వోలం సురేష్ కుమార్


క. నానావిధరణవిజయమ హా నిపుణు లవార్యవీర్యు లనఁ దగువారిన్ సేనాధ్యక్షులఁ జేసి.తె నీ నమ్మిన వారి మాననీయుల హితులన్ ! 31

చ. కడుఁ జనువాఁడు నై పురుషకారియ దక్షుఁడు నైనమంత్రి పెం పడరఁగ రాజపుత్త్రుల మహాధనవంతులఁ జేసి వారితో నొడఁబడి పక్ష మేర్పడఁగ నుండఁడుగా, ధన మెట్టి వారికిం గడుకొని చేయకుండునె జగన్నుత గర్వము దుర్విమోహమున్. 32

క. క్షితినాథ! శాస్త్రదృష్టి ప్రతిభను దివ్యాంతరిక్ష భౌమోత్పాత ప్రతికారు లగుచు సన్మా నితు లయు వర్తింతురయ్య నీ దైవజ్ఞుల్. 33

క. అనిశము సేవింతురె ని న్ననఘా! యష్టాంగ మైనయాయుర్వేదం బున దక్షు లైన వైద్యులు ఘనముగ ననురక్తులై జగద్ధితబుద్ధిన్. 34

క. సారమతిఁ జేసి మానస శారీరరుజావలులకు సతతంబుఁ బ్రతీ కారములు సేయు చుండుదె యారఁగ వృద్ధోపసేన నౌషధ సేవన్. 35

క. ఉపధాశుద్ధులఁ బాప వ్యవగతబుద్ధుల, వినీతివర్తుల, సములన్ సుపరీక్ష నియోగించితె నిపుణుల నర్థార్జనాది నృపకార్యములన్. 36

ఉ. ఉత్తమమధ్యమాధమని యోగ్యత బుద్ధి నెఱింగి వారి న య్యుత్తమమధ్యమాధమని యోగములన్ నియమించితే నరేం ద్రోత్తమ! భృత్యకోటికి ననునముగాఁ దగు జీవితంబు లా యత్తము సేసి యిత్తె దయ నయ్యయి కాలము దప్పకుండఁగన్. 37

క. తమతమకని యెడుతఱి జీ తము గానక నవయుభటుల దౌర్గత్యవిషా దము లేలిన వాని కవ శ్యము నెగ్గొనరించు నతఁడు శక్రుం డైనన్. 38

క. కుల పుత్త్రు లైన సద్భృ త్యులకును సత్కార మర్థితోఁ జేయుదె వా రలు నీ ప్రస్తవమున ని మ్ములఁ గృతము దలంచి ప్రాణములు విడుతు రనిన్. 39

క. అనఘా! నీ ప్రస్తవమున నని నీల్గిన వీరభటుల యనుపోష్యుల నె ల్లను బ్రోతె భుజనాచ్ఛా దనముల వారలకు నెమ్మి దఱుఁగక యుండన్. 40

క. ధనలుబ్ధుల, మ్రుచ్చులఁ గూ ర్పని వారలఁ బగఱవలనివారల ధృతి చా లనివారల, దుర్జనులం బనుపవుగా రాజకార్యభారము దాల్పన్. 41

క. చోర భయ వర్జితముగా ధారుఁణి బాలింతే యధికధనలోభమునం జోరుల రక్షింపరుగా, వారలచే ధనము గొని భవద్భృత్యవరుల్. 42

క. ధరణీనాధ! భవద్భుజ పరిపాలిత యైనవసుధఁ బరిపూర్ణములై కర మొప్పుచున్నె చెఱువులు ధరణి కవగ్రహభయంబు దనుకక యుండన్. 43

క. హీను లగు కర్షకులను భూనుత! ధాన్యంబు బీజములు, వణిజులకున్ మానుగ శతైక వృద్ధి న నూనముగా ఋణములిత్తె యుత్తమ బుద్ధిన్. 44

క. పంగుల మూకాంధుల విక లాంగులను నబాంధవుల దయుబ్రోతె భయా ర్తుం గడిఁదిశత్రునైనను సంగర రంగమునఁ గాతె శరణం బనినన్. 45

క. కృత మెఱిఁగి కర్త నుత్తమ మతుల సభల సంస్తుతించి మఱవక తగుస త్కృతి నేయుదె కృత మెఱిఁగెడు పతియె జగజ్జనుల నెల్లఁ బరిపాలించున్. 46

సీ. ఆయంబునందు నాల్గవభాగమొండె మూఁడవ భాగమొండె నం దర్ధమొండె గాని మిక్కిలి సేయఁ గాదు వ్యయం బని యవధరించితె బుద్ధి నవని నాథ! యాయుధాగారధ నాధ్యక్ష్యముల యందు వరవాజి వారణావళుల యందు బండారముల యందుఁ బరమ విశ్వాసుల భక్తుల దక్షులఁ బంచితయ్య

