ఆ. ధర్మరహితు లైన ధార్తరాష్ట్రులకు భూ రాజ్యలక్ష్మి సుస్థిరంబు గాదు ధర్మతనయ నిన్నుఁ దద్రాజ్య సంపదల్ వలచి తమకుఁ దామ వచ్చి పొందు. 061

వ. నా వచనంబున నెగడునది యనిన ధర్మరాజు నట్ల చేయుదు నని యున్నంతనిట ధృతరాష్ట్రుండు పాండవుల యొద్ద విదురు నునికి యెఱింగి ధృతివిహీనుండై తన హృదయంబును దృష్టియుం బోనివిదురుం బాసి నిమిషంబేనియు నిర్వహింప నోపక సంజయున కిట్లనియె. 062

క. నెమ్మగలవాని నాచి త్తమ్మెఱిఁగెజడు వాని విదురు ధర్మప్రియు నా తమ్ము నిట వేగ తోడ్కొని రమ్మరుగుము కామ్యకాఖ్యరమ్యాటవికిన్. 063

వ. అని పంచిన నప్పుడ సంజయుం డతి త్వరితగతిం గామ్యకవనంబున కరిగి. 064

మ. ధరణీదేవ సహస్ర సంఘములతే ధౌమ్యుండు ధర్మక్షమా భరణుల్ నల్వురు దమ్ములున్ విదురుఁడుం బాంచాలుయుం బ్రీతిబం ధరులై కొల్వగ నొప్పుచున్న బుధ బంధున్ ధర్మరాజూం బ్రభా స్వరతేజుం బ్రభుఁ గాంచి సంజయుఁడు సంజాత ప్రమోదాత్ముఁడై. 065

క. వనవాసము సేయుచుఁ ద్రిభు వనరాజ్యము సేయునట్టి వడువున సంతో షనిబద్ధ బుద్ధి యగుయమ తనూజులకు భక్తి నెఱఁగి తా నిట్లనియెన్. 066

వ. మిమ్మును ధర్మార్థవిదుండైన విదరినిం గౌరవేంద్రుం డెప్పుడుం దలంచుచుండు మీ యనుమతంబునఁ దనయనుజుం దోడ్కొమి తేర నన్నుఁ బుత్తెంచె ననిన విని ధర్మరాజు విదురున కిట్లనియె. 067

తే. సర్వజనులును ధృతరాష్ట్రు శాసనంబు సేయు చున్నచో మనకు విశేష భక్తిఁ జేయవలయుఁ గావున నెడసేయ కరుగు మనిన విదురుండు గజపురి కరిగెంనంత. 068

వ. ధతరాష్ట్రుండును దనకు వినయవినమితోత్తమాంగు డైన విదురు నతి స్నేహంబునం గౌఁగిలించుకొని మూర్ధాఘ్రాణంబు సేసి నీవు నిత్యక్షమా నిరతుండవు నా బుద్ధి లేమికి క్షమింయింపు మనిన విదురుం డిట్లనియె. 069

ఆ. నీవు నీ సుతుండు నెఱిఁ దప్పి పలికినఁ బథ్య మయిన పలుక పలుక వలయు వీరు లయిన పాండవేయులతో నిగ్ర హంబు సేయు టిది నయంబు గాదు. 070

వ. అనుచు నెప్పటియట్ల కార్యసహాయుండై విదురుండు ధృతరాష్ట్రు నొద్దనున్న నయ్యిద్దఱ సంగమంబునకు శంకించి దుర్యోధనుండు కర్ణ శకుని దుశ్శాసనులతో నిట్లనియె. 071

క. పాండవహితుఁ డగు విదురుఁడు వెండియుఁ జనుదెంచి కార్యవిధులందు సహా యుండయ్యె నతనితోడ హి తుండయి మంతనము సేయఁ దొడఁగెన్ విభుఁడున్. 072

వ. వీర లింకఁ బాండవుల నిందులకు రావించు వారలయిన నగ్ని విషజలంబులు ప్రయోగించి వారల కపాయంబు సేయుద మనిన విని శకుని దుర్యేధనుం జూచి యిట్లేట బాలిశం బైనమతిఁ దలంచితివి విదుర ధృతరాష్ట్రులు విపరీత మతులై రావించినను నిత్యసత్య నిరతులైన యప్పాండవులు దమచేసిన సమయంబు సలుపక యేల వచ్చువా రగుదు రనిన శకుని దుర్యోధనులకుఁ గర్ణుం డిట్లనియె. 073

ఉ. ఇత్తఱిఁ బన్నిపోయి వయినెత్తి రణం బొనరించి వారలన్ మిత్తికి నంపి ధాత్రి నిరమిత్రముఁ జేయుద మిట్టులైనఁ ద ద్వృత్తులు నీక దక్కుఁ గురువీర కడంగుము నావుడున్ మదో న్మత్తుఁడు గౌరవుం డతని మాటకు సంతస మంది చెచ్చెరన్. 074

వ. సమరసన్నద్ధుఁడై సమస్త బలంబును సమకట్టి వెలువడినం దన దివ్యదృష్టి నంతయు నెఱింగి కృష్ణద్వైపాయనుండు వచ్చి యిది ధర్మువు గా దుడుగుమని దుర్యోధనుని వారించి ధృతరాష్ట్రున కిట్లనియె. 075

