ఆ భా 3 1 151 to 3 1 180
వోలం సురేష్ కుమార్
చ. ప్రతినరపాలకాలు శిశుపాలు బలాధికుఁ జంపి దర్పసం హితుఁ డగుచున్న వృష్ణిఖలుఁ డెక్కడ నాతనిం జయో న్నతి వెలయంగఁ జంపెద రణంబున నంచు నలంఘ్యవిక్రమో ర్జితుఁడయు దాని చుట్టు విడిసెం జతురంగ మహాబలంబులతోన్. 151
క. మెలగు తత్పుర బాహ్యవి శాలోద్యానముల తాల సాల సరళ హిం తాల తమాలావలి ని ర్మూలితముగఁ జేసెఁ దచ్చమూసామజముల్. 152
వ. మఱి తృణ జలధాన్యసమిత్సమృద్ధంబు శతఘ్నీ ప్రముఖానేక యంత్రంబుల నలంఘ్య పరిఘాప్రాకారంబులను నపార బలరక్షితఘనక వాటచతుర్గోపురంబులను లబ్ధ ప్రభూతవేతన ప్రహృష్టపుష్ట ధృష్టవీరసుభట సంకులంబులను నపరిమిత గజతురంగశతాంగంబులను బ్రదీప్తాలాతశాతశరచక్రతోమర పరశుపాశాంకుశ కూటంబులను వీరయోధారూఢ విశాలాట్టాలకంబులను నొప్పి పరుల కసాధ్యం బయున ద్వారవతి భేదింప నేరక దానివెలిం బ్రపాచైత్య దేవాయతన వల్మీకంబులు వర్జించి సమతల ప్రదేశంబున నిబిడంబుగా శిబిరసన్ని వేశంబు సేసి నిత్యంబు నుపద్రవంబు సేయుచున్న సౌంభక విజృంభణంబునకు సహింపక సమర సంరంభంబున సర్వాయుధ సన్నద్ధు లయి. 153
క. ఉద్యద్బలులు గుమారులు విద్యాధరసములు పురము వెలువడిరి రణై కోద్యములు చారుదేష్ణుఁడు బ్రద్యుమ్నుఁడు సాంబుఁడునువిపక్ష జిఘాంసన్. 154
మణిభూషణము. రామవిక్రముఁ డజేయుఁ డరాతి గజావలీ సామజహితుఁడు సాంబుఁడు సాల్వచమూపతిన్ క్షేమవృద్ధి యనువాని నకృతి మసాహసో ద్దాముఁ దాఁకె శరధారల ధారుణిఁ గప్పుచున్. 155
క. జాంబవతేయు బృహద్విశి ఖంబులకున్ బెదర కెదిరి ఘనుఁడేసె రణా గ్రంబున నాతనిపై నవి లంబితుఁడై క్షేమవృద్ధి లక్షశరంబుల్. 156
వ. వాని యేయుశరంబుల నేర్పునకు సహింపక సాంబుండు జాంబులద పుంఖంబు లయిన విశిఖంబులం దదీయ రథాశ్వమర్మంబుల నేసిన నవి మర్మభేదవేదనలం దలరి యతివేగంబున రణంబు వెలువడ రథం బీడ్చుకొని సారథికి వశంబుగాక పఱచె నట్లు సాల్వచమూపతి సమరవిముఖుం డయిన. 157
స్వాగతము. వేగవంతుఁ డనివీరుఁడు సాంబున్ వేగవంతుఁ డయి వీఁకను దాఁకెన్ వేగబాణపదవీతతులన్ ది గ్భాగముల్ విశిఖపంజరముల్ గాన్. 158
ఆ. సాంబుఁ బాయు మనుచుఁ జారుదేష్ణుం డల్గి వేగవంతుఁ దాఁకి వీఁకతోడ వానిమస్తకంబు వ్రయ్యంగ వడి గదం బొడిచో రుధిరవారి పూర మొలుక. 159
