వోలం సురేష్ కుమార్


వ. ఇట్లు ధర్మరాజూ వచనంబునఁ గిమ్మీరు నశ్రమంబున వధియించి తద్వినవాసులకు రాక్షసభయం బుడుపిన మహావీరు నమ్మారుతాత్మజు ధర్మార్జున నకుల సహదేవులును ధౌమ్యాది మహీసురవరులును బ్రశంసించి రని విదురుండు గిమ్మీరు వధ సెప్పిన విని ధార్తరాష్ట్రులకు హృదయదలనం బయ్యెనిట పాండవులు గామ్యక వనంబున నుండునంత. 121

యాదవ పాంచాలాదులు పాండవులకడ కేతెంచుట సం. 3-13-1

సీ. వసుమతీ రాజ్యంబు వలన నిరస్తులై మునివృత్తి నత్యుగ్ర వనములోన నవయుచుఁ బాండుభూనాధనందను లున్న వారని విని యతి క్రూరమతుల ధృతరాష్ట్రసుతుల నిందించుచుఁ బాంచాలయాదవ వృష్టి భోజాంధు లెల్ల నచ్యుత ప్రముఖులై యప్పాండవులకడ కేతెంచి శోకపరీతులగుచు.

ఆ. నున్న నధిక ధర్మయుక్తుఁ డుపేంద్రుండు నికృతిఁ జేసి పాపనియత బుద్ధిఁ బాండవులకు నట్లపాయంబు సేసిన ధార్తరాష్ట్రులకును దద్ద యలిగి. 122

క. అనిఁ గర్ణ శకుని దుర్యో ధన దుశ్శాసన నవాస్రధారాపాతం బునఁ దృప్తివొందు వసుధాం గన రాక్షస కాక గృధ్రగణముల తోడన్. 123

క. అవినీతుల వధ్యులఁ గౌ రవపాంసులఁ జంపి ధర్మరాజునకుఁ గురు ప్రవరున కొనరింతమ యీ యవనీ రాజ్యాభిషేక మవిజశక్తిన్. 124

వ. అని యుగాంత్య కాల కుపిత కృతాంతాకృతి నున్న జగన్నాధు జనార్దనుం బ్రశాంత చిత్తుం జేసి యర్జునుం డతని నిట్లని కీర్తించె. 125

ఆ. పూజ్యుఁడవు పురాణపురుషుండ వీశుండ వప్రమేయుఁడవు చరాచరంబు లయిన భూతరాసు లచ్యుత నీయంద పుట్టునిలుచు లయముఁ బొందుచుండు 126

వ. నీవు దొల్లి గంధమాదనంబునం గందమూలఫలాశనుండవై పదివేలేండ్లు తపంబు సేసి పుష్కరంబున నేకాదశ సహస్ర ప్రవర్షంబులు జలంబు లాహారంబుగా నుండి ప్రభాసం బను తీర్థంబున దివ్య సహస్ర వర్షంబు లేకపాతస్థితుండవయి యుండి బదరీవనంబునం బవనంబు భక్షించుచు నూర్ధ్వబాహుండవయి యేకపాదంబున ననేక సహస్ర వర్షంబులు నిలిచి సరస్వతీ సత్త్రంబున నవకృష్ణోత్తరాసంగుండవై నియమకృశీకృత శరీరంబుతోఁ బండ్రెండు వర్షంబు లశేష వ్రతంబులు సలిపిన తపోనిధానంబవు నిఖిలలోక జైత్రుండవయి చైత్రరథంబున నుత్తమ క్రతువు లనేకంబులు సేసి యొకొక్క క్రతువునకు నూఱేసి లక్షలు సువర్ణంబులు దక్షిణ లిచ్చిన యజ్ఞపురుషుండవు తపోయజ్ఞంబులు రెంటను సమృద్ధతేజుండవయు దైత్యదానవేంద్రుల వధియించి యింద్రునకింద్రత్వం బేకాధిష్ఠితంబు సేసిన లోక ప్రభుం వదుతికింగశ్యపునకు నుదయించి యింద్రానుజుండ వై త్రివిక్రమంబునం ద్రజగంబుల నభివ్యాపించిన విశ్వ రూపధరుండవు. 127

క. నరక శిశుపాలు రాదిగ ధరణీకంటకుల నధికతరదర్పులఁ బ ల్వుర వధియింపఁగ మహి నవ తరించిన మహాత్ముఁడవు నుతస్థిర శక్తిన్. 128

క. అనృతము మదమును మత్సర మును గ్రోధము నను వికారములు వొరయునె ని న్ననుపమగుణముల నీకొరు లెన పోల్పఁగఁ గలరె సురమునీంద్ర ప్రణుతా. 129