క. పుడమియు రాజ్యముఁ గోల్పడి యడవుల నేకతను యున్న యప్పాండవులం గడగి వధియింతు నని నీ కొడు కరిగెడు నిట్లు తలఁపఁ గూడునె బుద్ధిన్. 076

క. ధృతియుతులై సత్యవ్రత రతు లయి పదుమూఁడు వత్సరంబులు ధర్మ స్థితి సలిపి వార కడఁగెద రతుల పరాక్రములు మీఁద నాహవమునకున్. 077

క. వనగతు లని వారలపైఁ జని భంగముఁ బొంది రాఁగ సమకట్టెడు నీ తనయుఁడు గావున నీ వా తని వారింపు మది యనుచితం బని నెమ్మిన్. 078

క. విను మేనును నీవును శాం తనవుఁడు విదురుండు నుండి తగునె యధర్మం బు నుపేక్షింపఁగ ననయం బును బాండివవిగ్రహంబు పుట్టుట లగ్గే. 079

వ. అనిన విని ధృతరాష్ట్రుండు దుఃఖితుండై నాకును గాంధారికిని భీష్మవిదుర కృప ద్రోణులకు ననిష్టం బైన దుష్టద్యూతంబు ప్రవర్తిల్లె దుర్బుద్ధియైన దుర్యోధనుం బుత్త్క స్నేహంబున విడువ నోప నేమిసేయుదు ననిన ధృతరాష్ట్రునకుఁ గృష్ణ ద్వైపాయనుం డిట్లనియె. 080

ధృతరాష్ట్రునకు వ్యాసఁ డింద్ర సురభి సంవాదంబు సెప్పుట సం 3-10-6

ఆ. ఎల్ల నెయ్యములకుఁ దల్లిదండ్రులయందు సుతులవలని నెయ్య మతిశయంబు ధనము లెంత గలిగినను సుతరహితుల కెమ్మెయిని మనః ప్రయమ్ము లేదు. 081

వ. తొల్లి సకలగోమాత యయిన సురభి సురరాజు కడకుం బోయి కరుణతంబుగా నేడ్చిన దాని జూచి సురపతి విస్మితుండై యి ట్లేల రోదనాకులిం లోచన వయి యున్నదాన వెల్లవారికి లగ్గకదా యనిన నింద్రునకు సురభి యిట్లనియె. 082

క. నీ వజ్రము రక్షింపఁగ నా వారికి దక్కఁ ద్రిభువనంబులఁ గలజీ వావలి కెల్లను గుశలమ దేవేంద్ర జగత్త్రయ ప్రదీప మహాత్మా. 083

వ. దీని జిత్తగింపుము బలంబు గలబలీవర్దంబులతో బలహీనంబు లయినవానిం బూన్చిన నవి దుర్వహభారవహన మహాలాంగలాకర్షణంబులయం దనవర్థంబు లైన నడిచియుం బొడిచియు ములుకోలలం గుట్టియు దుర్భల బలీవర్దంబుల జనులు బాధింపు జూచి యేను దానికి దుఃఖించెద ననిన సురభికి సురపతి యిట్లనియె. 084

క. నీకు నవత్యశతంబు ల నేకంబులు గలవు వాని కేకాకృతి దుః ఖాకులత సంభవింపదు శోకింపకు మనిన సురభి సురపతి కనియెన్. 085

వ. దేవా దీనాననంబు లయి దుర్బలంబు లయిన యపత్యంబుల దుఃఖం బేనెట్లు సూడ నోపుదు ననిన నగి యింద్రుండు దానికిం గరుణించి వర్షంబునఁ దృణవర్థనంబు సేసి దుర్బలబలీవర్దనంబులకు బలంబు గావించె నని యింద్ర సురభి సంవాదంబు వేదంబుల యందు వినంబడుఁ గావున నీకు బుత్త్ర స్నేహంబు సామాన్యంబుగా దైనను దీనులై వనంబు నవయుచున్న యప్పాండవులకు దలాళుండ వగుము. 086

తే. నీవుఁ బాండుండు విదురుండు నెమ్మి నాకు నొక్కరూ పైనయట్లు నీ కుదితయశులు నీ సుతులు నూర్వరును బాండు నృప తనూజు లేవురును నొక్కరూప కా నెఱుఁగ వలయు. 087

క. సుజనుల సహవాసంబునఁ గుజనులు సద్ధర్మమతు లగుట నిక్కము ధ ర్మజు నొద్దనుండి నీయా త్మజూఁడు ప్రశాంతుండు ధర్మమార్గుండు నగున్. 088

వ. రాజర్షియైన ధర్మరాజుతోడి సహవాసంబు సర్వజన హితంబు గావున నాతని నుపాసించి దుర్యోధనుండు గొండొక కాలంబుండునట్లుగాఁ బనుపు మట్లయిన నుభయ పక్షంబులకు లగ్గగు ననిన ధృతరాష్ట్రుండు గృతాంజలి యయి మునీంద్రా దుర్యోధనుండు నా పలుకులు వినండు కురుకులంబు రక్షించునట్టి బుద్ధి గల దేని వాని మీర శిక్షింపుం డని మ్రొక్కిన. 089

క. అనఘుఁడు మైత్రేయుం డను మునినాధుఁడు వచ్చి ధర్మమున నాతనిఁ దా నను శాసించుఁ దిరంబుగ నని చెప్పుచు నప్పరాశరాత్మజుఁ డరిగెన్. 090


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com