వ. ఇట్లు చారుదేష్ణు నిష్ఠురగదాఘాతంబున వేగవంతుండు విగతజీవుం డయి నిర్ఘాత పాతభిన్నోన్నత గిరిశిఖరంబునుంబోలె నేలఁ ద్రెళ్ళినం జూచి విచింత్యుం డనువాఁ డవిచింత్యవిక్రముం డయి. 160
తే. చారుదేష్ణుపైఁ గడువాఁడిశరము లేసె లతఁడు కార్ముకహస్తుఁడై యాక్షణంబ వానిపై నభిమంత్రించి వహ్ని బాణ మేసె నుగ్రస్ఫులింగంబు లెసఁగం జదల. 161
క. అనలాస్త్ర మట్లు వక్షముఁ గొనిన విచింత్యుండు గూలెఁ గుతలం బద్రువన్ ఘను వానిఁ జూచి హాహా స్వనము లెసఁగ సాల్వుసేన సంక్షోభించెన్. 162
వ. సాల్వుండు నిజసేనా సంక్షోభం బుడిచి సర్వాయుధసనాథం బయినరథం బెక్కి యాదవకుమారవాహినిపయు నెత్తి యేయుచు వ్రేయుచుం బొడుచుచుఁ బ్రతిబలంబునెల్ల నాయుధమయంబుగాఁ జేయుచున్న వాని కలిగి. 163
సీ. హంస వర్ణోత్తమ హయములఁ బూనిన రథమెక్కి కాంచనరమ్యయష్టి సంభృత మకర ద్వజం బొప్ప బద్ధగోధాంగుళిత్రాణుఁడై యతులశాత సాటకావలిఁ జేసి సాల్వుఁ బిల్చుచు వానిమీఁదఁ బ్రద్యుమ్నుఁ డమేయ బాణ వర్షంబు గురిసిన వాఁడును వానిపైఁ గడువాఁడి శరముల గడఁగి యేసె.
ఆ. నధికవీరు లయిన యయ్యిద్ధఱకు నస్త్ర కోవిదులకు బోరు ఘోరమయ్యెఁ దద్ద భయమువొంది తద్ద్వారకాపురి సౌంభకముల జనులు సంభ్రమింప. 164
క. అనిమొన సాల్వుఁడు ప్రద్యు మ్ననిశాతశరాలివిద్ధమర్ముం డయి పె ల్చన మూర్ఛవోయి పడియెం దనరథముపయిన్ ధరిత్రి దల్లడపడఁగన్. 165
ఉ. అంతన మూర్ఛదేరి కలుషానలదీప్తముఖుండు సౌంభకుం డంతకదండదారుణము లైలశరంబున రౌక్మణేయు ది గ్దంతిబలాఢ్యు నేయుడు నతండును మూర్ఛితుఁడయ్యె వాని సం భ్రాంతిఁ దదీయసారథి యపాస్తరణాంతరుఁ జేసెఁ జెచ్చెరన్. 166
వ. ఇట్లు మూర్ఛితు డయున ప్రద్యుమ్నుం దోడ్కొని చని రణంబునకు దూరంబుగా నరదంబు నిలిపికొని దారుకసుతుం డున్నంత నొక్కింత ప్రొద్దనకు మూర్ఛదేఱి ప్రద్యమ్నుండు సూతున కిట్లనియె. 167
క. ఘోరాహవరంగమునకు దూరముగా నన్ను నిట్లు దోడ్కొని తేరన్ దారుకసుత నీకుచితమె వీరారంభంబు సూచి వెఱచితె చెపుమా. 168
వ. మరియు సారథిం జూచి విహ్వలమానసుం డయి యిట్లనియె. 169
క. సమర విముఖత్వమును రణ విముఖులఁ జంపుటయు శరణువేఁడిని రక్షిం పమియును యాదవ వంశో త్తముల కుఁగనలయినఁ గలవె దారుకతనయా. 170
క. విక్రమము విడిచి సమరా పక్రాంతుఁడ నయిన నన్ను బలదేవుఁడునుం జక్రధరుండు కుమారులు నక్రూరాదులును నేమియని నగరె సభన్. 171
