఁడు వింధ్యంబు పెరుఁగ కుండ వారించుట - సం. 3-101-2

3_3_021 ఉ. నెమ్మి నినుండు మేరుధరణీధరనాథుఁ బ్రదక్షిణంబుగాఁ ద్రిమ్మరుచున్నఁ జూచి పటుదీధితికిం గలమల్గి వింధ్యశై లమ్మనియెన్ దినేంద్ర యచల ప్రభు నన్నుఁ బ్రదక్షిణంబు ని త్యమ్మును జేయకేల మతి దప్పితి మేరువుఁ గొల్వ నేటికిన్

3_3_022 వ. అని గర్వించి పలికిన నప్పర్వతంబునకు భానుం డిట్లనియె.

3_3_023 క. అనవరతము విధియోగం బున నేఁ ద్రిమ్మరుదు నమరభూధరముఁ బ్రియ మ్మున నాత్మేచ్ఛ యొనర్పఁగ జన దనవుడు నలిగి వింధ్యశైలం బంతన్.

3_3_024 క. ఇనశశితారా దులకుం జన రాకుండంగఁ బెరిఁగి జలధరపథ మె ల్లను గప్పి యుండె వింధ్యం బనుపమ ముత్తుంగమై సురాద్రిస్పర్థన్.

3_3_025 క. రవిశశిగతు లుడుగుదు నిది దివ మిది రాత్రి యని వసుమతీ జనులకు న ద్దివజ మునివరుల కెఱుఁగఁగ నవగాఢంబయ్యె నంధ మయ్యె జగంబుల్.

3_3_026 వ. ఇట్లు పెరిఁగిన వింధ్యంబు నొద్దకు వచ్చి వేల్పులెల్ల దానివర్ధనంబు వారింప నోపక యగస్త్యు పాలికిం జని వింధ్యంబు పెక్కువ యెఱింగించి యిట్లనిరి.

3_3_027 క. భువన వ్యవహారమునకు వ్యవధానం బయ్యె వింధ్యవర్ధనమున న ద్దిపసకర రజనికరగతు లవిహిత మగునట్లు సేయు మమర మునీంద్రా.

3_3_028 వ. అని దేవతలు ప్రార్థించిన నగస్త్యుండు లోపాముద్రా సహితుండై వింధ్యంబు సమీపంబునకు వచ్చి దానిచేతం బూజితుండై యిట్లనియె.

3_3_029 క. చనియెద దక్షిణదిశ కే నొనరఁగఁ దెరు విమ్ము నాకు నర్వీధర నీ వనవుడు నట్టుల చేయుదు నని పెరుఁగుట యుడిగి వింధ్య మతి వినయముతోన్.

3_3_030 వ. భట్టారా విజయుం చేయుం డని భుమి సమానమై యున్నదాని కగస్త్యుం డిట్లనియె.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com