ఆ. గురుల వృద్ధ శిల్పి వరవణిగ్భాంధవ జనుల నాశ్రితులను సాధుజనులఁ గరుణఁ బేదఱికము వొరయకుండఁగఁ బ్రోతె సకల జనులు నిన్ను సంస్తుతింప 47

క. వలయు నమాత్యులుఁ, జుట్టం బులు, మూలబలంబు రాజపుత్త్రులు, విద్వాం సులు, బలసి యుండ నిచ్చలుఁ గొలువుండు దె లోక మెల్లఁ గొనియాడంగన్ 48

క. పరికించుచు బాహ్యభ్యం తర జనముల వలన సంతతము నిజరక్షా పరుఁడ వయు పర మహీశుల చరితము వీక్షింతె నిపుణ చర నేత్రములన్. 49

క. వెలయఁగ విద్వజ్జనము ఖ్యులతోడ నశేష ధర్మ కుశలుఁడ వయి యి మ్ముల లోక వ్యవహార మ్ములు దయఁ బరికింతె నిత్యమును సమబుద్ధిన్. 50

ఆ. వార్తయంద జగము వర్తిల్లుచున్నది యదియు లేని నాఁడ యఖిల జనులు నంధకారమగ్ను లగుదురు గావున వార్త నిర్వహింప వలయుఁ బతికి. 51

ఆ. దార సంగ్రహంబు ధరణీశ! రతిపుత్త్ర ఫలము, శీలవృత్త ఫలము శ్రుతము దత్తభుక్త ఫలము ధనము, వేదము లగ్ని హోత్ర ఫలము లనియు నొగి నెఱుంగు. 52

చ. బహుధన ధాన్య సంగ్రహము బాణశరాసన యోధ వీరసం గ్రహము నిరంతరాంతరుదకంబులు ఘాసరసేంధనౌఘసం గ్రహము ననేక యంత్రంములుఁ గల్గి యసాధ్యము లై ద్విషద్భయా వహు లగు చుండ నొప్పునె భవత్పరిరక్ష్యము లైన దుర్గముల్. 53

చ. వదలక బుద్ధి నంతరరివర్గము నోర్చి జితేంద్రియుండ వై మొదలన దేశకాల బలముల్ మఱి దైవబలంబుఁ గల్గి భూ విదితబలుండ వై యహితవీరుల నోర్వఁగ నుత్సహింతె దు ర్మదమలినాంధ చిత్తులఁ బ్రమత్తుల నింద్రియనిర్జితాత్ములన్. 54

తే. కడిఁది రిపులపైఁ బోవంగఁ గడఁగియున్న నీకు ముదఱఁ జని రిపునృపులయందుఁ దగిలి సామాద్యుపాయంబు లొగిన సంప్ర యోగమునఁ జేసి వర్తిల్లుచున్నె చెపుమ. 55

వ. మఱియు నాస్తక్యం, బనృతంబు, ప్రమాదం, బాలస్యం, బనర్థజ్ఞుల తోడి చింతనంబు, క్రోధంబు, దీర్ఘచింత, దీర్ఘసూత్ర్తత, యెఱుకగలవారి నెఱుంగమి, యర్థంబులయం దనర్థకచింత, నిశ్చిత కార్యంబులు సేయమి, మంత్రంబుల రక్షింపమి, శుభంబులఁ బ్రయోగింపమి, విషయంబులం దగులుట యనం బరఁగిన పదునాలుగు రాజదోషంబులఁ బరిహరింతె యని యడిగిన నారదునకు ధర్మరా జిట్లనియె. 56

ఇట్టి సభ యెచ్చటనైన చూచితిరా యని ధర్మజుండు నారదు నడుగుట

తే. నా యథాశక్తిఁ జేసి యన్యాయ పథముఁ బరిహరించి మహాత్ముల చరితలందు బుద్ధి నిలిపి మీ యుపదేశమున శుభంబు లయిన వాని ననుష్ఠింతుఁ బ్రియముతోడ. 57

వ. అని కృతాంజలి యయి మునీంద్రా! యీ త్రిలోకంబులయందు మీ చూడనివి లే వెందే నిట్టి యపూర్వం బైన సభ చూచి యెఱుంగుదురే యని మయనిర్మితం బయిన సభ చూపినం జూచి విస్మితుం డయి నారదుండు ధర్మరాజున కిట్లనియె. 58

క. భూనాథ! యిది యపూర్వ మ మానుషము, విచిత్ర రత్నమయ మిట్టి సభన్ మానవ లోకేశ్వరులం దే నెన్నఁడుఁ జూచి వినియి నెఱుఁగ ధరిత్రిన్. 59

క. సురపతి యమ వరుణ ధనే శ్వర కమలాసనుల దివ్య సభ లెల్ల నరే శ్వర! చూచితి నవి దీనికి సరిగా వత్యంతవిభవ సౌందర్యములన్. 60


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com