వ. చెట్ట సేసి తింకనయినఁ జెచ్చెర సాంబ చారుదేష్ణు లున్నచోటికి సాల్వాభి ముఖంబుగా రథంబు వఱపు మనిన సారథి యిట్లనియె. 172
క. రథి కిమ్ము గానియెడ సా రథి ధృతిమెయుఁ గావవలయు రథియును దత్సా రథిఁ గావవలయు రథిసా రథులు పరస్పర శరీర రక్షకు లగుటన్. 173
ఆ. సాల్వబాణ విగత సత్త్వుఁడ వైన ని న్నిట్లు దెచ్చితిని సహింప వలయు నారథాశ్వముల ఘనస్యందనము నిదె చూడు మనుచు సూతసూనుఁ డపుడు. 174
వ. సవ్యాపసవ్య విచిత్రమండల గతుల నాక్షణంబ సాల్వునకు నప్రదక్షిణంబుగా రథంబు వఱపిన దాని సహింపక సాల్వుండు మూఁడమ్ముల సారథినేసి మఱియు రాక్షసమాయ ననేకశరంబులు ప్రద్యుమ్నపై నేసిన. 175
క. అమ్మాయాశరములు భ గ్నమ్ములుగాఁ జేసి తన్ముఖమ్మునఁ దద్వ క్షమ్మున నొక్కట బ్రహ్మా స్త్రమ్మును బ్రద్యుమ్నుఁ డేసె దారుణభంగిన్. 176
వ. ఇట్లు బ్రహ్మాస్త్రపీడితుం డయి సాల్వుండు మూర్ఛవోయి రథంబుపయిం బడిన వాని వెండియు నొక్కదివ్యబాణంబు నేయ సమకట్టిన నంతరిక్షంబున హాహారవంబు లెసఁగె నంత దేవగణ ప్రేరితు లయిన నారదమారుతులు ప్రద్యుమ్నుపాలికి వచ్చి యిట్లనిరి. 177
తే. వీఁడు నీచేత వధ్యుండుఁ గాఁడు మిన్న కేయ కుండుము వీని నారాయణుఁడు మొనసి వధియించు నని పల్కె వనజగర్భుఁ డనినఁ బ్రద్యుమ్నుఁ డేయక యనఘుఁ డుండె. 178
- సాల్వుఁడు ప్రద్యుమ్నునిచే బాధితుండై మరలిపోవుట - సం. 3-20-26
వ. అంత సాల్వుండును నివృత్తుం డయి ద్వారకాపురియవరోధం బుడిగి తన సౌంభకం బెక్కి క్రమ్మఱి చనియె నంత నీ యజ్ఞంబు నిర్వృత్తం బయిన నే నరిగి బలభగ్నీకృత పాదపవనంబులదాని ననభిజ్ఞాత ద్వారదేశంబుల దాని నస్వాధ్యాయ స్వాహోకార మహీసురాగారం బయినదాని నపేతభూషణ యోషిజ్జనంబులదాని ద్వారవతిం జూచి యాహుకాత్మజు వలన నంత వృత్తాంతంబును నెఱింగి సాల్వుం జంపికాని యిప్పురంబు సొరనొల్లనని నిశ్చయించి దీని నప్రమాదులరై రక్షించుకొని యుండుండని బలదేవాదులంబంచి యప్పుడ ప్రయాణభేరి సఱవంబంచి కృతస్వస్తి వచనపురోహిత ప్రముశ బ్రాహ్మణవరులకు నమస్కరించి శైబ్యసుగ్రీవంబు లను వాహనంబులంబూనిన దివ్యరథం బెక్కి. 179
ఆ. పాంచజన్యరవముఁ బంచమహాశబ్ద రవముఁ జెలఁగె దిశలు సెపుడువడఁగ నొలసి జనుల దీవనలు మించె రమ్మమై గరుడకేతనంబు గ్రాలెఁ జదల. 180
వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com