వ. అని కృతాంజలి యయిన ధనంజయుం జూచి దనుజభంజనుం డిట్లనియె. 130

తే. నరుఁడు నారాయణుం డునాఁ బరగు నాది మునుల మిద్దఱమందు నీవనఘ నరుఁడ నేను నారాయణుండ ననూనశక్తి యుతులమై మర్త్యయోనిఁ బుట్టితిమి పేర్మి. 131

తరువోజ. నిరతంబుగా నేను నీవను భేదనియమంబు లే దైక్యనిష్ఠయ మనకు నిరువురకును నీకు నిష్టుండ నాకు నిష్టుండు మఱి నీకనిష్టుండ నాకుఁ గరమనిష్టుం డట్లుగా నమ్ముమనుచు ఘనభూజుల్ భువనోపకారైకమతులు హరియు నర్జునుఁడుఁ బ్రియంబుతోఁ దగిలి యన్యోన్యహితభాషులగుచుండు నంత. 132

ద్రౌపది శ్రీకృష్ణునితోఁ దనపరిభవంబు సెప్పి దుఃఖించుట సం. 3-13-42

వ. అఖిలరాజలోక పరివృతుండయి యున్న నారాయణు నొద్దకువచ్చి ద్రుపదరాజ పుత్త్రి ముకుళిత కరాంబుజ యయి యిట్లనియె దేవా నిన్ను నాది ప్రజావర్గంబునఁ బ్రజాపతివని యసితం డయన దేవలుండును సత్యంబువలన యజ్ఞం బుద్ధరించుటం జేసి నిత్యసత్యమయుం వయిన యజ్ఞ పురుషుండ వని కశ్యపుండును శిరంబున బాదంబుల మేదినియును లోచనంబుల సూర్యుండును నవయంబుల లోకంబులు నభివ్యాపించుట జేసి సర్వమయుండ వని నారదుండును నక్షయజ్ఞాననిధి వని సర్వ మునిముఖ్యులును జెప్పిరి. 133

మధ్యాక్కర. అని ననివృత్తులై పుణ్యచరితులై యాత్మ ప్రబోధ వినిహితచిత్తులై సర్వధర్మార్ధ విదులయి తృప్తిఁ దనరెడు రాజర్షి వరులకును యోగధరులకు సాధు జనులకు గతి నీవ నిత్యకారుణ్య సర్వశరణ్య. 134

వ. నీయంతఃకరణ ప్రవృత్తి కగోచరం బెద్దియు లేదయినను నా పడిన పరాభవం బెఱింగించెద. 135

సీ. పార్థివ ప్రభుఁడైన పాండు మహీపతి కోడల నయి యుద్ధకుశలు లయిన పాండుతనూజుల భార్యనై పూజ్యుఁడ వైన నీ యనుజనై యధిక శక్తిఁ బరగు ధృష్టద్యుమ్ను భగిని నై ధృతరాష్ట్రు పట్టిచే సభఁ దలపట్టి యీడ్వఁ బడి పాపకర్ముచేఁ బరిధాన మొలువంగఁబడి దారుణంబైన పరిభవంబు

ఆ. పడితినట్టి నన్నుఁ బాండవుల్ సూచుచు నుండి రొరులువోలె నుక్కుదక్కి యాపగాతనూజుఁ డాదిగాఁ గలవృద్ధ బంధుజనులు సూచి పలుక రయిరి. 136

క. శరణనినవారిఁ గరుణా కరు లయి రక్షించు పురుషకారాన్వతు లే శరణని యఱచిన నాలిం పర భీమార్జునుల బాహుబల మేమిటికిన్. 137

వ. భ్రాతృపుత్త్ర బంధుజనంబులు నాకుం గలిగియు లేనివారయి రట్టి యెడం గర్ణుండు నన్నుం జూచి నగియె. 138

ఆ. కర్ణునగవు లోకగర్హితుం డగు దుస్స నేను చెయిదికంటె శిఖియపోలె నడరి నామనంబు నతి దారుణక్రియ నేర్చుచున్న యది మహీధరుండ. 139

వ. తొల్లి వేదాధ్యయనంబు సేయుచు బాలకేళీ వినోదంబున నున్న కాలంబునఁ బ్రమాణకోటియందు సుప్తుం డయిన భీమసేను నంటఁ గట్టి గంగమడువునం ద్రోపించియు విషంబుఁ బెట్టియు విషసర్పంబులంబట్టి గఱపించియు జననీ సహితులైన యేవురను వారణావతంబున లక్కయిల్లు సొనిపియందు దహనంబుఁ బ్రయోగింపం బంచియు ననేకంబు లైన యపకారంబులు సేసి యిప్పుడు దుర్యోధనుం డధర్మద్యూతంబున రాజ్యంబు నపహరించి రాజలోక సమక్షంబునం దమ్ము నిరాకృతులంజేసినను బరాక్రమ పరాఙ్ముఖులైన పాండవులు నాపడిన పరిభవంబు లెట్లు దలఁగెదరని బాష్పధారాస్నపితపయోధర యయి పాణిపల్లవంబున నయనపమ్మార్జనంబు సేయుచున్న పాంచాలిం జూచి వాసుదేవుం డిట్లనియె. 140

చ. తనుకుచు నున్న నీ హృదయతాపనిమిత్తమునన్ సురేంద్రనం దను పటుబాణపాతహతిఁ దద్ధృతరాష్ట్రబలంబు మృత్యుసా దనమున కేఁగుఁ జూమ్మిదియ తథ్యము నా వచనంబు దప్ప ది వ్వననిధు లేడు నింకిన దివంబును రాత్రియు సంచలించినన్. 141

వ. అనిన నర్జునుండు ద్రౌపదిం జూచి యిట్లనియె. 142

ఉ. ఈ పురుషోత్తముండు మన కిందఱకుం గుశలంబు సేయుచుం బాపకలంకపంకములఁ బాయఁగఁ జేయుటఁ జేసి దర్మదో ద్దీపితశత్రుసంహతి హతిం బరమార్థమ పొందు నేల సం తాపము నీకుఁ జేయఁగఁ ద్రిధామజయోన్నతి గల్గి యుండఁగన్. 143

వ. అనిన సక్రోధుం డయి ధృష్టద్యుమ్నుం డిట్లనియె. 144

వినయవిహీనుల దుర్యో ధనదుశ్శాసనులఁ బవనతనయుఁడు రాధా తనయుని నరుఁ డేఁ గుంభజు ననిఁ జంపుదు మేల వగవ నంబుజనేత్రా. 145

వ. అని యందఱు ద్రుపదరాజపుత్త్రి నాశ్వాసించి రంత నచ్యుతుండు ధర్మరాజున కిట్లనియె. 146

తే. ద్వారవతినుండియే యుయుధానువలన ధరణీశ యింతయు విని తత్క్షణంబ యరుగుదెంచి యాపన్నుఁడ వైన నిన్నుఁ జూచి దుఃఖోపహత మనస్కుండ నైతి. 147

వ. అయ్యవసరంబున నేను మీ యొద్దనుండమిం జేసి యిట్టి దుర్వ్యసనంబు సంభవిల్లెం గామజంబు లైన స్త్రీ ద్యూత మృగయా పానంబు లను నాలుగు దుర్వ్యసనంబులం బ్రవర్తిల్లకుండఁ బ్రతిషేధింప వలయు నందును విశేషంబుగా ననర్థమూలం బయిన పాపద్యూతంబుఁ బరిహరింపనినాఁడు పాపం బగు నని హేతుదృష్టాంతంబులు సూపి కృప ద్రోణ విదుర గంగేయులం దోడు సేసికొని యాంబికేయు నొడం బఱిచి దుష్టద్యూతంబు సర్వ ప్రకారంబుల వారింతు. 148

క. వలచి హితంబునఁ బథ్యముఁ బలికినఁ జేకొనని ధర్మబాహ్యుల నవివే కుల నిగ్రహింతు మీ కె గ్గులు మత్సాన్నిధ్యమున నగునె యెయ్యెడలన్. 149

- కృష్ణుఁడు ధర్మరాజూనకు సౌంభకాఖ్యానంబు సెప్పుట - సం. 3-15-1

వ. ఏను సముద్రతీరంబున సాల్వుతోడం బదినెలలు యుద్ధంబు సేసి వాని వధియించుపొంటె నక్కడ మసలితి నది గారణంబుగా మీకు దుర్వ్యసనావసరంబున నలబ్ధసన్నధానుండ నయితి ననిన నది యెట్లని యుధిష్టిరుం డడిగిన నాతనికి సౌభకాఖ్యానంబు సవిస్తరంబుగాఁ గృష్ణుం డిట్లని చెప్పె నీ యజ్ఞంబున నర్ఘ్యనిమిత్తంబున నసహిష్ణుండయిన శిశుపాలుండు నాచేత నిహతుండగుట విని వాని తమ్ముండు సాల్వుం డనువాఁడు తద్వధ ప్రవర్తిత క్రోధుం డయు కామగమనం బయిన సౌంభకం బను నగరంబుతో సన్నద్ధుం డయి వచ్చి ద్వారవతీపురంబు నవరోధించి. 150


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com